కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Navvukunna variki Navvukunnantha' Written By Nallabati Raghavendra Rao
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ధనరాజు ఆస్తి ఇరవై కోట్లకు పైమాటే.
అనుకోకుండా పాత స్నేహితుడు పండుస్వామిని కలిసాడు.
తనకు కూడా ఓ నాలుగు కోట్లు ఉన్నాయని చెప్పాడు పండుస్వామి.
చెప్పడమే కాదు.
పూర్తి వివరాలు కూడా స్నేహితుడికి తెలిపాడు.
ఆసక్తికరమైన ఈ కథను ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించారు.
.
ధనరాజు రాజమండ్రి నుండి విజయవాడ వెళ్లడానికి తన ఇన్నోవా కారు ఎక్కి కూర్చు న్నాడు. అతని ప్రయాణం.. ముఖ్యమైన ఆఫీసు పని. కారు చాలా వేగంగా పోతుంది. చాలా దూరం వెళ్ళాక దారిలో కారు ఆపమన్నట్టుగా ఒకతను చెయ్యి ఊపాడు. కానీ ధనరాజు ఆపలేదు. కారు చాలా దూరం ముందుకు పోయింది. కానీ సడన్గా ఆగిపోయింది. యూ టర్న్ తిప్పి వెనక్కి వచ్చింది కారు.
"నీ పేరు పండుస్వామి కదూ..... "
ఎయిర్ విండ్ మిర్రర్... క్రిందకు దింపి అడి గాడు.. ధనరాజు.
" అవును.. మీరెవరు?"
" నేనురా ధనరాజుని.. మనిద్దరం టెన్త్ క్లాసులో క్లాస్ మేట్స్o. గుర్తుందా.. తాటిచెట్టు నల్లకాలువ... ముంజి కాయలు..కత్తినాటు... గుర్తొస్తుందా....నేనేరా ధనరాజ్ ని .." కిందకు దిగాడు ధనరాజు...తన బొజ్జను నిమురు కుంటూ
పండుస్వామి గుర్తు చేసుకున్నాడు.. బా గ గుర్తొచ్చింది.
" ఓర్నీ... ధనరాజు ....తారాజువ్వ అని పిలిచే వాళ్ళం కదా ..అది నువ్వేనా"
" హమ్మయ్య గుర్తు వచ్చేసాను అన్న మాట.ఏడకి పోతున్నావ్.. ఇట్టా.."
" చెప్తా గాని... ఇక్కడ ఏదో పార్కు లాగా ఉంది.. లోపల కాసేపు ఆ చెట్టు క్రింద బల్లమీద కూర్చుందాం రా మాట్లాడుకోవచ్చు."
ఇద్దరూ పార్కు లోకి వెళ్లి సిమెంట్ బల్లమీద కూర్చున్నారు.
" ఇప్పుడు చెప్పు.. పండుస్వామి ఏం చేస్తున్నావురా.. ఎక్కడ ఉంటున్నావ్ అసలు"
అడిగాడు ధనరాజు.
" నేను రామచంద్రపురం లో బిజినెస్ చేస్తున్నానురా..ఫ్యాన్సీ షాప్.."
"ఆ పక్కనే ఉన్న మండపేటలో నేను ఉంటున్నాను. సరే ఈ పాటికి ఏమాత్రం" సంపాదించావు. పిల్లలు ఏం చేస్తున్నారు?"
"నాకుఇద్దరు ఆడపిల్లలురా. ఇంటర్ ,టెన్త్ క్లాస్ చదువుతున్నారు."
" బాగుంది నాకేమో ఇద్దరు మగ పిల్లలు. ఇప్పుడు ఓ జీవిత సత్యం చెప్తాను వింటావా...
"సరదాగా మాట్లాడుకోడానికె కదా ఇక్కడ కూర్చున్నాం.. చెప్పు చెప్పు"
" మా తాతయ్య అనేవాడు... ఇద్దరు ఆడపిల్లలు ఉంటే... అందులో ఒకరి కాపురమే బాగా ఉంటుందట... ఇద్దరికీ పెళ్లి అయ్యాక.. ఫోన్ లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ
తమతమ కుటుంబ విషయాలు కూడాచర్చించు కుంటూ..చివరికి తెలివైన ఆడపిల్ల కాస్త తెలివి తక్కువ.. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంది.. మా అత్త వారి ఇంట్లో ఇలా జరుగుతుంది ..
అలాజరుగుతుంది..నీకు ఎలా ఉన్నది.. అంటూ.. మాట్లాడి... ఏమైనా తేడా ఉంటే ఫైట్ చేయ మని రెచ్చగొడుతోంది. ఆ తెలివి తక్కువ ఆడ పిల్ల ఆ మాటలకు బలై పోయి తన అత్తమామ లతోటి భర్త తోటి గొడవ పెట్టుకుంటుంది. చివరికి చిలికి చిలికి గాలివానగా మారీ కాపురం చెడిపోతుంది. అందుకని ఎవరికైనా ఒక ఆడ పిల్లే ఉంటే బాగుంటుందని అంటుండేవారు.
ఆ.. తాతయ్యే.. మళ్లీ ఏమనేవాడో తెలుసా... ఇద్దరు మగ పిల్లలు ఉన్నా ప్రమాదమే అనేవాడు... ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుఖపడటం.. ఎక్కడా జరగ
లేదట.. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే విషయంలో నువ్వు చూస్తే నువ్వు చూడు అని తగువులాడుకుని... చివరికి ఇద్దరూ చూడడం మానేస్తారు...అట.... బాగుంది కదూ... అందుచేత పిల్లల విషయంలో నువ్వు నేను మైనస్సే! బాగుంది కదూ.. సరదాగా చెప్పానురా..నువ్వు
ఏదైనా చెప్పు..."
" నేను జోక్ చెప్తాను రా.."
" జోక్..ఆ ..నాకు చాలా ఇష్టం చెప్పు"
"ఇద్దరు ఫ్రెండ్స్.. ఒకరికి కారు ఉంది. రెండో వాడికి లేదు. ఇందులో కారు ఉన్నవాడు మధ్య
తరగతివాడు... కారు లేని వాడు కోటీశ్వరుడు.. ఇది ఎలాగా? నువ్వు చెప్పలేవుకానీ నేనే చెప్తా... డబ్బులేనివాడు సరదా కోసం కొన్నాడు.... డబ్బు ఉన్నవాడు...తెగుళ్ళు రోగాలు
ఎక్కువైపోయి.. ఎక్సర్సైజ్ కోసం కారు అమ్మేసి నడుస్తున్నాడు..ఎలా గుంది ఈ జోకు?"
" జోక్ కాదురా బాబు ఇదో పెద్ద సత్యం"
అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుని గలగల నవ్వుకున్నారు. ధనరాజు...తను చాలా కోటీశ్వరుడు అని.. రెండు బిల్డింగులు, మూడు కార్లు ,నాలుగు సైట్లు, 3 వ్యాపారాలు .. ఒక రైస్ మిల్.... సంపాదించానని... చెప్పుకున్నాడు.
కానీ ఇరవై కోట్ల ఆస్తి ఉన్నా... బీపీ, షుగర్ జబ్బులకు బలైపోయానని... నిద్ర సరిగాపట్టని స్థితిలో ఉన్నానని... తను డబ్బు సంపాదించి కూడపెట్టడానికి 24 గంటల సమయం సరి పోవడం లేదని.... చెప్పుకొచ్చాడు.కడుపు నిండా తిండి తిన లేకపోతున్నాను.. అని... తన విషయం చెప్పు కొచ్చి పండుస్వామిని అతని ఆర్థిక పరిస్థితులు చెప్పమని అడిగాడు.
పండు స్వామి గలగల నవ్వేసాడు..
ధనరాజుకు అర్థం కాలే.
" ఏరా ఫ్రెండ్ దగ్గర దాస్తున్నావా.. నేను చెప్పలేదా నా విషయాలు..?"
" చెప్పడానికి ఏముందిరా నీ అంత సంపాదన కాదురా నాది?"
" అది సరే అసలు ఏమాత్రం సంపాదిం చావు..చెప్పు ...ఏం కొన్నావ్ ..చెప్పు"
"ఎందుకులే"
" అంటే... ఫ్రెండ్స్ అంటే భార్యభర్తలు లా ఉండాలిరా కష్టసుఖాలు ఒకరుకి ఒకరు పంచు కోవాలి... అదే నిజమైన స్నేహం."
"చెప్ప మంటావా.. చెప్పమంటావా.. నవ్వకూడదు మరి...?"
" ఎందుకు నవ్వుతాను.. అందరి సంపా దన ఒకలా ఉండదు కదా... హూ ..చెప్పు"
"నువ్వేమో.... కోట్లు కోట్లు..మొత్తం 20 సంపాదించాను.. అన్నావు... నేనుమాత్రం..
నేను మాత్రం నాలుగే సంపాదించానురా"
"ఆ నాలుగు చాలురా బాబు!!!"...అదేం తక్కువ కాదుకదా ఇంతకీ ఏం కొన్నావ్...
..బిల్డింగ్... సైట్.. ల్యాండ్.... "
" నో నో .. ఆ నాలుగు భద్రంగా ఇంటిదగ్గర నా సూట్ కేస్లోనే ఉన్నాయి.."
"ఇప్పుడు అర్థం అయిందిరా . నువ్వు తీసుకున్నది రాంగ్ డెసిషన్... అమౌంటు ఏదో దాని మీద పెట్టి ఉంచాలి.... అలా చేసేవనుకో దానికదే రెండు సంవత్సరాలలో రెట్టింపు అయిపోతుంది... దీన్ని బట్టి నీకు సరైన ప్లాన్ లేదు.... అని.. అర్థమవుతుంది. అలా చేయ లేదు నువ్వు.... ఎవరైనా అమౌంట్ అంతా సూట్కేసులో దాచుకుంటారా? ఇప్పటికైనా మునిగిపోయింది లేదు...సరే ఇప్పుడు నాకు బిజీ వర్కు ఉంది. నిన్ను దారిలో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. రేపు మీ ఇంటికి వస్తాను సరైన సజెషన్ నీకు ఇస్తాను. నీ ఫోన్ నెంబర్ ఇయ్యి." పైకి లేస్తూ అన్నాడు ధనరాజు.
పండు స్వామి.. నవ్వేశాడు.పకపకా నవ్వేశాడు. తెగ నవ్వేశాడు. చాలాసేపు నవ్వేశాడు.
ధనరాజు మళ్లీ తన బొజ్జను నిమురుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు.
***** ********* ***
మర్నాడు ధనరాజు తన ఇన్నోవా కారు మీద పండుస్వామి ఇంటికి వచ్చేశాడు. వస్తు వస్తూ బుట్టెడు ఆపిల్ పళ్ళు తీసుకొచ్చాడు. పండు స్వామి, అతని భార్య సత్యసుందరి.. ధనరాజు ని ఆహ్వానించారు.
సత్యసుందరి ఆప్యాయతగామాట్లాడుతూ
" అన్నయ్య గారు మీరు వస్తారని మా వారు చెప్పారు...".. అంటూ బిస్కెట్లు టి పట్టుకొచ్చి ఇచ్చింది.. చాలా ప్రేమగా.
" ధనరాజు ఆమె చూపించే ప్రేమకు,ఆమె పలకరింపుకు ,అభిమానానికి.. చాలా ఆనంద పడ్డాడు.
" అమ్మాయి.. నీ పేరు"
"సత్యసుందరి అన్నయ్యగారు"
" చాలా బాగుందమ్మా ఈ వెధవ పండు స్వామి గాడు...నిన్ను బాగా చూసుకుంటు న్నాడా వీడికి ప్రాపర్టీ డెవలప్ చేయడం అస్సలు చేతకాదు... అది నేర్పుదామని వచ్చాను... నా చెల్లి హ్యాపీగా ఉండాలిగా.. అందుకనే నా పను లన్నీ మానుకుని వచ్చాను... సరే.. ఒరేయ్...... ఆ అమౌంట్ ఉన్న సూట్ కేస్ ఇలా పట్టుకురా.... ఈ పాటికి చెదలు పట్టి ఉండొచ్చు." అన్నాడు ధనరాజు పండుస్వామి తో.
ఈసారి పండుస్వామి ఇంకా బిగ్గరగా నవ్వాడు. సత్యసుందరి కూడా మూతి ముడుపు గా ముసిముసిగా నవ్వింది
"తెస్తాను ఉండు.."... అంటూ పండు స్వామి గదిలోకి వెళ్లి సూట్కేసు పట్టుకుని వచ్చాడు.
" నేను చెప్పేది ఏమిటంటే అమౌంట్ అంతా ఒకే చోట పెట్టకూడదు.. ఒక కోటి బిజి నెస్ మీద,మరో కోటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద, ఇంకో కోటి తో స్థలాలు కొనాలి... నాలుగో కోటి మిగిలి ఉంది మీ దగ్గర చూశారూ... దాన్ని కొంత షేర్లు మీద కొంత బంగారం మీద... ఇలా చేశారు అనుకో.. రెండు సంవత్సరాల్లో 8 కోట్లు అయి తీరుతుంది. నాది గ్యారెంటీ." అంటూ ధన రాజు సూట్కేసు తెరిచాడు.
అందులో రెండు కవర్లు ఉన్నాయి.
" ఇదేమిటిరా క్యాష్ ఉందన్నావ్."..అంటూ ఒక కవరు ఓపెన్ చేశాడు.... అది పండుస్వామి కి బి.పి...లేదని డాక్టర్ సర్టిఫికెట్.... మరొక కవర్ ఓపెన్ చేశాడు... అది పండుస్వామికి...
షుగర్ లేదని డాక్టర్ ఇచ్చిన మరో సర్టిఫికేట్.
" ఏమిటిది?" విచిత్రంగా అడిగాడు.
పండు స్వామి ఈసారి నవ్వలేదు. "ఒరేయ్ ధనరాజు... నీకు బిపి ఉందన్నావ్, షుగర్ ఉంది అన్నావ్... అవి రెండూ లేని వాళ్ళు రెండు కోట్ల ఆస్తిపరులతో సమానం అని...ఈ రెండు సర్టి ఫికెట్లు ఇస్తూ డాక్టర్ గారు అన్నారురా.. ఆ రెండు కోట్లు ఇవే!!".... అంటూ 30 డిగ్రీల ఫేస్ కటింగ్ తో.. ధనరాజు వైపు చూశాడు... పండు స్వామి.
ధనరాజు 90 డిగ్రీల కటింగుతో తూలుతూ పైకి లేచాడు... మిడి గుడ్లతో చూశాడు పండు స్వామి వైపు.
" ఓహో..మరో రెండు కోట్ల గురించా నీ చూపు..అవి ఈ సూట్కేసులో లేవు.. నాదగ్గరే ఉన్నాయి. నేను ప్రతిరోజూ....కడుపునిండా అన్నిరకాలు భోజనం చేస్తాను... అది మూడవ కోటి ఆట!!! మా డాక్టర్ గారు చాలా చిత్రంగా చెప్పారురా... ఆయన అన్నారు... పండు స్వామి పండుస్వామి.... నీకు హాయిగా నిద్ర పడుతుంది కదా.. అది నాలుగవ కోటి తో సమానం అయ్యా అన్నారు. ఇప్పుడు చెప్పు నాకు నాలుగు కోట్లు ఉన్నట్లు కాదా... నేను 4 కోట్లు సంపాదించినట్లు కాదా..." పండుస్వామి ధనరాజు వైపు ఓరగా చూస్తూ అన్నాడు.
ఎవరికీ వినబడకుండా తనలో తానే..సత్యసుందరి కిసుక్కున నవ్వేసింది! "ఆ బొజ్జ పొట్ట ఏంట్రా బాబు..". అన్నట్టు సత్యసుందరి తనవైపు చాలా చిరాకుగా చూసినట్టు అని పించింది ధనరాజుకు.
ధనరాజు కోపంగా వెళ్ళిపోబోయాడు.
"ఒరేయ్..ధనరాజు నిన్నుఅవమానించటం మా ఉద్దేశం కాదురా... నిన్న పార్కులో నువ్వు ఆయాసపడుతూ మాట్లాడుతుండటం చూసి నప్పుడే నీ గురించి తెలిసింది....పూతరేకుల కుండలాంటి నీ బొజ్జ చూసాకే నిన్న నాకు చాలా భయం వేసింది. కోట్లు కన్నా ఆరోగ్యం ముఖ్యం. నువ్వే కదా ఫ్రెండ్స్ అంటే భార్యా భర్తలు గా ఉండాలని నిన్న చెప్పావు. ఇప్పుడు
నేను నీ భర్తను అన్నమాట..ఆర్డర్ వేస్తున్నాను.. పాటించి తీరాలి".....అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు పండుస్వామి... ధనరాజు బయటకు వెళ్లకుండా.
ఈరోజు నుండి నీ ఆరోగ్యం కోసం ఆరు గంటలు..నీ సంపాదన కోసం...మరో ఆరు గంటలు..ఇలా... నీ దినచర్య... ఉండాలి.. ఇది ఆప్తుడైన మిత్రుడికి ప్రేమగా నేను ఇచ్చే సజెషన్ రా... అలా చేస్తాను అని నువ్వు మీ చెల్లాయి మీద ఒట్టు వేసి చెప్తేనే నీకు దారి వదులుతాను... లేదంటే కుదరదు..."' అంటు కచ్చితంగా చెప్పాడు...
మిత్రుని ప్రేమకు ,ఆప్యాయతకు.. పులక రించి పోయాడు.. ధనరాజు.
" సరే.."... అంటూ పండుస్వామి ని గట్టిగ ఆలింగనం చేసుకున్నాడు ధనరాజ్.
పండుస్వామికి ఊపిరి ఆడలేదు.
" ఒరేయ్.. వదలరా..వదలరా.." అంటూ గట్టిగా అరిచాడు. అయినా ధనరాజు పండు స్వామిని వదలలేదు.
ఈసారి ధనరాజు తన బొజ్జమీద నిమురు కోలేదు ఆనందంగా గుద్దు కున్నాడు... తన పెద్ద పొట్ట అంతా కరిగి పోయి..చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది అతని మనసుకు.
🥰🥰🥰🥰
(ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు మేలుకొలుపడమే నా ఆశయం.)
🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం....
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments