top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 4'Jeevana Chadarangam - Episode 4' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 25/01/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 

బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. 

 ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు.  ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 4 చదవండి. 


సిరి మాటలను గేలి చేస్తూ ఆకతాయిగా మాట్లాడే మైత్రి కళ్ళు ఇప్పుడు చమర్చాయి. ఇంత చిన్న వయసులో షర్మిలకు ఇన్ని కష్టాలా? అసలు పుట్టుక నుంచీ షర్మిల అనేక ఇబ్బందులను ఎదుర్కుంది. తండ్రిని చూడనే లేదు. ఆ తరువాత తాతనూ పోగొట్టుకోవడం, ఊరు కాని ఊర్లో ఎవరి పంచనో ఉంటూ ఆ తల్లీ కూతురు బతకడం. ఎంతటి అభాగ్యురాలైయ్యింది పాపం!!


“పేదరికానికి ఇన్ని పరీక్షలుంటాయా సిరీ?” గద్గద స్వరంతో అంది మైత్రి. 


“మీ అమ్మంత మనోధైర్యం ఉంటే, పేదరికపు కష్టాలతో పోరాడే శక్తి కూడా అలాగే ఉంటుంది. ఆ రాజా చెల్లెలే ఐనా నీ కన్నతల్లి గౌరి మహా బేల. ఏదో ఉన్నదాంట్లో సద్దుకుపోతూ వచ్చిందే కానీ, కష్టాలను కానీ, పరీక్షలను కానీ ఎదుర్కునే ధైర్యం తక్కువ. కానీ మీ అమ్మలా కాకుండా నిన్ను పెంచి నీకు ధైర్యం నూరి పోసినది మా రాధత్తయ్యే తెలుసా?” కనుబొమ్మలను ఎగరేస్తూ చిరు గర్వంగా అంది సిరి. 


“అది సరే కానీ ఆ తరువాత షర్మిలకేమైంది? వాళ్ళమ్మ పోయిన సంగతైనా తనకు తెలిసిందా?” అడిగింది మైత్రి. 


‘ఉత్సవాలకని ఊరెళ్ళిన అమ్మ చాలా రోజులవరకూ రాలేదు. తనకు స్కూలు ఉంది కనుక తను హాస్టల్ లోనే ఉండిపోయింది. ‘తాతయ్య ఒంట్లో ఏదైనా నలత చేసి అమ్మ ఉండిపోయిందేమో. తాతయ్యను కూడా చూసినట్టుంటుంది. ఒక సారి నేనే వెళ్ళి వస్తాను’ అనుకుని ఊరు బయలుదేరింది షర్మిల. 


కానీ బెంగుళూరు దాటకుండానే ఊరు చేరకుండానే దారిలోనే ఆమోను బలవంతంగా హైదరాబాదు తీసుకు వెళ్ళారు దుండగులు. అదే మేము మన ఊరికి సంక్రాంతి పండుగకు బయలుదేరిన రోజు. అప్పుడే ప్లాట్ఫార్మ్-2 లో ఆమెను మొదటి సారిగా చూసాము. అక్కడి నుండి ఆ కాషాయం ధరించిన వారి నుండి తప్పించుకుని పారిపోయింది. అరోజే కాకతాళీయంగా ఆమెను చూసిన మేము మళ్ళీ మనూళ్ళో చూడడమూ జరిగింది. 


కానీ ఆ తరువాత అనేక సఘటనలు వెలుగులోకి రాగా ఆమెకూ మన ఊరికీ ఉన్న సంబంధమూ, రాజన్న ఆమెకు తాత అని, మన రాజా బాబాయ్ కూ ఆ కాషాయి దుస్తుల వారితో గల కనెక్షను, నాగభూషణానికీ రాజా బాబాయ్ కీ ఉన్న లావాదేవీలు మొదలగు విషయాల గురించి తెలిసింది. 


మొదట్లో, తాతగారితో ఉత్తర ప్రత్యుత్తరాల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మా బాబయ్య కూడా రాజా కూటమిలో చేరాడు. అంచేత ఆశ్రమ కార్యక్రమాలు ఎలా ఉంటాయో మా బాబయ్యను చూడడం వల్ల తాతగారికి తెలియడం, వాటిని గురించి నాతో పంచుకోవడం జరిగింది. అలా ఆ ఆశ్రమ కార్యక్రమాలు మన ఊర్లో కొనసాగించడంలో మా బాబయ్య పాత్ర ఎంతో ఉండేది. ఆశ్రమం వ్యాపించడానికి బ్రాంచీలుగా ప్రతి ఊళ్ళో పెడ్డడం, వాటి కార్యక్రమాల ద్వారా వేళ్ళు నాటుకుని, వటవృక్షంగా మారడం అనతి కాలంలోనే జరిగిపోయింది. 


అది మహావృక్షమై ఎందరి జీవితాలతో చలగాట మాడనున్నదో అప్పటికి ఎవ్వరికీ అంచనాకి రాలేదు. అందుకే కాబోలు మా బాబయ్య కొత్తగా మారాడు. ఎప్పుడూ ఇంటి నుంచే తన వృత్తిని చూసుకున్న బాబయ్య తాతగారి ఇంటికి దూరంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అతడి ఆగడాలు తాతయ్య కంట పడకుండా జాగ్రత్తపడ్డాడు కాబోలు. ఆ సంక్రాంతి పండగకు మేము వెళ్ళనప్పుడే అవే కాషాయి రంగు దుస్తుల వారితో మాట్లాడుతూ, తనూ అదే గుర్తున్న స్కార్ఫుని ధరించి ఉండడం చూసాను. 


“అది సరే గానీ షర్మిల అసలా రోజు రైల్వే స్టేషనులో ఎందుకంత భయపడి పోయింది. ఏదైనా ప్రత్యేక సంఘటన ఆమెను భయకంపితురాలిని చేసిందా?” అడిగింది మైత్రి. 


ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు షర్మిలకు అసలు తెలియదు. నిజం చెప్పాలంటే అసలు ఆశ్రమం విషయాల నుంచి షర్మిలను ఎప్పుడూ దూరంగానే ఉంచేది తన తల్లి శ్యామల. ఆమైతే రాజా కుటుంబంతో ఆశ్రమ పనులకోసం వెళ్ళేది కానీ, షర్మిలను మాత్రం ఫాదర్ రక్షణలో, హాస్టల్ లోనే ఎప్పుడూ ఉంచేది. అంచేక షర్మిలకు ఆశ్రమ విషయాలే చాలా రోజుల వరకూ తెలియదు. కానీ, ఒక రోజు ఆశ్రమంలో పెద్ద ఎత్తున తన వయసు పిల్లల కోసం ఏదో కార్యక్రమం జరుగుతోందని, తను కూడా వీలుంటే రావచ్చునని శ్యామల చెప్పింది. అమ్మ మాట కోసం ఆ రోజు వచ్చింది షర్మిల. 


ఉత్సాహంగా ఆరోజు ఆశ్రమానికి వెళ్ళిందే కానీ, అక్కడి పరిస్థితులు చూసి ఆశ్రమంపై పెద్ద మంచి అభిప్రాయం ఏర్పడలేదు. అంతే కాక కొన్ని సంఘటనలు షర్మిలకు జుగుప్స కలిగించాయి. హాస్టల్ నుండి సెలవులకు వచ్చిన షర్మిల ఆశ్రమంలో జరగనున్న శిబిర నిర్వహణ పనుల్లో సహాయ పడేందుకు అమ్మతో వెళ్ళింది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. 

******

ఆశ్రమంలో ‘స్వియ సంతులనం శిక్షణా కార్యక్రమం’ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిబిరానికి కావలసిన ఏర్పాట్లకి తన వొంతు సహాయాన్ని అందిస్తోంది షర్మిల. మునుపెపుడో ఒకటి రెండు సార్లు ఆశ్రమాన్ని చూసినా, అంత వివరంగా ఎప్పుడూ చూడలేదు షర్మిల. నాలుగు రోజుల శిక్షణా శిబిరం పనులలో సహకరించడానికి వెళ్ళిన తనకు ఎన్నో వింతలు, విడ్డూరమైన విషయాలూ కనిపించాయి. ఐతే ఈ శిబిలం ద్వారా తానూ ఏదో నేర్చుకోవచ్చునని ఉత్సాహపడింది. కానీ, ఆశ్రమంలో తనకెదురైన అనుభవం జీవితాన్నే మరో దిశకు మలచుతుందని అప్పటికి షర్మిల ఊహకైనా అందలేదు. 


బ్లెసింగ్ ఇన్ డిస్గైస్ అన్నట్టు, చెడులో కూడా మంచి జరిగినట్టు, బెంగుళూరు రాజా ఇంటికి వచ్చినా, స్కూలు ఫాదరు సంరక్షణలో హాస్టలు, చక్కటి చదువు పొందే అవకాశం లభించింది. ప్రతి క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకుంటూ ఫాదరుగారి సంరక్షణలో చక్కగా చదువుకుంటోంది. మంచి చదువులు చదివి ఉన్నత పదవులను అధిరోహించాలన్న ఆశతో ఉండేది. 


ఆ శిబిరంలో తనకి అప్పచెప్పిన పనుల్లో నిమగ్నమై ఉంది శ్యామల. ఆశ్రమమంతా తిరుగుతూ ఒక్కో చోటునీ పరిశీలించి చూస్తోంది షర్మిల. దిన ప్రణాలిక వ్రాసిన బోర్డును చూసింది. వాళ్ళ స్కూల్లో ఉన్నట్టే అనిపించింది. దాని ప్రకారమే శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. ఆ రోజు మూడవ రోజు. శిక్షణలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకేరంగు దుస్తులతో, చేతిపై వేసిన గుర్తు, మెడకి అదే గుర్తుగల కాషాయి రంగు స్కార్ఫ్ ధరించి ఉన్నారు. వారందరిని చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలిగింది. మనుషులంతా ఒకటేనని సూచిస్తూ వారు ధరించిన సమమైన స్కార్ఫులను చూస్తే ముచ్చటేసింది. ఐకమత్యమే మహా బలమన్న నినాదం వారి పనుల్లో ప్రస్ఫుటంగా కనబడింది. 


ఉదయపు పలహారం పూర్తి కాగానే, వారికి ఏవో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత బోర్డులో సూచించిన విధంగా పెద్ద హాలు వద్దకు అందరూ చేరారు. హాజరైన వారందరికీ తర్ఫీదు కోసమై హాజరు వేసుకుంటున్నారు శిక్షకులు. వెలుపలి నుండి అంతా ఆసక్తికా చూస్తోంది షర్మిల. ఒకొక్కరినీ లోపలకు పంపారు. 


లోపల ఒక గదిలో ఒక గాజుపెట్టె అమ్మర్చి ఉంది. అలాంటి మరిన్ని గదుల్లోకి వెళుతున్నారు అందరూ. కొద్ది నిముషాల్లో గదుల్లోంచి శబ్దాలు వినిపించాయి. ఒంట్లో గగుర్పాటు పుట్టించే శబ్దాలు. ఆక్రందనలు. 


“వద్దు, నన్ను విడిచిపెట్టండి” అంటూ గావుకేకలు వేస్తోంది ఒక చిన్నారి. 


“నాకు భయం వేస్తోంది, నాకీ పరీక్ష వద్దు” మరో పదేళ్ళ కుర్రాడు అంటున్నాడు. 


ఆ ఆర్తనాదాలు వింటుంటే, ఏదో భయం తన గుండెల్ని పిండేసినట్టైంది. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలమూ షర్మిలలో పెరిగింది. వెంటనే, అక్కడే ఉన్న ఒక స్కార్ఫ్ తీసుకుని తనూ ధరించి ఆ హాలులోకి వెళ్ళింది. గదులలో అర డజనుకు పైగా గాజుపెట్టెలున్నాయి. ప్రతీ పట్టెలో ఒక పాము ఉంది. ఒక్కో చిన్నారికీ ఆ గాజుపెట్టెలో పాముతో ఉండడానికి శిక్షణ ఇవ్వబడుతోంది. అసలు చలనం లేకుండా కదలకుండా ఉండి భయాన్ని నిగ్రహించుకుంటే ఎంతటి విషసర్పమైనా ఏమీ చేయదని సూచించడమే ఆ శిక్షణట. 


“నీ సెషన్ పూర్తైందా?” లోపలికి వస్తున్న వ్యక్తి స్కార్ఫుతో ఉన్న షర్మిలను అడిగాడు. తల ఊపి జుగుప్సతో బయటకు పరుగు తీసింది. స్కార్ఫు తీసి విసిరి పారేసింది. కాసేపు ఒళ్ళంతా కంపించి పోయింది. ఇక్కడుడడం ఎవ్వరికీ క్షేమం కాదనిపించింది ఆ చిన్ని మనసుకి. తల్లితో చెప్పి రాజా గారింటి పనిని కూడా వెంటనే మాన్పించి తతయ్య దగ్గరికో, లేక తాతయ్యనే తీసుకుని మరెక్కడికో దూరంగా వెళిపోదామని అమ్మకు చెప్పాలనుకుంది. 


కుదుట పడడానికి కాసేపు పట్టింది. అక్కడే పూదోటలోనున్న అరుగు మీద కూర్చుంది. కుడివైపున ఉన్న పెద్ద మందిరం నుండి మైకులో ప్రవచనం వినిపించింది. సరే, అదైనా కాస్త ఉపశమనం కలిగిస్తుందని వినడానికి అటువైపు వెళ్ళింది. 


“పురాణాలలో నాగ లోకాల ప్రస్తావన ఉంది. పాములే కాదు, పాము వంశానికి చెందిన మానవుల సమాజం ఒకటుందని, వారిని నాగులు అని పిలుస్తారు. మన దేశంతో సహా అనేక సంస్కృతుల చైతన్యాన్ని రూపొందించడంలో వారు చాలా ముఖ్యమైన పాత్రపోషించారుట. ఆధ్యాత్మికత అనేది మానవ అవగాహనను చూపే ఒక నిర్దిష్టకోణం. పాము ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇక్కడ ఎందరికి తెలుసు? అంచేత మనలను మనము అదే పాముద్వారా ఉద్ధరించుకోవచ్చును. 


ఇందుకు సహాయ పడేదే ఇక్కడ చేయబడే సర్పసేవ. 


ఒక బంధంలో ఉన్న ఏ ఇద్దరైనా ఇక్కడ లింగ భైరవునకు నైవేద్యం సమర్పించు కోవచ్చు. ఈ అర్పణ వారి సంబంధంలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు. ఇది భర్త మరియు భార్య, సోదరుడు మరియు సోదరి లేదా వ్యాపార భాగస్వాములు వంటి సంబంధాన్ని పంచుకునే ఎవరైనా సమర్పించుకోవచ్చు. ఇది బలమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది మరియు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. 


నాగదోషం, వైవాహిక సంబంధమైన అడ్డంకులు, ప్రధాన అడ్డంకులు, శ్రేయస్సు లేదా పురోగతి లేకపోవడం మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడాలని కోరుకునే వారికి కూడా సర్ప సేవ అందుబాటులో ఉంది. మీరు చేయవలసినదల్లా మీ పేర్లు నమోదు చేసుకోవడమే. మన సేవాదళం వారు మిగిలనదంతా చూసుకుంటారు. ఓం తత్సత్” అంటూ సెలవిచ్చారు. 


ఇప్పటి వరకూ ఉన్న భయమూ, అయోమయమూ ఇప్పుడు లేవు సరికదా, ఆలోచనా శక్తిని సైతం ఇప్పుడు కోల్పోయింది షర్మిల. ఈ మాటలు కానీ, ఇక్కడ చూస్తున్న విషయాల యొక్క పర్యవసానం కానీ తొమ్మిదేళ్ళ షర్మిలకు అస్సలు బోధపడలేదు. తన ఆలోచనాశక్తికి మీరిన విషయాలవి. బుద్ధికి తాళం పడిపోయింది. 


“అమ్మా, నువ్వు రాజా సారుకి మనం ఊరికివె ళ్ళిపోతామని నెమ్మదిగా చెప్పు” నిర్లిప్తంగా అంది. 


‘చిన్నతనం కనుక, అంత సులభంగా వెళ్ళిపోవచ్చును అనుకుందే కానీ, షర్మిలలా నేనూ ఆలోచించలేను కదా! ఇక్కడికొచ్చిన నాటి నుండీ నేను అనేక నిర్బంధాల్లో చిక్కుకున్నాను. అంత సులువుగా వెళ్ళిపోతానని చెప్పగలిగే పరిస్థితి కాదు. కాలం, సమయం కలసి రావడం కోసం వేచి ఉండాలి. అనుకున్నవి వెంటనే అమలు పరిచే స్థితిలోనే ఉంటే అంతకంటే అదృష్టమూ, కావలసిందీ ఇంకేముంటుంది. కానీ, అంతటి భాగ్యము తమకెక్కడిది. 


ఆచీ తూచీ అడుగు వేయవలసిన దుర్భర స్థితి. దురదృష్ట వశంగా తమ స్థితి అది. తగిన సమయం కోసం వేచి ఉండాల్సిన అగత్యం. ఊరికి రావడం, నాన్న పోవడం జరిగిపోయింది’ శ్యామల మనసులో అనేక ఆలచోనలు పరుగులు తీసాయి. 


“అక్కడ చూసిన దృశ్యాలూ, స్కార్ఫ్ ధరించిన వ్యక్తులు, వింతలూ, వికృతాలూ తలచినపుడల్లా షర్మిల భయంతో కంపించి పోయింది. ఆ రంగు దుస్తులు, ముద్ర, స్కార్ఫ్ తనలో రేపిన భయం తనను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. 


అలా కనుమరుగైన షర్మిల ఎవరికీ కనబడలేదు. ఆ తరువాత కొన్నాళ్ళ వరకూ ఆమె జాడ తెలియనేలేదు. శ్యామల మరణ వార్త తరువాత ఆశ్రమ విషయాలను గురించి తెలిసిన మరో వ్యక్తి షర్మిల ఉందని ఆ ముఠాకి తెలిసినా, చిన్న పిల్ల, తల్లినీడ కూడా లేనిది, అదేం చేస్తుందని తక్కువగా అంచనా వేసారు. వెంటాడినా చిక్కని ఆమెను వదిలేసారు. 


ప్లాట్ఫార్మ్-2 పై తమ పిల్లల్ని బతిమాలుతూ విఫలమైన రాజారామ్, సీతాలక్ష్మి దంపతులు నడుపుతున్న ఉద్యమంలో చెరింది షర్మిల. ఆవేళ ఆ కాషాయి ముఠానుండి తప్పించుకుంటున్న షర్మిలను గురించి వివరాలు అడిగిన రాజారామ్ దంపతులు, అప్పుడే ఆ ఆశ్రమ వాసానికేగి బిడ్డలను దూరం చేసుకున్నారు. అంతలోనే దైవానుగ్రహంగా షర్మిల వారికి కనిపించింది. 


వారితో తీసుకుని వెళ్ళి ఆశ్రయమిచ్చారు. ఇటువంటి మోసభూయిష్టమైన విషవలయాలనుండి యువతను కాపాడాలన్న సంకల్పంతో ఒక ఉద్యమాన్ని స్థాపించిన వారు, షర్మిలను అందులో చేర్చుకున్నారు. ఉద్యమంలో భాగమైన షర్మిల అనేక మంది యువతలో సకారాత్మక దృక్పథాన్ని నెలకొల్పడంలో విజయం సాధించింది. 


ఈ విషయం చూచాయగా తెలిసిందేకానీ ఆమెను గురించి ఊళ్ళో ఎటువంటి ఆధారాలూ దొరకని కారణం చేత ఆమె విషయంలో ఏమీ చేయలేకపోయారు రాజా నాగభూషమం” అంది సిరి. 


సిరి సాంగత్యం పదేళ్ళ పైచులుకేనైనా ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం తనపై పడి మైత్రిని అనేక విషయాలపై ఆలోచింప చేస్తోంది. 


“ఏవిఁటా ఉద్యమం?” అలోచనల్లో పడింది మైత్రి. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
55 views0 comments

Comments


bottom of page