'Jeevana Chadarangam - Episode 5' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 31/01/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది.
ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు.
ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 5 చదవండి.
“మైత్రీ, మన నలుగురు తాతగార్ల కుటుంబాల కథలన్నీ నీకు అంత విపులంగా ఎందుకు చెప్పానో తెలుసా? నాలుగు వేళ్ళూ ఒక్కలా ఉండవుగా! ఒక తల్లి కడుపున పుట్టిన వారందరూ అదే అగ్రహారంలో పెరిగారు. వారివారి కుటుంబాలు పెరిగుతూ, వ్యక్తిగతంగా పురోగతి వైపు పయనిస్తూ వెళుతున్నప్పటికీ, నేడు అందరూ ఒక్కలా లేరు. ఆర్థిక తేడాలను అధికమిస్తూ ఎవరి పిల్లల్ని వారు ఉన్నతంగా పెంచాలనుకోవడం, చదువులు చదివించడం చేసినా, అందరి జీవితాలు ఎలా మారిపోయాయో చూడు! జీవితం ఎంత విచిత్రమైంది మైత్రి! పెద తాతగారింట్లో పెద్దగా చదువులు లేక పోయినా ప్రభుత్వోద్యోగాలు చేసుకుంటూ మధ్య తరగతి జీవీతాలు వెళ్ళబుస్తూ ఉన్నదాంట్లో సంతృప్తిగానే బతుకుతున్నారు. అలా ఉన్నచోట చల్లగా ఉంటున్న వాళ్ళను సైతం పెడ త్రోవ పట్టించేందుకు దారులు వేస్తున్నాడు రాజా బాబయ్య.
‘వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును,
చీడపురుగు చేరి చెట్టు చెఱచు,
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ!’
అన్నట్టు పెడత్రోవ పట్టిన రాజా బాబయ్య నాలుగు కుటుంబాల వారినీ ఏదో ఒక ప్రలోభంలో పడేస్తూ వారి జీవితాలనూ ప్రభావితం చేస్తున్నాడు” బాధగా చెప్పింది సిరి.
“ధనార్జన మీదే ధ్యాస పెట్టిన రాజా ఎన్నో ఆస్తులు గడించి కోటీస్వరుడైయ్యాడు. న్యాయ బద్ధమా కాదా అన్నది ఎవరికీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. బాబయ్య కూడా ధనాకాంక్షతో అతనితో చేతులు కలిపి పెడత్రోవ పట్టాడు. అన్నదమ్ముల పిల్లలందరూ ఆత్మీయంగా ఉంటూ మంచికీ చెడుకీ కలుసుకుంటూ ఆ బంధాలను నిలుపుకోవాలన్నదే మా నాన్న, మీ అమ్మ ఆశ. అలా మనమూ కొనసాగిస్తామనని వారి నమ్మకం. మనమెప్పటికీ అలా ఉంటూ వారి నమ్మకాన్ని నిలుపుదామా మైత్రీ?” అంది సిరి.
అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు మొత్తం ఈ తరం దాయాదులంతా ఇంచుమించు హైదరాబాదులోనే స్థిరపడి పోయినందువల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తరచూ కలుసుకుంటున్నారు. కలుసుకున్న రోజున ఊరు కబుర్లలోకి దిగారంటే సమయం గడిచేదే తెలియదు. మన చిన్నతనంలో జరిగినట్టుఊరికి వెళ్లడం రావడం ఇప్పుడు కుదరట్లేదనుకుని అందరూ బాధపడ్డారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో స్కూళ్లకు సెలవలు దొరకక ఒక కారణం, తాతలు అందరూ కాలం చేయడం వల్ల ఊరు వెళ్ళాలన్న ఉత్సాహం తగ్గి అక్కడికి వెళ్ళే పండగలు జరుపుకోవాలని అనుకోక పోవడం మరో కారణం. కారణం ఏదైతేనేమి, సుమారు మూడేళ్ళుగా ఎవ్వరూ ఊరు వెళ్ళలేదు. ఈ ఏడు ఎలాగైనా అందరూ వీలుచేసుకుని ఊరెళ్ళి రెండు రోజులైనా కలిసి గడపాలని తీర్మానించుకున్నారు. అది పండుగ సమయమైతే మరీ బాగుంటుందని కొందరు గట్టిగా పట్టుపట్టారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం అందరూ మళ్ళీ సంక్రాంతి జగపతిరాజపురంలో జరుపుకుంటున్నారు.
రోజులు దగ్గర పడే కొద్దీ ఇది కలా నిజమా అని ఉత్సాహం రెట్టింపవుతూ అనుకున్నారు. వాళ్ళకున్న ఉత్సాహం పిల్లలకు ఉండదని తెలుసు. ఐనా సరే ఒక్కసారైనా, అందరినీ తీసుకువెళ్ళడానికి ఒప్పించి సిద్ధమవుతున్నారు. పట్టణంలో పెరగడం, అక్కడి వాతావరణం అలవాటుపడి ఇప్పుడు ఊరంటే, అమ్మో బోరు అనుకుంటారు ఈ తరం వారు. అందులో నువ్వూ ఉన్నావు. నీలాంటి వారు మనతరంలో ఎందరో ఉన్నారు.
మన తరం వరకైనా ఈ మాత్రం చుట్టరికాలు తెలుస్తున్నాయంటే అది మీ అమ్మ చలవే తెలుసునా మైత్రీ? మీ స్వంత మావయ్యలైన ఆ బెంగుళూరు మందతో నీకు పరిచయం లేదు కనుక వారి గురించి నీకు ఆట్టే తెలియదు. ఎప్పుడు కలిసినా తతిమా వారికంటే వాళ్ళు గొప్పగా ఉన్నామని చూపించుకుంటూ భేషజాలకు పోతారు. ఏళ్ళ నుండీ ఇక్కడే ఉంటున్న మా అత్తయ్యలు కానీ, మీ అమ్మ కానీ అలా ఎప్పుడూ అనుకోలేదు. అందరూ కలిసి మెలిసి ఉంటున్నారాలేదా? ఆ రాజా బాబయ్య వాళ్ళు మాత్రం అలా ఉండరు. అంతెందుకు, నిన్ను దత్తత ఇచ్చిందే కానీ, మీ అమ్మ, అదే నాకు గౌరి అత్తయ్య, తను కూడా ఎప్పుడూ రాధత్తయ్యను వేరు చేసి చూడలేదు. నిన్ను రాధత్త బిడ్డగానే చూసింది గౌరి అత్తయ్య. అదే ఇంట్లో పుట్టినా, అన్నగారైన రాజా బాబయ్య బుద్ధి వంటపట్టలేదు. గౌరి అత్తయ్య ప్రోత్భలం వల్లనే అంతా ఈ ఏడు మళ్ళీ పండుగకి ఊరు వెళ్లే సన్నాహాలు మొదలు పెట్టారు. ఆ బెంగళూరు వారు కూడా వస్తారుట. అన్నదమ్ముల పిల్లలంతా కలిసి కట్టుకా ఉంటే రేపు మనతరం కూడా చుట్టరికాలు తెలిసి కలిసి మెలిసి మసలుకుంటామనే వారి నమ్మకం. ఎదిగిన తమ పిల్లల్ని ఒక్క సారైనా ఊరుకి తీసుకుని వెళ్లి, అందరినీ ఒక చోటకి చేర్చి మనతరానికి బంధుత్వాల గురించి చెప్పి చూపించాలన్నదే వాళ్ళ తాపత్రయం. అలా చేస్తే, మనతరం కూడా ఆ బంధుత్వాలను వదులు కోకుండా ఉంటామని వారి నమ్మకం. నువ్వేమో చుట్టరికాల గురించి ఎంత విడమరచి చెప్పినా తలకి ఎక్కించుకోవు. పెద్దగా పట్టించుకోవు!” వివరిస్తూనే చెవిమెలి పెట్టినట్టు అంది సిరిచందన.
“అబ్బా, వెళ్ళి చూస్తే కానీ తెలియదే బాబూ! ఇంత పెద్ద ఫేమిలీ ట్రీని అలా చెప్పేస్తే ఎలా గుర్తుంటుంది? అందరూ నీలా వీళ్ళందరి గురంచి తెలుసు కోవాలనుకోరుగా. ఈ సారి వెళుతున్నాముగా, చూసాకా అందరినీ గుర్తు పెట్టుకుంటానులే. మన పెద్దవాళ్ళ నమ్మకాన్ని కాపాడడంతోపాటు, చూసిన వారందరినీ తప్పకుండా మర్చిపోతాను అనే నీ అపనమ్మకాన్ని తప్పు అని కూడా నిరూపిస్తానులేవే మహాతల్లీ.. ” చిలిపిగా అంది మైత్రి.
******
సోషల్ వర్కనీ, పోటిలనీ ఎప్పుడూ అన్నిట్లో పాల్గొనే సిరి బిజీగా ఉండడంతో కాలేజీ అంతా సిరి పేరు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. వడ్డించిన విస్తరిలా అన్నీ అమర్చి ఉన్నా మైత్రి మాత్రం ఎప్పుడూ ఏదో నిరుత్సాహంగానో, లేక జీవితంలో ఇంకా ఏదో లేదనో నిరాశగా ఉంటూ ఉంటుంది.
“ఎప్పుడూ ఆ నిరుత్సాహం ఏవిటే? రాధత్తయ్య నీ మీదెన్ని ఆశలు పెట్టుకుందో తెలుసుగా? నిన్ను ఎంతో గొప్పస్థానంలో చూడాలని కలలు కంటోంది. అందుకు కావలసినవన్నీ తన శక్తికి మించి సమకూరుస్తోంది. నీ మీద అత్తయ్యకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకూడదు. గౌరత్తయ్య చేతుల్లోంచి నిన్ను అందుకుని అక్కున చేర్చుకున్నప్పటినుండీ నిన్ను అతి గారాబంగా పెంచింది. పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుంది. నిన్నోకంట కనిపెట్టమని నాకు రాధత్తయ్య చెప్పిందిలే. అంచేత ఈ క్విజులో మనం పాల్గొంటున్నాము ప్రైజు కొట్టేస్తున్నాము. పద పద” అంటూ హడావుడి పెట్టింది సిరి. అలాగే సెమిస్టర్ పరీక్షలకు చదివేందుకు మైత్రిని తయారు చేయడానికి నాంది పలికింది.
“నేను నీకు హెల్ప్ చేస్తానే, ఈ సెమిస్టరులో నువ్వు మంచి మార్కులతో పాసవ్వాలి, సరేనా? రోజూ మనిద్దరం కలిసి చదువుదాం” క్రితం సెమెస్టరులో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలై నిరుత్సాహంగావున్న మైత్రికి నచ్చచెప్పింది సిరి. మైత్రి చదువు అలా కుంటినడకనడవకుండా ఉండాలని శతవిధాల తనకు వీలైన ప్రయత్నం చేస్తోంది సిరి.
“మైత్రీ, డిగ్రీ ఫైనల్లోకి వచ్చేసామే! బాక్ లాగ్స్ లేకుండా మంచి స్కోర్ తో పాసవ్వడం మనకి చాలా ముఖ్యం. దాని కోసం ఇప్పటి నుండే కృషి చెయ్యడం ప్రారంభించాలి. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలే కాకుండా మన డిగ్రీ స్కోరులు కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు. అంచేత, మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగాలొచ్చే అవకాశం. అమ్మాయి గారు నా మాట విని రోజు ప్రాక్టీసుకి రావలసిందే. రోజు వారీగా టైం టేబులు వేసుకుని చదువుదాం. సంవత్సరం మొదలవ్వక ముందు నుంచే ఇలా చదివామంటే, మనకి తప్పక మంచి స్కోర్లు వస్తాయి. ఈ ఇయర్ నేను చెప్పినట్టు విని తీరవలసిందే” సున్నితంగా మందలిస్తూనే బుజ్జగించి చెప్పింది సిరి.
*****
ఎన్నో ఏళ్ళ తరువాత దాయాదులందరూ, అప్పటికు కుదిరినంత మంది రాగలిగారు. పిల్లలు ఎదిగాక వాళ్ళు చేసుకుంటున్న మొదటి పండగ అది. చిన్నపిల్లలుగా ఆటలాడుకునే వయసులో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న పిల్లలు! ఇప్పుడు చదువులయ్యి ఉద్యోగాలూ, పెళ్లిళ్ల వయసు వరకూ వచ్చేసారు. పండుగ సందడితోపాటు ఎదిగిన పిల్లల్ని చూసుకుంటున్న ఆ తరంవారంతా ఎంతో ఆనందించారు. అందరూ కలుసుకుని ఏడెనిమిదేళ్ళపైమాటే.
పండుగ అని నెపం పెట్టుకుని ఒక అద్భుతమైన సందర్భాన్ని కల్పించుకునే అందరూ రావాలనుకోవడమే గొప్ప విశేషం. ఇలాంటి ప్రయత్నాలు మున్ముందు సాధ్య పడడమూ కష్టమే. పిల్లలు కూడా ఉద్యోగాలని, పై చదువులనీ, పెళ్ళిళ్ళనీ దూరాలకు వెళ్ళిపోతారు.
రాధ తన అక్కయ్య రాజ్యాన్ని తీసుకుని సకుటుంబ సపరివారంగా వచ్చింది. తన ముగ్గురు పిల్లలతోనూ దిగింది గౌరి. గౌరి అన్నదమ్ములు సూర్యం, రాజా బెంగళూరు నుంచి, చంద్రం మద్రాసు నుంచీ వచ్చారు. తాటి ముంజులు, కొబ్బరి బొండాలు, చెఱుకుగెడలు, కొత్త చింతపండు, మావిడి పిందెలు, మావిడల్లం ఇవన్నీ సంక్రాంతి నవరసాల నిధులు. పిల్లలకి తెలియని ఆ వస్తువులన్నీ రైతు వెంకయ్య ప్రీతిగా తెచ్చి పెట్టాడు.
గౌరి, లావణ్యల పిల్లలకంటే సూర్యం, రాజాల పిల్లలు పెద్దవాళ్ళు. దాయాదుల మధ్య ఆరాలు, అసూయలు ఉండడం సహజమే. రాజా బెంగుళూరులో కోట్లు గడిస్తున్నాడన్న వార్త వినికొందరికి అనుమానం వేయగా మరి కొందరికి ఆశ్చర్యం కలిగింది.
మద్రాసు నుంచి వచ్చిన చంద్రం బాబయ్య పిల్లలు బాగా చదువుకుంటూ బుద్ధిమంతులని అపించుకున్నారు. రాజా పిల్లలు ముగ్గురూ కాస్త పొగరుగా ఉన్నా స్టైలుగా వున్నారనుకుంది మైత్రి. వారి ప్రతి నడవడిక లోనూ డబ్బు దర్పం, అహం గమనించింది సిరి. రాఘవ, రితీష్ ల తీరు సిరికి అసలు నచ్చలేదు. రౌడీల్లా ఉన్నారనుకుంది మనసులో. కలుసుకున్న రెండ్రోజుల్లోనే మైత్రికీ, రాఘవకూ స్నేహం కుదిరింది. అందరికీ అది ఆశ్చర్యం కలిగించిన విషయమే. ఆతడిని చూసిన వెంటనే పొగరుబోతని అనిపించినా, ఎందుకో సిరికి అతని స్టైలు నచ్చింది. రావడానికి బోరు అంటూ వంకలు పెట్టిన మైత్రి ఇప్పుడు మాత్రం ఊళ్ళో ఉండడానికి బోరనడం మానేసింది. మైత్రిని ఉత్సహాంగా చూసిన రాధ సంతోషపడింది. ఎలా ఉంటుందో అని బెంగగా వచ్చిన రాధకి ఇప్పుడు నిశ్చింతగా ఉంది.
“గళ్ళాల్లో డబ్బు బాగా మురుగుతున్నట్టుంది. ఒకటే పోజులు కొట్టడం. ధన అహంకార మహిమే” చిరాకు పడుతూ మైత్రితో అంది సిరి.
“నాకూ ముందు అలాగే అనిపించింది సిరి. కనిపిస్తున్నదంతా పొగరు కాదే. భాష ఇబ్బంది కూడా కాస్త ఉంది. వాళ్ళకి కన్నడంబాగా అలవాటు. తెలుగులో మాట్లాడడం తక్కువ. ఈ పల్లెటూరి భాష అలవు బోధ పడకపోవడంతో మాట్లాడడానికి మరికాస్తు జంకుతున్నారు” సమర్థిస్తూ అంది మైత్రి.
********
పెరట్లో సపోటా చెట్టుకింద కూర్చుని మైత్రీ, రాఘవ బోలెడు కబుర్లు చెప్పుకుంటూ గంటలు గడిపేస్తున్నారు. సిరికి కొద్దికొద్దిగా విషయం అర్థమవుతున్నా పట్టించుకోలేదు. వాళ్ళు విడిగా ఆడుకుంటూ ఉన్నా మాట్లాడుకుంటున్నా మైత్రి ఎప్పుడూ రాఘవ కబుర్లే చేప్పేది. రాఘవ బావ ఇలా అన్నాడు అలా చేసాడంటూ, మైత్రి ధ్యాసంతా అతని మీదనే ఉండడం గమనిస్తూనే ఉంది సిరి.
‘రాఘవన్నయ్య నాకు మాత్రం ఎందుకో పెద్ద నచ్చలేదు. విషయంపై అవగాహన తక్కువ, గొప్పలకు పోవడం ఎక్కువ’ అని మనసులోనే అనుకుందిసిరి.
అలా మనుషుల్లోని అసలురంగులు పసిగట్ట గలగడమూ ఒక కళే. పాలల్లోని నీళ్లను వదిలి పాలనే గ్రహించగలిగే శక్తి హంసలకు ఉంటుందంటారు. హంసలకు కాకులకు ఉన్న భేదం అదే. పై ముసుగులెన్ని వేసుకుని నటిస్తున్నా, అవతలి మనిషిని లోతుగా పరికించి చూసి, వారి అసలు గుణాలను పసికట్టడంలో దిట్ట సిరి. అందుకేనేమో, సిరికి సైకాలజీ విషయం అంటే చాలా ఇష్టం. హ్యూమన్ బిహేవ్యరెల్ సైన్సు సంబంధిత పుస్తకాలు ఆసక్తికరంగా చదువుతూ ఉంటుంది. డిగ్రీ తరువాత తను చేయాలనుకున్న కోర్సుని కూడా ఎన్నుకుంది సిరి. వ్యక్తిగత సంబంధాలు వాటి ప్రభావాలు, వివిధ పరిస్థితులలో మానవ ప్రతిచర్యలు, వారిమానసికత, ప్రవర్తనా వైఖరులు మున్నగు అంశాలు ఇమిడున్న సైకాలజీ కోర్స్ చేయాలన్నది ఆమె ఆశ. కాలేజీలో కూడా తప్పనిసరిగా తీసుకోవలసినఎక్స్ట్రా కరికులర్ అంశంగా అందరూ తీసుకునే NCC కాకుండా NSS నేషనల్ సర్వీస్ స్కీమును ఎంపికచేసుకుంది. ఎన్నుకున్న దిగువ వర్గపు మురికివాడలకి వెళ్ళి వారానికొక రోజు వారితో గడపడం NSSలో భాగం. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను గురించి చెప్పడం, అక్కడి చిన్నారులకు చదువు నేర్పడం, సాంఘిక బాధ్యతల పై అవగాహన తేవడం మున్నగునవన్నీ ఆ సేవా కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం.
ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రవృత్తి మైత్రిది. ఆడుతూ పాడుతూ కాలక్షేపంచేస్తూ జీవితానికో గొప్పలక్ష్యమో, లేక ఏదో అవ్వాలన్న తపనో లేకుండా తప్పని సరి అన్నట్టుగా చదువుకునేది.
చంద్రం బాబయ్య కొడుకు కార్తీక్ సరదాగా ఉండడమే కాకుండా మంచి తెలివైనవాడు కూడాను. అతనికి షెర్లాక్ హోమ్స్, సిడ్నీ షెల్డన్, అగాథ క్రిస్టీ నవలలంటే చాలా ఇష్టం. నేరశాస్త్రం మీది మక్కువ ఎక్కువ. క్రైమ్ థ్రిల్లెర్స్ బాగా చదవడం వల్లనో, మద్రాసులో ప్రాధమిక శిక్షణ జరగడం వల్లనో అతని ఇంగ్లిష్ చాలా బాగుండేది. అందుకేనేమో అగాథాక్రిస్టీ పుస్తకాలను సైతం ఇట్టె చదివేసేవాడు. అనేక ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపుతూ చదివినవాటిని తనకు తెలిసినంతలో ఇతరులతో పంచుకునేవారు. తెలియనివి అడిగి తెలుసుకునేవాడు. అతని దగ్గర్నుంచి నేర్చుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉండడంతో సిరి చాలా వరకూకార్తీకుతో మాట్లాడుతూ మద్రాసు కబుర్లన్నీ వింటూ కాలక్షేపం చేసేది.
అంతలో పండుగ వచ్చేసింది. భోగినాడు అందరూ తల్లంట్లంటుకుని కొత్తబట్టలు కట్టుక్కున్నారు. కొత్త పరికిణి ఓణీ వేసుకుని, మెళ్ళో ఒక సన్నని గొలుసు వేసుకుంది సిరి. మెడలో పొడవాటి పెద్ద లాకెట్ గొలుసు, మావిడిపిందెల నెక్లెస్ పెట్టుకుని పట్టు పరికిణీ ఓణీ వేసుకుని ఎంతో అందంగా ముస్తాబయ్యింది మైత్రి. రోజుకో నగపెట్టి మైత్రిని ముస్తాబు చేసి మురిసిపోయేది రాధ.
‘పెరట్లో క్రికెట్ ఆడుకుంటున్న వాడల్లా ఎదో వంకన వచ్చి వంటింట్లోంచి ఎదో ఒకటి తెమ్మని నన్ను అడగడం నాకు నచ్చలేదు. మేము ఏదో ఆడుకుండగా వచ్చి అలా చేయడం, నేను వెళ్ళగానే అక్కడే కాలక్షేపం చేయడంగమనిస్తూనే ఉన్నాను. ఇందులో మర్మమేదోవుంది. రాఘవన్నయ్య ఎటువైపుకు అడుగులు వేస్తున్నాడో తెలుస్తోంది’ మనసులో అనుకుంటూ డైరీలో రాసుకుంది సిరి.
బొబ్బట్లు పులిహోరలతో భోగినాటి విందు భోజనాలు జరిగాయి. సంక్రాంతినాడు చక్కెర పొంగలి పప్పు వడలతో పసందు చేసుకున్నారు. కనుమనాడు మినుము తినాలంటారుట. అంచేత ఆరోజు గారెలు, సేమియా పాయసం. వంటలతో ఇంతులు అదరకొడితే, మావయ్యలు బాబయ్యలు ఆరగించి ఆస్వాదించారు. ఆ నాలుగు రోజులు ఎంతో సంబరంగా గడిచిపోయాయి.
హైదరాబాదు వెళుతూనే కాలేజీకి వెళ్ళాలి. ఇంటర్ కాలేజియేట్ సెమినారుకు తయారవ్వాలని మనసులో ఆలోచనలెన్నో మెదులుతున్నా, పండగను కూడా అంతే ఆస్వాదించ గలిగింది సిరి. తిరుగు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారంతా! ఊరే బోసిపోయేట్టుంది. ఊరికి రావడానికే ఏడుపు మొహం పెట్టిన మైత్రి ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి కూడాఅదే స్థితిలో ఉండడం చూసిన రాధ ఆశ్చర్యపడింది. అసలు విషయం ఎవరికీ తెలియకపోయినా, మైత్రి ఎదో దిగులుగా ఉండడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ప్రేమలో పడ్డట్టుందని మనసులోనే అనుకున్న సిరి మాత్రం పైకి అసలు తేలలేదు.
బాధను దాచుకుంటూ నవ్వులు వెదజల్లుతూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూవ ఎవరి ఊళ్లకు వారు ఏగిపోయారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Comentarios