top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 6'Jeevana Chadarangam - Episode 6' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 05/02/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 


బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. 


ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.

మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు.అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది.


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 6 చదవండి. 


నేడు ఉద్యమాన్ని సాగిస్తున్న షర్మిల వారికి దైవ ప్రసాదమని అనుకున్నారు రాజారామ్ దంపతులు. లేకపోతే అలా ఆరోజు..... కూతుళ్ళను దూరం చేసుకుంటున్న దురదృష్ట ఘడియలలో మరో అదృష్టాన్ని పొందుతామని ఎన్నడూ కలగనలేదు. ఆరోజు మరొక్కసారి దృశ్యమానమైయ్యింది.


ప్లాట్ఫార్మ్-2 నుండి కంగారుగా పరుగులు తీసిన షర్మిల భయంతో ఒణికిపోవడం గమనించారు రాజారామ్ సీతాలక్ష్మి దంపతులు. కానీ ఆ స్కార్ఫ్, ఒకే రంగుదుస్తులతో ఉన్నవారు ఆమెపై నిఘా వెసి ఉంచడం చూసి, తొందర పడకూడదని నిశ్చయించుకున్నారు. వాళ్ళ మనసు విరిచేసిన కారణంగా తమ పిల్లలు తమకు కాకుండా పోయారు. ఈ అమ్మాయికి ఏదో ఆపద పొంచి ఉందని గ్రహించాడు రాజారామ్.


“సీతా, నేర్పుగా ఈ అమ్మాయిని ఆ చిక్కుముడిలోంచి బయటకు తేవాలేకానీ, ఇప్పుడు తొందరపాటు చర్యతో వ్యవహరిస్తే, ఆ అమ్మాయి కూడా శివాని భవానుల్లా మారిపోయే ప్రమాదముంది. ఇప్పటికే కొందరు స్త్రీలు చేసి మోకాళ్ళు కొట్టుకుపోయి ఉన్న ఆమె చుట్టూచేరి సహాయ పడుతున్నారు. నువ్వు కూడా వెళ్లి, ఈ చీటి ఆ అమ్మాయి చేతుల్లో పెట్టు” అన్నాడు రాజారామ్. 


‘ఎటువంటి ఇబ్బందైనా వెంటనే మమ్మల్ని సంప్రదించు. నీకు మాతాపిత సమానులము. మా మీద నమ్మకం ఉంచు’ అని రాసి, కింద రాజారామ్ సీత అన్న పేర్లు, ఫోను నెంబరు కల చిన్న చీటీని జనాలలో కలిసిపోయి ఆమెను సమీపించినసీతాలక్ష్మి షర్మిల చేతిలో పెట్టింది. 


చుట్టూ చూసిన షర్మిల రహస్యంగా పెట్టిన ఆ చీటిని ఎవరికంటా పడకుండా దుస్తులలోపల దాచేసుకుంది. ఆమెకున్న ఒకే ఆసరా ఆ చీటి. ‘ఇప్పటికి వీళ్ళ చేతుల్లోనుంచి తప్పుకోలేకున్నా, ఒకనాడు ఇది రాసిన వారిని చేరుకుంటాను’ అనుకుంది.


మద్రాసు రైలుని తప్పించుకున్న తాను గోదావరిలోకి ఈడ్చబడింది. ఇంచుమించు ఆరునెలల నరకం చూసింది షర్మిల.


ఆరు నెలలతరువాత రాజారామ్ కి జగపతిరాజపురం నుండి ఫోను వచ్చింది. 


“నేను మీ వద్దకు రావచ్చునా? నాకు ఆశ్రయం ఇస్తారా? నాకంటూ ఎవ్వరూ లేరు?” జీరబోయిన స్వరంతో అంది షర్మిల.


“మా బిడ్డలాంటి దానివమ్మా. ఎక్కడున్నావు? మేము వచ్చి నిన్ను తీసుకు రాగలము” అన్నారు రాజారామ్.


“ఇక్కడ నుంచి తప్పించుకున్నాను. హైదరాబాదు వెళుతున్న ట్రక్కు ఎక్కాను. అక్కడికి వచ్చి చేరాకా మీ వద్దకు వస్తాను. ఎక్కడికి రావాలి?” హడావుడిగా మాట్లాడింది షర్మిల.


“హైదరాబాదు రాగానే మళ్ళీ ఫోను చెయ్యమ్మా, నేనే వస్తాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. భయంలేదు” అనునయంగా అన్నాడు రాజారామ్.


అలా రాజారామ్ సీతాలక్ష్మిల పెంపుడు బిడ్డై తమ బిడ్డలను కొద్దిగా మరిపించింది షర్మిల.

*****

సంక్రాంతి రోజున అందరూ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో, మా బాబయ్య, రాజా బాబయ్యలు భూషణంగారింటికి బయలుదేరారు. మైత్రి రాఘవతో మాటల్లో లీనమైపోయింది. నేను నెమ్మదిగా వారిని వెంబడించాను. కొద్ది నిముషాల్లో బాబయ్య ఒక పెద్ద బ్యాగ్ తో బయటకి వచ్చి కంగారుగా చినతాతగారి ఇంట్లో పెట్టుకున్న తమ సామాన్ల దగ్గరకు దాన్ని చేర్చాడు. వారు మాట్లాడుకుండగా అన్నీ విన్నాను. ప్రతి ఏడూ జరిగే సర్పసేవ తదితర కార్యక్రమాల అనంతరం ఖర్చులుపోగా నిధికి చేరవలసిన మొత్తం ఇది. హైదరాబాదు నుండి వచ్చిన ఆ నిధిని బెంగళూరు ఆశ్రమానికి చేర్చవలసిన బాధ్యత రాజాది.


“తాడే పామై కరుస్తుందంటే ఇదే, ఎప్పుడో చచ్చిందనుకున్న ఆ షర్మిల, ఇప్పుడు లా డిగ్రీ చదివి ఆ రాజారామ్ గాడు వెలగపెడుతున్న సంఘసేవ చేస్తోందిట. అదేదో ఉద్యమం వెలగపెడుతున్నాడుట. చింత చచ్చినా పులుపు చావలేదు వాడికి. వాడి కూతుళ్ళే ఆధ్యాత్మికత మైకంలో పడి మన చరలో ఉన్నారు. ఐనా సరే పట్టువిడువక ఈ చుట్టుపక్కల అటవీప్రాంతంలోని వారికి విద్యనందిస్తున్నాడుట. ప్రాథమిక పాఠశాల నామమాత్రానికే ఉన్న ఆ ఊళ్ళో ఇప్పుడు విద్యార్థినివిద్యార్థులతో కళకళలాడుతోంది. 


చదువుకోవడం ఎంత ముఖ్యమో వారికి చెప్పగా పిల్లలను బడికి పంపడం జరుగుతోంది. వాళ్ళకి నాగరిక ప్రపంచాన్ని చూపిస్తూ, అనేక డాక్యూమెంటరీల ద్వారా ఎన్నో విషయాలు చెపుతున్నాడుట. ఇవన్నీ నూరిపోస్తే ఇక మనకి జనాలు చిక్కేదెలా? మన చేతులకి ఇట్టేచిక్కేపిట్టలు ఇప్పుడు ఏకుమేకై కూర్చుంటున్నాయి. ఈ అడవిమనుషులకు చదువులు నేర్పుతాడుట చదువు. ఎంతకాలం ఇలా సాగిస్తాడో చూద్దాం? వాడిని ఆపకపోతే రేపు మనకి ముప్పే వస్తుంది. ఈ నెల టార్గెటు ఇంకా చేరుకోలేదు” కోపంతో రగిలిపోతూ అన్నాడు భూషణం. 


“ఇప్పుడు కనుక నేను స్వామీజీ ఉత్తర్వులలో విఫలమైతే వారికి నాపైనున్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఇప్పుడు మనపైనున్న నమ్మకానికే ముప్పొచ్చేలా ఉంది. వాళ్ళ సంగతి తేల్చాలి” వాపోయాడు రాజా.


“ఆ రాజారామ్ చాలా దూరం వెళ్ళాడు. కలెక్టరుకు లేఖరాసి తమ పిల్లలను చూపమని దరఖాస్తు పెట్టుకున్నాడుట” విషయం చెప్పాడు భూషణం.


“దీనికి నా దగ్గరి ఉపాయం ఉంది. ఈ విషయం నాకొదిలెయ్యి. మనపై ఉన్న నమ్మకం మరింతబలపడే ఉపాయం వేసాను” హామీ ఇచ్చాడు భూషణం.

*****

“ఏవిఁటే ఆ పరధ్యానం? ఈ రోజు రివిజనుకి రెడీనా?” అడిగింది సిరి.


“అబ్బా, అసలు జీవితంలో చదువు తప్ప మరేంలేదా? నాకసలు చదువుకోవాలని లేదు. ఇంట్లో అమ్మా ఇక్కడ నువ్వూ, ఇదే పని మీకు!” చిరాకుపడింది మైత్రి.


‘ఇన్నాళ్ళూ ముక్కుతూనో మూలుగుతూనో చదివేది మైత్రి. ఇప్పుడు చుట్టరికాలు తెలుసుకుని కలిసి మెలిసి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఊరు తీసుకెళ్ళారు సదుద్దేశ్యంతో పెద్దలు. 


ఎందులోనైనా మంచిని చెడుని చూడగల విచక్షణ చూసేవారిపై ఆధార పడి ఉంటుంది. రాధత్తయ్య మైత్రి విషయంలో అతి జాగ్రత్తపడే కారణమూ అదే. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని, మేనమామ రాజా జీన్, తల్లి బద్దకం ఎక్కడొస్తుందో అని జాగ్రత్తపడుతూనే పెంచింది రాధత్తయ్య. విధిని ఎవరు తప్పించగలరు. ఇప్పుడు స్నేహమో, ప్రేమో!! ఆ ఇంటి వారసుడొచ్చి దీన్ని డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వడు కాబోలు’ మనసులోనే అనుకుంటూ బాధ పడింది సిరి.

 

‘అసలు రాధత్తయ్య పెంపకంలో పెరిగిన మైత్రి ఇలా ఉండవచ్చునా? రాధత్తయ్య జీవితమే ఎంత స్ఫూర్తి దాయకం! దాన్ని చూసి కాస్తైనా మైత్రి నేర్చుకోలేదే!’ వాపోయింది.


నాకైతే రాధత్తయ్యలా ఉండాలనిపిస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం! మైత్రికైతే జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసింది కానీ, రాధత్తయ్య వాళ్ళు ఎంత కష్టపడి వృద్ధిలోకి వచ్చారు! జీవితం అడుగడుగునా సంఘర్షణలే రాధత్తయ్య జీవితం. ఆ సంఘర్షణలను మనసులోనే సందర్శించుకుంది సిరిచందన. 

********


తాతగార్లలో చివరివారైన వెంకట్రావుగారి చిన్నకూతురు రాధ. ఆయన ప్రభుత్వ కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. చిన్నతనంలోనే భార్య జబ్బు చేసి పోవడంతో కూతుళ్ళిద్దరినీ ఆయనే పెంచారు. పెద్దకూతురి బ్రతుకు చేజేతులా పాడుచేసానన్న బాధ ఆయన్ని దహించేస్తూ ఉండేది. పెళ్ళి చేసినా కాపురం సవ్యంగా లేక తిరుగు టపాలా పుట్టింటికి చేరిన ఆమెను చూసి గుండెతరుక్కుపోయేది. రెండో అమ్మాయి అలా అవ్వకూడదన్న ఆరాటంతో రాధను ధైర్యం నూరిపోసి పెంచారు వెంకట్రావు. రాటుపోట్లను ఎదుర్కునే మనోబలాన్ని ఇచ్చారు.


ఆరోజుల్లో పొరుగూర్లలో ఉద్యోగమంటే ఇప్పటికిమల్లే హాస్టళ్ళలోనో, లేకపోతే ఫ్లాట్ తీసుకుని ఉండడాలోలేవు. ఎంతటి దూరపు బంధుత్వమైనా పిల్లల్ని ఒక తెలిసినవారి ఇళ్లల్లో మాత్రమే పెట్టేవారు. రాధనీ వాళ్ళ నాన్నగారు బాబయ్య పిన్నమ్మల ఇంట్లో పెట్టారు. పంతొమ్మిదేళ్ళకు ఇల్లుదాటి చుట్టాలింట్లో ఉంటూ, సద్దుకుంటూ, చేతిలోని పనులను అందిపుచ్చుకుని చేస్తూ గడపవలసి వచ్చింది. ఎంతో నేర్చుకుంది. అతి స్వల్ప కాలంలోనే సమయస్పూర్తిగా మసలుకోవడంలో ఆరితేరింది. పొరుగింట ఎదుర్కోవలసిన ఇబ్బందుల్లన్నీ ఎదుర్కుని నెగ్గుకు రావడం నేర్చుకుంది. 


ఆ శిక్షణ వల్లనేనేమో ఆఫీసులో కూడా ఎవరితో ఎంతవరూ ఉండాలో అలా నడచుకునేది. ఎంతటి వారైనా అటుఇటుగా మాట్లాడితే ఠక్కున ఒక మాట అనేయడానికి వెనుకాడేదీ కాదు. పిన్నమ్మ ఇంట్లో చచ్చే చాకిరీ చేసి ఆఫీసుకు వెళ్ళవలసి రావడం జరుగుతున్నా ఆఫీసు పనిలో ఎలాంటి నాకా పెట్టడం అలవాటు చేసుకోలేదు. చురుకుతనం ఆమె సహజలక్షణం. మొహం చిట్లించకుండా, పెదవి విరుపులేకుండా అందరినీ మెప్పిస్తూ పని చేయడంతో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. రెండు సంవత్సరాలలోనే డిపార్టుమెంటులో అందరూ ‘మనమ్మాయి మనమ్మాయి’ అంటూ ముచ్చట పడేవారు. రాధను ముద్దుబిడ్డగా చూసుకునే రామకృష్ణగారైతే మరీను. 


అందరికీ పెద్ద తలలా వ్యవహరించే ఆఫీసరు రామకృష్ణగారు. అలాంటి రామకృష్ణగారు వారంతటివారే ఆమెకో చక్కని కుర్రాణ్ణి చూడాలి అనుకునేవారు. ఆయనతో చనువుగా కన్నకూతురిలానే మెసిలేది రాధ. ఆయనా అలానే ఉండేవారు. తన ఎరుకలో ఉన్న కుర్రాళ్ళెవరైనా రాధకు నప్పుతారా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండేవారు. అనుకున్న తణువే అన్నీ జరిగిపోవాలన్న తీరు రామకృష్ణగారిది. 


పూర్వం ప్రభుత్వ కార్యాలయాలు ఉమ్మడి కుటుంబాల్లా ఉండేవి. ఆ కుటుంబంలాంటి వాతావరణంలో మన బాబయ్యలాంటి పెద్దమనిషి, అజమాయిషీ చేస్తూ కనిపించే ఒక అత్తగారివంటి శాల్తీ, ఆప్యాయంగా పనినేర్పే తోబుట్టువు లాంటి వ్యక్తీ, ఒకడుగు ముందుకేస్తె పదడుగులు వెనక్కి లాగే దాయాదుల్లాంటి సహాకర్మచారులూ అందరూ ఉంటారు. మన పిన్ని ఇంట్లో తనతోనూ, వాళ్ళు పిల్లలతోనూ బాబయ్యతోనూ సద్దుకోవట్లేదా, అలాగే ఇక్కడాను అనుకునేది. కలివిడితనము, అందులోనే కాస్త చాకచక్యంగా నడచుకునేది. అక్కయ్య రాజీకి ఆ చలాకీతనం కానీ, కలుపుకోలుతనం కానీ అబ్బలేదు.“ఇదిగో అమ్మాయి! రెండేళ్లనుంచి నీపనితీరు చూస్తున్నాను. చురుకుతనం దానికి తగ్గ మాట ఖచ్చితం నీకున్నాయి. నీ శక్తిసామర్ధ్యాలను చూస్తే ముచ్చటేస్తుంది. నీ గుణగణాలను అభిమానిస్తూ, జీవితాంతం నిన్ను గౌరవించే భర్త రావాలని ఒక తండ్రి స్థానంలోంచి నిన్ను చూస్తూ ఆశ పడుతున్నాను. నాకు ఒక కుర్రాడు జ్జాపకం వచ్చాడు. నా ఎరుకలోని ఆ అబ్బాయి బుద్ధిమంతుడు. మీరిద్దరూ ఒకరినొకరు చూసి మాట్లాడుకునే ఏర్పాటు చేస్తాను, అన్నీ నచ్చిన పక్షాన మీ పెద్దవాళ్ళతో నేనే మాట్లాడతాను. ఏమంటావూ? సరేనా?” అడిగారు రామకృష్ణ గారు.


తండ్రి సమానులైన రామకృష్ణగారి మాటలకు రాధ కళ్ళు చెమర్చాయి. తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారే తప్ప ఎలాంటి బంధుత్వాలూ లేవు. అలాంటిది ఏ స్వార్ధమూ లేకుండా ఆయన తనపై ఇంతటి శ్రద్ధ చూపడమే ఒక గొప్ప వరమనుకుంది. మూడేళ్లుగా ఎరిగిన ఆయన, తననో ఇంటిదాన్ని చేయడానికి పడుతున్న తాపత్రయానికి మనసులోనే నమస్కరించుకుంది. ఉమ్మడికుటుంబాల్లా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకరితో ఒకరు తమ మంచిచెడులు పంచుకుంట, వీలైనంత సహాయపడుతూ, చేదోడువాదోడుగా ఉంటారని ప్రత్యక్షంగా చూసి ఎంతో ఆనందపడింది.


మూడు దశాబ్దాలకు పైబడి సర్వీసు పూర్తి చేసారు రామకృష్ణగారు. ఆ వయసులో ఊన్న ఆయనకు ఈ తరం కుర్రకారుపై కూడా మంచి అభిప్రాయాలుండడం ఆశ్చర్యకరం. ఏ విషయమైనా నాణెం రెండుపక్కలా చూసే గుణం వారిది. 


ఆఫీసులో కూడా కుర్రకారుతో ప్రోత్సాహకరంగా మాట్లాడతారు. అందరి పెద్దవాళ్ళలా, ఈ కాలం కుర్రాళ్ళు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తారు, పెద్దలను గౌరవించరు అంటూ ఈ తరంమంతా పాడైపోయిందని మాట్లాడినట్టు వారు మాట్లాడరు. యువతకున్న ముందుచూపు, జీవితంపై వారికున్న అవగాహనను, క్లారిటీని మెచ్చుకుంటారు. ఒక వ్యక్తిని పరిశీలించి విశ్లేషించడంలో నిష్ణాతులు వారు. అందువల్లనే ఒక వ్యక్తికి అనుగుణంగా ఉండే మరోవ్యక్తితో ముడిపడితే వారి భావిజీవితం బాగుంటుందని ఆలోచించి వేసే అడుగు. అలా రాధకు నప్పే మనిషి అని తోచిన మరు క్షణమే రంగంలోకి దిగి అయ్యే వరకూ అందులోనే నిమఘ్నులై ఉండడం అలవాటు. పన్లో మొగ్గు చూపడమేకాక, దాన్ని సాధించే వరకూ చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయడానికి ఎంత మాత్రమూ వెనుకాడని గుణం వారిది.


రాధకు తగిన జోడీ ప్రసాద్ అని ఆయన మనసుకు అనిపించిన మరు క్షణమే సంబంధం మాట్లాడడం కోసం ఆయన వేసిన మొదటి అడుగూ అలాంటి ప్రయత్నమే. ఒక మంచి పని చేసేముందు, మంచి రోజు మంచి ముహూర్తం, తారాబలం అన్ని చూడడం మన రామకృష్ణగారికి అలవాటు. అలాగే, ప్రసాదుని పిలవడానికి ముందు అన్ని లెక్కలూ సరిగ్గా వేసి, ఒక శుభదినాన రమ్మని కబురంపారు. 


క్రితం రోజునే రాధను పిలిచి, “ఇదిగో అమ్మాయీ, రేపు ఆ అబ్బాయిని రమ్మంటున్నాను. కాస్త చక్కని చీర కట్టుకుని, పెళ్ళి చూపులకన్నట్టు రావాలి సరేనా!” ఒక తండ్రి కన్నబిడ్డకు చెప్పినట్టు చెప్పారు. ఆఫీసులోనే ఆయన ఏర్పరిచిన ఇన్ఫార్మల్ పెళ్ళిచుపులవి. 


రాధ మనసు అనేకవిధాలుగా ఆలోచించింది. వివాహం చేసుకునే ఈడొచ్చింది. పిన్నిబారి నుంచి తప్పించుకోవడానికి ఇదో మంచి అవకాశమని ఆ క్షణానికి అనుకుని సంబరపడింది. ఐతే, వివాహ సన్నాహాలకు సరేనని తన మనసు ఒప్పుకోవడానికి మాత్రం అదొక్కటే కారణం కాదు. తండ్రిసమానులైన రామకృష్ణగారిపట్ల్ ఉన్న గౌరవం కూడా. అప్పటికి అంతవరకే ఆలోచించగలిగింది రాధ.


“నాకు మాత్రం ఎవరున్నారు సర్, నన్నిక్కడ పన్లోనైతే పెట్టించారు కానీ, పట్టుమని రెండు జీతాలు కూడా నేను అందుకోకుండానే మా నాన్నగారు పోయారు. ఇంకా నీడకోసం మా పిన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. నా మంచీచెడూ చూసేవారు కూడా నాకెవరూ లేరు సార్. పెళ్ళై తన ఉమ్మడి కాపురంలో ఉంది అక్కయ్య. మా బావ పెద్దగా కలుపుగోలు వ్యక్తికాదు. నాకు సంబంధాలు చూసి చేసేసేంతగా వారు ఉండరు కూడా. అలాంటి ఆశ నాకు లేదు కూడా. 


అందుకేనేమో దేవుడు నన్నిక్కడికి చేర్చాడు. దైవంలాంటి మీ వద్ద పనిలో చేరడంతో నాకు అమ్మా, నాన్నా, దైవము అన్నీ మీరుగానే భావిస్తున్నాను. మీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యండి సర్. మీరు చేసినది నాకు ఎన్నడూ మంచే అవుతుంది” ఆఫీసని కూడా అనుకోకుండా వారి రెండుపాదాలను తాకి నమస్కరించింది. ఎంత దాచుకుందామనుకున్నా, చెమ్మగిల్లిన ఆమెకళ్ళని రామకృష్ణ గారు పసికట్టేసారు. 


ఆమె పైనున్న వాత్సల్యాన్ని కనపడనివ్వకుండా గాంభీర్యం వెనుక దాచేస్తూ, “ఆయుష్మాన్భవ, తొందరలో జంటగా ఆశీస్సులందుకోవాలి” అంటూ చిరునవ్వుతో దీవించారు. 


ఆమె ఆత్మ సౌందర్యాన్ని మరొకసారి చూసిన రామకృష్ణకి, ఆమెనొక ఇంటిదాన్ని చెయ్యాలని తనకు వచ్చిన ఆలోచనకు మరింత సంతోషం కలిగింది. 


తన చుట్టుపక్కల పెళ్ళికావలసిన అర్హులైన యువతీ యువకులుంటే వాళ్ళకి అనుకూలమైన సంబంధం గురించి అలోచించి, తన ఎరుకలో వున్న వారిలో గాలించి వెతికి మరీ సంబంధం మాట్లాడి, ఇరువురికీ అనుకూలంగా ఉంటే, కట్టబెట్టడం అలవాటుగా చేసుకున్న ఆయన రమారమి ఇరవై పెళ్ళిళ్ళు చేసారు. మరీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్నవాళ్ళైతే, తాను కొంత వేసి, నలుగురి వద్ద నుంచీ తలాకొంతా సేకరించి పెళ్లి బాధ్యత మొత్తమూ తన నెత్తిన వేసుకునేవారు. ఆ విషయం కొంత వరకూ తెలిసినా, తన పట్ల వారు తీసుకుంటున్న శ్రద్ధకు సంబరపడి పోయింది రాధ. తనకంటూ ఒక తోడు, ఇల్లు, వాకిలి కావాలని మనసులో ఉన్నా దాన్ని సంకల్పించి నడుంకట్టిన ఒక ఆపద్బాంధవుడి వద్దకు తనను చేర్చిన ఆ పరమేశ్వరునికి మనసారా నమస్కరించుకుని కృతఙ్ఞతలు చెప్పుకుంది.


ఆవేళ శుక్రవారం అవ్వడంతో వేకువ ఝామునే లేచి, చక్కగా తలంటి పోసుకుని, తాను నిత్యమూ చేసుకునే పూజ చేసుకుని, “నా జీవితానికి ఒక మలుపు రాబోతున్న రోజు ఇది. నాకు ఏది మంచిదైతే అదే చెయ్యి భగవంతుడా! నువ్వు ఏది నిశ్చయించినా అది నీ ఆశీర్వాదంగానే భావిస్తాను” మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది రాధ. 


రాధ అల్ప సంతోషి. ఆ వయసులో అంతటి పరిపక్వత ఉండడం చాలా అరుదు. తన తోటి వాళ్ళందరూ చదువుకుంటున్నప్పుడు తనకి పెద్దగా చదువు అబ్బలేదని బాధ పడడమో లేక వాళ్ళ మీద అసుయపడడమో లాంటివి అసలు తెలియదు. నాన్నతో పొలానికెళుతూ వేరుశెనక్కాయలూ, చేరుకులూ తింటూ కాలక్షేపం చేసుకునేది. అతి పిన్న వయసునుంచే నాన్నకి ఒండి పెడుతూ పెరిగిన పిల్ల రాధ. నువ్వు నాకు కూతురుకాదు కొడుకు అని మురిసిపోయేవారుట వాళ్ళ నాన్నగారు. 


ఆ అదృష్టము ఏంతోకాలం మిగలలేదు. ఆ బిడ్డను పట్టణానికి పంపడం వల్లనో, ఒంటరివాడినని లోలోపల వ్యాకులపడడం వల్లనో రాధ వెళ్ళిన కొన్నాళ్ళకే కన్నుమూసారు. ఆయన చేతుల మీద జరగాల్సిన పెళ్ళి. బతికుంటే ఉన్నదాంట్లో ముచ్చటగానే చేసేవారు. భగవంతుడు తానే రాలేక ఎవరినో పంపినట్టు రామకృష్ణగారిని ఆ పనికి తలపెట్టే తలంపు ఇచ్చాడు. భగవంతుడే చేయిస్తున్నాడని నమ్మింది. ఆయన చూపించే తోడు తనకు సరియైనదే అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మింది.


“అమ్మా, మిమ్మల్ని పెద్దయ్యగారు పిలుస్తున్నారు” అన్నాడు గుర్నాధం.


“సార్” మొహమాటంగా నిలబడింది రాధ.


“చూడమ్మా ఈ అబ్బాయి పేరు ప్రసాదు. నేను దాదాపు ఐదేళ్ళనుండి ఎరుగుదును. మన డిపార్టుమెంటే. రామనగర్ బ్రాంచి ఆఫీసులో సూపరింటెండెంటుగా చేస్తున్నాడు. ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. నేను రమ్మనగానే, ఎందుకు, ఏవిటి అని అడక్కుండా ఆఫీసులో పర్మిషను తీసుకుని వచ్చాడంటే, అతడికి నామీదున్న గౌరవం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఇప్పుడు అతను వచ్చాకే నేను ఈ ప్రస్తావన గురించి చెప్పాను. ఏవోఁయ్ అన్నీ సరిగ్గా చెపుతున్నానా?!” నవ్వుతూ అన్నారు రామకృష్ణగారు.


చిరునవ్వే ప్రసాదు బదులైయ్యింది. 


“మీ ఇరువురకీ పరిచయమై సుముఖత చూపితే అప్పుడు నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. అవి నాకు వదిలెయ్యండి!” అన్నారు. ఇక రాధకు చెప్పడం అయ్యందన్నట్టుగా ప్రసాదునే చూస్తూ.


“చూడు బాబు ఈ అమ్మాయి నాకు కూతురు లాంటిది. 


“పద్దెనిమిదేళ్ళు నిండగానే మన ఆఫీసులో చేరింది. తను చేరిన కొద్దిమాసాలకే ఆయన కాలంచేసారు. నాకూతురు అని నేను స్వీకిరించి చెప్పాక, అమ్మాయి బుద్ధిమంతురాలని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తన కష్టార్జితం మీదే ఆధారపడి చుట్టాలింట్లో ఒబ్బిడిగా ఉంటూ బ్రతుకుతోంది. ముందు మీరిద్దరూ మాట్లాడుకుని ఎలాంటి అభ్యంతరమూ లేని పక్షంలో మీ ఇరువురి తరపున పెద్దలతోనూ నేను మాట్లాడతాను. నేనలా సెక్షన్లోకి వెళ్ళొస్తాను. మీరిక్కడే మనసువిప్పి మాట్లాడుకోవచ్చు. నేనో అరగంట తరువాత వస్తాను” అంటూనే గదిలోంచి వెళ్ళారు. 


అరగంటలో తిరిగొస్తూ “ప్రసాదూ, నువ్వు బాగా ఆలోచించి చెప్పు. అమ్మాయిని కనుక్కుని నేను నీకు చెపుతాను” అని ఆయన అనడం ముగియకుండానే ఏక స్వరంతో ఇద్దరూ, ”మాకు సుముఖమే సార్” అన్నారు. ఇద్దరి ముఖాలూ ఆనందంతో మెరవడం రామకృష్ణగారి దృష్టిని తప్పిచుకుపోలేదు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.


44 views1 comment

1 Komentar@user-mo4ye7vd9z

• 12 hours ago

Chala saamajika spruhato raastunnavu kameswari. Interesting ga undi. Ne boss garu gurtukuvacheru. Good going

Suka
bottom of page