top of page

చదువు దాహం

'Chaduvu Daham' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 04/02/2024

'చదువు దాహం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

దుర్గ  అందాల బొమ్మే.  బాపూ బొమ్మలా సన్నగా పొడుగ్గా తీర్చిదిద్దిన కళ్లు, ముక్కు పెదవులతో ఆకర్షణీయంగా ఉంటుంది.  దుర్గ తల్లి రాధాదేవి, తండ్రి వేణుగోపాల్ ఇద్దరూ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్లే.  దుర్గ తల్లి వైపు, తండ్రి వైపు అందరూ బాగా చదువుకున్న వాళ్లే.   దుర్గ కు వాళ్ల బామ్మ గారి పేరు పెట్టారు.  దుర్గ పేరు మోటు గా ఉందని నేటి తరానికి తగ్గ పేరుకాదని రాధాదేవి వ్యతిరేకించినా తల్లి మీద ఉన్న అమితమైన ప్రేమతో  కూతురికి తన తల్లి పేరు పెట్టుకున్నాడు వేణుగోపాల్.   దుర్గ అంటే అమ్మవారే కదా, ఆవిడకు చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒక అందమైన నాజూకు పేరు పెడదామంటే వేణుగోపాల్ ససేమిరా కాదన్నాడు.   దుర్గ బామ్మగారు గొప్ప సౌందర్య రాశి.  ఆవిడకు తొంభై సంవత్సరాలు వచ్చినా ఆవిడ అందం చెక్కు చెదరలేదు.  దబ్బ పండులా పచ్చగా నిగ నిగ లాడుతూ ఉండేది.  ఏ అనారోగ్యం లేకుండా ఆవిడ తొంభైయవ ఏట నిద్రలోనే ప్రాణాలు వదిలిన ఆవిడ అంటే వేణుగోపాల్ కు పంచ ప్రాణాలు.

దుర్గ కు తండ్రి దగ్గర చనువు ఎక్కువ.  కూతురంటే విపరీతమైన ముద్దు.  ఆడుతూ పాడుతూ చలాకీగా గంతులేస్తున్న దుర్గను చూసుకుంటూ మురిసిపోయేవాడు.

దుర్గను డాక్టర్ చదివించాలని రాధాదేవి అనుకునేది.  కాని వేణుగోపాల్ కూతురి తెలివి తేటలు గురించి  ఆమెకు చదువుపట్ల  ఏ మాత్రం అభిలాష లేదని ముందునుండే తెలుసున్నవాడు కాబట్టి భార్యతో అనేవాడు "దుర్గను అంతగా చదవమని  ఫోర్స్ చేయద్దని, ఆర్ట్స్ గ్రూప్ తో గ్రాడ్యుయేషన్ చేయిద్దామని".  

దుర్గకి చదువు తప్పించి మిగతా ఏ పనులపట్లైనా మహా ఆసక్తి.  వంటలు బాగా చేస్తుంది, ఇల్లు చక్కగా సర్దుతుంది.  ఇంట్లో అందమైన గార్డన్ ని పెంచుతూ చాలా చలాకీగా ఉంటుంది.  రాధాదేవికి  కూతురు బాగా చదువుకోవాలని కనీసం పోస్టుగ్రాడ్యుయేషన్ అయినా చదవాలని అనుకునేది.   దుర్గను బాగా గారం చేస్తున్నారు కాబట్టే దానికి చదువు పట్ల శ్రధ్ద లేదని భర్తను కోప్పడుతూ ఉండేది.

టెన్త్ క్లాస్ కంపార్ట్ మెంటల్ లో పాస్ అయింది.  పలుకుబడి  ఉపయోగించి  ఇంటర్ మీడియట్  లో చేర్చింది రాధాదేవి.  ఇంటర్ తప్పింది.  మరోసారి ప్రయత్నించినా రెండు సబ్జక్ట్స్ పూర్తి చేయలేక నేను చదవలేను బాబోయ్ అంటూ చేతులెత్తేసింది.

రాధాదేవికి అదే కాలేజ్ లో కెమిస్ట్రీ టీచ్ చేస్తున్న సునంద ప్రాణస్నేహితురాలు.  సునంద కొడుకు కిరణ్  ఐఐటి బాంబే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.  స్నేహితురాళ్లిద్దరూ వియ్యమందుకోవాలని అనుకునేవారు.  దుర్గ అందం, చలాకీతనం సునందని ఆకర్షిస్తూ వస్తోంది.  ఐతే సునంద భర్త డాక్టర్.  అతని చెల్లెళ్లూ, తమ్ముళ్లూ అందరూ బాగా చదువుకుని  పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.

సునంద ఒక రోజు మాటల సంధర్భంలో భర్తతో అంది.  "మన కిరణ్ కి నా స్నేహితురాలు రాధ కూతురు బాగా సూట్ అవుతుంది.   వాడు బాగా స్తిరపడ్డాక దుర్గతో వివాహం చేస్తే ఎలా ఉంటుందని అతని అభిప్రాయాన్ని అడిగింది".  

" చెత్తలా ఉంటుంది సునందా.   కిరణ్ కి చదువయ్యాకా అమెరికా వెడతాడు, అక్కడ  ఎమ్.ఎస్  చేస్తాడు.  వాడి చదువుకి తగ్గ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కానీ, ఇంటర్ తప్పిన మీ స్నేహితురాలు రాధ కూతురు తో పెళ్లేమిటని కాస్త ఘాటుగా  సమాధానమిచ్చాడు".  

సునంద కి  కూడా భర్త మాటలు సబబుగా తోచాయి.  రాధ తన కూతురిని  కిరణ్ కు చేసుకోవాలని ఆశపడ్తోందేమో, ఇప్పుడే చెప్పేస్తే మంచిదని భావించింది.   ఒక రోజు ఇద్దరికీ క్లాస్ లు లేనపుడు ఫ్రీగా ఉన్నప్పుడు సునంద రాధ తో మాటలు కలిపింది.

"చూడు రాధా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.  కిరణ్  ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే యు.ఎస్ వెడతాడు.  వాడికి చదువంటే ప్రాణం.  వాళ్ల నాన్న కూడా కిరణ్ ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివిద్దాం.  మధ్యలో పెళ్లి అంటూ వాడిని డైవర్ట్  చేయకంటూ నన్ను హెచ్చరించారు.  వాడి చదువు పూర్తయ్యేసరికి ఎంత కాలం పడుతుందో ఏమో.  మీ దుర్గ  ను అంతకాలం అట్టిపెట్టడం ఎందుకు.   పాపం  దుర్గ  ఖాళీగా ఎన్ని రోజులు అలా ఉంటుంది చెప్పు.   ఈలోగా మంచి సంబంధం వస్తే చేసేయ్ రాధా అంటూ   మనస్సులోని మాటను చెప్పేసి, 'సారీ  అంటూ అపాలజీ కోరింది'.

మనస్సు చివుక్కుమనిపించినా పైకి నవ్వుతూ "ఫరవాలేదులే సునూ, అయినా కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చదవని దుర్గను మీ ఇంటి కోడలుగా చేసుకొనమని అడగడం అత్యాశే.  నేనేమీ అనుకోనులే అంటూ తేలిగ్గా నవ్వేసింది".  

ఆ రోజు రాత్రి  రాధ భర్తతో ఈ విషయం చెపుతూ బాధ పడింది.  చదువులేని మన దుర్గను ఎవరు చేసుకుంటారు?  కనీసం డిగ్రీ కూడా చదవలేకపోయింది దుర్గ అని.  

దానికి భర్త సమాధానమిస్తూ   "పోనీలే రాధా, దుర్గ దగ్గర ఈ విషయాన్ని చెప్పకు, బాధ పడ్తుంది".  కిరణ్ కాకపోతే మరొకరు, చదువులేనంత మాత్రాన పెళ్లే అవదా మన చిట్టి తల్లికి అంటూ భార్యను ఓదార్చాడు.  

పక్క గదిలో  కూర్చుని  తన డ్రస్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటున్న దుర్గ చెవిని పడ్డాయి ఈ మాటలు.  తల్లీ తండ్రీ తన చదువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుసు, కానీ తనకు చదవుపట్ల శ్రధ్దలేదు.  తన క్లాస్ మేట్స్ అందరూ ఇంజనీరింగ్ లో చేరారు.  తను ఏ పనీ పాటా లేకుండా ఏదో కాలక్షేపం చేసేస్తోంది.  అందరూ తన తల్లినీ తండ్రినీ "మీ అమ్మాయి ఏమి చదువుతోందని"  అడిగితే అమ్మా నాన్న ముఖం సిగ్గుతో   వివర్ణమవడం  తను ఎన్నో సార్లు గమనించింది.  

ఏదో నిశ్చయానికి వచ్చేసింది.  ఇంటర్ లో మిగిలిపోయిన రెండు సబ్జక్టులూ  పట్టుదలతో రాత్రీ పగలూ కూర్చుని చదివింది.  పాస్ అయింది.  కూతురిలో హాఠాత్తుగా వచ్చిన మార్పుకి రాధాదేవి ఆనందపడింది.  రెండు సంవత్సరాలు ఆలస్యమైనా బి.ఏ  ఎకనమిక్స్ మెయిన్ సబ్దక్ట్ గా తీసుకుని కాలేజ్ లో చేరింది.  పట్టుదలతో ఇంటర్ పూర్తిచేసిన దుర్గలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది.  బి.ఏ లో క్లాస్ తెచ్చుకుని ఎమ్.ఏ ఎకనమిక్స్ తీసుకుని చదవాలని.  రాత్రీ పగలూ అదే ధ్యాస.  లైబ్రరరీ నుండి బుక్స్ తెచ్చుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది.  కాలేజ్ లో చెప్పేదే కాకుండా అదనంగా ఎన్నో విషయాలను సేకరిస్తూ రాత్రీ పగలూ పుస్తకాల మధ్యే గడిపేది. పుస్తకాలే లోకంలా వాటి మధ్యే పడుకునేది.    తల్లీ తండ్రీ కూతురు అలా కష్టపడి చదువుతుంటుంటే ఒక వైపు జాలిపడుతూనే మరోవైపు కూతురు బాగా చదువుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని ఆరాటపడేవారు.

అనుకున్నట్లుగా బి.ఏ కాలేజ్ ఫస్ట్ లో పాస్ అయింది.

అందరూ సంతోషంతో పండుగ చేసుకున్నారు.

ఆ రోజు ఆంధ్రాయూనివర్సిటీ లో ఎమ్.ఏ  ఎకనమిక్స్ లో సీట్ వచ్చిందని సమాచారం అందుకున్న దుర్గ మనస్సు లో ఏ భావావేశం లేకుండా పడుకుని ఆలోచిస్తుంటే గడచిన కాలం తన మనోనేత్రం ముందు కదలాడుతుంటే మనస్సులో అనుకోసాగింది.  "ఇంటర్ తప్పిపోయినప్పుడు ఇంక తను చదవలేననుకుంది.  చదువుకూ తనకూ పడదని భావించింది.  ఒక చిన్న సంఘటన తన మనసుమీద తీవ్ర ప్రభావాన్ని చూపింది.  ఆరోజు తల్లీ తండ్రీ  తన పెళ్లి విషయంలో బాధపడడం వింది.  ఏదో తెలియని కసి, పట్టుదల తనను ఇలా ముందుకు నడిపించింది".

పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని అనుకోసాగింది.

అసలే దుర్గ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న రాధ స్నేహితురాలు సునంద  దుర్గ అందాలరాశే కాకుండా అపర సరస్వతీ దేవిలా అవతారమెత్తి బాగా చదువుకుంటోందని తెలుసుకుని రాధను ఆమె భర్తనూ  తిరిగి ఎలాగైనా ఒప్పించి దుర్గను తన కోడలిగా చేసుకోవాలని ఆరాటపడుతోంది.

కాలం ఏమి నిర్ణయిస్తుందో ఎవరికి తెలుసు?    దుర్గ కి  చదువు రుచి తెలిసింది.  ఆ రుచిని  ఇంకా ఇంకా ఆస్వాదించాలని ఆరాటపడుతోంది.  పి.జి లో రేంక్ సంపాదించి పి.హెచ్.డి ప్రోగ్రామ్ కోసం ఎమ్.ఐ.టి   అమెరికాకు పరుగెత్తాలని ఆమె మనసులో  ఆలోచనలు రూపు దిద్దుకోవడం  ప్రారంభించాయి.  ఈ విషయాన్ని దుర్గ ఇంకా ఎవరికీ చెప్పలేదు.  అలా ముందరే గొప్పగా చాటుకునే స్వభావం కాదు ఆ అమ్మాయిది.  చేసి నిరూపిస్తుంది.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

43 views0 comments
bottom of page