'Kantharaoki Award Vachhindandaho' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao
'కాంతారావుకి అవార్డు వచ్చిందండహో' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కాంతారావు బాగా పేరు ఉన్న రచయితల్లో ఒకడు. పైగా అతను హాస్య కథలు రాయడంలో పెట్టింది పేరు. అతను ఒక హాస్య కథ రాశాడు అంటే.. అది చదివినవాడు పడి పడి నవ్వడం కాదు.. నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటాడు అన్నమాట.
అతనికి గత 20 సంవత్సరాలలో చాలా అవార్డులు వచ్చాయి. హాస్య ఆవకాయమహారాజు.. గలగల గిలకల కాంతారావు.. పడి పడి నవ్వించే బేతాళం.. మొదలగు రెండు డజన్లకు పైగా బిరుదులు కూడా అతని కైవసం అయిపోయాయి.
ఒకలా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని తరిగిపోని హాస్య రచయిత అన్నమాట. ఇంతలా అతని గురించి చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే అతని గురించి ఎవరైనా మాట్లాడు కున్నా వాళ్ళు కూడా హాస్యనట చక్రవర్తులు అయిపోతారు.
సరే మనం మాత్రం.. అతని హాస్య ఊబిలో చిక్కడిపోకుండా బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం.
ఏతావాత విషయం ఏమిటి అంటే ఆవకాయ పచ్చడి లో కాయేలేదు.. అన్నీ ముక్కలే అన్నట్లు, మైసూరు బజ్జీలో మైసూరు లేదు అన్నట్లు, సీతాకోకచిలుకలో సీత లేదు కోకా లేదు అన్నట్లు, ..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నట్టు అతనికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.
అదేమిటి అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన.. విజయవిహారం అనే వెబ్ పత్రిక వారు హాస్య కథల పోటీ ప్రకటించారు సంక్రాంతి పండుగ సందర్భంగా. ఆనందంతో పోటీకి సంబంధించిన నియమ నిబంధనలు చదవడం మొదలు పెట్టాడు కాంతారావు.
హాస్య కథ అంటే హాస్య కథలా ఉండకూడదు. కథ చదివిన వాళ్లు నేల మీద పడి గిలగిలా ఫిట్స్ వచ్చిన వాడిలా కొట్టుకోవాల. అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తే మేమే వచ్చి దానికి తగిన వైద్యం చేయిస్తాం ఫ్రీగా.. అదిగది ఆదన్నమాట అట్లా ఉండాలి.. స్టోరీ. ఇక ముగింపు విషయానికి వస్తే మంచి కొసమెరుపుతో ఉండాలి. అంటే ముగింపు చదివేసరికి తల 14 మొక్కలైపోయే అంత బ్రహ్మాండంగా ఉండాలి అన్నమాట. అలా ముక్కలైపోయిన 14 ముక్కలు ఎవరికి వారే ఏరుకొని అరాల్ డైట్ తో అంటించుకునే ప్రయత్నం చేసుకోవాలన్న మాట. అంత గొప్పగా ఉండాలి.
మొదటి బహుమతి 5000. మాకు నచ్చిన కథ రాకపోతే మొదటి బహుమతి క్యాన్సిల్ చేసి పడేస్తాం.
మాకు బాగా కోపం కనక వస్తే దారిని పోయే వాడికి పిలిచి 5000 వాడికి ఇచ్చేస్తాం. లేదా 50 మందికి సమానంగా మనిషికి 100 రూపాయలు పంచి పడేస్తాం. అది మా ఇష్టం సర్వహక్కులు మావే. మీరు మమ్మల్ని పల్లెత్తు మాట అనడానికి వీలు లేదు. ఒకవేళ అడగదలుచుకుంటే మీరు మా ఊరు వచ్చి మా వీధిికి వచ్చి మా ఇంటికి వచ్చి అప్పుడు మాత్రమే అడగాలి.
అర్థమైంది కదా వెంటనే మీ బంగారు కలల్ని నిజం చేసుకోవడం కోసం మీ బంగారు కలాల్ని పట్టుకుని కదలండి.. కాలంతో పోటీపడి వీర విహారం చేయండి, విజృంభించండి.. విజయం మీ సొంతం చేసు కోండి.
అది ప్రకటన.
ఒకటికి వందసార్లు చదివాడు కాంతారావు ఏకాగ్రతతో. సరే ఈ నియమ నిబంధనలు అన్ని మామూలే కానీ ఈసారి ఎలాగైనా అవార్డు పట్టేయాలి.. మొదటి బహుమతి 5000 కొట్టేయాలి అనుకున్నాడు మనసులో.
మరి మంచి హాస్య కథ ఎలా వస్తుంది.. ఎలా పుడుతుంది దానిని వండడం ఎలా.. ? ఇది అన్నమాట అతనికి వచ్చిన సమస్య.
మొట్టమొదటి ప్రయత్నంగా అతనికి అతని భార్య జ్ఞాపకం వచ్చింది. ఆమె పేరు ఐడియాల రాణి.
అసలు పేరు అయినంపూడి దుర్గ లక్ష్మి రాణి.. వెరసి ఐడిఎల్ రాణి.. అది కాస్త నోరు తిరగని వాళ్ళు వల్ల ఐడియాలరాణిగా ఆమె చదువుకునే రోజులలోనే రూపాంతరం చెందింది. ఇదేదో బాగుంది అను కుని వాళ్ళ నాన్న కూడా ఆ పేరును అట్లాగే ఉంచేసి పెళ్లి చేశాడు.. సరే సరే ఇదేదో బహు బేషుగ్గా ఉంది అనుకుంటూ.. ఐడియాలరాణిని పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన మన హీరో రచయిత కాంతారావు గారు కూడా ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. ఇదేదో గమ్మత్తుగా అదేదో లాగే ఉంది అనుకుంటూ.. ఒక గొప్ప రచయిత తనకు భర్త కాబోతున్నందుకు, బోల్డన్ని కథలు ఆయన చెబు తుంటే మంచం మీద వింటూ హాయిగా పడుకుంటాను కదా.. అనే ఆనందంతో సంతోషిస్తూ ఎగిరి గంతు వెయ్య లేదు కానీ గుండ్రంగా గిరగిరా తిరిగి తిరిగి తను ఒప్పేసుకుని పెళ్లాడేసింది ఐడియాల రాణి.
అయితే ఫస్ట్ నైట్ లోనే ఆమె తన కథలకు ఐడియాలు ఇవ్వడంలో అర్ధనా కాసంత కూడా ఉపయోగ పడదని తెలిసేసుకున్నాడు రచయిత కాంతారావు. పేజీల మీద కథలు రాసినంత ఈజీ కాదు పెళ్లి, పెళ్ళాం కలసి రావడం అంటే అన్నది అర్థమయిపోయింది. అప్పటినుండి సమర్ధించుకుని సర్దుకు పోతున్నాడు పుష్కరకాలం నుండి.
ఆ పాత జ్ఞాపకం అంతా బుర్ర విదిలించేసి తుడిచేసుకుని భార్య దగ్గరికి వచ్చి కూర్చుని.. తన కష్టం గురించి విపులంగా యాకరువు పెట్టి ఏదైనా సలహా ఇవ్వమన్నాడు మంచి కామెడీ స్టోరీ పాయింట్ చెప్పమన్నాడు సదరు భార్యమణిని.
ఆమె గారు మూకుడులో అప్పుడే వేయిస్తున్న నాలుగు గుమ్మడి వడియాలు స్టీలు పళ్లెంతో పట్టు కొచ్చి.. ఇవి తినండి.. ఐడియా వస్తుంది.. అంటూ గట్టిగా పళ్ళాన్ని నేల మీద కొట్టినట్టుగ పెట్టి.. చక్క మళ్లీ తన పనిలో నిమగ్నం అయిపోయింది. కాంతారావు స్టీలుపళ్లెంలో చూసుకునేసరికి అందులో ఒక గుమ్మడి వడియం కూడా లేదు. అవి పళ్ళెం చుట్టూ నేల మీద డాన్స్ కడుతున్నాయి.. కెలకలా కలకలా నవ్వేసుకున్న కాంతారావు మంచి ఆకలి మీద ఉండడంతో మాట్లాడకుండా ఏరుకొని తినేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేసాడు.
కాంతారావుకు అర్థం అయిపోయింది తన ఇంట్లో తన సమస్యకు పరిష్కారం దొరకదు అని. అయినా తన పిచ్చి గాని ఈ పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు, 144 నెలలు, 576 వారాలు.. ఆ తర్వాత గంటలు నిమిషాలు సెకండ్లు లెక్కపెట్టడం చాలా కష్టం కానీ అంత సుదీర్ఘకాలం ఉపయోగించని భార్యామణి ఇప్పుడు ఉపయోగిస్తుందని అనుకోవడం తన బుద్ధి తక్కువ.. అంటూ తన కుడి వేలుతో తన డిప్పకాయ మీద తుప్పుకున్న కొట్టుకొని తూ తూ అంటూ దగ్గు రాకపోయినా దగ్గుకుంటూ బయ టపడ్డాడు తన భార్యామణి వంట గదిలో నుండి ద గ్రేట్ రైటర్ కాంతారావు.
చేసేదిలేక బయటకు వచ్చి తన పాత మోపెడ్ ఎక్కి తన స్నేహితుడు జంబుకేశ్వరరావు ఇంటికి వెళ్లి
తన అష్ట కష్టపు బాధ గురించి ప్రస్తుతం తన కామెడీ కథ సమస్య గురించి వివరంగా చెప్పి మంచి కామెడీ కథ రాయడానికి తగిన లైను చెప్పమని కాళ్ళు వేళ్ళు కాదు మిగిలిన ఇతర భాగాలు పట్టు కొని బ్రతిమలాడాడు. జంబుకేశ్వరరావు తల గోక్కుంటూ గ్లాసుడు మంచినీళ్లు తాగి తన చెల్లెలు కాపురంలో వచ్చిన కష్టాలు.. ఇంటి ఓనరుతో తను రోజు తగులాడుతున్న కథలు.. మొత్తం ఏకరవు పెట్టేసాడు. 'ఇందులో నీకు ఏదైనా కామెడీ పాయింట్ దొరికితే తీసుకో. ' అంటూ.. అక్కడున్న కాటన్ జేబుమారుతో కళ్ళు రెండు తుడుచుకుని సదరు జేబురుమాలు బాగా మెలిక పెట్టి చిరిగిపోయేంత గట్టిగా పిండాడు కాసిన్ని నీళ్లు కారాయి.
''కామెడీ అన్న పదం ట్రాజెడీ అన్న పదంగా వినబడినట్టుంది ఈ మునక్కాడగాడికి.. ఈ మాత్రం ఏడుపు కథలు రాయడం మాకు వచ్చులేవో. '' అనుకుంటూ.. ఒక్కసారిగా పైకి లేచాడు కుర్చీలోంచి రచయిత కాంతారావు. అంతే తలపైన అడ్డంగా ఉన్న పుస్తకాల బీరువా నెత్తికి తగిలి బొప్పి కట్టింది.
'అయ్యో పాపం అయ్యో బాబోయ్ దెబ్బ ఏమైనా తగిలిందా?' అన్నాడు జంబుకేశ్వరరావు.. పళ్ళు ఇకిలించి నవ్వుతూ.
గట్టిగా నెత్తి బొప్పి కట్టే అంత దెబ్బ తగిలినప్పటికి.. తగిలింది.. అని అంటే బాగుండదని.. అబ్బే ఏం తగలలేదులే.. అనుకుంటూ బయటపడ్డాడు రచయిత కాంతారావు. అదిగో అప్పుడే అతనికి తన మిత్రుడు చర్యల వల్ల ఒక కామెడీ లైను దొరికింది. దాన్ని ఆధారం చేసుకుని బలమైన కథ రావటం లేదని ఆలోచించి ఆలోచించి.. పక్క ఊరిలోనే ఉన్న తన తమ్ముడు హాస్య ప్రియుడు హాస్యనటుడు
సరిగమపదనిసరావు ఇంటికి వెళ్ళాడు.
కాంతారావు ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి సరిగమపదనిసరావు అనే శాల్తీ కనిపించలేదు.
అదే గదిలో ఈశాన్యం మూలన శీర్షాసనం వేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి.. మా ఓడు ఏడి? అంటూ అడిగాడు అతను సమాధానం చెప్పాడు కానీ వినబడలేదు. ఇది కాదు పని అని అతని పక్కనే కాంతారావు కూడా శీర్షాసనం వేసి అతని ముఖం దగ్గరగా తన ముఖం పెట్టి ఈసారి అడిగాడు.
. ''మా సరిగమపదనిసరావు ఎక్కడకు వెళ్లాడు. '' అని.
'' ఒరేయ్ అన్నయ్య నేనేరా సరిగమపదనిసరావుని శీర్షాసనం వేసేసాను కానీ మళ్లీ కాళ్లు కిందకు దించలేకపోతున్నాను.. కొంచెం నువ్వు హెల్ప్ చేయరా.. కిందకు దించరా '' అన్నాడు శీర్షాసనంలో ఉన్న సరిగమపదనిసరావు.
''తర్వాత మన ఇద్దరం కలిసి దిగుదాము కానీ ముందు నాకు ఒక సమస్య వచ్చిందిరా''. అంటూ తన విషయం అంతా యాకరువు పెట్టాడు కాంతారావు.. తను కూడా అదే శీర్షాసనంలో ఉంటూ.
''అంతే కదా నీ సమస్య.. ఏం భయపడకు మనిద్దరం కలిసి కొన్ని చోట్లకు తిరుగుదాం నేను చెప్తాగా అప్పుడు నీకు బ్రహ్మాండమైన కామెడీ స్క్రూలు దొరుకుతాయి. మంచి కామెడీ స్టోరీ రాసి అవార్డు కొట్టొచ్చు. '' అంటూ సరిగమపదనిసరావు చెప్పడంతో కాంతారావు కొంచెం ధైర్యం పడి తాను ముందు మామూలు పొజిషన్లోకి వచ్చి అతని తమ్ముడిని కూడా మామూలుగా దింపాడు.. శీర్షాసనం స్థితి నుండి.
అంతే ఇద్దరూ కలిసి ముందుగా రద్దీగా ఉన్న బస్టాండ్ కి వెళ్లారు. అక్కడ నవ్వు వచ్చే చాలా సన్ని వేశాలు చూశారు. కానీ అవి కామెడీ కథ అవార్డుకు సరిపోయేంత పవర్ ఫుల్ పాయింట్లుగా అని పించలేదు కాంతారావుకి. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న పెద్ద సర్కస్ కి వెళ్లారు. భయంకర విన్యాసాలే కాదు బోల్డంత హాస్యము కూడా దొరికింది. అయినప్పటికీ.. అబ్బే.. అంటూ కాంతారావు బుర్ర విది లించాడు.
''ఒరేయ్ ఇది కాదు పని.. రా. '' అంటూ సరిగమపదనిసరావు తన అన్నగారిని.. పార్కుకి తీసుకు వెళ్లాడు. అక్కడ పెద్దవాళ్లతో పిల్లలు సరదాగా ఆడడo చూసి కావలసినంత కామెడీ దొరికింది.. అనుకున్నాడు కానీ అది కూడా బలమైన హాస్య కథకు సరిపడినంత హాస్యం లేదు అనుకున్నాడు.
''లాభం లేదురా తమ్ముడు.. నేను వెళ్ళిపోతాను ఇంకో మార్గం చూసుకుంటాను''.. అంటూ కాంతారావు తన ఇంటికి బయలుదేరాడు.
చివరగా తన అన్నగారును ఒప్పించి సరిగమపదనిసరావు.. అతడిని హాస్య నాటకాలు వేసే రిహార్సిల్స్ దగ్గర తీసుకువెళ్లాడు. అవి చూస్తూ కడుపు ఉబ్బిపోయి బానలా తయారయ్యే అంత పరిస్థితికి వచ్చాడు కాంతారావు.
''అబ్బే ఈ కామెడీ అంతా చూడ్డానికి బాగుంటుంది కానీ రాయడానికి ఏమాత్రం బాగుండదురా తమ్ముడు.. ''.. అంటూ స్పీడ్ గా తన మోపెడ్ ఎక్కి.. దారిలో తమ్ముడు సరిగమపదనిసరావుని మార్కెట్లో వదిలేసి.. తన ఇంటికి ఆలోచిస్తూ బయలుదేరాడు.. కాంతారావు.
''చాలామంది రచయితలు చాలా హాస్య కథలు రాశారు. ఒకాయన తన కథ లో గోడను ఆవు తినే సిందని, ఇంకొక ఆయన తన హాస్య కథ లో హీరో గారు నెత్తిమీద ఆవకాయ జాడితో భరతనాట్యం చేశాడని.. మరొక ఆయన.. తన హాస్య కథ లో హీరోయిన్ వంకాయలతో బూరెలు వేసిందని
అబ్బా ఒకటా రెండా వేలాది హాస్య కథలు వచ్చాయి.. గడచిన కాలంలో.. వాటన్నిటికీ ప్రథమ బహుమతులు అవార్డులు రివార్డులు కూడా దక్కాయి.
హాస్యం అజరామరం దానికి అంతులేదు అలా పుడుతూనే ఉంటుంది. అంతేకాదు హాస్యం ఆరోగ్యా నికి చాలా మంచిది. హాస్యంతో సంతోషంగా ఉండగలిగితే ఆయుర్దాయం కూడా పెరిగిపోతుంది.
మరి అంత గొప్ప హాస్య కథలు రాసే తనకు ఇప్పుడు మాత్రం ఎందుకు ఐడియా తట్టడం లేదబ్బా.. ''
అనుకుంటూ మోపెడ్ వేగంగా తన ఇంటి వైపు పోనిస్తున్నాడు కాంతారావు.
****
సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అయింది.. ఇంటికి చేరే సరికి.
ఆయాసంతో, ఆవేశంతో వచ్చి నీరసపడి నేల మీద కూర్చున్న కాంతారావు.. నిరాశకు వచ్చేసాడు.
ఇక ఈ సంవత్సరం తను పోటీలకు హాస్య కథ పంపించలేనని తీర్మానం చేసుకున్నాడు.
కాంతారావు కి అప్పుడే తనకు తెలుసున్న ఇద్దరు ముగ్గురు తోటి రచయితలు ఫోన్ చేశారు.
వాటి సారాంశం.. ఏమిటంటే.. తమకు హాస్య కథలకు సంబంధించి మంచి స్క్రూపాయింట్లు తట్టి నట్లు దాంతో మంచి కథ రాసి పోస్ట్ చేసేసినట్టు తప్పకుండా అవార్డు తమకే వస్తుంది.. అన్నట్టు చెప్పారు.
ఈసారి కాంతారావు వలవల ఏడవడం మొదలుపెట్టాడు.
అంతే.. అప్పుడు పెద్ద విచిత్రం జరిగింది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అనవచ్చు. ఆకాశం ఆకాశం నుండి సడన్గా ఉల్కలు భూమ్మీద పడినట్టు అతని నుదురు మీద నాలుగు రాళ్లు లాంటి శాల్తీలు తపుక్కున తగిలినట్లు అనిపించింది.
''ఏంటబ్బా ఇది. '' అనుకుంటూ నుదురు వదిలిపెట్టి నేల మీద చుట్టూ చేతితో తడిమాడు. చివరికి అలా తను ఏరుకున్నవి 4గుమ్మడి వడియాలు అని గ్రహించగలిగాడు.. రోజుకన్నా కాస్తంత పెద్ద సైజు చేతికి దొరికాయి.. కచ్చితంగా చెప్పాలంటే బోదురు కప్పలు అంటారే ఆ మాత్రం సైజన్నమాట. చూస్తే స్టీల్ ప్లేటు మాత్రం ఖాళీగా ఉంది.. ఎంత గొప్ప అనుభూతి.. తన భార్యామణి అందంగా.. అతిపెద్ద సైజు గుమ్మడి వడియాలు వేసి ప్రేమతో స్టీల్ ప్లేట్ లో తెచ్చి నేల మీద పెడితే అవి ఎగిరి తన నుదురు మీద పడి మళ్లీ అదే స్పీడులో స్టీలు పళ్లెం చుట్టూరా నేల మీద పడ్డాయి అన్నమాట. అవన్న మాట తను ఏరుకున్న నాలుగు వడియాలు. ఇలాంటి గొప్ప అనుభూతి, అనుభవం, ఆనందం ప్రపంచంలో ఏ గొప్ప మనిషి కీ సిద్ధించవు''
''అబ్బో.. ఎంత ఆశ్చర్యకరమైన హాస్య సంఘటన. ఇదే గుమ్మడి వడియాలు ఎగిరి గoతులేస్తున్న గొప్ప ఐడియాతో ఒక గొప్ప కామెడీ స్టోరీ రాసి పంపించేస్తే.. దెబ్బకు అవార్డు రివార్డు నాకు కాకపోతే ఇంకెవరికి?!''. అనుకుంటూ.. భలే సరదా, ఆనందం సంతోషం పడిపోయి నేల మీద దొర్లేశాడు కాంతారావు.. కాసేపటికి తన భార్యామణి ఐడియాలరాణి పరుగున వచ్చి అయ్యో పాపం పడిపో యారా.. అని బాధపడుతూ పైకి లేవదీస్తుంది ఏమో అని చూశాడు కాంతారావు. అతని ఆశ అడి యాస అయిపోయింది.. కోరిక కొండెక్కిపోయింది.
''కాలు గాలిన పిల్లిలాగా ఆ డొక్కు మోపెడ్ వేసుకుని ఊరంతా బలాదూర్ తిరగడం దేనికి.. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని నాలుగు గుమ్మడి వడియాలు తింటూ ఉంటే ఆలోచన రాదా ఏమిటి?'' అన్న తన భార్యామణి ఐడియాలరాణి వంటింట్లో నుంచి కేకలు పెట్టినట్టు అంటున్న మాటలు కూడా అతని కర్ణభేరిని గట్టిగా తాకేశాయి.. అయితే ఆ మాటలు నిజంగా ఆవిడ అన్నదో లేకపోతే వంటిం ట్లో ఆవిడ మూకుట్లో వేస్తున్న గుమ్మడి వడియాలు చూయిచూయి మంటూ చేసిన శబ్దం బాపతు సౌండో అనవసరం.
''హాస్య కథ రాయడానికి ఏదో బ్రహ్మాండమైన పాయింట్ అవసరం లేదు. చట్టాలు, చుట్టాలు గురించి తెలుసు కోనక్కర్లేదు. చరిత్రలు, పురాణాలు పఠించనక్కరలేదు. సైన్సు, రైమ్స్ అధ్యయనం చేయనక్క రలేదు. అనవసరంగా బుర్రకాయ పాడు చేసుకోకండి. మీ ఇంట్లోనే ప్రతి మనిషిలోనూ ప్రతి వస్తువు లోనూ ప్రతి విషయంలోనూ ప్రతి పద్ధతిలోనూ బోల్డంత హాస్యం దొరుకుతుంది. దాన్ని పట్టుకొని రెండు మూడు పేజీలు రాసి పడేయండి అదే పెద్ద హాస్య కథ అయిపోతుంది.. హాస్యం రాయాలంటే ఈ ప్రపంచమే ఒక హాస్యం. ''.. అన్న భావం వచ్చేలాగా వంటింట్లోంచి తన భార్యామణి అనకపోయినా.. కచ్చితంగా ఆవిడ అదే మాదిరిగా అన్నట్టు.. ఆమె వంటింట్లోంచి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని తన వైపు చూస్తున్న చూపు భావం.. గా అర్థమైంది కాంతారావు కి.
సరే.. ఏదైతేనో పెళ్లి అయిన పుష్కరకాలం తర్వాత తన చేష్టలు ద్వారా ఒక గొప్ప కామెడీ కథ రాయడానికి ఒక గొప్ప స్క్రూ లైన్ అందించిన తన భార్యకు మనసులోనే అభినందనలు తెలియ జేసుకుంటూ.. భవిష్యత్తులో కూడా తన ఇంటిలోనే తన వంటగదిలోనే తన భార్యామణి వల్లనే బోల్డన్ని బోల్డన్ని హాస్య కథలు దొరకబోతున్నాయి అన్న కృతనిశ్చయంతో, గట్టి నమ్మకంతో, భరోసాతో కామెడీ కథ రాయడానికి విజయం సాధించిన విక్రమార్కుడిలా సిద్ధమయ్యాడు ద గ్రేట్ హాస్య రైటర్.. కాంతారావు గారు.
( ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాసిన కథ కాదని సవినయంగా విన్నవించుకుంటూ ఇది కేవలం హాస్యం పండించడానికి మాత్రమే రాసిన హాస్య కథ అని తెలియజేస్తూ మీ కథారచయిత..
నల్లబాటి రాఘవేంద్రరావు)
*****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentários