top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 4


'Kotha Keratam Episode 4' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు.


హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్.


తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్.


తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు సూరజ్.


హాస్పిటల్ కి వచ్చిన తన తలిదండ్రులకు సూరజ్ కొడుకునే తన కొడుకుగా చెబుతాడు రాజేంద్ర.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 4 చదవండి.


‘వంశాంకురం కోసం అత్తమామలు ఎంతగానో పరితపించినా, నా ప్రాణాలే ముఖ్యమనుకున్నారంటే వారెంతటి ఉత్తములో తెలుస్తోంది. నేనే వారిని సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను’ కళ్యాణి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది.


‘ఇకపై ఏ విషయంలోనూ అత్తమామలకు ఎదురాడను, నా ప్రవర్తన ద్వారా వారి మనసులని నొప్పించను. నాకు కష్టమైనా వారి ఇష్టప్రకారమే చేస్తాను’ ఆ క్షణానే ధృఢంగా నిశ్చయించుకుని అప్రయత్నంగా ఇరువురికీ చేతులెత్తి నమస్కరించింది కళ్యాణి.


వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కళ్యాణికీ బాబుకీ గుమ్మంలోనే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసింది జానకి.

మనవడి రాక రామయ్య దంపతుల జీవితంలో క్రొత్త ఉత్సాహాన్ని నింపింది.


బాబు పుట్టిన ఇరవై ఒకటో రోజున ఉయ్యాలలో వేసారు.

ఆ మర్నాడు సాయంత్రం “అబ్బాయ్ నేనూ అమ్మా కాలనీలో ఉన్న గుడికి వెళ్ళొస్తాము”


“సరే నాన్నా. జాగ్రత్త. త్వరగా వచ్చేయండి” తల్లీదండ్రీ అటు వెళ్ళగానే, పిల్లవాడికి పాలు త్రాగిస్తున్న కళ్యాణి వద్దకు వెళ్ళాడు.


భర్త ముఖం చూసి ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించి “ఏమైందండీ? ఏదైనా సమస్యా?” అంది.


“నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అది విన్నాక నేను చేసింది తప్పో ఒప్పో నువ్వే నిర్ణయించు”


‘ఏం చెప్పబోతున్నారో!’ అనుకుని విచిత్రంగా చూసింది..


భార్యని ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్ళడంనుంచి మొదలుపెట్టి ఆ తర్వాత జరిగినదంతా, సూరజ్ గురించీ అతడికి తమతో ఉన్న అనుబంధం గురించీ, ఆతడు తమకెలా సహాయం చేసాడు అన్నదాని గురించీ, తమకీ డాక్టర్ కీ మధ్య జరిగిన సంభాషణ, ఒప్పందం, కళ్యాణి ముఖంలో హావభావాలని గమనిస్తూ, పూసగ్రుచ్చినట్లు చెప్పాడు.


తనకు పుట్టిన ఆడబిడ్డ పురిట్లోనే చనిపోయిందని భర్త చెప్పగానే వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత జరిగింది వింటున్నంతసేపూ కళ్యాణి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి.


ఓదార్పుగా ఆమె వీపు నిమురుతూ దుఃఖం ఉపశమించేదాకా ఏడ్వనిచ్చాడు.


కొంతసేపటికి అతికష్టంమీద తేరుకుని “నాకు బిడ్డని ఇచ్చినట్లే ఇచ్చి తీసేసుకుని ఆ దైవం అన్యాయం చేసినా ఇదిగో ఈ బిడ్డనిచ్చి ఆశీర్వదించాడు. ఈ బిడ్డ నా బిడ్డే. నేను కనకపోతేనేం! నేను కళ్ళు తెరిచేటప్పటికి నా పొత్తిళ్ళలో ఉన్నాడు. నాకు తల్లినయ్యే భాగ్యం కలిగించాడు. నన్ను అమ్మా అని పిలిచే వీడే నా బిడ్డడు” ఒడిలోని బిడ్డని హృదయానికి హత్తుకుంటూ ఆనందబాష్పాలు రాల్చింది.


“ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏం చేయాలో తోచలేదు. నీ క్షేమం, అమ్మానాన్నల సంతోషం, మనందరి జీవితాల గురించీ ఆలోచించి, సూరజ్ చెప్పినట్లు చేయడమే మేలనిపించింది కళ్యాణీ” రాజేంద్ర స్వరంలో వణుకు.


“ఎందుకండీ అలా ఏదో తప్పుచేసినట్లు బాధపడుతున్నారు. మీరు చేసిన పనివల్ల నాలుగు ప్రాణాలు నిలబడ్డాయి. అత్తమామలకి వంశాంకురం మనకి బిడ్డ లభించాడు. సూరజ్ అన్నయ్యది మహోన్నతమైన వ్యక్తిత్వం. అన్నయ్య ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేము. ఈసారి ఫోన్ చేస్తే నా తరఫున కృతజ్ఞతలు చెప్పండి. వీలయితే ఒకసారి వెళ్ళి కలుద్దాము”


“లేడు నిన్ననే అమెరికా వెళ్ళిపోయాడు” అంటూ తను చేసిన వాగ్దానం, బాబు పేరు వగైరా సూరజ్ కోరికలు కూడా చెప్పాడు.


“తప్పకుండా అలాగే చేద్దామండీ. కానీ అత్తయ్య మామయ్య ఏమంటారో?”


“ఒకవేళ వాళ్ళేదైనా పేరు పెట్టాలని సూచిస్తే, మనం అనుకున్నదానికి ఆ పేరు కలుపుదాము”


భర్త సూచన బాగుందనిపించి సరేనంది.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.

“అమ్మా వాళ్ళూ వచ్చినట్లున్నారు. లే వెళ్ళి కళ్ళూ ముఖం కడుక్కో. నే చెప్పినదంతా గుర్తుందిగా. జాగ్రత్త”


“ఆహా మహా చక్కగా గుర్తుంది. నాతోబాటు వీడికి కూడా, కదురా బుజ్జి కన్నా” పిల్లవాడిని ముద్దుపెట్టుకుని ఉయ్యాలలో పడుకోబెట్టి బాత్రూం వైపు కదిలింది.

&&&

పిల్లవాడికి మూడో నెల రాగానే ఘనంగా నామకరణ మహోత్సవం తలపెట్టారు.


రాజేంద్ర బియ్యంలో పేరు వ్రాయబోతుంటే యాథాలాపంగా అత్తమామలను చూసిన కళ్యాణికి మామగారేదో చెప్పడానికి సందేహిస్తున్నారని తోచి, భర్తని ఒక్క నిమిషం ఆగమని “మామయ్యా, మీరిరువురూ ఏదైనా పేరు అనుకుంటే నిస్సంకోచంగా చెప్పండి. ఇది మనఃపూర్వకంగా నా అభ్యర్థన” వేడుకుంది కళ్యాణి.


కోడలి పలుకులు పన్నీరు జల్లులై కురిసాయి సంధిగ్ధ భావనతో నలుగుతున్న రామయ్య మనసుపై.


“చాలా సంతోషమమ్మా. ఇప్పటిదాకా ఎలా చెప్పలా ఈ విషయం అని మధనపడుతున్న నాకు నీ మాటలు ధైర్యాన్నిచ్చాయి. ఫలానా పేరంటూ ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు. మీ బిడ్డకి ఏ పేరు పెట్టుకోవాలన్నది మీ ఇష్టం. అయితే నీ ప్రసవం కష్టమైనప్పుడు, నువ్వూ బిడ్డా క్షేమంగా బయటపడితే బిడ్డ పేరుకి మన కులదైవం పేరు కలుపుదామని మ్రొక్కుకున్నాను. బాబు పేరుకి ముందు ఆ నాగదేవత పేరు కలపండి”


“తప్పక కలుపుతాము మామయ్యా, మీరేమంటారండీ?”


“అవును నాన్నా ఇందులో అభ్యంతరానికేముంది”


“బాబుకి ఏమని పేరు పెడదామనుకుంటున్నారు?” అడిగింది జానకి.


ఆరోజు సూరజ్.. . ‘మరొక్క విషయం రాజూ, నేనూ మైథిలీ, మగబిడ్డ పుడితే మా నాన్నగారి పేరు, భార్గవ అని పెడదామనుకున్నాము. నీకూ చెల్లెమ్మకీ అభ్యంతరం లేకపోతే ఆ పేరు పెట్టు.. . అని సూరజ్ అడగడం తప్పక మైథిలి ఆఖరి కోరిక నెరవేరుస్తానని తాను చెప్పడం జ్ఞప్తికి వచ్చి “భార్గవ” అని చెప్పాడు.


“చాలా సంతోషం నాయనా చక్కటి పేరు”


“అవును చాలా బాగుంది పేరు గంభీరంగా”

ఆహూతులందరూ మెచ్చుకున్నారు.


తండ్రి కోరిక మీద, బాబు పేరుకి ముందు ‘నాగ’ జోడించి బియ్యంలో ‘నాగ భార్గవ’ అని వ్రాసాడు రాజేంద్ర.

పురోహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్యన వేడుక ఘనంగా జరిగిపోయింది.


“నా వంశాకురం, నా మనవడు నాగ భార్గవ” బిడ్డని ఎత్తుకుని మురిసిపోయారు రామయ్య.


సరిగ్గా అదే సమయానికి యాదృచ్ఛికంగా కళ్ళు తెరిచి తాతని చూసి చిరువనవ్వులు చిందించాడు మనవడు.

దినదిన ప్రవర్థమానమై భార్గవ ఎదుగుతుంటే వాడి ముద్దు మాటలూ అల్లరీ అంతా కన్నులవిందుగా చూస్తూ వీనులకింపుగా ఆలకిస్తూ ఆనందిస్తున్నారు తల్లిదండ్రులూ, తాతానాన్నమ్మలూ.


మనవడి చేయిపట్టుకుని నడక నేర్పారు రామయ్య. భార్గవకి ఏడాది నిండేవరకూ కొడుకు వద్దనే ఉండి గ్రామంలో పనులు చక్కబెట్టుకోవడానికి పయనమయ్యారు రామయ్య దంపతులు.


ఆ తరువాతి వీలైనప్పుడల్లా వచ్చి మనవడ్ని చూసిపోతుండేవారు.


భార్గవకి మూడో ఏట, చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయంలో, అక్షరాభ్యాసం చేసి తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆంగ్ల మాధ్యమం స్కూలులో చేర్పించాడు రాజేంద్ర.

కొడుకు వద్దకు వెళ్ళినప్పుడల్లా మనవడిని బడిలో దింపడం మళ్ళీ బడి వదిలాక ఇంటికి తీసుకుని రావడం రామయ్యగారి వంతైతే, అన్నం తినిపించడం, దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడం జానకమ్మ వంతు.


మనవడి ముద్దు మురిపాలలో కాలం తెలియకుండానే గడిచిపోయేది ఇద్దరికీ. అయితే భార్గవ పెద్దవుతున్న కొద్దీ ఎవరి పోలికో అర్థం కాలేదు రామయ్య దంపతులకి.


“ఏమండీ భార్గవలో అబ్బాయి పోలికలు కానీ కోడలు పోలికలు కానీ కనిపించట్లేదేమిటో చిత్రంగా ఉంది కదూ!”


“నీకన్నీ సందేహలే. తల్లిదండ్రుల పోలికలు రాకపోయినా తాత ముత్తాతలలో ఎవరివో వచ్చే ఉంటాయిలే. వాళ్ళని మనము ఎరుగుదుమా ఏమన్నానా! ఊరికే అనుమానం లేవనెత్తకు. అనుమనం పెనుభూతం అన్నారు” భార్యని మందలించారు.


ఆడుకుంటున్న మనవడిని చూస్తూ ‘జానకి అడిగిందని కాదుగానీ అసలు ఇంతకీ వీడెవరి పోలికో?’ అనుకున్నా తనకూ అదే సందేహం కలిగిందని భార్యకు ఎన్నటికీ తెలియనీయలేదు రామయ్య.


&&&


స్వగ్రామం అచ్యుతాపురంలో తమ ఇంటిపైన, మనవడికోసం, ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చి మరో అంతస్తు, కట్టించారు రామయ్య.


ఆ ఇంటి పూజా, కొడుకు ఐదవ పుట్టినరోజు కూడా కలిసి జరుపుకుందామని వచ్చారు రాజేంద్ర దంపతులు.


భార్గవ ప్రతి పుట్టినరోజు సమయానికి కొంచం అటూ ఇటూగా, అమెరికానుంచి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం పరిపాటి అయ్యింది సూరజ్ కి.


ఒకసారి అలా వచ్చిన ఫోన్ రామయ్య ఎత్తారు.

“ఎవరూ మాట్లాడేది?”


“రాజేంద్రని పిలుస్తారా కొంచం”


“అబ్బాయి పని మీద బయటకి వెళ్ళాడు. నేను వాడి నాన్నని”


“నమస్తే అంకుల్. నేను సూరజ్. ఆస్పత్రిలో మిమ్మల్ని కలిసాను గుర్తుకొచ్చిందా?”


“ఆ.. . ఆ.. . నువ్వా బాబూ! చాలా కాలమైంది కదా అందుచేత వెంటనే గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోవద్దు”


“అయ్యో ఫరవాలేదు అంకుల్. భార్గవ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్దామని చేసాను. బాబుకి నా ఆశీస్సులు”


మరికాసేపు సూరజ్ తో మాట్లాడి “మంచిది బాబు అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూండు”


“అలాగే అంకుల్”

ఫోన్ మాట్లాడడం అయ్యాక భర్త దీర్ఘాలోచనలో మునిగిపోవడం గమనించి “ఎవరండీ?” ఆరాతీసింది జానకి.


“సూరజ్”


“ఎవరూ?”


“అదే మన సహాయంతో చదువుకున్నాడూ ఆరోజు ఆస్పత్రిలో నువ్వే గుర్తుపట్టావు ముందు.. . అతనూ”


“ఓహో ఆ అబ్బాయా! చాలా మంచివాడు”


ఆ తర్వాత మనవడితో ఆటలలో పడి ఫోన్ సంగతి మర్చిపోయారు.


రాత్రి భోజనాల దగ్గర హఠాత్తుగా గుర్తొచ్చి “అన్నట్లు ఒరేయ్ అబ్బాయ్.. . చెప్పడం మర్చిపోయాను. ఉదయం నువ్వలా బయటకు వెళ్ళగానే ఇలా అమెరికానుంచి సూరజ్ ఫోన్ చేసాడు” అసంకల్పితంగా ఉలిక్కిపడి, తలవంచుకుని భోజనం చేస్తున్న తండ్రి తన ఉలికిపాటుని గమనించలేదని గ్రహించి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు రాజేంద్ర.

“ఏమన్నాడేమిటీ?”


“మన పిల్లవాడి పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్దామని చేసాడుట. అవును కానీ అబ్బాయ్, మీరు ఇక్కడ ఉన్నట్లూ, బాబు పేరు భార్గవ అనీ ఎలా తెలుసురా అతనికీ?”


“అదీ.. . అదీ” తండ్రికి తన తొట్రుపాటు తెలియకూడదని, పొలమారినట్లుగా చిన్న పొడి దగ్గు దగ్గి, గబుక్కున మంచినీళ్ళ గ్లాసు అందుకుని త్రాగి ప్రక్కన పెడుతూ “ప్రతి సంవత్సరమూ ఫోన్ చేస్తాడు నాన్నా. అక్కడికి చేసి ఉంటాడు. పలకకపోతే ఇక్కడ ఉన్నామని ఊహించి ఉంటాడు. అందరినీ పేరు పేరునా అడుగుతాడు. మన కష్ట సమయంలో ప్రక్కనే ఉన్నాడు, అదీగాక మనమంటే చాలా అభిమానం. మీరంటే ఎంతో గౌరవం కూడా. బాబు గురించి అడుగుతుంటాడు ఫోన్ చేసినప్పుడల్లా. వాడి పేరు భార్గవ అని నేనే చెప్పాను”


“ఓహో అలాగా! వాళ్ళ నాన్నగారి పేరు కూడా అదేనట” భోజనం ముగించి చేయి కడుక్కోవడానికి లేచారు.

ఈ సారి ఉలిక్కిపడడం కళ్యాణి వంతైంది.


“అవునా నాతో ఎన్నడూ చెప్పలేదే. ఈసారి అడుగుతానుండండి” తానూ లేచాడు డైనింగ్ టేబుల్ వద్దనుంచి.


“అయ్యో వద్దురా! ఏదో అతనలా అన్నాడని చెప్పారంతే మీ నాన్న. మళ్ళీ నువ్వు అడిగితే ఏమైనా అనుకుంటాడు పాపం. అయినా మా మనవడొక్కడేనేమిటీ ఆ పేరున్న వాళ్ళు ఎందరుండరూ” తానూ భోజనం ముగించి చేయికడుక్కుని భర్త వెనకాలే హాలులోకి వెళ్ళింది జానకమ్మ.


కొన్ని రోజులు మనవడి ఆటపాటలలో మునిగి తేలి పంట చేతి కొచ్చి కుప్పనూర్పిళ్ళ సమయం, కాబట్టి కుప్పనూర్పిళ్ళ పనులుంటాయి కనుక ఈసారి హైదరాబాదు రావడానికి కుదరదనీ, భార్గవకు సెలవలు ఇవ్వగానే కొడుకునే కుటుంబంతో అచ్యుతాపురం రమ్మని చెప్పి, స్వగ్రామం తిరిగి వచ్చారు రామయ్య, జానకమ్మ.


మనవడి కోసం తాతకీ నాన్నమ్మకీ, కన్నవాళ్ళకోసం రాజేంద్ర కుటుంబానికీ, పట్నానికీ స్వంత ఊరికీ మధ్య తరచూ రాకపోకలు ఎక్కువయ్యాయి.

========================================================================

ఇంకా వుంది..



========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in

.


206 views0 comments

コメント


bottom of page