top of page

మమతల మధువు ఎపిసోడ్ 5


'Mamathala Madhuvu Episode 5' New Telugu Web Series

Written By Ch. C. S. Sarma

'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 5

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.

వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.


హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటి చెబుతాడు.


ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.


ఇక మమతల మధువు ఐదవ భాగం చదవండి..


ఏ విషయాన్ని గురించి నాన్నగారు నన్ను యీ రీతిగా ఓదార్చారు. ఆఫీస్ వ్యవహారాలా, ఆ వైజాగ్ ఆఫీస్లో ఎలాంటి సమస్యలూ లేవే.. కారణం ఎంతోఅనుభవంగల రామకోటి అంకుల్.. ఆ ఆఫీసు సమర్థవంతంగా నడుపుతున్నాడు. యికపోతే.. నాన్నగారు తనకు యిచ్చిన ఆ సందేశం ఏ విషయానికి సంబంధించింది అయ్యివుంటుంది?.. శాంతి విషయమా!.. శారతి ఎవరు అన్న విషయం నాన్నగారికి తెలియదే.. ఒకవేళ ఆ విషయం రామకోటి అంకుల్కు తెలిసి.. వారు నాన్నగారికి చెప్పి వుంటారా!.. వారిరువురి సంబంధం.. కృష్ణార్జునుల బంధం. అంకుల్ తనకితెలిసిన ఏ విషయాన్నీ నాన్నగారికి తెలియజేయకుండా వుండరు. కారణం.. రామకోటి తన తండ్రిగారి పెద్ద అక్క కుమారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి.. పట్టుదల, తీవ్రమైన కృషితో ఒక్కొక్క మెట్టు ఎక్కి వున్నతీకి వచ్చిన నాన్నగారంటే.. బంధువుల కందరికీ ఆదర్శం. సంవత్సరం క్రిందటి వరకూ రామకోటి విజయవాడ బ్రాంచ్ లో వుండేవాడు. వైజాగ్లో.. బిజినెస్ బాగా పెరిగినందున నాన్నగారు.. వారిని వైజాగ్ మార్చారు.


తన సందేహాన్ని తీర్చగలవాడు ఒక్కడే.. మురారి. గోపాల్ మురారికి ఫోన్ చేశాడు. రామకోటి తన్ను కలవలేదని చెప్పాడు మురారి. ప్రశాంతతారహితంగా అదే ఆలోచనలో వుండిపోయాడు గోపాల్. నిద్రపట్టలేదు.

***

గోపాల్ ఆఫీస్లో తన రూమ్ లో కూర్చొని వున్నాడు. అకౌంట్సు సత్యారావు తలుపు తట్టాడు.

“కమిన్..”

మేనేజర్ సత్యారావు లోన ప్రవేశించి విష్ చేశాడు. గోపాల్ సత్యాకు విష్ చేసి..

"ఏమిటి సత్యా!..”


“సార్!.. స్పేర్ పార్టు బిల్సు మీద మీరు సంతకం చేస్తే నేను చెక్కులు వ్రాస్తాను.” ఫైల్ను అందించాడు సత్యా.


బిల్స్ ని చెక్ చేసి.. అన్నింటి మీదా సంతకం చేసి ఫయిల్ను సత్యాకు అందించాడు గోపాల్.

"థ్యాంక్యూ సార్.” చెప్పి సత్యా వెళ్ళిపోయాడు. సెల్ మ్రోగింది. కాల్ చేసింది మురారి

“చెప్పు మురారి.”


“బావా!.. మామయ్యగారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. వారు హాస్పటిల్కు వచ్చారు. శాంతిని చూచారు. ఎంతో అభిమానంగా.. శాంతితో దేనికి బయపడవద్దని చెప్పారు. పెద్ద డాక్టర్ మిస్రాని కలిసికొని మాట్లాడారు. అన్ని విషయాలూ వారికి రామకోటి అంకుల్ సేకరించి.. తెలియజేశారు. నన్ను చూచి..'ఏరా!.. ఎలా వున్నావ్?.. బాగున్నావా?..' అని మాత్రం అడిగారు. తన రూమ్కు ఆనందు పిలిచారు. రామకోటితో ఆనంద్ వెళ్ళాడు. వాడికి చేస్తున్న వుద్యోగాన్ని రిజయిన్ చేయమని బెంగుళూరు బ్రాంచికి మ్యానేజర్గా ఆర్టర్ రిలీజ్.. చేశారు. శాంతి హాస్పటిల్ నుంచి డిచ్ఛార్జి అయిన తర్వాత వారిరువురినీ బెంగుళూరికి వెళ్ళి వలసినదిగా.. ఆనంద్ చెప్పారు. మా అమ్మ యిష్టపడితే వెళతాను. ఆమె వద్దంటే వెళ్ళనని ఆనంద్ మామయ్యతో చెప్పాడు. రేపు యిక్కడి నుండి బెంగుళూరుకు వెళ్ళి.. వారు రెండు మూడు రోజుల్లో నెల్లూరు చేరుతారు.” ఏకధాటిగా చెపుతూవున్న మురారి ఆపాడు.


"శాంతి ఎలా వుంది?..”

"బావా!.. శాంతి బాగుంది.”

"జాగ్రర్తగా చూచుకోరా!..””

"బావా!!.. నీవు నాకు చెప్పాలా.. నాలుగైదు రోజుల్లో డిచ్ఛార్జి చేస్తారు.”


"జయ ఎలా వుంది.”

"చాలా బాగుంది. యిక కట్ చేయనా బావా!..”

"మంచిది. రేపు ఒకసారి ఫోన్ చెయ్యి.”

“అలాగే!..” మురారి కట్ చేశాడు.


తను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న విషయాలన్నీ నాన్నగారికి తెలిసిపోయాయి. తను యిరవై నాలుగు సంవత్సరాలుగా వారికి చెప్పకుండా దాచిన విషయాలన్నీ రామకోటి మూలంగా వారికి తెలిసిపోయాయి. తిరిగి వచ్చిన తర్వాత వారు తన్ను ఏమడుగుతారో!.. యీ విషయాన్ని గౌరీకి తెలియజేస్తాడా!.. అలా జరిగితే గౌరి తన్ను క్షమిస్తుందా!.. కలసి కాపురం చేస్తుందా!.. తను యిప్పుడు ఏం చేయాలి?.. నాన్నగారికి తన ముఖాన్ని ఎలా చూపించాలి?..


ఎన్నో ప్రశ్నలు.. ఏ ప్రశ్నకూ తనకు జవాబు తోచటంలేదు. తలవేడెక్కి పోయింది. మనస్సు నిండా కలవరం, అశాంతి, భయం,

తలుపు తట్టిన శబ్దం. “కమిన్.” అన్నాడు గోపాల్ విసుగ్గా.

అకౌంటెంట్ బాలమురుగన్ నికి వచ్చాడు. విష్ చేశాడు. “సార్ ఏర్ టిక్కెట్లు.”


“ఎవరికి?.. ఎక్కడికి?..” ఆశ్చర్యంతో అడిగాడు గోపాల్.

“మీకు అమ్మగారికి, చెన్నై టు మంగుళూరు,” టిక్కెట్లను అందించాడు. బాలమురుగన్.


గోపాల్ అందుకొన్నాడు.

సెల్ మ్రోగింది. నెంబర్ను చూచాడు. అది భీమారావుగారి కాల్. భయంతో చెవి దగ్గిర వుంచుకొన్నాడు.

“హలో!..”

“చెప్పండి నాన్నా!..” మెల్లగా ఏమి వినవలసి వస్తుందోనని.. అన్నాడు.


"గోపూ!.. నీకు గౌరికి మంగుళూరుకు.. ఏర్ టిక్కెట్లు చెప్పి వచ్చాను. అవి నీకు అందాయా!..”

భీమారావుగారి కంఠం ఎంతో ప్రశాంతంగా వుంది. వారి మనస్సులో తన పట్ల ఆనందంగా వుంటే గోపూ.. అని పిలుస్తారు. కోపంగా వుంటే.. గోపాలా!.. అని పిలుస్తారు. యిప్పటి యీ పిలుపు తన మనస్సుకు ఆనందాన్ని కలిగించింది.


“బాల మురుగన్ యిప్పుడే టిక్కెట్లను నాకు.. యిచ్చాడు నాన్నా!..”

"ఏ డేటు?..”

“పన్నిడవ తేదీ.. అంటే ఎల్లుండి నాన్నా.

“మంచిది. గౌరి ఆదిత్యను చూడాలంటూ వుంది. యిద్దరూ కలసి జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను రేపు.. బెంగుళూరికి వెళ్ళి అక్కడి నుండి మంగుళూరికి.. వస్తాను.మనం అక్కడ కలసికొందాం. సరేనా!..”


“అలాగే నాన్నా!..”

“ఎక్కడున్నావు?..”

“ఆఫీస్లో..”

“త్వరగా పనులు ముగించి యింటికి వెళ్ళు.. పాపం గౌరి.. ఒంటరిగా కూర్చొని నీ కోసం ఎదురు చూస్తూ వుంటుంది.”


“సరే నాన్నా.”

“కట్ చేస్తున్నా!..” భీమారావు కాల్ కట్ చేశాడు.


జరిగిన సంభాషణ వలన.. గోపాల్ హృదయంలో వున్న ఆవేదన చాలా వరకు తగ్గి పోయింది. తన.. తండ్రి తన విషయంలో ఎంతో ప్రసన్నంగా వున్నారు. నిలబడే వున్న బాల మురుగనన్ను చూచి.. “మీరు వెళ్ళండి.” చిరునగవుతో చెప్పాడు గోపాల్. అతను వెళ్ళిపోయాడు.


గది నుంచి బయటికి వచ్చి వర్క్షాప్ ప్రాంతాన్నంతా తిరిగి చూచాడు. రెండు. వెహికల్సుకు రిపేరు జరుగుతూ వుంది. మెకానిక్ హెల్పర్స్.. యజమానిని చూచి నమస్కరించారు.

"వీటి పని ఎప్పటికి పూర్తి అవుతుంది బాలయ్యా!.." మెకానికన్ను అడిగాడు గోపాల్

"రొండూ రేపు సాయంత్రానికి రడీ అవుతాయి. వీటిని ఎక్కడికి పంపాల.. మెకానిక్.


"ఫోర్మన్ శాంతయ్య దగ్గర వివరాలు వున్నాయి. వారిని అడిగి.. వారు చెప్పిన చోటికి పంపండి.”

"అలాగే సార్..”

“వస్తాను.” చెప్పి.. కారు ఎక్కి యింటికి బయలుదేరాడు.

***

రామకోటి.. భీమారావు ఆదేశానుసారంగా.. మురారి శ్యామ్ల వద్ద గతంలో ఏ పరిస్థితుల వలన రహస్యంగా శాంతికి గోపాల్కు రిజిష్టర్ మ్యారేజ్ జరిగిందన్న విషయాలనన్నింటినీ సేకరించి.. భీమారావుకు తెలియజేశాడు.


అంతా విన్న భీమారావుకు అంతవరకూ తన మదిలో గోపాల్ పట్ల వున్న కోపం పోయింది. సానుభూతి ఏర్పడింది. శాంతి విషయంలో.. ఆమెపట్ల ఎంతో జాలి.. అభిమానం కలిగింది. మరోసారి.. రామకోటితో హాస్పటిల్కు వెళ్ళి.. శాంతిని చూచి.. ఆనంద్కు తాను చెప్పిన విషయాలను ఆమెకు చెప్పి.. ఆమెను బెంగుళూరికి వెళ్ళేదానికి ఒప్పించాడు. నీకు నీ బిడ్డకు ఏ విషయంలోనూ.. ఎన్నటికీ కొరత వుండదని ఆమెకు వాగ్దానం చేశాడు. మరోసారి తాను చెప్పిన మాటలను ఆనందు గుర్తుచేసి.. హోటల్కు వచ్చి రామకోటితో కలసి.. బెంగుళూరికి వెళ్ళిపోయాడు.


అప్పటికి వారి ఆఫీస్కు సమీపంలో బాలప్ప.. భీమారావు చెప్పినట్లుగా.. మంచి యింటిని చూచి అడ్వాన్సు యిచ్చాడు. బాలప్ప యజమానిని ఏర్పోర్టులో కొని రిసీవ్ చేసికొని నేరుగా ఆయింటి దగ్గరకు తీసుకొని వచ్చాడు. భీమారావు, రామకోటి ఆ యింటిని చూచి బాలప్పను మెచ్చుకొన్నాడు. తర్వాత ఆఫీస్కు వెళ్ళి.. అక్కడి విశేషాలను గురించి.. లారీల కండిషన్.. డ్రయివర్లను గురించి.. భీమారావు.. బాలప్పతో చర్చించాడు. స్థలం రెండు ఎకరాలు చీపుగా, కూతురు పెండ్లి కోసం ఓనరు విక్రయించదలచాడని.. ఆ భూమిని వర్క్షాప్ పెడితే బాగుంటుందని బాలప్ప యజమానికి సూచించాడు. అతని సలహా భీమారావుకు నచ్చింది. రామకోటి బాలప్పతో కలససి వెళ్ళి ఆ స్థలాన్ని చూచాడు. హైవే ప్రక్కగా వున్న ఆ స్థలం బాగా నచ్చింది భీమారావుకు. ఓనరిని పిలిపించి మాట్లాడాడు. డాక్యుమెంటు వ్రాయించి ఆ స్థలానికి అడ్వాన్స్ యిచ్చాడు.

***

గోపాల్ గౌరీలు ఆదిత్యకు ఫోన్ చేశారు. మంగుళూరు ఏర్పోర్టులో దిగారు. ఆదిత్య తల్లిని తండ్రిని చూచి వారిని తన రెండు చేతులతో కౌగలించుకొన్నాడు. అప్పటికి ఆదిత్యను వారిరువురూ చూచి మూడు మాసాలు. కొడుకును చూచి వారు ఎంతగానో ఆనందించారు. ముగ్గురూ సిటీకి వచ్చి హోటల్ రూమ్లో ప్రవేశించారు. ఆదిత్య టిఫిన్ ఆర్డరు చేశాడు. తన చదువు ఎలా సాగుతూవుందని.. గోపాల్ ఆదిత్యను అడిగాడు. హాస్టల్లో భోజనం ఎలా వుంటుందని గౌరి అడిగింది. వారి ప్రశ్నల్లో.. ఒకరికి కావలసింది తన అభ్యున్నతి.. ఒకరికి కావలసింది తన ఆరోగ్యం. తనపట్ల తల్లి దండ్రులకున్న భావనలను తలచుకొని.. ఆదిత్య నవ్వుకొన్నాడు.


టిఫిన్ తింటూ వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆదిత్య సమాధానాలు సౌమ్యంగా చెప్పాడు. తర్వాత తల్లి కోరికపై వుడిపి శ్రీకృష్ణఆలయాన్ని దర్శించే దానికి బయలుదేరారు.


క్యూలో వుండగా.. ఒక దొంగ తనకు ముందువున్న ఆడమనిషి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. దాన్ని చూచిన ఆదిత్య వాడిని వెంబడించాడు. చాలా దూరం సందు గొందుల్లో వాడి వెనకాల పరిగెత్తి.. వాణ్ణి పట్టుకొని.. కొట్టి ఆ బంగారు గొలుసుతో తిరిగి వచ్చాడు. ఆలయం ముందు, హారాన్ని కోల్పోయిన ఆవిడ, వారి బంధువులు తన తల్లితండ్రి ఆత్రుతతో తనరాక కోసం నిరీక్షిస్తూ వున్నారు.


ఆదిత్య వారిని సమీపించాడు. గౌరి.. అతృతతో ఆదిత్యను సమీపించింది.

“నాన్నా నీకే కాలేదు కదా!..” కొడుకును పరీక్షగా చూస్తూ అడిగింది గౌరి.

“లేదమ్మా!.” నవ్వుతూ జవాబు చెప్పి ఆ గొలుసును పోగొట్టుకున్న ఆమె చేతికి అందించాడు ఆదిత్య. వారంతా.. ఆదిత్యను అభినందించారు. ఆశీర్వదించారు.


గౌరి మరోసారి.. ఆదిత్యను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూచి ఎక్కడా గాయాలు లేనందున.. తన బిడ్డ చేసిన మంచి పనికి ఆనందించింది. తండ్రి గోపాల్ సగర్వంగా గోపాల్ను చూస్తూ అతని భుజంపై తట్టాడు. ఆ పరంధాముని దర్శించారు. 'తండ్రి!.. నా బిడ్డకు అన్ని వేళలా అండగా వుండి కాచి రక్షించు. వీడికి ఆవేశం జాస్తి.. దాన్ని తగ్గించు తండ్రీ.' ఆ దేవుని గౌరి వేడుకొంది.


'శ్రీకృష్ణపరమాత్మా!.. వాడి మనస్తత్వానికి తగిన రీతిగా.. వాడికి చక్కని భవిష్యత్తును ప్రసాదించు' యిది తనయుని క్షేమం కోసం తండ్రి గోపాల్ ఆ దేవుని కోరిన కోరిక.


‘జగత్ రక్షకా!.. నాకు మరుజన్మ అంటూ వుంటే.. నేను మరలా మా యీ అమ్మా నాన్నలకే బిడ్డగా.. పుట్టాలి. నా తల్లిదండ్రులు.. మా తాతయ్యా.. నిండుగా నూరేళ్ళు ఏ కొరతా లేకుండా.. ఆనందంగా వుండాలి. సా ఏ చర్యావారికి కష్టం కలిగించకూడదు.’ తన వారికోసం ఆదిత్య కోరుకొన్న కోర్కె యిది.

"తీర్థప్రసాదాలు స్వీకరించి ముగ్గురూ ఆనందంగా లాడ్జికి తిరిగి వచ్చారు. క్లాస్ వుందని నాలుగు గంటలకు వస్తానని చెప్పి ఆదిత్య కాలేజ్కి వెళ్ళిపోయాడు.


గోపాల్ కి సెల్ మ్రోగింది. అతను రెస్టురూమ్కు వెళ్ళి వున్నందున గౌరి సెల్ ని చేతికి తీసుకొంది. అది తన మామగారి కాల్.

"హలో!.. మామయ్యా!..”

“ఏమ్మా!.. క్షేమంగా చేరారా!..”

“చేరాము మామయ్య. ఆదిత్య ఏర్పోర్టుకు వచ్చాడు. సిటీకొచ్చి రూం తీసుకొని,టిఫిన్ చేసి వుడిపికి వెళ్ళి శ్రీకృష్ణపరమాత్మను దర్శించి వచ్చాము. ఆది క్లాస్ వుందని కాలేజికి వెళ్ళాడు. వీరు రెస్టురూంలో వున్నారు. అవును మామయ్యా!.. మీరెలా వున్నారు. బెంగుళూరులో చలి జాస్తిగా వుంది కదూ!..” అన్నీ వివరించి, తను అడగదలచింది అడిగింది గౌరి.


"నేను బాగున్నానమ్మా!.. యిక్కడ చలి తక్కువగానే వుంది. వాడు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పు.”

గోపాల్ ఆ గది నుంచి బయటకి వచ్చాడు.


"మామయ్యా!.. వారు బయటకి వచ్చారు. ఫోన్ వారికిస్తున్నాను.”

"మామయ్యగారు..” గౌరి ఫోన్ను గోపాల్కు అందించింది. గోపాల్ అందుకొన్నాడు.


"నాన్నా!.." అన్నాడు మెల్లగా.

"గోపూ.. ప్లయిట్ కరక్టు టైముకు చేరిందా!.."

"చేరింది నాన్నా!.."

.

"నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి.”

"ఏమిటి నాన్నా అది?..”


"బాలప్ప హైవే ప్రక్కన రెండు ఎకరాల బీడు భూమిని చూపించాడు. చాలా చీప్ గా వస్తూవుంది. అక్కడ మనం గెస్టుహౌస్.. వర్క్షాప్ పెట్టవచ్చు. పెద్దబావి కూడా వుంది. అడ్వాన్స్ యిచ్చేశాను. యీ విషయం నీకు చెప్పాలనే ఫోన్ చేశాను. నా నిర్ణయం సరైందేనా!..” నవ్వుతూ అడిగాడు భీమారావు.

"చాలా మంచి నిర్ణయం నాన్నా.”


"సరే.. గౌరికి ఆనందం కలిగేలా ఆ చుట్టు ప్రక్కల వున్న మంచి ప్రాంతాలను చూడండి. అన్ని ప్రదేశ వివరాలు ఆదికి బాగా తెలుసు.”

"అలాగే నాన్నా!.."


"నేను ముందు నీతో చెప్పినట్లుగా మంగుళూరు రావడం లేదు. పని ముగించుకొని వూరికి వెళతాను.”

"సరే నాన్నా!.."


“గౌరిని జాగ్రర్తగా చూచుకో.” కట్ చేశాడు భీమారావు. నవ్వుతూ సెల్ ని టీపాయ్ పై వుంచాడు గోపాల్,

"నవ్వుతున్నారు.. కారణం?.." భర్తను పరీక్షగా చూస్తూ అడిగింది గౌరి.


"నిన్ను జాగ్రత్తగా చూచుకోవాలట. మీ మామయ్యగారు చెప్పారు."

"ఆ మాటల్లో మీకేం అర్థమయింది?.. నవ్వింది గౌరి.


"నా మీదకంటే.. వారికి నీ మీద ప్రేమ అధికం." ఆనందంగా నవ్వాడు గోపాల్. గౌరి తన అదృష్టానికి మురిసింది.


నాలుగు రోజులు కొడుకుతో ఆనందంగా గడిపారు గోపాల్ గౌరీలు. తల్లిదండ్రుల సమక్షంలో గోపాల్ కూడా ఎంతో సంతోషాన్ని పొందగలిగాడు. ఆ రోజు వారి తిరుగు ప్రయాణం.


టాక్సీ ఏర్పోర్టు వైపుకు పరుగిడుతూ వుంది. డ్రయివర్ ప్రక్కన ఆడిత్య.. వెనక సీట్లో గోపాల్ గౌరీలు కూర్చొని వున్నారు.

"నాన్నా ఆదీ!..”

“ఏం నాన్నా!..”


"తొమ్మిది నెలల్లో నీ యం.టెక్. పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలని నీ అభిప్రాయం." అడిగాడు గోపాల్.


“నాన్నా!.. పది సంవత్సరాలుగా నేను మన వూరికి మన యింటికి.. మీకు.. దూరంగా వున్నాను. నాన్నా!.. నాకు మీతోటే వుండి ఆనందంగా బ్రతకాలను వుంది. యింత వరకూ మీరు.. తాతయ్య.. ఎంతగానో శ్రమించారు. శ్రమిస్తూనే వున్నారు. నేను మీ యిరువురికి విశ్రాంతి కలిగేలా చేయాలనుకొంటున్నాను. అంటే.. మీ బాధ్యతలను నేను స్వీకరించదలిచాను. నన్ను ద్వేషించిన వారందరి నోటా మంచివాడినని పించుకోవాలను కొంటున్నాను. అందుకు నేను ఎంతగా శ్రమించవలసి వచ్చినా ఆ శ్రమను.. ఆ బాధ్యతను నేను ఆనందంగా స్వీకరిస్తాను. నా యీ కోర్కెను మీరు కాదనకండి.” అభ్యర్థనా పూర్వకంగా చెప్పాడు ఆది.


ఆదిత్య మాటల్లో గోపాల్.. గౌరీలకు ఎంతో వేదన.. ధృడసంకల్పం.. గోచరించాయి. గౌరి కళ్ళల్లో అశ్రువులు నిండాయి. భర్త ముఖంలోకి చూచింది. ఆదిత్య మాటలు గోపాల్ మనస్సును కలత చెందేలా చేశాయి.


"ఆది కోర్కె విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?..” కన్నీళ్ళను పవిటతో తుడుచుకొని అడిగింది గౌరి.


"ఆది నిర్ణయం సరైయ్యింది గౌరీ!.. నాకు చాలా ఆనందంగా వుంది.”


గౌరి వదనంలో సంతోషం.. ఆది వెనక్కు తిరిగి ఆ యిరువురి ముఖాలను పరీక్షగా చూచాడు. వారికి తన పట్ల వున్న ప్రేమాభిమానాలు వారి కళ్ళల్లో గోచరించాయి ఆదిత్యకు.


"థ్యాంక్యూ నాన్నా." ఆనందంతో అన్నాడు ఆది.

టాక్సీ.. ఏర్పోర్టు చేరింది. తల్లీ తండ్రీ.. ఏర్పోర్టు లోపల ప్రవేశించేముందు ఆదత్య తండ్రి తల్లీ.. పాదాలు తాకి నమస్కరించారు. ఆది భుజాలను పట్టుకొని గౌరి అతన్ని తన హృదయానికి హత్తుకొంది. కుడిచేతిని ఆది తలపై వుంచి..

“నిండుగ నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి నాన్నా!..” మనసారా దీవించింది ఆ తల్లి తన తనయుణ్ణి.


గోపాల్ గౌరీలు ఏర్పోర్టు లోపలికి వెళ్ళారు. వికలమైన మనస్సుతో.. ఆదిత్య టాక్సీలో కూర్చున్నాడు. టాక్సీవాలా బండిని కదిలించాడు. ఆదిత్య మనో దర్పణం మ్మీద తన బాల్య చేష్టలు ప్రతిబింబిచసాగాయి.

==========================================


ఇంకా వుంది==========================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


39 views0 comments

Comments


bottom of page