'Maro Konam' written by Kiran Vibhavari
రచన : కిరణ్ విభావరి
"మాయదారి మంద.. మాయదారి మందని. పొద్దు పొద్దున్నే వీళ్ళ మొహాలే చూడాలా!! ఎప్పుడు పోతారో!!" నానమ్మ ఎవరిని చూసి విసుక్కుంటూ ఉందా అని, ఆరుబయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్న చిట్టి తలెత్తి, ఆమెని ఒకసారి తేరిపార చూసింది.
తులసి మొక్కలకు నీళ్లు పోస్తున్న రత్నమ్మ, శ్లోకాలు మరిచి, శోకాలు పెడుతోంది. ఎదురింట్లో ఉన్న శర్మ గారికి వినిపించాలని కొంచెం గట్టిగా అంటోంది.
మూడు రోజుల నుంచి నానమ్మని గమనిస్తున్న చిట్టికి, ఆమె ఎవరిని చూసి అలా రాగాలు తీస్తుందో అర్థమైంది. మూడు రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే కాదు, ఏ ఇద్దరు అమ్మలక్కలు కూడినా ఇదే భాగోతం!
"ఏం చేద్దాం అంటారు?! వాళ్లని ఇక్కడ నుండి ఎలా వెళ్ళగొట్టాలో తెలియట్లేదు. వాళ్లను చూసి మా పిల్లలు కూడా చెడిపోతున్నారు. మొన్నటికి మొన్న మా పెద్దోడు నా లిప్స్టిక్ మొత్తం మూతికి పూసుకున్నాడు. నా మట్టి గాజులు వాడి చిన్న చేతికి పెద్దవైపోయి, కిందపడి పగిలితే ఆ శబ్దానికి లోపలికి వెళ్లిన నేను, మా వారు ఖంగుతిన్నాము. నుదుటున ఇంత బొట్టు, మొహానికంతా పసుపు, పెదవులు మొత్తం ఎర్రగా లిప్స్టిక్ పూసుకుని అమ్మోరు తల్లిలా ఉన్న వాడిని చూసి, మా గుండె ఒక క్షణం ఆగి పోయింది అంటే నమ్మండి. ‘ఏంట్రా ఈ పిచ్చి వేషాలు’ అని నాలుగు తగిలిస్తే.. ‘కాంచన మూవీ చూసి, నాకు అలానే తయారవ్వాలి అనిపించింది అమ్మా! ఎదురింటి అన్నయ్య కూడా అమ్మాయిగా అయ్యి వచ్చాడు కదా. నేను కూడా అమ్మాయి అయిపోతాను. అప్పుడు రంగురంగుల రిబ్బన్లు ,గాజులు ,బట్టలు, బొట్టు బిళ్ళలు ఇవన్నీ పెట్టుకొని అందంగా ఉంటాను..’ అని వయ్యారాలు పోతూ వాడు చెబుతుంటే నా హృదయం విలవిలలాడి పోయింది అంటే నమ్మండి" ఎదురింటి విరజాక్షి కళ్ళు వొత్తుకుంటూ చెప్పింది.
"అసలు ఇలాంటి మాయదారి మందని మన వీధిలో.. అదీ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉంచడం మహా పాపం. వచ్చారు సరే.. ఆ అబ్బాయిలిద్దరూ బయటనే సిగ్గు ఎగ్గు లేకుండా, చేతిలో చేతులు వేసుకుని నడవడం, ముద్దులు పెట్టుకోవడం చూస్తూ, మా పిల్లలు కూడా అదే పాడు బుద్ధులు అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళని అనుసరిస్తూ అదే చేస్తున్నారు. మొన్న మా వాడు, వాడి స్నేహితుడు.. గదిలో కూర్చుని చదువుకుంటున్నారు కదా అని నేను అనుకుంటే , వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఏంటండీ వైపరీత్యం!" బుగ్గలు నొక్కుకుంది పక్కింటి పద్మ.
చిట్టికి నవ్వు వచ్చింది "ఒకవేళ మీ అబ్బాయి ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉంటుందా ఆంటీ?" అని అడిగితే అమ్మ చిట్టి ని తిట్టి లోపలకి పంపించింది.
గోరంతలను కొండంతలు చేసి చెప్పుకునే ఈ ఆడవాళ్ళ మాటలు కొత్త కాకపోయినా , వీళ్ళ సంభాషణ మొత్తం ఒకరి వైపే ఉంది అని అర్ధమైంది.
"వాళ్ళు దొంగతనం చేశారా?? లేదా అత్యాచారాలు చేశారా?? మీరు ఎందుకు వాళ్ళని ఇలా ద్వేషిస్తున్నారు?" చిట్టి మళ్ళీ వచ్చి వాళ్ళని అడిగింది. ఈసారి చిట్టి వాళ్ళ అమ్మ చెయ్యి లేపబోయేంతలో చిట్టి తుర్రుమంది.
***
"నువ్వు చెప్పినట్టే చేశాం చిట్టి! అయినా అమ్మ, నాన్న మారలేదు. నేను వీడిని ముద్దు పెట్టుకున్నా అని నా మూతి పగలగొట్టాడు నాన్న." బాధగా చెప్పాడు చింటూ.
"మా అమ్మ చీపురుతో కొట్టింది" దెబ్బలు చూపించాడు బంటి.
"నన్ను కూడా.. లిప్స్టిక్ మూతికి రాసుకున్నా అని, ఇలాంటి వెధవ వేషాలు వేస్తే హాస్టల్ లో వేసేస్తా అని బెదిరించింది" ఏడుపు మొహం పెట్టాడు బాలు.
చిట్టి ఆలోచనలో పడింది. ఏం చేసి ఈ పెద్దల మనసు మార్చాలి? అద్వైత్ అన్నయ్య చేసిన తప్పేంటి?? కేవలం అతని శరీరాన్ని అంగీకరించడం అతను చేసిన పాపమా? ఎందుకు అందరూ అతన్ని దోషిలా చూస్తున్నారు?
అద్వైత్.. ఇలాంటి అబ్బాయి మాకు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఎందుకు ఇప్పుడిలా కారాలు మిరియాలు నూరుతున్నారు? ఏం చేయాలో పాలుపోక అసలు అద్వైత్ చేసిన తప్పేంటి?? అనే ఆలోచన చేసింది. అతనితో మాట్లాడిన మాటలను, అతనితో తను గడిపిన జ్ఞాపకాలను బాధగా గుర్తుకు తెచ్చుకుంది.
***
" హాయ్ ఆంటీ... అమ్మ ఇది మీకు ఇచ్చి రమ్మంది " అంటూ కొన్ని కాగితాలు చేతిలో పెట్టాడు. సంక్రాంతి ముగ్గులు ఉన్న పేపర్ కటింగ్ లు అవి.
" చాలా థ్యాంక్స్ బాబూ! రా.. కూర్చో. కొద్దిసేపు మాట్లాడి వెళుదువు"అంటూ లోపలికి ఆహ్వానించింది చిట్టి వాళ్ళ అమ్మ.
"పర్లేదు అండి.." మొహమాట పడ్డాడతను.
"పర్లేదు ఏంటి? మళ్లీ ఢిల్లీ వెళ్ళి పోతావ్. ఎప్పుడో గానీ దొరకవు. రా కూర్చో.."అంటూ సోఫా చూపించింది.
"మా చిట్టితో మాట్లాడుతూ ఉండు బాబూ! నేను ఇప్పుడే వస్తాను" అంటూ ఫలహారం తేవడానికి లోపలికి వెళ్ళింది.
"హాయ్ అన్నయ్యా!" పలకరిస్తూ, తన పక్కన వచ్చి కూర్చుని చేతులతో సైగ చేసింది.
"హాయ్ చిట్టీ.." మొహమాటపడుతూ వచ్చి కూర్చున్నాడు.
"నీ పేరేంటి అన్నయ్యా?" ముద్దుగా అడిగింది.
"అద్వైత్" అని నవ్వుతూ చెప్పాడు.
"అంటే??!!" అన్నిటినీ ప్రశ్నించడం అలవాటుగా! అడిగేసింది.
"ద్వైతము కానిది.." రెండు ముక్కల్లో చెప్పాడు.
"అర్థం కాలే.."తెల్లమొహం వేసింది చిట్టి.
అతడు శ్వాస బలంగా పీల్చుకుని, సోఫాలో ఉన్న కుషన్ ఒడిలో తీసుకుని, చిట్టికి మరికాస్త దగ్గరగా జరిగాడు.
"అద్వైతము అంటే ద్వైతము కానిది. అంటే రెండు కానిది. ఆదిశంకరాచార్యులు బోధించిన తత్వం. ఆత్మ ఆ పరబ్రహ్మ స్వరూపం! రెండూ వేరు కాదు. బ్రహ్మసత్యం.. జగం మిథ్య! జీవో బ్రహ్మైవ నా పరః.." అతడు చెప్తుంటే
"అంటే నువ్వు, నేను.. అందరం ఒకటేనా? మనందరం పరమాత్మలో భాగమేనా?" మళ్లీ ప్రశ్నించింది.
" అవును చిట్టీ! " నవ్వుతూ బదులిచ్చాడు.
" మరి నువ్వెందుకు అబ్బాయివి, నేనెందుకు అమ్మాయిని??"అమాయకంగా అడిగింది.
"ఇది కేవలం భౌతికమైన శరీరానికి సంబంధించినది మాత్రమే. ఆత్మకు లింగ బేధం లేదు.."
"ఆత్మ అంటే??"
" ఆత్మ అంటే నువ్వు, నీ శరీరం కాదు. నా చెయ్యి , నా తల అంటావు కానీ నేను చెయ్యిని, నేను మెదడుని అని చెప్పవు కదా.. అంటే నువ్వు అనే పదార్థం ఏదో ఉంది. అది నీతో యెల్లకాలం ఉంటుంది. దానికి చావు లేదు. ఎలా అయితే నువ్వు రోజూ బట్టలు మారుస్తావో, అలా నీ ఆత్మ శరీరాల్ని మారుస్తుంది. ఒకసారి జంతువుగా, మనిషిగా, చెట్టుగా ఇలా ఎన్నో రూపాలలో కర్మసిద్ధాంతాన్ని అనుసరిస్తూ పుడుతూ ఉంటుంది. కానీ అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క రూపమే.. నీ రూపమే! అది తెలుసుకోవడమే అద్వైతం. "అని అతడు చెప్తుంటే, చిట్టి శ్రద్ధగా వింటోంది.
" ఇప్పుడు బిందెడు సముద్రపు నీళ్లు తీసుకుని, దానిని వేరు వేరు ఆకారాలు ఉన్న బాటిల్లో వేసినా అది సముద్రపు నీరే కదా! అట్లే ఎన్ని రూపాల్లో, ఎన్ని శరీరాల్లో ఉన్నా మనం అంతా దేవుడి బిడ్డలమే కదా అన్నయ్యా!" సాదోహరించింది చిట్టి.
" నువ్వు చాలా తెలివైనదానివి చిట్టీ!" అంటూ మెచ్చుకోలుగా చూసాడు.
"మీరేవిట్లు అబ్బాయ్?" వీళ్ల సంభాషణ మొత్తం విన్న చిట్టి వాళ్ళ నానమ్మ అతనికి దగ్గరగా వచ్చి, ఆరా తీసింది.
అద్వైత్ లేచి నుంచున్నాడు. గౌరవంగా ఆమె కాళ్లను ముట్టుకొని ఆశీస్సులు తీసుకున్నాడు.
"మా నాయన మా నాయనే.."అంటూ మెచ్చుకుంది రత్నమ్మ.
"నీ పూర్తి పేరు ఏంటి బాబు?" అతడేమీ బదులివ్వక పోయేసరికి మళ్ళీ అడిగింది.
"అద్వైత్ శర్మ బామ్మ గారు.." మొహమాటంగా చెప్పాడు.
"ఓహ్ శర్మనా.. మా వాళ్లేనా! అందుకే ఇంత బాగా చెబుతున్నావ్ శాస్త్రాలన్నీ.."
"చదువుకుంటే ఎవరైనా చెప్పొచ్చు కదా నానమ్మా" చిట్టి మధ్యలో దూరింది.
అద్వైత్ చిన్నగా నవ్వాడు. రత్నమ్మ ఏదో చెప్పేటంతలో చిట్టి వాళ్ళ అమ్మ పిండి వంటలు తీసుకొచ్చి వీళ్ళ ముందు ఉంచింది.
"తీసుకో బాబూ!" అంటూ ప్రేమగా అరిసెలను అందించింది. అతను మొహమాట పడుతుంటే చిట్టి అతని నోటిలో కుక్కే సింది.. ‘తిను అన్నయ్యా’ అంటూ. వీళ్ళిద్దరినీ చూసి అత్తా కోడలు నవ్వుకున్నారు.
"ఏం చేస్తున్నావ్ బాబు నువ్వు ఇప్పుడు? ఉద్యోగమా లేదా చదువుకుంటున్నావా?" ఆరా తీసింది రత్నమ్మ.
"ఢిల్లీలో ఏఐఐఎంఎస్ ఆస్పత్రిలో పెద్ద డాక్టరుగా చేస్తున్నాడు. పండగకని వచ్చాడు." అద్వైత్ చెప్పేంతలో చిట్టి వాళ్ళ అమ్మ, రత్నమ్మకి వివరించి చెప్పింది.
"ఓహో.. మంచిది.. మంచిది” అంటూ గొప్పగా చూసింది అతన్ని.
రోజులు గడిచే కొద్దీ అద్వైత్ ఇంకా దగ్గర అయిపోయాడు. కాలనీవాసులకు కూడా. చిన్న సమస్య వచ్చినా అతని దగ్గరికి వెళ్లి ఉచిత సలహాలు తీసుకొని, పొగడ్తలను ఫీజులుగా చెల్లించేవారు ఆ కాలనీవాసులు.
అతడు సంక్రాంతి అయిపోయాక ఢిల్లీ వెళ్లి , సెలవులకని తిరిగి వచ్చే వరకు ఆడవాళ్ళ ముచ్చట్లలో అతని పేరు తరచూ వస్తూ ఉండేది.
"అద్వైత్ ఉండుంటే ఈ మోకాలు నొప్పి చిటికెలో పోయేది ఏమో!!"
"అవునవును.. ఎంత బతిమిలాడినా ఫీజు తీసుకోడు. ఇలాంటి కుర్ర డాక్టర్లు ఈ కాలంలో ఉండడం నిజంగా వింతే సుమీ.."
"అందం, అణకువ, మంచితనం అన్నీ కలబోసిన కుర్రోడు. ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతురాలు!"
ఇలా ఉండేవి అమ్మలక్కల కబుర్లు. అలాంటి కాలనీవాసులు ఈరోజు ఇలా అద్వైత్ మీద పగ పట్టడానికి కారణం.. ఎన్నో ఏళ్లుగా వాళ్లలో దాగి ఉన్న ఏహ్యత..
ఆరోజు దసరా సెలవులకి అద్వైత్ వచ్చాడు. అతడు వస్తున్నాడని , వాళ్ళ అమ్మగారు ముందుగానే కాలనీవాసులు అందరికీ చెప్పి ఉంచడంతో పలకరింపుగా అందరూ వచ్చి ఉన్నారు.
అద్వైత్ తో పాటుగా మరో అబ్బాయి కూడా కారు దిగాడు. అతని వాటం విచిత్రంగా ఉంది. గుమ్మంలో నిలబడి ఉన్న అతడిని పిలవాలని ఎవరికీ లేదు. కానీ అద్వైత్ వాళ్ల అమ్మగారు మాత్రం హారతి పళ్లెం తీసుకొని ఇద్దరికీ దిష్టి తీసింది. ‘ఊరూరు తిరిగి వచ్చారు కదా! అందుకే దిష్టి తీస్తుందేమో’ అని అనుకుంటున్న అమ్మలక్కలకి అద్వైత్ వాళ్ళ అమ్మ అద్వైత్ తో పాటు వచ్చిన అబ్బాయిని " మా అల్లుడు" అంటూ పరిచయం చేసింది.
"అదేంటండి.. మీకు అమ్మాయి లేదుగా? ఏ వైపు నుండి మీకు అల్లుడు అవుతాడు!" ఆరా తీశారు అమ్మలక్కలు. ఆవిడ చిన్నగా నవ్వింది.
"మా అబ్బాయి ఈ అబ్బాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుని వచ్చాడు" ఆవిడ చెప్పింది విని అందరూ తెల్ల మొహాలు వేశారు. ఆవిడ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
" నాకు వాడి చిన్నప్పటి నుండి, వాడి విషయం తెలుసు. వాడు లోలోపల ఎంత బాధ అనుభవించాడు.. ఎంతగా కుమిలిపోయాడు.. తల్లిగా నేను కళ్లారా చూశాను. మొదట్లో నేను కూడా సతమతమైయ్యాను. నా కొడుక్కే ఎందుకిలా?? అని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇందులో వాడి తప్పులేదు. వాడిని అసహ్యించుకుని వాడిని నేరస్తుడిగా చూడడం నాకు నచ్చలేదు. అందుకే మా వాడు ఎలా ఉన్నాడో అలా నేను అంగీకరించాను. వాడి శరీరాన్ని, వాడి మనసును వాడి ఇష్టానికి వదిలేసాను. ఎటువంటి కంచెలు, అడ్డుగోడలు లేని స్వేచ్ఛా సమాజంలో వాడిని హాయిగా బతకనిచ్చాను.."ఆమె ఇంకా చెప్తుండగానే ఒక్కొక్కరు అక్కడనుండి మెల్లగా లేచి వెళ్లిపోయారు. ఆమె అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
"కొన్ని రోజుల్లో వీళ్ళే అర్ధం చేసుకుంటారు అమ్మా! " అంటూ అద్వైత్ తన తల్లి చుట్టూ చేతులు వేసాడు.
క్యాలెండర్ లో రోజులు మారుతున్నాయి కానీ, కాలనీ వాసులలో మాత్రం మార్పు రావట్లేదు. ‘సమాజం అనేది స్త్రీ పురుషులకు మాత్రమే, మరొకరికి చోటు లేదు’ అన్న వారి భావన.. తేడా గాళ్లు, నట్టు గాళ్ళు, పాయింట్ ఫైవ్ లు, అని హేళన చేస్తారు గానీ వాళ్ళు పూజించే పరమేశ్వరుడు కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించాడు అనే సంగతిని విస్మరిస్తున్నారు.
అర్జునుడు బృహన్నలగా మారడం అతడి శాపం అని ఆలోచిస్తారే గాని, అది కౌరవుల బారి నుండి అతడిని కాపాడిన వరం అని అనుకోరు.
మేము పట్టిన దానికి మూడే కాళ్లు అన్నట్టు మాట్లాడుతారే కానీ, అది కుందేలా లేదా ముక్కాలి పీటా అనేది ఆలోచించరు.
కృష్ణుడు కొడుకు శంభుడు కూడా ఒక ‘అర’ వానిగా బతికాడు. అయినా మనుషులం అని చెప్పుకు బతికే వీళ్లకు, ఇటువంటి వారు మనుషులుగా గోచరించరు.
షాపింగ్ మాల్స్ లో, థియేటర్లలో ఏదైనా పబ్లిక్ ప్రదేశాలలో వీళ్ళు కనిపిస్తే పక్కకి తప్పుకుంటారు. వింతగా చూస్తారు. నగరాల్లో ఇటువంటి వారికి అద్దె ఇల్లు దొరకడం కూడా చాలా కష్టం.
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఎవరూ మొగ్గు చూపట్లేదు. దిక్కులేని పరిస్థితుల్లో కాలే కడుపుకు ఇంత కూడు పెట్టడానికి అడుక్కొని తింటున్నా, చూపులతో చంపేస్తారు. ‘కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి పని చేసుకొని బతకొచ్చుగా’ అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. కానీ పనిలో పెట్టుకునేందుకు మాత్రం ఎవరూ ముందుకు రారు.
సినిమాలలో, టీవీ షోలలో వీళ్లపై జుగుప్సాకరమైన సన్నివేశాలు. నిలదీసే వారు లేక అండగా నిలిచేవాడు లేక, ‘ఎందుకురా భగవంతుడా మమ్మల్ని ఇలా పుట్టించావు’ అని ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిర్భాగ్యులు! తప్పనిసరై పడుపు వృత్తిలోకి దిగి నయంకాని రోగాలు తెచ్చుకుంటున్నారు.
స్త్రీ పురుషులు కలవడం మాత్రమే సృష్టి ధర్మం, ప్రకృతి నియమం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కానీ వీళ్ళు కూడా ప్రకృతిలో భాగమే అని గుర్తించరు. ఇలా పుట్టడం వీరిదే తప్పు అన్నట్టుగా వారిని సంఘ బహిష్కరణ చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా, సంఘంలో మార్పు రాకుండా సమాజం వీళ్ళని ఆహ్వానించకుండా వీళ్ళ బతుకులు మార్చడం అసాధ్యమే కదా.
***
"ప్లీజ్ గాడ్ ! ప్లీజ్.. అద్వైత్ అన్నయ్య వాళ్ళు ఇక్కడ నుండి వెళ్లకుండా చూడు. ప్లీజ్.." పిల్లలందరూ ఏడుస్తూ దేవుడి ముందు మోకరిల్లి ప్రార్థన చేశారు.
"అద్వైత్ అన్నయ్య చాలా మంచోడు. నువ్వు మంచోళ్ళకి హెల్ప్ చేస్తావుగా! అన్నయ్యకు హెల్ప్ చెయ్యి. నేను మమ్మీ చెప్పిన మాట వింటాను" బంటి గాడు దేవుడికి మొక్కుకున్నాడు.
"నువ్వు నిజంగా ఉంటే, అన్నయ్య మంచితనాన్ని మా వాళ్ళు గుర్తిస్తారు. అలా చెయ్యి స్వామీ! లేదంటే నిన్ను ఎప్పటికీ నమ్మం. నీకు పూజలు కూడా చెయ్యం. ప్రసాదం కూడా పెట్టము" ఈసారి బెదిరించారు దేవుణ్ణి.
ప్రార్థనలకు పొంగిపోయాడో, లేక బెదిరింపులకు బెదిరిపో యాడో కానీ పెద్ద వర్షాన్ని ఆగమేఘాల మీద కురిపించాడు. అంత వరకు నీలంగా ఉన్న ఆకాశం నల్లగా మారిపోయింది. తుఫాను హెచ్చరిక మోసుకొస్తూ ఈదురు గాలులు బలంగా వీచాయి. పిల్లలందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు.
మూడు రోజులు గడిచిపోయాయి. వర్షం ఆగే మాటే తీసుకోవట్లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వీళ్ళ కమ్యూనిటీ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో, అది కూడా నదీ సమీపంలో ఉండడంతో, ఇళ్లలోకి వరద నీరు చేరింది.
మరో రెండు రోజులు గడిచేసరికి, పరవళ్లు తొక్కుతున్న నది ఊరిని ముంచేసింది. వరద బీభత్సం అంతా ఇంతా లేదు. మనుషులు కొట్టుకుపోతున్నారు. కార్లు, తోపుడు బళ్ళు, ఆగి ఉన్న ఏ వాహనాలైన వరద ప్రవాహంలో కొట్టుకు పోతున్నాయి. చూస్తూ చూస్తూ ఉండగానే రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పోయాయి. కరెంటు కోత షరా మామూలే. రెండు రోజుల నుంచి బయటకు కదిలే ప్రశ్నే లేకుండా ఎక్కడ చూసినా, బలమైన ఈదురు గాలులు, దానికితోడు కుండపోత వర్షం.
గాజు భవనాలు పెళ పెళ మంటూ కూలిపోయాయి. ఇళ్లల్లోకి విష సర్పాలు, క్రిమికీటకాలు చొరబడి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపించాయి. అయినా ఈ మనుషులు మారరు. వారి అహంకారాన్ని వదులుకోరు.
ఆదినుండి ఆకాశం మూగది. అనాదిగా పుడమితల్లి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు. ఈ నడమంత్రపు మనుషులకే మాటలు. ఎవరో కవి చెప్పినట్టు, ఈ మనుషులే ప్రకృతిని మించిన వారని భ్రమ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఏమో ఇలాంటి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి.
కొందరి ఇండ్లలో సరుకులు నిండుకున్నాయి. పాలు, టీలు, కాఫీలు అలవాటైన ప్రాణాలు గిలగిల గింజుకున్నాయి. కాలక్షేపానికి టీవీ చూద్దామంటే కరెంటు కూడా లేదు. ‘మీ ఇంట్లో కరెంట్ వచ్చిందా? మా ఇంట్లో పోయింది’ ఇలా అడుక్కుంటు కాలక్షేపం చేస్తున్నారు ఎదురు బొదురు ఇంటి వాళ్ళు. మొబైల్ ఫోన్లు కూడా మూగబోయాయి. ప్రభుత్వం వచ్చి వీళ్ళను ఆదుకునే వరకు, వేచి ఉండాల్సిందే.
కొందరి ఇళ్లు పై అంతస్తుల్లో ఉండటం మూలాన కొంతలో కొంత నయం. కానీ వాళ్ళ వాహనాలు కింద అంతస్తులో ఉండటం వలన నీళ్లతో నిండిపోయాయి.
పాపం హృద్రోగులు, పేషెంట్లు, పసిపిల్లలు, వృద్ధుల అవస్థలు మరీ దారుణం. కొట్టుకు వస్తున్న వరద నీటితో పాటు, అది తెస్తున్న రోగాలతో కాలనీవాసులు తల్లడిల్లి పోయారు. అలాంటి సమయంలో ఆపద్భాందవుల్లా అద్వైత్, అతని సహచరుడు కలిసి అందరికీ సేవలు చేశారు. ఇప్పుడు అమ్మలక్కలు సంశయం చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే నిస్సహాయత వారి పొగరును అణచివేసింది.
అద్వైత్ కుటుంబం ఇరుగుపొరుగు వారిని వాళ్ల ఇంటికి ఆహ్వానించింది. ఇల్లు మొత్తం సోలార్ పవర్ తో బ్యాకప్ చేసి ఉండటం వల్ల కరెంటు పోయినా చిన్నచిన్న అవసరాలకు సోలార్ పవర్ పనికి వచ్చింది. కాలనీవాసులు చాలామంది వీళ్ళ ఇంటికి వచ్చి తమ మొబైల్ ని రీఛార్జ్ చేసుకున్నారు. మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాక, బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాక వాళ్ళ కళ్ళలో కనిపించిన కృతజ్ఞతా భావం వర్ణనాతీతం.
వరద బీభత్సం మరో రోజు కూడా కొనసాగింది. ముసలి వాళ్లను అద్వైత్ తన ఇంటికి, జాలర్లను అడిగి తీసుకువచ్చిన పడవ సహాయంతో తీసుకు వచ్చాడు.
అప్పటికే కొంతమంది ప్రభుత్వ వాలంటీర్లు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ కొందరిని వసతి గృహాలకు తరలించే ప్రయత్నం చేశారు. కొందరికి త్రాగు నీళ్లు, అన్నం ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.
చిట్టి వాళ్ళ అమ్మ ,రత్నమ్మతో పాటు, చిట్టిని తీసుకుని అద్వైత్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. సమయానికి చిట్టి వాళ్ళ నాన్న కూడా అందుబాటులో లేకపోయేసరికి, బిక్కచచ్చి పోయి ఉన్న చిట్టి కుటుంబాన్ని, అద్వైత్ కుటుంబం అన్నీ మరచి , సాదరంగా ఆహ్వానించారు.
రత్నమ్మకు తను అన్న మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుతో తలదించుకుంది. మనిషిని మనిషిగా గుర్తించడం చేతకాక అనరాని మాటలు, పెట్టకూడని వంకలు పెట్టేస్తూ ఉంటారు. ఏదో మనమే సృష్టికర్తలు అన్నట్టు.
ఆకలితో నకనక లాడుతున్న రత్నమ్మ సిగ్గు విడిచి "కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా!!" అని అద్వైత్ వాళ్ళ అమ్మగారిని దీనంగా అడిగింది.
"అయ్యో క్షమించమ్మా! మర్చిపోయాను.." అంటూ అద్వైత తల్లి, కంచాలు సర్దింది.
"అయ్యో దేవుడా! నా పళ్ళ సెట్టు.. ఇంట్లో మర్చిపోయానే. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తీసుకురావడం మర్చిపోయాను" అంటూ బాధపడింది రత్నమ్మ.
"అంతేగా నానమ్మా! నేను వెళ్లి తెచ్చేస్తా." అంటూ మరో మాట మాట్లాడకుండా అద్వైత్ బయటకు పరుగు తీశాడు.
"అద్వైత్! వద్దు బాబూ.." వెనక నుండి అమ్మలక్కలు వారించారు. అతడు అవేవి పట్టించుకోకుండా, నడుము లోతు వరకు నిండిన నీటిలో నడుచుకుంటూ, చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్లి, పూల కుండీలో దాచిన తాళంచెవితో తలుపు తీసి, డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచిన పళ్ళసెట్టును బయటకు తెచ్చి ఆనందంగా దాన్ని చూపిస్తూ చెయ్యి ఊపాడు.
"తొందరగా ఇటు వచ్చేయ్ బాబూ!".. ఆడవాళ్ళు గట్టిగా అరిచారు.
"వస్తున్నా.. వస్తున్నా.." అంటూ కిందకి దిగిన అద్వైత్ మీద ఇంటి పక్కనే ఉన్న మామిడి చెట్టు భారీ కొమ్మ ఒకటి విరిగి, అతనిమీద అమాంతం పడింది.
"అద్వైత్.." అక్కడున్న వారంతా గట్టిగా అరిచారు. వాళ్ల అరుపులకి బయటకు వచ్చిన అతని తల్లి, కంగారుగా కిందికి వెళ్ళింది.
చెట్ల కొమ్మలను పక్కకి తోస్తూ, బయటకు వచ్చిన అద్వైత్ ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడు పైకి వచ్చిన వెంటనే రత్నమ్మ అతన్ని అమాంతం కౌగలించుకొని, ముద్దులు కురిపించింది. "మా తండ్రే, మా నాయనే.. నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా! దేవుడిలా వచ్చి, జ్వరం పట్టిన మా చిన్న పిల్లలను కాపాడావు. మా వృద్ధులకు ఆరోగ్యం సరిగా ఉందో లేదో అని ఇంటింటికీ వచ్చి పరీక్షలు చేస్తున్నావు. మా అందరికీ రెండు పూటలా ఇంత ముద్ద పెడుతున్నావు. నేను నీకు ఏమీ కాకపోయినా నాకోసం అంత సాహసం చేశావు. ఏమిచ్చయ్యా నీ రుణం తీర్చుకోనేది.." అతడి తలను నిమురుతూ రత్నమ్మ చెప్పింది.
"నన్ను మీ సాటి మనిషిగా గుర్తించండి చాలు. కేవలం నా శరీర అవసరాలను బట్టి నన్ను వింత మనిషిని చూసినట్టు చూడకండి. తట్టుకోలేకపోతున్నాను.." అతడు ఏడుస్తూ చేతులు జోడించి అందరినీ వేడుకున్నాడు.
"మమ్మల్ని క్షమించు బాబూ!" ఈసారి కూడా ఆ అమ్మలక్కలందరిదీ ఒకటే మాట. అందరి కళ్ళల్లో అదే పశ్చాత్తాపం.
పిల్లలందరూ మాత్రం తమ కోరిక నెరవేరినందుకు భగవంతుడికి థాంక్స్ చెప్పుకున్నారు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి
నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.
コメント