top of page

మాతృ హృదయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Mathru Hrudayam' New Telugu Story


Written By Ch. C. S. Sarmaకథ చదివి వినిపించిన వారు: మల్లవరపు సీతారాం కుమార్


ప్రతి తల్లి తన బిడ్డల క్షేమాభివృద్ధికి ... తాను కొవ్వొత్తిలా కరిగి... తన జీవితాంతం పాటుపడుతుంది. అందుకే 'తల్లికి సాటి తల్లే' అని పెద్దలు అన్నారు.


"అమ్మా!... స్నేహా!..." అనారోగ్యంతో మంచంలో వున్న హారతి మెల్లగా పిలిచింది.


మాత్రలు... మంచినీళ్లు ఆమెకు ఇచ్చి గది నుండి బయటికి వెళుతున్న హారతి వెనుతిరిగి మంచాన్ని సమీపించింది.

"ఏం అమ్మా..." ప్రీతిగా హారతి ముఖంలోకి చూస్తూ అడిగింది స్నేహ..


"నాన్నగారు ఎక్కడికి వెళ్లారమ్మా!..." అడిగింది హారతి.


"బజారుకు వెళ్లారమ్మా!... వెళ్లి చాలా సేయింది. ఈపాటికి తిరిగి వస్తూవుంటారు."

గదిలో ప్రవేశించిన శ్రీనివాస్... "వచ్చేశాను..." చిరునవ్వుతో చెప్పాడు..


తన చేతిలోని సంచిని స్నేహకు అందించి... "నీవు చెప్పినవన్నీ తెచ్చానమ్మా... చూచుకో..." అన్నాడు.

స్నేహ... సంచితో వంటగది వైపుకు వెళ్లింది.


"ఎలావుంది హారతి!..." ప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ మంచం ప్రక్కన వున్న స్టూలు మీద కూర్చున్నాడు.


హారతి అతని ముఖంలోకి చూచి... విరక్తిగా నవ్వింది. కళ్లు మూసుకొంది.

శ్రీనివాస్ ఆమె నొసటిపై తన చేతిని వుంచాడు.


"త్వరలో నీవు కోలుకొంటావు హారతి... నీకు ఏ వ్యాధి లేదు. మనోవేదన తప్ప. దైవాన్ని ఎంతగానో నమ్మేదానివి కదా!... నీ మనోభావాన్ని తీర్చమని ఆ సర్వేశ్వరుని... వేడుకో..." మంటూ అనునయంగా చెప్పాడు శ్రీనివాస్.


హారతి మెల్లగా కళ్లు తెరిచింది. అంతవరకూ కళ్లల్లో వున్న కన్నీళ్లు చెక్కిళ్లపైకి జారాయి.

"శ్రీ... నాకు సాగర్ ను ఒకసారి చూడాలని వుంది..." గద్గద స్వరంతో చెప్పింది హారతి.


కొన్ని క్షణాలు హారతి ముఖంలోకి దీక్షగా చూచాడు శ్రీనివాస్. కన్నకొడుకును చూడాలని హారతి మనస్సు ఎంతగా ఆరాట పడుతూవుందో... హారతి చెప్పిన ఆ ఒక్క మాటలో అతనికి అర్ధం అయింది.


'యుక్తవయస్సు వచ్చిన సాగర్... తల్లికి దూరంగా వుంటున్నాడంటే... దానికి కారణం తాను... హారతి కోర్కెను తీర్చాలంటే తాను స్వయంగా వెళ్లి సాగర్ ను కలవాలి. అతనికి నచ్చచెప్పి... తనతో తీసుకొని రావాలి. సాగర్ కు తనంటే యిష్టంలేదు. తన మాటలను పెడచెవిన పెడతాడు. అయినా... హారతి ఆనందం కోసం... తాను సాగర్ ను కలవక తప్పదు. ఈ నిర్ణయానికికి వచ్చిన శ్రీనివాస్...

"రేపు నేను వెళ్లి సాగర్ ను కలుస్తాను హారతీ!..." అనునయంగా చెప్పాడు.


"రేపు వెళతారా!..."..

"అవును... నీ కోర్కెను తీర్చడం నా ధర్మం హారతి!..." చిరునవ్వుతో చెప్పాడు శ్రీనివాస్.

దిండు కిందికి చేతిని పోనిచ్చి... మడచిన కొన్ని కాగితాలను శ్రీనివాస్ కు అందించింది హారతి. అవి ఐదు ఎ ఫోర్ షీట్లు.


"హారతి!... ఏమిటిది?..." ఆశ్చర్యంతో అడిగాడు శ్రీ....

"వాడికి వున్న సందేహాలను తీర్చడానికి నేను వ్రాసిన మన కథ. వాటిని వాడికి ఇవ్వండి. చదవమని చెప్పండి. దాన్ని చదివి వాడు తప్పక మీతో వస్తాడని నా ఆశ... ఇదే.. నా చివరి ప్రయత్నం" అంటూ విరక్తిగా నవ్వింది హారతి.


హారతి మాటలకు శ్రీనివాస్ మనస్సులో ఆందోళన.

తల్లీ కొడుకుల ఎడబాటుకు కారణం... తనే.


"నేను నీ జీవితంలో ప్రవేశించకుండా వుంటే... నీకు ఈనాడు యింత బాధ వుండేది కాదు. సాగర్ నీకు దూరమయ్యేవాడు కాదు." విచారంగా తలదించుకొని చెప్పాడు శ్రీనివాస్.


“శ్రీ... నీవు అనేవాడివి... ఆనాడు నన్ను ఆదరించి వుండకపోతే... సాగర్... అనాధాశ్రమం పాలయేవాడు. నా కధ ముగిసి పోయి వుండేది." పేలవంగానవ్వుతూ అంది. కొన్ని క్షణాల తర్వాత.... “శ్రీ... సత్యాన్ని నమ్మి గౌరవించాలంటే... దానికి స్వచ్ఛమైన మనస్సు వుండాలి. వాడిలో ప్రహించే రక్తం ఎవరిదో నీకు తెలుసుగా!... అయినా... ఈ చివరి ప్రయత్నాన్ని నీవు నా కోసం... చేయాలి శ్రీ.!.... దీనంగా శ్రీ కళ్లల్లోకి చూస్తూ చెప్పింది హారతి..


"తప్పకుండా చేస్తాను హారతి... వాడికి నీవు అవసరం లేకపోయినా... నాకు, స్నేహకు నీవు కావాలి... ఆప్యాయంగా హారతి ముఖంలోకి చూస్తూ చెప్పాడు శ్రీ...


స్నేహ... ఒక ప్లేటులో యిడ్లీలు.. పాలగ్లాసుతో ఆగదిలోకి వచ్చింది. వాటిని టేబుల్ పై వుంచి మంచాన్ని సమీపించి.....


“అమ్మా!... మెల్లగా లే... టిఫిన్ తినాలి." తన చేతిని హారతి తలక్రింద నుంచి భుజాల వరకు పోనిచ్చి లేపి... హారతిని కూర్చోబెట్టింది స్నేహ. ఇడ్లీ ప్లేటును చేతికి తీసుకొని... ముక్కలను హారతి నోటికి అందించింది. హారతి మెల్లగా తినడం ప్రారంభించింది ప్రీతిగా... స్నేహ నోట్లో పెట్టగా హారతి రెండు యిడ్లీలను తిన్నది.


“అమ్మా!... స్నేహా!... యిక చాలురా!!..." అని స్నేహముఖంలోకి పరీక్షగా చూచింది.

కళ్లు ఆర్పకుండా తన్నే చూస్తున్న హారతిని చూచి స్నేహ... "అమ్మా!... ఎందుకు నన్నే చూస్తున్నావ్!...


"నీ రుణాన్ని నేను ఈ జన్మలో ఎలా తీర్చుకోగలనా అని... విరక్తిగానవ్వి... “నేను చచ్చి నీ కడుపున పుడతాను తల్లీ..." చిరునగవుతో అంది హారతి.

స్నేహ ఆశ్చర్యంతో తండ్రి శ్రీనివాస్ ముఖంలోకి చూచింది.


“హారతి!... ఏమిటా మాటలు!... నీ బిడ్డ నీకు సేవ చేయకుండా మరెవరికి చేస్తుంది?... నీవు ఆరోగ్యంగా... నిండునూరేళ్లు బ్రతకాలి. స్నేహ బిడ్డలను నీ చేతులతో పెంచాలి. అది చూచి నేను ఆనందించాలి...." ఆవేశంగా చెప్పాడు శ్రీనివాస్.


స్నేహ... పాలగ్లాసును హారతికి అందించింది. పాలను త్రాగింది హారతి. ఆమె చేతిలోని గ్లాసును అందుకొంది స్నేహ. ఇడ్లీప్లేటును చేతికి తీసుకొని వంటగది వైపుకు వెళ్లిపోయింది.


"ఎట్టి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పడుకో... హారతి... రేపు వెళ్లి నేను సాగర్ ను నాతో తీసుకొస్తాను..." అనుయంగాచెప్పాడు శ్రీనివాస్.


హారతి మంచంపై వాలిపోయింది.

"శ్రీ... సాగర్... నీతో వస్తాడనే నమ్మకం నీకు వుందా !....”


"ఉంది... హారతి"

హారతి చిరునగవుతో కళ్లు మూసింది.

శ్రీనివాస్... ఆ గది నుండి బయటికి నడిచాడు.

***


శ్రీనివాస్ మరుసటి రోజు పదిగంటలకు గుంటూరు చేరాడు. ఇనస్పెక్టర్ సాగర్ కార్యాలయానికి వెళ్లాడు. ద్వారం దగ్గరవున్న పోలీస్ శ్రీనివాస్ ను చూచి... "ఎవరిని కలవాలి మీరు ?..." అని అడిగాడు.


"మీ అయ్యగారిని...."

"మీరు వారికి ఏమౌతారు?...".


"బంధువు..."

"మీ పేరు?...."

"శ్రీనివాస్... మీ అయ్యగారు వున్నారా?.."


"ఉన్నారు... కూర్చోండి... అయ్యగారికి చెప్పి వస్తాను....


పోలీస్ లోనికి వెళ్లిపోయాడు.

రెండు నిముషాల్లో తిరిగి వచ్చి.....

"అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరు కొద్ది నిముషాలు వెయిట్ చేయాలి...". వినయంగా చెప్పాడు.


పదినిముషాల తర్వాత... ఆ గదినుండి ఇరువురు వ్యక్తులు బయటికి వచ్చారు. వీధిలోకి వెళ్ళిపోయారు.

"మీరు లోనికి వెళ్లండి సార్!..." చెప్పాడు పోలీస్.


శ్రీనివాస్ ఇనస్పెక్టరు గదిని సమీపించి తలుపుపై తట్టాడు.

"ప్లీజ్ కమిన్..."


తలుపు రెక్క తెరచి శ్రీనివాస్ లోన ప్రవేశించాడు.

సాగర్ ల్యాండ్ లైన్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.


శ్రీనివాస్ ను చూచి... టేబుల్ ముందున్న కుర్చీని చూపుతూ... "కూర్చోండి.." అన్నట్టు చేత్తో సైగ చేశాడు.

శ్రీనివాస్ కుర్చీలో కూర్చున్నాడు. ఎంతో ఆనందంగా ఫోన్లో మాట్లాడుతున్న సాగర్ ను పరీక్షగా చూడసాగాడు.


సాగర్ ప్రసంగాన్ని ముగించి, ఫోన్ను రిసీవర్ పై వుంచి శ్రీనివాస్ ముఖంలోకి చూచాడు. ఆ క్రిందటి క్షణంవరకు అతని ముఖంలో వున్న ఆనందం స్థానంలో... సీరియస్ నెస్ నిండిపోయింది.


"వాటీజ్ యువర్ ప్రాబ్లమ్?..."

" ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్..."


"అయితే స్టేషన్ కు ఎందుకు వచ్చినట్టు?.."

"మీ అమ్మగారి ఆరోగ్యం సరిగా లేదు. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనేది ఆమె కోరిక. మీరు నాతో వస్తే ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది...." ఎంతో అనునయంగా చెప్పాడు శ్రీనివాస్.


“ఇది చెప్పడానికేనా మీరు ఇక్కడికి వచ్చింది?...".

“అవును బాబూ!..."


సాగర్ కొన్ని క్షణాలు అలోచించాడు. అతని వదనంలో అప్రసన్నత...

"మీరూ ఆమె కలసివుంటే... నేను ఆమెను చూడడానికి రాను. ఇదే విషయాన్ని మీరు ఆమెకు చెప్పండి...”


శ్రీనివాస్... అతని మాటలకు ఆశ్చర్య పోయాడు. 'ఇరవై ఐదు సంత్సరాల అనుబంధాన్ని తెంచుకొని తాను... హారతికి దూరంగా పోవాలా!... ఇందుకు హారతి సమ్మతిస్తుందా... స్నేహ అందుకు అంగీకరిస్తుందా!... తనకు దూరమై హారతి బ్రతక గలదా!... అన్నీ సమాధానం లేని ప్రశ్నలే... శ్రీనివాస్ మనస్సు వికలమయింది. కళ్లల్లో కన్నీరు.. తాను ఎత్తుకొని మాటలు నేర్పి... పెంచి పెద్దచేసిన వాడు తన సాంగత్యాన్ని అసహ్యించుకొంటున్నాడు. ద్వేషిస్తున్నాడు. హారతితో తెగతెంపులు చేసుకోమంటున్నాడు. కాలం... వీడి మనస్తత్వంలో ఎంతటి మార్పు తెచ్చింది.....


తలవంచుకొని ఆలోచనా సాగరంలో మునుగుతున్న శ్రీనివాస్‌ని చూచి సాగర్...

"ఇక మీరు వెళ్లవచ్చు...." అన్నాడు..


తల ఎత్తి శ్రీనివాస్, సాగర్ ముఖంలోకి చూచాడు. అతని వాడి చూపులు... 'లేచి బయటికి పోరా!...' అన్నట్టుగా గోచరించాయి.

శ్రీనివాస్... లేచి నిలబడ్డాడు. తన జేబులోని కవర్ను సాగర్ ముందు వుంచి.....


"దీన్ని... మీ అమ్మ మీకు ఇమ్మని చెప్పింది. నాకు మీరు ఇచ్చిన సమయానికి మీకు నా కృతజ్ఞతలు...” చేతులు జోడించి... బరువైన పాదాలతో మెల్లగా శ్రీనివాస్... ఆ గదినుండి బయటికి నడిచాడు.


సాగర్ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది డి.యస్.పి., వెంటనే బయలుదేరి రమ్మని వారి సందేశం.

టేబుల్ మీద ఉన్న కవర్‌ను మడిచి జేబులో వుంచుకొని... సాగర్ గదినుండి వేగంగా బయటికి నడిచి స్టేషన్ ముందున్న జీప్‌ను ఎక్కాడు. డ్రైవర్ జీపును స్టార్ట్ చేశాడు. జీప్ ముందుకు సాగిపోతూ వుంది.


శ్రీనివాస్ రాక... అతను చెప్పిన మాటలు... సాగర్ కు పదేపదే... గుర్తుకు రాసాగాయి. మనస్సులో ఏదో కలవరం... అనుమానం... అశాంతి.

జీప్, డి.యస్.పి. కార్యాలయం ముందు ఆగింది. సాగర్ దిగి వేగంగా డి.యస్.పి. గది వైపుకు నడిచాడు.

***

గుంటూరునుండి తిరిగి వచ్చిన శ్రీనివాస్... తన ముఖాన్ని హారతికి చూపించడానికి భయపడ్డాడు. కారణం... తనతో సాగర్ రాలేదు. ఆమె సాగర్ ను గురించి అడిగితే తాను ఆమె ప్రశ్నకు ఏమని జవాబు చెప్పగలడు?... తనకు సాగర్ కు జరిగిన సంభాసణ హారతి విని తట్టుకోగలదా!...ఆ కారణంగా స్నేహతో ఆమెను జాగ్రత్తగా చూచుకోమని... ఆమె నిదురించే సమయంలో ఆవేదనతో హారతిని చూచేవాడు శ్రీనివాస్.


మూడు రోజులుగా తన కంటపడకుండా వుండే శ్రీనివాస్... సాగర్‌ల మధ్యన ఏం జరిగి వుంటుందో వూహించలేనంత అమాయకురాలు కాదు హారతి. ఆమెకు విషయం పూర్తిగా అర్థం అయింది. సాగర్ రానందుకన్నా... తన మూలంగా శ్రీనివాస్ ని సాగర్... ఎంతగా అవమానించాడో అనే వ్యధ ఆమెను కృంగదీసింది. మందులు వేసుకోవడం... ఆహారాన్ని తీసుకోవడం మానేసింది.


స్నేహ... తన తల్లి స్థితిని శ్రీనివాస్ కు తెలియచేసింది. శ్రీనివాస్ దోషిలా తలదించుకొని హారతి గదిలోనికి ఆవేదనతో వచ్చాడు. ఆమె స్పృహలేకుండా కళ్లు మూసుకొనివుంది. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకని పల్స్ చూచాడు. చాలా వీక్ గా గోచరించింది.

శ్రీనివాస్ ఆందోళనతో... హారతిని హాస్పిటల్ కు తీసుకొనివెళ్లాడు.


డాక్టర్లు పరీక్షించి హార్టు చాలా బలహీనంగా వుందని చికిత్స చేసి, ఐసియులో వుంచారు. శ్రీనివాస్, స్నేహ హారతికి ఏమౌతుందోనని భయపడ్డారు. బాధతో ఏడ్చారు. కన్నీరు కార్చుతూ ఐసియు ప్రక్కన కూర్చున్నారు.


వైజ్ఞానికులు... వ్యాధులకు మందులను ఎన్నో కనిపెట్టారు. కానీ... మనోవ్యధకు మందును కనిపెట్టవలసి వుంది

*

డిఎస్పి ఆదేశానుసారం ఒక కేసు విషయంలో శ్రీనివాస్ తనను కల్సిన రాత్రే... సాగర్ హైదరాబాద్ వెళ్లి... వారం రోజుల తర్వాత గుంటూరుకు ఆరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు చేరాడు.


స్నానం చేసి పచ్చి సోఫాలో కూర్చున్న అతని కళ్లు టీపాయ్ పై వున్న... తనకు శ్రీనివాస్ యిచ్చిన కవర్ మీద లగ్నం అయినాయి. తన తల్లిని గురించి శ్రీనివాస్ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కవర్ ను చేతికి తీసుకొని అందులోని కాగితాలను బయటికి తీసి చూచాడు. అది... తన తల్లి హారతి తనకు వ్రాసిన వుత్తరం. చదవడం ప్రారంభించాడు.


'చిరంజీవి సాగర్ కు... మీ తల్లి శుభాశీస్సులు. నాకు శ్రీనివాస్ కు వున్న సంబంధం విషయంలో యిరుగుపొరుగువారి... ముఖ్యంగా మీ నాన్న.. వారి తరఫునవారి మాటలను విని నీవు... శ్రీనివాస్ పై ద్వేషాన్ని పెంచుకున్నావు. నేను వారితో కలసి వుండటం నీకు గిట్టక, నామీద ఈర్ష్యను పెంచుకొన్నావు. నీవు ప్రయోజకుడవయ్యేంతవరకు... మా ఇరువురినీ వాడుకొన్నావు. నీకు వుద్యోగం రాగానే... మాకు దూరంగా వెళ్లి మమ్మల్ని అసహ్యించుకొంటున్నావు.


నా అందాన్ని చూచి... నన్ను ప్రేమించినట్లు నటించి, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని... నాకడుపులో నీవు మూడు నెలలవాడిగా వున్నపుడు... నాపై మోజు తీరిన మీ నాన్న... నాకు విడాకులు ఇచ్చి వారి తల్లిదండ్రుల యిష్టానుసారంగా మరో కలిగిన యువతిని పెండ్లిచేసుకొన్నాడు. నా కడుపులో పెరుగుతున్న నీవు... నాకు.. శ్రీనివాస్ కు వున్న అక్రమ సంబంధానికి ప్రతిరూపం అని ప్రచారం చేశాడు. శ్రీనివాస్ మా పక్కింటివారి అబ్బాయి. మంచి చదువు, సంస్కారం వున్న వ్యక్తి. బ్యాంక్ ఉద్యోగి. నాకు మంచి హితుడు. స్నేహితుడు.


అవమానభారంతో విషం త్రాగి చాపబోతున్న నన్ను రక్షించాడు. తాను... నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, నా తల్లిదండ్రులను ఒప్పించి... నన్ను పెండ్లి చేసుకొన్నాడు. నీవు పుట్టేంత వరకు... నన్ను ఊరడిస్తూ.. ఆదరించి అభిమానించేవాడే కాని,.. నన్ను ఆయన తాకనే లేదు.


నీవు పుట్టిన తర్వాత... నిన్ను తన బిడ్డగా భావించి అభిమానించి ప్రేమించాడు. తన గుండెలపై నిన్ను నిద్రపుచ్చేవాడు. ఆయనలోని మానవతావాదం... నాకు భార్య బాధ్యతలను తెలిపింది. హృదయపూర్వకంగా ప్రేమతో వారికి చేరువయ్యాను. స్నేహ జన్మించింది. నీవు గతాన్ని గుర్తు చేసుకొంటే... నేను శ్రీనివాస్... నీకు అన్యాయం చేశామా... న్యాయం చేశామా అనే విషయం నీకు అర్థం అవుతుంది. నీ గురించిన మనోవ్యధ నన్ను పట్టిపీడిస్తూ వుంది. నేను ఎక్కువకాలం జీవించను. ఒక్కసారి వచ్చి నీవు నన్ను చూడగలవా!... ఈ నీ మాతృహృదయం ఆవేదనను అర్థం చేసుకోగలవా!... అభ్యర్థన నాది... నిర్ణయం నీది...


ఇట్లు

నీ తల్లి... హారతి.'


సాగర్ చేతిలోని కాగితాలు జారిపోయాయి. హృదయం వెయ్యి ముక్కలయింది. మనస్సు తల్లిని చూడాలనే కోర్కెతో... మంచులా కరిగిపోయింది. వేగంగా లేచాడు.

*

"హారతి... హారతీ...!... నీ కొడుకు సాగర్ నిన్ను చూడాలని వచ్చాడు.. గద్గద స్వరంతో ఆమె చెవి దగ్గర చెప్పాడు శ్రీనివాస్.


హారతి మెల్లగా కళ్లు తెరచి చూచింది. కన్నీళ్లతో ఆమె ముఖంలోకి చూస్తూ... "అమ్మా!... అమ్మా!... నేను నీ సాగర్‌ని వచ్చానమ్మా!..." బొంగురు పోయిన కంఠంతో చెప్పి... ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు సాగర్.


హారతి మెల్లగా కళ్ళు తెరిచింది.... శ్రీనివాస్... సాగర్... స్నేహ.... ముఖాల్లోకి చూచింది. పెదవులపై చిరునవ్వు. ఆమె చూపు చెదరక అలాగే నిలిచిపోయింది. వారి రోదన గదిలో మారుమ్రోగింది.

**

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.38 views0 comments

Comments


bottom of page