'Pragathi Premikulu episode 1' Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అంకితం..
మన హైందవ జాతి పితామహులు...
మన సనాతనాధ్వయిత వేదాంత తత్వాన్ని...
ఆధ్యాత్మిక చింతనా విధానాలను... హైందవ ధర్మ సిద్ధాంతాలను... విశ్వానికి చాటి చెప్పిన భరతమాత ముద్దుల బిడ్డ... కారణ జన్ములు...
శ్రీ రామకృష్ణపరమహంస ఏకలవ్య శిష్యులు...
కీర్తి శేషులు... అయిన
శ్రీ వివేకానందస్వామీజి వారి దివ్య పాదపద్మములకు... అంకితం.
చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
"ఈశ్వర్..! బయలుదేరుదాం." జీప్ లో కూర్చుంటు అంది బి.డి.ఓ. అమృత.
ఈశ్వర్ తన స్థానంలో కూర్చొని జీప్ ను స్టార్ట్ చేశాడు. "ఆ పుస్తకాలను అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు పంచండి. అందరూ తప్పక చదవాలి.” నవ్వుతు చెప్పింది అమృత.
మండల సమావేశానికి వచ్చి, ఆమె జీప్ చుట్టూ వున్న వారంతా తలలు ఆడించారు. అందరికి బై చెప్పింది అమృత. జీప్ మండల కార్యాలయ ప్రాంతాన్నిదాటి రోడ్డులో ప్రవేశించింది.
ఇరవై నిముషాల తర్వాత జీప్ హైవే పైకి వచ్చేసింది.
సమయం సాయంత్రం ఆరుగంటల ప్రాంతం. వారు చేరవలసిన గమ్యానికి ముక్కాలు గంట పడుతుంది. మేఘావృతంగా ఉన్న ఆకాశం నుండి సన్నటి తూర ప్రారంభమయింది. ఈశ్వర్ రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ఒక కారును దాటి ముందుకు వెళ్ళాడు. ఆ కారు బ్యానెట్ తెరిచి వుంది. డ్రైవర్ వంగి యంత్రాన్ని పరిక్షిస్తూ ఉన్నాడు.
ప్రక్కన ఒక యువకుడు నిలబడి ఆకాశానికేసి చూస్తూ ఉన్నాడు. వాన వేగం హెచ్చింది.
బహుశా... ఆ కారులో ఏదో ప్రాబ్లం అయ్యి వుండవచ్చు. సాయం కావాలా అని అడగటం ధర్మంగా భావించింది అమృత. కారును వెనక్కు త్రిప్పమని ప్రక్కనే ఉన్న ఈశ్వర్ తో చెప్పింది అమృత. రెండు వైపులా చూచుకొని ఈశ్వర్ బండిని రివర్స్ లో వెనక్కు నడిపాడు. జీప్ కారును సమీపించింది. అమృత జీప్ దిగి ఆ కారును సమీపించింది.
ఆ యువకుడు దగ్గరగా వచ్చిన ఆమెను చూచాడు.
“సార్… కెన్ ఐ హెల్ప్ యు..?” వందనంగా అడిగింది అమృత.
“యింజన్లో ప్రాబ్లమండి. మీరేం సహాయం చేయగలరు..?” నవ్వుతూ అన్నాడు వివేకానంద.
"మీరు ఎక్కడికి వెళ్ళాలి..?”
"కడప."
మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో మా జీప్ లో రావచ్చు. మా డ్రైవర్ కు తెలిసిన మంచి మెకానిక్ వున్నాడు. మనం దిగిపోయి వారిరువురినీ యిక్కడికి పంపుదాం. ఆ మెకానిక్ మీ బండిని బాగు చేయగలడు.” తను చెప్పదలచుకొన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది అమృత.
ఆమె తత్వానికి, మాటలకు వివేకానంద సంతోషించాడు.
“బాలా..! నీవు కార్లో కూర్చో. నేను వీరితో వెళ్ళి ఆ మెకానిక్ ని పంపుతాను. బండి రిపేర్ కాగానే నీవు వెనక్కు.. మన వూరికి వెళ్ళిపో.” జేబునుంచి పర్స్ తీసి, రెండువేలు బాలాకు యిస్తూ... “దీన్ని నీ ఖర్చులకు డీజిల్కు వుంచుకో.” అన్నాడు వివేకానంద.
బాలా డబ్బును అందుకొన్నాడు. “అలాగే సార్” అన్నాడు.
అమృత డ్రైవర్ సీట్లో జీప్ లో కూర్చుంది. డ్రైవర్ ఈశ్వర్ వెనక సీట్లో కూర్చున్నాడు. “రండి సార్ కూర్చోండి.” వివేకానందను ఆహ్వానించింది అమృత.
వివేకానంద ఆమె ప్రక్క సీట్లో కూర్చున్నాడు. అమృత జీప్ ను స్టార్ట్ చేసింది. వర్షం ఎక్కువయింది. వైపర్స్ ను ఆన్ చేసింది. కళ్ళకు వున్న అద్దాలను తీసింది.
ముక్కుకు సూటిగా చూస్తూ జీప్ ని వేగంగా నడపసాగింది.
చేతి రుమాలుతో ముఖాన్ని తుడుచుకొని వివేకానంద అమృతను పరీక్షగా చూచాడు. ఏకాగ్రతతో అమృత జీపు నడుపుతూ వుంది.
"మేడమ్..!”
“చెప్పండి.”
“ఇక్కడి నుంచి మీ వూరు ఎన్ని కిలోమీటర్లు..? మెల్లగా అడిగాడువివేకానంద.
"40"
“ఓ... ఆఁ... బైదాబై... నా పేరు వివేకానంద.” నవ్వుతూ చెప్పాడు.
“అమృత” దృష్టిని మరల్చకుండా అతను తన పేరును అడగక ముందే చెప్పేసింది.
“ఓ... నైస్ నేమ్.” మెల్లగా అనుకొన్నాడు వివేక.
“ఏమన్నారు..!” క్షణం సేపు వివేక ముఖంలోకి చూచింది అమృత.
తను మెల్లగా అన్నది విని వుంటుందేమో అన్న సందేహంతో "మీ పేరు చాలా మంచిపేరు” అన్నాడు.
మరోసారి వివేక ముఖంలోకి క్షణంసేపు చూచి దృష్టిని త్రిప్పి “మీరు ఎవరి ఇంటికి వెళ్ళాలి..?" అడిగింది అమృత.
“ఇంటికి కాదండి స్టేషన్ కి.”
“రైల్వే స్టేషన్ కా.. ఓకే నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను.”
“రైల్వే స్టేషన్ కి కాదండి. పోలీస్ స్టేషన్ కి.”
అమృత ఆశ్చర్యంతో వివేకానంద ముఖంలోకి చూచింది.
“ట్రాన్స్పర్ మీద ఈ వూరికి వచ్చాను. నా హోదా యస్.ఐ. మరి మీరేం చేస్తుంటారో నేను తెలుసుకోవచ్చా..!”
"బి.డి.ఓ."
"ఓ... మీరు బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసరా..!"
“అవును.”
పరస్పర పరిచయాలు ముగిసిపోయాయి. యిరువురి హృదయాల్లో ఒకే భావన. ఇక అడిగి తెలిసికోవలసినదంటూ ఏమీ లేదని.
“సార్... మీకు పెళ్ళయిందా..!" వెనక వున్న ఈశ్వర్ అడిగాడు.
యిది అప్రస్తుతమైన ప్రశ్న అనుకొంది అమృత.
"ఈశ్వర్ ఆ విషయం నీకు యిప్పుడు అవసరమా..!" మందలింపు ధ్వనించింది అమృత మాటల్లో.
ఆ యిరువురినీ చూచి నవ్వుతూ, “కాలేదండి” అన్నాడు వివేకానంద.
కొన్ని క్షణాల తర్వాత...
"మిష్టర్ ఈశ్వర్..! మీ వూరిని గురించి మీ అభిప్రాయం ఏమిటి..?”
“మా వూరికేం సార్ బంగారంలాంటి వూరు.” నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.
“ప్రతి ఒక్కరికీ వారి సొంతవూరు బంగారమే..!” అంది అమృత.
కారు ట్రబుల్ ఇవ్వగానే వివేకానంద తను చార్జి తీసుకొనవలసిన స్టేషన్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి వెహికల్ని పంపవలసిందిగా చెప్పాడు.
వూరికి పది కిలోమీటర్లు దూరంలో అమృతకి జీపు పోలీస్ జీప్ ఎదురయింది. కొద్ది నిముషాల్లో రొండూ సమీపించాయి.
"మేడమ్..! జీపును ఆపండి. మా జీప్ వచ్చింది. నేను దాంట్లో వెళ్ళిపోతాను.”
“ఎక్కడికి..?"
“అదే మీ వూరికి.”
“వర్షంగా వుందే..!"
"ఫరవాలేదు. మా అమ్మమ్మ చెబుతూ వుంటుంది. సంవత్సరంలో ఒక్కనాడైనా కురిసే వర్షం తడవటం మంచిదని.”
“యింతకీ మీ వూరేదో చెప్పలేదు.”
“రాజమండ్రి.”
అమృత జీప్ ఆపింది. వివేకానంద దిగాడు. ఎదురు వైపున వస్తున్న జీప్ వైపు చేతిని ఎత్తి చూపించాడు. ఆ డ్రైవర్ విషయాన్ని అర్థం చేసికొని బండిని త్రిప్పుకొని వచ్చి అమృత జీపు ముందు ఆపాడు.
వివేకానంద అమృత వైపుకు వచ్చి,
“మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వానలో తడుస్తూ వచ్చి, అడిగి సహాయం చేశారు.” నవ్వుతూ చెప్పాడు.
“యిటీజ్ మై ప్లజర్. నో మెన్షన్.” చిరునవ్వుతో చెప్పింది అమృత.
తన ముందున్న డైరీలో నుంచి ఒక పుస్తకాన్ని తీసి వివేకానందకు చూపిస్తూ, "దీన్ని తీసుకొండి. తీరిక సమయంలో చదవండి. మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. నా సెల్ నెంబర్ ***” వినయంగా చెప్పింది అమృత.
"థ్యాంక్యూ..!" పుస్తకాన్ని అందుకొన్నాడు వివేకానంద.
అమృత జీప్ స్టార్టు చేసి ముందుకు వెళ్ళిపోయింది. వివేకానంద డిపార్టుమెంటు జీప్లో కూర్చున్నాడు. వానలో తడవకుండా మధ్యకు మడచి ప్యాంటు జేబులో పెట్టుకొన్న పుస్తకాన్ని బయటికి తీశాడు. డ్రైవర్ జీప్ ను స్టార్ట్ చేశాడు. వివేక కవర్ పేజీ పైనున్న అక్షరాలను చూచాడు.
'స్వామీజీ వివేకానంద జీవిత చరిత్ర'
బంగారు రంగులో ముద్రితమైన ఆ అక్షరాలు వివేకానందకు ఎంతగానో ఆకర్షించాయి. పుస్తకం సాంతం చదివి ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకొన్నాడు.
అరగంటలో జీప్ ఒక ఇంటి ముందు ఆగింది. “సార్ యిదే మీ క్వార్టర్.” వినయంగా చెప్పాడు డ్రైవర్. వెళ్ళి తలుపుకు వేసివున్న తాళబుఱ్ఱను తీశాడు.
వివేకానంద యింట్లోకి ప్రవేశించాడు. వాన కారణంగా మరచి కార్లో వున్న తన సూట్కేస్ను తనతో తీసుకు రాకుండా వచ్చాడు. పర్స్ తెరిచి ఐదువందల నోటు డ్డ్రైవర్ కు ఇచ్చి “ఓ లుంగీ, టవల్ తీసుకొని వస్తావా..! ఆ... మీ పేరేమిటి..?” అడిగాడు వివేకానంద.
“పది నిమిషాల్లో వస్తాన్ సార్. పేరు మస్తాన్.”
నోటును అందుకొని డ్రయివర్ జీప్లో కూర్చొని వెళ్ళిపోయాడు.
వివేకానంద లైట్లు వేసి అన్ని గదులనూ చూచాడు. అది డబుల్ బెడ్రూమ్ ఫర్నిష్డ్ హౌస్.
ఒక కుటుంబం ఆనందంగా వుండే దానికి తగిన రీతిలో అన్ని హంగులు క్రమంగా అమరి వున్నాయి.
వాకిట్లో జీప్ ఆగిన శబ్దం విని వరండాలోకి వచ్చాడు.
“సార్..! యీనే మెకానిక్ ఏడుకొండలు. మా బండిలో యీనా, నేను వెళ్ళి మీ కారును రిపేర్ చేసి వూరికి పంపించి వస్తాం సార్. యిది మా అమ్మగారి ఆజ్ఞ.” నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.
“మంచిది ఈశ్వర్. కార్లో నా సూట్కేస్ వుంది. దాన్ని తీసుకొని రావాలి.”
“తప్పకుండా తెస్తాన్ సార్.”
ఆ యిరువురూ జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. అమృత వివేకానంద కళ్ళముందు నిలిచింది. ఆమె తన కారు దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు, ప్రయాణంలో యిరువురి మధ్యన జరిగిన సంభాషణ, తను జీప్ దిగిన తర్వాత ఆమె చెప్పిన మాటలు, యిచ్చిన పుస్తకం అన్నీ క్రమంగా గుర్తుకు వచ్చాయి.
హాల్లోకి వచ్చి సోఫాలో వుంచిన ఆ పుస్తకాన్ని చూచాడు. ఆమె మాటతీరు, సహాయ చింతన, మాటలో వున్న నిజాయితీ, స్నేహభావం వివేకానందకు ఎంతగానో నచ్చాయి.
డ్రైవర్ వచ్చాడు. కవర్ ను చేతికి అందించాడు. మిగతా చిల్లర యివ్వబోయాడు. "వుంచుకోమని చెప్పాడు వివేక.
వుదయం ఏడున్నరకల్లా వస్తానని చెప్పి, వివేక అనుమతితో అతను వెళ్ళిపోయాడు. కవర్లోని బట్టలను చేతికి తీసికొని, వివేకానంద తలుపు మూసి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ వుండగా భోజనం ఎక్కడ చేయాలనే ప్రశ్న మదిలో కలిగింది. బయటికి వెళ్ళాలంటే బట్టలు విప్పిన, తడిసిన బట్టలే వున్నాయి తన దగ్గర. లుంగీ, విప్పిన షర్టు తగిలించుకొని వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. బాత్రూమ్ నుండి బయటికి వచ్చాడు.
కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపును తెరిచాడు. ఒక వ్యక్తి చేతిలో క్యారియర్ పట్టుకొని నిలబడి వున్నాడు.
వివేకానందను చూడగానే ఆ వ్యక్తి “గుడ్ యీవినింగ్ సార్..." నవ్వుతూ చెప్పాడు.
"మీరు..!" ఆశ్చర్యంగా అడిగాడు వివేక్.
అతని మాటలు పూర్తికాక మునుపే ఆ వ్యక్తి, "మా చిన్నమ్మగారు మీకు భోజనాన్ని పంపించారండే.” నవ్వుతూ చెప్పాడు.
"మీ చిన్నమ్మగారూ..!"
"అమృతమ్మగారండే.” అతని జవాబు.
వివేకానంద అమృత తత్వాన్ని తలచుకొని ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి లోనికి నడిచి, సోఫా ప్రక్కన క్యారియర్ను వుంచి, "వెళ్ళొస్తానండే.” చెప్పి, చేతులు జోడించి వెళ్ళిపోయాడు.
క్యారియర్ ను డైనింగ్ టేబుల్ మీద వుంచి హాల్లోకి వచ్చాడు వివేకానంద. ఈశ్వర్ జీప్ వచ్చి వివేక్ ను సమీపించి, "సార్..! బండిని రిపేర్ చేసి రాజమండ్రికి పంపించాము. యిదిగోండి మీ సూట్కేస్.” వివేక్ చేతికి అందించాడు.
అతనికి ధన్యవాదాలు చెప్పాడు వివేక్. ఈశ్వర్ వెళ్ళిపోయాడు.
తలుపు బిగించి, భోంచేసి, పడకపై వాలి అమృత యిచ్చిన పుస్తకాన్ని చేతికి తీసుకొని చదవడం ప్రారంభించాడు వివేకానంద.
'నా మాట'
శ్రీ స్వామీజీ వివేకానంద జీవిత చరిత్రను చదివాను. పబ్లిషర్సు, ది ప్రసిడెంట్, శ్రీరామకృష్ణమట్, మైలాపూర్, చెన్నై, ఆ మహోన్నతులకు నా ధన్యవాదాలు.
స్వామీజీవారి చరిత్రను సంక్షిప్తంగా, పై అమూల్య గ్రంథం ఆధారంగా, యథాతథంగా, కొద్ది పేజీలలో వ్రాసి, ప్రచురించి, భావి భారతపౌరులైన అందరి విద్యార్థుల చేతా చదివించాలని యీ సాహసానికి పూనుకొన్నాను. ప్రచురించాను. కొన్ని స్కూళ్ళకు పంచాను. త్వరలో జిల్లాలోని అన్ని స్కూళ్ళకూ పంచుతాను. తర్వాత
మిగతా జిల్లాలకు పంచాలని ఆశ.
యీ మన భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించారు. వారి సుచరిత్రలను మనకు ఆదర్శంగా మిగల్చి వెళ్ళిపోయారు. నేటి ప్రతి విద్యార్థి, వ్యక్తి తెలిసికొనవలసిన అంశాలు… మన హైందవ జాతి సంస్కృతిని, మన అధ్వయిత సిద్ధాంత తత్వాన్ని, మన పూర్వీకులలో వుండిన యిప్పుడు మన అందరి మధ్యనా
వుండవలసిన భిన్నత్వంలో ఏకత్వ భావాన్ని, యీ దేశపు ప్రతి పౌరుడూ తను, తనవారు ఎలాంటి వారన్నది ఎరిగి, వారి భావి జీవితాన్ని ధర్మ మార్గాన వర్తింపచేసి, కన్న తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన యీ భారతావనికి గర్వకారకులు కావాలని, మన తల్లి భారతమాత, 'ఆ తల్లి కోరేది, మన అందరి నుండీ యిదేనని' విశ్వసించి
మన జీవిత లక్ష్యం, గమనం అందరికీ ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలను కోరుతున్నాను.
మీ సోదరి అమృత..
=================================================================================
ఇంకా ఉంది...
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments