'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ మూడవ(చివరి) భాగం
'Premante Thelusa Miku - 3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha
'ప్రేమంటే తెలుసా మీకూ - 3' తెలుగు కథ
రచన : పూడిపెద్ది ఉగాది వసంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ
అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. కొద్దిరోజులకు పుట్టింటికి వచ్చిన అతని కూతురు కుమారి తనకు, భర్తకు మధ్య సఖ్యత లేదని చెబుతుంది.
భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు సహజమేనని కూతురికి నచ్చజెబుతారు, సీతారామయ్య, సీత దంపతులు.
ఇక 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ మూడవ భాగం చదవండి..
"నాన్న, మిమ్మల్నో మాట అడుగుతాను, ఏమి అనుకోరుగా " అంది కుమారి.
ప్రేమగా కుమారి తల నిమిరి, కళ్ళతోనే సౌంజ్ఞ చేసారు అడగమన్నట్టు.
"అమ్మది, మీది ప్రేమ కధ చెప్పండి నాన్నా" ఉత్సుకతగా అడిగింది కుమారి.
"చెపుతాను కానీ, మా ప్రేమ కధ కన్నా, నీకు ముందు ఇంకో ప్రేమకథ చెప్పితీరాలి రా. చెప్పనా ?"
సరే అన్నట్టుగా, బొటనవేలితో థంప్స్ అప్ చూపించింది.
“మనింటి దగ్గరున్న బస్తీలో దేవుడమ్మ, ఈశ్వర్ రావు ఉండేవారు. మొదటి రెండు పెళ్లిళ్లు విఫలమవడంతో, దేవుడమ్మని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు ఈశ్వరరావు. దేవుడమ్మ కూడా ఈశ్వరరావు ని గాఢంగా ప్రేమించింది.
వాడికి తాగుడు అలవాటుంది. రాత్రిపూట తాగొచ్చి దేవుడమ్మతో గొడవపడి, బాగా కొట్టేవాడు. అయినా దేవుడమ్మ లో ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. తాగనప్పుడు మాత్రం దేవుడమ్మని ఓ దేవతగా చూసుకునేవాడు. దేవుడమ్మకి వాణిశ్రీ పాటలంటే ఇష్టమని, ఓ రేడియో కొనిచ్చాడు. సడెన్ గా ఓరోజు గుండెపోటొచ్చి దేవుడమ్మ చనిపోయింది. వాణిశ్రీ పాటలు లౌడ్ స్పీకర్ లో పెట్టి, దేవుడమ్మకి తుది వీడ్కోలు పలికాడు.
తనకిష్టమైన పాటలు వింటూ తాను పయనమవ్వాలని వాడి కోరిక. అందరు ఈసడించుకున్నారు, శవం ఉండగా ఆ సినిమా పాటలేంటి అని. తనకి గుర్తుగా ఆ బస్తీకి "దేవుడమ్మ బస్తీ " అని పేరు పెట్టేడు.
అంతా విని, కన్నీరు పెట్టుకుంది కుమారి.
"ఎంత గొప్ప ప్రేమికులు కదా నాన్నగారూ" అంది తేరుకుని.
"వారి ప్రేమ " గొప్పది" అని అందరు ఎందుకు అనుకుంటున్నారో తెలుసా తల్లీ? వారిద్దరూ ఒకరి హావభావాలని ఒకరు బాగా అర్ధం చేసుకుంటూ, వారిలో ఉన్న ప్రేమకి ఏ మలినమూ అంటకుండా, ప్రేమని పెంచుకుంటూ పోయారు. పైగా ఇద్దరూ ఏమి చదువుకోలేదు కూడానూ! కానీ ఒకరిని ఒకరు బాగా చదువుకుని, పట్టి విడవని ప్రేమబాట పట్టి, పట్టభద్రులయ్యారు”
******
" ఇపుడు నాది, అమ్మది ప్రేమ కథ చెపుతాను విను”
“మిట్టమధ్యాహ్నం పన్నెండయ్యింది! వైశాఖమాసపు ఎండ చురకలు వేస్తోంది!
భీమునిపట్నం సింహద్వారంలోకి ప్రవేశించింది ఇటుకరంగు చెవర్లెట్ కారు. భీమునిపట్నంలో రోడ్లన్నీ, అసలు ఆవూరిలో మనుషులున్నారా అన్నట్టున్నాయి. మాంచి ఎండాకాలం! ఓ రెండ్రోజుల్లో రోహిణి కార్తెలు మొదలవుతాయి.
బస్సు స్టాండ్ మదుం దాటి, ఘంటస్తంభం, చిన్నబజారు, కోఆపరేటివ్ స్టోర్స్ అన్ని దాటి, పెద్ద అగ్రహారంలోకి వచ్చింది ఇటుకరంగుచెవర్లెట్ కారు. డ్రైవర్ కారు నడుపగా, వెనుక సీట్లో దర్జాగా ఓ పాతికేళ్ల కుర్రాడు కూర్చున్నాడు. ఆవేడికి రోడ్ మీద దోశ వేసినా చక్కగా కాలుతుంది, అలా ఉంది ఎండవేడిమి. పిట్టా, పురుగు కూడా సంచరించడం లేదు. అందరిళ్ళ తలుపులు మూసేసి ఉన్నాయి.
ఎండవేడిమి తిప్పికొట్టడానికి, వట్టివేళ్ల చాపల పరదాలను కప్పుకున్నాయి. వారితో పాటు తెచ్చుకున్న మంచి నీళ్లసీసా, తగరపువలస కూడా రాక ముందే ఖాళి అయిపొయింది. బాగా దప్పికవుతోంది ఆపాతికేళ్ల నవయవ్వనుడికి. కారుని నెమ్మదిగా పోనిమ్మని డ్రైవర్తో చెప్పి, అటు ఇటు చూడసాగాడు, అగ్రహారంలో కాస్త దూరం వచ్చాక, ఓ ఇంటి తలుపు తెరిచే ఉండడం గమనించాడు, అక్కడే కారు ఆపమని, కారుదిగి, ఆ ఇంటిని తేరిపారా పరిశీలించి చూసాడు ఆ అందమైన పాతికేళ్ల కుర్రాడు సీతారామయ్య.
అటుఇటు, ఎత్తుఅరుగులు, గుమ్మంలో పచ్చగా ఆవుపేడతో చల్లిన కళ్ళాపి, దానిమీద ఓఅందమైన అమ్మాయి తీర్చి దిద్దిందా? అన్నట్టుండే చక్కని ముగ్గు. గుమ్మానికి పచ్చని పసుపు, దానిపై ఎర్రని కుంకుమబొట్లు, ఓపండు ముతైదువ ముఖానికి పసుపురాసుకుని, విచ్చ రూపాయంత బొట్టు పెట్టుకున్నట్టుగా ఉన్నాయి.
పచ్చని మామిడి తోరణాలు వేలాడుతూ, వచ్చేపోయే వారిని పలకరిస్తున్నట్టున్నాయి! గుమ్మానికి రెండు వైపులా తులసి వనం తన పచ్చదనంతో ఆహ్వానం పలుకుతుంటే, గన్నేరు, నందివర్ధనం, ముద్దమందార పూలమొక్కలు తలలూపుతూ, లోనికి రారమ్మని స్వాగత గీతాలాలపిస్తున్నట్టున్నాయి!
ఈఇంటి వీధి గుమ్మము చుస్తే, ఇంటి వారు చాలా పధ్ధతిగల వారిలా అనిపించి, వారింటి ముందు ఆగాడు సీతారామయ్య.
బ్రహ్మముడి వేయడానికి బ్రహ్మ రాతల గీతల లెక్కలు సరి చూసుకుంటున్నట్టున్నాడు!
“అయ్యా ఎవరండీ ఇంట్లో, కాస్త దప్పిక తీరుస్తారా, మేము పొరుగూరు నించి, పనిమీద ఈవూరొచ్చాము” లోపలున్న వారికి వినిపించేలా ఉందా పిలుపు.
సీతారామయ్య తెల్లగా పొడుగ్గా పెద్దపెద్దకళ్ళు, సూటిముక్కు, పలచనిపెదాలు, నీట్ గా షేవ్ చేసుకుని ఉన్నాడేమో, చెక్కిళ్ళు నిగనిగలాడుతున్నాయి. తెల్లని ఖద్దరు ప్యాంటు, తెల్లని ఖద్దరు చొక్కా వేసుకుని, నల్లని బూట్లు వేసుకుని, హుందాగా ఉన్నాడు.
లోపలినించి, సన్నంగా పొడుగ్గా ఉన్న ఓపెద్దాయన,. తెల్లని పంచకట్టుతో, పైన ఓ కండువా సవరించుకుంటూ బయటికొచ్చి వీరిని చూసి, మర్యాదస్తుల్లాగే ఉన్నారనుకున్నారేమో, లోపలికి రమ్మని పిలిచారు.
అతనిపేరు సోమేశ్వరరావు, ఆఇంటి పెద్ద.
నాలుగిళ్ళ చావిడీ, వసారాలో రెండు పట్టెమంచాలు వేసి, తెల్లని దుప్పటి పరిచి ఉంచారు. ఆపక్కనే ఓ పడక కుర్చీ, ఎదురుగా ఓముక్కాలి పీట ఉన్నాయి.
సాంబ్రాణి ధూపం, కర్పూర హారతి, అగర్బత్తి పొగ అన్ని కలిపి ఓ చక్కని సువాసన వెదజల్లుతోంది ఇల్లంతా, అది ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది.
పక్కనే ఉన్న నూతిలోంచి నీరు తోడుకొని, కాళ్ళు, మొహం కడుక్కుని, అక్కడే కొక్కేనికి తగిలించి ఉన్న తుండుగుడ్డతో మొహం తుడుచుకుని, పట్టెమంచంపై కూర్చున్నాడు సీతారామయ్య.
లోపల్నించి, వీణవాదనం వినిపిస్తోంది, దాంతోపాటే సన్నని గొంతు శృతి కలుపుతోంది. "నగుమోముకనలేని " త్యాగరాయ కీర్తన శ్రావ్యంగా వినిపిస్తోంది.
"అమ్మాయ్, సీతా! అతిధిలొచ్చారు, కాస్త దప్పిక తీసుకు రామ్మా" అని పురమాయించారు పెద్దాయన.
వీణ, గానం రెండూ ఆగిపోయాయి. వెనువెంటనే గజ్జెలూ, గాజులూ జుగల్బందీ జరిపాయి!
ఘల్లుఘల్లుమన్న మువ్వలసవ్వడి, ముందు దగ్గరగా వినిపించి, తర్వాత దూరమయ్యింది. మళ్ళీ ఆ సవ్వడి మరో పది నిమిషాల్లో ఆంతకంతకూ దగ్గరయింది. వెనువెంటనే గాజుల చప్పుడు అతి సమీపంగా వినిపించడంతో బాటు, చందన పరిమళాల్ని కూడా, మోసుకొచ్చింది.
ఇంతలో, అటుఇటు రెండు బంగారుగాజుల మధ్యలో ఎరుపురంగు మట్టిగాజులను వేసుకున్న ఓసన్నపాటి బంగారు తీగలాంటి చేయి, మంచినీళ్లు, మజ్జిగ ఉన్న రెండు వెండిగ్లాసులను, ఓపళ్లెంలోతెచ్చి, అక్కడే ఉన్న ముక్కాలిపీట మీద ఆపళ్లెం పెట్టేసి లోనికి తుర్రుమంది.
అయినా సరే, సీతారామయ్య చూపు ఆ అమ్మాయిమీద దుర్భిణి వేసేసింది. బక్క పలచగా ఉంది ఆ అమ్మాయి, పచ్చని మేనిఛాయ, పరికిణీ, ఓణీవేసుకుంది.
మంచినీరు, మజ్జిగ తాగాక ప్రాణంతెప్పరిల్లింది. అప్పుడు ఉభయకుశ లోపరి అయ్యాక, ఒకరి గురించి ఒకరు కలబోసుకున్నాక, ఆయన ఆతిధ్యానికి కృతజ్యతలు తెలియజేసి, సెలవుతీసుకుని, బయటి కొచ్చాడు సీతారామయ్య.
ఇంటి బయటే వేచి ఉన్న డ్రైవరుని, కారు తీయమని, అక్కడ ఆపి ఉన్న ఇటుకరంగు చెవర్లెట్కారు ఎక్కి, వెళ్ళిపోయాడు సీతారామయ్య.
***
కొన్నాళ్ళకి, మళ్ళీ, అదే ఇటుకరంగు చెవర్లెట్ కారు, ఆ అగ్రహారానికి వచ్చి, ఎత్తరుగుల ఇంటి ముందు ఆగింది. ఈసారి సీతారామయ్య. ఒక్కడే రాలేదు, వెంట ఓ పెద్దాయన, ఓపెద్దావిడ, ఓ యువజంట కూడా ఉన్నారు.
వచ్చినవారికి తాగడానికి కొబ్బరినీళ్లిచ్చి, అదే పట్టె మంచాలపై కూర్చోబెట్టారు. పళ్ళు, ఫలహారాలువచ్చాయి, కానీ, కతికితే అతకదని, ఎవరు ఫలహారాల జోలికిపోలేదు, ఈలోగా, చిక్కని, చక్కని, ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ అందించారు అతిధులకు. అందరూ, పాలఘాట్ కాఫీని తృప్తిగా ఆస్వాదించారు.
"అమ్మాయిని తీసుకురా అన్నపూర్ణా!” అని లోనికి చూస్తూ, చెప్పేరు సోమేశ్వరరావు.
“అయ్యో అవేమి వద్దులెండి, మాఅబ్బాయి సీతారాముడు అమ్మాయిని చూడ్డమూ, నచ్చుకోడమూ రెండూ కూడా జరిగిపోయాయి కదా, అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి, నాకూ ఆడపిల్లలున్నారండీ. వారి సాధకబాధకాలు క్షుణ్ణంగా ఎరిగినవాడినే!” అన్నారు, సదరు సీతారాముడి తండ్రి కృష్ణమూర్తిగారు.
ఇద్దరు ఉభయకుశలోపరి అయ్యాక, ఒకరి వివరాలు ఒకరు పంచుకున్నారు..
సోమేశ్వరరావు తనకి ఇద్దరు అమ్మాయిలనిన్నూ, అప్పుడు సీతారామయ్యకి మజ్జిగ తెచ్చిచ్చిన అమ్మాయి, పెద్దమ్మాయి సీత అని, చిన్నమ్మాయి సరస్వతి, స్కూల్కెళ్లిందనీ చెపుతూ, వారిద్దరిమధ్య ఏడు సంవత్సరాల వయసు తేడా ఉందని చెప్పారు. ఆయన అక్కడే పంచాయతీ ఆఫీసు లో గుమాస్తాగిరీ వెలగబెడుతున్నారని చెప్పేరు.
కృష్ణమూర్తిగారు కూడా తనకుటుంబం గురించి వివరంగా చెప్పారు.
“తనకి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు అని, వారిది ఎలమంచిలి అని, తాను స్థిరస్థారుగా పనిచేస్తున్నానని. పెద్దబ్బాయికి, అమ్మాయిలకి వివాహం అయిందని, సీతారాముడే పెళ్ళన్నప్పుడల్లా వాయిదాలు వేస్తుండడంతో, ఆగామనీ“ చెప్పారు.
సీతారాముడి అంతరంగంలో ఆలోచనలు తరంగాల్లా సాగిపోతున్నాయి.
‘తన కాంట్రాక్టు పనుల్లో, తనకుండే ఒత్తిడిని మరిచిపోవాలంటే, తనమనసు అర్ధం చేసుకుని, ఇంటికొచ్చేసరికి, హాయిగొలిపే వింజామరలా, ఉండే అమ్మాయయితే, బాగుణ్ణని తనఆలోచన! ఇంతవరకు చూసిన అమ్మాయిల్లో, తనకి అలాంటి వారు తారసపడలేదు. సీతని చూడ్డానికి ముందే ఆమె శ్రావ్యమైన గానం విన్నాడు,
తర్వాత, తనలో మంచి, మర్యాద, భయం, భక్తి అన్ని కలబోసిన సంస్కారం చూసాడు. ఎందుకో ఆనాడే అనిపించింది, ఈ అమ్మాయి తన భార్య అయితే తన జీవితం ఓ అందమైన పాటలా సాగిపోతుందని. “తొలి ప్రేమ” అంటే ఇదేనేమో? ఏమో అదంతా తనకి తెలీదు కానీ ఆనాడు కాంట్రాక్టు పనిమీద భీమిలి వెళ్లడం మంచిదయింది, తన మనసు కోరుకునే అమ్మాయిని చూడగలిగాడు’.
అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు తరచి, తెరిచి ఉభయులూ మాట్లాడుకున్నారు, ఇద్దరిపద్ధతులూ, సంప్రదాయాలు కలిశాయని రూఢి పరచుకున్నాక, శుభస్యశీఘ్రం అని సంబంధం ఖాయ పరుచుకున్నారు
చావిడీలోకి తెచ్చి కూర్చోబెట్టగానే సిగ్గుల మొగ్గే అయింది సీత. కన్నార్పడం కూడా మరిచిపోయేడు సీతారాముడు, అందరు తన వైపు చూస్తుండడం తో, సీత సిగ్గు కాస్త సీతారాముడి చెంతకి కూడా చేరింది.
నెమలి పించం రంగు పావడా, చెమ్కీ బుటాలతో ఉన్న ఎరుపు రంగు రవిక, బంగారు వర్ణం ఓణీ, దిద్దులు జుంకాలు, మెడలో బంగారు గొలుసుకి, ఎరుపు నీలం పొడులతో తాపడం చేసిన నెమలి బొమ్మ లాకెట్, చేతులకి బంగారు గాజుల మధ్యలో ఎరుపు, నీలం రంగు మట్టిగాజులు.
దబ్బపండులాంటి శరీరంపై ఇవన్నీ ఎంతో చక్కగా ఇమిడిపోయాయి. సీత చక్కదనాన్ని ద్విగుణీకృతంచేసాయి.
“చాల బాగా పాడావమ్మాయ్! నువ్వూ నీ పాటా నాకు బాగానచ్చాయి, మరి నేను నీకు నచ్చానా? నేను పుట్టగానే నాపేరులో చేరిపోయేవు, గడుసుదానివే” చమత్కరించాడు సీతారాముడు.
సిగ్గుల మొగ్గే అయింది సీత.
***
సీత–రాముడి కళ్యాణం, ఐదురోజులు, అంగరంగ వైభవంగా జరిగింది. భువిలో సీతారాములు మళ్ళీ మనువాడారా? అన్నట్టుందన్నారు చూసినవారంతా.
సీతని, సీతపాటని కూడా అల్లారుముద్దుగా చూసుకున్నాడు సీతారాముడు. సీత కచేరీలు కూడా ఏర్పాటు చేయించేడు. ఏడువారాల నగలూ చేయించాడు, పట్టు చీనాంబరాలు దండిగా కొన్నాడు, సీత కూడా, అతని మనసెరిగి అన్ని చేసి పెట్టింది, ఇద్దరు చిలకగోరింకల్లా అన్యోన్యంగా ఉన్నారు.
ఐదుగురు పిల్లలకి అమ్మనాన్న అయ్యారు, ఇద్దరబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు. పిల్లల తోడిదే ప్రపంచమైపోయింది ఇద్దరికీనీ.
పిల్లలుపుట్టేక, సీతకి చేతినిండా పనే. "పాట" స్థానాన్ని, పిల్లలతో "పాట్లు" ఆక్రమించేసుకున్నాయి. పాటకి పీట పక్కకి జరిగింది. వీణ ఓమూలకి చేరి మూగబోయింది.
తన కాంట్రాక్టు పనులలో రోజంతా బిజీ, ఇంటికొచ్చేక పిల్లలతో ఆటపాటలు, ఇదే సీతారామయ్య దిన చర్యగా మారింది. మరి కుటుంబం అంటే ఇదే!
రానురాను పెరిగిన కుటుంబం, ఖర్చులు, వ్యాపారంలో ఒడుదుడుకులు, చిరాకులు పరాకులు పెరిగాయి ఇద్దరి మధ్య. సీతారాముడుకి కోపం బాగా ఎక్కువైపోయింది. ఏ విషయంలో కోపం వచ్చినా, భార్యల మీదే ఆ కోపాన్ని చూపే భర్తల జాబితా లో చేరిపోయేడు సీతారామయ్య.
ముందే ఎంతో సహనశీలి అయినసీత, మరింత సహనాన్ని తన స్వంతం చేసుకుని, కష్టాల్ని, కన్నీటిని కడుపులో దాచుకోవడంలో నిజంగా మహాసాత్వి సీతే అయింది.
"నీకు రానురాను నామీద ప్రేమ పూర్తిగా పోయింది, పిల్లలే లోకంగా ఉంటున్నావు"
ఒకసారి కాదు, చాలసార్లు ఈమాట అతని నోటివెంట వినివిని విసిగిపోయింది సీత, ఈమాటకి ఏమి సమాధానం ఉంటుంది? ఎవరి దగ్గర అయినా? తనకన్నా, వయసులో పది సంవత్సరాలు పెద్ద అయిన, భర్తకి ఏమి చెప్పి సముదాయించ గలదు?
*********
“అమ్మా! ఈచెట్టు, ఓకాయలేదూ పండూలేదు, అడ్డంగాఉంది, దీని వలన ఎలాంటి ఉపయోగం లేదు, నరికవతల పడేస్తేసరి” అన్నాడొక రోజు సీతారాముడు తల్లితో.
“అదేంటిరా ఆలా అంటావు, తప్పు! మొక్కగా ఉండగా, లేత ఆకుపచ్చ ఆకులతో, పూలతో ఎంతో నిండుదనాన్నిచ్చింది ఇంటిగుమ్మంలో. ఇహ వృక్షం అయ్యాక, ఎన్నికాయలు కాసిందిరా, మనం తిన్నన్ని మనం తిన్నాం, ఇతరులకి పంచాము, ఊర్లనించి వచ్చిన చుట్టాలకీ, స్నేహితులకి కూడా ఇచ్చేవాళ్ళం. దీని కాపు అయిపొయింది, నేలసారం కూడా తగ్గిపోయుంటుందిరా, కానీ, మనకి నీడనీ, పిట్టలకి గూడునీ ఇస్తోందిరా!
ఒక్కోస్థితిలో ఒక్కోలా మనకి తనప్రేమ చూపిస్తోందిరా, అన్ని సమయాలలో ఒకేలా ఉండాలని కోరుకోడం తప్పు కదూ?”
“అంతెందుకు, నేను నీకు చిన్నప్పుడు ఎన్నో విధాల సహాయపడుతూ, మీఅందరికి ఇష్టమైన, ఎన్నో రకాల వంటలు చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనేమి చేయగలుగు తున్నానురా ? ఇప్పుడు నేనేమి చేయట్లేదని నన్ను ఇంట్లోంచి బయటికి పంపేస్తున్నావా? నాకు నీమీద ప్రేమలేదంటావా ఏంటి కొంపదీసి? ఇదీ అంతేరా వెర్రినాగన్నా ! పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకురా”
చిన్నగా నెత్తిమీద మొట్టి, అక్కడ నించి లేచి ఇంట్లోకెళ్ళిపోయింది సుందరమ్మ.
"సమయానికి తగు పాట పాడెనే" సాధన చేస్తోంది వారి పెద్దమ్మాయి కుమారి, అమ్మ సీత నించి సంగీతం పుణికి పుచ్చుకుంది.
“అమ్మా! నువ్వు నాకు తెలీకుండానే చాల పెద్ద సహాయం చేసేవమ్మా, నేను సీతని ఇన్నాళ్ళూ సరిగా అర్ధం చేసుకోలేక పోయానమ్మా. మారుతున్న పరిస్థితులతో పాటుగా, ప్రేమని తెలిపే తీరు మారుతూ ఉంటుందని గ్రహించలేక పోయానమ్మా ! నా బిజీ లో నేను మునిగిపోయి ఇంటిని, పిల్లల్ని పట్టించుకోలేకపోయినా, ఎంతో శ్రద్ధతో అవన్నీ తను చూసుకుంటూ, తనకి నిశ్చింతనివ్వబట్టే కదా, తను తన బిజినెస్ పనులు సక్రమంగా చూసుకోగలుగుతున్నాడు.
అయ్యో ఎంత తప్పు చేసెను? సీతని చాలా వ్యాకుల పరిచేనమ్మా, తనకి నామీద ప్రేమ పోయిందని అదిఇది అని అనరాని మాటలెన్ని అన్నా, పాపం పిచ్చిపిల్ల, స్వతహాగా నెమ్మదస్తురాలైన సీత, ఏమి చెప్పలేక లోలోపల ఎంత కుమిలిపోతోందో కదా అమ్మా?” అని తనలో తానే చాలాసేపు మధనపడిపోయాడు.
కాసేపటికి తరవాణీ పట్టుకొచ్చింది సీత, తాను ఎండలో బయటికి వెళ్ళినప్పుడల్లా, తరవాణీ తాగి బయటికెళ్ళడం అలవాటు.
“సీతా!” పిలిచాడు సీతారామయ్య. మునుపటి ప్రేమ నిండిన పిలుపు! ఎన్నాళ్ళయింది ఈ పిలుపు విని? పరవశంగా అతని వంక చూస్తూ అనుకుంది సీత.
ఇన్నాళ్లు ఈ ప్రేమ ఎక్కడ దాక్కుంది ? కారణాలు ఏమై వుంటాయని తర్కించుకోలేదు సీత, ఎందుకంటే, తనపై తన భర్తకున్న అపారమైన ప్రేమ సీతకి మాత్రమే క్షుణ్ణముగా తెలుసు కనుక.
“ఏంటండీ పిలిచారు!” మామూలుగా అడిగింది సీత.
"తరవాణీ చాలా కమ్మగా ఉంది సీతా!" చల్లకొచ్చి ముంత దాచేసాడు.
సీత అమాయకురాలే గానీ, భర్త అంతరంగం గ్రహించ లేనంతైతే కాదు.
"ఆ ముంత ఇస్తే వెళ్ళిపోతాను", నవ్వును దాచుకుంటూ అడిగింది కొద్దిగా గాభరాగా.
"ఏ ముంతా.. ?" అన్నాడు సీతారామయ్య.
“తరవాణీ తాగిన చెంబండీ!!” వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది సీత.
"క్షేమంగా వెళ్లి లాభంగా రండి" ఎప్పుడూ చెప్పే మాట చెప్పేసి వెళ్ళిపోయింది, చిన్న నవ్వు నవ్వుకుంటూ.
దాచిన ముంతని కనిపెట్టేసినప్పుడు, దొంగ దొరికిపోయినప్పుడు నవ్వే నవ్వు ని సీత మొహంలో చూసాడు.
‘క్షమించమని అడుగుదామనుకుని పిలిచి కూడా, తానెందుకు సీతకి ఆమాట చెప్పలేకపోయేడు? తనలోని ఇగో, ప్రేమని అధిగమించడం లేదు కదా?
నో! అలా, ఎన్నటికీ జరగనివ్వను, సీత నాప్రాణం. ఓ ప్రత్యేక పద్ధతిలో సీతకి క్షమాపణలు చెప్పాలి’ అనిమనసులో పదేపదే అనుకుని, ఓ గాఢమైన నిట్టూర్పు విడిచి బయటికి నడిచాడు సీతారామయ్య.
********
"ముందుగా అమ్మా, నేనూ ఒకరిని ఒకరం చూసుకోలేదు, మాట్లాడుకోలేదు, మీలా కలిసి డేటింగ్స్ చేయలేదు.
మొదట అమ్మ పాట, వీణ విన్నాను. శృతి పక్వమైన గానం లో, చేసే పని పట్ల నిబద్ధతని గమనించాను.
వెనువెంటనే, తన కాలిమువ్వల చప్పుడు, గాజుల సవ్వడి చేసిన జుగల్బందీ విన్నాను. అందులో, తనకి పెద్దల మాట పట్ల ఉన్న గౌరవమర్యాదలు చూసాను. తాను చేస్తున్నపని ఆపేసి, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటని గౌరవించి, వచ్చిన అతిథికి (అంటే నాకు ) మర్యాదలు చేసింది, ఎక్కడా విసుక్కోకుండా.
పరాయి మగాడు తనని చూసే అవకాశం ఇవ్వకుండా, వచ్చిన పని శ్రద్ధగా చేసి, వచ్చినంత వేగంగాను తాను పరిగెత్తి లోనికి వెళ్లే తీరులో, పదహారణాల సంప్రదాయ బద్ధమైన ఆడపిల్లని చూసాను.
అంతే, అమ్మని నేను ఇష్టపడ్డాను. పెళ్ళికిముందు, మీ అమ్మ నన్ను కనీసం చూడనైనా లేదురా.
పెద్దవారికి చెప్పాను, మిగతా కార్యక్రమం అంతా పెద్దల చేతులమీదుగా, చాల సంప్రదాయబద్ధం గా జరిగిందిరా.
అన్నాళ్ళు పెళ్ళికి వాయిదా వేస్తూ వచ్చిన నాకు, అమ్మని నాకు ఆ దేవుడే చూపించి, ‘ఈమేరా నువ్వు కోరుకున్న భార్య’ అని చెప్పినట్టనిపించింది.
నా ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని, కష్టాలు, కన్నీళ్లు కడుపున దాచుకుని, తన ప్రేమలో ఇసుమంతైనా తేడా రానీక చూసుకుంటోంది రా. అమ్మ లేకపోతే నాకు ఒక నిమిషం కూడా గడవదు, కానీ ఆమె మహారాణి, ఎక్కడైనా బ్రతికేయగలదు. "
"అమ్మకి కష్ఠాలు, కన్నీళ్లా ?" ఆశ్చర్యపోయింది కుమారి.
“అదేరా అమ్మంటే, తన కుడికంట్లో నీటిని, తన ఎడమ కంటికి కనపడనీయదు. తన బాధలు మీ అమ్మమ్మకి కూడా చెప్పుకోలేదురా ఆ పిచ్చిది. నాకు బయటున్న సమస్యలతో, అదునుగా కనపడిన అమ్మని బాగా ఘోరంగా తిట్టేసేవాడిని రా, ఆ తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుదామంటే, నాలోని మగ అహంకారం అడ్డుపడేది.
చాల తొందరగా తనని అపార్ధం చేసేసుకునేవాడిని. అమ్మ కరెక్ట్ అని, నా అభిప్రాయమే తప్పు అని తర్వాత తెలిసినా, సారీ ల జోలికి వెళ్లనిచ్చేది కాదు నాలోని ఇగో. కానీ నిజమైన ప్రేమకి ఈ ‘ఇగో’ పెద్ద ఇనుప గోడారా, దాన్ని సమూలంగా తొలగించేయాలి, అంతే.
“ఒకసారి ఏమైందంటే, మా తొలి పెళ్లి రోజునాడు, మీ అమ్మకిష్టమైన సినిమా కి తీసికెళ్ళడానికి, మా వూర్లో నవరంగ్ సినిమా హాల్ ఓనర్ కి ఫోన్ చేసి, మా ఆఫీస్ బాయ్ ని పంపించి, మొదటి ఆటకి, “చీకటి వెలుగులు ” సినిమాకి టిక్కెట్లు తెప్పించాను. మీ అమ్మకి వాణిశ్రీ అంటే ఇష్టం. అందుకని అమ్మని ఆశ్చర్య పరుద్దామని, ఆపైన ఆనందపరుద్దామని, ముందుగా చెప్పలేదు.
ఇంటికొచ్చేక, "త్వరగా తయారవు, ఓ అరగంటలో మనిద్దరం బయటికెళ్తున్నాము" అని ముక్తసరిగా చెప్పేసి నేను బాత్రూం లోకెళ్ళిపోయెను.
నేను స్నానం చేసి బెడ్ రూమ్ లోకొచ్చి క్రాఫ్ దువ్వుకోడానికి దువ్వెన తీయబోతుంటే, ఆ దువ్వెన కింద రెండు సినిమా టిక్కెట్లు పెట్టి ఉన్నాయి. విప్పి చుస్తే, పూర్ణ హాల్ లో ఆడుతున్న “ముత్యాల ముగ్గు” సినిమాకి, మొదటి ఆటకి టిక్కెట్లవి. నాకు బాపు గారి సినిమాలంటే ఇష్టమని, అమ్మ ఎవరిచేతో తెప్పించినట్టుంది.
ఇష్టమైన వారి ఇష్టాలు గ్రహించి మెసలుకోడంలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదురా!
******
ఓనాడు పెళ్ళైన కొత్తలో, మీ అమ్మమ్మ వచ్చింది మమ్మల్ని చూడ్డానికి.
"అమ్మాయి సీతా, భోజనాలకి సర్దేశాను, నీ ఐటమ్స్ ఎక్కడున్నాయో చెపితే, అవి కూడా పెట్టేస్తాను, అందరం ఒకే మారు భోయినాలు చేసేద్దాం" అని గట్టిగా అడిగింది, అమ్మ పెరట్లో ఉంటె వినపడాలని.
"హుష్ ! నెమ్మదిగా మాట్లాడమ్మా, నావంటూ ఏవి విడిగా చేయడం లేదమ్మా, అందరు తినేవే తినేయడం అలవర్చుకున్నాను. "
"ఈ ముద్ద కూరలు, పులుసులు, పచ్చళ్ళు తిననంటే తినను అని పేచీ పెట్టేసేదానివి, నీకోసం ముద్ద పప్పు, వేపుడు కూర గాని పొడి కూర గానీ చేసేదాన్ని. అల్లుడుగారు వద్దని ఆంక్షలేవీ పెట్టలేదు కదా ?"
"అలాంటిదేమి లేదమ్మా, మా అత్తగారిని అడిగి ఆయనకి ఏవేవి ఇష్టమో తెలుసుకున్నాను. బయటికెళ్లే మనిషి కాస్త, నచ్చినవి వుంటే ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తిని వెళతారు, పైగా బయటెక్కడా ఏవి తినరు కూడాను. " అంది మీ అమ్మ.
" అంతా విని చాలా షాక్ కి గురయ్యానంటే నమ్ము తల్లీ. నా దృష్టికి రానివి ఇంకా ఎన్ని త్యాగాలు చేసిందో? మీ అమ్మది నిజమైన ప్రేమరా.”
"అవును నాన్నగారు, అమ్మ నాకు అన్నింటా ఆదర్శం నాన్నగారు. ఫైనల్ గా ప్రేమంటే, ఇష్టం ఉన్నవారికి కష్టం కలగకుండా మెసులుకోడమే కదా నాన్నగారూ!”
“వజ్రం లాంటి విలువైన మాట చెప్పావురా. నువ్వు నా కూతురివి రా ! నా బంగారు కొండవీ రా! పో తల్లి పో!, హాయిగా అమ్మ దగ్గర బజ్జో, పొద్దున్నే, నేను, అమ్మా వచ్చి, నిన్ను మీఇంట్లో దిగబెడతాము, సరేనా? ఇంతకన్నా నీకు ఎక్కువ చెపితే, నా పెంపకాన్ని తక్కువ చేసినట్టేరా తల్లి!”. కుమారి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నారు. కుమారి మనసు దూది పింజలా తేలిగ్గా అయిపొయింది.
తల్లితండ్రులంటే, పిల్లలకి దేవుడిచ్చిన రక్షణ కవచాలు!!
"ప్రేమించుకుంటున్నాము అని అనుకుంటారు పిల్లలు గానీ, అసలు ప్రేమంటే తెలుసా వీళ్ళకి ?? "
గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి, కళ్లద్దాలు తీసి, పక్కనున్న బల్ల మీద పెట్టి, నిశ్చింతని కావలించుకుని, నిద్ర కుపక్రమించారు, 'సీతా' 'రామయ్య' గారు.
***శుభం***
పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత
నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .
నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.
కృతజ్యతలతో
ఉగాది వసంత
Sri krishna • 2 hours ago
నేటి తరపు యువతకు ప్రేమ పరమార్థం విశదీకరించడంలో నడక నడత కళ్లకు కట్టిన మా రచయిత్రి అమ్మ కి అభినందనలు