top of page

ప్రేమంటే తెలుసా మీకూ 2


'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ రెండవ భాగం

'Premante Thelusa Miku - 2' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha

'ప్రేమంటే తెలుసా మీకూ - 2' తెలుగు కథ

రచన : పూడిపెద్ది ఉగాది వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడు సీతారామయ్య.

కొద్దిరోజులకు పుట్టింటికి వచ్చిన అతని కూతురు కుమారి - తనకు, భర్తకు మధ్య సఖ్యత లేదని చెబుతుంది.


ఇక 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ రెండవ భాగం వినండి.


సీతకి ఏమి మాట్లాడాలో తెలీడంలేదు. కూతురు చెప్పే పితూరీలేవి అంత పెద్దవిగా అనిపించ లేదు. ఈ కాలం పిల్లలు ప్రతిదీ ఓ పెద్ద గడ్డు సమస్యగా అనుకుని తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఎదుటివారికి తమ మీద ప్రేమ లేదని ఖచ్చితంగా అనేసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు ప్రేమించి, బాగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఇద్దరూ కూర్చుని స్నేహంగా చర్చించు కుంటే, అన్నీ సర్దుకుంటాయేమో అని అనిపించింది సీతకి.


అనుభవాల అ, ఆ లు కూడా ఎరుగని వయసు, ఆ వయసు పిల్లలది. ఏ అనుభూతినైనా, ఎక్కువసేపు మనసున పదిల పరుచుకోలేరు, దాన్ని సమగ్రంగా చదవనూ లేరు. అప్పుడే కావాలనుకుంటారు, మరుక్షణంలో దాన్ని వద్దనుకుంటారు. మంచి చెడుల విచక్షణలని అంచనా వేయలేని వయసు వేగం వీరి స్వంతం. పైగా తన శ్రేయోభిలాషులు, పెద్దలూ చెపితే వినడానికికూడా వారి మనసంగీకరించదు. అదే వయసు గారడీ.


పిల్లలవంతు కూడా సంయమనం పాటించాల్సింది పెద్దలే మరి!


పిల్లలు పెద్దవుతున్నా కూడా వారు ఎప్పటికీ పసివారే! అమ్మా, నాన్నలు ఆదిగురువులై, చిన్న చిన్న లెక్కల్లో వచ్చే అవకతవకల్ని సరిదిద్ది, వారి జీవితం లో ఎదురయ్యే "తప్పుడు లెక్కలకి " మంచి "సూత్రం" సూచిస్తూ సరైన మార్గాన నడిపిస్తారు.


"మీ అత్తగారి మాటే కరెక్ట్ ఏమోరా, సర్దుకుపోరా కన్నా, ఇంకా రాహుల్ తో కూల్ గా మాట్లాడి పరిష్కరించుకో, నీ క్లాస్ మేటే కదరా, నీ బాధని అర్ధం చేసుకుంటాడులే.


ఇలాంటి పద్ధతులు మనింట్లోనే ఉండి ఉంటె ఏమి చేసే దానివి చెప్పు. నీకలవాటైపోయి ఉండేది కదా ఈ తరహా జీవితం. మన ఇల్లుని, మమ్మల్ని వదిలి అయితే వెళ్లేదానివి కాదుగా?


పైగా అందరిలో మంచి చెడులు ఉంటాయి రా. ఇప్పుడు నేనున్నాను నేను మొత్తంగా నీకు నచ్చకపోవచ్చు, నాలోనూ నీకు నచ్చని గుణాలు ఉండి ఉంటాయి, అయితే నామీద నీకున్న ప్రేమ, ఆ నచ్చని గుణాలని వదిలేసి, నచ్చినవే తీసుకునేలా చేస్తోంది. రాహుల్ లో మంచి గుణాలను అంటే నీకు నచ్చే వాటిని మాత్రమే చూసుకుంటూ, నచ్చని వాటి జోలికి వెళ్లకురా. ఇప్పుడు మనం నడిచి వెళ్తున్న రోడ్ లో, ముళ్ళు, రాళ్ళూ ఉండే త్రోవ ఉంటుంది, సాదా త్రోవ ఉంటుంది, మనం ఏ త్రోవ ని ఎంచుకుని ముందుకెళతాము ? జీవితమూ అంతేరా!”


తనకి ఉన్న పరిజ్ఞానం మేరకు, తెలిసినంతలో నచ్చ చెప్పింది.


అమ్మ చెప్పింది విని కన్విన్స్ అయినట్టుంది, మౌనంగా ఉండిపోయింది కుమారి.


ఈలోగా, చెల్లెళ్ళు, అన్నయ్యలూ వచ్చారు, పెళ్లయ్యాక కుమారి రావడం ఇదే మొదటిసారి కనక, ఒకటే కోలాహలం చోటు చేసుకుంది. అందరూ ఒకచోట చేరి, మాట్లాడుకోడం ప్రారంభించారు.

****

అప్పుడు సీతారామయ్య, సీత, వివరంగా చర్చించుకున్నారు, ఇద్దరూ ఒక విషయం ఆకళింపు చేసుకున్నారు.


కుమారి, రాహులు మధ్య ప్రేమకి లోటు లేదు, ఇద్దరూ రెండు నేపధ్యాల్లోంచి వెళ్ళినవారు కావడం, వారి వారి పరిస్థితులను వారు జీర్ణించుకోలేకపోడం.. ఇదే పెద్ద కారణం వారి మధ్య పొంతన కుదరకపోడానికి.


“తనకి కావాల్సిన దాన్ని రాహుల్ ఇవ్వకపోయినా, తను చేస్తానన్న పనికి వద్దని బ్రేక్ వేసినా, మనమ్మాయి, రాహుల్ కి తనమీద ప్రేమ లేదని తనలో తానే నిర్ధారించేసుకుని, బాధ పడి పోతోంది. రాహుల్ కూడా అంతే. ” తేల్చి చెప్పేసారు సీతారామయ్య.


సీత తనకున్న అనుభవంతో అందుకుంది.


"వీళ్ళకి అసలు ‘సమస్యలు’ అని వేటినంటారో తెలుసా అని ? శాడిస్ట్ భర్త పెట్టే నరక యాతన, అనారోగ్యంతో బాధపడే తల్లితండ్రులు/ అత్తమామలు, డబ్బు కొరత, భార్యాభర్తల్ని సుఖ పడనీకుండా వేధించుకుని తినే అత్తమామలు, కట్నం కోసం కాల్చుకుతినే అత్తమామలు, అప్పులవాళ్ళ బాధలు, అవుకుతనంతో పుట్టిన పిల్లలు, ఇలాంటివి కదా పెద్ద పెద్ద సమస్యలంటే?

ఇలాంటి గడ్డు సమస్యలొస్తే అసలు వీళ్ళు తట్టుకోగలరా?


ఈ చిన్న చిన్న సమస్యల్ని పట్టుకుని, అవే జీవన్మరణ సమస్యలనుకుని కొంపలంటుకుపోతున్నట్టు లబోదిబో మంటున్నారు.


ప్రేమించున్నప్పుడు, తల్లితండ్రులకి తెలియకుండానో, క్లాసులు బంక్ కొట్టో, ఓ గంటో, రెండు గంటలో కలిసి కాలక్షేపం చేయడానికి కలుసుకుంటారు. అప్పుడు వేరే విషయాల మీద అంత శ్రద్ధ ఉండదు. అప్పుడు ఏ పేచీ ఉండదు.


అదే పెళ్లయ్యాక అంటే, వేరు వేరు ఇళ్ల నించి, వేర్వేరు పద్ధతుల్లో పెరిగి, వేర్వేరు అలవాట్లని స్వంతం చేసుకుని, వేర్వేరు మనస్తత్వాలతో, వేర్వేరు ఇష్టాలు, అయిష్టాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఇరవై నాలుగుగంటలు కలిసి ఒకే ఇంట్లో జీవించాలి.


భిన్నత్వంలో ఏకత్వం సాధించడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, అర్ధం చేసుకునే తత్వం ఉండాలి. ఇవేవి లేకపోగా, ఇద్దరూ ‘అహం’ కలిగి ఉంటె, ఇహా చెప్పే పనేముంది? ముఖ్యంగా ఈ తరం పిల్లలకి ఏమాత్రం సహనం ఉండడం లేదు, అర్ధం చేసుకునే తత్వమూ చాల తక్కువగా ఉంటోంది, పోనీ ఎవరైనా చెపితే వింటారా, ఆహా! అస్సలు కుదరదు. ఇది పెద్దలకి పెద్ద సమస్యగా తయారయి కూర్చుంటోంది!


చిన్నప్పటినించి కోరుకున్నవన్నీ యిట్టే దొరుకుతున్నాయి, మొన్నటికి మొన్న, ఈ పెళ్ళికి ఇరుపక్షాల వాళ్ళు ఒప్పుకోకపోతే. వీళ్ళ పరిస్థితి ఏంటి?


జీవితం వడ్డించిన విస్తరిలా కనిపించేసరికి, అది రుచిగా లేదు, ఇది బాలేదు అని ఒంకలు పెడుతూ కూర్చుంటున్నారు. ”


పెద్దగా నిట్టూర్చి, ఆశ్చర్యపోయింది సీత, తనేనా ఇంతగా మాట్లాడిందీ అని.


సీతారామయ్య అవాక్కైపోయి, స్థాణువులా వింటూ ఉండిపోయేడు, తానెరిగిన సీతేనా ఇంతలా మాట్లాడిందీ అని.


“మనమ్మాయి తనకి నచ్చిన విధంగా రాహులు ఉండాలని కోరుకుంటోంది, రాహులు తనకి నచ్చినట్టుగా, కుమారి ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ అభిప్రాయ భేదాల్ని, వీళ్ళిద్దరూ ప్రేమ లేకపోవడంగా అభివర్ణించుకుంటూ, బాధపడిపోతున్నారు, వడ్ల గింజలో బియ్యపు గింజ”. కూతురికెంత కష్టం వచ్చిందో అని గాభరా పడ్డ పితృ హృదయం, విషయం విన్నాక నెమ్మదించింది.


“ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరి ఇష్టాలని, అయిష్టాలని కూడా, ఇంకొకరు ప్రేమించాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి, ఇది తెలుసుకోడానికి ఇద్దరికీ వయసు, అనుభవమూ చాలదు. ఇప్పుడు మనం ఏమి చెప్పినా, తనకి వ్యతిరేకంగా చెపుతున్నామని భ్రమపడే అవకాశం ఉంటుంది, అందుచేత, నేనో పధకం యోచన చేశాను, అది ప్రయోగించి చూద్దాం. " అని రహస్యంగా సీతకి తన ఆలోచన వివరించారు.


******


రాత్రిభోయినాలయ్యేక, సీతారామయ్యగారి పందిరి మంచం మీద, తండ్రి పక్కనే కూర్చుని, అతని గుండెలపై తలపెట్టుకుని, ఇన్నాళ్లూ కోల్పోయిన అనుభూతిని, ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది కుమారి.


అప్పుడు ఆయన, మంద్రస్థాయిలో, కుమారికి మాత్రమే వినిపించేంత నెమ్మదిగా చెప్పేరు. "తల్లీ! మీరు పుట్టినప్పటినించి మీ సుఖం కోసం అహర్నిశలు తపించే మాకు నువ్వు పెళ్లయ్యాక సుఖంగా లేవు అని తెలిసినప్పటినించి, చాలా బాధగా ఉందిరా. నీ సుఖం కోసం నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, మాకు సమ్మతమే నాన్నా! నీమాటకి విలువలేని ఇంట్లో, నీకు ఆనందం లేనిచోట నువ్వు ఉంటున్నావంటే, తెగ బాధ కలుగుతోంది రా తల్లి. “


“ఇప్పుడు ఏమి చేస్తావురా తల్లి, నీ నిర్ణయం ఏదైనా, మేము అడ్డు చెప్పం, ఇది నీ జీవితం, దాన్ని నీక్కావల్సినట్టు ప్లాన్ చేసుకునే అధికారం నీకుందిరా! మేమెంతకాలం బ్రతుకుతామురా, మహా అంటే, ఓ పది సంవత్సరాలు! అంతేగా ? మాక్కావాల్సింది నీ సంతోషమే రా తల్లీ. ఈఇల్లు ఎప్పటికీ నీదే తల్లీ, ఇంతకన్నా ఏమి చెప్పగలం రా!”


తన పధకం ప్రకారం, రివర్స్ గేర్ వేసేశాడు సీతారామయ్య. నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించేసాడు, తన కూతురు మనస్తత్వం బాగా తెలిసినవాడు కనక. ఇప్పటి తరం అంతా ఇలాగే ఉన్నారు.


కాసేపు మౌనం తన పెత్తనం చెలాయించింది. అప్పుడు అంది కుమారి "లేదు నాన్నగారూ! నేను లేకపోతే రాహులు ఉండలేడు. కుమారి కుమారీ, అని క్షణం వదలడు నన్ను. ప్రతి పని నాతో చెప్పే చేస్తాడు. జీతం మొత్తం తెచ్చి నాచేతికే ఇస్తాడు. పెళ్ళికిముందు, వాళ్ళ అమ్మచేతికి ఇచ్చేవాడట. అయితే, అత్తయ్యగారే అన్నారట, భర్త సంపాదన భార్య చేతిలో పెడితే, ఐశ్వర్యం సిద్ధిస్తుందని. ”


ఈమాటలతో, విషయం మొత్తం బోధపడిపోయింది ఆయనకి.


"దొంగభడవా, రాహులు నిన్ను విడిచి అస్సలు ఉండలేడు అంటున్నావు, మరి నువ్వుండ గలవా రాహులు ని విడిచి ?"


కుమారి చాలా అందంగా సిగ్గుపడుతూ, తల అడ్డంగా ఊపింది, ఉండలేనన్నట్టుగా. అప్పుడు కుమారిలో, తమ పెళ్లిచూపులప్పుడు, సిగ్గుతో ముడుచుపోయిన సీతను చూసారు ఆయన.


ఈలోగా సీత వచ్చింది, అందరికి పళ్ళరసాలు తీసుకుని.


సీతారామయ్య గారి ఆలోచనలకి ఆనకట్ట పడడం లేదు!


పిచ్చిపిల్లలు, ప్రేమించుకుంటున్నాము అనుకుంటారుగానీ, ఒకరి ఇష్టాయిష్టాలని ఒకరు అర్ధం చేసుకోడంలో బాగా విఫలమవుతున్నారు. వీళ్ళలో నిజమైన ప్రేమదాగి వుందనే విషయం, వీళ్ళే తెలుసుకోలే కపోతున్నారు. చిన్నప్పుడు చెల్లితోనో, తమ్ముడితోనో, ఏదైనా గొడవ వస్తే, 'నీజెట్టు పచ్చి ' అన్నంత సులువుగా, పెళ్లి, వైవాహిక జీవితం కూడా, ఆటలో అరటిపండు, పాటలో పనసపండు అనుకుంటున్నారు. రాహుల్, కుమారిల తంతు అలానే ఉంది.


“చూడమ్మా, కుమారీ! మీమధ్య ప్రేమ మెండుగా ఉందిరా, అయితే మీమీ పరిస్థితులని జీర్ణించుకోడంలో, ఇద్దరు విఫలం అయ్యారు. ఇద్దరూ అపోహల్లో ఉన్నారు. ఇద్దరికీ వయసు, అనుభవమూ లేవు కదా ! మీరింకా చిన్నపిల్లలమ్మా! నెమ్మదిగా నీ ఇష్టాలని, అయిష్టాలని అతనికి తెలియచేసి, ఎలా ఉంటే నీకు ఆనందమో చెప్పు, కుర్రాడిలో నీమీద ప్రేమ ఉంది కనక, వాటిని తప్పక అంగీకరిస్తాడు. “


“అలాగే, అతని ఇష్టాలని, అయిష్టాలని నువ్వు కూడా అడిగి తెల్సుకుని, వాటిని అర్ధం చేసుచేసుకుని ప్రవర్తించు. అంతే ఇక సమస్యనేది ఉంటేగా పరిష్కరించడానికి. ”


కుమారి అన్ని బహు శ్రద్ధగా వింటోందని గ్రహించి, సీతారామయ్య ఇంకా చెప్పసాగారు.


“ప్రేమంటే ఏంటనుకున్నారురా మీతరం వాళ్ళు? ఓ మూడు డ్యూయెట్లు, నాలుగు షికార్లు అనా? ప్రేమించిన వారికోసం మన ఇష్టాలను కూడా కాస్త సడలించుకోడం చాలా అవసరంరా, అది ఇద్దరిలోను ఉండాలి సుమా. ఒకరి ఇంటి స్థితిగతులను ఇంకొకరు అర్ధం చేసుకుని సర్దుకుపోవాలి. నాలా నువ్వుండలేవు. నీలా నేనుండలేను. కానీ నీకు తగ్గట్టుగా నేను మారగలను, నాకు తగ్గట్టుగా నువ్వు మారగలవు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా, మన మధ్య అంతులేని ప్రేమ ఉన్నప్పుడే అది సాధ్యం.


ఒక ఉదాహరణ చెపుతా వినరా కన్నా! సంప్రదాయాల్లో పుట్టి పెరిగి, అందులో మునిగిపోయి ఉన్న నేను, నాకిష్టం లేకపోయినా, కులాంతర వివాహానికి ఒప్పుకున్నాను అంటే, కేవలం నాకు నీమీద ఉన్న మమకారం చేత మాత్రమేరా. సమాజంలో వచ్చే అన్ని సవాళ్ళని ఎదుర్కోడానికి, నాతో ఏకీభవించని వారిని వదులుకోడానికి కూడా సిద్ధపడ్డాను అంటే కూడా, ఆ రెండక్షరాల మహిమ వల్లనేరా”.


ఆ మాటలు విని, నాన్నని గట్టిగా వాటేసుకుని కన్నీటి పర్యంతమైంది కుమారి.


“అంచేత, ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డట్టే, మీ మీఇంటి పరిస్థితులని, పద్ధతులని కూడా అంతే ఇష్టపడ్డప్పుడే, ఈ ప్రేమ బంధం శాశ్వతత్వాన్ని అద్దుకుంటుందినాన్నా! ప్రేమకి ఫలానా అని నిర్వచనం ఉండదురా కన్నా!”

*****

=======================================================================

ఇంకా ఉంది..


=======================================================================

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత

55 views1 comment
bottom of page