top of page

ప్రేమంటే తెలుసా మీకూ - 1



'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ మొదటి భాగం

'Premante Thelusa Miku - 1' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha

'ప్రేమంటే తెలుసా మీకూ - 1' తెలుగు కథ

రచన : పూడిపెద్ది ఉగాది వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"రాహుల్ వాళ్ళూ మనవాళ్లేనా??" మన శాఖేనా? ? ఆరాగా అడిగింది సీత ముందుగా అసలు ఈ ప్రొపోజల్ ఎంత అర్హమైనదో తెలుసుకోవాలని.


"కాదమ్మా, వేరే కులం !!"


బాంబు పడింది సీత గుండెల్లో..

"మొన్నామధ్య అన్నయ్యకి ఓసంబంధం వచ్చినప్పుడు, వాళ్ళ శాఖ వేరు అని తెలుసుకుని, అది వద్దనుకున్నారు నాన్నగారు. అలాంటిది ఈ కులాంతర వివాహానికి ఒప్పుకోరు కాక ఒప్పుకోరు. నా వల్ల కాదురా బాబూ మీ నాన్నగారికి చెప్పడం. ఆపాట్లేవో నువ్వే పడవే తల్లీ ! నామీద అగ్గిగుగ్గిలం అయిపోతారు, ఆసూది ముక్కుకి అంటుకునే ఉంటుంది ఎప్పుడూ అగ్నిహోత్రం లాంటి కోపం!" తల పట్టుకుని చతికిల పడిపోయింది ఉన్నచోటే.


కాళ్ళు చేతులు ఆడ్డం లేదు ఇద్దరికీనూ. అప్పుడే అటుగా వచ్చిన సీతారామయ్యగారు

"ఏంటీ, తల్లీకూతుర్లు ఇద్దరు అంత నిశ్శబ్దంగా ఉన్నారు, ఎప్పుడు స్వరాలతో యుగళగీతం ఆలపించే మీగళం, ఇలా మౌనగీతం ఆలపిస్తోందేంటి" ?


ఛలోక్తివేసి, జవాబు కోసం ఆగకుండా, మేడమీదకి వెళ్ళిపోయేరు సీతారామయ్య.


గతుక్కుమన్నారు ఇద్దరూ ఒకేసారి. ఆయన నిష్క్రమణ చూసి, ఊపిరి పీల్చుకున్నారు.


కుమారి ఆలోచిస్తోంది, నిజమే!అమ్మ ఎప్పుడు నాన్నకి ఎదురుపడి ఎక్కువగా మాట్లాడింది లేదు, పోట్లాడింది లేదూ, అమ్మకి నాన్నంటే చాలా భయం.


భగవంతుడా!, ఏదైనా అద్భుతం చేయవా ప్లీజ్? పరిష్కారం దొరకని సమస్యలు వెంటాడినప్పుడు, మనిషికి గుర్తొచ్చేది, ఆ దేవుడేగా.

********

ఓరోజు ధైర్యం చేసి, సీతారామయ్యగారు, పూజాదికాలు పూర్తి చేసుకుని, పడక్కుర్చీలో కూర్చుని ఉండగా చెప్పేసింది.


"నాన్నగారూ!చిన్నప్పటి నించి నేను ఏది కోరితే అది ఇచ్చారు, జీవితంలో అత్యంత ముఖ్యనిర్ణయం, మీలా నన్ను బాగా చూసుకునే వ్యక్తిని తెచ్చి వివాహం చేయడం కదా! మరి ఇందులో నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉంటుంది కదండీ ?"


కూతురి అంతరంగం లోతుగా గ్రహించలేని ఆయన "అయ్యో అదెంత మాటతల్లీ, నీకు ఇష్టమయితేనే పెళ్లిదాకా వెళ్తుందమ్మా, లేదంటే, సిద్ధాంతిగారికి చెప్పి మరో సంబంధం చూద్దాంరా, పిచ్చితల్లీ, నేను నీనాన్ననురా, నీమంచిని, శ్రేయస్సుని అనుక్షణం కోరుకునేవాడిని" అని సముదాయించారు, ఆయనకి అర్ధమైన కోణంలోంచి.


"అదికాదండీ, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆవిషయం గురించి మీరు కోప్పడనంటే చెపుతానండి!"


కుమారిలో ధైర్యం ఎంత ఉందొ, అంతే పిరికి తనమూ ఉందా క్షణంలో. కానీ తెగించి కుండ బద్దలు కొట్టేసింది, ఎన్నాళ్లీ ముసుగులో గుద్దులాట అని !


"ఎవరమ్మా, మనవాళ్లేనా, మనశాఖేకదా, వేరే శాఖ అయినా పరవలేదులే, మారుతున్న కాలం తో మారక తప్పదు కదరా, పిల్లల ఇష్టాలని తీర్చడానికి. కుర్రాడేమిచేస్తాడు, వివరాలుచెపితే, వెళ్లి మాట్లాడదాంరా, అన్నీ కుదిరితే, ఇదే ఖాయ పరుచుకుందామురా!"


బాంబుని దాచి సంభాషణ జరుగుతోంది కనుక, అక్కడ ఎలాంటి విస్ఫోటనమూ జరగలేదు.


"క.. క.. కాదండీ, కులాంతరమండీ, మీరుఅంగీకరిస్తే, మీ చేతులమీదుగా వివాహం జరుగుతుంది, లేదంటే, మీరు నమ్ముకున్న దేవుడే మాపెళ్ళికి పెద్ద" బాంబుని వేసేసింది కుమారి, అయినా ఏ విస్ఫోటమూ కనబడలేడక్కడ, ఎందుకంటే అది జరిగింది ఓ తండ్రి హృదయంలో కాబట్టి.


ప్రేమ నిండిన ఓ తండ్రి హృదయం ఛిన్నాభిన్నమైంది, కూతురు కులాంతర వివాహం చేసుకుంటున్నందుకు కాదు, తను ఇష్టపడకపోయినా, తన వివాహం జరిగితీరుతుందని నిర్ణయం తీసేసుకున్నందుకు. గుండెల మీద ఆడించి, అరచేతుల్లో అడుగులు వేయించి, నడకలు నేర్చుకున్న తన కూతురు, మీఇష్టం ఉన్నా లేకున్నా తన పెళ్లి, తనిష్టపడ్డ వ్యక్తితో జరుగుతుంది అన్నప్పుడు, ఆకన్న తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది ? ఎవరికిచెప్పుకోగలడు? ఎదిగిన ఓ కూతురు దృష్టిలో, తనకి ఏపాటి విలువ వుందో??. తాను పెంచిన కూతురు మీద కాదు, తన పెంపకం మీదే అతనికి బోల్డు సందేహాలు వచ్చాయి.


తను అవునన్నా, కాదన్నా ఇక్కడ ఆగేది ఏమిలేదని ఓకూతురు అంత స్పష్టంగా వ్యక్తపరిచేక, ఆ పితృ హృదయం ఎలా విలపిస్తుంది?


తండ్రి మౌనాన్ని మరోలా ఊహించుకున్న కుమారి, "నాన్నగారూ, రాహులు గురించి నేను అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నానండి, వాళ్ల కుటుంబం గురించి కూడా స్టడీ చేసానండి, మీకు ఆబాధ కూడా లేదు. అదే మీరు సంబంధం చూస్తే, అన్నీ మీరొక్కరే పరిశీలించాలి కదండీ, మీకు ఆ బరువు కూడా తగ్గించేసానండీ! నేను మీ కూతురునండీ!" పూర్తి భరోసా ఇచ్చేసింది తను వెళ్లబోయే ఇల్లు, మనుషులు చాలా మంచివని.


"నువ్వు అతనితో సుఖంగా ఉండగలనని నమ్మకం నీకుందా ?" తను ఇష్టపడ్డ వ్యక్తిని తను వివాహమాడడంలో ఓ కన్నతండ్రి ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండడబోదని కన్నకూతురు ఘంటాపధంగా తేల్చి చెప్పేసినా, మమకారంతో పెంచుకున్న తన కూతురు సుఖాన్నే కోరుకుంది ఆ కన్నతండ్రి హృదయం.


"నూటికి నూరుపాళ్ళు ఉంది నాన్నగారూ" టక్కున సమాధానం చెప్పింది, ఆలస్యం అయితే ఎక్కడ ఈ పెళ్లిని తిరస్కరిస్తారో అని.


మౌనంగా అక్కడ నించి నిష్క్రమించడం మినహా ఏమి చేయగలడు? ఆ నిస్సహాయ తండ్రి?

ఇలాంటి పరిస్థితి ఇంక ఏ తండ్రికీ రానీయకు భగవంతుడా! ఇది ఎవరికీ చెప్పుకోలేని అవమానం.

********

ఆరోజునించీ, ఓ నాలుగు రోజులపాటు, ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం శబ్దం చేసింది.


"సీతా! సిద్ధాంతి లచ్చన్న గారికి కబురు పంపాను, ఆయన రేప్పొద్దున్న వస్తారు. అతి త్వరలో ఏ ముహూర్తం ఉంటే అది పెట్టమంటాను" సాంప్రదాయ పద్ధతులని, జాతకాలని, ఎక్కువగా నమ్మే ఈయన వాటి జోలికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే, కూతురు నిర్ణయించేసుకుంది, రాహుల్తోనే తన పెళ్లి జరిగి తీరుతుందని, ఇంక ఈ వృధా ప్రయాసలెందుకనేమో?


"పెళ్ళికి మనం సంప్రదాయం ప్రకారం, మనమ్మాయికి ఏమేమి పెట్టాలని అనుకున్నామో, వాటన్నింటికి ఏర్పాట్లు చూడు, పెద్దవాడి సహాయం తీసుకో. ఇక నువ్వెళ్లొచ్చు" అని అటువైపు తిరిగి పడుకున్నారు.


ఈ పాతికేళ్లలో ఎప్పుడూ ఇలాంటి బాధ తన భర్త మొహంలో చూసి ఎరుగదు ఆ ఇల్లాలు, ఎవరితోనూ సమంగా మాట్లాడ్డంలేదు కూడానూ.

***

అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి కుమారి పెళ్లి తల్లితండ్రుల చేతుల మీదుగా, సంప్రదాయబద్ధంగా, జరిగింది, బాగా దగ్గర వారు తప్ప, పెద్దగా చుట్టాలు పెళ్ళికి రాలేదు.


కూతురి నిర్ణయం విన్నాకనే పూర్తిగా కృంగిపోయిన సీతారామయ్యగారు, ఆ కృంగుబాటు ముందు, ఇలాంటి ఉపద్రవాలకి సీరియస్ గా స్పందించడం లేదు. ఇంతకుముందు, పరువు, ప్రతిష్ట, అవమానం అని బాధపడేవారు, ఇప్పుడు అన్నింటికీ అతీతుడైపోయారు.


"నాన్నగారు! చాలా థాంక్సండీ, వెళ్లొస్తానండీ, నానిర్ణయంతో మిమ్మల్ని బాధిస్తే క్షమించండి నాన్నగారూ, రాహులు నన్ను మీరు చూసుకున్నంత భద్రంగా చూసుకుంటాడు, నన్నునమ్మండి, అదే కదా మీకు ఆనందం" అత్తారింటికి బయల్దేరుతూ తండ్రికి చెప్పి బయలుదేరింది.


కోరుకున్న వ్యక్తితో వివాహం జరగడంతో కుమారి మొహం కోటి కాంతులు వెదజల్లడం ఆయన గమనించారు. ఈ మాటలు రాహులు నోటి నుంచి వచ్చిఉంటే, ఆ పితృ హృదయం కాస్త సేదతీరేది.

*********

సీత పుట్టినరోజని, కుమారి ఉదయాన్నే, పూలబొకే, మిఠాయిలు, సీతకిష్టమైన సంపెంగపూలు, నీలంరంగు పట్టుచీర పట్టుకుని వీళ్ళింటికి వచ్చింది. అప్పటికే సీత స్నానం చేసేసి, పూజలో ఉంది. గుమ్మంలో సీతారామయ్యగారు వార్తాపత్రిక చదువుతూ కనిపించారు.


నాన్నగారి కాళ్ళకి నమస్కరించి, "నాన్నా, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి, ఎలా వున్నారు నాన్నగారూ?" కళ్ళలో నీళ్లు చిప్పిల్లగా, ఆప్యాయంగా పలకరించింది.


ఓ ఉదాసీనపు నవ్వు నవ్వి, మళ్ళీ వార్తపత్రికలో తల దూర్చేసారు.


"నాన్నా, నామీద మీకింకా కోపం పోలేదా ? కోపం ఉంటె చెడా మడా తిట్టేయండి నాన్నగారూ", అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ, ఆయన పడక్కుర్చీ పక్కనే చతికిల పడిపోయింది కుమారి.


"ఆనాడే ఈపెళ్లి వద్దని ఖండించాల్సింది కదా నాన్నగారూ! మీరు నాతో మాట్లాడకుండా ఉంటే, నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి? మిమ్మల్ని బాధపెట్టి ఆపెళ్లి చేసుకుని, నేనేమి సుఖపడిపోడం లేదులెండి" కన్నతండ్రిని చూడగానే, గబుక్కున మనసులోని బాధ, మాట రూపంలో బయటపడిపోయింది.


ఆమాటలకి ఉలిక్కిపడి, పేపర్ మడిచి పక్కన పడేసి, "ఏమన్నావు?.. మళ్ళీచెప్పు" ఆదుర్దాగా అడిగారు తాను విన్నది నిజామా కాదా అని రూఢి చేసుకోడానికి.


ఈలోగా సీత ప్రసాదం, బొట్టు పట్టుకుని వచ్చి, ఏడుస్తూ కూర్చున్న కుమారిని చూ సి, గాభరాగా "అయ్యో ఏమైంది తల్లీ !" అని దగ్గరగా వచ్చి అక్కున చేర్చుకుంది.


"సీతా! కాస్త ఏమైందో కనుక్కో, తానేదో బాగా మధనపడుతోంది, నేనడిగితే చెప్పడంలేదు".


"ఏమయిందిరా, నీ బాధ ఏవిటో మాతో చెప్పురా కన్నా, అంతా కుశలమే కదా?" తల్లి హృదయం కాస్త తల్లడిల్లింది, ఎందుకంటే అనుభవాల మాలల వాసనలెరిగిన అతివ కదా!


కుమారి దుఃఖం తగ్గేవరకూ, అలా వీపుమీద, తలమీదా నిమురుతూ ఉంది సీత.

కాస్త తెప్పరిల్లేక, అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, తెచ్చిన గిఫ్టులు అమ్మకిచ్చి, అప్పుడు చెప్పడం ప్రారంభించింది..


“రాహులు విషయంలో నా అంచనా తప్పయింది. అతని తీరు నాకు తృప్తిగా లేదు. నేనంటే వల్లమాలిన ప్రేమంటాడు కానీ, అన్నీ తనిష్ట ప్రకారమే చేయాలంటాడు, అలాగే చేస్తుంటాడు కూడాను, ఎదుటివారి అభిరుచుల్ని అస్సలు గౌరవించడు, ఇలా అయితే ఎలా జీవితాంతం వీడిని భరించడం అమ్మా ?


పైగా వాడు చాల పిసినారమ్మా, వాడికి బద్ధకం కూడా బాగా ఎక్కువమ్మా. పెళ్ళికి ముందు ఈవిషయం నాకు తెలియలేదు. సెలవులువస్తే, రోజంతా టీ. వీ చూస్తూ ఉంటాడు, ఓఅచ్చటా లేదు ముచ్చటా లేదు, మూవీ, షాపింగ్ ఏదీ వద్దంటాడు, తిండి దగ్గర కూడా అంతా కూడికే. పొద్దున్న వండిన కూరే రాత్రికి కూడా తినాలి.


అత్తయ్యగారితో చెపితే, అన్నీ మా మామయ్యగారి పోలికలే అన్నారు ఆవిడ. తానూ మొదట్లో చాలా బాధ పడేవారట, రానురానూ అలవాటైపోయింది అన్నారు. తానెలా తన భర్తతో ఇన్ని సంవత్సరాలుగా సర్దుకుపోతూ కాపురం చేస్తోందో, నన్నూ అలాగే సర్దుకు పొమ్మని సలహా ఇచ్చారమ్మా!"

=======================================================================

ఇంకా ఉంది..

=======================================================================

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత

86 views1 comment

1 Comment


Annapurna Sirisha • 7 hours ago

Nice story

Like
bottom of page