top of page

రెండు ఎడ్లబండి


'Rendu Edla Bandi' - New Telugu Story Written By Ch. C. S. Sarma

'రెండు ఎడ్లబండి' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

వివాహం.. సంసారం..

సవ్వంగా కావాలంటే కలవాలి రెండు కుటుంబాలు.


పాత కాలంలో.. యుక్తవయస్సుకు వచ్చిన యువతీయువకులు తమ తల్లీతండ్రులు నిర్ణయించిన వారిని ఆనందంగా వివాహం చేసికొనేవారు.


వారి సంసారజీవితం ఎలాంటి ఆటుపోటూ లేకుండా సఖ్యతతో ఎంతో ఆనందంగా సాగుతుండేది.

ఆ యువతీ యువకులకు అంటే ఆ భార్యాభర్తలకు ఒకరి కుటుంబం పట్ల ఒకరికి ఎంతో ఆదరాభిమానాలు కలిగి, పరస్పరం మైత్రీభావనతో వారి జీవిత కాలాన్ని బంధుమిత్రులతో, పిల్లలతో ఆనందంగా గడిపేవారు. ఎదుటివారికి ఆదర్శప్రాయులుగా వుండేవారు.


సంసారమనే బండికి ఆలుమగలు రెండు చక్రాలు. తాతా తండ్రులు పాటించిన ఆచార్య వ్యవాహారాలను తాము పాటించి తమ పిల్లలకు నేర్పేవారు. క్రమశిక్షణ, మాటపట్టింపు, నీతి నిజాయితీ ఆనాటి పెద్దలు అభిమానంతో పాటించినవి, తమ పిల్లలకు నేర్పినవి.


కారణాంతరాల వలన ఆ రెండు కుటుంబాల్లో ఏ కుటుంబమైనా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తే.. రెండవ కుటుంబపెద్ద ఆ కుటుంబాన్ని ఆదుకొనేవారు. సాయం చేసి వారిని పూర్వస్థితికి చేరేలా చేసేవాడు. అది ఆనాటి మంచి మానవత్వం.


ఆ రోజుల్లో..

రంగారావు, ఆనందరావు ఒకే వూరివారు.

రంగారావు వ్యవసాయదారుడు.

ఆనందరావు చిన్నచిన్న కాంట్రాక్ట్‌ పనులు వున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేవాడు. భోజనానికి సంవత్సరం అంతా సరిపడే ధాన్యం భూమినుంచి వచ్చేది. కాంట్రాక్ట్‌ పనులలో వచ్చిన లాభంతో ఇంటి పై ఖర్చులను జరిపేవాడు.


వారి భార్య జగదాంబ. ఒక కుమారుడు మాధవరావు. యం. ఎ. వరకు చదివి తండ్రికి కాంట్రాక్ట్‌ పనుల్లో సాయంగా వర్తించేవాడు. తండ్రిమాట మాధవరావు వేదం. తల్లి తండ్రులంటే మాధవరావుకు ఎంతో అభిమానం, గౌరవం. వూర్లో ఆ కుటుంబానికి మంచిపేరు.. రంగారావు పది ఎకరాల పంటభూమి, ఆరు ఎకరాల మెట్టు భూమి, బావి, పంపుసెట్‌ వున్న ఆసామి. వారికి ఒక కూతురు సంధ్య.. కొడుకు గోపాల్‌. వారి సతీమణి శకుంతల. ఉత్తమ ఇల్లాలు. దానధర్మాలకు ముందు వుంటుంది.


రంగారావు ఆమెను ఏనాడు ఆక్షేపించలేదు. గోపాల్‌ అగ్రికల్చర్‌ బి. యస్సీ చదివి ట్రాక్టర్‌ కొని వ్యవసాయం చేయసాగాడు. తండ్రి బరువు బాధ్యతలను కొంతవరకు తాను స్వీకరించాడు.

సంధ్య బి. ఎ పాసయింది.


గొప్ప గొప్ప సంబంధాలు గోపాల్‌కు పిల్లనిస్తామని వచ్చాయి. తల్లితండ్రి గోపాల్‌తో వివాహ ప్రస్తావన చేశారు.


‘‘నాన్నా!.. ముందు నా చెల్లి సంధ్య వివాహం ఘనంగా జరగాలి. ఆ తరువాతే నా వివాహం.. ’’ నవ్వుతూ చెప్పాడు గోపాల్‌.


గోపాల్‌ నిర్ణయం రంగారావు దంపతులకు నచ్చింది. ఏకాంతంలో ఆ భార్యాభర్తలు ఆనందరావు కొడుకు మాధవరావును గురించి చర్చించారు.


‘‘ఏమండీ!.. మాధవరావు చాలా మంచి అబ్బాయి. తల్లీతండ్రి అంటే అతనికి ఎంతో గౌరవం. మనంత భాగ్యవంతులు వారు కాకపోవచ్చు. మా నాయనమ్మ చెబుతుండేది. ‘ఒసేయ్‌ అమ్ములు! మన పిల్లను మనకంటే పేదయింట ఇవ్వాలి. అప్పుడే ఆ కుటుంబీకులు మన పిల్ల కలవారి పిల్ల అని, ఎంతో అభిమానంతో గౌరవంగా చూచుకొంటారు. అవసరం అయితే మనం వారికి సాయం చేయాలి. అప్పుడు మనలను ఆ కుటుంబం గౌరవిస్తుంది. అభిమానిస్తుంది. మనపిల్ల ఆ యింట హాయిగా మహారాణిలా వుంటుంది’ చిరునవ్వుతో చెప్పింది శకుంతల.


భార్య సలహా రంగారావుకు బాగా నచ్చింది. సంధ్యతో మాధవరావును గురించి ప్రస్తావించాడు.

‘‘నాన్నా!.. మీ ఇష్టమే నా ఇష్టం’’ అంది సంధ్య చిరునవ్వు సిగ్గుతో తలదించుకొని.

మాధవరావు ఆ ఇంటివారందరికీ బాగా నచ్చాడు.


మంచిరోజు చూచుకొని రంగారావు దంపతులు ఆనందరావు గారి ఇంటికి వెళ్ళారు. కులగోత్రాలతో సమస్య లేదు.


వచ్చినవారిని సాదరం ఆహ్వానించారు ఆనందరావు వారి శ్రీమతి.

రంగారావు.. తమరాకను గురించి వారికి తెలియజేశాడు.


ఆనందరావు శ్రీమతులకు పరమానందం. తల్లి శ్రీమతి, కొడుకు మాధవరావుతో రంగారావు వారి సతీమణి రాకను వారు వీరికి చెప్పిన విషయాన్ని వివరించింది.


‘‘నాయనా!.. మాధవా సంధ్య అంటే నీకు ఇష్టమే కదూ!.. ’’ అడిగింది శ్రీమతి.


మాధవరావు సంధ్య ఒకే కాలేజీలో చదివినవారు. ఒకే వూరివారు. ఇరుగుపొరుగులు. సంధ్యను గురించి మాధవరావుకు మంచి అభిప్రాయం. అంటే సంధ్య కాలేజీలో ఆన్నిట్లో ఫస్టు. మంచి స్నేహశీలి. మితభాషిణి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేది.


ఆమెలోని ఆ లక్షణాలు బాగా నచ్చిన మాధవరావు.. చిరునవ్వుతో ‘‘అమ్మా!.. ఆ సంబంధం నాకు ఇష్టమే!.. ’’ నవ్వుతూ చెప్పాడు.


శ్రీమతి కొడుకు చేతిని తన చేతిలోకి ఆనందంగా తీసికొని హాల్లోకి వచ్చింది.

మాధవరావు, రంగారావు శకుంతలకు చిరునవ్వుతో చేతులు జోడిరచి నమస్కరించాడు.


‘‘ఏం బాబూ!.. మీ అమ్మగారు నీతో చెప్పే వుంటారు. మా సంధ్య అంటే మీకు ఇష్టమేనా!.. నిర్మొహమాటంగా చెప్పండి. కారణం వివాహం అనేది రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధుత్వం.. నూరేళ్ళ బాంధవ్యం.. ’’ చెప్పాడు రంగారావు.


మాధవరావు చిరునవ్వుతో తల ఆడిరచాడు.

‘‘రంగారావుగారు మీ నిర్ణయం నాకు నా భార్యకు కుమారుడికి పూర్తి సమ్మతం.. ’’ చిరునవ్వుతో చెప్పాడు ఆనందరావు.


రంగారావు వారి సతీమణికి పరమ ఆనందం..

‘‘ఆనందరావుగారూ!.. త్వరలో నిశ్చితార్థం, వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తాము. మీరు మా అభిప్రాయముతో ఏకీభవించినందులకు ధన్యవాదములు’’ లేచి నిలబడి చేతులు జోడిరచారు రంగారావు.


నలుగురు పెద్దలూ వీధివాకిటకి చేరారు. వెళ్ళొస్తామని చెప్పి రంగారావు దంపతులు ఆనందంగా వారి ఇంటికి వెళ్ళిపోయారు. శుభముహూర్తాన రెండునెలల తరువాత మాధవరావు, సంధ్యల వివాహాన్ని, రంగారావు కుటుంబం ఘనంగా జరిపించారు. ఆ వివాహం జరిగిన ఆరునెలల లోపల పొరుగువూరి శంకరరావు, వనజల కుమార్తె ప్రీతితో గోపాల్‌ వివాహం గొప్పగా జరిగింది.

మూడు వసంతాలు కాలచక్రంలో సాగిపోయాయి.


సంధ్యకు కవలపిల్లలు. ఆడ, మగ జన్మించారు. ప్రీతి మగ శిశువు జన్మనిచ్చింది.


పెద్దలు ఆనందరావు, శకుంతల. రంగారావు శ్రీమతులు వుత్తరదేశపు యాత్రలకు టూరిస్టు బస్సులో బయలుదేరి వెళ్ళారు. యాత్రను పూర్తి చేసికొని తిరిగి వచ్చేటప్పుడు, రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొని.. బస్సు లోయలో పడిపోయింది. చాలామంది చనిపోయారు. కొందరికి తీవ్రగాయాలు.. చనిపోయినవారి జాబితాలో ఆనందరావు, శకుంతల, రంగారావు, శ్రీమతి చేరారు.


తల్లితండ్రుల వియోగంలో గోపాల్‌, మాధవరావులు ఎంతగానో బాధపడ్డారు. వాపోయారు.

కాలచక్రం మరో ఇరవై వసంతాలను చూపింది.


* * *

ఇరవై ఏళ్ళ తరువాత..


ఆ రెండు కుటుంబాల మధ్య విరోధభావం. గోపాల్‌ మనస్సున ఆనందరావు మూలంగా తన తల్లితండ్రులు చనిపోయారనే భావన.


మాధవరావు మదిలో తన తల్లితండ్రుల మరణానికి ఆనందరావు కారకుడనే నీచ ఆలోచన.

ఒకేసారి తల్లితండ్రి మరణంతో గోపాల్‌ ఆ బాధను మరచిపోయేదానికి త్రాగుడుకు బానిసైనాడు. వ్యవసాయం చేయడం మానేశాడు. ఆస్తిని అమ్మి త్రాగుడుకు కుటుంబ ఖర్చులను వాడేవాడు.

కూర్చొని తింటే త్రాగితే.. కొండలు కూడా కరిగిపోతాయనే సామెతలా.. రంగారావుగారి ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. ప్రీతి త్రాగుడు మానమని గోపాల్‌కు ఎన్నోసార్లు చెప్పింది. బ్రతిమాలింది. ఏడ్చింది. గోపాల్లో మార్పు రాలేదు. చివరకు విసిగిన ప్రీతి తన ఇద్దరు బిడ్డలతో, భర్త తన మాట విననందున త్రాగి తనను కొట్టి హింసిస్తున్నాడని.. తన పుట్టింటికి వెళ్ళిపోయింది. గోపాల్‌ ఏకాకిగా మారాడు. నీచుల సాహవాసం.. త్రాగుడు.. సదా మైకంలో మునిగి తేలేవాడు.


తల్లి ఇంట ప్రీతికి ఆదరణ కొద్దిరోజులు మాత్రమే లభించింది. అన్న త్రివిక్రం తన వాడైనా, వదిన ఇంటికి పరాయిదేకదా!.. ప్రీతిని పనిమనిషిగా మార్చింది. ఏడుస్తూ ప్రీతి తన ఇంటినీ, భర్తను వదలి తల్లి ఇంటికి వచ్చి తప్పు చేశానని వాపోయేది. ఫలితంగా పిల్లలు రాజా, మహిజాల ఆలనాపాలనను సవ్యంగా నిర్వర్తించలేక వాపోయింది. యుక్తవయస్సు వచ్చిన మహిజా ఎదురింటి యువకుడితో లేచిపోయింది.


రాజా చదువుకోకుండా ఇంట్లోని సామానులను దొంగిలించి అమ్మి చీట్లాట, త్రాగుడుకు బానిసై, చేయని నేరానికి నేరస్థుడుగా పిలవబడి జైలుపాలైనాడు.


సంధ్య తన అన్న గోపాల్‌ దుస్థితిని తలచుకొని ఎంతగానో బాధపడేది.


ఆమె భర్త మాధవరావులో ధనాశ పెరిగింది. తప్పుడు మార్గాల్లో తరంలేని నిర్మాణాలను చేసి, అవి కూలిపోయి, కేసులు, కోర్టులు, వ్యవహారాలలో సంధ్యని విమర్శిస్తూ మనస్శాంతిని కోల్పోయాడు.

మనోవ్యధతో సంధ్య ఒకరాత్రి గుండె ఆగి చనిపోయింది. ఆమె కుమారుడు భాస్కర్‌ ఒంటరి వాడైనాడు. తండ్రి మాధవరావును గురించి విన్న చెడును గురించి విమర్శించాడు. ఎదిగిన కొడుకని కూడా ఆలోచించక భాస్కర్‌ను మాధవరావు చితకబాదాడు. నోటికొచ్చినట్లు తిట్టాడు. ఫలితంగా భాస్కర్‌ తన తండ్రిలో మానవత్వం నశించినదని, తల్లిని తలచుకొని ఎంతగానో బాధపడేవాడు.

మాధవరావు రాగిణి అనే ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చాడు. ‘‘రేయ్‌! భాస్కర్‌ ఆమె నీ పినతల్లి. నీవు ఆమె చెప్పినట్లు నడచుకోవాలి’’ శాసించాడు.


రాగిణి భాస్కర్‌ చదువును మాన్పించింది. సరిగా భోజనం పెట్టేదికాదు. బానిసలా చూచేది. అన్నిరకాల చాకిరీ భాస్కర్‌చేత చేయించేది.


ఆకలిబాధ.. మనస్సున ఆవేదన.. తండ్రి తనను పట్టించుకోకపోవడం కారణంగా.. భాస్కర్‌ ఒకరాత్రి ఆ ఇంటినుండి పారిపోయాడు.


నిర్మాణంలో వున్న ప్లాట్స్‌ నాసిరకం కాంక్రీట్స్‌తో నిర్మించిన కారణంగా కూలిపోయింది.

అడ్వాన్స్‌లు ఇచ్చినవారు మాధవరావు పై కేసు వేశారు. కాంక్రీట్‌ను టెస్ట్‌ చేయడం జరిగింది. మాధవరావు మోసగాడని రుజువయింది. ప్లాట్స్‌ కొన్నవారి డబ్బును మాధవరావు తిరిగి ఇవ్వలేనందున ప్లాట్స్‌ కొన్నవారు పెట్టిన కేసు మూలంగా మాధవరావు అరెస్టు చేయబడ్డాడు. జైలు పాలైనాడు.


ఆ ఇంట్లో వున్న డబ్బు.. నగలను దోచుకొని రాగిణి మాయమైపోయింది.


ఒకనాడు ఆ వూరికి ఆదర్శంగా వున్న ఆ రెండు కుటుంబాలు చితికిపోయాయి.

భార్యాభర్తల సంసారజీవితం అపురూపం.. కలిమిలేములకు సంబంధంలేదు.


కష్టసుఖాల్లో ఇరువురూ కలసి ధైర్యంగా, దైవనమ్మికతో ముందుకు సాగితే అది ఒకనాటికి ఆనందప్రదం అవుతుంది.


కష్టాలకు ఓర్చు కోలేక.. పగ ద్వేషాలతో.. ఆశ మోసాలతో సాగే సంసారాల పరిస్థితి ఈ తీరుగానే మారుతుంది.


సంసారం అన్నది. రెండు ఎడ్లబండి. అందులో అన్ని సమయాల్లో భార్యాభర్తలు ఒకటిగా.. వున్నంతలో తృప్తిపడి.. సహనంతో నిశ్చలంగా దైవనమ్మికతో ముందుకు సాగాలి. సంతతిని క్రమశిక్షణతో పెంచాలి. అదే మంచి మానవత్వం.. సుఖసంసారం..


* * *


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


49 views0 comments

Comentarios


bottom of page