top of page

సంఘం చెక్కిన చిత్తరువు


'Sangham Chekkina Chittaruvu' New Telugu Story


Written By Ch. C. S. Sarma




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆశతోనే కలిగేది జననం. ఆశతోనే సాగేను జీవితం. పొద్దు తిరిగిన వయస్సులో వుండవలసిన ఆశ ఎవరికైనా ఒక్కటే.. ఆత్మీయుల సన్నిధి.. ఆత్మానందం.. శాంతి.


అది అనాధల ఆశ్రమం. నిర్వాహకురాలు ‘పావని మాత’. అందరూ ఆమెను ఆ పేరుతొ పిలుస్తారు. కానీ ఆమె అవివాహిత. ఆశ్రమవాసులు ఆమెను అలా గౌరవంగా పిలుస్తారు. ఆశ్రమానికి ‘మాతా శరణాలయం’ అని పేరు.


బాంబే నుంచి వచ్చి.. ఐదేళ్ళ క్రిందట ఆ ఆశ్ర మాన్ని స్థాపించింది. ఆ భవన నిర్మాణానికి పది హేను లక్షలు ఖర్చు పెట్టింది. నాలుగు ఎకరాల స్థలంలో భవంతి.. ముప్పై గదులతో రెండు అంతస్తులతో ఆ ప్లాట్ నైరుతీ భాగంలో ఆ భవన నిర్మాణం జరిగింది.


సహృదయులైన.. కొందరు పావనిని కలసి.. విరాళాలను యిచ్చారు. మూడు సంవత్సరాల క్రిందట.. ప్రాధమిక విద్యా కేంద్రాన్ని కూడా ఆ ఆవరణలో నిర్మించింది. దాదాపు నూటయాభైమంది పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు.


ఆశ్రమం చుట్టూ రకరకాల చెట్లు, పూలమొక్కలు నాటించి.. ఆశ్రమ వాసులను ఎంత ఆదరాభిమానాలతో చూచుకొంటుందో.. అదే రీతిగా వాటి సంరక్షణను చేస్తూవుంది పావని. ఆశ్రమవాసులు రెండువందల మంది మాత ఆధ్వర్యాన అన్ని పనులు నిర్వర్తిస్తూ ఆనందగా వుంటారు.


అక్కడ ఉన్నవారికి.. వారి గత జీవిత చేదు జ్ఞాపకాలు తప్ప.. వేరే చింతలూ లేవు.

మాయదారి మనస్సు గతాన్ని మరువలేదుగా!.. ఈ సమస్య అక్కడవున్న వారికే కాదు, పావనికీ వుంది. మనస్సుకు మరిచే గుణం వుంటే.. మనస్సుల్లో ఎలాంటి అలజడి వుండదుగా!.. కాని అలాంటి శక్తీ.. మనస్సుకు లేదే!..

&&&&&


“సార్!.. నమస్కారం!.. ”

“ఎవరండీ మీరు?.. ”

“నేను మాతా ఆశ్రమం నుంచి వచ్చాను. నాపేరు రాంబంటు. మా మాత పావనిగారి ఆరోగ్యం మూడు రోజులుగా సరిగా లేదు. హాస్పిటల్ కు వెళదామంటే వారు నిరాకరిస్తున్నారు. మీరు వచ్చి మా మాతను చూడాలి సార్ !.. ” కన్నీటితో కోరాడు రాంబంటు.


“మీ మాత పెరేమిటీ?.. ” ఆశ్చర్యంతో అడిగాడు డాక్టర్ శ్రీరామ్.

“పావనీ మాత.. ” చెప్పాడు రాంబంటు.


శ్రీరాం.. కొన్ని క్షణాలు ఆలోచించాడు. మనస్సులో ఏదో సందేహం.. అనుమానం.. ఆవేదన.. నిట్టూర్చి.. “పదండి.. ” కుర్ఛీ నుండి లేచాడు శ్రీరామ్.


రాంబంటు ముందు.. వెనుక శ్రీరామ్ బయలు దేరారు. తన కార్లో అరగంటలో ఆశ్రమాన్ని చేరారు.

వారంరోజుల క్రిందట ఆవూరికి.. డి. ఎం. ఓ. గా శ్రీరాం వచ్చాడు ప్రభుత్వ హాస్పిటల్ కు.

ఆశ్రమం వూరికి పది కిలోమీటర్లు దూరంగా వుంది. అక్కడక్కడా కొన్ని భవనాలు వున్నాయి. ఖాళీ ప్లాట్లు చాలా వున్నాయి. ఆ ప్రాంతాన్ని చూచి.. ‘ఇటీజ్ అండర్ డెవలప్ మెంట్ ‘ అనుకొన్నాడు శ్రీరాం.


కారును పోర్టికోలో నిలిపి.. దిగాడు. రాంబంటు శ్రీరాం చేతిలోని బ్యాగ్ ను తాను తీసికొన్నాడు. “రండి సార్.. రండి.. ” వేగంగా పావని వున్నా గది వైపుకు నడిచాడు. శ్రీరాం అతన్ని అనుసరించాడు.


ఇరువురూ పావని వున్న గదిలో ప్రవేశించారు. “సార్!.. మా మాత.. కాపాడండి సార్.. ” పావనిని చూపుతూ బొంగురుపోయిన కంఠంతో దీనంగా చెప్పాడు రాంబంటు.


శ్రీరామ్.. పావనిని పరీక్షగా చూచాడు కొన్ని క్షణాలు. అతని అనుమానం నిజం అయింది. వదనం లో విచారం. మనస్సులో మూగ బాధ. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొన్నాడు. తమాయించుకొని కళ్ళు తెరచి.. దుప్పటిని తొలగించి పావని చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. జ్వరం తీవ్రంగా వుంది.


తన బ్యాగ్ ను తెరచి.. సిరంజీ లిక్విడ్ బాటిల్ ను బయటికి తీసి పావనికి ఇంజక్షన్ చేసాడు. దుప్పటిని కప్పాడు.


హెడ్ నర్స్ గాయత్రి గదిలోనికి వచ్చింది. ఆమె ఏడుస్తూ.. ”సార్! మా అమ్మగారు మూడురోజులుగా ఇదే స్థితిలో వున్నారు. ఏమీ తినలేదు. త్రాగలేదు. మా మాతను కాపాడండి సార్.. ” దీనంగా అడిగింది.


“భయపడకండి.. నిమోనియా జ్వరం.. త్వరలో తగ్గిపోతుంది. ఆమె మేల్కొనే వరకు నేనూ ఇక్కడే వుంటాను. ఆమెతో మాట్లాడిన తర్వాతనే.. నేను వెళతాను.. ” అనునయంగా చెప్పాడు డాక్టర్ శ్రీరామ్.


రాంబంటు.. గాయిత్రీ వారి మాటలను నమ్మారు. వారిలో వున్న భయాందోళన కొంతవరకు తగ్గింది. దీనంగా పావని ముఖంలోకి చూస్తూ వుండి పోయారు.


పావని జుట్టులో కొన్ని వెండితీగలు. ముఖం పాలిపోయింది. కండ్లక్రింద నల్లని చారలు. ‘యిప్పటికి.. పావనికి దాదాపు యాభై సంవత్సరాలు. పొద్దు పడమట వైపుకు వాలింది. కానీ ముఖంలో ఏదో కళ.. కాంతి.. అనుకొన్నాడు తదేకంగా ఆమె ముఖాన్ని చూస్తూ శ్రీరాం.

“అమ్మ!.. మీరు ఇక్కడే వుండండి. కొంతసేపట్లో మీ అమ్మగారు మేల్కొంటారు. నేను మీ ఆశ్రమాన్ని అంతా చూసివస్తాను. రాంబంటూ ! నీవు నాతో రా!” అని శ్రీరాం గదినుండి బయటికి నడిచాడు. రాంబంటు అతన్ని అనుసరించాడు.


శ్రీరాం.. ఆశ్రమాన్నంతా తిరిగి చూచాడు. గత జ్ఞాపకాలు మనస్సున అల్లరి చేస్తున్నాయి. రాంబంటు మౌనంగా అతని వెనకాలే నడుస్తున్నాడు.


“రాంబంటూ! మీ అమ్మగారి ఆరోగ్యం ఎప్పటి నుంచీ సరిగా లేదు?.. ”


“మూడురోజుల నుంచి సార్.. ఆ క్రిందటి సాయంత్రం ఎవరో ఒక వ్యక్తి ఆశ్రమానికి వచ్చారు. అమ్మగారిని కలిసారు. గది తలుపులు మూసుకొన్నారు. ఇరువురూ అరచుకొంటూ ఏవేవో మాట్లాడుకొన్నారు. అరగంట తర్వాత ఆ వ్యక్తి కోపంగా గది బయటికి వచ్చి.. తానూ వచ్చిన కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు. నేను అమ్మగారి గదిలో ప్రవేశించాను. భోరున ఏడుస్తున్న అమ్మ గారిని చూచాను.


‘ఏం జరిగింది అమ్మా.. అని అడిగాను. ఏం లేదులే.. నీవు వెళ్లి నీ పని చూచుకో.. ఫో.. !” అని అన్నారు. ఆ రాత్రి వారూ ఏమీ తినలేదు. గదినుండి బయటికి రాలేదు. తెల్లవారి మేము చూసేసరికి జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ ను పిలుస్తామంటే వద్దన్నారు. మూడు రోజులుగా వారి స్థితి అలాగేవుంది. నాకు.. ఏం చేయాలో తోచక మీదగ్గరకు పరుగెత్తుకొచ్చాను. మీరు నా మాటను మన్నించి నాతో వచ్చారు. మా అమ్మగారిని కాపాడారు. మీ రుణాన్ని మేమంతా ఈ జన్మలో తీర్చుకోలేము సార్!.. ” శ్రీరాం కాళ్ళు పట్టుకొన్నాడు రాంబంటు.


అతన్ని భుజాలు పట్టుకొని పైకి లేపి.. “ఒక డాక్టర్ గా నేను నా కర్తవ్యాన్ని చేసాను. నేనూ మీలాంటి మనిషి నే. ” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరాం.


అతని మనస్సులో.. ఆ వచ్చిన వ్యక్తి ఎవరై వుం టారు?.. అతనికి పావనికి సంబధం ఏమిటి?.. వాడిని చూచి పావని అంతగా ఎందుకు అప్సెట్ అయింది?.. ఏదో బలమైన కారణం లేకుంటే.. పావని ఎందుకు ఇంతగా కృంగిపోతుంది?.. అన్నీ సమాధాన రహిత ప్రశ్నలే..


గాయిత్రి పరుగున వారిని సమీపించింది.

“సార్!.. మాత మేల్కొన్నారు.. మిమ్మల్ని చూడాలంటున్నారు.. ” ఆనందంగా చెప్పింది.

శ్రీరాం, రాంబంటు, గాయిత్రీలు ఆ గదిని సమీపించారు. వారిరువురినీ చూచి శ్రీరాం..

“నేను పిలిచినప్పుడు మీరు లోనికి రండి.. ” అని చెప్పి మెల్లగా తలుపు తెరచి పావని గదిలో ప్రవేశించాడు శ్రీరాం. తలుపును మూసాడు. మెల్లగా పావని మంచాన్ని సమీపించాడు.


“మిమ్మల్ని నమ్మి ఎందరో ఆశ్రితులు వున్నారు. మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు. నేను యిచ్చే మందులను మూడు పూటలా ఆహారం తీసుకొన్న తర్వాత వేసుకోవాలి.. ” తన బ్యాగ్ తెరచి క్యాప్సిల్ తీసి మంచం ప్రక్కన వున్న స్టూల్ పైన ఉంచాడు శ్రీరాం.


పావని అతన్ని ఆశ్చర్యంతో చూడసాగింది. నెరిసిన జుట్టు.. కళ్ళకు అద్దాలు.. గంభీరమైన ముఖం.. గతంలో చూచి.. పరిచయంవున్న ముఖంలా.. శ్రీరాం వదనం ఆమెకు గోచరించింది. కృతజ్ఞతాభావంతో చేతులు జోడించింది.


“రాంబంటూ.. ” పిలిచాడు శ్రీరాం.

రాంబంటు గాయిత్రీలు గదిలోనికి వచ్చారు.


స్టూల్ పై తాను ఉంచిన క్యాప్సిల్ ను చూపుతూ “వాటిని మూడు పూటలా ఆహారం తిన్న.. పావుగంట తర్వాతా యివ్వండి. యిపుడు కాఫీ.. టీ పాలు వారికి ఏది యిష్టమో దాన్ని యివ్వండి. ఇడ్లీ తిన వచ్చు. వద్దన్నా సరే.. బలవంతంగా పెట్టండి. నేను రేపు ఉద యం వస్తాను”.


పావని వైపుకు చూచి.. “మీరు ఏ విషయానికి భయపడనవసరం లేదు. మీకు నేను అండగా వుంటా”.. చెప్పి శ్రీరాం హ్యాండ్ బ్యాగ్ తో గదినుండి బయటికి నడిచాడు.

చిత్తరువులా అతన్నే చూస్తూవుండి పోయింది పావని. మనస్సున.. అతన్ని ఏవేవో అడగాలని.. తన సందేహాలను తీర్చుకోవాలనే కోరిక.. తనలోని నీర సత్వం.. శ్రీరాం కూర్చోకుండా వెళ్ళిపోవడం.. కారణంగా ఆమె మనస్సున రేగిన ఆశలు.. అలాగే ఉండిపోయాయి. మదిలో.. ఎన్నో సందేహాలు.. కల వరం.. శ్రీరాం చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారు మ్రోగాయి. అతన్ని గురించిన ఆలోచనలతో.. కళ్ళు మూసుకొంది పావని.

&&&&&

శ్రీరాం కారు నడుపుతున్నాడు. అతని మనస్సు నిండా గత జీవిత జ్ఞాపకాలు.

పావని.. తను బి. ఎస్సీ లో క్లాస్ మేట్స్. ఆరు నెలల ఫస్టియర్ క్లాస్ జీవితంలో వారి పరిచయం ప్రేమగా మారిపోయింది.


ఆ మూడు సంవత్సరాలు.. హద్దులు దాటక ఇరువురూ వారి భావిజీవితాలును గురించి.. కాబోయే భార్యాభర్తలుగా తియ్యని ఊహాలలో విహంగాలై విహరించారు.

ఆ మూడు సంవత్సరాలూ వారి జీవితంలో మరువలేని.. మరపురాని మూడు మధుర వసం తాలుగా మిగిలి పోయాయి. పరీక్షలయ్యాక తల్లి దండ్రులకు చెప్పి వివాహం చేసుకోవాలనుకున్నారు.


ఫైనల్ యియర్.. పరీక్షలు ముగిసాయి. గుంటూరు నుండి శ్రీరాం తన వూరు తిరుపతి కి.. పావని తన సొంత వూరు వైజాగ్ కు వెళ్ళిపోయారు.

పావని తండ్రి ఇండియన్ బ్యాంక్ మేనేజర్. వారికి కలకత్తాకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ కుటుంబం కలకత్తాకు వెళ్ళిపాయింది.


శ్రీరాం కు పావని వ్రాస్తున్న లేఖను తండ్రి విక్రం చూచి ఆవేశంలో చించి వేసాడు. పావనిని.. బాంబే లో వున్న తన బావమరది జోగారావు మాటలు నమ్మి.. ఉద్యోగ నిమిత్తం.. ఆమెను బాంబే కి తీసుకొని వెళ్లి జోగారావుకు.. అప్పగించాడు. తానూ కలకత్తాకు తిరిగి వచ్చాడు.


తల్లితండ్రులకు తన ప్రేమ విషయం చెప్పి వారిని ఒప్పించి పావనికోసం శ్రీరాం.. వైజాగ్ వచ్చాడు. వారు కలకత్తా వెళ్లిపోయారని తెలిసికొని.. అక్కడికి వెళ్లి పావని బాంబేలో వున్నదని తెలుసుకొని.. బాంబే కి వెళ్లి పావనికోసం గాలించాడు. వారు చెప్పిన అడ్రస్ తప్పు అయినందున.. శ్రీరాం ప్రయత్నాలు ఫలించలేదు. నెల రోజులు అక్కడ వుండి.. అతను పావనీని కలుసుకోలేక పోయాడు. భగ్నప్రేమికుడై తిరుపతికి తిరిగి వచ్చాడు.

ఆ తర్వాత.. ముప్పై సంవత్సారాల అనంతరం.. చిత్రంగా ఈనాడు ఆ స్థితిలో శ్రీరాం పావనిని చూచాడు. అతని మనస్సులోని భూతకాలం చెదరి పోయింది. వర్త మానం నిండిపోయింది.

&&&&&

“గుడ్ మార్నింగ్ !.. డాక్టర్ గారు.. ” నవ్వుతూ చెప్పింది పావని.

శ్రీరాం.. ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. అతని కళ్ళకు ఆనాటి పావని గోచరించింది. “ఏమిటి శ్రీరాం!.. అలా చూస్తున్నావ్!” పేలవంగా నవ్వింది పావని. క్షణం తర్వాత “కూర్చో! నీతో చాలా మాట్లాడాలి” అంది పావని.


మంచం ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు శ్రీరాం. “నేను మిమ్మల్ని యిపుడు ఏమని పిలవాలి?.. ” మెల్లగా తలదించుకొని అడిగాడు శ్రీరాం.

“నేను.. నిన్ను అని పిలిచానుగా.. నీవు నన్ను.. అలాగే.. ”


“పావనీ.. ఏమిటి యిదంతా!.. ” దీనంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు శ్రీరాం.

“ ‘ఇహం’.. నా జీవితంలో వీరవిహారం చేసింది. నన్ను సంఘం చెక్కిన చిత్తర్వులా మార్చింది. ఆ సంఘం మా నాన్నా అమ్మా.. మా మేనమామ జోగారావు.. ఇంకా ఎందరెందరో!.. ఒక రాయిని ఒక శిల్పి చెక్కితే అది అందమైన.. చిత్తరువు అవుతుంది. అనేకులు వారివారి ఇష్టానుసారంగా చెక్కితే అది అందవిహీన మైన దిష్టి బొమ్మ అవుతుంది. నేనూ వారందరివల్లా అలాగే మారాను. నాకు వుద్యోగం ఇప్పిస్తానని.. మా నాన్నను నమ్మించి నన్ను బాంబే కు రప్పించాడు జోగారావు. నన్ను.. తన కామదాహానికి ఆహుతి చేసాడు. అంతటితో ఆగక.. దుబాయ్ పఠాన్ కు నన్ను పాతిక లక్షలకు అమ్మాడు జోగారావు.


వాడి కారాగారంలో.. వాడి ఆటబొమ్మలా ఐదేళ్ళు గడిపాను. అక్కడే మరో మూడు చేతులు మారింది ఈ బొమ్మ. మరో ఐదేళ్ళు గడిచి పోయాయి.

ఆ తర్వాత బాంబేకి తిరిగి వచ్చాను. నన్ను.. ఆ స్థితికి గురిచేసింది డబ్బు.. నాలో ఈ సంఘం పట్ల వున్న పగ.. కోపం.. ద్వేషం.. తీరాలంటే ఆ డబ్బును నేను సంపాదించాలి. నాలో వున్న ఆసలు ఆకాంక్షలు తీరాలంటే నేను డబ్బును సంపాదించాలి. స్ట్రీట్ లైట్ గా మారిపోయాను. కసిగా డబ్బును రేరాణిగా మారి.. సంపాదించాను. పదిహేను సంవత్సరాలు ఆ దాహం తోనే గడిపాను. కొవ్వొత్తిలా మారి ఎందరికో.. వారు కోరిన రీతిలో వెలుగును చూపించాను. కోట్లు సంపా దించాను.


తలలో కనుపించిన నెరిసిన వెంట్రుకలను ఒకనాడు చూచాను. యిక ఈ జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకొన్నాను. బాంబే వదిలేశాను. ఇక్కడికి వచ్చాను. ‘ఇహాన్ని’ సమాధి చేసాను. ఇక ‘పరం’ దారిని గురించి ఆలోచించాను. నాలాంటి.. ఎవరూలేని.. వున్నవారు కాదన్న వారికి.. ఆశ్రయాన్ని కల్పించాలనుకొన్నాను. ఆశ్రమాన్ని స్తాపించాను.


గడిచిన ఐదు సంవత్సరాలుగా.. నా చుట్టూ చేరిన వారితో.. ఎంతో ఆనందంగా వున్నాను. కానీ.. దైవ నిర్ణయం వేరుగా వున్నట్లు వుంది. ఐదురోజుల క్రిందట ఆ జోగారావు ఆశ్రమంలో ప్రవేశించాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ కోటి రూపాయిలు ఇవ్వకపోతే.. నా చరిత్రను పేపర్లకు వీడియోలకు ఎక్కిస్తానని నన్ను బెదిరించాడు.


నేను.. నా ఆత్మీయుడు.. ఈ ఆశ్రమ నిర్మా ణానికి నాకు సాయం చేసిన రిటైర్డ్ డి. యస్. పి. దయానిధి గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. వారు వాడిని వెదికి పట్టుకొని తన్ని జైల్లో త్రోసారు.


వాడి రాక.. వాడు మాట్లాడిన మాటలు నన్ను ఎంతగానో కలవార పరిచినాయి. బి. పి. పెరిగింది. మంచం పట్టాను. నీవు వచ్చావు. నన్ను రక్షించావు. కానీ.. నీవు వాడి బారినుండి నన్ను.. ఎంతకాలం కాపాడగలవు?.. ” దీనంగా కన్నీటితో అడిగింది పావని.


“నా జీవితాంతం వరకూ!.. ”

“అంటే!.. ” ఆశ్చర్యంగా శ్రీరాం ముఖంలోకి చూచింది.. పావని.

“నీ శేష జీవితానికి నేను అనుక్షణం.. నీకు అండగా వుంటాను.. నీవు కోరిన విధంగా.. ” పావని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు శ్రీరాం.


“శ్రీరాం! నీవు పెండ్లి చేసుకోలేదా!.. ”

లేదు అన్నట్టు తల ఆడించాడు.

“కారణం?.. ”

“నీతో పంచుకొన్న ప్రేమను.. ఈ జన్మలో మరువలేను కాబట్టి.. ”


“ఆశ్రమ బాధ్యతలను దయానిధిగారికి అప్పగించి.. నన్ను తెలియని వారి మధ్యకు దూరంగా వెళ్ళి పోవాలనంది నా కోరిక.. ” దీనంగా కన్నీటితో చెప్పింది పావని.

“నేను నీతో వచ్చేదానికి అవకాశం కల్పింప గల వా?.. ” అభ్యర్ధనగా అడిగాడు శ్రీరాం.

రాంబంటు వచ్చి.. డి. యస్. పి. దయానిధి వచ్చారని చెప్పాడు.


పావని.. ఆఫీస్ గది వైపు నడిచింది. శ్రీరాం ఆమెను అనుసరించాడు.

ముగ్గురూ ఆఫీస్ గదిలో కూర్చున్నారు. ఆ క్రిందట రాత్రి స్టాంప్ పేపర్ మీద వ్రాసి తను సంతకం చేసిన దాన్ని పావని.. దయానిధికి అందించింది.


యికపై.. ఈ చిన్న సామ్రాజ్యానికి మీరే చక్రవర్తులు. జీవితం లో ఎంతగానో అలసిపోయాను. ఈ నా మిత్రునితో కలసి దూరంగా వెళ్లిపోదలిచాను. నా కోర్కెను మన్నించి నా విన్నపాన్ని అంగీకరించండి సార్!.. ” చేతులు జోడించింది పావని.. దయానిధి తల ఆడించాడు.


ఆ మరుదినం.. పావనీ శ్రీరాం లు బదరీనాద్ వెళ్లి పోయారు. దయానిధి వారికి వీడ్కోలు పలికాడు.

&&&&&&

//సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.








44 views0 comments

Comentários


bottom of page