(భలే భలే సరదా కథ)
'Sarigamapadanisa Sanidapamagarisa' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao
'సరిగమపదనిస.. సనిదపమగరిస' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చక్రి.. సరోజ టౌన్ లో కొత్తగా వచ్చిన సినిమాకి వెళ్లాలని అనుకుంటున్నారు.. వారం రోజుల నుంచి.
కానీ టిక్కట్లు దొరకవేమో అని కొన్నాళ్ళు, జనంతో బాగా రష్ గా గత్తర గా ఉంటుంది అని కొన్నాళ్లు, ఖాళీ సమయం అందు నా ఫస్ట్ షో టైం కుదరక ఇంకొన్నాళ్ళు అలా అలా పది రోజులు గడిచి పోయింది.
అయితే వాళ్లు ఎప్పుడు షికారుకు బయటకు వెళ్లాలన్నా, అట్లాగే సినిమాకు వెళ్ళాలన్న ఆ పక్క వీధిలో ఉన్న ఆ ఇద్దరికీ ప్రాణ సమానమైన మరో ఫ్యామిలీ గిరిధర్, గౌతమిలతో కలిసే వెళ్తూ ఉంటారు.
చక్రి సెల్ ఆన్ చేశాడు.
" ఒరేయ్ గిరిధర్.. ఇంటి దగ్గరే ఉన్నావా? ఏం లేదు కొత్త సినిమా.. "సరిగమపదనిస.. సనిదపమగరిస".. చాలా బాగుందట కదా. నువ్వు మా చెల్లెమ్మ చూసేశారా?"
"ఎలా చూస్తాంరా.. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ జంట మా జంట కలిసే కదా వెళ్ళేది. అయినా సినిమా పెద్దగా బాగుండలేదేమో" అన్నాడు అవతల నుండి గిరిధర్.
“ఏంటి.. చూడలేదా.. ? మంచి పని చేశావు రా.
కొత్త సినిమా చాలా బాగుందని బయట టాక్.
సరే ఈరోజు ఫస్ట్ షో కు మీఫ్యామిలీ మా ఫ్యామి లీ కలిసి వెళ్దాం. సరేనా ఓకేనా.. అలాగైతే ఇద్దరు రెడీ అయిపోయి మీ బండి మీద ఇలా వచ్చేయండి. మా బండి మీద మేం బయలుదేరుతాము. అందరం కలిసి శ్రీనగర్ కాలనీలో థియేటర్కు వెళ్దాo''..
అంటూ తన కొలీగ్ గిరిధర్ తో మాట్లాడి చక్రి తను తన భార్య సరోజ టాయిలెట్ అవ్వడం మొదలు పెట్టారు.
సాయంత్రం 6:00 అయ్యింది.
చక్రి సరోజులు. గిరిధర్ గౌతమి అందరూ కలుసుకొని
చెరొక బండిమీద థియేటర్ సమీపించారు. ఈసారి మొత్తం టిక్కెట్లు తీసే బాధ్యత చక్రి సరోజలది.
టికెట్స్ తీసుకొని లోపలకు వెళ్లి కూర్చున్నారు. సినిమా మొదలయ్యింది.
రెండు ఫైట్లు ఒక పాట కూడా అయ్యాయి. సినిమా కథ కూడా చాలా వేగంగా వెండితెర మీద జరిగి పోతుంది.
చక్రి సరోజలు సినిమాలో లీనమైపోయి చాలా ఇంట్రెస్ట్ గా చూసేస్తున్నారు.
కానీ ఎందుకనో గిరిధర్, గౌతమి తమ కుర్చీలలో
అటూ ఇటూ కదులుతూ కాస్తంత అసహనంగా ఫీల్ అవుతూ సినిమా చూస్తున్నారు. అలా వాళ్ళు అసహనానికి లోనవుతో చూస్తున్నట్టు చక్రీ సరోజలు గమనించే స్థితిలో లేరు.
సినిమా 30 నిమిషాల వరకు గడిచిపోయింది.
సడన్గా పెద్ద సౌండ్ తో చక్రి సెల్ రింగ్ అయ్యింది.
చక్రి కొంచెం దూరం గా థియేటర్లోకి ఎంటర్ అయ్యే గుమ్మం వరకు వెళ్లి సెల్ ఆన్ చేశాడు. కంగారు పడ్డట్టు తన భార్య సరోజ ను సైగ చేసి పిలిచాడు.
ఆమె సీట్లోంచి లేచి మరింత కంగారుగా భర్త నిలబడ్డ థియేటర్ ఎంట్రన్స్ డోరు దగ్గరకు వెళ్లి, విషయం తెలుసుకుని అవాక్కు అయిపోయింది.
అర్థం కాక గిరిధర్, గౌతమి కూడా కాసేపు గుసగుసగా మాట్లాడుకుని తమ సీట్లలో నుంచి లేచి వాళ్ల దగ్గరకు వెళ్లారు. అందరూ కలిసి థియేటర్ బయటకు వచ్చారు.
"గిరిధర్.. మా మామగారు జగన్నాధపురం నుండి బయలుదేరి వచ్చారట. ఇప్పుడే ట్రైన్ దిగారట. ఉదయం ఆయన ఇంటి దగ్గర బయలు దేరేటప్పుడు నాకు కనీసం ఫోన్ చేసి కూడా చెప్ప లేదు. సడన్ గా ప్రయాణం పెట్టుకొని వచ్చేశారు. అందుచేత నిన్ను చెల్లెమ్మ గౌతమిలను అప్సెట్ చేస్తున్నాం అనుకోవద్దు. తప్పదు కదా మేమిద్దరం బయలుదేరి వెళ్లి ఆయన్ని రిసీవ్ చేసుకుని ఆటో మీద ఇంటికి తీసుకుని వెళ్తాము. సినిమా కొంచెం అయిపోయింది కదా.. మీరిద్దరూ సినిమా పూర్తిగా చూసి రండి" అంటూ చేతులు పట్టుకున్నాడు.
సరోజ కూడా గౌతమి చేతులు పట్టుకొని..
"వదిన.. ఏమీ అనుకోవద్దు.. మా నాన్నగారు ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేస్తారు అని అనుకోలేదు..
'థియేటర్ లో ఉన్నాం ఓ గంట వరకు రైల్వే స్టేషన్ లోనే ఆగండి లేదా మన ఇంటికి వెళ్ళిపోయి గుమ్మం బయట నిలబడి ఉండండి'.. అంటే బాగుండదు కదా.. అందుకనే వెళ్లి పోవాల్సి వస్తుంది. నువ్వు మా అన్నయ్య గారు మీరిద్దరూ మమ్మల్ని క్షమించాలి." అంటూ తన కొలీగ్ గౌతమి చేతులు పట్టుకుని బ్రతిమలాడింది థియేటర్ బయట సరోజ.
గిరిధర్ గౌతమి ఒక్క నిమిషం మాట్లాడుకున్నారు. తమ ప్రాణ స్నేహితులైన వాళ్ళిద్దరూ లేకుండా విడిగా.. సినిమా పూర్తిగా చూడడానికి మనసు అంగీకరించడం లేదు అన్నట్లు ఒకరికొకరు మాట్లాడుకుని అవగాహన చేసుకుని అర్థం చేసుకో గలిగారు.
"చక్రి.. అలా ఏమి వద్దు రా.. మీరిద్దరూ లేకుండా మేమిద్దరం సినిమా చూసి ఇంటికి రావడం మా మనసుకు ఇష్టం కావడంలేదు. మేం కూడా మా ఇంటికి వెళ్లిపోతాం. మీరిద్దరూ రైల్వేస్టేషనుకు వెళ్లి మీ పని చూసుకోండి. మేము ఏమి అనుకోoకదా".. అన్నాడు స్నేహితుడు చక్రి భుజం మీద చెయ్యి వేస్తూ.. గిరిధర్
"సరోజ వదిన.. మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టి మాకు మాత్రం సినిమా చూడాలని ఎలా అని పిస్తుంది.. ? సినిమా ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ వచ్చి చూద్దాం. నడవండి.. అందరూ కలిసి వెళ్ళిపోదాం.." అంటూ తన కొలీగ్ సరోజను ను.. గేటు వైపు నడిపిస్తూ అంది గౌతమి.
గిరిధర్ గౌతమిల ఆప్యాయతకు ప్రేమకు తెగ ఆనందపడి పరవశించిపోయారు.. చక్రి సరోజ!
"అదేమిటి.. మా గురించి మీరిద్దరూ మీ ఆనందం పాడు చేసుకుంటే ఎలా? మీరిద్దరూ సినిమా చూసి రండి.. మళ్లీ వెళ్లాలంటే కుదురుతుందో లేదో సినిమా చాలా బాగుంది కదా. క్లైమాక్స్ లో చాలా ఇంకా చాలా చాలా బాగుంటుందట. మా పని మనిషి రంగమ్మ చెప్పింది. మీరిద్దరూ చూసి రద్దురూ.." అంటూ చాలా సేపు చక్రి సరోజలు గిరిధర్ గౌతమి లను తెగ బతిమాలాడారు.
అలా థియేటర్ బయట ఆరెండు జంటల మధ్య
బ్రతిమిలాడడం.. బుజ్జగింపులు 15 నిమిషాల సేపు జరిగాయి.
చివరికి వాళ్ళందరూ సినిమా చూడడం మానేసి మధ్య లో ఇళ్లకు వెళ్లిపోవాలని నిశ్చయించు కున్నారు.
గేటు బయట షెడ్డు ఉన్న తమ తమ వాహనాలు తీసుకునేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు.
ఇప్పుడు చక్రీ సరోజలు ముసిముసిగా నవ్వుకుం టున్నారు తమలో.
ఎందుకంటే చక్రీ సరోజ లు చెప్పింది అబద్ధం.. ఎవరు రైల్వే స్టేషన్కు రాలేదు. ఆ వచ్చిన ఫోను సత్య ప్రకాష్ గారిది మరి. మరి విషయం ఏమి టంటే.. చక్రీ సరోజ లు ఇద్దరూ ఈరోజు ఊర్లో ఒక పార్టీ కి సత్య ప్రకాష్ గారి ఇంటికి ఇదే రోజు రాత్రి 7 గంటలకు వెళ్ళవలసి ఉంది.. కానీ శుభలేఖ సరిగ్గా చూసుకోకపోవడంతో ఆ పార్టీ జరిగేది.. "రేపు" అన్న అభిప్రాయంతో.. మరుపుతో ఈరోజు సినిమాకు బయలుదేరారు.
సినిమా చూస్తూ ఉండగా పార్టీ జరుగుతున్న సత్య ప్రకాష్ గారి చోటునుండి వీళ్ళకు.. బయలుదేరారా లేదా.. అంటూ ఫోన్ వచ్చింది. అప్పటివరకు పార్టీ ఈ రోజే అన్న విషయం గుర్తు లేదు. దాంతో తమ స్నేహితుడు అయిన గిరిధర్ కు అలా చెప్తే బాగుండదని ఎవరో వస్తున్నట్టు నమ్మశక్యం గా ఉండేటట్టు కొత్తతరహాకథ అల్లారు అన్నమాట.
గిరిధర్ గౌతమిలను ఆ రకంగా అబద్ధం చెప్పడం ద్వారా నమ్మించ గలిగినందుకు తమలో తాము ఇదేదో 'కొసమెరుపు' సంఘటన అన్నట్టు ముసి ముసిగా నవ్వుకుంటూ నడుస్తున్నారు.. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినoత ఆనందంతో. సప్త సముద్రాలు అర్ధ గంటలో ఈదేసినంత మహదా నందంతో.
ఈసారి గిరిధర్ కూడా తనలో తాను ముసిముసిగా నవ్వేసుకుంటున్నాడు.
"తనభార్యతో సహా మొత్తం అందరూ మహా ఘటికులే.. ! సినిమా చాలా బాగుంది అని అందరూ అనడంతో ఆగలేక ఉబలాటంతో రిలీజ్ అయిన మొదటి రోజే ఆఫీసుకు సెలవు పెట్టి మ్యాట్నీ సినిమా చూసేశాడు గిరిధర్ గారు వీళ్ళు ఎవరికీ చెప్పకుండా. కనీసం భార్య గౌతమి కి కూడా చెప్పకుండా తానొక్కడే కొత్తసినిమా. " సరిగమపదనిస.. సనిదప మగరిస" చూసేయడం.. ఈ జన్మలో బయటపడే విషయం కాదు..".. అని.. తనలో తాను అనుకుంటూ సినిమాను రెండోసారి చూడడానికి కుర్చీలో కూర్చుంటూ అసహనానికి లోనైన గిరిధర్ థియేటర్ నుండి బయటకు వచ్చాక తెగ నవ్వేసుకుంటూ నడుస్తున్నాడు.. మోటార్ షెడ్ దగ్గరకి.
అక్కడికి.. గౌతమి కి అనుమానమొచ్చి "ఎందుకు అలా మీలో మీరే నడుస్తూ తెగ నవ్వేసుకుంటు న్నారు.".. అంటూ అడిగింది నెమ్మదిగా.
"ఏం లేదోయ్.. సినిమాలో ఒక సన్నివేశం గుర్తొచ్చింది లే.. ".. అంటూ ఇంకా నవ్వేస్తున్నాడు అతను.. ఈ కథకు కొసమెరుపు పాత్ర తనదే అన్న ట్టుగా.. !
నిజమే.. 'కొసమెరుపే'.. కచ్చితంగా కొసమెరుపు పాత్ర మన హీరో గిరిధర్ గారిదే!
ఫైనల్ టచ్ ఇదే అనుకుంటున్నారు కదూ. కాదండి బాబు. ఇదే ఫైనల్ టచ్ అయితే ఈ కథకు వ్యాల్యూ ఎక్కడుంటుంది.
అందుకనే కథ ఇంకొంచెం పొడిగిద్దాం.
గిరిధర్ ఈ కథకు కొసమెరుపు హీరో అనుకుంటే.. అనుకుంటే అందరూ పప్పుదాక లో రెండు కాళ్లు కలిపి వేసినట్లే. అవును మరి.. గిరిధర్ భార్య గౌతమి గారి ఫేస్ ఒకసారి మనం పరిశీలించి చూస్తే.. ఆమె పైకి కనపడ కుండా చాలా రకరకాల యాంగిల్స్ లో ముసిముసిగా నవ్వేసుకుంటూ నడుస్తుంది.
'అయ్యా, అమ్మా.. అసలు విషయం ఏంటంటే..
కాసేపు మీరు ఊహించుకోండి. అబ్బే మీరు ఎంతో సేపు ఊహించుకున్న ఊహకు అందదు ఈ చిట్ట చివరి క్లైమాక్స్.
అదేమిటో వినేయండి మరి.. గిరిధర్ భార్య గౌతమి గారు తన భర్త ఊరిలో లేని సమయంలో..
"సరిగమపదనిస.. సనిదపమగరిస" సినిమా చాలా చాలా బాగుందని అందరూ చెప్పటంతో.. ఆత్రుత ఆపుకోలేక తన భర్త చూపిస్తాడో లేదో అన్న అపనమ్మకంతో తాను సినిమా విడుదలైన రెండవ రోజే.. భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా ఒంటరిగా వెళ్లి కొత్త సినిమా మ్యాట్నీ షో చూసి వచ్చేసింది వీళ్లందరి కన్నా ముందే!..
అంటే భర్తగారు మొదటిరోజు సీక్రెట్ గా చూసేయడం భార్య గారు రెండవ రోజు సీక్రెట్ గా చూసేయడం జరిగిపోయాయి
దాంతోనే ఆవిడ సినిమా హాలులో రెండవసారి సినిమా చూడ్డానికి కాస్త అసహనం ఫీల్ అయిందన్నమాట. అందుకనే ఆవిడ ఇంటికి వెళుతూ రకరకాల యాంగిల్స్ లో ముసిముసి గా నవ్వేసు కుంటుంది అన్నమాట.
ఇదన్న మాట అసలు విషయం.
ఒక్కరు కాదు.. అందరూ ఒకరి కన్నా ఒకరు మహా జగత్ జంత్రీలు అన్నమాట.
అన్నమాట ఏమిటండి బాబు ఉన్న మాటే. ఇలా
ఉంది ప్రస్తుత సమాజ పరిస్థితి.. మీరు కూడా ఇలాంటి ఒక మాయామశ్చీంద్ర తతంగం గతంలో ఒకసారి ఎప్పుడో ఏదో సందర్భంలో ఎవరో ఒకరి విషయంలో చేసే ఉంటారు. ఒక్కసారి మీ బుర్ర అరౌండ్ సర్కిల్ తిప్పి గుర్తు చేసుకోండి గుర్తు రాక మానక చస్తుందా.. ?
సరిగమపదనిస.. సనిదపమగరిస!
*****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentarios