top of page

సెల్ఫీ చెలగాటం


'Selfie Chelagatam' - New Telugu Story Written By Ch. C. S. Sarma

'సెల్ఫీ చెలగాటం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


నవీన విజ్ఞాన సాధనాలను.. అవసరాలకు తగిన రీతిలో వాడుకోవడం ఉచితం.. వీరాన్ని, సాహసాన్ని వాటి సాయంతో ప్రదర్శించడం అనే భావన అవివేకం అవుతుంది. అవివేకపు తర్వాత దశ.. ఆవేశం.. అది మంచిది కాదు. విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.. నేల విడిచి సాము చేయరాదు.


నేటి యువతరం.. బి. టెక్.. యం. టెక్.. చదువులు.. సెమిస్ట్రీ పద్దతిలో సాగుతున్నందున డిగ్రీలను సులభంగా సంపాదించుకొంటున్నారు. ర్యాంకులు తెచ్చుకొంటున్నారు. బాగా కష్టపడి చదివిన వారు గోల్డు మెడల్స్ను సాధిస్తున్నారు. మొదటి సంవత్సరంలో చదివింది.. ఆ సెమిస్ట్రీ పరీక్ష వ్రాసేటంతవరకే వారికి అవసరం..


చివరి సెమిస్ట్రీని.. వ్రాసే నాటికి ఆ మొదటి సెమిస్ట్రీలో చదివింది ఏ కొందరికో జ్ఞానం.. చివరి పరీక్షలలో దాని అవసరం వుండదు గనుక..

కాలం ఎంతో విలువైనదని అందరూ అంటారు. వారిలో ఆ విలువైన కాలాన్ని ఐ ఫోన్.. వాట్సప్ చాటింగ్లకు, ల్యాప్టాప్లో సినిమాలు చూచేటందుకు వినియోగించేవారు చాలామంది.


దినపత్రికలను, వీక్లీలను.. తెలుగు సాహిత్యాన్ని.. నవలలు, నాటకాలను చదివే ఓపికా.. తీరికా ముఖ్యంగా అభిలాష చాలామంది కోల్పోయారు.


చదువు తర్వాత.. వుద్యోగ సంపాదన.. మిత్రులతో కలసి కొత్తగా రిలీజ్ అయిన సినిమా కాస్టిలీ థియేటర్లో సందర్శించడం.. రాత్రి పొద్దు పోయేదాకా వాట్సప్ చాటింగ్.. ఏ ఒకటిన్నరకో.. రెండింటికో పడుకోవడం.. ఏడు, ఏడున్నర, ఎనిమిదికి లేవడం.. పిచ్చుక స్నానం చేయడం, జీన్స్ ప్యాంట్ తగిలించుకొని టీషర్టో.. ఫుల్షర్టో లేక ఆఫ్ర్టో ధరించి.. అల్పాహారాన్ని సేవించి బులెట్ పైనో.. సిటీ బస్లోనో.. షేర్ ఆటోలోనో ఆఫీస్ వైపుకు పరుగెత్తడం.. ఆలస్యమైతే బాస్కు బిక్కముఖంతో 'సారీ' చెప్పడం.. అన్నీ క్రమశిక్షణకు విరుద్ధమైన అలవాట్లే.. యీ పద్ధతులకు అతీతంగా వున్న వారు బహు కొద్ది మందే.. దానికి కారణం వారి తల్లిదండ్రుల పెంపకం.. చిన్ననాటి నుంచీ నేర్పిన పద్ధతులు.. ఇది నేటి యువత నగర జీవితం.. వుద్యోగస్థుల దినచర్యా విధానం..


కాలేజీ విద్యార్థులు.. కొందరు బస్సులో ప్రయాణించి కాలేజీకి చేరవలసిన రీతిలో ఆర్థిక పరిస్థితి. వారిలో కొందరు తమ బస్టాప్లో ఎక్కిన దగ్గర నుంచీ.. కాలేజీ బస్ స్టాప్ వరకూ ఫుట్ బోర్డు ట్రావిలింగే.. స్టాప్ రాగానే దిగి ఎక్కేవారిని ఎక్కనిచ్చి వారు మాత్రం ఫుట్బార్డులోనే నిలబడి ప్రయాణం సాగిస్తారు. కాలు జారి నేల పడితే.. బ్రతుకు ఏమౌతుందనే ఆలోచనే వారికి వుండదు. సాటి మనుషులతో ఒక బస్సులో ఎలా ప్రయాణం చేయాలనే విషయం తెలియని ఈ వీరాగ్రేసరులకు మరో పేరు.. భావి భారత పౌరులు.. వారిని ఆ స్థితిలో చూస్తే తల్లిదండ్రులు.. ఎంతగా బాధపడతారో అనే ఆలోచనే వారికి వుండదు.


పద్మారావు విద్యార్ధి దశను దాటి ఉద్యోగపర్వంలో ప్రవేశించాడు. కాలేజీ రోజుల్లో అమ్మను కాకాపట్టి 45 x 110 యం. యం సైజ్ సామ్సంగ్ ఫోన్ మూడు వేల ఐదువందలకు కొన్నాడు. పద్మారావు తండ్రి వరహాలరావు.. తల్లి సుమలత. ఇద్దరు సంతానం. పద్మారావు తర్వాత మూడేళ్ళకు ఓ పాప పుట్టింది. ఆమె వయస్సు ప్రస్తుతంలో పద్దెనిమిదేళ్ళు. పేరు పాచని. కాలేజీలో బి. యస్సీ ఫస్ట్ ఇయ్యర్ చదువుతూ వుంది. మంచి తెలివైన యువతి. తల్లిదండ్రులపై ఎంతో గౌరవం.. అన్నయ్య పద్మారావు అంతే ఎంతో అభిమానం.


వరహాలరావుగారు హోల్సేల్ వ్యాపారి.. మాట ఖరారైన మనిషి. బి. టెక్. ముగియగానే పద్మారావుకు.. మూడు నెలల లోపలే దాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం దొరికింది.

ఆ ఆఫీస్లో పద్మారావు ఒక సంవత్సరం సర్వీసును సంపాదించాడు. అతను చేరిన ఆరు నెలలకు దీప ఆ కంపెనీలో చేరింది. ఆమె మంచి అందగత్తె. తొలి చూపులోనే పద్మారావు ఐస్గడ్డలా కరిగిపోయాడు.


దీప మితభాషి.. తను.. తన పని.. అంతవరకే. అనవసరంగా ఎవరితోనూ మాటలు కలపదు. పైగా ఆమె యం. డి. దాస్ గారి బంధువు.


గడచిన ఆరునెలల కాలంలో దీప.. ఆఫీస్ పని విషయంలో పద్మారావును పన్నెండుసార్లు పలకరించింది. బాస్ తనకు చెప్పి.. పద్మారావుకు చెప్పమన్న విషయాలను చెప్పింది. పద్మారావు.. స్నేహితుడు నాయుడు.. పద్మారావు కంటే ఆరునెలల సీనియర్. నాయుడు మంచి మాటకారి.. చిరునవ్వుతో వందనంగా అందరినీ పలకరిస్తాడు. పద్మారావుకు అతని తత్వం బాగా నచ్చి.. అతనితో స్నేహాన్ని పెంచుకొన్నాడు.


తల్లీతండ్రి పర్మిషన్తో.. పద్మారావు మూడో నెల జీతంలో పదిహేను వేలు తీసుకొని ఐ ఫోన్ కొన్నాడు. రాత్రి పొద్దుపోయేదాకా వాట్సప్ నాయుడితో ఇతర మిత్రలతో చాటింగ్ చేసేవాడు. అందులో అతనికి ఎంతో ఆనందం. ముఖ్యంగా సెల్ఫీ ఫోటోలను రకరకాల భంగిమల్లో తీసుకొని స్నేహితులకు పంపడంలో అతనికి ఎంతో సంతోషం. “పద్మారావుగారూ!.. " దగ్గరకు వచ్చి పిలిచింది దీప.


తలను పైకెత్తి చూచాడు పద్మారావు. ప్రక్కన నిలబడి వుంది దీప. అతనికి ఎంతో సంబరం..

“వాట్ మేడం!.. ” ఆత్రంగా అడిగాడు.


“బాస్ మీకు యీ డ్రాయింగ్ను ఇమ్మన్నారు. ఎస్టిమెట్ను రడీ చేయమన్నారు” డ్రాయింగ్ చూపించింది దీప.


చిరునవ్వుతో అందుకొన్నాడు పద్మారావు.

“ఇంకా ఏమైనా చెప్పారా మేడం!.. ” మాటలను పెంచేదానికి అడిగాడు పద్మారావు.


“లేదు.. ” దీప తన సీట్ వైపుకు వెళ్ళిపోయింది.


డ్రాయింగ్ను విప్పి చూచాడు పద్మారావు. ఆ డ్రాయింగ్లో అతనికి దీప ముఖం గోచరించింది.

ఆశ్చర్యపోయాడు. కళ్ళు మూసుకొని తలను విదిలించాడు పద్మారావు. ఆమె మీద అతనికి వున్న పిచ్చికి అది నిదర్శనం.. అతని చేష్టలను గమనించిన నాయుడు.. పద్మారావును సమీపించి భుజంపై చెయ్యి వేసి వంగి..


“ఏం బ్రదర్!.. ఏమిటి వర్తమానం?.. ” చిరునవ్వుతో అడిగాడు నాయుడు.


"ఏం లేదు బాస్!.. ఈ డ్రాయింగ్ను చూడు. ఎస్టిమేట్ చేయాలట.. ”


“అంతేనా!.. ”


“అంటే!.. ”


“ఇంకేం లేదా!.. ”


"లేదు.."

"సరే పద. భోజన సమయం. ఆత్మారాముడు ఆకలంటున్నాడు. భోంచేసి వద్దాం!.. '


“ఓకే!.. పద బాస్!.. ”


పద్మారావు కుర్చీ నుండి లేచాడు. ఇరువురూ మెట్లు దిగి.. ఆ ఆఫీస్ భవనానికి ఆరో బిల్డింగ్లో వున్న ఫాస్ట్ఫుడ్ సెంటర్ వైపుకు నడిచారు.

"బాస్!.. ఏం తింటావ్?” అడిగాడు పద్మారావు.


“వడ, పెరుగన్నం.. ”


రెండు ప్లేట్లకు డబ్బులు ఇచ్చి టోకెన్స్ చేతికి తీసికొన్నాడు పద్మారావు.

నాయుడు రెండు గ్లాసుల్లో నీళ్ళు నింపుకొని టేబుల్ పై వుంచాడు. పద్మారావు ప్లేట్లను చేతికి తీసికొని టేబులు సమీపించి పైన వుంచాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు.


"బాస్!.. నేను ఒకటి అడుగుతాను. నిజం చెప్పాలి సుమా!.. ” అన్నాడు పద్మారావు.


“నాకు తెలిసి వుంటే చెబుతా. తెలియకపోతే తెలీదంటా. అబద్ధం మాత్రం చెప్పను. అడుగు.. ” అన్నాడు నాయుడు.


“నీవు ప్రేమించి పెండ్లి చేసుకొంటావా!.. పెళ్ళి చేసికొని ప్రేమిస్తావా?”


ఫ్రెండ్!.. మా నాన్న.. మా తాతయ్య.. పెండ్లి చేసికొని ప్రేమించారట” నవ్వాడు నాయుడు.

“అంటే!.. నీవు.. ”


“వాళ్ళ దారినే నడవాలనుకొంటున్నా!.. ”


పద్మారావు ఆ జవాబు విని మౌన్ గా వుండిపోయాడు.

అతని వాలకాన్ని చూచి నాయుడు..

"బ్రదరూ!.. నీవు ఎవరినైనా ప్రేమిస్తున్నావా!.. ”


పద్మారావు క్షణంసేపు నాయుడి ముఖంలోకి చూచి తలదించుకొన్నాడు.. తన మనస్సులో, దీప విషయంలో వున్న అభిప్రాయాన్ని నాయుడికి తెలియజేయాలా!.. వద్దా!.. అనే ఆలోచన.


“బాస్!.. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి!.. ” చిరునవ్వుతో అడిగాడు నాయుడు.

“నేను ఒకరిని లవ్ చేస్తున్నాను.. ”


“ఎవరా అదృష్టవంతురాలు!.. ”

“ఇప్పుడు చెప్పలేను.. ”


“ కారణం!.. ”


“ఆ సైడ్ నుంచి నాకు ఇంకా!.. ”


“జవాబు రాలేదా!.. పద్మారావు ముగించకముందే అడిగాడు నాయుడు.


“అవును.. ” విచారంగా చెప్పాడు పద్మారావు.


“అంటే లవ్ పేరుతో నీవు నీ ప్రశాంతతను కోల్పోతున్నావన్నమాట!.. ” నవ్వాడు నాయుడు.


పద్మారావు మౌనంగా వుండిపోయాడు. టిఫిన్ ముగించి ఇరువురూ ఆఫీస్.. వైపుకు బయలుదేరారు. పాన్షాప్ ముందు ఆగి నాయుడు ఓ కింగ్ సైజ్ గోల్డ్క్ సిగరెట్ను కొని వెలిగించాడు. పద్మారావు సిగరెట్ కాల్చాడు.


“పద్మా!.. ఓ విషయం చెప్పనా!.. ” పొగను గాల్లోకి వదులుతూ అన్నాడు నాయుడు.


“చెప్పు బాస్!.. ”


“ఇది నా నిర్ణయం.. నీవు పాటించడం.. పాటించక పోవడం.. అనేది నీ నిర్ణయానికి సంబంధించింది. చూడు.. ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించిందన్నా!.. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడన్నా.. ' దృష్టిలో అది ప్రేమ కాదు ఆకర్షణ. ఈ ఆకర్షణ అనేది వుంది చూశావ్!.. అది శాశ్వితం కాదు.. పై మెరుపులను చూచి ఒకరి పట్ల ఒకరికి ఏర్పడే తాత్కాలిక వ్యామోహం.. ఒక రీతిగా అదో పిచ్చి అని కూడా చెప్పొచ్చు.. కాబట్టి నీకు పెండ్లి చేసుకోవాలనిపిస్తే.. అమ్మా నాన్నకు చెప్పి.. వారికి అన్ని విధాల నచ్చిన సంబంధం.. అదే అమ్మాయి.. నీవూ చూచి నీకు నచ్చితే పెండ్లి చేసుకో.. ఆ అమ్మాయి ప్రేమించు.


మీ ఇరువురికీ ఇంతకుముందు పరిచయం లేని కారణంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ.. జరిగిన వివాహ బంధం రీత్యా ప్రేమ.. అభిమానం గౌరవం.. నమ్మకం.. దినదినానికి పెరుగుతాయి. భవిష్యత్తును గురించి.. పిల్లలను గురించి.. చర్చలు.. నిర్ణయాలు ఇవన్నీ. భార్యాభర్తల మధ్యన, చక్కటి సంసార జీవితం సాగేదానికి సుస్థిర మార్గంగాన్ని ఏర్పరుస్తాయి. అలా జరిగితే జీవితం చాలా బాగుంటుంది.. నా అభిప్రాయాన్ని నాకు నచ్చిన విషయాన్ని నీకు చెప్పాను!.. ఆలోచించుకో.. సరైన నిర్ణయాన్ని తీసుకో!.. ” సిగరెట్ ముక్కను రోడ్డు ప్రక్కన పడేశారు నాయుడు.

పద్మారావు.. నాయుడు చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ అతని వెనకాలే ఆఫీస్లో ప్రవేశించాడు.


మరుదినం వుదయం.. నాయుడు సెల్ ఆన్ చేశాడు. దాదాపు ఇరవై సెల్ఫ్ ఫోటోలను పద్మారావు నాయుడికి పంపాడు. వాటిని చూచాడు నాయుడు. వేరు వేరు దుస్తులు.. వేరు వేరు భంగిమలు.. ఇంట్లో.. రోడ్లో.. పార్కులో.. టెరస్ పైన.. బుల్లెట్ పై నిలబడి తీసినవి.. పద్మారావుకు సెల్ఫీ ఫోటోల పిచ్చి ఏ స్థాయికి ముదిరిందో నాయుడికి బాగా అర్థం అయింది.


* * *


ఎనిమిదిన్నరకు పద్మారావు తన బుల్లెట్పై ఆఫీస్కు బయలుదేరాడు. వారి ఇంటికి ఆఫీసు ఎనిమిది కిలోమీటర్లు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో.. నాయుడు, తాను పంపిన సెల్ఫీలను చూచుంటాడు.. తనను ఈరోజు చూడడంతోనే ఏమంటాడో అనే ఆలోచన.. మరో వైపు, ఆఫీసులో దీపతో ఫ్రీగా మాట్లాడే అవకాశం దొరకడం లేదు.. ఈ రోజు కాఫీకి పిలిచి బయటికి తీసుకొని వెళ్ళి మాట్లాడాలనే సంకల్పం.. వస్తుందో రాదో అనే సందేహం. తన ప్రయత్నం.. ఫలిస్తుందో లేదో అనే అనుమానం. పొందిక లేని ఆలోచనలతో పద్మారావు బులెట్పై ముందుకు సాగిపోతున్నాడు.

అతని చూపులు.. పాతిక అడుగుల దూరంలో ముందు స్కూటీని రోడ్డు ప్రక్కకు నెట్టుకొని పోతున్న దీపపై వాలాయి. ముఖంలో ఆనందం.


'దీప స్కూటీ చెడిపోయినట్లుంది. దగ్గరకు వెళ్ళి విచారించి.. నా బులెట్పై దీపను ఆఫీస్ వరకూ.. ఆమెతో మాట్లాడుతూ తీసికొని వెళ్ళవచ్చు.. ' అనుకొన్నాడు పద్మారావు.

దీప రోడ్డు ప్రక్కన స్కూటీకి స్టాండ్ వేసి, రోడ్డు రెండు వైపులా ఆటో కోసం చూడసాగింది.

'నిజంగానే దీప స్కూటీ చెడిపోయినట్లుంది. ఒరేయ్!.. పద్మా!.. మంచి తరుణం. సవ్యంగా ఎన్క్యాష్ చేసికో.. ' అనుకొంటూ బులెట్ను దీప పక్కన ఆపాడు పద్మారావు.


“దీపగారూ!.. ”


వ్యతిరేక దిశలో చూస్తున్న దీప.. అతని కంఠాన్ని విని పద్మారావు వైపుకు దృష్టిని త్రిప్పింది. “ఏమయిందండీ!.. ” బులెట్కు స్టాండ్ వేస్తూ అడిగాడు పద్మారావు.


“ఏమోనండీ నాకేం అర్థం కావడం లేదు. వున్నట్లుండి ఆగిపోయింది. ఆఫీసు టైమ్ అవుతూ వుంది. ఏం చేయాలో తోచడం లేదు” అమాయకంగా చెప్పింది దీప.


“ఎందుకండీ!.. అంతగా భయపడతారు. నేను సమయానికి వచ్చానుగా.. రండి. బులెట్ ఎక్కండి.. మిమ్మల్ని ఆఫీస్ దగ్గర దించి నేను తిరిగి వచ్చి మీ స్కూటీ ప్రాబ్లమ్ ఏంటో చూస్తాను. టైమ్ అవుతూ వుంది రండి.. ” ప్రీతిగా చిరునవ్వుతో చెప్పాడు పద్మారావు.


ఆటో కంటికి కనబడని కారణంగా దీప..

“సరే పదండి.. ” అంది.


పద్మారావు స్కూటర్ను స్టార్ట్ చేశాడు. దీప వెనకాల కూర్చుంది. జేబులోని సెల్ను బయటికి తీసి పద్మారావు సెల్ఫీని దీప కనుపించేలా తీశాడు.

“ఏవింటండీ మీరు చేసిన పని!.. ” ఆశ్చర్యంతో అడిగింది దీప.


"సెల్ఫీ తీశానండీ! మీరు నా బులెట్ పై కూర్చున్నారు. ఆనందం.. అంతే!.. ” నవ్వి బులెట్ను ముందుకు నడిపాడు పద్మారావు.


రోడ్డు మిట్టపల్లా వలన దీప భుజం పద్మారావుకు తగిలింది.

“సారీ!.. ” అంది దీప.


మరో నాలుగు నిముషాల తర్వాత అదే స్థితి..

“సారీ!.. అండి!.. రోడ్లు పరమచండాలంగా వున్నాయి”


ఆ స్పర్శకు పద్మారావుకు ఎంతో ఆనందం.

"మీరు జాగ్రర్తగా పట్టుకోండి. మిట్టపల్లాలు కారణం.. నేను నెమ్మదిగానే పోనిస్తున్నా!.. ” తలను ప్రక్కకు తిప్పి చెప్పాడు పద్మారావు.


ముందు చక్రం పల్లంలో పడి బులెట్ బాగా షేక్ అయింది.

“ముందు చూస్తూ జాగ్రర్తగా తోలండి!.. ” అంది దీప.


“మిమ్మల్ని క్షేమంగా ఆఫీస్కు చేర్చే పూచీ నాది. నా డ్రయివింగ్ పై సందేహ పడకండి!.. ” నవ్వుతూ చెప్పాడు పద్మారావు.


“ఏమండీ!.. ” అడిగింది దీప


“చెప్పండి!.. ”


“నా బండి అక్కడ సేఫ్ గా వుంటుందా!.. ”


“తాళం వేశారుగా!.. ”


“ఆఁ.. వేశాననుకోండి.. అయినా!.. ”


“మరేం ఫర్వాలేదు. ఇరవై నిముషాల్లో నేను మీ పుష్పకం దగ్గర వుంటానుగా!.. ”


ఏంటీ!.. పుష్పకమా!.. అంటే!.. ”


“అదేనండీ!.. మీ స్కూటీ!.. ” నవ్వాడు పద్మారావు.


“స్కూటీని మన తెలుగులో పుష్పకం అంటారా.. నేను ఇంత వరకూ ఆ పదాన్ని వినలేదే!.. ”


"ఇప్పుడు విన్నారుగా!.. ”


“మీరు అన్నారు కాబట్టి!.. ” చిలిపిగా నవ్వింది దీప.


బులెట్ ఆఫీసు చేరింది. దీప దిగింది.

"యం. డి గారికి నేను ఫోన్ చేసి చెబుతాను. మీరు ఓ గంట ఆలస్యంగా వస్తారని.. ” అంది దీప.

‘అవసరం నీది కాదా!.. నేను చెప్పక ముందే నీవు చెప్పేస్తానన్నావ్.. ' అనుకొని నవ్వుతూ..


“థ్యాంక్యూ!.. ” అన్నాడు పద్మారావు.


“ఆ మాట చెప్పాల్సింది నేను.. థ్యాంక్యూ!.. నా స్కూటీ!.. ”


“ఇప్పుడు నేను వెళ్ళేది అక్కడికేగా!.. ”


ఇంతలో నాయుడు అక్కడికి వచ్చాడు.

“బాస్!.. కూర్చో.. ”


“ఎక్కడ?.. ” ఆశ్చర్యంతో చూచాడు నాయుడు.


“జాగ్రర్తగా వెళ్ళిరండి.. ” అంది దీప


“అలాగే!.. ” అన్నాడు పద్మారావు.


దీప ఆఫీస్లోనికి వెళ్ళిపోయింది. జరిగిన విషయాన్ని నాయుడికి వివరించాడు పద్మారావు.

“అంటే చెరకురసం.. పాకంలోకి వచ్చిందన్న మాట!.. " నవ్వాడు నాయుడు.

పద్మారావు.. నాయుడు దీప స్కూటర్ వున్న ప్రాంతం వైపుకు బయలుదేరారు.


* * *

ఆ సంఘటన తర్వాత.. పద్మారావు దీప సన్నిహితులైనారు. ఆఫీస్ వదలిన తర్వాత.. పార్కు.. హోటల్స్.. ఆదివారం సినిమా ప్రోగ్రాం.. కలిసి తిని.. తిరిగి సరదా కబుర్లతో ఆనందంగా కాలాన్ని గడిపేవారు. ఓ ఆదివారం సాయంత్రం పార్కులో తన నిర్ణయాన్ని నిర్భయంగా తెలియజేశాడు. అతని సెల్ఫీ ఫోటోలను చూచిన దీప సాహస వంతుడనే నిర్ణయానికి వచ్చింది. అతనికి మనస్సు ఇచ్చింది. తల్లిదండ్రులకు పద్మారావు పై తనకున్న అభిప్రాయాన్ని వివరించింది. తనతో పద్మారావును.. తన ఇంటికి తీసుకొని వెళ్ళి తల్లితండ్రికి పరిచయం చేసింది. పద్మారావు వారికి బాగా నచ్చాడు. దీప తల్లిదండ్రులు.. పద్మారావు ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలిగా చేసికొనవలసిందిగా కోరారు. అతను తల్లితండ్రికి దీపను గురించి చెప్పి వున్నందున. వరహాలరావు సుమలత.. దీప పద్మారావుల వివాహానికి అంగీకరించారు. నిశ్చితార్థం జరిగింది. మూడు వారాల తర్వాత దీప.. పద్మారావుల వివాహం.


ఆ రోజు ఆదివారం.. వుదయం పదిగంటలకు తన బులెట్పై దీపతో గోల్కొండకు వెళ్ళాడు పద్మారావు. ఇరువురూ కలసి ఫోటోలు తీసుకొన్నారు.


కోట దక్షిణ భాగంలో వుండే ఎత్తైన నవాబ్.. మహల్ ప్రాకారం పైకి ఎక్కి సెల్ఫీ పిచ్చోడు పద్మారావు.. ఫోటో తీసుకోవాలనుకొన్నాడు. అతికష్టం మ్మీద పైకి ఎక్కాడు. దీప.. వారించినా ఆమె మాటను వినలేదు. ఎడమ చేతిలో సెల్తో.. కుడిచేతిని పైకెత్తి గొప్ప ఫోజును పెట్టాడు.. తాను చేత్తో ఆకాశాన్ని అందుకొన్నట్లు.. విపరీతమైన గాలి.. ఫోజును సెల్లో చూచుకొని క్లిక్ చేయబోయే సమయంలో.. బూటు కాలు జారింది. సెల్ నేలకు రాలిపోయింది. ఎత్తు నుండి పద్మారావు క్రింద పడ్డాడు. తల పగిలింది. క్షణాల్లో జరిగిన ఆ ప్రమాదాన్ని చూచిన దీప.. 'పద్మా!.. ' అని అరచి నేలకూలి మూర్ఛపోయింది.


దాదాపు అరగంట తర్వాత.. గోల్కొండను చూడవచ్చిన మంచి మనస్సు వున్న వారు.. వారిని హాస్పిటల్కు చేర్చారు.


పద్మారావు.. సెల్ఫీ చలగాటం అతని ప్రాణాలను బలికొంది.. స్పృహ వచ్చిన.. దీప.. 'పద్మా!.. పద్మా!.. ’ అనే కలవరింతతో కోమాలోకి వెళ్ళిపోయింది. వారిని కన్న తల్లిదండ్రుల.. మనోవేదన మాటలకు వ్రాతలకు అందనిది.


* * *

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

38 views1 comment

1 commento


కథ బాగున్నా విషాదాంతం కావడము విచారకరం-అయినా కథకొరకైనా అభినందనలు.

Mi piace
bottom of page