top of page

స్నేహం సాక్షిగా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Sneham Sakshigaa' New Telugu Story


Written By Kotthapalli Udayababu


రచన : కొత్తపల్లి ఉదయబాబు




దేశంలో కరోనా అనే ప్రాణాంతక మహమ్మారి వ్యాపిస్తోందని టీవీలలో ప్రచారం ప్రారంభమయిన మొదటి రోజులవి.


హైదరాబాద్ లో ప్రయివేట్ కంపెనీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు. 'చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా' అంటే హైద్రాబాద్ లో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని వచ్చి, మొదటివారం స్నేహితుని రూంలో ఉన్న కాలంలోనే అతని చురుకుదనానికి, సమయస్ఫూర్తికి ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం ఇచ్చేసింది.

ఇద్దరు అక్కల తరువాత ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఉండలేక, అలా అని అతని భవిష్యత్తు పాడవుతుందని మిన్నకుండి పోయారు అతని తల్లి తండ్రులు.

తల్లితండ్రులను చూద్దామని శనివారం ఉదయం బయల్దేరి ఆదివారం రాత్రికి మళ్లీ ఉద్యోగానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని వచ్చిన శశాంక ఆ ఆదివారం రాత్రినుంచే లాక్-డౌన్ ప్రకటించడంతో ఆగిపోయాడు.

అప్పటికే కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో… అందుకు మనం పౌరునిగా పాటించవలసిన ధర్మాలేమిటో తెలుసుకున్నవాడుగా మరుసటి ఉదయమే రంగంలోకి దిగాడు.

ఇంట్లో పనికిరాని పాతచీరలన్నీ తీసుకుని స్వయంగా జేబురుమాలు సైజులో కత్తిరించి తమ పేటలో ప్రతి వ్యక్తికి 3 మాస్కులు కనీసం ఇచ్చేలా కుట్టించాడు.

తల్లి, తను వాడిన డిష్-వాష్ సీసాలన్నీ ఒక బస్తాలోవేసి, బస్తా నిండాక అమ్ముతూ ఉంటుంది. వాటిని తీస్తే ఎనభైకి పైగా ఉన్నాయి.

ఎదో టీవీలో చూసిన విధానం గుర్తుపెట్టుకొని డెట్టాల్ సబ్బులు కొని, వాటిని పెద్ద సీవండి దాబారా గిన్నెలో తురిమి, అందులో వెనిగర్ వేసి ఉడికించి, ఆ పేస్ట్ ను సీసాలన్నింటిలోను నింపాడు.

తనవయసు కుర్రవాళ్ళని పదిమందిని పిలిచి ఏ4 సైజు పేపర్లు, కార్బన్లు కొని, వాటిమీద కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వ్రాయించి… ప్రతి కుటుంబానికీ 3 మాస్కులు, ఒక సీసా, ఒక కరపత్రం అందించాడు.పేట పేటంతా, సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వృత్తాలు గీయించాడు.

తాను యూట్యూబ్ లో రకరకాల పచ్చళ్ళు చూసి, ఆ పదార్ధాలు కొనుక్కువచ్చి, తల్లిచేత దగ్గరుండి చేయించి,

ఆ విధివిధానాలన్నీ మనసులో ముద్రించుకున్నాడు.

తమపేటలోకి వచ్చిన అన్నార్తులకు ఆ పచ్చళ్ళు వేసి ఉన్నంతలో భోజన పొట్లాలు అందించాడు.

"నాయనా..నీ ఉద్యోగం?" అడిగింది తల్లి.

"చూద్దామమ్మా… ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగం ఉండకపోవచ్చు. కానీ బతుకుతెరువు నేర్పావు కదమ్మా.. కరోనా తగ్గాక, నేర్చుకున్న ఈ విద్యతో పచ్చళ్ళ వ్యాపారం పెడతా. ఎవరో వచ్చి ఏదోచేస్తారని భావించే కంటే… మన కాళ్ళమీద మనం బతకడం నయం కదమ్మా. అందాకా మన ముగ్గురం ఆనందంగా కలిసి ఉందామమ్మా" అన్న శశాంక మాటలు విని పుత్రప్రేమతో కొడుకుని దీవించింది ఆ తల్లి.

మరునాడు సాయంత్రం పచ్చళ్ళ కారాలు, పొడులు అన్నీ బైక్ మీద తీసుకువస్తుంటే ఒక సందు మలుపులో ఒక పదహారేళ్ళ అమ్మాయి వేగంగా పరుగెత్తుకు వస్తూ తన బైక్ కు అడ్డంగా వచ్చి ఇసుకమట్టిలో జారి కింద పడిపోయింది.

హఠాత్తుగా బ్రేక్ వేసాడు శశాంక్. బైక్ కి సైడు స్టాండ్ వేసిన శశాంక్ ఆమె పరుగెత్తి వచ్చిన వైపు చూసాడు. ఎవరో ఇద్దరు తాగుబోతులు తూలుతూ పరుగెత్తుకొస్తున్నారు. అతను వెంటనే ఆమె కేసి చూసాడు.

చూస్తూనే ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు. తాను… తాను… చంచల. ఆమె లేచి చేతులకు, బట్టలకు అంటిన మట్టి దులుపుకుని పరుగెత్తబోయింది.

''చంచలా...'' అని అరిచాడు. ఆమె తనను పిలిచింది ఎవరా అని ఒక్కక్షణం ఆగి మరింత ఆశ్చర్యంతో శశాంకను చూస్తూనే అతన్ని తప్పించుకునే ఉద్దేశంతో తాగుబోతులు ఎదురుగా పరుగెత్తింది. అంతకంటే వేగంగా ఆమెను చేరి '' చంచలా..ఆగు...ఆగు..ప్లీజ్.'' అన్నాడతను, ఆమెను రెండు జబ్బలూ పట్టుకుని.

అంతలో దగ్గరగా వచ్చిన తాగుబోతులు ''ఏరా... తెలుగు సినిమాలు బాగా చూస్తావా… హీరోయిన్ని రక్షించే హీరో మాదిరి వచ్చేసావ్..'' అన్నారు వెకిలిగా నవ్వుతూ.

''ఔన్రోయ్ ...ఈడు నాగ చైతన్య. అదేమో సమంత. దాన్ని మర్యాదగా వదిలేయి. లేదా ఇద్దరి ప్రాణాలు తీస్తాం.'' అంటూ చాకు తీసి బెదిరించాడు ఒకడు .

అంతలో అటుగా పోలీసు జీపు హఠాత్తుగా వచ్చి వారిముందు ఆగింది. తాగుబోతులిద్దరూ పారిపోబోయారు. బాగా తాగి ఉన్నమీదట తూలి పడబోయారు. పోలీసులు వాళ్ళిద్దర్నీ పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.

''ఏంట్రా గొడవ? చేతిలో ఆ చాకు ఏమిటి?'' అడిగాడు ఎస్.ఐ.

ఏం జరిగిందని చంచలను అడిగాడు.

తానూ, తన అన్నయ్య, తల్లీ తండ్రీ విశాఖపట్నం నుంచి కూలీలుగా నగరానికి వచ్చామని, కరోనా సోకి తన తల్లి తండ్రి ఇద్దరూ మరణించారని, అన్నయ్య పనిలోకి వెళ్లగా ఒంటరిగా ఉన్న ఆ తాగుబోతులు తన గుడిసెలోకి వచ్చి తనను బలాత్కరించబోయారని, తానూ తప్పించుకుని పరుగెడుతుంటే వెంటబడ్డారని, శశాంక్ అడ్డుపడితే ఇద్దరినీ చంపుతామని బెదిరించారని చెప్పింది.

పోలీసులు చంచలని శశాంక్ కి అప్పగించి తాగుబోతుల్ని జీపెక్కించి వెళ్లిపోయారు.

'' చంచలా...నేను గుర్తున్నానా?''

''నువు సమయానికి రాకపోతే నా శీలం, ప్రాణం రెండూ పోయేవి శశాంక్. నాన్నకి భయపడి నీ ప్రేమను కాలదన్నుకుని వెళ్ళిపోయిన నన్ను నీ కళ్ళ బడేలా చేసి ఆ భగవంతుడు నాకు మేలు చేసాడు. నన్ను మన్నించు. '' అంది కన్నీళ్లతో.

''నువ్వు మీ పిన్నిగారి ఇంట్లో ఉండి కదా చదువుకునే దానివి.?'' అడిగాడు శశాంక్.

'' అవును. అపుడు మనం కాలేజీలో చదివిన రోజుల్లో మా పిన్ని వాళ్ళు ఆ వూరిలో ఉండేవారు. నువ్వు హాస్టల్ లో ఉండేవాడివి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం మా అన్నయ్య మా నాన్నకి చెప్పేసాడు. మా నాన్న నా చదువు ఆపేసి విశాఖపట్నం తీసుకు పోయాడు.

అయితే తుఫాను వచ్చి మా గూడెమంతా సముద్రం లో కొట్టుకుపోయింది. మాకు నిలువ నీడ లేకుండా పోయింది. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక ఈ మహానగరానికి వలస వచ్చాము.

కరోనా సోకి నాన్న, అమ్మ చనిపోయారు. అన్నయ్య, నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్లిపోదామనుకున్నాం. కానీ అక్కడకు వెళ్లినా మమ్మల్ని ఆదుకునే వారు ఎవరూ లేరు. అందుకని అన్నయ్య ఇక్కడే ఏదో కూలిపని వెతుక్కుందామని రోజూ పనికోసం తిరుగుతున్నాడు. నన్ను ఇళ్లల్లో పనిలోకి రానివ్వడం లేదు. ఒంటరిగా ఉండటం చూసి ఈ వెధవలు ఈవేళ గుడిసెలో దూరారు. ఇదీ జరిగింది.''

''అయితే నిన్ను మీ గుడిసె దగ్గర దింపెయ్యనా?'' అడిగాడు శశాంక్.

''వద్దు శశాంక్. నువ్వు అన్నయ్య కళ్ల పడటం మంచిది కాదు.'' అంది కంగారుగా.

'' మరేం చెయ్యదలుచుకున్నావ్?''

'' శశాంక్. నా జీవితం ఇపుడు సుడిగుండంలో ఉన్నట్టు లెక్క. అన్నయ్య నాకు పెళ్లి చెయ్యలేడు . ఇపుడు నా ముందు ఉన్నవి రెండే మార్గాలు. నీ కిష్టమైతే నీ వెంట రావడం. లేదా ఆత్మ హత్య చేసుకోవడం.''

''నామీద, నా ప్రేమ మీద నీకు నమ్మక ఉందా?''

''నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించు కున్నట్టే ..'' అంది చంచల తప్పుచేసి దానిలా.

''నువ్వు వస్తానంటే నా ఇంట్లోనే కాదు.... నా జీవితంలోకి కూడా నీకు స్వాగతం .''

'' నీ సహాయానికి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అయితే ఇంట్లో వాళ్ళకి ఏం చెబుతావ్?''

'' నేను చేసే ప్రతీ కార్యక్రమంలోను మన స్నేహం సాక్షిగా నువు నాకు తోడుగా నీడగా ఉంటాను అని మాట ఇస్తే చాలు. అమ్మకు నాన్నకు నేను నచ్చ చెప్పుకోగలను."

"తప్పకుండా శశాంక్. నాకున్నది అది ఒక్కటే మార్గం. కాలేజీలో ఉండగానే నువు ఎందరెందరికో నీ శక్తి కొలది సాయం చేసేవాడివి. నాకు అందులో భాగం పంచుకునే అవకాశం ఇవ్వు చాలు." అంది అతని కళ్ళల్లోకి ఆశగా చూస్తూ.

"తప్పకుండా. పద వెళదాం"

వారిద్దరూ ఎక్కిన బైక్ వారి ఇంటిమార్గం పట్టింది శశాంక్ డ్రైవింగ్ ల.

******

ఒకే గమ్యం, ఒకే లక్ష్యం తో జీవితం ప్రారంభించిన చంచల, శశాంక్ లు తల్లి తండ్రుల అనుమతితో ఒక్కటయ్యారు.

పెద్దల ఆశీసులతో వారిద్దరూ ప్రారంభించిన మొబైల్ పచ్చళ్ళ వ్యాపారం ఈ లాక్-డౌన్ సమయంలో కొందరికి ఉపాధి కల్పించడమే కాకుండా మరెందరో ఆర్తులకు తమ శక్తి కొద్దీ ఆహారం పొట్లాలను ఉచితంగా అందిస్తూ వారి 'స్నేహం సాక్షిగా' కొనసాగుతోంది!!!

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.




రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు

తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంటా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్




32 views1 comment
bottom of page