top of page

పెద్ద గీత – చిన్నగీత

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Pedda Githa Chinna Githa' New Telugu Story

Written By Kotthapalli Udayababu

రచన : కొత్తపల్లి ఉదయబాబు


‘’ఈవేళ సాయంత్రం కళాకేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాష్టారు. నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు. పండగ సీజన్ వల్ల కొంచెం బిజీగా ఉన్నారు" అంటూ నా శిష్యులు శ్వేత, స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి...


"ముందు బోర్డ్ మీద లెక్క ఎక్కించేసుకొండమ్మా. ఆతరువాత మీకు దానిని వివరించి బోర్డ్ చేరిపేస్తాను. ట్యూషన్ అయిపోయాక ఒక పదినిమిషాలు ఉండడమ్మా. మీతో మాట్లాడాలి. " అన్నాను చిరాకును బయటపడనీయకుండా.


ట్యూషన్ అయిపోయాక పిల్లలందరూ వెళ్లిపోయాక శ్వేత, స్వాతి కూడా లేచి నిలబడ్డారు.


"మీరు ప్రైవేటు లో చేరినప్పటి నుంచి నుంచి చూస్తున్నాను.. రోజు ఆలస్యంగా వస్తారేమిటమ్మా?" అడిగాను.


" మా ఇంట్లో పనులు, మా పెద్దమ్మ గారి ఇంట్లో పనూలు చేసుకుని మరీ వస్తాం సార్. అక్కడికి నాలుగు గంటలకు లేస్తే ఆరు గంటలకి సగం పని పూర్తి అవుతుంది సర్. మా పెద్దమ్మ గారికి పిల్లలు లేరు సార్. మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మేము ఇద్దరం, తమ్ముడు పుట్టాము. పైగా మా పెద్దమ్మకు క్యాన్సర్. నాన్నగారు వారంలో మూడు రోజులు పెద్దమ్మ ఇంట్లో ఉంటారు సర్. అక్క, నేను వంతులుగా పనులు చేసుకుని వస్తాం సర్" అని చెప్పిందిశ్వేత.


" సరే.. ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి మరి" అన్నాను.


నేను ప్రైవేట్ చెబుతానని తెలుసి నెల క్రితం తన తండ్రి ని తీసుకొని శ్వేత,స్వాతి నా దగ్గరికి వచ్చారు.


"సర్. నాపేరు సూరి బాబు. నేను టైలర్ గా పని చేస్తాను. నా పిల్లలు ఇద్దరు మీ పాఠశాలల్లో చదువుతున్నారు. వాళ్లకు నచ్చిన చోట ప్రైవేటు చెప్పిస్తే బాగా రాణిస్తారని నాకు నమ్మకం. . మీ పుణ్యమా అని మా పిల్లలిద్దరూ ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయితే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం సార్. ఎందుకంటే పదవతరగతి, విద్యార్థుల జీవితానికి పునాది అని నా నమ్మకం" అని ఎంతో వినయంగా, చూడటానికి సన్నగా రివటలా ఆరడుగుల పొడుగు ఉండి నా ముందు చేతులు కట్టుకుని మాట్లాడిన అతని దగ్గర రెండు కుటుంబాలు నిర్వహించెంటంత విషయం ఉందని నేను ఊహించలేదు. ఏదో తెలియని చులకన భావం కలిగింది అతనిమీద.


"నేను సహజంగా ఎప్పుడు ఎక్కడ బేరం ఆడను సర్ . అలా అడిగితే అవతలి వ్యక్తికి వచ్చే రూపాయి నావల్ల పోతుంది అని నా నమ్మకం . అలా అని ఎక్కువ డబ్బు పెట్టను. న్యాయబద్ధంగా అందరూ ఎలా డబ్బులు ఇస్తే నేను అలాగే ఇస్తాను. అయితే మీరు ఒక యాభై రూపాయలు కనుక డబ్బు తగ్గిస్తే అది నాకు మరొకందుకు ఉపయోగపడుతుంది. " అడిగాడు అతను.


"చూడండి. నేను కచ్చితంగా చదువు చెప్తాను. ఫీజు విషయంలో కూడా అంతే కచ్చితంగా ఉంటాను" అన్నాను మాటకి అవకాశం ఇవ్వకుండా. అతను నా చేతిలో ఐదు వందలు పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు. నేను సంతృప్తిగా చూసుకుని జేబులో పెట్టుకున్నాను. నా ఆశలు నాకున్నాయి మరి!


****


భారతీయ కాలమానం ప్రకారం7 గంటలకు కళాకేంద్రం కి వెళ్లాను. కళా కేంద్రంలో జరిగే ఒక నెల వారి కార్యక్రమం అది. బోర్ కొడితే లేచి వెళ్లి పోవచ్చు అన్నట్టుగా ఆఖరి వరుసలో మొదటి కుర్చీలో కూర్చున్నాను. నన్ను చూస్తూనే శ్వేత, స్వాతి ఇద్దరు వచ్చి పలకరించి వెళ్ళారు. సభా కార్యక్రమం మొదలైంది


అనంతరం విశ్వామిత్రుడు ఏకపాత్రాభినయం ప్రదర్శన జరిగింది. ఆ వ్యక్తి వాక్ప్రవాహం,అపర ఘంటసాలలా పాడిన పద్యాలు, సంభాషణలు పలికే తీరు వింటూనే నన్ను నేను మరిచిపోయాను. ఈ కాలంలో కూడా ఎంతటి ఉత్తమ కళాకారులు ఉన్నారు? అతను పాడిన పద్యాలలో తెలుగు వాడినై ఉండి ఒక్క పద్యం రాదు నాకు . తర్వాత ఆ పాత్రధారుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు నేను నిర్ఘాంత పోయాను. ఆయన సూరిబాబు గారు.


ఎందుకో మనసు ముడుచుకుపోతున్న భావన నాలో మొదలైంది. ఏదో తెలియని బాధ మనసును మెలిపెట్టడం ప్రారంభించింది. తానుగా వచ్చి ఒక్క 50 రూపాయల జీతం తగ్గించమని నన్ను కోరినప్పుడు నిర్ధాక్షణ్యంగా తిరస్కరించాను. అతను పాడిన ఒక పద్యానికి నా మొత్తం జీవితం తూకం వేసినా సరిపోదు. ఎంత తప్పు పని చేశాను అనుకున్నాను.


అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఒక నిరుపేద కళాకారునికి మోసుకొచ్చి సన్మానం చేశారు శ్వేత, స్వాతి. హారతి ఉన్న ఒక పళ్ళాన్ని తీసుకుని ప్రేక్షకులందరి దగ్గరికి వచ్చారు. అందరూ ఎవరికి తోచింది వారు వేశారు. నేను జేబులో డబ్బులు వేసుకు రాలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చినపుడు వేదిక వైపు చూస్తూ ఉన్నట్టు నటించి, వాళ్ళు వెళ్లిపోయాక సిగ్గుతో తలవంచుకొన్నాను.


అనంతరం ఆ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి సూరిబాబు గారు అప్పటికప్పుడు సభలో సేకరించిన 10500 కళాకారునికి ముఖ్య అతిధి చేతులమీదుగా అందచేస్తూ, తనవంతుగా 25 కిలోలబియ్యపు బస్తాను ఆ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. నన్ను, నా మనసును, నా వ్యక్తిత్వాన్ని గుండ్రాయితో కుంకుడుకాయ ని చితక్కొట్టేస్తున్నట్టుగా బాధపడ్డాను. పెద్ద గీతను అని విర్రవీగుతున్న నేను , అతని ముందు చిన్నగీతగా కుంచించుకు పోసాగాను.


సూరి బాబు గారు హఠాత్తుగా నన్ను వేదికపైకి ఆహ్వానించారు. తన కుమార్తెలకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడిగా నన్ను పరిచయం చేసి వృత్తికి అంకితమైన వ్యక్తి గా నన్ను అభివర్ణించి దుశ్శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. నేను కనీవినీ ఎరుగని ఊహించని జీవితంలో మొదటి సన్మానం. కళకు జీవితాన్ని అంకితం చేసుకున్న ఆ పేద కళాకారునికి కనీసం ఒక 100 రూపాయలు కూడా ఇవ్వలేని నిస్సహాయస్థితిలో వచ్చినందుకు సిగ్గుతో చచ్చిపోయాను.


పాంటు కుడి జేబులో ఏదో ఎత్తుగా ఉన్న స్పర్శ. ఏమిటా అని చూస్తే ఎల్. ఐ. సి. కడదామని నోటీసుకాగితంలో దాచిన రెండు 500 రూపాయల నోట్లు. ఆలోచించకుండా ఆ సొమ్మును సూరిబాబుగారికి అందించాను. 'మీరు ఒక్క 50 రూపాయలు ఫీజు తగ్గిస్తే అది మరొకరూపంలో ఉపయోగపడుతుంది' అన్న అతని మాటలలోని అంతరార్ధం మనసును ఛెళ్లున తాకింది. అయితేనేం? మనసు సంతృప్తి తో నిండిపోయింది, కరతాళధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది.


సమాప్తం.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు

తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంటా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్





5件のコメント


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年9月19日

Gangadharsarma Kottapalli • 1 month ago

బాగుంది కధ.

いいね!

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年9月19日

nani rk • 1 month ago

కనువిప్పు కలిగించే కధ

いいね!

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年9月19日

KUBDevotionalWorld • 3 days ago

ధన్యవాదములు

いいね!

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年9月19日

Gudala Santoshita • 1 month ago

కధ చాలా బాగుంది సర్. అభినందనలు.

いいね!

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年9月19日

Lakshmi Kolli • 1 month ago

మంచి కథ వినిపించారు. రచయిత ఉదయబాబు గారికి, మీకు ధన్యవాదములు అండి.

いいね!
bottom of page