top of page

ఒక దీపం వెలిగిన వేళ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Oka Deepam Veligina Vela' New Telugu Story By Kotthapalli Udayababu

రచన : కొత్తపల్లి ఉదయబాబు


"అమ్మా అనితా... ఎలా ఉన్నావ్? బావ... పిల్లలు బాగున్నారా?’’ ఫోన్ లో అన్నగారి మాటలు వింటూనే సంబర పడిపోయింది అనిత.


‘’బాగున్నాను అన్నయ్య. మీరంతా ఎలా ఉన్నారు?’’


‘’అంతా బాగున్నామ్. సరే గానీ నీకో శుభవార్త.’’


‘’ ఏంటన్నయ్యా...అది?’’


‘’మన వూళ్ళో తొందరలో గ్రంధాలయం ఏర్పాటుచేస్తున్నానమ్మా. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నువు, బావ పిల్లలు తప్పక రావాలి.’’


‘’అన్నయ్యా...నిజమా...ఎంత మంచి వార్త చెప్పావు?ఇంతమంచి ఆలోచన నీకు ఎలా వచ్చిందన్నయ్యా? మన చిన్నప్పుడు ప్రాధమిక పాఠశాల తప్ప ఏమీ సౌకర్యం ఉండేది కాదు. అలాంటిది నువు మొన్న పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ గా ఎన్నిక అయ్యాక వూరికి ఇంత మంచి జరుగుతోంది అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్యా. తప్పకుండా వస్తాను. ‘’


‘’సరేనమ్మా. నేను గ్రంధాలయ ప్రధాన కార్యదర్శిగారిని కలవడానికి వెళ్తున్నాను. గ్రంధాలయానికి కావలసిన పుస్తకాల కొనుగోలుకు పంచాయితీలో తీర్మానం కూడా చేశాం. ఆ జాబితా ఇవ్వడానికి వెళ్తున్నాను. ఉంటానమ్మా మరి.’’


‘’ సరే అన్నయ్యా... ఏది ఏమైనా నీ చేత్తో మనవూరిలో ఆ చదువులతల్లి ఆలయంలో నీచేత్తో దీపం వెలిగించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా.తప్పకుండా వస్తానన్నయ్యా. సరే.ఉంటాను.’’అనిత ఫోన్ పెట్టేసింది.


*******


‘’అన్నయ్యా.. బాగున్నావా...వదిన లోపల ఉందా ...అన్నట్టు మీ బావగారు రేపు సమావేశం సమయానికి వస్తానని చెప్పమన్నారు.‘’ అంటూ వస్తూనే తన కాళ్ళకు నమస్కారమ్ చేసిన చెల్లెల్ని భుజాలు పట్టి పైకి లేవదీశాడు ముక్కంటి. తల్లిని చూసి పిల్లలు కూడా మామయ్యకి పాదనమస్కారాలు చేశారు.


"ఇదేంటమ్మా.. ఎపుడూ లేనిది ఈ కాళ్ళకి నమస్కారాలు...అయినా ఇవన్నీ మీకెవరు నేర్పారర్రా"మేనల్లుడిని, మేనకోడల్ని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ముక్కంటి.


"ఈ మధ్యకాలంలో ఇంటికి వచ్చి ప్రైవేటు చెప్పే మాష్టారిని పెట్టానన్నయ్యా. నాలుగు నెలలే చెప్పారాయన. పెద్దాయనలే. ఉద్యోగం అయిపోయాక కొడుకు దగ్గరకొచ్చి ఉంటున్నాడంట.ఓ రోజు మా ఆయన ఏ.టి.ఎం.కి వెళ్తే అక్కడ కనిపించారట. ఏదో మాటల్లో ఆయన అడిగితే తనకు కాలక్షేపం లేక ఇబ్బంది పడుతున్నానని, చిన్నపిల్లలకు చదువు చెప్పడం తనకు చాలా ఇష్టమని ఇంటికి వచ్చి చెప్పడానికి ఒప్పుకున్నాడు.


అబ్బా.ఎంత బాగా చెప్పేవాడని.మన తాత కూడా ఎపుడూ అన్ని మంచి విషయాలు చెప్పలేదేమో.పిల్లలు చిన్నతనంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి...పెద్దలతో ఎలా వ్యవహరించాలి...ఈ నాలుగు నెలల్లో వాళ్ళల్లో అంతమార్పు వాళ్ళు పుట్టాక చూడలేదు. ఆయన ఎక్కడ పనిచేశాడో గాని, ఆయనదగ్గర చదువుకున్న పిల్లలదే అన్నయ్యా అదృష్టం అంటే"అంది అనిత.


"మరియెందుకు మాన్పించేశావు?అడిగాడు ముక్కంటి.


"ఆయన ఇంకో కాలనీలో ఇల్లు కొనుక్కున్నారట మావయ్యా.ఆయన అక్కడ పనులవల్ల రెండేసి రోజులు మానేసేవారు.కానీ ఆదివారం వస్తే రెండేసి గంటలు ఓపికగా చెప్పేవారు.కానీ అమ్మే ఆయన మానేసిన రోజులకి పనిమనిషి మానేస్తే జీతం కట్ చేసి ఇచ్చినట్టు ఆయనకు కూడా జీతం కట్ చేసి ఇచ్చింది. పనిమనిషి ఇల్లు, అంట్లు శుభ్రం చేసి పోతుంది అంతే. అదే ఆయన అయితే నాలుగు నెలల్లో నాకు తెలుగు పూర్తిగా రాయడం చదవడం నేర్పారు. యే చిన్న తప్పు చేసినా 'అలా చెయ్యకూడదమ్మా. అలా చేసి నష్టపోయినవారి కధ చెప్పనా?'...అంటూ ఒక కధ చెప్పేవారు. ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయకూడదు అనిపించేలా. ఆయనకు కోపం వచ్చిందనుకుంటా. ఇంక రాను.నా ఆరోగ్యం బాగాలేదు అని మానేశారు మావయ్య."మేనల్లుడు చెప్పాడు.


ముక్కంటి నిర్ఘాంతపోయాడు.


"అదేమిటమ్మా.7 వ తరగతి వరకు చదువుకున్నదానివి.చదువు విలువ కాస్తో కూస్తో తెలిసినదానివి...ఒక పనిమనిషి రోజూ వచ్చి అంట్లు కడిగి పోవడానికి, జీవితాంతం గుర్తుండిపోయేలా చదువు చెప్పే అమూల్యమైన చదువుచెప్పే మాస్టారి బోధన కి డబ్బుతో ముడిపెడతావా? ఎంత తప్పు చేశావ్ చెల్లాయ్? నాకు తెలిసి ఆయన డబ్బు తక్కువ ఇచ్ఛావని మానేసి ఉండరు. తన ఉపాధ్యాయ వృత్తిని అవమానించావని మానేసి ఉంటారు.


మన చిన్నతనంలో మనవూళ్ళో పాఠశాల లేక ఎంత ఇబ్బందులు పడేవాళ్ళమ్? బల్లకట్టు మీద కాలవ దాటి గట్టు అవతలి వూళ్ళో ప్రాధమిక పాఠశాలకి వెళ్ళేవాళ్ళం.వర్షం వస్తే అంతా బురద మయం. నిన్ను ఉప్పుమూటలా మోసుకుని వెళ్ళేవాడిని. అక్కడ ఆ మాస్టారు బోర్డు మీద రెండు వాక్యాలు చెప్పి పదిసార్లు రాయండిరా అని తనపని తను చూసుకునేవాడు. అలా సంవత్సరమంతా వానాకాలం చదువే చదువుకున్నాం. మరి పిల్లల విషయం లో అలా చేసావేమిటమ్మా?


ఈ ప్రపంచంలో విద్యార్ధికి యే విషయం లో అభిరుచి ఉందో తెలుసుకుని బోధించేవాడు ఉపాధ్యాయుడు. ప్రాణం పోసే వైద్యుడిని, న్యాయాన్ని గెలిపించే న్యాయవాదిని, ప్రాజెక్టులు నిర్మించే ఇంజనీరుని, చివరకి దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అవ్వాలనే ఆశయానికి, ఆలోచనకి కూడా జీవం పోసేవాడు, మార్గం చూపించేవాడు ఉపాధ్యాయుడేనమ్మా. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా మన దేశం ఈమాత్రం అభివృద్ధి సాధించిందీ అంటే అధ్యాపకునిగా పనిచేసి దేశ ప్రధమ పౌరునిగా సేవలందించిన డా. సర్వేపల్లి వంటి వారేనమ్మా. అన్నీ వృత్తులలాగే ఉపాధ్యాయ వృత్తి కూడా జీవనాధారంగా మారిపోయింది. కాదు. రాజకీయమే మార్చేసింది. గురువును ఆటబొమ్మగా చూస్తున్న ఈ వ్యవస్థ కొనసాగినంతకాలం ఎవరికి వారు అవస్థలు పడవలసిందే. ఏమైనా నువు చేసింది తప్పు.''


''నీకు రాజకీయాల్లోకి వచ్చాకా ప్రసంగించడం బాగా వచ్చేసింది అన్నయ్యా.అదేదో అయిపోయిన గొడవలే. వదిలేయ్.'' అంది లౌక్యంగా.


''నిజమే.. ఎప్పుడు తిన్నారో ఏమిటో ...గుమ్మంలోనే నిలబెట్టేశాను ... పదండి...పదండి.'' అంటూ ఇంట్లోకి వారితో దారితీశాడు ముక్కంటి.


******


"అత్తా.ఎలాగున్నావ్?"అంటూ బయటనుంచి వచ్చిన మేనల్లుళ్లు ఇద్దరూ పలకరించారు అనితని.


"బాగున్నానర్రా.ఏంచేస్తున్నారు?ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినియ్యి?" పెద్దమేనల్లుడు శ్రీకంఠ ని అడిగింది.


"నాన్న పంచాయతీ సర్పంచిగా గెలిచాడు కదా అత్త...అప్పటినుంచి నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటన్నాను.డిగ్రీ పూర్తయిపోయింది. పోటీ పరీక్షలు రాస్తున్నాను .అయినా నాన్న కష్టపడి సంపాదించిన పొలం చూసుకుంటూ ఎంతగానో వెనకబడిపోయిన మన ఊరుకి కాస్త మంచి పనులు చేద్దామని కుర్రకారంతా అనుకుంటున్నాం. ఊళ్ళో నాలాంటి కుర్రాళ్లు ఓ నలభై మందిదాకా ఉన్నారు.అందరం కలిసి ''నేతాజీ యువజన "అనే పేరుతో ఒక యువ సంఘంగా ఏర్పడ్డాం. మనూరు లో ఎవరికి ఎక్కడ ఏ సాయం కావాలన్నా వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి ఆ పని పూర్తిచేసిపెడతాం. అదీ నా సంగతి.ఇక నీ సంగతి చెప్పరా"అంటూ చేతిలో పుస్తకాన్ని టీపాయ్ మీద పెట్టి అత్త పక్కన కూర్చున్నాడు శ్రీకంఠ.


"నాన్న రేపు గ్రంధాలయంలో ప్రారంభిస్తున్నారు కదా అత్తా.దానిలో నేను స్వచ్ఛందంగా సేవలు అందిస్తాను అని చెప్పడంతో గ్రంథాలయ కార్యదర్శిగారు నన్నే దాని అధికారిగా నియమించారు.అదీ నా సంగతి. అది సరే గాని ఈ పుస్తకం చదివావా అత్తా?"అని శంకర్ టీపాయ్ మీద పెట్టినపుస్తకం అనితకి అందించాడు రెండో మేనల్లుడు శంభు.


"ఏం పుస్తకంరా అది?"అనిత పుస్తకం చేతుల్లోకి తీసుకుంది.


"అది ఒక కధల సంపుటి..అంటే తాను రాసి వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన రకరకాల కథలన్నింటిని ఒకపెద్దాయన ఏభై వేల రూపాయలు స్వంతంగా ఖర్చు పెట్టుకుని పుస్తకంగా వేసాడు.దాని గురించి ఒక ప్రధాన వార్తాపత్రిక ఆదివారం అనుబంధంలో ఇంకో పెద్దాయన ఎవరో'ఆ పుస్తకం లోని కథలన్నీ ఈవేళ సమాజంలో జరుగుతున్న సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి.అంతేకాదు.ఈనాడు అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు రచయిత ప్రతీకథలోను చూపిన పరిష్కారం చాలా బాగుంది. సాహిత్యాభిమానులందరూ ఇటువంటి మంచి పుస్తకాన్ని కొని చదవకపోతే చాలా నష్టపోతారు' అని రాసారట. అది చదివి నాన్న ఆ రచయితగారికి ఫోన్ చేసి మరీ తెప్పించారు. ఆపుస్తకం వచ్చాకా నాన్న తాను ఓ నలభై సార్లైనా చదివి ఉంటారు.అంత నచ్చేసాయి దాంట్లో కథలన్నీ నాన్నకి. మా కుర్రాళ్లందరిచేత చదివించారు.అలా అనిఆ రాసినాయన గురజాడ ..పాలగుమ్మి పద్మరాజు... అలాంటి పెద్ద రచయితా కాదు. మన మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే సంఘటనలే. నిజంగా చాలా బాగున్నాయి.నాన్నకి ప్రతీ కథ కంఠస్థం వచ్చేసిందటే నమ్ము."ఉత్సాహంగా శంభు చెబుతుంటే ఆశ్చర్యపోయింది అనిత.


ఆమెకు ఇంకా బాగా అర్థం అయేలా వివరణ ఇచ్చాడు శంభు.


"అన్ని కుటుంబ కథా చిత్రాలు వస్తున్న సమయంలో కళాతపస్వి విశ్వనాధ్ గారు"శంకరాభరణం"సినిమా తీసి సంచలనం సృష్టించారు. దాంతో ఎంతో మంది కూచిపూడినృత్య కళాకారులకు ఉపాధి దొరికింది. ఎందరెందరో చిన్నారులలోని ప్రతిభ వెలుగులోకి వచ్చి మరుగునపడిపోయిన "నృత్యానికి" కొంత వైభవం వచ్చింది.


అలాగే "ఇద్దరు మనుషులు వివాహ బంధం ద్వారా కలవాలంటే "కులం"తో పనిలేదు...మనసులు కలవాలి"అన్న నీతితో కులమతాబేధాలను రూపుమాపే "సప్తపది" వచ్చి కులమతాల అంతరాల దూరాచారాన్ని తగ్గించింది.


అలా కొన్ని సమయాల్లో కొందరి వల్ల సమాజంలో మార్పు వస్తుంది. అది నచ్చినవారు అనుసరిస్తారు.నచ్చనివారు వారి పద్ధతుల్లోనే వాళ్ళుంటారు.అలా ఈ పుస్తకం మాత్రం మనవూళ్ళో ఎక్కువమంది పాఠకులకు నచ్చింది.


ఆమాటే నాన్న ఆ రచయితగారితో అంటే 'మీ ఊళ్ళో గ్రంధాలయం ఏర్పాటు చేసుకుంటే నా దగ్గర ఉన్న ఎక్కడో గాని దొరకని అత్యుత్తమ సాహిత్య పుస్తకాలు రెండు వేలవరకు ఉన్నాయి..వాటిని మీ గ్రంధాలయానికి ఉచితంగా బహుమతి ఇచ్చే అవకాశం నాకు కల్పించండి'అని కోరారట.


ఈలోగా అనుకోకుండా పంచాయితీ ఎన్నికలు వచ్చి ఊరికి కొత్తగా ఎన్నికైతే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఏమాత్రమూ అభివృద్ధో చెందని మన గ్రామంలో చక్కని ఉన్నతపాఠశాల, గ్రంధాలయం, మంచి సౌకర్యాలు ఉండే దవాఖాన,కుళాయిలద్వారా ఇంటింటికి నీళ్లు...ఊళ్లోని చదువుకున్న యువకుల సహకారంతో ఏర్పాటు చేస్తానని ప్రమాణం చేసి గెలిచిన నాన్న ఆచరణలోకి తెస్తున్న మొదటి మంచి పని ఇదే అత్తా.

ఇంత మంచి పని ఆకారం దాల్చడానికి మూలపురుషుడు ఆ పుస్తకం రాసినాయన.ఏమంటావత్తా?"అడిగాడు శంభు.


"నిజవేరా అబ్బాయ్.మార్పు అనేది ఎవరో ఒకరినుంచి మొదలవ్వాలిరా.ఇపుడు నువు ఇంత వివరంగా చెబుతుంటే మా ఇంటికి కోరి వచ్చి చదువు చెప్పిన పెద్దాయన వయసుకి, జ్ఞానానికి, అనుభవానికి కూడా విలువ ఇవ్వక పనిమనిషి చేసిన పనితో సమానంగా విలువకట్టి జీతం ఇచ్చాను. నేను అవమానించింది ఆయన్ని కాదురా.సాక్షాత్తూ ఆ సరస్వతీ మాతని.అందుకే ఆ తల్లి ఆయనకి కోపం తెప్పించి నా పిల్లలకి చదువును దూరం చేసింది. మీ మావయ్య అబద్ధాలు చెప్పి వ్యాపారం చేసి ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు.విద్యాదానం చేస్తున్న మనిషికి ఒకరూపాయి ఎక్కువిస్తే తప్పేంటి?కానీ కాస్తో కూస్తో చదువుకుని కూడా అజ్ఞానంగా ప్రవర్తించి నా పిల్లలకి నేనే అన్యాయం చేసుకున్నాను శంభు.నిజంగా తప్పు చేసానురా." కళ్లనీళ్ళ పర్యంతమైపోయింది అనిత.


"పోనీలే అత్తా.అందుకే అన్నారు పెద్దలు."A stich in time saves nine"అన్నాడు శ్రీకంఠ.


"అంటే అర్ధమేమిట్రా?"అడిగింది అనిత.


"అదికూడా తెలీదా మమ్మీ...ఏదైనా బట్ట చిరుగు పడితే ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అశ్రద్ధ చేస్తే 9 కుట్లు వేసుకునేంత చిరుగు అవుతుంది అని

అర్ధం. అంటే చిరిగి చేటంత అవుతుందని."

కొడుకు అందుకుని చెప్పిన తీరుకు అనితతో పాటు అక్కడ అంతా నవ్వేశారు.


**********


మరునాడు ఉదయం పదిగంటలకు పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో విశాలంగా రెండు గదులతో నిర్మించబడిన భవనానికి జిల్లా గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది.


కార్యక్రమానికి దాదాపు చుట్టుపక్కల పది గ్రామాల సర్పంచులు, వారి అనుయాయులు, ఊరిలోని యువత, చదువుకునే పిల్లలందరితో ఆ ప్రాంగణం నిండిపోయింది.


భవనానికి బయట విశాలమైన ఖాళీస్థలంలో షామియానా వేసి వేదిక నిర్మించారు.


వేదిక ముందు దాదాపుగా రెండువందల కుర్చీలు అతిధులతో ఆహూతులతో నిండిపోయాయి. ముక్కంటి సభకు అధ్యక్షత వహించాడు. ''నేతాజీ యువజన" సభ్యులు అందరూ కార్యకర్తలుగా తలోపనిని క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు.శ్రీకంఠ, శంభు తండ్రి కుర్చీకి వెనుక జయవిజయుల్లా నిలబడ్డారు.


ముక్కంటి అధ్యక్షస్థానంలో నిలబడి మైక్ అందుకున్నాడు.


"ముందుగా ఈ గ్రంధాలయం ఇక్కడ నిర్మించే ఆలోచనకు పునాది వేసి తన దాతృత్వంతోనే కాకుండా తన కథలతో పాఠక లోకాన్ని, మరీ ముఖ్యంగా మా గ్రామ ప్రజలను చైతన్యపరచిన శ్రీ అనంతరామయ్య మాష్టారిని సరస్వతీమాత ముందు దీపం వెలిగించి పూజ నిర్వహించి ఈ గ్రంధాలయం ప్రారంభం అయినట్లు గా ప్రకటించమని కోరుతున్నాను.వారిని వేదిక మీదకు తోడ్కొని రావాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాను."అన్నాడు.


నున్నటి గుండు వెనుక చిన్న పిలక, నుదుట విభూతి రేఖలు,మెడలో రుద్రాక్షలు, తెలుగునుడికారపు పంచికట్టు, లాల్చీ మీద జానెడు వెడల్పున జరీ అంచు ఉన్న కండువా మెడలో ధరించి వేదపండితుడిలా మెరిసిపోతూ నమస్కరిస్తూ వేదికపైకి ఎక్కుతున్న ఆయన్ని చూస్తూనే అనిత ఉలిక్కిపడింది.సంభ్రమాశ్చర్యాలతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని, అంతలోనే తప్పు జేసినట్టు చింతాకుల్లా చిన్నవైపోయాయి.అయినా ఆమె కనురెప్ప వేయకుండా ఆయన్నే చూడసాగింది.పిల్లలిద్దరూ అప్రయత్నంగా వారి స్థానాల్లో నిలబడి చేతులు జోడించారు.

"అమ్మా!సారుగారు!"అన్నారు సంతోషాతిరేకంతో.


ఆయన చూపులు ముందు వరుసలో నిలబడిన పిల్లలమీద తరువాత అనిత మీద పడి 'వీళ్ళు ఇక్కడేంటి?'అన్నట్టుగా భ్రుకుటి ముడిపడి అంతలోనే ముక్కంటి వాయువు తిరిగిపోయాయి.


ముక్కంటి, ముఖ్య అతిథులు పక్కన నిలబడగా ఆయన ,జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీ ప్రార్ధన ఆలపించి ఇలా అన్నారు.


"ప్రజలు అధికారమిచ్చినందుకు నిజమైన సేవచేయాలనుకుని ముందుగా ప్రజలందరికీ విజ్ఞానపు వెలుగులు పంచే సరస్వతీమాతకు ప్రతిరూపమైన గ్రంధాలయాన్ని స్థాపించిన ఉత్తమ నాయకుడు ఈ గ్రామ సర్పంచి ముక్కంటిగారి సమక్షంలో జ్యోతిప్రజ్వలన చేసిన నేను గ్రంధాలయం ప్రారంభింపబడింది అని సభాముఖంగా ప్రకటిస్తున్నాను." కరతాళధ్వనులతో ఆ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించింది.


అనంతరం ముక్కంటి మాట్లాడుతూ తనకు ఆ మంచి ఆలోచనకు ఏ విదంగా బీజం పడిందో సవివరంగా చెప్పారు.


తన రెండో కుమారుడు స్వచ్చందంగా గ్రంథాలయ అధికారిగా సేవలు అందిస్తాను అని తెలపడంతో పెద్దమనసుతో అంగీకరించిన గ్రంథాలయ ప్రధానకార్యదర్శి గారి చేతుల మీదుగా ఆ ఉత్తర్వులు ఇప్పించాడు. తన వంతు సాయంగా రెండువేల పాత అమూల్యమైన పుస్తకాలను ముందుగానే దానం చేసిన ఆనంతరామయ్యగారికి సభాముఖంగా ఘనంగా చక్కని సత్కారం చేశారు...వేదికమీద ఉన్న సభ్యులందరూ కలసి.

ఆనంతరామయ్యగారు సన్మానగ్రహీతగా మాట్లాడుతూ -


"స్వాతంత్రం వచ్చాకా ప్రజలందరూ చదువుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

సాంకేతిక విద్య అభివృద్ధిలోకి వచ్చాక విద్య ప్రాముఖ్యత మరీ పెరిగింది.అయితే చదువుకుంటున్నవాళ్ళు అందులోని అర్ధాన్ని, అంతరార్ధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దీని వల్ల మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనే ఆలోచిస్తున్నారు. ఉద్యోగం రాని చదువు వృథా అని భావిస్తున్నారు.

నిజానికి చదువు ఒక గంధపు చెట్టు లాంటిది.దాని అణువణువు దానిని వాడుకున్న ప్రతీ వారికి సుగంధ పరిమళాన్ని మిగిల్చినట్టే మనిషినైనా ఎత్తుకుపోవచ్చునేమో గాని చదువుకున్న చదువును ఎవరూ దొంగిలించలేరు.అలాంటి ఖచ్చితమైన విద్యను ఉపాద్యాయుడు తాను నేర్చుకున్నదంతా జీవితాంతం ఉపయోగపడేలా విద్యార్థులకు నేర్పిస్తాడు.

అటువంటి చదువుకు రోజుకూలి కడితే సాక్షాత్తూ ఆ సరస్వతీమాతను అవమానించినట్టే. ఈ గ్రంధాలయం ఈ గ్రామస్థులందరికి జీవితాలలో జీవనజ్యోతులు వెలిగించాలని కోరుకుంటూ నేను సూచనప్రాయంగా గ్రంధాలయాన్ని ఏర్పాటుచేసుకోండి అన్న మాటకు విలువిచ్చి దానిని ఆచరించి ఇంత అపూర్వ గౌరవమిచ్చిన ముక్కంటి గారికి,ఈ గ్రామస్తులకు ఆ తల్లి కటాక్షం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ .. సెలవ్"


నేతాజీ యువజన సభ్యులు టపాసులుపేల్చి తారాజువ్వలు వదిలారు.


ఇంతలో ముక్కంటి పక్క గ్రామపు సర్పంచి మాట్లాడతారని ప్రకటించాడు.


"సభకు నమస్కారం.జిల్లా గ్రంధాలయ అధికారి గారు ఇక్కడే ఉన్నారు కనుక వారు అనుమతి ఇస్తే అనంతరామయ్య మాష్టారు అందించిన స్పూర్తితో ఈ చుట్టుపక్కల మా గ్రామాలలో కూడా గ్రంధాలయాలు ఎవరికి వారం ఏర్పరచుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం సర్"అనడంతో ఆ వాతావరణమంతా కుర్రాళ్ళ ఈలలు,అరుపులు, స్టెప్పులతో

ఆనంద సంద్రంలా మారిపోయింది.


సమాప్తం.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు

తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంటా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్


145 views1 comment

1 commentaire


shahnaz bathul
shahnaz bathul
17 juin 2022

కథ చాలా బాగుంది.

గ్రంధాలయాలు దేవాలయాలతో సమానం.

ఈ కాలం లో విలువ లేకుండా పోయాయి.


J'aime
bottom of page