తాతగారు రాసిన ప్రేమలేఖ
- Kotthapalli Udayababu

- 1 day ago
- 8 min read
#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #తాతగారురాసినప్రేమలేఖ, #ThathagaruRasinaPremalekha, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Thathagaru Rasina Premalekha - New Telugu Story Written By - Kotthapalli Udayababu Published In manatelugukathalu.com On 21/11/2025
తాతగారు రాసిన ప్రేమలేఖ - తెలుగు కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
స్కూటర్ దిగి నెమ్మదిగా తనగదిలోకి వెళ్ళబోతూ గుమ్మంముందు ఆగిపోయిన విష్ణు మూర్తిగారు లోపలికి వచ్చిన చందన్ తో "థాంక్స్ కన్నయ్యా. చాలా రోజులతర్వాత ఒక గంట ప్రశాంతతని అందించావు. హార్ట్ ఫుల్ థాంక్స్. ” అనేసి వెళ్ళిపోయారు.
“మమ్మీ.. ఆకలి. ఏమైనా స్నాక్స్ పెట్టవా.. ” డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ తల్లి మాధురిని అడిగాడు చందన్.
“ఏమిట్రా.. తాతగారు అన్ని సార్లు థాంక్స్ చెబుతున్నారు?” బ్రెడ్ మీద జామ్ చాకుతో రాస్తూ అడిగింది.
“మమ్మీ.. నువ్ రోజూ మాకు అన్నం పెడుతున్నావ్ గా.. అందులో వింతేముంది?”
“అవున్రా.. రేపు నీ పిల్లలకు కూడా నువ్వు అన్నం పెట్టుకుంటావ్.. అందులోను వింతేమీ లేదు”
“మరి తాతగారేమిటి? వాళ్ళ మావయ్య కూతురు ఇంటికి తీసుకువెళ్ళానా?.. అన్నం పెట్టినవాడు.. మహానుభావుడు అని స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి చేరేంతవరకు గొణుక్కుంటూనే ఉన్నారు. అక్కడకి వెళ్ళాక ఆయనదెవరిదో ఫోటో చూసి ఏడుపు కూడా.. ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకే అంత బాధపడాలా?” అన్నాడు చందన్.
“నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ వుంటారు. అవేమీ మనసులో పెట్టుకోకు. నీ చదువు నువ్వు చదువుకో. అయినా నీకు లక్షసార్లు చెప్పాను. ఆయన ఎక్కడికన్నా తీసుకువెళ్ళమంటే ‘నాకు వర్క్ ఉంది కుదరదు తాతగారు. మీరు ఆటోలో వెళ్ళండి’ అని చెప్పమన్నానుకదా. ” అంది మాధురి.
“అదేంటమ్మా అలా అంటావ్?. ఎవరొచ్చినా ఆయనకోసమే వస్తారుకదా.. పాపం. తాతగారు ఎప్పుడోగాని అడగరు. తీసుకెళ్తే తప్పేంటి? అదే మీనాన్న - మా 'ఆ తాత' వస్తే మాత్రం కాలేజ్ ఎక్కొట్టి మరీ తిప్పమంటావ్? ఆ తాతకో రూలూ, ఈ తాతకో రూలూనా?” అడిగాడు చందన్.
“ఆ తండ్రికి తగ్గకొడుకు మీ నాన్న. మీ నాన్నకు తగ్గ కొడుకువు నువ్వు. సరిపోయింది. అందరూ కలిసి నాకు పెడతారు టెండర్. ఆయన తన తిండికి అయ్యేఖర్చు అయిదువేలే ఇస్తున్నారు. మిగతా పెన్షన్ డబ్బంతా ఏం చేసుకుంటున్నారో తెలీదు. కూతురు అడిగినప్పుడల్లా పంపిస్తారు. మీ నాన్నకు మొహమాటం. ’ఇంకో అయిదువేలు ఇవ్వండి నాన్న ‘ అని అడగమంటాను. ఒక మనిషి ఎంత తిన్నా అద్దెతో సహా అయిదువేలు సరిపోతుందికదా.. మనకు నిజంగా అవసరం అయినప్పుడు అడుగుతానులే. ’ అంటారు. అంతా నా ఖర్మ. నా మాట ఎవరూ వినరు కదా. ”విసుక్కుంది మాధురి.
*****
“అమ్మాయి. నేనలా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళొస్తాను. పది నిముషాలలో వచ్చేస్తాను. ” కోడలి సమాధానంకోసం ఎదురుచూడకుండా వీధిలోకి నడిచారు విష్ణుమూర్తిగారు చేతిలో కవరుతో.
“మీరెందుకండీ, ఏమైనా పోస్ట్ చెయ్యాలనుకుంటే చందూకి ఇవ్వండి. పోస్ట్ చేస్తాడు. ” అని హాల్లోకి వచ్చిన మాధురికి మావగారు హాల్లో కనిపించకపోవడంతో కాలేజ్ కి బయల్దేరుతున్న చందన్ తో అంది నేరం చెబుతున్నట్టుగా.
“చూసావురా. ఆ కవర్ నీకిస్తే ఆయన ఎవరికి ఏం పంపిస్తున్నారో నాకు తెలిసిపోతుందని ముందే వెళ్ళిపోయారు. ఆయన్ని నువ్వు వెనకేసుకొస్తావ్. నామాటంటే ఎవరికి లెఖ్ఖ?”
తల్లి అమాయకపు గడుసుదనానికి నవ్వుతూ ఒక్కసారిగా మాధురిని కౌగలించుకుని "ముసలాయన. ఆయనతో నీకెందుకమ్మా?.. మాఅమ్మ మంచిది. ” అని తల్లిబుగ్గమీద ముద్దుపెట్టుకుని వెళ్ళిపోయాడు చందన్.
“ఎవరు బాధపడినా ఓర్చుకోలేడు. అందరూ కావాలి వెధవన్నకి.” మురిపెంగా బుగ్గ రాసుకుంటూ తలుపేసుకుంది మాధురి.
వీధిచివర మలుపులో బాదం చెట్టుకింద నీడలో నిలబడిన తాతగారిని చూస్తూనే బైక్ ఆపాడు చందన్.
“ఏంటి తాతయ్యా ? ఇక్కడ నిలబడ్డారు? ఎక్కడికైనా వెళ్ళాలా?” అడిగాడు తాతగారిని.
“లేదు కన్నయ్యా. నీకోసమే. నీకు తెలుగు చదవడం రాయడం వచ్చు కదూ?”
“వచ్చు తాతయ్యా. మీరు మీ గదిలో భగవద్గీత శ్లోకాలు పాడినంత బాగా రాదు. ఎందుకు అలా అడిగారు?”
“ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి. ఇపుడు మనం ఇక్కడ ఇలా మాట్లాడుకున్నట్టు ఎవరికీ, ముఖ్యంగా మీ అమ్మకి చెప్పనని మాట ఇవ్వాలి. అపుడు చెబుతాను. ” విష్ణుమూర్తిగారు చేయిచాచారు.
నిస్సంకోచంగా తాతగారి చేతిలో చేయివేసాడు చందన్.
“నేను నీకు ఒక ప్రేమలేఖ రాసాను. ”
తాతగారి మాటలకు విస్తుబోతూ అన్నాడు చందన్.
“యు మీన్ లవ్ లెటర్? మీరు.. నాకు.. హ హ హ.. ప్రేమలేఖా.. వాట్ ఈజ్ దిస్?”
“వెర్రినాగన్నా.. మీకుర్రకారు దృష్టిలో లవ్ అంటే స్త్రీపట్ల ఆకర్షణ. ఇది అదికాదునాన్నా.. మమకారంతో, ఆత్మీయతతో రాసింది. నువ్వుకూడా నవ్వుకోకూడదు. పూర్తిగా చదవాలి. చదివాక కూడా అర్ధం అవకపోతే మళ్ళీ నాకు ఇచ్చెయ్యాలి. అంతేగాని ఇంట్లో ఎవరికీ చూపించకూడదు. సరేనా?”
“సరే.”
తన చేతిలోని కవర్ చందన్ చేతిలో పెడుతూ “చెప్పింది గుర్తుందిగా.. ” అడిగారు విష్ణుమూర్తి గారు.
“ఓ.. వెళ్తాను తాతయ్యా.. కాలేజ్ కి టైం అయింది. ” కవర్ తన బుక్స్ బాగ్ లో పెట్టుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు చందన్. మనవడు వెళ్ళాక విష్ణుమూర్తిగారు ఇంటిదారి పట్టారు.
*****
కాలేజ్ కి వెళ్ళే దారిలో పార్క్ ముందు బైక్ ఆపి లోపలకి నడిచాడు చందన్. అతని మనసంతా ఏదో ఉద్వేగంగా ఉంది. తాతయ్య తనతో డైరెక్ట్ గానే చెప్పవచ్చు కదా.. లెటర్ రాయడం ఏంటి? తనకు వచ్చిన తెలుగు భాషకి పరీక్షా ఇది? అమ్మకు చెప్పకూడనంత రహస్యం ఏముంది ఇందులో? చదివేస్తే పోలా? అనుకుని బాగ్ లోంచి కవరుతీసి లోపల ఉన్న కాగితాలను బయటకులాగి చెట్టునీడన చల్లగా ఉన్నచోట నీడలో కూర్చుని చదవసాగాడు. అందులో ఇలాఉంది.
“ప్రియమైన నా చందన్ బాబు కి,
ఉత్తరం అనేది మనం ప్రేమించే మనిషి ఎదురుగా ఉండగా చెప్పలేని అపురూప భావాలను వాళ్ళ మనోతీరాలకు తీసుకువెళ్ళే అద్భుత సమాచారసాధనం. చేతిలో పడినవెంటనే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుతతో మనసు పరిపరివిధాలపోతున్నా, మన ఏకాగ్రతను ప్రతీ అక్షరంపైన ఉంచి చదివి ఆకళింపు చేసుకుని ఆత్మానందపు సాగరంలో ముంచి తేల్చే మనోహర సౌధం. అందుకే నీకీ ఉత్తరం.
నీకు ఈ తాతగారి ఆశీస్సులు. నా వంశ వారసుడిగా నువ్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నా కోరిక. ‘ఈ పెద్దాళ్ళు వాళ్ళచాదస్తంతో మన బుర్రతింటూ వుంటారు. అవేమీ మనసులో పెట్టుకోమాకు’ అన్న మీఅమ్మమాటలు నేనువిన్నాను. అవే కాదు. మీరిద్దరూ మాట్లాడుకున్న అన్ని మాటలూ నేనువిన్నాను.
ఈ ప్రపంచంలో నేను ఇక చెయ్యవలసిన పనులేమీ లేవు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి నన్ను నీలో కైంకర్యం చేసుకో, ’ అని ఏ మనిషి సంతృప్తిగా భగవంతుని ఆత్మసాక్షిగా ప్రార్దిస్తాడో ఆనాడు ఆ మనిషికి స్వచ్చంద మరణం భగవంతుడు ప్రసాదిస్తే నాలా బాధ్యత తీరిన ఎందరో వృద్ధులు ప్రశాంతంగా శాశ్వత విశ్రాంతి పొందడానికి ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉన్నారు. కానీ వృద్దాప్యంలోనే మనిషి గతజన్మ లో చేసిన పాపాలు అనేక విధాల శాపాలై చుట్టుకుంటాయి.
మానీడ పడితేనే పాపం అనుకుంటారు గాని.. మన కుటుంబానికి తల్లివేరు ఆ వృద్ధులే అన్న నిజం తెలిసికూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు. నాఅదృష్టం కొద్దీ ఇంకా నా కొడుకు కుటుంబం అలా అనుకునే స్థాయికి రాలేదనే ఆనందం నన్ను బ్రతికిస్తోంది నాన్నా..
నిన్న సాయంత్రం మనం వెళ్ళింది నా మేనత్త కూతురు ఇంటికి. ’ఒక్కసారివచ్చి నన్నుచూసి వెళ్ళుబావా ’ అన్న నా మరదలి మాట తీసేయలేక నిన్న నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇక్కడనుంచి ఇంకాస్త శ్రద్ధగా చదువు. ”
తాతగారు తన ఎదుటే నిలబడి చెబుతున్నట్టుగా అనిపించి ‘ఇలా రాస్తారా ఉత్తరం.. ’ అని ఆశ్చర్యపోతూ చందన్ చుట్టూ ఒకసారి కలియచూసి సర్దుకునికూర్చుని మళ్ళీ చదవడం కొనసాగించాడు.
‘నేను, మా చెల్లి మీ ముత్తాతగారికి ఇద్దరం పిల్లలం. మీ ముత్తాతగారు స్టేజి మీద నాటకాలు వేసేవారు. అంటే మీరు మీ కాలేజ్ ఫంక్షన్స్ లో స్కిడ్స్ వేస్తున్నారే అలాగన్నమాట. నేను స్కూల్ ఫైనల్స్ చదువుకు వచ్చేనాటికే పూర్వీకులు ఇచ్చిన ఆస్తినంతా ఆ నాటక సమాజాలవాళ్ళకే ఖర్చు చేసేసారు.
అవి స్వాతంత్య్ర పోరాటపు రోజులు. నేను సరిగా చదువుకోక ఆ ఉద్యమాల ఊరేగింపుల్లో, సభలలో పాల్గొనేవాడిని. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడిని. పోలీసులచేత ఎన్నో లాఠీ దెబ్బలు కూడా తినేవాడిని. డబ్బున్న స్నేహితుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాడిని.
వాళ్ళల్లో ‘రంగడు’ అనే కోటీశ్వరుడు ఉండేవాడు. చిన్నవయసులోనే ఇంట్లో తెలియకుండా సిగరెట్ కాల్చేవాడు. ఆ పెట్టెలు నాచేత కొనిపించేవాడు. నాకు బీడీకట్ట ఉచితంగా ఇచ్చేవాడు. నాకు బీడీలు అలవాటుచేసింది వాడే. ఒక దీపావళి పండగకు రెండుజతల బట్టలు కుట్టించారు మీ ముత్తాతగారు నాకు.. రోడ్డు పక్కన ముష్టివాడు చలికి వణికిపోతుంటే వాడికి ఒక జత ఇచ్చేశాను.
పోలీసుల లాఠీఛార్జిలో ఒకడికి ఒళ్ళంతా రక్తసిక్తమైతే వాడికి నాఒంటిమీద ఉన్న రెండోజతలోని చొక్కా అక్కడికక్కడే విప్పి ఇచ్చేశాను. ఆరోజు మానాన్న నన్ను వెదురుబెత్తంతో చావగొట్టాడు. పరీక్షలకు వెళ్ళడానికి చొక్కా లేకపోతే రంగడు ఇచ్చిన చొక్కాతో పరీక్ష రాసాను. ఒకేనిక్కరుతో ఎంతకాలం ఉండను? దానిని ఉతికి ఆరవేసి దుప్పటి కట్టుకునివెళ్లి స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసాను. పాసయ్యాను.
ఆ వేసవికి మా అమ్మమ్మగారి వూరు వెళ్లాను. అమ్మాయిలు ఎక్కడ కనిపించినా ఆట పట్టించేవాడిని. మీరు ఇప్పుడు చేస్తున్న రాగింగ్ లా.. ఒక పెద్దాయన నన్ను పిలిచి వివరాలు అడిగి ‘మీనాన్నను తెచ్చుకో. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను’అన్నాడు. వెళ్లి మాఅమ్మమ్మతో విషయం చెప్పాను. నాకు ఉద్యోగం లేదు.. గాలిగాడిని.
ఏం జరిగిందో ఏమో గానీ.. వారం రోజుల్లో మీ నాన్నమ్మతో నాకు పెళ్లయింది. అపుడు నావయసు 17. మీ నాన్నమ్మకు 14. పెళ్ళికి వచ్చిన మా మేనమామను మానాన్న నాకు ఉద్యోగం ఎక్కడైనా వేయించమన్నాడు. ఆయన నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఉద్యోగం వేయించాడు. చాలా మంచివాడు ఆయన.
కానీ మామేనత్త ఆయన లేనపుడు నన్ను పిలిచి “చూడు.. నీ ఉద్యోగానికి ౩౦౦ లంచం ఇచ్చాము. నీకొచ్చే 100 రూపాయల జీతంలో నెలకు 50 చొప్పున నాకుకట్టి మిగతాడబ్బు వాడుకో” అనిచెప్పింది.
మీ నాన్నమ్మ అక్కడ మాఇంట్లో మాఅమ్మచేత కోడింటికం అనుభవించేది.
అత్తయ్య అప్పు తీరిపోయాక నేను మీ నాన్నమ్మను తీసుకువచ్చి రాజమండ్రిలో కాపురం పెట్టాను. అయినా మాఅత్తయ్య మరో ఆరునెలలపాటు నాదగ్గర నెలకు 50 రూపాయల చొప్పున మరో ఆరునెలలు తీసుకుంది.
’అదేమిటి’ అని అడిగాను.
’నన్నే ప్రశ్నిస్తావా’ అని కోపగించుకుంది.
ఆరు నెలలు పూర్తయ్యాక మీ నాన్నమ్మకు మూడుకాసులతో మంగళసూత్రపు తాడు, మరో మూడుకాసులతో రెండు బంగారుగాజులు చేయించి నాతో అంది "అమ్మాయి ఒంటిమీద నగలు ఏనాడైనా తీసావో నీకు మర్యాద దక్కదు. " అని,.
మీనాన్న, మీఅత్తయ్యా పుట్టారు. మీ నాన్న చక్కగా క్రమశిక్షణతో చదువుకుని మామాట విని ఆరోజుల్లోనే ఇంజనీరు అయ్యాడు. వాడికి వచ్చిన మార్కులుచూసి వాడికి వుద్యోగం వెంటనే ఇచ్చారు. మీఅత్తయ్యకు చక్కగా పెళ్లి చేసాము.
ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే.. ఆనాడు నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి మామేనమామ నాకు ఉద్యోగం ఇప్పించి ఉండకపోతే నాబ్రతుకు ఏమయ్యేది? నాకు, నా కుటుంబానికి అన్నం పెట్టింది ఎవరు?
నిన్న మనం వాళ్ళఇంటికి వెళ్ళినప్పుడు నువ్ ఫోటోలో ఒక ముసలి తాతగారిని చూసావే.. ఆయనే నాకు అన్నం పెట్టినవాడు. అందుకే ప్రతీరోజు నేను భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక ముద్దతీసి కంచం బయటపెడతాను చూడు.. అది ఆయనపేరు తలుచుకునే పెడతాను. ఈనాడు మన కుటుంబం ఇలా నిలబడిందంటే.. దానికి కారకులెవరు? ఆ అన్నంపెట్టిన మహానుభావుడే.. మన కుటుంబానికి తల్లివేరులాంటి ఆయనను మరిచిపోతే మనకు పుట్టగతులుండవు నాన్నా.
చెట్టును నాటకుండానే దానికి కాసిన పరిపక్వానికొచ్చిన కాయను కోసుకుని తినే అదృష్టం మీ అమ్మకు దక్కింది, ఆమెకు నా కుటుంబనేపధ్యం తెలియక అలా మాట్లాడుతుంది. ఇవన్నీ ఆమెకు అర్ధం కావలసిన అవసరంలేదు. నీకు అర్ధం కావాలి. ఆకష్టంచాటున దాగిన విలువ నీకుతెలియాలి. తాతగా నాపేరును నిలబెట్టే మంచి పొజిషన్ లోకి నువ్ రావాలి.
నేడో రేపో రాలిపోయే వాడినినేను. కానీ నువ్వు మన వంశ పునాదుల్ని మరింతగా పటిష్టపరచవలసిన బాధ్యతగలవాడివి. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ప్రతీ తాతకు వారసుడు మనవడే నాన్నా.
అందుకే ఇదంతా నీతో ప్రేమగా పంచుకున్నాను. ఇదిచదివాకా నన్ను నువ్వు ప్రేమిస్తావో లేదో మరి.. కానీ నిన్ను నేను తుదిశ్వాసవరకూ ప్రేమిస్తూనే ఉంటాను.. ఐ లవ్ యు.. కన్నయ్యా.. ఐ లవ్ యు ఫరెవర్.
ప్రేమాశీస్సులతో,
నీతాతగారు.”
రెండుమూడుసార్లు చదివాకా, అందులోని అర్ధం బోధపడ్డాకా.. అక్షరాలు మసకబారుతుంటే అర్ధం అయింది చందన్ కి, తనకళ్ళల్లో అశ్రువులు సుడులు తిరుగుతున్నాయని.
కోశస్థ దశనుంచి అప్పుడే బయటపడి తన రంగురంగుల లేతరెక్కలతో ఎగురుతోన్న సీతాకోకచిలుకలా, తల్లి పాలకోసం ఆత్రంగా పొదుగుదగ్గర నోటితో రొమ్ముచేపుతూ తన బుల్లితోకను ఊపుతున్న లేగదూడలా, దేవుని పూజకోసం కొలనులో సూర్యకిరణాలుపడి అప్పుడే విచ్చుకున్న కలువపూవులా ఉన్న తన మనసునిండా తాతయ్యపట్ల ప్రేమ పొంగిపొరలుతుండగా చందన్ ఆ కాగితాలను కళ్ళకద్దుకుని, పవిత్రంగా మడిచి బాగ్ లో పెట్టుకుని కళ్ళు తుడుచుకుని లేస్తూ “ ఐ లవ్ యు తాతయ్యా.. రియల్లీ ఐ లవ్ యు. యు ఆర్ ది స్పిరిట్ ఆఫ్ మై లైఫ్. యు అర్ ఎ స్వీట్ అండ్ గ్రేట్ గైడ్ టు మీ. ఈ సమయం లో మీరు ఎదురుగా ఉంటే ఎంత బాగుండేది?” అనుకున్నంతలోనే ఎదురుగా విష్ణుమూర్తిగారు పార్క్ గేటులోంచి లోపలికి తనవైపురాగానే ఎదురుగావెళ్ళి రెండుచేతులూ జోడించి తాతగారి పాదాలకు నమస్కరించాడు చందన్.
ఆనందభాష్పాలతో మనవడిని ఆప్యాయంగా కౌగలించుకుని ప్రేమాస్వాదనతో కళ్ళుమూసుకున్నారాయన.
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్




Comments