top of page
Original_edited.jpg

అపాయం లో ఉపాయం

#ApayamloUpayam, #అపాయంలోఉపాయం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Apayamlo Upayam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 20/11/2025

అపాయం లో ఉపాయం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“మీ అమ్మాయి కి పెళ్ళి సంబంధం చూసుకోవాలి కాని మా అమ్మాయికి వచ్చిన సంబంధం చెడకొడతావా సుబ్బారావు, నా ఉసురు తప్పకుండా తగులుతుంది” అంటూ కేకలు వేస్తున్న రమణమూర్తి ని చూసి “ఎందుకు ఆలా కాకీలా అరుస్తావు, ముందు లోపలికి వచ్చి కూర్చో, జరిగిన విషయం చెప్తాను” అన్నాడు సుబ్బారావు. 


“ఛీ నాకు సిగ్గులేదు అనుకున్నావా నీ గుమ్మంలో అడుగుపెట్టడానికి, ఎన్నిసార్లు డబ్బులు అవసరం అయితే సహాయం చేసాను, చివరికి నీ కూతురు కాలేజీ ఫీజు నా కూతురు ఫీజుతోపాటు కట్టాను, స్నేహానికి విలువ లేకుండా చేసావు” అంటూ వెళ్ళిపోయాడు రమణమూర్తి. 


“ఏమిటండీ వాళ్ళ అమ్మాయికి వచ్చిన సంబంధం మనం చెడగొట్టడం ఏమిటి, మీ స్నేహితుడికి పిచ్చపట్టిందా, అసలు మనం అమ్మాయి పెళ్ళి యిప్పుడు అనుకోవడం లేదుగా” అంది సుబ్బారావు భార్య రమణి. 


“వాడితిట్లకి ఎలా జవాబు లేదో నీ ప్రశ్నలకు అలాగే జవాబు లేదు. వాడు కొద్దిగా శాంతించిన తరువాత అసలు విషయం తెలుసుకుంటాడు. నేను ఏ పనిచేసినా వాడి కూతురు రాధిక మంచికోసం చేస్తాను, దానిని చిన్నపిల్లగా ఉన్నప్పటినుంచి చూస్తున్నాను, అది కూడా మన అమ్మాయి లాంటిదే” అన్నాడు సుబ్బారావు. 


“మనం ఆలా అనుకుంటే చాలా, నానా తిట్లు తిట్టి వెళ్ళాడు, పక్క ఇల్లు వాళ్ళు ఏమనకుంటారో అని భయంగా వుంది, అందుకే చెప్పాను స్నేహం కూడా హద్దుల్లో ఉండాలి అని. వింటేగా.. మీరు పూసుకుని తిరిగారు” అంది. 


“నువ్వు ఒక్కొక్కసారి నా మీద విరుచుకు పడవు, అలాగే వాడూనూ. కొంత టైము గడిస్తే వాడే తిక్క తిరిగి వస్తాడు” అన్నాడు సుబ్బారావు. 


సుబ్బారావు కూతురు మాధురి, రమణమూర్తి కూతురు రాధిక యిద్దరూ ఒకే కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒకరోజు రమణమూర్తి వచ్చి సుబ్బారావు కి చెప్పాడు తన కూతురికి మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి ప్రెవేట్ బ్యాంకులో పెద్ద ఆఫీసర్. అతని తల్లిదండ్రులు కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్ గా చేస్తున్నారు, ఇదిగో ఫోటో చూసి చెప్పు అబ్బాయి ఎలా వున్నాడో అని. 


అబ్బాయి ఫోటో చూసి యితనిని ఎక్కడో చూసినట్టు వుంది అనుకుని, “పిల్లాడు బాగానే వున్నాడురా. అయితే రాధిక చదువు పూర్తి కాకుండా పెళ్ళికి తొందర ఏమిటి. ఈ కాలంలో ఆడపిల్ల తనకంటో కొంత సంపాదన చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం” అన్నాడు. 


“దానికేముందిరా. పిల్లాడికి యిక్కడే ఉద్యోగం, అమ్మాయి చదువుకి ఎందుకు అడ్డు వుంటుంది. మనకంటే వాళ్లే ఈ విషయంలో జాగ్రత్తగా వుంటారు, మంచి రోజు చూసుకుని రాధికని చూసుకోవడానికి రమ్మన్నాను, ఆ రోజు నువ్వు, మా చెల్లెలు కూడా రావాలి” అన్నాడు రమణమూర్తి. 


ఒకరోజు పాలవాడికి డబ్బులు కట్టాలి అని చెప్పడంతో యింట్లో కూడా చిల్లర లేదు బ్యాంకు కి వెళ్లి తెద్దాం అనుకుని పెందరాలే బయలుదేరి బ్యాంకు కి వెళ్ళాడు. ఎటిఎం లో అన్నీ అయిదు వందల నోట్స్ వస్తాయి. బ్యాంకు తెరిచిన తరువాత చేక్ యిచ్చి క్యాష్ తీసుకుందాం అని గోడకు ఆనుకుని నుంచున్నాడు. ఒక్కొక్కళ్ళే స్టాఫ్ వస్తున్నారు, యింతలో మోటార్ సైకిల్ మీద కొత్తగా పెళ్ళి అయిన దంపతులు అనుకుంటా కిలకిలా నవ్వుతు వచ్చారు. వాళ్ళ దగ్గర కీస్ తీసుకుని అటెండర్ బ్యాంకు తలుపులు తీసాడు. 


 ఒక్కసారిగా బ్యాంకు దోచేయడానికి వచ్చిన వాళ్ళ లాగా అందరూ అటెండర్ని తోసుకుంటూ లోపలికి వచ్చేసారు. చెక్కు పుస్తకాలు పట్టుకుని కొందరు, సంచి చేతిలో గట్టిగా పట్టుకుని కొందరు. 


చెక్కు, కౌంటర్ క్లర్క్ కి యిచ్చి కుర్చీలో కూర్చొని ఇందాక చూసిన మోటార్ సైకిల్ మీద వచ్చిన మేనేజర్ ని ఎక్కడో చూసినట్టు వుంది, ఎక్కడ చూసాను.. అని ఆలోచిస్తున్నాడు సుబ్బారావు. ఆటే వచ్చిన అటెండర్ తో “బాబూ ఇందాక నీకు బ్యాంకు తాళం యిచ్చిన మేనేజర్ గారు, ఆ క్యాషియర్ భార్యభర్తలా? ఓకే బ్యాంకు లో ఉద్యోగం ఎంత అదృష్టమో” అని ఆడిగాడు. 


“కాదు సార్. వాళ్ళు ప్రేమికులు అంతే” అన్నాడు అటెండర్ నవ్వుతూ. 


ఇంతలో తన వంతు రాగానే వెళ్లి క్యాష్ తీసుకుని బయటకు వస్తో ‘ఆ మేనేజర్ని ఎక్కడ చూసాను బ్యాంకులో కాకుండా’ అనుకుంటూ నడుస్తోవుండగా గుర్తుకు వచ్చింది సుబ్బారావు కి. 

 

అవును.. కొన్నాళ్ళ క్రితం రమణమూర్తి తన కూతురుకి మంచి సంబంధం వచ్చింది అంటూ ఈ ఫోటో చూపించాడు, యిక్కడ చూస్తే ఇతనికి వేరే అమ్మాయితో ప్రేమాయణం. ‘వెంటనే రమణమూర్తి కి చెప్పాలి ఈ విషయం. లేదంటే పిల్ల గొంతుకోస్తాడు ఈ సంబంధం ఒప్పుకుని’ అనుకున్నాడు. 


ఇంటికి వచ్చి భార్యకి విషయం చెప్పి, రమణమూర్తి కి ఫోన్ చేసాడు. “ఒరేయ్ మొన్న నువ్వు చెప్పిన బ్యాంకు ఆఫీసర్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందిట, ఈ రోజు నేను ఆ అమ్మాయితో అతను మోటార్ సైకిల్ మీద వికవికలు ఆడుతో కనిపించారు” అని చెప్పాడు. 


“అలాగా. సరే, నేను తెలుసుకుంటానులే. ఏదైనా సంబంధం వచ్చింది అంటే చాలు చెడగొట్టడానికి రెడీ. నువ్వు కూడా అంతే అన్నమాట” అంటూ ఫోన్ పెట్టేసాడు రమణమూర్తి. 


‘వీడు ఎప్పుడు అర్ధం చేసుకున్నాడు, ? మూర్కుడు, .. యిప్పుడు ఏం చెయ్యాలి, చూస్తో చూస్తో బంగారం లాంటి అమ్మాయిని ఆ మోసగాడికి యిచ్చి గొంతు కోస్తాడేమో’ అనుకున్నాడు. 


“మీకెందుకు చెప్పండి, మీరు చూసింది చెప్పారు, వినకపోతే మీ స్నేహితుడి ఖర్మ మనమేం చేస్తాం” అంది సుబ్బారావు భార్య. 


“స్నేహం అంటే ఒకళ్ళు పాడై పోతోవుంటే ఆనందించడం కాదు, ఎలాగైనా ఈ సంబంధం కుదరకుండా చూడాలి” అన్నాడు సుబ్బారావు. 


సుబ్బారావు, కూతురు కి విషయం చెప్పి “నీ స్నేహితురాలు రాధిక కి వచ్చిన సంబంధం కుర్రాడు నా బ్యాంకు అకౌంట్ వున్న బ్యాంకులోనే ఉద్యోగం. మొన్న బ్యాంకు కి వెళ్ళినప్పుడు అతడు ఆ బ్యాంకులో పని చేసే క్యాషియర్ తో తిరుగుతున్నాడు అని తెలిసింది. ఆ విషయం రమణమూర్తి అంకుల్ కి చెప్పితే నేను కావాలి అని కల్పించి వాళ్ళ అమ్మాయికి వచ్చిన సంబంధం చెడగొట్టుతున్నాను అని అనుకుంటున్నాడు. రేపు ఆదివారం పెళ్లిచూపులుట, ఏం చెయ్యాలో తెలియటం లేదు” అన్నాడు. 


“ఎందుకు నాన్నా కంగారు, రాధిక నా స్నేహితురాలేగా. అయినా దానికి చెప్పి ఉపయోగం లేదు, దానికి వాళ్ళ నాన్న అంటే అంత నమ్మకం. నా దగ్గర ఒక ప్లాన్ వుంది, మీరు కొద్దిగా సాహసం చేస్తే చాలు” అని తండ్రి చెవిలో తల్లి వినకుండా రహస్యం చెప్పింది. 


ఆదివారం నాడు బ్యాంకు ఆఫీసర్ శ్రీకాంత్ పెళ్ళి చూపులకి రమణమూర్తి ఇంటికి వెళ్ళాడు తల్లిదండ్రులతో సహా. టిఫిన్స్ తిన్న తరువాత రాధికని చూపించారు. 


“పిల్ల వంక చూడకుండా ఇల్లు వంక చూస్తున్నావు ఏమిటి రా” అన్నాడు శ్రీకాంత్ తండ్రి. 


“బ్యాంకు లో పని కదా నాన్నా. ఎక్కడికి ఇన్స్పెక్షన్ వెళ్లినా ఆ ఆస్తి ఎంత విలువ వుంటుంది, బ్యాంకు లోన్ యిస్తే డబ్బులు తిరిగి వస్తాయా అని చూడటం అలవాటైపోయింది, సారి.. ఏమి అనుకోకండి, అమ్మాయి నాకు, నచ్చింది, చదువు విషయం మీరు చెప్పారు కాబట్టి, మీ అమ్మాయి కి నేను నచ్చితే మిగిలిన విషయాలు మా నాన్న గారితో మాట్లాడండి” అన్నాడు రమణమూర్తి తో. 



బుధవారం ఉదయం బ్యాంకు తెరవగానే సుబ్బారావు, సుబ్బారావు కూతురు మాధురి ఇద్దరు లోపలికి వెళ్లారు. క్యాషర్ తో విరగబడి నవ్వుతు తన రూంలోకి వెళ్తున్న శ్రీకాంత్ ని చూసింది. బ్యాంకులో పెద్దగా రష్ లేదు. మాధురి మెల్లగా వెళ్లి క్యాషియర్ రమణి కి ఒక పేపర్ అందించింది. అది చదవగానే రమణి మొహం నల్లగా మాడిపోయింది. తను యిచ్చిన నోట్ లో రాసినట్టుగా మాధురి బయటకు వెళ్లి నుంచుంది రమణి ఫోన్ కోసం


. రమణి కి ఫోన్లో తన ప్లాన్ చెప్పి “యిప్పుడు మా నాన్నగారు శ్రీకాంత్ ని కలిసి నా ఫోటో యిచ్చి మా ఇంటికి పెళ్లిచూపులకి రమ్మని పిలుస్తారు. ఒక పక్కన మిమ్మల్ని ప్రేమిస్తో నిన్న ఆదివారం మా స్నేహితురాలుని చూసి వచ్చినప్పుడే శ్రీకాంత్ మోసగాడు అని అర్ధం అయ్యింది, ఆ విషయం మీకు, మా స్నేహితురాలి తండ్రికి అర్ధం కావాలి. అందుకే చిన్న నాటకం, మీరు సహకరిస్తే ముగ్గురు ఆడపిల్లలం రక్షింపబడతాం” అంది. 


శ్రీకాంత్ గదిలోనుంచి బయటకు వచ్చిన తండ్రిని కలిసి “ఏమన్నాడు?” అని అడిగింది. 


“రేపు సాయంత్రం ముందు తను ఒక్కడు వచ్చి చూసి, నచ్చితే ఊరు వెళ్లిన తల్లిదండ్రులు రాగానే మళ్ళీ వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు” అని చెప్పాడు సుబ్బారావు, కూతురికి. 


“ఫోటో ఇవ్వకుండా తీసుకుని రమ్మన్నాను తీసుకుని వచ్చారా” అంది. 


“ముందు ఫోటో తన దగ్గర ఉంచమన్నాడు, ఎలాగో అమ్మాయిని చూస్తారు కదా, ఒకరికొకరు నచ్చితే ఫోటోలు ఒకరికొకరు యిచ్చుకుందురు అని తీసుకుని వచ్చేసాను” అన్నాడు. 


మర్నాడు సాయంత్రం శ్రీకాంత్ ముస్తాబు అయ్యి బ్యాంకు నుంచి బయలుదేరుతో క్యాషియర్ రమణికి చెప్పాడు తను అర్జెంటు పనిమీద బయటకు వెళ్తున్నాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో అని. అలాగే అన్న రమణి శ్రీకాంత్ బయలుదేరగానే తనుకూడా బయలుదేరి మాధురి యిచ్చిన అడ్రస్ ప్రకారం మాధురి ఇంటికి వెళ్ళింది. ఇంటి ముందు శ్రీకాంత్ మోటార్ బైక్ ఉండటం చూసి శ్రీకాంత్ మోసం గ్రహించింది. 


“మీ అమ్మాయిని పిలుస్తే అయిదు నిముషాలు మాట్లాడుకుని వెళ్తాను. నాకు అర్జెంటు గా వేరే బ్యాంకు పని వుంది వెళ్ళాలి” అన్నాడు శ్రీకాంత్. 


“అమ్మాయి కాలేజీ నుంచి వస్తోంది, ఈ లోపు పచ్చి మిర్చి బజ్జిలు తింటో ఉండండి” అన్నాడు సుబ్బారావు. 


“గంట గడిచినా యింకా మీ అమ్మాయి కాలేజీ నుంచి రాలేదు ఏమిటండి” అన్నాడు అసహనంగా. 


“వస్తో ఉంటే కారుకి ప్రాబ్లెమ్ వచ్చిందిట, యింకో అరగంట లో వచ్చేస్తుంది” అన్నాడు సుబ్బారావు. 


“మీ అమ్మాయి కారులో కాలేజీ కి వెళ్తుందా” అన్నాడు శ్రీకాంత్. 


“కొత్త కారు తీసుకుని వెళ్ళకే అంటే వినకుండా వేసుకుని వెళ్ళింది, అరవై లక్షల కారు, ఏమైందో ఏమిటో, ఈ రోజుల్లో ఏమి నమ్మలేకపోతున్నాము” అన్నాడు సుబ్బారావు. 


“సరే సార్. ఎలాగో ఆదివారం కాలేజీ కి సెలవు కాబట్టి ఆరోజు వస్తాను’, అని చెప్పి సెలవు తీసుకున్నాడు శ్రీకాంత్. మనసులో వీళ్ళు బాగా ఆస్తిపరులే అనుకున్నాడు శ్రీకాంత్. 


“జరిగింది యిది, చూద్దాం మనం అంటించాము. ఇహ ఆ క్యాషియర్ నడిపించాలి” అన్నాడు. 


“ఏమిటో మీరు మీ కూతురు ఎప్పుడూ నాకు అర్ధం కారు” అంది సుబ్బారావు భార్య. 


శ్రీకాంత్ ఆదివారం రావడానికి అవసరం లేకుండానే రమణి, రమణమూర్తి ఇంటికి వెళ్లి జరిగిన సంగతి చెప్పి “మాధురి, సుబ్బారావు గారు మీ కోసం ఎంత రిస్క్ తీసుకున్నారో ఈ లెటర్ చూస్తే తెలుస్తుంది” అని చూపించి, వాటితో పాటు తను శ్రీకాంత్ తీసుకున్న ఫొటోస్ చూపించింది. 


‘బాబోయ్ ఎంత మోసం. సుబ్బారావుని అనవసరంగా తిట్టిపోసాను, . నా కూతురు జీవితం నాశనం కాకుండా రక్షించాడు’ అనుకుని, ఒక్కసారి రమణి వంక చూసి “మరి శ్రీకాంత్ ఇటువంటి వాడు అని తెలిసింది కదా మరి యిప్పుడు నీ పరిస్థితి ఏమిటి” అన్నాడు. 


“ఏముంది అంకుల్.. అతనితో తిరగడమే నేను చేసిన తప్పు. అంతకంటే తొందరపడలేదు. నన్ను, మీ అమ్మాయిని ఈ మోసగాడి నుంచి రక్షించారు సుబ్బారావు అంకుల్, మాధురి. నేను వేరే వూరుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. వెళ్ళేలోపు అతని మోసాన్ని బ్యాంకులో బట్టబయలు చేసాను. అదే నాకు తృప్తి. వాళ్ళ నాన్నగారు, అమ్మగారికి కూడా వాళ్ళ అబ్బాయి గురించి తెలియచేసాను. వాడికి యింతకంటే శిక్ష అక్కర్లేదు” అంది బయటకు నడుస్తో. 


ఉదయం పాల పాకెట్స్ తీసుకుందాం అని బయటకు వచ్చిన సుబ్బారావు కి గేటు దగ్గర నుంచుని వున్న రమణమూర్తి కనిపించడంతో మళ్ళీ ఉదయమే ఏం గొడవ పెడతాడో అనుకుని “అక్కడే నుంచున్నావే లోపలికి రా” అన్నాడు. 


“సిగ్గేస్తోంది రా లోపలికి రావాలి” అంటే, “స్నేహంలో కూడా నాకు నిజాయితీ లేకుండా పోయింది. నువ్వు స్నేహానికి విలువ యిచ్చి నీ కూతురికి ఏమవతుందో కూడా ఆలోచించకుండా ఎంతో సాహసం చేసి నన్ను నా కూతురిని రక్షించావు” అన్నాడు. 


“నీకూ నాకు మధ్యలో మొహమాటం ఏమిటిరా. నీ ఆలోచనలో కూడా నిజం వుంది. ఆడపిల్లల తల్లిదండ్రులలో ఈ పోటీ ఉంటోనే వుంది, మన దాకా వచ్చేసరికి తెలిసింది. ఏమైనా ఆ మోసకారి చేతుల్లో పడకుండా తప్పించుకున్నాము. లోపలికి రా, మంచి సంబంధం చూసి ముందు మీ అమ్మాయి రాధిక కి పెళ్ళి చేసిన తరువాత మా అమ్మాయి పెళ్ళి, సరేనా” అంటూ చెయ్యి పట్టుకుని రమణమూర్తి ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. 


 శుభం 


 జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.







30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page