top of page

తిండీ - తిప్పలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Thindi Thippalu' written by Dasu Radhika

రచన : దాసు రాధిక

బకాసురుడిని, ఘటోత్కచుడిని ఒకే మిక్సీలో వేసి తిప్పితే తయారయ్యాడు రామ్మూర్తి.

ఏళ్ళు పెరిగినా అతడి తిండి పిచ్చి మాత్రం మారలేదు.

కరోనాతో ప్రపంచం మొత్తం మారిపోయింది.

మరి మన రామ్మూర్తి ఏమైనా మారాడేమో, ప్రముఖ రచయిత్రి దాసు రాధిక గారి ఈ ‘తిండీ - తిప్పలు’ కథలో తెలుసుకోండి.


సాంబారు వాసన ఘుమ ఘుమ లాడుతూ పక్కింటి నుండి యమ ఘాటుగా వద్దన్నా రామ్మూర్తి ముక్కు లోకి వ్యాపించింది... అస్సలే రేడియో లో " వివాహ భోజనంబు వింతైన వంటకంబు..." అని మాధవపెద్ది సత్యం గొంతు ఖంగు మని పాడుతుంటే వారం రోజుల నుండి పస్తున్న మనిషి డీలా పడిపోయినట్లున్నాడు రామ్మూర్తి... ఆ పాట లో ఘటోత్కచుడు లడ్డూలు మింగటం రామ్మూర్తి కి గుర్తొచ్చి పిచ్చి బాధ వచ్చేసింది...


చమటలు కక్కుతూ భార్య వనజ పది నిమిషాల్లో భోజనము సిద్ధం చేసి రామ్మూర్తిని పిలిచింది...

ఆకలి రుచి ఎరగేదేమో కానీ మన రామ్మూర్తిది ఆకలి బాధ కాదుగా... అతనికి తిండి పిచ్చి...

"ఏమిటే ఇది? అన్నం పెడ్తావంటే ఏదో గడ్డి వడ్డిస్తున్నావు?" అని కంచం తోసిపుచ్చాడు...

వనజకు ఆ భూదేవి కున్నంత ఓర్పు... ఏదో ఒక రోజు తనదారికి రాకపోతాడా భర్త అని ఇలా వారంలో రెండు సార్లు కనీసం ప్రయత్నిస్తూ ఉంటుంది... పడే తిట్లు పడతాయి, ఒకో సారి గొడవ కూడా అవుతుంది... కానీ ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకొని తినే ఆహారం మితంగా తింటూ వయసుకు తగ్గట్టు ఆహారం లో మార్పులు చేసుకుంటూ ఉంటే హాయిగా ఏ మందుల బారిన పడకుండా బావుంటామన్న సిద్ధాంతం ఆమెది...

ఇద్దరికి పొత్తు ఎలా కుదురుతుంది మరి...


"ఏంటి నీ ఉద్దేశ్యం, ఈ అడ్డమైనవన్నీ నీవు వండి వడ్డిస్తే నేను వెధవల్లే తినేస్తాననా? జొన్నలు, సొజ్జలు ఈ చిరుధాన్యాలు నువ్వే మింగు...నేను హోటల్ లో ఫుల్ మీల్ తిని వస్తా " అంటూ పక్క వీధి లో ఎప్పుడూ తినే కామత్ హోటల్ కాకుండా ఒక రెండు కిలోమీటర్ల అవతల ఉన్న సుబ్బయ్య హోటల్ లో ఏకంగా 32 రకాల మహారాజా విందు కసి గా తినేసొచ్చాడు రామ్మూర్తి...

ఎన్ని సార్లు ప్రయత్నించినా వనజకు చుక్కెదురే...


ఊరంతా రెండు భాగాలుగా చీలిపోయింది... సగం మంది మంతెన సత్యనారాయణను, మిగిలిన వారు వీరమాచినేని రామకృష్ణ ను అనుసరిస్తూ కడుపు కట్టుకొని నానా పాట్లు పడుతున్నారు... ఆధునిక ఆరోగ్యసూత్రాల వెల్లువలో... రామ్మూర్తి కి మటుకు చీమ కుట్టినట్లు లేదు... రోజు వేపుడు కూర, అప్పడాలు, వడియాలు, టిఫిన్ కి అట్లు, పంటికిందకి మధ్యాహ్నం వేళ లో స్వీట్లు, హాట్లు ఏవి తక్కువ కాకూడదు.


కొడుకు బాలుకు పిల్లను వెతికేటప్పుడు కూడా మంచి ఫలహారం పెట్టిన వాళ్లకు ఓటు వేసేవాడు ఆ పిల్ల బాలుకు నచ్చిందో లేదో పట్టించుకోకుండా...


కిందటి ఏడాది అమెరికా వెళ్లి ఆరు నెలలు ఉన్నప్పుడు కోడలు తో మాట్లాడలేదు మావగారు... పాపం వంట రాక పోయినా ఏవో పాస్తాలు, కేక్లు, కుక్కీస్ చేసిపెడ్తుండేది అరుణ... కానీ రామ్మూర్తిని మెప్పించాలంటే మంచి ఆంధ్రా భోజనం వండి పెట్టాల్సిందే...


పూట పూట గుత్తి వంకాయ కూర , పనస పొట్టు కూర ఇలా పెళ్ళిళ్ళకి కేటరింగ్ వాళ్ళు చేసినట్లు చెయ్యాలంటే ఎవరు చేయగలరు... వనజకు అక్కడకూడా క్షణం ఖాళీ దొరకలేదు... మొగుడికి అన్ని వండి వార్చటమే సరిపోయింది... పోనీ బయటకు తిప్పి అన్నీ చూపిద్దామని బాలు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది... అన్నీ చోట్ల ఇండియన్ హోటల్స్, మన భోజనం దొరకదాయే అమెరికా లో...


"ఎవడడిగాడు రా నిన్ను అటు ఇటు తిప్పమని, ఇంట్లో ఉంటే అమ్మ చేసిన బంగాళదుంప వేపుడు తినేవాడిని... ఈ బ్రెడ్ ముక్కలూ ఒక తిన్డే నా? నువ్వు ఇండియా వచ్చినప్పుడు మీ అమ్మ నీకిష్టమని నాలుగు రకాలు చేస్తే సుబ్భరంగా తింటావే... నాకేమో ఇక్కడ పిజ్జాలు పెట్టిస్తే నేనెలా బతకాలిరా?" అని గోల గోల చేసేవాడు...


తిరిగొచ్చేరోజు అరుణ మావగారికి క్షమార్పణ చెప్పుకొని "మీరీసారి వచ్చే సరికే అన్నీ వంటలు నేర్చుకుంటానని" కళ్లనీళ్లు పెట్టుకుంటే బాలు, వనజలకు రామ్మూర్తిని చూసై ఒళ్ళు మండిపోయింది...శ్రావణ మాసం లో అందరికంటే ఎక్కువగా పండగ చేసుకునేది రామ్మూర్తి! ఆ నెలంతా తెలిసిన వాళ్ళు, బంధువులు పంచే శుభలేఖలు, పెళ్లి పిలుపుల కోసం ఎంతో ఆత్రుత గా ఎదురు చూడడమే కాకుండా తూచ తప్పక రెండు రోజులు అదనంగా తిని వస్తాడు సతీ సమేతముగా... అందరూ కాశీ లో ఇష్టమైనవి వదిలేసినట్లు ఇతను కాశీ వెళ్ళకుండానే సిగ్గు, మొహమాటం వదిలివేశాడు తిండి విషయములో...


వాళ్ళ వీధిలో చివరింట్లో ఉండే గురుమూర్తి గారి ఆఖరి కూతురి పెళ్లికి పిలవటానికి ఒక రోజు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా వచ్చి పద్ధతిగా పిలిచారు రామ్మూర్తి వనజలను... అస్సలు ఒక్క మాట కూడా కాబోయే అల్లుడి సంగతి అడగకుండా భోజనాల గురించి సంభాషించాడు రామ్మూర్తి... ముహూర్తానంతరం మెనూ ఏంటి, ఆ రోజు పొద్దున ఫలహారినికి, సాయంత్రం తినటానికి ఏంటి అని వరసగా అడిగి తెలుసుకున్నాడు...


వనజ వైపు చూస్తూ "ఒక రెండు రోజులు హాయిగా పెళ్ళివారి ఇంట్లో భోంచేసి వాళ్ళని సంతోష పెడదాము, ఒకే వీధిలో ఇరవై ఏళ్లనుండి ఉంటున్నవాళ్ళం" అన్నాడు...

గురుమూర్తి భార్య అందుకుని "ముందు రోజు ఊళ్ళో వాళ్ళని అనుకోలేదండి, చుట్టాలవరకే అనుకున్నాం" అన్నా కూడా రామ్మూర్తి పట్టించుకోలేదు...వనజ కు గురుమూర్తిగారి భార్య ముఖ పరిచయము మాత్రమే...బాలు పెళ్లికి పిలిచిన జ్ఞాపకముకూడా లేదు! ఏం చేస్తాం తన మొగుడంతే...ఒక పక్క పెళ్ళి లో బావున్న వంటకాలు అక్కడ ఆస్వాదించింది కాక మళ్ళీ ఇంట్లో వనజ చేత చేయించుకుని తినాల్సిందే... మరో పక్క పెళ్లి లో నచ్చనివి కూడా మళ్లీ ఒక సారి వనజ చేయాల్సిందే, అవి రాంమ్మూర్తి తినాల్సిందే...ఇదీ వరస!


బాలు పెళ్లి ఖాయ పరుచుకున్నప్పుడూ అంతే...మాట్లాడుకోటానికి అరుణ వాళ్ల ఇంటికి వెళ్తే, ఒకే అంశంపై ఒక రెండు గంటలు మాట్లాడారు... "బావగారు అమీర్పేట్ చౌరస్తా పక్కన గలీ లో సాయంత్రం పూట వేడి వేడి బజ్జీలేస్తాడు, తినాల్సిందేనండి..."ఈ మధ్యే మా ఆఫీసు దగ్గర సమోసా చాట్ బండిపెట్టా రండి, ఒకసారి మీరు రావాలి బావగారు, మీకు పెట్టిస్తాను"... రాసిపెట్టుంది కాబట్టి జరిగింది...బాలు గాడి పెళ్లి...


అంతెందుకు... అలా ఒక ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్తే వనజను చేసుకోటానికి రామ్మూర్తి చెప్పిన కారణం పెళ్ళిచూపుల లో పెట్టిన ఫలహారమే! ఆ చేత్తో అత్తగారు తెచ్చి పెడుతూ ఉంటే ఈ చేత్తో తాను తింటూ ఉన్నాడు...అరిసెలు, మైసూర్ పాక్, కొమ్ము మిఠాయి, పకోడీలు, జీడిపప్పు, మిక్సచర్...ఇన్ని రకాలు పెట్టేసరికే కాదని ఎలా అంటాడు...అదృష్టవశాత్తూ వనజది కూడా వాళ్ళమ్మ చెయ్యి లాగే తిరిగిన చెయ్యి... లేకపోతే రామ్మూర్తి ఇన్నాళ్లు కాపురం చేసేవాడే కాదు...

ఇంకా నయము తన భర్తకు తిండి పిచ్చి మాత్రమే ఉంది...అత్తగారికైతే ఒక వింత అలవాటు ఉండేది... ఎవరయినా ఇంటికొస్తే వాళ్ళు పెట్టింది పూర్తిగా తిని వెళ్లినా, తినకుండా వెళ్లినా వాళ్ళు వెళ్ళాక వాళ్ళను నోరారా తిట్టేది... తిని వెళ్తే సిగ్గులేని పీనుగులు పీకలదాకా తిన్నారు అనేది. అదే ఏమి ముట్టుకోకుండా వెళ్లినా " వీళ్ళకు ఇదేమి పోయేకాలం, చచ్చేట్టు చేసి పెడితే తినకుండా పోయారు" అని ఆ వచ్చినవాళ్ళ కోసం చేసినవి అప్పటికప్పుడు తల్లీకొడుకులు మెక్కే వాళ్ళు... బాలూకి వాళ్ళ పోలిక రానందుకు వనజ తన కృతజ్ఞతలు తెలుపుకోవటం కోసము ఒకసారి ఆ ఏడు కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంది!


ఇటీవలే డాక్టర్ సలహామీద వనజ కాస్త స్వీట్స్, పిండి పదార్థములను తగ్గించి ఆహారం లో మార్పులు చేద్దామని చూసినప్పుడల్లా "ఛస్తే ఛస్తాను" అంటూ పట్ట లేని ఆవేశము తో అరవటం అలవాటుగా మారింది రామ్మూర్తికి...


తండ్రికి బాలు ఐ పాడ్ కూడా కొనిచ్చాడు ఎన్నో విషయాలు గురించి చదివి తెలుసుకోవచ్చని.... కాస్త తిండి మీద కాకుండా ధ్యాస మళ్లించినట్లవుతుందని...

కానీ ఒక నెలలో పదింతలు పైత్యం పెరిగింది తప్ప తరగలేదు... ఫుడ్ బ్లాగులు చూసి అవన్నీ వనజ చేత బలవంతంగా చేయించుకొడములో పడ్డాడు...


మనవడి మొదటి పుట్టినరోజుకు అమెరికా ప్రయాణం తప్పలేదు...ఈ సారి మూడు నెలలు మాత్రమే ఉన్నారు... కోడలు అరుణ పనైపోయింది... నేర్చుకున్న వంటలు మావగారికి వండి పెడ్తుంటే, అత్తగారికి కోపం, చెయ్యకపోతే మావగారికి కోపం... "అందరూ బతకడం కోసం తింటే నేను తింటం కోసమే బ్రతుకుతున్నాను" అని సిగ్గులేకుండా ప్రకటించేవాడు రామ్మూర్తి...

ఈ సారి ఇండియా తిరిగి వచ్చిన కొన్నాళ్టికి వనజ ఆరోగ్యం బాగా దెబ్బతింది... అరగంట పని చేసేసరికి అలిసిపోయి మూలుగు వచ్చేసేది... అప్పుడే మహమ్మారి కరోన ప్రపంచ వ్యాప్తముగా పీడించ సాగింది...


పక్కింటి వంటింటి ఘుమఘుమలు ఉన్నట్టుండి ఆగిపోయాయి... మహమ్మారి కి బలయిపోయింది ఆవిడ... ఆ దెబ్బకి రామ్మూర్తికి తన భార్య వనజ గురించి బెంగ మొదలయింది... కొడుకు బాలు ఫోను చేస్తే మొట్టమొదటిసారి అస్సలు తిండి గురించి ప్రస్తావించలేదు... కుశల ప్రశ్నలు వేయటమే కాకుండా పిల్లలకు జాగ్రత్తలు చెప్పాడు తండ్రి...అరుణ కూడా ఆశ్చర్య పోయింది...వనజ ఆరోగ్యం సంగతి కొడుకు తో చెప్పి కాస్త సేద తీరాడు రామ్మూర్తి...


అలవాట్లు మార్చుకుంటాడు లే అని బాలు అనుకొనే లోపలే పల్లెటూరి నుండి వంట మనిషి పార్వతమ్మకు కబురు చేసి పిలిపించాడు తండ్రి రామ్మూర్తి... పార్వతమ్మ కొడుకు ఉద్యోగం మహమ్మారి రావటం వల్ల పోయింది...విధి లేక పార్వతమ్మ పాత పరిచయస్తులకు మటుకు వాళ్ళ అవసరాలకు వంటలు చేస్తోంది... వనజ పెళ్లప్పటి నుండి పరిచయం ఉండడం తో రాంమ్మూర్తి పిలిస్తే కాదనలేక పట్నం వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్లకు వండి పెడుతూ కూడబెట్టిన డబ్బు కొడుకు కు సాయంగా పంపుతోంది...


వారం తర్వాత ఫోను చేసిన బాలు తో రామ్మూర్తి- "ఒరేయ్, ఈరోజు నా జీవితము లో మరపురాని రోజు రా... పెసరెట్టు ఉప్మా టిఫిను, మధ్యాహ్నం భోజనానికి చామదుంప వేపుడు, గోంగూర పులుసు కూర అప్పడాలు, వడియాలు కడుపు నిండా తిన్నానురా... రాత్రికి ఉల్లి ఖారం, కొత్తిమీర ఖారం నూరి పులి బొంగరాలు వెయ్యమని చెప్పాను పార్వతమ్మకు..." ఇవేమీ ఎన్నడూ తిననట్లు చెప్పేసరికే బాలూ ఖంగు తిన్నాడు..."నాన్నకు మానసిక వైద్యుడి చికిత్స ఎంతో అవసరము" అని బాలు మనసు చెబుతోంది కానీ ఎలా??


"అమ్మ ఎలా ఉంది నాన్నా?" అని బాలు అడిగితే " తినటానికి కూడా పెట్టి పుట్టాలిరా, మీ అమ్మ దానికి నోచుకోలేదు... జావ తాగి పడుంటోంది రా... నా గురించి దిగులు పడద్దు, ప్రతీ నెలా ఒక 100 డాలర్లు సర్దుబాటు చేశావనుకో, సరిపోతుంది... వంట మనిషి కి పోగా మిగిలింది పంటి కింద కు కావాల్సిన స్నాక్స్ కి, స్వీట్స్ కి పనికొస్తుంది... బయటికి పోయి తినేందుకు, కొనుక్కుని తెచ్చే వీలు ఈ వెధవ కరోనా వల్ల లేదు కదా... ఈ మాత్రం జాగ్రత్తగా ఉంటే కదా పది కాలాల పాటు తింటూ బతకవచ్చు...


పాపం పార్వతమ్మ మటుకు ఎక్కువ ఏం కష్టపడుతుంది... పెద్దదై పోయింది... వంట తో పాటు మూడు పూటలా మీ అమ్మ కు విడిగా పచ్చమ్ ఆహారం చేసేసరికి అయిపోతోంది... పనికిమాలిన ఆహార సూత్రాలు పాటించే మీ అమ్మ కు ఉన్న ఓపిక పోయింది... నన్ను చూడు..." ఆపకుండా రామ్మూర్తి మాట్లాడుతూ ఉంటే బాలు కి కోపం, బాధ, తిక్క తో కూడిన భావోద్వేగము కలిగింది...తల్లి కేమైందో ఎలా ఉందో అర్ధం కాక మనసు కలచి వేసింది...వంట మనిషి రాక వల్ల నాన్న లో మార్పు వచ్చేలోపలే మళ్ళీ శరమామూలైపోయింది పరిస్థితి...నాన్న తిండి పిచ్చి లో బయటికి పోకుండా వంటమనిషిని తెచ్చిపెట్టుకున్నందుకు సంతోషించాలో లేక కరోనా తో అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచం, ముఖ్యముగా అమెరికా లో పరిస్థితి భీభత్సంగా ఉన్నా ఒక్కసారి అయినా కొడుకు, కొడుకు కుటుంబం బాగోగులు అడగలేదని బాధ పడాలో బాలూకి అర్ధం కాలేదు...


"అమ్మ ను చూస్కో నాన్న, నువ్వూ జాగ్రత్త, కాస్త వయసుకు తగ్గట్టు తిండి తగ్గించి తింటే అడ్డం పడకుండా ఉంటావు" ఆ మాట వింటూనే రామ్మూర్తి ఎప్పటిలాగే "ఛస్తే ఛస్తాను అంతే" అని ఫోను పెట్టేసాడు...


మంచం లో పడుకుని ఉన్న వనజ సంభాషణ అంతా విని చేసేదేమీ లేక భగవంతుడి మీద భారం వేసి నిట్టూర్చింది... "అలా మంచం లో పడుకొని మూలిగే బదులు నా లాగా తిని చావు" అంటూ సొగసు గా భార్యను పలకరించే ప్రయత్నం చేసాడు రామ్మూర్తి... ఇంతలో గోడ గడియారం గంటలు వినిపించాయి...


గంట తొమ్మిదయిందా పార్వతమ్మా? పులి బొంగరాలు వేస్తారా" అంటూ సరాసరి వంటింట్లోకి వెళ్ళిపోయాడు రామ్మూర్తి...

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.282 views1 comment

1 Comment


dasutrivikram
dasutrivikram
Jan 06, 2022

Tindi-tippalu aadyantam haasyam chilakarinchindi.

Like
bottom of page