top of page

వీడ్కోలు(ఒక యదార్ధ సంఘటన ఆధారంగా అల్లిన కథ)

'Vidkolu' written by Dasu Radhika

రచన : దాసు రాధిక

25/2- A లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ ఇంటి కళ పోయింది. తెల్లవారుతూనే పక్షుల కలరవలతో పాటు నిత్యం ఆ ఇంట్లో నలభై ఏళ్ళ నుండి ఒక గొంతు పొద్దున్న ఐదింటి నుండి రాత్రి పదింటి వరకు మూత పడదు.ఇవాళ ఆ గొంతు మూగబోయింది.

"ఒరేయ్ సుబ్బారావు, ఏంటా మొద్దు నిద్దర? లేవరా" అనే వాళ్ళు ఇంక లేరు.

"లక్ష్మీ, ఇంకా తయారు కాలేదా? ఎన్ని గంటలు నిలుచుంటావు అద్దం ముందు? అక్కడ కాలేజి గంట కొట్టేశారు" రేపటి నుండి లక్ష్మి ఎంత సేపైనా ముస్తాబు చేసుకోవచ్చు. అడిగేవాళ్ళు ఎవరు?.

నాగమణి ఎదిరింట్లో ముగ్గేసి ఉరుకులు పరుగుల మీద లోపలికొచ్చింది, కాంతమ్మగారి పూజ వేళయింది,ఏమంటుందో అని. తీరా లోపలకి రాగానే ముందు గదిలోనే కాంతమ్మగారు నిర్జీవంగా పడుకుని ఉండడం చూసి నాగమణి ఒక్కసారి రోధించింది.

"అమ్మా! ఇదేంటమ్మా?ఎప్పుడు జరిగినాదమ్మా..ఘోరం అయిపోనాది గామ్మా" అని కాంతమ్మ కోడలు సుమను పట్టుకుని సోకాలు పెట్టింది.

"నిన్న కూడా బానే ఉన్నాది కదా , అంత లోకే నూరేళ్ళు నిండిపోయాయా? "

సుమ నాగమణిని తీసుకొని లోపలికెళ్లిపోయింది.

చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఇంకో గంటలో పక్క ఊరు నుండి తన ఆడపడుచు హేమ, వాళ్ల ఆయన రాజు వస్తారు. ఇక సుమ తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి ఏ క్షణమైనా రావచ్చు. హైదరాబాద్ నుండి కాంతమ్మ గారి ముఖ్యమైన బంధువులు రావాలి. మరి ఎవరు వస్తున్నారో, ఎవరు రావట్లేదో ఇంకా ఏమి తెలీలేదు. సుబ్బారావు మధ్యాహ్నం పన్నెండు దాకా చూద్దామనుకున్నాడు.

తెల్లవారుజామున మూడింటికి ఒక్కసారిగా ఏదో విచిత్రమైన గురక శబ్దం వినిపిస్తే, సుబ్బారావును సుమ లేపింది. అత్తగారు లేచారేమో చూడమంది. సుబ్బారావు గది దాటాక పిల్లలు లక్ష్మీ, హరి పడుకునే గది, ఆ తర్వాత, భోజనాల గది, దానికి ఒక వైపు దేవుడి గది, ఇంకో వైపు వరండా. వరండా కు ఎడం పక్కగా సందులోకి వెళ్లేందుకు దారి. కుడి పక్కన ఒక చిన్న గది, అంటే సరిగ్గా ముందు హాలుకి వెనకాల, అదే కాంతమ్మ పడుకునే గది.

సుబ్బారావు నిద్దర కళ్ల తో వెళ్లి చూసేసరికి తల్లి నోట్లో నుండి నురుగు వచ్చేసింది. పలకరించి లేపినా లేవలేదు. సుమను తల్లి దగ్గర కూర్చోపెట్టి రెండు వీధులవతల ఉన్న డాక్టర్ కోసం వెళ్ళాడు. అంతా అయిపోయిందని డాక్టర్ చెప్పాక ఇల్లు ఒక్కసారి మేలుకొన్నది. హరి, లక్ష్మి లేచి బిత్తరపోతూ కూర్చున్నారు ఒక పక్కన. హరి పుట్టక ముందు కామేశ్వర రావు గారు , అంటే కాంతమ్మగారి భర్త, పిల్లల తాతగారు పోయారు. లక్ష్మికి ఊహ తెలీదు. వాళ్ళిద్దరూ ఇదే మొదటిసారి చూడ్డం.

వాకిట్లో ఆటో ఆగిన శబ్దం. సుబ్బారావు బాబాయి కొడుకు శర్మ, అతని భార్య లల్లి పసి బిడ్డను ఎత్తుకొని దిగారు. సుబ్బారావు ఒక్కసారి దుఃఖం ఆపుకోలేక శర్మను పట్టుకొని ఏడ్చేశాడు. "ఆమె నీకే కాదురా, నాకు కూడా అమ్మే" అని శర్మ కాంతమ్మ పాదాలకు నమస్కరిస్తూ, అన్న సుబ్బారావు కు బదులిచ్చాడు.

" చివరి క్షణాల్లో అవస్థ పడకుండా వెళ్ళిపోయింది, ఆవిడ చేసుకున్న అదృష్టము. కామేశ్వర రావు పెద్దనాన్న లాగే". అన్నాడు శర్మ . సుమ కూడా ముందు గది లోకొచ్చింది అలికిడికి.

లల్లి సుమ మాట్లాడుకుంటున్నారు. చంటివాడిని లోపల మంచం మీద పడుకో బెట్టింది లల్లి.

హేమా, రాజు కారు దిగి లోపలకొచ్చారు. ఒక అరగంట పాటు హేమను ఎవ్వరూ పట్టలేక పోయారు. రాజు మటుకు అర గంటలో అర డజను కాఫీలు తాగేశాడు.

మెల్లగా మొగుడు, పెళ్ళాం కాంతమ్మగారి తల వైపు కాస్త దగ్గరగా కూర్చున్నారు. రాజు పెళ్ళాంతో మాట్లాడుతున్నాడు, " హేమా, కిందటి సారి మనము పండగకు వచ్చినప్పుడు అత్తగారు నీకు రవ్వల దుద్దులు తో పాటు ఆవిడ చేతి గాజులు ఇస్తానన్నారు. ఇచ్చినట్టు లేరే".

హేమ అన్నది, " ఆ రోజు తీసుకోలేదు, ఇవాళ మనమే తీసుకెళదాము", అని మెల్లగా తల్లి చెవుల నుండి దుద్దులు తీస్తూ కూర్చుంది, ముక్కులు ఎగ పీలుస్తూ. లల్లీ అంతా విన్నది. అసహ్యము వేసింది. తన భర్త శర్మ పక్కన కూర్చుంది.

సుమ తల్లిదండ్రులు కూడా వచ్చేసారు. వాళ్లకు ఇరవైఏళ్ల నుండి కాంతమ్మగారి తో అనుబంధం. కూతురు సుమ పెళ్లి సుబ్బారావు తో నిన్నో మొన్నో అయినట్టు అనిపించింది.

అవన్నీ తలుచుకుంటూ అల్లుడిని పరామర్శించారు.

సుమ కావాల్సినవి చెప్తుంటే శర్మ రాసుకుంటున్నాడు. అప్పుడు సుబ్బారావు తమ్ముళ్లు బాబ్జి, మహేశు బస్సు కోచ్చారు. బ్రాహ్మడు ఇంకా రాలేదు. ఈ లోపల కొంతమంది చుట్టాలు వచ్చారు. ఒక అరవై డెబ్భై మంది అయ్యారు. ఇంటి ముందు విశాలమైన చావిడి లో పడుకోబెట్టారు పెద్దావిడను. అప్పటికి హేమా, రాజులు కలిసి చేతి గాజులు, మెడలో నాలుగు పేట్ల గొలుసు, ముత్యాలు, పగడాల హారము , వేలి ఉంగరం అన్నీ ఒలుచుకున్నారు.

సుబ్బారావు గమనించలేదు కానీ సుమ, లల్లి అన్నీ చూసారు. ఇంటి ఆడపడుచుని ఏమనగలరు??? రాజు హేమను పట్టు చీరెల లెక్క అడుగుతున్నాడు. ఆస్తి పాస్తులు పంపకాలు ఇంకా ఏమైనా మిగిల్చిపోయిందా అని విపరీతముగా ఆలోచించేసి చింతిస్తున్నాడు రాజు. గతి లేని వాళ్ళా అంటే కాదు. రెండు చేతులతో సంపాయిస్తున్నాడు. కాని డబ్బు మీద వ్యామోహం మనిషిని నిలువునా నాశనం చేస్తుంది. వచ్చిన వాళ్ళ సానుభూతి అందుకుంటూ తల్లి ఆస్తులు లెక్కేస్తోంది హేమ తన మనసులో.

సుమకు అత్తగారి మాటలు గుర్తుకొచ్చాయి. హేమను రాజు కిఛ్చి చెయ్యటం ఆమెకు ఇష్టం లేదు.కానీ కూతురు అతన్నే చేసుకుంటానని పట్టు పట్టే సరికి ఏమీ చెయ్యలేక పోయింది.రాజు ఆస్తిపరుడు, కానీ గుణానికి పేదవాడు.ఈ విషయం ఆ ఊరి పెళ్ళిళ్ళ పెరయ్య కాంతమ్మ చెవిన వేసాడు.హేమ మేనమామ ఇల్లు, రాజు ఇల్లు ఒకే వీధి కావటంతో అలా జరిగిపోయింది. సమయం చూసి హేమను బుట్టలో వేసుకున్నాడు రాజు. లక్ష్మి పోకళ్ళు అదే దారి పడ్తాయన్నది అత్తగారి భయం అని సుమకు తెలుసు.


ఊళ్ళో జనం కూడా గుంపులు గుoపులుగా పోగయ్యారు, పక్క ఇళ్ళ మేడమీద, ఎదురుకుండా అన్ని వైపులా. వీధిలో కనబడిన ప్రతి మనిషిని అప్యాయయముగా పలకరించేదావిడ.

ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఈవిడ హాజరు వేసేది మంచికీ, చెడుకీ. కొత్త వాళ్లను ఇట్టే కలుపుకునేది. పాలవాడు, పూలు తెచ్చే అమ్మాయి, పేపర్ వేసే వాడు, వడ్రంగి, కరెంటు పని చేసేవాడు, ప్లంబరు వీళ్ళు వాళ్ళు అనే భేదము లేకుండా అందరిని మంచి చేసుకొని మాట్లాడే స్వభావం ఆవిడది. ఇంక పండుగలకు చేసే హడావిడి వేరే చెప్పాలా? పేరంటం పేరున ఊరూరు వీళ్ళింట్లోనే.

సుమ పెళ్లయిన కొత్తలో అత్తగారికి తగ్గ కోడలు అనిపించుకోవటం కష్టమైంది. అందులో బడిలో టీచరుగా చేస్తూ చాలా వత్తిడిగా ఉండేది సుమ పరిస్థితి. ఇంటి పని కూడా అప్పట్లో కాంతమ్మగారు దాదాపు అంతా చేసేది. కమ్మగా వండేది. కబుర్లు చెప్తూనే వచ్చిన వారికి క్షణాలలో వడ్డించేది. ఇంట్లో రోజూ పండక్కు చేసుకున్నట్లు నాలుగు రకాలు వండుకోవలసిందే. ఏ రోజూ భోజనం తగ్గించలేదావిడ. అదేమంటే "బతికినన్నాళ్లు దర్జాగా తిని తిరుగుతూ బతకాలి" అనే సిద్ధాంతం ఆవిడది. షుగరు వ్యాధి వచ్చాక కొడుకు సుబ్బారావు హెచ్చరించినా సరే ఆవిడ ఏ మాత్రము తన వైఖరి మార్చుకోలేదు. అలాగే పువ్వల్లే రాలిపోయింది.


బ్రాహ్మణుడిని తీసుకొని శర్మ, బాబ్జి పూల దండలవి తీసుకొని వచ్చారు . వాళ్ళు చూస్తుండగా ఒక్క సారి తేనెటీగల సైన్యం సుబ్బారావు మీద దాడి చేశాయి. రెప్ప పాటులో కనీసం ఒక వంద కాట్లకు గురయ్యాడు సుబ్బారావు. స్పృహ కోల్పోయాడు. శర్మ, బాబ్జి అన్నను భుజాన వేసుకొని లోపలికి పరిగెత్తారు.. చుట్టాలు అన్ని వైపుల నుండి ఇంట్లోకి పరిగెత్తి తలుపులు వేసేశారు. మహేశు బయటికి వెళ్లి వెనక్కి వచ్చేసరికి దూరము నించే జరుగుతున్నది చూసాడు. అప్పటికి తేనె టీగల తుట్టె మొత్తం కదలి పోయి భీభత్సముగా ఉంది ఇంటి ముందు , ఆ వీధి మొత్తం. కనిపించిన మనిషిని వదలకుండా కాటేస్తున్నాయవి. అందరూ దుప్పట్లు కప్పుకొని ప్రాణాల కోసం పరిగెడుతున్నారు.బ్రాహ్మడు ముందే పారిపోయాడు. కాంతమ్మగారిని చావిట్లో వదిలేశారు. సుమకు గుండె ఆగిపోయింది. సుబ్బారావు పరిస్థితి ఏమి బాగాలేదు. శర్మ అంబులెన్స్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేస్తున్నాడు. బాబ్జి ఊళ్ళో తెలిసినవాళ్ళకి చేస్తున్నాడు. ఒక అర గంట లోపు అన్నకు వైద్యం అందాలి. ఆ తేనెటీగ కాట్లకు శరీరంలో గుచ్చుకు పోయిన ముళ్ళను తీయాలి.

బయట ఇంకో ఇరవై మందికి తీవ్ర గాయాలయినాయి. ఎట్టకేలకు ఒక అంబులెన్స్ ఒక పెద్ద వ్యాను వచ్చాయి. దొడ్డి వైపు నుండి సుబ్బారావును ఎక్కించి, ముందు వైపు గాయ పడిన వారిని ఎక్కించేలోపల సహాయం చేస్తున్న వారికి కూడా తప్పలేదు. ఆ తేనె టీగల కాట్లు.

ఇంతలా ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఆ ఇల్లు కట్టి యాభై ఏళ్లు. ఎదురుకుండా రోడ్డు కు అటు పక్క పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. దాని మీద ఒక పదేళ్ల నుండి ఈ తుట్టెలు వచ్చాయి. ఎవరో పోకిరి వెధవలు చేసిన అల్లరి . చేతులూరుకోక వాటి పై రాళ్లు విసిరేశారు. అవి కదలగానే ఆ పిల్లలు మాయం అయిపోయారు.

పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా మారిపోయాయి. అటు సుబ్బారావును ఆసుపత్రిలో ఇంటెన్ సివ్ కేర్(ICU) లో చేర్చారు. మర్నాడు కానీ పంపించరు. అది తేలిపోయింది. అస్సలు ముందు స్పృహ రావాలి. సుమను చూస్తే లల్లికి భయమేసింది. ఒక పక్క ఇంట్లో సీన్ అది.. కిటికీ లో నుండి బయటకు చూస్తే ఏదో సినిమాలో సన్నివేశం లాగా ఉంది తప్ప నిజ జీవితంలో ఇలాంటిది ఊహ క్కూడా అందదు. కాంతమ్మగారి సంగతి అందరూ మర్చిపోయారు. లల్లి మనసులో రక రకాల ఆలోచనలు వస్తున్నాయి.


జీవితం అంటే ఏమిటి? అప్పటిదాకా బాధ లో ఎవరికి వారు పోయిన మనిషి చుట్టూ చేరి విలపించారు. ఆ మనిషి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడేమో ఆవిడను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంత లోకే చినుకులు మొదలయ్యాయి. సుమ పెద్ద వాళ్ళకి చాలా ఆందోళన గా ఉంది. సమయము మించిపోతోంది. వీడ్కోలు కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడేం చేయాలనేది అర్ధం కాలేదు. మహేశు సందు చివర నుండి ఇంటికి రాలేక పోతున్నాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా తేనెటీగ కాట్లకు గురవుతున్నాడు. ఎంతో ఆలోచించి సుబ్బారావు అత్త మామలు శర్మ, బాబ్జీలకు ఫోను చేసి ఆసుపత్రి నుండి ఇంటికి రమన్నారు.

అది ఒక గంట ప్రహసనం. ఇంకో అయిదారు రగ్గులు తీసుకొని వీధి చివరికి వెళ్ళాడు పక్కింటి శీను. బాబ్జీ, శర్మ కు తల, చేతుల మీద కాట్లు తప్పలేదు. ఒక పది పదిహేను ముళ్ళు దిగాయి. అతి కష్టము మీద లోపలికొచ్చారు. అంబులెన్స్ వెనకాల వచ్చింది. చినుకులు పడి కాంతమ్మగారి శరీరం తడిసిపోయింది. బాబ్జీ కి తోడు శర్మ వెళ్లి అంబులెన్స్ లో మనుషుల సాయముతో ఆవిడను ఎత్తి బండి లోపల పడుకోబెట్టి ఎటువంటి క్రియా కర్మలు, మంత్రాలు లేకుండానే తీసుకెళ్లిపోయారు. ఇళ్ళ కిటికీలలో నుండి కొన్ని తలకాయలు చూస్తుండి పోయాయి.అందరూ సుబ్బారావు గురించి ఆలోచిస్తున్నారు. రాజు, హేమా తల్లి పడుకునే మంచంమీద కూర్చుని ఏమి పట్టనట్లు ఇంకా ఏమి సర్దుకుందామా అని గోతి కాడ నక్కల్లాగా కాచుకొని ఉన్నారు.

నాగమణి పొద్దున్నించి ఇక్కడే ఉంది సుమకు సాయంగా. వీళ్ళను గమనిస్తూనే ఉంది. "ఈళ్ల కడుపు కాల. నెత్తిమీద పెట్టుకొని చూసుకునేది కూతుర్ని కాంతమ్మగోరు. ఈళ్లకు ఇదేం పోయే కాలం." అని నాగమణికి ఒళ్ళు మండిపోతూ అనుకుంది. అదేదో అక్కినేని నాగేశ్వరరావు బొమ్మ లో చూసింది ఇలాంటిది. ఇప్పుడు కళ్ళముందు జరుగుతున్నది ఘోరము. ఇంతలొకే హైదరాబాద్ లో ఉండే కాంతమ్మ గారి పిన్ని కూతురు పలకరించింది నాగమణిని-- "బావున్నావా నాగమణి?" అని. ఒక్కసారి నాగమణి భోరు మంది. " ఏం బాగమ్మ. నా కూతురి కడుపున కాయ కాస్తే చూడాలని ఎంతో సంబరపడిపోయిందమ్మ పెద్దమ్మగోరు. ఆమె రోజూ నన్ను తిట్టినా, ఆమె పెట్టనిదే నాకు సద్ది కూడు కూడా ఎక్కదమ్మ. నా ఇంటో అన్నిటికి పెద్దదిక్కమ్మ."

సుమ మర్నాటికి ఏమి కావాలో ఆలోచిస్తూ రాసుకుంటోంది. ఈ సంభాషణ విని ఎంతో ఆశ్చర్య పోయింది. 'ఎందుకు సామాన్యంగా ఒక మనిషి పోతే గాని ఆ మనిషి గురించి ఎదుటి మనిషెవరైనా సరే, రెండు మంచి మాటలు మాట్లాడరు? బతికున్నప్పుడు ఎందుకు ఆ మనిషి మీద ఈర్ష్యా ద్వేషాలతో ఉంటారు? పోయాక ఏం మారుతుంది.. వాళ్ళు గొప్ప అని మాట్లాడడంలో వీళ్ళ గొప్ప చాటుతున్నారా?? నిజాయితీ అనేది ఏ కోసానా లేదు కదా.. నాగమణి తనకే ఎన్ని చెప్పేదో తన అత్తగారి మీద' అని ఏడవలేక నవ్వుకుంది లోలోపల సుమ.


సుబ్బారావుకు స్పృహ సాయంత్రం ఏడింటికొచ్చింది. గండం గడిచింది. ఇంకా గాయాలు మానటానికి నాలుగు రోజులు పడుతుందన్నారు డాక్టర్ లు. బాబ్జి, శర్మ అంత్యక్రియలు ముగించి అదే వేళ్టికి ఇంటికొచ్చారు. సుబ్బారావు మిత్రులు శ్మశానం దగ్గర కలిశారు.

ఎవరికి ఎంత ప్రాప్తమో. ఎవరికి ఎవరు ఋణమో. ఎంతవరకీ బంధమో.

బాబ్జి, మహేశు తల్లి, అన్న అనుకున్నంత ఎదగలేదు. చిన్న ఊళ్ళో వెలగపెట్టింది సరిపోక పట్నము వెళ్లారు తల్లిని ఉద్ధరిస్తామని. కానీ ఏ రకముగాను ప్రయోజకులు కాలేదు.నెలకోసారి తల్లిని చూడ్డానికి ఊరొఛ్చి వెళ్ళటం వల్ల ఆ అన్నకు అదనపు ఖర్చు తప్ప ఇంకేమీ జరగలేదు. స్థిరంగా ఉద్యోగం లేని వాళ్లకు పిల్లనిఛ్చి ఎవరు మటుకు పెళ్లి చేస్తారు? కాంతమ్మ గారు బాబ్జీ, మహేశుల పెళ్లిళ్లు చూడకుండానే వెళ్ళిపోయింది. కూతురి కడుపున నలుసు క్కూడా నోచుకోలేదు. హేమకు రెండు సార్లు వచ్చినట్లే వచ్చి కడుపులు పోయాయి. ముచ్చట్లన్నీ హరీ, లక్ష్మీ తోనే తీర్చుకుంది. హరిని విపరీతంగా గారాబము చేసేది ఆవిడ. వాడు మరీ అల్లరి వాడు కాదు. బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. లక్ష్మే కొంచెం పెంకిది. దానికి చదువు మీద కంటే, షోకులు, సినిమాలు, చిల్లర స్నేహాలే లోకము. కాంతమ్మగారికి ఇష్టం ఉండేది కాదు. కాకపోతే నాగమణి ఊళ్ళో వాళ్ళ ఆడ పిల్లల వార్తలు చాలానే మోసుకొస్తూ ఉండేది. దానితో లక్ష్మి చాలా నయమని కాంతమ్మగారికి అర్ధమయ్యింది. సుబ్బారావుకు ఎన్నో సార్లు చెప్పింది లక్ష్మికి తొందరగా పెళ్లి చేస్తే నయమని. కానీ ఇవి పాత రోజులు కావుగా. ఉద్యోగం చేసినా చేయకపోయినా చదువున్న పిల్లలనే ఇష్టపడుతున్నారు. అయినా కనీసము ఇంకో ఐదేళ్లు ఆగక తప్పదు.

రాత్రి ఎనిమిదింటికి ఏదో ఇంత ముద్ద తిన్నారు అందరూ. రావమ్మ గారొచ్చి వంట చేశారు. హరికి నాయనమ్మ ముద్దలు పెట్టనిదే అన్నం సయించదు. సుమను చుట్టుకుని పొద్దున్నించి దిగమింగుకున్న బాధ ఒక్కసారి గా కట్టలు తెంచుకుని వచ్చి ఏడ్చేశాడు. లక్ష్మి కూడా ఏడ్చింది.



శర్మ పంచలో కూర్చోని కాంతమ్మగారి పాత ఆల్బమ్ములు తిరగేస్తున్నాడు. చిన్నతనం కళ్ల ముందు కదులుతోంది. వెన్నెల్లో పెద్దమ్మయిన కాంతమ్మ చేతి గోరు ముద్దలు, కధలు. ఆ తరువాత అందరూ ఆరు బయట వరసగా పడుకునే వాళ్ళు. ఎప్పుడైనా కాంతమ్మ జోల పాట భాగ్యం తనకు మటుకు కలిగేది. తనకు ప్రత్యేకంగా నవారు మంచం వేసేది ఓ పక్కగా. ఎంతో ముద్దు ఆవిడకి శర్మ అంటే. లల్లితో పెళ్లి కుదిరినప్పుడు బాగా గుర్తు శర్మకు--- "నీ పెళ్ళాం అందగత్తె రా" అనటమే కాకుండా పెళ్లి హడావిడంతా ఆవిడ చేతులమీదగానే. తన కిష్టమైన పిండి వంటలు, మిఠాయిలు ఎప్పటికప్పుడు ఎవరు పట్నం వెళ్తున్నా ఇఛ్చి పంపేది. శర్మ కు కొడుకు పుట్టినప్పుడు బంగారు మొలతాడు చేయించింది కాక, ఊరంతా పేరంటం పిలిచి హడావిడి చేసింది. ఇంక ఈ జ్ఞాపకాలే మిగిలాయి. కనీసం కడసారి వీడ్కోలు పద్ధతిగా జరగలేదావిడకు. తలుచుకుంటే బాధ వస్తోంది.

రాత్రికి మూడొంతులు ఇల్లు ఖాళీ అయిపోయింది. రాజు హేమను తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పి అందరితో పాటు వెళ్ళిపోతే సుమకు ఏమనాలో తెలియలేదు. తన పరిస్థితి పగవాళ్ళక్కూడా రావొద్దనుకుంది. ఇటు అత్తగారు పోతే అటు భర్త ఆస్పత్రిలో.

శర్మ ఆసుపత్రికి వెళ్ళాడు రాత్రి ఉండేందుకు.

బాబ్జీ అంత్యక్రియలు చెయ్యటం వల్ల అలసిపోయి పడుకున్నాడు. పడుకునే ముందు తల్లిని స్మరిస్తూ ఎప్పుడూ లేనంత ఒంటరితనాన్ని అనుభవించాడు. తన చేత్తోనే తల్లిని సాగనంపాడే. ఆమె బతికున్నప్పుడు బాధ్యతారహితముగా ఉన్నందుకు చాలా సిగ్గు పడ్డాడు. ఇంక పట్నం వెళ్లనని తీర్మానించుకున్నాడు. ఇక్కడే ఉండి అన్నకు బరువు కాకుండా స్థిర పడాలనుకున్నాడు తల్లి తోడు..



ఎందుకు సగటు మనిషి ఏదైనా విషాదం జరిగితే కానీ తెలుసుకోడు? మార్పు రావటానికి ఒక మనిషి పోవాలా? అదే కాంతమ్మగారు ఉండగా బాబ్జీ, మహేశు బుద్ధిగా ఉండుంటే ఎంత బావుండేది??? ఆమెకు మధుమేహం వచ్చేదే కాదేమో. చాలా కుటుంబాలలో ఇదే పరిస్థితి. రాజు, హేమ లాంటి వాళ్ళు మరి? ఇంకో పది జన్మలెత్తాలేమో. కరుడుగట్టిన బాపతు కదా!



మూడో రోజు సాయంత్రం సుబ్బారావు ఇంటికొచ్చాడు. ఎంతో బాధ పడ్డాడు పెద్ద కొడుకైనందుకు తల్లికి ఘనంగా వీడ్కోలు ఇవ్వలేక పోయాడని. తల కొరివి కూడా పెట్టలేదని. శర్మ నఛ్చచెప్పాడు. బాబ్జీ ఆవిడకు ఎక్కువ ఋణపడ్డాడు కాబట్టే అలా జరిగిందని. బాబ్జీలో వచ్చిన మార్పు అన్నకు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ బాధ లోనే ఒక సంతోషం. అది కూడా తల్లి వల్లే.

సుమకు అత్తగారిని సరిగ్గా సాగనంపలేక పోయినందుకు బాధ పడాలో లేక తన భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోష పడాలో తెలీలేదు. యాంత్రికంగా కార్యక్రమాలు జరిపిస్తూ పోతోంది,బాధ్యత కాబట్టి. అదేగా అత్తగారి నుండి తాను నేర్చుకున్న మొదటి పాఠం.

ఆ ఆదివారం ఇంటికి పత్రికా విలేఖరులు, టీవీ వాళ్ళు వచ్చి హడావిడి చేశారు. "మీ అమ్మగారు కాంతమ్మగారి వీడ్కోలు మీద ఒక 'న్యూస్ ఫీచర్' (ప్రత్యేక వార్తా శీర్షిక) చెయ్యాలని , అందుకు మీరు సమ్మతిస్తే ఆవిడకు ఘనంగా నివాళులు అర్పించే సభ కూడా పెడ్తాము " అన్నారు. ఎందుకంటే తేనెటీగలు సృష్టించిన భీభత్సం న భూతొ న భవిష్యతి.

అలా కాంతమ్మగారి వీడ్కోలు గాధ నలు వైపులకు పాకింది. ఆ రోజు కాకపోయినా ఈ రకంగా తెలిసిన వాళ్ళు, తెలీని వాళ్ళు అందరూ కూడా ఆవిడకు నివాళులు అర్పించారు. ఆవిడ సంస్మరణ సభకు కుటుంబమంతా హాజరై కాంతమ్మగారికి సమిష్టి వీడ్కోలు నిచ్చారు. హేమారాజులు కాంతమ్మగారిని స్మరిస్తూ వేదికనెక్కి ఒక నాలుగు మాటలు మాట్లాడి, తమ ఫోటోలు మర్నాటి సమాచార పత్రిక లో వచ్చేందుకు చాలా శ్రమ తీసుకొన్నారు. పెళ్లికో పేరంటానికో వచ్చినట్లు, కాంతమ్మగారి సొమ్ముల్ని ధరించి, తయారై వచ్చింది హేమ. ప్రెస్సు వాళ్లకు దొరికిందే తడవుగా వ్రాసుకున్నారు. సుబ్బారావు మౌనం వహించాడు. ఫోటోల హడావిడి అవుతుండగానే పనుందంటూ హేమారాజు వెళ్లిపోయారు. ఊపిరి పీల్చుకున్నారు సుమా సుబ్బారావులు.

ఆ ఊరి చరిత్ర పుటల్లోకెక్కింది కాంతమ్మగారందుకున్న వీడ్కోలు.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి .


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.



192 views0 comments
bottom of page