'Tholagina Nili Nidalu episode 1' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పద్మం అలక చెందిన వేళ !
సంధ్యాదీపం చంద్రహారం పడుతున్న వేళ !
కొలనులో కలువ అభిసారికగా మారే వేళ !
శుకపికాది కలవరం సద్దుమణిగే వేళ !
వేళ కాని వేళ.. వేలుపు వేంచేసినట్టు వెన్నెల వీది తలుపులు తెరిచింది. నెమ్మదిగా కదిలి వచ్చి సిద్దంగా వున్న గుర్రపుబండి నెక్కి కూర్చుంది.
అప్పటికే..
ప్రకృతి పాడే భూపాలరాగం వినడానికి సంధ్యాకాంత అడుగిడుతోంది. దారి దారంతా నీరెండని ముఖాన అలుముకుని వెన్నెల రాక కోసం ఎదురు చూస్తోంది.
అరుదుగా వచ్చే వెన్నెలను చూసిన మలయసమీరం చెట్లఆకుల మీదుగా కదులుతూ మంద్రంగా వాయుతనం ఆలపిస్తోంటే.. తమతమ నెలవులకు వెళ్ళే గిత్తల డెక్కల చప్పుడు మృదంగధ్వానంలా వినిపిస్తోంది.
వాటికి జతగా గుర్రపు మెడలోని గజ్జెలు నర్తకి పాద మంజీర ధ్వనిలా శబ్దం చేస్తున్నాయి. జన్మ ధన్యమైనట్టు గోధూళి.. ప్రియుడి స్పర్శ తగిలిన కాంతలా సిగ్గుతో మొహాన్ని ఎర్రగా చేసుకుని నర్తకి గా మారి.. గాలిలో ఆనంద తాండవ మాడింది.
నిర్మానుష్యంగా ఉన్న ఆ మట్టిరోడ్డు "చాముండేశ్వరీ" ఆలయం వైపు మలుపు తిరిగింది.
రోడ్డుకి కాస్తదూరంలో గోదావరి ప్రేమికుడి కోసం సంకేతస్థలానికి వడిగా పోయే నాయికలా దూకుడుగా సాగుతోంది. గుడి మరో కిలోమీటరు దూరం ఉందనగా అక్కడనుండి ప్రారంభమైంది అశేషజనవాహిని.
సింహద్వరం నుండి గర్భగుడి వరకు వున్నారు. వాళ్ళ వెన
కాల.. దూరంగా విడిది చేసిన గుర్రపు బళ్ళు, ఎడ్లబళ్ళు, జీపులు, స్కూటర్లూ సైకిళ్ళు.. అన్నీ జనంతో కలిసిపోయాయి.
చెరువు గట్టుపై చేపలకై బారులు తీరి నిలుచన్న కొంగల్లా.. రోడ్డు కిరువైపులా దడికట్టి వరుసగా నిలుచున్న జనం. జనమంతా తనవైపే చూస్తున్నారని గ్రహించింది కాబోలు వయ్యారంగా కాళ్ళు ఎత్తి వేస్తూ ముందుకు రుకుతోంది గుర్రం.
"ఏ హే.." కళ్ళెం పట్టి లాగుతూ దాని వేగాన్ని తగ్గిస్తున్నాడు గుర్రపుబగ్గీవాడు. అది అతని మందలింపు పట్టించుకోనట్టే హుషారుగా అడుగులు వేస్తోంది. నీరెండ సోకి బగ్గికి కట్టిన చమ్కీ దండలు మెరిశాయి.
బగ్గీ జనవాహిని ని దాటుకుని సింహద్వారం. ముందు ఆగింది. బండివాడుక్రిందకు దిగి ముక్కాలిపీట తెచ్చి బగ్గీ వెనకాల వేశాడు. వెన్నెల ముక్కాలి పీట మీదపాదం ఆన్చింది. అప్పుడే ఆలయంలోని మైకులో సంకీర్తన ప్రారంభమైంది.
"బ్రహ్మ కడిగిన పాదమూ.. బ్రహ్మము దానై నీ పాదమూ.."
చూసే వారందరికీ.. మట్టిరంగు లో ఉన్న ముక్కాలిపీట మీద ఆన్చిన పాదము.. బురద.. లోంచి తొలుచుకుని వచ్చిన పద్మం లా కనిపించింది.
కారు మొయిళ్ళని తొలగించుకుని నెమ్మది నెమ్మదిగా కిరణం భూమికి చేరినట్టు.. కోటి కిరణ ప్రభల తో వెన్నెల బండి. దిగింది.
పళ్ళెంలో పూజాసామగ్రిని చామండేశ్వరి కి బహూకరించే సాంప్రదాయ వలువలు చేబూని ఆమె ఆ దారెంట ముందుకు కదిలింది.
అంతకు గంట క్రితమే"శశాంకవిజయా"న్ని పూర్తి చేసిన ఆ వూరి తెలుగు ఉపాధ్యాయులు నోరు తెరుచుకుని ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అందులోని పద్యాన్ని పైకే
చదివాడు.
కొమ్మ కాదిది బంగారు బొమ్మ గాని,
యింతి కాదిది, జాజి పూబంతి గాని
కలికి గాదిది, మరుని పూ మాలికి గాని
భామ కాదిది లావణ్య సీమ గానీ..
ఆవేశంతో ఇంకా ముందుకు కదలబోతుంటే ప్రక్కనేవున్న వాళ్ళావిడ గట్టిగా భుజం లాగగానే చప్పున స్పృహ లోకి వచ్చి పగ్గంలాగిన గిత్తలా నిలిచిపోయాడు.
అరవ్వైఏళ్ళ ' ఆయన' పరిస్థితి' అలా ఉంటే రెండు పదుల రెడ్డిగారబ్బాయి విషయము మరీ దారుణంగా మారిపోయింది. అతను సైన్స్ స్టూడెంట్.
మేఘమూ- ఘమూ డీ కొనక ముందే మెురుపు పుట్టిందే మిటా యని ఆశ్చర్యపోయి చూస్తున్నారు.
అతని ప్రక్కనే వున్న మరో కొంటె కోణంగి మరింత విభ్రమం చెందాడు.
"జలజ( నీటి లోంచి పుట్టినది) నిరజ( వైకుంఠం లోని నది) నుండి జన్మించాలి కదా! తనూజ ( తనువు నుండి పుట్టినది) తనయలా అవనిపై 'జ' అనుకున్నాడు.
లలనామణులు తలెత్తి ఆమె అందం చూసి భ్రాంత మనస్కురాలై వారి మొహాలు ఆత్మన్యూనతా భావంతో పువ్వులా ముడుచుకుపోయారు.
విరుల మరుడు తమ్మీ పూగుమ్మతి చేపట్టి విశాలమైన అతడి రొమ్ముబాగానికి తగిలేలా బాణం వదిలాడు. అతడి కనుపాపలు వేలకిరణప్రభల్లా వెలిగిపోయాయి.
ఆమె తల దించుకుని నెమ్మదిగా కదిలి అతడి ముందు నుండి వెళ్ళిపోయింది.
"అందమా అది.." మనసు లోనే ఆమె రూపం మననం చేసుకున్నాడు.
భగీరథుడి తపస్సు కి మెచ్చి భువికి చీకటిలో జారే జలధారలా.. ఆమె తలనుంచి నడుం మీదుగా జాలువారిన కురులు పిరుదులని కొండలని భ్రమసి
వాటిపైనుండి జలపాతంలా దూకి సమతలమైన నదిలా మారినట్టు తొడల మీదికి ప్రాకి అక్కడ నిలిచిపోయాయి.
విదియ నాటి చంద్రునికి చుట్టమైన లలాటం మీద కస్తూరి తిలకం చంద్రుడి సోదరుడి ( సూర్యుడు) లా వెలిగి పోతున్నాడు.
మరుడు ధనస్సు హరుడి శాపానికి దహించుకుపోయి వాలిందేమో అన్నట్టున్న కనుబొమల క్రింద ఆమె కనుగవలు కలువల్లా వుండటం చూసి నిజరసిజములు దిగులుతో ముడుచుకుపోయాయి. అందులో ఒకటి ఆమె నాసికగా మారింది.
వసంతుడిని చూసి ప్రకృతి కన్నె సిగ్గు పడగానే ఎర్రబారిన చెంపల్లోని కెంపు పొరపాటున జారి ఆమె పెదవుల మీద ఆనింది.
శివుడా ముఖారవిందాన్ని చూసి మైమరచి చేతిలోని శంఖాన్ని వదిలి పెట్టాడేమో.. అది కాస్తా కంఠమై కూర్చుంది.
అభినవ కుసుమ సుకుమారంబులగు బాహువుల మధ్య పూర్ణ కలశాలు రెండు ఆమె నడక అదురుకు బోర్లా పడిపోయి వక్షోజాలయ్యాయి.
వ్యాకులపాటు వ్యక్తులకే కాదు. మానవనైజం తెలియని వృక్షాలకూ కలిగిందనటానికి గుర్తుగా అవి ఆకులని కూడా కదల్చకుండా అలా ప్రతిమల్లా నిలబడ్డాయి.
పికములు కిలకిలరావములు మరిచిపోయాయి.
లతాంతములు జిలిబిలి అలరురలను చిమ్ముతుంటే సరసిజముల్లో మధుసారం పుట్టింది.
దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు మేఘ పరదాల మాటునుండి ఆమె అందాన్ని తొంగి చూస్తున్నారు.
వెన్నెల ముందుకు కదిలింది.
ఆమె నడుస్తున్న బాటలో కుడిప్రక్క వరుసలో స్నేహితునితో నుంచున్నాడతను
అతను.. రవిప్రకాశ్.
వెన్నెలను చూసే అమ్మాయిలు మధ్యలో అతనిని కూడా ఓరగా చూస్తున్నారు.
ఓ కొంటె పిల్ల అతడిని చూసి చిలిపిగా ఓ పద్యం అల్లేసి ప్రక్కనున్న స్నేహితురాలి. చెవిలో వూదేసింది.
".. కలువల చెలికాడు కదే
కళల కెల్ల రేడు వాడే
నెత్తమ్మ నేస్తానికి సరిజోడే
విరహిణల నేస్తానికి సరిజోడే.
విరహిణుల మది వ్యధ కలిగించే గోపాలుడే".
స్నేహితురాలు అది విని "నీ బొంద ! అందులో చందస్సు ఏ మాత్రము వుపయోగించలేదు. భావముంటే సరా! భాష.. భాష కూడా సక్రమముగా వుండాలి” అంది.
నిజానికామెకి అతడిని చూడగానే కలిగిన భావం చెప్పడానికి తెలుగు భాషలో ఒక్క పదమూ దొరకలేదు. ఆ అక్కసును ఆ విధంగా స్నేహితురాలి మీద వెళ్ళగక్కింది. అతడు మాత్రం చుట్టూ వున్న ఏ తరుణీమణిని పట్టించుకోవడం లేదు. వెన్నలని మాత్రం చూస్తున్నాడు.
ఎడారిలా నున్న పొట్ట మధ్య సన్నటిత్రోవ నీటిచెంతకు దారి చూపుతున్నట్టు వుంటే.. ఆ నీటి చెలిమె కాస్తా మరీచిక అని తేలింది. అదే ఆమె నాభి అయ్యింది.
జాకెట్టుకు, చీరకట్టుకు మధ్యస్థలం నిరుపేద ఇంటిముంగిలి లా కుచించుకు పోయి పిడికిట్లో ఇముడునట్లుగా ఉంది.
ఆమె గాజులు లయబద్ధంగా"ఘల్లు.. ఘల్లు"మని శబ్దం చేస్తూంటే ఆ శబ్దం అక్కడున్న వారి గుండెల్లో"ఘల్లు.. ఘల్లు"మని మార్మోగింది.
ఆమె మేని జిలుగు చూసి నీరెండ చివరి కిరణం సోకిన ఇత్తడి ద్వస్తభం కళ్ళు బైర్లు కమ్మాయి.
గర్భగుడిలో ఉండాల్సిన దేవత మండపంలో నిలబడినట్లు అందరూవెన్నెల వంక సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు.
------------
ఎలా వుంది వెన్నెల?
స్నేహితుడి మాటలతో ఆలోచనల నుండి బయటపడ్డాడు రవిప్రకాశ్.
"మాట్లాడవేం?" అతన్ని కుదుపుతూ తిరిగి అన్నాడు సుధాకర్.
"నీ కీ రోజు ఒక అందాల సునామీ కనబడిందా.
"ఇంతకీ ఆమె ఎలా వుందో చెప్పలేదు?" మళ్ళీ అడిగాడు సుధాకర్.
శీతాకాలంలో పద్మాల జాతి అంతా నశించిపోయినప్పుడు ఒకే ఒక్క విర బూసిన పద్మాన్ని ముందుకు తెచ్చి ఎలా వుందో అడిగితే అలా వుంటుందో..
చూపు కెలా వుందని చెప్పాలో..
మనసు కెలా వుందని చెప్పాలో..
తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాడు.
చివరకు పెదవి కదిపాడు. "ఏం చెప్పమంటావు? చెప్పటానికి నాకు తెలిసిన భాష సరిపోదు. నే నెక్కువ ప్రబంధాలు చద
వలేదు. చదివుంటే ఆ జ్ఞానంతో శ్రీనాథుడి కన్నా నాలుగు పాదాలు ఎక్కువే వర్ణించేవాడిని. ఆమెని పోల్చడానికి యీ ప్రకృతిలో ఆమెతో సరితూగేదేదో నాక్కనిపించలేదు”
అని చెప్పాడు.
ఆ మాటలకి సుధాకర్ మొహం వెలిగిపోయింది.
' ఆమె నాన్నగారి పేరేమిటన్నావ్?' అనడిగాడు రవిప్రకాశ్.
"వెంకటరామయ్య. ఆయన మధ్య తరగతి రైతు. ఒక్కతే కూతురు. ఆమెను చాలాగారాబంగా, అపురూపంగా పెంచారు.
"ఈ విషయాలన్నీ నీ కెలా తెలుసు".
నవ్వాడు సుధాకర్. "ఈ పల్లెటూళ్ళలో అందరూ ఒకే కుటుంబము లో వుంటున్నట్టు వుంటారు. అందరి విషయాలు అందరికీ తెలిసిపోతుంటాయి. దాపరికాలు
వుండవు”.
***
ఘల్లు ఘల్లు మని మువ్వల సవ్వడి వాకిట్లో వినబడింది.
ఆ శబ్ధం కోసమే ఎదురుచూస్తున్న జానకమ్మ బయటకు వచ్చింది.
"ఇదిగో నేను వచ్చేశాను" అన్నట్టు ఆమె పెదవుల మీద సన్నని నవ్వు కదలాడుతోంది.
వెన్నెలని దగ్గరగా తీసుకుని చేతులతో గట్టిగా చుట్టేసింది జానకమ్మ. జానకమ్మ వెన్నెల తలను పైకెత్తి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. నూత్నకాంక్ష మధువుని గ్రోలిన ఆవిడ కళ్ళు అరమోడ్పులయ్యీయి.
"అయ్యో!నీ మొహం ఇలా వాడిపోయిందేమిటే? ఎంతమంది దిష్టికళ్ళు పడ్డాయేమిటో! రామ్మా। దిష్టితీస్తాను!" అని ఎర్ర నీళ్ళ చెంబు అందుకుని వెన్నెల చుట్టూగా తిప్పింది. ఆ తరువాత చెంబుని పనిమనిషి కిచ్చి పెరటిలో పారబోసి రమ్మని చెప్పింది.
"అమ్మా! నేను బయటికి వెళితే, మనింటికి బంధువులు వస్తే నాకు దిష్టి తీస్తావేం?”
ఆ ప్రశ్నవిని ఆమె మురిపెంగా వెన్నెల బుగ్గలు పుణికి మెటిమలు విరిచింది.
"ఎవ్వరికీ లేని అద్భుతసౌందర్యం దేవుడు నీ కిచ్చాడు. తల్లీ! నువ్వు బయటికి వెళితే చాలు అందరి కళ్ళు నీ పైనే వుంటాయి. ఆ కళ్ళలో ఎన్ని దిష్టి కళ్ళో! నరుడి
చూపులకు నల్లరాయైనా కరిగిపోతుంది." చెబుతూ ఆమెని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది.
గుమ్మందాటి రెండడుగులు వేశారో లేదో ఎదురొచ్చారు వెంకటరామయ్య. ఎర్రటి కావిపంచె, ఖద్దర్‌లాల్చీ, నెత్తిమీద తలపాగా ధరించి నుదుటి మీద ఏర్పడిన గీతలు
ఆయన అనుభవాన్ని, రైతుల జీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి.
భార్య మాటలు విన్నట్లుగా ఆయన పెదాల మీద సన్నటి ధరహాసం రేఖ కదలాడుతోంది.
"దిష్టి ఎందుకు తీస్తారో చెప్పనా వెన్నీ?” అడిగాడు వెంకటరామయ్య.
వెన్నెల ఆయనకు దగ్గరగా వెళ్ళి నిలబడి - "చెప్పండి నాన్నా" అంది.
ఆమె నోటి వెంట "నాన్నా" అన్న పదం వినగానే ఆయన మొహం ఆనందంతో వెలిగిపోయింది.
"ఈ ఎర్రనీళ్ళలో, ఉప్పు మిరపకాయల్లో ఏమీ లేదురా! అంతా మన మనసుల్లోనే వుంది. అసలు ఈ దిష్టి అనేది వుందో లేదో ఖచ్చితంగా మనకి తెలీదు. అయితే అలా తీయడం వల్ల ఒక ఆత్మ సృతృప్తి.. ఆత్మీయులు క్షేమంగా వుండాలన్న కాంక్షని ప్రదర్శించుకోవడానికి మొదటిది, సులువైనదీ అయిన మార్గం యిదీ!"
ఆయన మాటల్లో నిజమున్నా జానకమ్మకు రుచించలేదు.
"ఆ.. సర్లేండి. నాదంతా చాదస్తమనే కదా మీరు చెప్పాలనుకున్నది. మరీ అంత తేలిగ్గా తూసిపారేయకండి. అంతో ఇంతో నిజం లేకపోతే తరతరాలుగా అందరూ ఎందుకు ఆచరిస్తూ వస్తున్నారు?" అయనకు ఏ మాత్రం తక్కువకాకుండా, సమానంగా ధీటుగా జవాబు చెప్పింది.
"జానకి చాలా తెలివిగా మాట్లాడుతోంది.." అనుకున్నాడు
వెంకటరామయ్య.
ఆ సంభాషణ, వాదన అప్రస్తుతం కాబట్టి ఆయన దానిని పొడిగించదలచుకోలేదు. ఎవరి నమ్మకం వారిది! ఏ నమ్మకమయినా మూర్ఖత్వం గా ఉన్మాదంగా మారి
ఎదుటివారికి నష్టం కలిగించనంతవరకు అనుసరించటంలో తప్పులేదు కదాని ఊరుకున్నారు. వేరే సమయంలో అయితే.. భార్యతో వాదన పెట్టుకుని, గెలవటానికి ఆమె ప్రయత్నిస్తూంటే, వినోదంగా చూస్తూ ఆనందిస్తూంటారు. వారిద్దరి మధ్య సంభాషణలో కలిపించుకోకుండా నవ్వుతూ వింటుంది వెన్నెల. జానకమ్మ ముఖంలోని చిన్నపిల్లల ఉక్రోశం, వెంకటరామయ్య కళ్ళలో భార్యను ఉడికించే నవ్వుచూడటానికి ఆయనకు సరదగా ఉంటుంది.
వెన్నెలపై ఉన్న ప్రేమానురాగాలు ఆయన నోరును కట్టేశాయి. చాలా పురాతన మైన పద్దతే కావచ్చు. ఏది ఏమైనా వెన్నెల క్షేమంగా వుండటమే ఆయనకు కావలసింది.
"సరే.. ఆ విషయం గురించి ఈ సారెప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాం. వెన్నీ అలసి పోయినట్లుంది.. ముందు లోపలికి తీసి కెళ్ళు.." అని భార్యతో చెప్పి, వెన్నీ తలపై చెయ్యేసి ప్రేమగా జుత్తు సవరించి వెళ్ళిపోయారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments