top of page

వెన్నెల్లో వయ్యారి


'Vennelo Vayyari' - New Telugu Article Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 10/10/2023

'వెన్నెల్లో వయ్యారి' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


ప్రతి తల్లీతండ్రీ బిడ్డలను ఎంతో ప్రేమ, అభిమానాలతో పెంచుతారు. వయస్సు వచ్చాక వారు గతాన్ని మరచి వలపులో పడిపోతారు. కానీ!.... ధర్మం.... నీతి.... న్యాయాన్ని ఎరిగిన వారు ఆ భ్రమ వలయంలో చిక్కుకొని తల్లిదండ్రులకు విచారాన్ని పంచకుండా... కొందరు, గతాన్ని.... తమ ధర్మాన్ని గుర్తుచేసుకొని... మనస్సును మార్చుకొంటారు. కర్తవ్యాన్ని తెలుసుకొంటారు. అలాంటివారు తల్లిదండ్రులను గౌరవించిన వారవుతారు. తల్లిదండ్రులు దైవ సమానులు కదా!....


వైజాగ్ నగరం.....

బే ఆఫ్ బెంగాల్ సాగర తీరం....

సాయంత్రం ఆరుగంటల సమయం.... ఆదివారం... ఆహ్లాదకరమైన బీచ్.... ఆరోజు పౌర్ణమి... పండువెన్నెల.


చల్లనిగాలికోసం.... మానసోల్లాసం కోసం.... అన్ని వయస్సులవారు బీచ్‍లో షికారుకు... జాగింగ్‍కు వస్తారు... వచ్చారు.


జతలు జతలుగా జనాలకు దూరంగా ప్రేమికులు.... బంధువులతో పిల్లలతో కొందరు... స్నేహితులతో యువతీ యువకులు... దగ్గరగా కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. కొందరు జాగింగ్ చేస్తున్నారు.


భార్యాభర్తలు కూర్చొని కుటుంబ విషయాలు.... సినిమా విషయాలు... ఇంకా ఏవేవో చర్చించుకొంటుంటే వారి పిల్లలు... ఇసుకలో పరుగులు... ఆటలు. ఆ క్షణాల్లో ఆనందం వారి సొంతం.


మూడు రోజుల క్రిందట రాజా ఎదురింటి టెర్రస్‍ పైన రాత్రి వెన్నెల్లో ఓ వయ్యారిని చూచాడు. రాజా, రఘులు బులెట్‍ను రోడ్డు ప్రక్కన ఆపి... తాళం వేసి బీచ్‍లో ప్రవేశించారు.

వారిరువురు రూమ్ మేట్స్. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఒకే వూరివారు... చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు.


"రాజా!..... జనంతో బీచ్ కిటకిటలాడిపోతూ వుందిరా!" జనాన్ని పారజూచి అన్నాడు రఘు.


"ఆదివారం కదరా!.... అందరూ ఈ ప్రశాంత వాతావరణానికి ఆశపడతారుగా" అన్నాడు రాజా.


"ఈ జన సమూహంలో మనం.... నీ వయ్యారిని ఎలారా వెతకటం?" అడిగాడు రఘు.


"నీవు వెతకవద్దు. ఆ పనిని నేను చూచుకొంటాను" ప్రక్కన వున్న జనాలను చూస్తూ "నీవు నా వెనకాలే రా!" అన్నాడు రాజు.


"నీ ప్రక్కన వస్తే.... నీకేమైనా అభ్యంతరమా!" వ్యంగ్యంగా అడిగాడు రఘు.


"ఇది జోకా!" విరక్తిగా అడిగాడు రాజా.


"కాదురా నీ మనోభావాన్ని తేటతెల్లంగా తెలుసుకోవాలని అడిగాను" నవ్వాడు రఘు.


"ఒరేయ్ రఘూ! ఈరోజు ఆ పిల్లను ఎలాగైనా కలవాలి!"


"ఎక్కడ?"


"ఎక్కడో అయితే ఇక్కడికి ఎందుకు వస్తామురా!" ఆశ్చర్యంతో అడిగాడు రాజా.


"అంటే!.... ఆ అమ్మడు ఈ మహాజనం మధ్యలో ఎక్కడో వుందంటావ్?" అన్నాడు రఘు జనాన్ని చూస్తూ.


"అవును... " ఖచ్చితంగా చెప్పాడు రాజా.


"కీడెంచి మేలెంచమన్నారుగా పెద్దలు. ఒకవేళ లేకపోతే!... " అడిగాడు రఘు.


రాజా రఘు ముఖంలోకి తీక్షణంగా చూచాడు.

వారికి ఒక ఏభైఏళ్ళ పెద్దమనిషి ఎదురయ్యాడు.


"బాబులూ!... ఏమనుకోమాకండి... అగ్గిపెట్టె వుందా?" అడిగాడు.


అతన్ని ఎగాదిగా చూచి.... "ఇది పబ్లిక్ ప్లేస్.... ఇక్కడ చుట్ట, సిగరెట్, బీడీలు తాగకూడదు" అన్నాడు రాజా.


"నాకు ఆ ఇసయం తెలుసులే బాబులూ!.... పెట్టె నాకాడ వుంది. రెండు పుల్లలియ్యండి.... దూరంగా పోయి కాల్చుకుంటా!" అన్నాడు.


"మా దగ్గర అగ్గిపెట్టె లేదు బాబాయ్!" చిరునవ్వుతో చెప్పాడు రఘు.


"అవునూ!.... ఈన నీకేమౌతాడు? మనిషి మహా పరాగ్గా వుండాడు" అడిగాడు పెద్దాయన.


"నా స్నేహితుడు"


"అతగాడి కళ్ళు దేన్నో ఎతకతా వుండాయ్... అదేంది?" రాజాను పరీక్షగా చూస్తూ అడిగాడు ఆ పెద్దమనిషి.


"మా విషయం నీకెందుకు? అగ్గిపెట్టె లేదని చెప్పాంగా!... నీదారిన నీవు పో... " కసిరినట్టు చెప్పాడు రాజా.


"ఓయబ్బో!... బాబో!..... ఇతగాడికి కోపం... ముక్కుమీదనే వుందే!.... అదేమంత మంచిదికాదు... కాస్త శాంతంగా మాట్లాడ్డం నేర్చుకో... అది నీ ఒంటికీ మీ ఇంటికీ మంచిది. ఏం కాలమో... ఏం పిల్లలో... పెద్దా చిన్నా అనే ఆలోచనే లేదు" అనుకొంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఆ పెద్దమనిషి.


"ఒరేయ్! రఘూ!... వాడు తాగివున్నాడు గమనించావా!" అడిగాడు రాజా.


"ఆయన సంగతి మనకెందుకుగాని... ముందు మన సంగతి చూడు" విరక్తిగా అన్నాడు రఘు.


రాజా... ముఖం చిట్లించి రఘు ముఖంలోకి చూచి...

"సరే.... పద" ముందుకు నడిచాడు.


రఘు.... రాజాను అనుసరించాడు.

ఇరువురూ అర్థగంటసేపు జనాల మధ్య వారు చూడాలని వచ్చిన కాంతామణి కోసం వెదికారు. ఆమె ఉనికి వీరికి తెలియలేదు. ఇసుకలో నడిచి.... నడిచి.... ఇరువురికీ అలసట కలిగింది.


"ఒరే రాజా!... " ఆగి అన్నాడు రఘు.


రాజా చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటూ.... "ఏమిటో చెప్పు" అన్నాడు.


"ఆ మహారాణి బీచ్‍కి వచ్చిందనేనా నీ నమ్మకం!"


"నా చెవులతో విన్నాను. "


"ఏమని?"


"వాళ్ళ అత్తయ్యతో తాను బీచ్‍కి వెళుతున్నానని చెప్పడానికి!"


"కాళ్ళు అరిగేలా తిరిగాం!.... ఏదీ కనబడదే!" నిట్టూర్చి అన్నాడు రఘు.


"అదేరా! నాకూ అర్థం కావటం లేదు. తను ఎటు వెళ్ళిపోయింది!" సాలోచనగా అన్నాడు రాజా.


"ఒరే రాజా!... ఓ మాట అడగనా!"


"అడుగు"


"ఆ పిల్ల నిజంగా నిను ప్రేమిస్తూ వుందా!"


రాజా వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

రాజా, రఘు ముఖంలోకి తీక్షణంగా చూచి....

"రేయ్.... రఘూ!.... ఏ పిల్లా నేను నిన్ను ప్రేమిస్తున్నానని తేలికగా చెప్పదు. ఆమె చూపుల్లోనే ఆ భావాలుంటాయి. వాటిని గ్రహించి... మనం ఫాలో అయ్యి.... మాట మాట కలిపి.... మన దారికి తీసుకురావాలి. ఏదైనా సాధించాలంటే సహనం... శాంతం ఎంతో అవసరం" అన్నాడు రాజా.


"నీ గీతాతత్వం బాగానే వుంది. అయితే ఇప్పుడు మనం ఏంచేయాలి?" విరక్తిగా అన్నాడు రఘు.


"మరో రౌండు వేద్దామురా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రాజా.


"ఓరి నాయనో!.... మరో రౌండా! రాజా సాహెబ్.... ఇక నావల్ల కాదు... అలసిపోయాను. నేను ఇక్కడే కూర్చొని వుంటా. నీ ప్రయత్నాన్ని నీవు సాగించు" రఘు రోడ్డు వైపుకు నడిచి ఇసుకలో కూర్చున్నాడు.


"అయితే నీవు నాతో రావా!"


"రాను... "


"సరే.... ఇక్కడే కూర్చొనుండు.... ఎటూ కదలకు నేను వచ్చేవరకూ!... "


"సంతోషం... పోయి.... త్వరగా రా!... "


రాజా... తన ప్రయత్నాన్ని జనంలో దూరి సాగించాడు.

రఘు.... తలక్రింద చేతులు పెట్టుకొని ఇసుకలో పడుకున్నాడు. తన మేనత్త కూతురు శృతిని తలచుకొంటూ.....


* * * *

శృతి బి. టెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ వుంది. రఘు, శృతిల మధ్యన ప్రేమ కలాపం మొదలై రెండేళ్లయింది.


ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రాజా కళ్ళు ఎదురింటి వైపు. ఆ సుందరి కనిపిస్తుందేమో అనే ఆశ, అన్వేషణ. గడచిన నాలుగు రోజులుగా ఆఫీస్‍లో పని ఒత్తిడి వలన ఆరున్నరకు ఇంటికి వచ్చే రాజా, రఘులు తొమ్మిది గంటలకు ఇంటికి చేరేవారు.


ఆ కారణంగా రాజా తన ఇష్టసఖిని చూడలేకపోయాడు. ఆరోజు ఆదివారం. వాకిట్లో మేడపైన ఆమె ఉండగా రెండుసార్లు చూడగలిగాడు.


ఐదుగంటల ప్రాంతంలో ఆ సుందరి ’అత్తయ్యా! నేను, లావా సాయంత్రం బీచ్‍కి వెళ్ళాలనుకొంటున్నాము. విత్ యువర్ పర్మిషన్’ అంది.


కిటికీలో నిలబడి ఆమెనే చూస్తున్న రాజాకు ఆ మాటలు వినిపించాయి. చంకలెగరేశాడు.

వారు బీచ్‍కు బయలుదేరిన పావుగంటకు తన హీరోహోండాపై రఘుతో బీచ్‍కి వచ్చాడు రాజా. ఆమె దరికి చేరి పలకరించి మాట్లాడాలనే నిర్ణయంతో....


* * * *

సమయం ఏడున్నర. మార్గశిర మాసం (నవంబర్) వాతావరణంలో చలి. జోరుగా సముద్రంపై నుండి వీచే చల్లగాలి... బీచ్‍లో జనం పలచబడ్డారు.


ఎలాగైనా ఆ సుందరిని చూచి మాట్లాడాలనే నిర్ణయంతో వున్న రాజా... తన ప్రయత్నాన్ని సాగిస్తూ బీచ్‍లో... చివరికి సాగర కెరటాలకు చేరువగా ఇసుక మేటిపై కూర్చొని వున్న ఆ సుందరిని... లావణ్యను చూచాడు.


’ఆహ!’ ఆనందంగా ఇసుకలో గంతులు వేశాడు. మెల్లగా వారిని సమీపించాడు.


"లావా!... పెండ్లి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? ప్రేమించి పెండ్లి చేసుకొంటావా!.... అమ్మా నాన్నలు చూచి వారికి నచ్చి, నీకూ నచ్చిన సంబంధాన్ని చేసుకొంటావా!" అడిగింది ఆ సుందరి.


"అమృతా!.... నాకంటే నీవు మూడేళ్ళు పెద్ద. చదువు అయిపోయింది. విజిలెన్స్ డిపార్టుమెంటులో ఉద్యోగాన్ని సంపాదించావు. నీ వివాహం ముందు జరగాలి. నీ నిర్ణయం ఏమిటో ముందు చెప్పు"

అంది లావణ్య.


"లావా!.... నిజం చెప్పనా!"


"నిజమే చెప్పాలి. "


"రెండేళ్ళ క్రిందట నాకు ఒకడు తగిలాడు. నేను ట్రైనింగ్‍లో వుండగా"


"అతని పేరు"


"దీపక్"


"వూరు"


"నాసిక్"


"హిందీ కదా వారి మాతృభాష"


"అవును"


"మనిషి మంచి అందగాడా"


"మహేష్ బాబులా ఉంటాడు"


"ప్రపోజ్ చేశాడా"


"ఆ... చేశాడు"


"నీవేమన్నావు"


"ఆలోచించాలి అన్నాను"


"ఏం ఆలోచించావ్?"


"మనం ఆంధ్రులం. అతను హిందీ బ్రాహ్మణుడే. నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు నాకున్నారుగా. అమ్మా నాన్నల గురించి, నా చెల్లెళ్ళ భవిష్యత్తును గురించి, వారి విషయంలో నాకున్న బాధ్యతలను గురించి ఆలోచించాను. "


"అతనికి నీవు చెప్పిన జవాబు ఏమిటి?"


"వివాహానంతరం కూడా నేను ఉద్యోగం చేయాలి. నా తల్లిదండ్రులకు నా చెల్లెళ్ళకు నేను అండగా సాయంగా వుండాలి. నా జీతంలో అర్ధభాగం వారికి వినియోగించాలి. దీనికి నీవు సమ్మతిస్తే.... నిన్ను మా వాళ్ళకు పరిచయం చేసి... వారిని ఒప్పించి... నిన్నే పెండ్లి చేసుకొంటానని చెప్పాను. "


"అందుకు అతను సమ్మతించాడా?"


"లేదు"


"ఏమన్నాడూ?"


"నేను ఉద్యోగం చేయకూడదన్నాడు"


"దానికి నీవు ఇచ్చిన జవాబు?"


"నన్ను మరిచిపో అని చెప్పాను"


"అతని రియాక్షన్"


"బాగా ఆలోచించుకో... ఓ వారంరోజుల తర్వాత కలుద్దామన్నాడు. "


"కలిశావా?"


"అవసరం లేదనిపించింది కలవదలచుకోలేదు... కలవలేదు. "


"అంటే?"


"అతనికి నాపట్ల వున్నది కేవలం వ్యామోహం.... ప్రేమ కాదు"


"అతన్ని తలచుకొంటే నీకు బాధగా లేదా!"


"కొద్దిరోజులు బాధగానే వుండేది.... కాని ఇప్పుడు లేదు"


"అతనికి సంబంధించిన ఆలోచనలు నీకు రావా!?"


"రావని ఎలా చెప్పగలను? వస్తాయి. అతను స్వార్థపరుడని, నా మనోస్థితికి తగినవాడు కాదనే విషయం నాకు బాగా అర్థం అయిందిగా. అతని గురించి నాకు ఎలాంటి బాధా లేదు. "


"మరి వివాహం?"


"అమ్మా నాన్నలు ప్రయత్నిస్తున్నారు. "


"అంటే... వారి నిర్ణయమే నీ నిర్ణయమా!"


"అవును... నన్ను ఇంతదాన్ని చేసింది వారు. నా భవిష్యత్తు ఎలా వుంచాలో వారు నాకన్నా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. వారి నిర్ణయం... నాకు ఆమోదం... సంతోషం... మరొకమాట... దీపక్ స్వార్థం.... నాలోవున్న వ్యామోహాన్ని చంపేసింది. నేను ఇప్పుడు హాయిగా, ఆనందంగా వున్నాను లావా!" నవ్వుతూ చెప్పింది అమృత.


"అమృతా! నీ మాటలు, నీ నిర్ణయాలు నాకు నా కర్తవ్యాన్ని తెలియజేశాయి. మనస్సు విప్పి నీవు నాతో మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు" అంది లావణ్య.


వారి వెనుక భాగంలో కొంతదూరంలో నిలబడి... వారి మాటలన్నింటినీ విన్న రాజా... ఆశ్చర్యపోయాడు. అమృత ప్రతిమాట అతని చెవుల్లో మారుమ్రోగింది.


’ఈమె అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఈమె నా స్థాయికి మించింది. ఆమెను ఆశించడం, ఆశలు పెంచుకోవడం తెలివి తక్కువే అవుతుంది. ఒకరీతిగా చెప్పాలంటే లావణ్య అన్నట్టు అమృత మాటలు నాకు జ్ఞానోదయాన్ని కలిగించాయి. కనిపెంచి, పెద్దచేసి, కోరినరీతిలో చదివించి, నా కాళ్ళమీద నేను నిలబడగలిగేలా చేసినా నా తల్లిదండ్రులు నన్ను తలుచుకొని బాధపడే రీతిగా నా జీవితానికి సంబంధించిన ప్రేమ, పెళ్ళి విషయంలో నా నిర్ణయానుసారంగా నడవడం కన్నా వారి జీవితాంతం నన్ను అభిమానించే నా తల్లిదండ్రుల ఇష్టానుసారంగా నా వివాహం విషయంలో నడుచుకోవడం ధర్మం, న్యాయం. ప్రేమ పేరుతో తప్పటడుగులు వేసి నేను బోల్తాపడి నావారికి కష్టం, ఆవేదన కలిగించడం అమానుషత్వమవుతుంది. చదువు.... సంస్కారాల అర్థాలు మారిపోతాయి. ఈ ప్రేమావేశం కొంతకాలమే... దాని ఫలితం.... అందరికీ ఒకే రీతిగా వర్తించదు. ప్రేమపేరుతో నేడు ఎందరో యువతీయువకుల జీవితాలు వివాహానంతరం కొంతకాలానికే అభిప్రాయ భేదాలు వలన విడాకుల పత్రాల మీద సంతకాలు చేసి... కోర్టుకు ఎక్కి విడిపోవడం చూస్తున్న వింటున్న విషయం. నా కధ వారి కధలా కాకూడదు’ అనుకొంటూ వెనుతిరిగాడు రాజా.


అమృత, లావణ్యలు లేచి సముద్రపు ఒడ్డున నడుస్తూ రోడ్డు వైపుకు తిరిగారు.

పదినిమిషాల్లో రాజా రఘుకు సమీపించాడు. కూర్చొనివున్న రఘు లేచి నిలబడి....

"ఏరా!... కాయా... పండా!... "


రఘును చూచి రాజా విరక్తిగా నవ్వాడు.

"జవాబు చెప్పు. ఆమెను చూచావా... లేదా... "


"చూచాను. "


"మాట్లాడావా"


"మాటలను విన్నాను. "


"నీవు ఏమీ మాట్లాడలేదా?"


"ఆ అవసరం లేకుండా పోయింది. "


"అంటే.... ?"


"ఆమె మాటల్లో.... ఆమె మనస్తత్వం నాకు బాగా అర్థం అయింది. "


"ఒరేయ్!... ఏందిరా నీ మాటలు!... నాకేం అర్థం కాలా!... ఇంతకీ ఆమె పేరేంటి?"


"అమృత"


"ఆహా! భలే పేరురా!.... ఆమెకు తగిన పేరు. "


"అవును. ముమ్మాటికీ తగిన పేరు"


"ఏమైందిరా!... ఎంతో గంభీరంగా వేదాంతిలా మాట్లాడుతున్నావ్!... కాస్త వివరంగా చెప్పరా బాబు"


ప్రాధేయపూర్వకంగా అడిగాడు రఘు.


రాజా తాను విన్న అమృత, లావణ్యల సంభాషణనంతా వివరించాడు. అంతా విన్నాడు రఘు.

"రాజా!.... ఇప్పుడు నీ మనస్సుకు ఎంతో బాధగా వుంది కదూ!" అడిగాడు రఘు.


"లేదు... జ్ఞానోదయం కలిగి హాయిగా ఉంది పద" నవ్వుతూ చెప్పాడు రాజా.


ఇరువురూ హీరోహొండా ఎక్కి తన నిలయం వైపు బయలుదేరారు.


* * * *

"ఒరేయ్! చిన్నోడా... ఇట్రా!" రాజా తండ్రి గోపాలయ్య కొడుకును పిలిచాడు. అప్పుడే బయటినుంచి ఇంట్లోకి వచ్చాడు రాజా. తండ్రి పక్కనే తల్లి లక్ష్మమ్మ కూర్చొనివుంది.


ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు భార్గవ. ముంబాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు. ఆడ, మగ. నందిని, రేవంత్. పది, ఏడు సంవత్సరాల ప్రాయం.


మధ్యన పుట్టింది మాలతి. పోయిన సంవత్సరం ఆమె వివాహాన్ని ఆ తండ్రి తనయులు మంచి సంబంధం చూచి ఘనంగా చేశారు. ఆమె భర్త ఎల్. టి చెన్నైలో ఇంజనీరు.

"ఏం నాన్నా!"


"మా అమ్మ... అదే మీ నాయనమ్మ... నీ వివాహం చూడాలంటోందిరా. ఆమె నా తల్లి కదా. ఆమెకు వయస్సయింది. ఆమె కోర్కెను తీర్చడం తనయునిగా నా బాధ్యత, ధర్మం. నీకూ వైజాగ్‍లో చేసే ఉద్యోగం బాగుందిగా!"


"చాలా బాగుంది నాన్నా!"


"అరే చిన్నా! నీవు ఈ కాలపు పిల్లోడివి కదా. నీ మనస్సుకు ఎవరైనా ఉన్నారా?" నవ్వుతూ అడిగింది లక్ష్మమ్మ.


"లేరమ్మా. అలంటిదేమీ లేదు" చిరునవ్వుతో చెప్పాడు రాజా.


"సరే!.... ఈ ఫోటోను చూడు... నీ అభిప్రాయాన్ని చెప్పు. "


తల్లి అందించిన ఫొటోను చేతిలోకి తీసుకొన్నాడు. త్రిప్పిచూచాడు. అతని కళ్ళు ఫొటోను చూచాయి.

కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొన్నాడు. మెల్లగా తెరిచి మరోసారి చూచాడు.

అది అమృత ఫొటో!....


అతని వదనంలో వేయి దీపాల కాంతి... ఎంతో ఆనందం... ఆశ్చర్యం...


"చాలామంచి కుటుంబం... మనకు దూరపు బంధువులు కూడా... నీ ఫొటో అమ్మాయికి నచ్చిందట. నీవు సరేనంటే... నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తాను రాజా!" చిరునవ్వుతో చెప్పాడు గోపాలయ్య.


"అమ్మాయి ఎలా వుందిరా!" అడిగింది లక్ష్మమ్మ.


’వెన్నెల్లో వయ్యారి’ అనుకొని "బాగుందమ్మా!... మీ ఇష్టమే నా ఇష్టం’ ఫొటోను తల్లిచేతికి ఇచ్చి నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు రాజా.


***సమాప్తి***


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



63 views0 comments

Comments


bottom of page