top of page
Writer's pictureGorthi Vani

వినిపించని రాగాలు 2


'Vinipinchani Ragalu 2' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

తన కాలేజ్ మేట్ రజిత హఠాత్తుగా తన ఇంటికి వస్తానని చెప్పడంతో ఆశ్చర్య పోతాడు మధు.

బస్టాండుకు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకుంటాడు.

సమయానికి అతని భార్య వూళ్ళో లేకపోవడంతో మానసికంగా కాస్త హైరానా పడతాడు.

హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత.



ఇక వినిపించని రాగాలు 2 వ భాగం చదవండి…


"అరె అక్కడే ఆగిపోయావే? లోపలికిరా. మొహమాట పడకు. " అన్నాడు మధు.


రజిత ఏదో అనబోయి ఆగిపోయింది. ఇల్లంతా పరికిస్తూ మెల్లగా లోపలికి వచ్చింది


"అటువైపు బాత్రూమ్. వెళ్లి ఫ్రెష్ అయి రా. " అన్నాడు.


టవల్ తీసుకుని వెళ్లి ప్రెషప్ అయి వచ్చి కూర్చుంది.

ఆమె దృష్టంతా గోడకి తగిలించివున్న ఫోటోల మీదే ఉంది.


"ఏం తాగుతావ్? టీ కాఫీ?"

"టీ ఇవ్వు" అంది.


రెండు కప్పులతో టీ కలుపుకొచ్చాడు మధు. రజితకి ఓ కప్పిచ్చి ఆమె ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు.

రజిత వస్తూనే ఇంటికి కొత్త శోభ తెచ్చింది.


ఆమె ఒంటిని అంటిపెట్టుకున్న సెంటు పరిమళం ఇల్లంతా గుమ్మెత్తింది. ఆమె చూడ్డానికి పురివిప్పిన నెమలిలా అనిపించింది మధుకి.


"ఏంటి రజితా, వచ్చిన దగ్గర్నుంచీ ఆ ఫోటోల వంకే చూస్తున్నావ్. అంత నచ్చాయా?" అన్నాడు మధు టీ సిప్ చేస్తూ.


"ఆ ఫొటోలో కుడివైపున ఉన్నదెవరు?"

"ఆయన మా నాన్నగారు. . "

" ఇప్పుడు ఏం చేస్తున్నారు?"

"ఆయన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్. పదిహేనేళ్ల క్రితం పాకిస్తాన్ వార్ లో ఆయన కుడి చెవి, కన్ను కాస్త దెబ్బ తిన్నాయి. సరిగా పనిచేయవు. ప్రస్తుతం ఇంటిపట్టునే వుంటున్నారు" అన్నాడు.


"ఆవిడ మీ అమ్మగారా? ఆవిడా ఇంట్లో లేరా?" అంది.


" అమ్మ ఏడాది క్రితం గుండెపోటుతో చనిపోయింది. అప్పట్నుంచీ నాన్న ఒంటరిగా ఫీలవుతూ ఉదాసీనంగా మారిపోయారు. ఈ మధ్య జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతోంది. అంత మనిషీ అమ్మ లేకపోవడం లోటుగా ఫీలవుతున్నారు"


" ఆయన ఇప్పుడెక్కడున్నారు?"

" నాన్న మా దగ్గరే మాతోనే వుంటారు. ఆయన, నా భార్యా పిల్లలు కలిసి ఊరెళ్ళారు. ఎందుకంత ప్రత్యేకించి అడుగుతున్నావ్"

"ఏం లేదు. ఊరికే" అంది రజిత.


తనతో తెచ్చిన చాక్లెట్లు తీసి మధుకిచ్చి, "మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళో తెలీక ఇవితెచ్చాను. వాళ్ళకివ్వు" అంది.


"కాస్త పెద్దవాళ్ళూ, కొంచెం చిన్నవాళ్ళూ. . ఇంతుంటారు" అని మధు చెయ్యి చాపి చూపిస్తుంటే నవ్వింది!

రజిత నవ్వు బాగుంటుంది. పూలకొమ్మ ఊగినట్టు. . తేనె బొట్టు రాలినట్టు. . గువ్వపిట్ట కూసినట్టు. .


"మీ నాన్నగారి గురించి ఇంకా చెప్పు" అంది.

" నాన్నకి నేనొక్కడినే కొడుకుని. అమ్మకి కాన్పు కష్టమై, ‘తల్లీబిడ్డల్లో ఒకళ్లనే బతికించగలం’ అన్నారుట డాక్టర్లు. ఆ పరిస్థితుల్లో నాన్న డాక్టర్ తో తల్లినే బతికించమన్నారుట.

అమ్మయితే ‘నాకేమైనా ఫర్వాలేదు. బిడ్డని బతికించ’మందిట. ఎందుకంటే నేను వాళ్ళ పెళ్ళైన పదేళ్లకు కడుపున పడ్డానుట. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఇద్దరికీ వున్నా నాన్న మాత్రం అమ్మనే బతికించమని డాక్టర్ కాళ్ళు పట్టుకుని ఏడ్చాట్ట.


అమ్మంటే నాన్నకి అంత ఇష్టం. దేవుడు నాన్నకి పెద్ద పరీక్ష పెట్టాడు. చివరకి నాన్నని డిస్టెంక్షన్ లో పాస్ అయ్యేలా చేసాడు. ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం. ఒక్కగానొక్క నలుసుని అపురూపంగా చూసుకున్నారు ఇద్దరూ. మిలట్రీ మ్యాన్ గా నాన్నఎప్పుడూ బోర్డర్ లోనే వుండాల్సొచ్చేది. అమ్మ నాన్నకి నా గురించి ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాసేది. నేను పెరిగే ప్రతిరోజూ ఒక డైరీలా ఉత్తరాలు రాసి పంపుతుంటే నాన్న అవి చదువుకుంటూ మురిసిపోయేవారుట.


అప్పుడప్పుడూ సెలవుల్లో ఇంటికి వచ్చిపోతుండేవారు. నన్ను అమ్మే పెంచి పెద్ద చేసింది. ఒకసారి నాన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి స్పృహలో లేరు. వార్ లో ఒళ్ళంతా తగిలిన గాయాలకు కట్లు కట్టి మూటలా ఇంటికి తీసుకొచ్చి అమ్మకి అప్పగించారు. అమ్మ బావురుమంది. ఆయనకు పగలూ రాత్రి సేవచేసింది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది.


అయినా కుడివైపు భాగాలు అంతబాగా పనిచేయవు. నాన్న గురించి ఆలోచిస్తూ అమ్మ తనను తను అశ్రద్ధ చేసుకుంది. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోయింది. చివరకు గుండె పరిమాణం పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అలా చాలా సంవత్సరాలు మందులు వేసుకుంటూ

గడిపింది. ఆపరేషన్ చేస్తేగానీ ఆవిడకి ఆయాసం తగ్గదన్నారు డాక్టర్లు.


‘వాళ్ళు అలాగే చెబుతారండీ. ఈ మందులతో నాకు బానే ఉంది’ అని నెట్టుకొచ్చింది.


నాన్న భయపడినంతా అయ్యింది. ఒకరాత్రివేళ ఊపిరాడక కొట్టుకుంటుంటే నాన్న, నేనూ బండిమీద మధ్యలో అమ్మని కూర్చోబెట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాం. అప్పుడు ఇప్పట్లా పిలిస్తే ఇంటికొచ్చే ఆంబులెన్సులు లేవు. ‘ఏం కాదు. . తగ్గిపోయి అమ్మ కోలుకుంటుం’దని డాక్టర్లు చాలా ఆశపెట్టారు. చాలా భాగం జబ్బు తగ్గిపోయింది. ఈ మందులు వాడుకోండి అని డిశ్చార్జ్ చేసారు.


ఇంటికి తీసుకొచ్చిన మర్నాడే అమ్మకి ఆయాసం ఎక్కువై ఛాతీలో నొప్పి మొదలైంది. ఈసారి వేరే హాస్పిటల్ కి తీసికెళ్లాం. ‘ఇప్పటికే వ్యాధి ముదిరింది ఇంత ఆలస్యంగానా తీసుకురావడం’ అన్నారు వాళ్ళు. మేము వాడిన మందులన్నీ చూపించాం. అసలు ఇవన్నీ దీనికి సంబంధించినవి కావన్నారు అక్కడి డాక్టర్లు.


మంచి వైద్యం చేసి అమ్మని బతికించమని మా నాన్న డాక్టర్ల కాళ్లా వెళ్ళా పడి బతిమాలారు. ‘ఏ మాత్రం అవకాశం వున్నా

మా వృత్తి ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించేవాళ్ళం. కానీ, అంతా చెయ్యి దాటిపోయింది. ఇంటికి తీసుకువెళ్లండి’ అని చెప్పారు. అమ్మని తిరిగి ఇంటికి తీసుకొచ్చాము.


జీవచ్చవంలా మంచంలో ఉన్న అమ్మని చూసి నాన్నా, నేనూ ఏడ్చేవాళ్ళం. రోజులు గడుస్తున్నకొద్దీ ఆరోగ్యం క్షీణించి కోమాలోంచి మరి బయటకురాలేదు. పైకి వెళ్ళిపోయింది అమ్మ. నాన్న ఆ షాక్ నుంచి కోలుకోలేదు. అయినా ఇదంతా నీకెందుకులే. మాదో చరిత్ర. ఇంతకీ ఏం తింటావ్. దోశలు వేసి పెట్టనా" అన్నాడు మధు అప్రయత్నంగా బయటకు వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ.


రజిత మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.

"ఏంటి మేడం ఈ పరధ్యానం? నువ్వేదో ఆడిగావ్. నేనేదో చెప్పేసా. దానిగురించి నువ్వేం ఆలోచించకు. కొన్ని జీవితాలంతే. రా ఇల్లంతా చూపిస్తా" అన్నాడు మధు.


అన్యమనస్కంగా లేచి మధువెనకాల నడిచింది రజిత. ఒక్కొక్క గదీ చూపిస్తూ తను ఆ ఇంటిని ఎంత కష్టపడి కట్టుకున్నాడో చెప్పుకుపోతున్నాడు.


"ఇదంతా నా భార్య టేస్ట్. ఆవిడే అన్నీ దగ్గరుండి చేయించింది. అది మా నాన్నగారి గది. చూసి ఖంగు తినకూడదు మరి" అంటూ తండ్రి గది డోర్ తెరిచి చూపించాడు మధు.


గది చూసి ఆశ్చర్యపోయింది. గదినిండా భార్య ఫోటోలు పెట్టుకున్నాడు. ఎటువైపుచూసినా ఆమె కనపడాలని. ఒక టేబుల్ మీద పెద్ద ఫోటో పెట్టి పూలదండ వేసి అగరత్తులు వెలిగించి పెట్టున్నాయి.


"మీ అమ్మగారంటే మీ నాన్నగారికి అంతిష్టమా?

భార్యని అంతలా ప్రేమిస్తారా?" అని అడిగింది.


"మరి?! ఈ గదిలోకి ఎవర్నీ రానివ్వరు. పిల్లల్ని కూడా. ఎందుకంటే ఆవిడకి నిద్రా భంగం అవుతుందట. రోజూ భగవద్గీత చదివి వినిపిస్తారు. పాటలు పాడతారు. బోలెడు కబుర్లు చెబుతారు. అంతా ఆ ఫోటోతోనే. ఈ గది మా నాన్న సమస్త ప్రపంచం. మరీ ఇంట్లోనే వుండి మతిపోయినట్టు అవుతున్నారని, కాస్త రిలీఫ్ కోసం మా అత్తయ్యావాళ్ళ ఊరు

పంపించాను".


"భర్తే తన ప్రపంచం అనుకునే భార్యలు వున్నారు. కానీ భార్యే తన సర్వస్వం అనుకునే భర్తని ఇక్కడే చూసాను. మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి " అంటూ నమస్కరించి గది బయటకు వచ్చేసింది రజిత.


వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలిగే కామన్ పాయింట్ కాలేజీ కబుర్లే. ఫేర్వెల్ లో తను వేసుకెళ్లిన తెల్లచొక్కా తీసుకొచ్చి చూపించాడు.


"దీన్ని ఇంకా ఉంచుకున్నావా?" అంది.

" మరి ఇలాంటి తీపి గుర్తుల్ని ఎవరైనా పారేసుకుంటారా?" అంటూ టేబుల్లో మీద పరిచాడు మధు.


చొక్కామీద మిత్రులు పెట్టిన సంతకాలు, పిచ్చి బొమ్మలు.

వాళ్ళు రాసిన రాతల్ని పైకి చదువుతూ పగలబడి నవ్వాడు.


"ఇదిగో ఇది చూడు. .


'కిల్ యూ. . . రజిత’


అని ఇది రాసి సంతకం చేసింది నువ్వేకదా. నామీద నీకెందుకంత కోపం ? ఏవిటో ఆరోజుల్లో అంత అల్లరి చేసేదానివి. ఇప్పుడు చూస్తే ఇలా తయారయ్యావ్" అన్నాడు మధు రజిత మొహంలోకి చూస్తూ.


రజిత ముభావంగా మారింది. పొదుపుగా మాట్లాడింది.

ఈ ఆడపిల్లలేంటో, పెళ్లవగానే పెద్దమనుషులైపోతారు.

కాసేపు అవన్నీ పక్కన పెట్టి సరదాగా వుందామని అనుకోరు అనుకుంటూ లోపలికి వెళ్లి ఫ్రిజ్ లోంచి పిండి తీసి దోశలు వేసుకొచ్చి ఆమెకిచ్చి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.


"ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఏ పనిమీద వచ్చావు? ఇక్కడ మీవాళ్ళుఎవరన్నా ఉన్నారా?"


రజితకి పొలమారింది. మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు మధు.


నీళ్లు తాగి గ్లాసు పక్కనపెట్టి

"మా పెదనాన్నని ఇక్కడే కేర్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడికెళ్లి మీ ఇంటికి రావడం దేనికని ముందే వచ్చాను.

ఆయన్ని చూసి రాత్రి బస్సుకి తిరిగి వెళ్లిపోతాను. " అంది.


"ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? వుండొచ్చుగా" అన్నాడు మధు.

చుర్రున చూసింది అతనివైపు.


"ఈఊళ్ళోనే మన క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారుగానీ ఎవరింటికీ వెళ్లడం నాకిష్టంలేదు.

కాలేజ్ డేస్ లో అందరూ పోకిరీ రాయుళ్ళే.

నా స్నేహితురాళ్ల జీవితాలతో ఆడుకున్నవాళ్లే.

అందుకే నేను వాళ్ళకి దీటుగా సమాధానం ఇస్తుండేదాన్ని.


వాళ్ళు నామీద కోపంతో ఏవేవో ప్రచారాలు చేశారనుకో. నేను అవేం పట్టించుకోను.


కానీ నువ్వు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఉత్తముడివే. నిన్ను మీ పేరెంట్స్ బాగాపెంచారు. అందుకే మీ ఇంట్లో ఇంతసేపు నిర్భయంగా వున్నాను. " అంది.

టిఫిన్ తిని చెయ్యి కడుక్కుంది. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని లేచింది.

"ఇక వెళతాను. ఈసారి వస్తే తప్పకుండా మీ ఇంటికే వస్తాను" అంది.


ఆమెను సాగనంపేందుకు బయటకు వచ్చాడు. రజిత మొహంలోకి చూసాడు.

ఆమె మొహం ఎందుకో ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనబడింది. ఎంత పెదనాన్న హాస్పటల్ లో ఉంటేమాత్రం ముఖం మీద చిన్న నవ్వు రేఖ కూడా మిగల్చుకోకుండా అంతలా బాధపడాలా? ఏమో, తన బాధేంటో. అడిగితేమాత్రం చెబుతుందా ఏంటి?


"డబ్బులేవన్నా అవసరమా రజితా?" అడగలేక అవస్థపడుతోందేమో అని అడిగేసాడు.


వెనక్కి తిరిగి చూసి "లేదు. అలాంటిదేమీ లేదు. థాంక్స్ మధు. నీతో మంచి టైం గడపగలిగాను. నీ పిల్లలకి నా బ్లెస్సింగ్స్. ఈసారి వచ్చినపుడు మీ శ్రీమతిని కలుస్తాను. " అంది.


"కేర్ దగ్గర నేను డ్రాప్ చేయనా?"

"అదేం అవసరం లేదు. నేను క్యాబ్ లో వెళ్లిపోతాను. " అని చెప్పి చకచకా నడుచుకుంటూ రోడ్డుమీదకి వెళ్ళిపోయింది.

గేట్ వేసి లోపలికి వచ్చాడు మధు.


ఇంకానయం తొందరపడి పిచ్చిపనులు చేసుంటే రజిత దృష్టిలో నేనో వెధవగా మిగిలిపోయేవాడ్ని.


ఎంత దగుల్బాజీ మగబద్దయినా అటుపక్కన మూర్తీభవించిన సంస్కారం ముందు ఓటమి తప్పదు. అయిన రజిత అలా ఎందుకుంది? ఎప్పుడూ తనంతేనా లేక నా దగ్గర అలా ప్రవర్తించిందా?


నాన్న గురించి చెప్పినప్పుడు ఎందుకంతగా కదిలిపోయింది? ఇల్లంతా తిప్పి చూపించినప్పుడు రాని చలనం నాన్న గదిలోకి వెళ్ళినప్పుడు వచ్చింది. అంగుళం అంగుళం పట్టిమరీ చూసింది. తన రాక పోకల వెనక ప్రత్యేకమైన కారణం ఏమన్నావుందా? ఉంటే తను చెప్పేదేగా.


ఆలోచనల్ని పక్కకుతోసి వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చాడు.

సోఫాలో కూర్చుని టి వి పెట్టుకుని చూస్తున్నాడుగానీ రజిత గుర్తొస్తోంది. తను మాట్లాడకుండానే ఎన్నో ప్రశ్నలను సంధించి వెళ్ళింది. ఏ మూల చూసినా అవే కనబడుతున్నాయి. రజిత చూపులు క్యాజువల్ గా లేవు. వేటాడే పులి కళ్ళలా ఉన్నాయి. తలుపులవైపు, కిటికీలవైపు ఎక్కువసార్లు చూసింది. ఫ్యామిలీ ఫొటో వంక కూడా కన్నార్పకుండా చూసింది.


తను సాధారణ స్త్రీలా లేదు. ఒక మగవాడి సమీపంలో ఉన్నాననే సంచలనం, సిగ్గు ప్రదర్శించలేదు. బాణాన్ని లక్ష్యానికి గురిపెట్టిన విలుకాడి చూపులా ఉంది. మనిషిక్కడున్నా మనసెక్కడో ఉన్నట్టుంది. వస్తానని అడిగింది. వెళ్లి తీసుకొచ్చి మర్యాదలు చేసి పంపాను. ఏది ఏమైనా నా కర్తవ్యం నేను పూర్తి చేసాను. తనతో అమర్యాదగా ప్రవర్తించలేదు కాబట్టి నో రెగ్రేట్స్ అనుకుని ప్రశాంతంగా ఊపిరిపీల్చుకున్నాడు మధు.


ఎక్కువ ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తూ తండ్రి గదిలోకి వెళ్ళాడు మధు.

ప్రతి వస్తువునీ చూసాడు. రజిత దృష్టిని ఏది ఆకర్షించి ఉంటుందా అని ఆమె కోణం నుంచి అంచనా వేయడం మొదలుపెట్టాడు.


ఎంత ఆలోచించినా ఆమె అంతరంగం ఏమిటో అసలు అంతుపట్టలేదు. ఆడవాళ్ల మనసు అగాధం అంటారు. అట్టడుక్కి వెళ్లి లోతులు చూడాలని ప్రయత్నిస్తే బయటకు రావడం అసాధ్యం.


ఆ విషయాన్ని వదిలెయ్యాలి అనుకున్నాడు మధు.

సాయంత్రం అయింది. బట్టలు తొడుక్కుని కోటీకి బయల్దేరాడు. నాన్న కోసం కొన్ని హోమియో మందులు తీసుకోవాలి అనుకుంటూ వాటిని కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకున్నాడు. తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకున్నాడు. మనసులో ఏదో కలత మెదిలింది. తన ముఖం కళా విహీనంగా కనపడింది. ఇదేంటి ఇంతలా ఒడిలిపోయింది అనుకున్నాడు.


కారులో ఏ సీ వేసుకుని మహమ్మద్ రఫీ పాటలు వింటూ బయలుదేరాడు. ఎక్కడ చూసినా జనం. రోడ్లు కిక్కిరిసి ఉన్నాయి.


పూర్తి దృష్టి రోడ్డుమీద పెట్టి డ్రైవ్ చేస్తుంటే మెల్లిగా రజిత విషయం మరుగునపడింది.


కార్ పార్క్ చేసి మందులు కొంటుంటే రాజేష్ కనబడ్డాడు. ఎందుకో అతన్ని చూడగానే జాలేసింది. మొన్నటిదాకా బంగారం షాపులో పద్దులు రాసేవాడు. తన దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్నాడు. త్వరలో నీ నెత్తిమీదకి పెద్ద అపనింద రాబోతోందని చెప్పాడు మధు. రాజేష్ కంగారుపడ్డాడు.


"అలా జరక్కుండా ఉండాలంటే ఏం చెయ్యాలి" అని అడిగాడు.


"నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేయ్యి. ఎందుకంటే అది బంగారం కొట్టు. అందులో చిన్నమెత్తు బంగారం లెక్కలో తేడా వచ్చినా ఉద్యోగం ఊడటంతోపాటు ఖైదు తప్పదు. " అన్నాడు.


రాజేష్ భయపడి వెంటనే ఆ ఉద్యోగం మానేశాడు. అందులో దాదాపుగా పదేళ్ల నుంచి చేస్తున్నాడు. నమ్మకస్తుడు. వాళ్ళు ఉద్యోగం మానొద్దన్నారు. కానీ రాజేష్ వాళ్ళ మాట వినలేదు. మధు చెప్పాడని మానేశాడు. కొత్తగా ఫర్నిచర్ షాపులో చేరాడు. అందులో కస్టమర్లకు మంచాలు, కుర్చీలు చూపించడం. ఒకరోజు షాపులో ఎవరూ లేరు. రాజేష్ ఒక్కడే వున్నాడు. ఇద్దరు కస్టమర్లు వచ్చి షాపంతా తిరిగి చూసి ఏవీ నచ్చలేదని చెప్పి వెళ్లిపోయారు.


తర్వాత ఓనర్ వచ్చి చూస్తే అతని సొరుగు తాళం తీసి డబ్బులు కాజేసినట్టు గుర్తించాడు. రాజేష్ ని నిలదీశారు. నాకేం తెలీదన్నాడు. నువ్వు కాకుండా ఎవరున్నారు ఇక్కడ. నిజం చెప్పమని అరిచాడు ఓనర్.


ఎవరో ఇద్దరు కస్టమర్లు వచ్చారు వాళ్లపనే అయ్యుంటుందని చెప్పాడు రాజేష్. కానీ అక్కడికి ఎవరూ రాలేదని పక్క షాపువాళ్ళు చెప్పారు.


‘అయ్యో లేదు. . నన్ను నమ్మండి’ అని రాజేష్ ఎంతచెప్పినా ఓనర్ వినిపించుకోలేదు.


‘కొత్తగా వచ్చినవాడు ఎలాంటివాడో విచారించకుండా నిన్ను పనిలోపెట్టుకోవడం, నీకు షాపు అప్పగించి బయటకు వెళ్లడం నాదే తప్పు. తియ్యి. . నువ్వు దొంగిలించిన డబ్బు తియ్యి. . ’ అంటూ అల్లరి చేసాడు. చివరకి అయిదు వేల రూపాయలు కట్టి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేశాడు రాజేష్.


"ఎలా ఉన్నావ్ రాజేష్?" అని అడిగాడు మధు

"జాతకంలో రాసివున్నది అనుభవించక తప్పదు కద సార్. ఈ రెండు నెలలూ పోయాక బాగుంటుందని మీరే చెప్పారు కదా. అందుకే అప్పుడే ఎందులోనన్నా చేరదామని ఖాళీగా వున్నా" అని చెప్పాడు.


ఇంటికి తిరిగివస్తున్న మధు మనసులో ఏదో విచారం. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న షాపులో ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఆగి ఆలోచించేవాళ్లేమో. ఇతని మనస్తత్వం అలాంటిది కాదని కనీసం మానసికంగానైనా గాయపరచకుండా ఉండేవాళ్లేమో? కొత్త చోట చేరడంవలన అవమానంతో పాటు, అర్ధం వదిలించుకుని తిరిగి వెనక్కి రావాల్సొచ్చింది. నేను రాజేష్ కి చేసింది మంచా? చెడా? అని మధు ఆలోచనలు ఒడ్డుకుచేరని అలల్లా అల్లకల్లోలంగా విరిగి పడుతున్నాయి.


ఇంటికి వచ్చి డిన్నర్ తినేసి ఆలోచనల్ని పక్కకి తోసి పడుకున్నాడు. మెల్లిగా మగత నిద్రలోకి జారుకున్నాడు మధు. మళ్లీ ధబ్బుమని చప్పుడు వినపడింది.

ఉలిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ చూశాడు. ఆ చిమ్మ చీకట్లో కిటికీ బయట ఏదో ఆకారం కదులుతూ వెళ్ళింది.


=================================================

...సశేషం...

=================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link




మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







44 views1 comment

1 comentario


Srinivas Bhagavathula • 6 days ago

కథ రెండో ఎపిసోడ్ కూడా చదివామువిన్నాము... చక్కగా ఉన్నది అభినందనలు వాణీగారూ.... సీతారాంగారు కూడా బాగాచదివారు... వారికీ శుభాభినందనలు.... భాగవతుల భారతి ఖమ్మం

Me gusta
bottom of page