top of page

వినిపించని రాగాలు 1


'Vinipinchani Ragalu 1' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


గొర్తి వాణిశ్రీనివాస్ గారి ధారావాహిక వినిపించని రాగాలు ప్రారంభం


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

దబ్బుమని ఏదో పడ్డట్టు చప్పుడై లేచి కూర్చున్న మధు నిద్రకళ్ళతోనే చుట్టూ చూసాడు. టిక్ టిక్ మంటూ గోడగడియారం పావుతక్కువ పన్నెండు చూపిస్తోంది.

కిటికీలోంచి గాలి రివ్వున వీస్తోంది. కర్టెన్లు ఎగురుటూ ప్లవర్ వాజ్ చెంపని అలవోకగా తాకుతున్నాయి. అది కితకితలు పెట్టినట్టు కదులుతూ బల్లమీదనుంచి కిందకి దూకేందుకు సిద్ధంగా ఉంది. అప్పుడే మేల్కొన్న మధు చటుక్కున లేచి ప్లవర్ వాజ్ ని తీసి జాగ్రత్తగా పెట్టాడు.


టేబుల్ కింద చెల్లా చెదురుగా పడిన కాగితాలను సర్ది పైన పెట్టాడు. కిటికీలోంచి బయటకు చూసాడు. పుచ్చపువ్వులా

పండు వెన్నెల. నిండుపున్నమి జాబిలి తెల్లగా నవ్వుతూ కనబడింది.


'మబ్బుల నదిలో తెల్లటి చందమామ

తెప్పలాగా తేలిపోతోంది

అందులో నా ముద్దు ప్రేయసి

ఉంది కాబోలు' అనుకున్నాడు.


కిటికీ ఊచలు పట్టుకుని మబ్బుల్లో దోబూచులాడే చంద్రుడ్ని చూస్తుంటే కవిత్వం పుట్టుకొచ్చింది. ఈ వయసులో ప్రేయసి ఊహలేవిటో. వయసుతో పనేముంది.. మనసులోనే అంతావుంది అని తన కొలీగ్ అంటుండేవాడు. భావగీతికలు

పాడుకునేందుకు వయసు అడ్డమెలాఅవుతుంది?

రెపరేపలాడుతున్న రాధాకృష్ణ క్యాలెండర్ వైపు చూసి దాన్ని సరిచేస్తూ ఆరోజు తేదీ చూసాడు.


ఆగస్టు పదిహేడు. తన జాతకం ప్రకారం ఈరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుందని రాసి పెట్టుకున్నాడు. జాతకంలో అది స్పష్టంగా ఉంది. ఎన్నాళ్ళుగానో ఈరోజు ఎలా ఉండబోతోందో అని ఎదురుచూస్తున్నాడు. కానీ రోజంతా మామూలుగానే గడిచింది. ప్రత్యేకత ఏమీ లేకుండానే.


అదేవిటోమరి. తను వేసిన లెక్కలు తప్పయ్యాయా? గ్రహగతులు తారుమారయ్యాయా? ఏమోమరి.

కానీ ఒకటి మాత్రం అనూహ్యంగా జరిగింది. కానీ అది అంత ప్రభావవంతమైన సంఘటన కాదనిపించింది. వాచీ వంక చూసాడు.


పన్నెండుo పావు. అర్ధరాత్రి మద్దెలదరువని

తీరుబాటుగా ఈ తీపి ఊహలేలనో.

శ్రీమతి బహుదూరానికేగిన ఫలితమేమో.

ఆఫీసులో పనుల వత్తిడిలో బడలిన మనఃశరీరాల సంఘీభావ విశ్రాంతి కోరుతున్న పిలుపులేమో.


తొమ్మిదిన్నరకే నిద్ర ముంచుకొచ్చింది.

అప్పుడే ఓ కునుకుతీశానా? అనుకున్నాడు.

ఆరోజు జరిగిందంతా దూరపు కొండలనొరుసుకుంటూ సాగే మేఘ మాలికలా మనసులో మంద్రంగా మెదిలాయి.


రజిత గుర్తొచ్చింది.


"మధూ!నేను రజితని. నేను బస్టాండ్ లో ఇప్పుడే బస్ దిగాను. " అంది.


"ఓహ్ రజితా, వాఁటే ప్లెజెంట్ సర్ప్రైజ్ "

" ఒక చిన్న రిక్వెస్ట్, నీకు ఇబ్బంది లేకపోతేనే. . . "అంది

"అదేంటో చెప్పు ముందు"అన్నాడు.


"నేను మీ ఇంటికి వచ్చి కొంచెం సేపు ఉండి ఫ్రెషప్ అయి వెళదామనుకుంటున్నాను. నీకేం ఇబ్బంది లేదుగా" అంది

"నాకా ఇబ్బందా. . నెవర్. . . ప్లీజ్ వెల్కమ్.

ఇట్స్ మై ప్లెషర్"


"మరి మీ ఇంట్లోవాళ్ళు ఏమీ అనుకోరుగా. "

"అనుకునేందుకు ఎవరూ లేరులే. ఐ మీన్ నా భార్యా పిల్లలు ఊరెళ్ళారు"


"అయితే సరే. బస్టాండ్ కి నువ్వు వస్తావా? నన్నే వచ్చెయ్యమంటావా?"

"నువ్వక్కడే ఉండు. పదినిమిషాల్లో నేనే అక్కడికొస్తాను" అన్నాడు మధు.


ఒంటరిగా వున్నప్పుడురజిత రావడమంటే జాక్పాట్ కొట్టినట్టే.

చకచకా తయారయ్యాడు.

పాడు బుద్ధి ఊరుకోనివ్వదుగా.

ఆలోచనల జడలు విప్పి జెయ్యిమంటూ ఎగిరాయి.


కాలేజ్ డేస్ లో రజిత ఓ సెన్సేషన్.

తన చూపు, మాట, తళుకు బెళుకులతో క్యాంపస్ ని హుద్ హుద్ తుఫానులా ఊపేసింది.

అప్పుడప్పుడూ పుస్తకాలు మార్చుకునే నెపంతో తగిలించే మునివేళ్ళు, ఓరగా విసిరే కొంటుచూపులు గుర్తొచ్చాయి.


'తను చాలా సోషల్ గురూ! 'అని ఫ్రెండ్స్ మాటలు మహా జోరుగా హుషారుగా అనిపించాయి.


అయినా మధు ఎటువంటి సాహసానికీ ఒడిగట్టకపోవడానికి కారణం దొరికిపోతానేమోననే భయం.

అతని స్నేహితులు మాత్రం అల్లరి చేష్టలతో ఆమెనూ ఆమె స్నేహితురాళ్ళని విసిగించేవారు.


వాళ్ళూ ఊరుకునేవాళ్ళు కాదు. దానికి తగ్గట్టే సమాధానం చెప్పేవారు.

ఆనాటి అనుభూతులు గుర్తుచేసుకుంటూ రజితని తీసుకు రావడానికి రయ్యిమంటూ బండేసుకెళ్లాడు.


కారున్నాగానీ బండి వేసుకెళ్లటంలో ఓ కొంటె ఊహ దాగుంది.

రజితని ఇంటికి తీసుకువచ్చి మర్యాదలన్నీ చేయాలని,

నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం అనేలా ప్రవర్తించాలనుకున్నాడు.


రజిత తనవంక మురిపెంగా చూస్తే ఉబ్బి తబ్బిబ్బవుతూ హుందాతనాన్ని ప్రదర్శిస్తూనే సరదా సందర్భాన్ని సృష్టించుకోవాలి అనుకున్నాడు.


ఆమెను పెద్దగా ఇబ్బంది పెట్టాలని లేదుగానీ ఏదో ఉబలాటం, సరదా, ఉద్వేగం అన్నిటికీ మించి కాలేజీరోజుల్లో ఆమె గురించి చేసిన కుర్ర ఆలోచనలు మెదడులో మోహరించడమే కారణం.


ఆమెకి మంచినీళ్ల గ్లాసందిస్తూ వేళ్ళు తాకుతూ, గదులు తిప్పి చూపిస్తూ భుజాల్ని ఆనిస్తూ ఓహ్. . ఇదేం ఊహోగానీ సరికొత్తగా, గమ్మత్తుగా అనిపించి, తను సోషలేగా ఇంకాస్త చొరవ చూపించినా ఏమనుకోకపోవచ్చనే నమ్మకం.


తనివ్వాల్సిన సంకేతాలన్నీ ఇచ్చేస్తే ఆమె వాటిని అందుకుని తన ఆమోదాన్ని తెలుపుతుంది. తనూ చొరవ చూపిస్తుంది.


భార్యకి ద్రోహం చేసే ఉద్దేశ్యం లేదని చెప్పి ఆమె చుబుకం పట్టుకుని మృదువుగా లాలించాలి.


భుజం చుట్టూ చేతులువేసి నడిపిస్తూ మనిద్దరం కల్మషం లేని మనుషులం అనిచెప్పి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాలి.

మనం ఎప్పటికీ స్నేహితులుగా కొనసాగుదాం అని బుగ్గల్ని నిమరాలి.


ఈసారి వచ్చినప్పుడు కూడా తప్పకుండా మాఇంటికే రావాలని చేతిలో చేయివేసినొక్కి ప్రామిస్ తీసుకోవాలి. అలా అలా వీణ జాణని శృతిచేసి వదలాలి. ఆ ఉద్దేశ్యంతో ఎన్ని కలలో.


తన ఆటలు సాగితేమాత్రం ఈ అనుభవం మరపురానిదిగా మిగిలిపోతుంది.

ఇలా ఊహించుకుంటూనే రజితని తీసుకురావడానికి బండివేసుకుని వెళ్ళాడు.


రజిత బస్ దిగి బస్టాండ్ లో మధుకోసం ఎదురుచూస్తోంది.

మధు బండి స్టాండ్ వేసి నిలబడి రజితకోసం చుట్టూ చూసాడు. ఆమె దూరంగా కనపడింది. వాఁచ్ చూసుకుంటూ నిలబడింది.


మెరూన్ షిఫాన్ చీరకి బ్లాక్ బోర్డర్ డిజైన్ బ్లౌజ్. తెల్లటి శరీరం నీరెండలో మరింత పసుపు వర్ణాన్ని సంతరించుకుంది. సృష్టిలో స్త్రీ సౌందర్యాన్ని మించిన అద్భుత దృశ్యం మరోటి వుండదేమో అనుకుంటూ కాసేపు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు మధు.


ఒక చిత్రమైన అనుభూతి. కొండమీదనుంచి లోయలోకి జారే ఆకాశగంగను చూస్తున్నట్టు అవ్యక్త భావన. ఎన్నిసార్లు చూసినా కొత్తే. ఇంకా ఏదో వుందనిపించే గమ్మత్తే. రజితకి చెయ్యి ఊపాడు మధు. ఆమె మెల్లగా నడుచుకుంటూ అతనిదగ్గరకు వచ్చింది.


చిన్నగా నవ్వింది. విడీ వీడని పెదాల మాటున కాలేజీ రోజుల్లో చిలిపి చూపుల అ భావవగీతికలు మెదిలినట్టుగా రెప్పలల్లార్చి మధుకి కనబడనీకుండా క్షణాల్లో మార్చేసింది. మధు కూడా గుంభనగా నవ్వుకుంటూ నల్లకళ్ళద్దాలు పెట్టుకున్నాడు.


మాట చెప్పలేని భావాలు చూపులు బయటపెడతాయని ఓ చిన్న భయం.

"ఎక్కు రజితా" అన్నాడు.


ఆమె బండి మీద అతనికి కాస్త దూరంగా జరిగికూర్చుంది. బండి ముందుకు పోనిచ్చాడు మధు. రోడ్డుమీద ట్రాఫిక్ పల్చగా ఉంది. కదిలిపోతున్న వాహనాల్ని, కదలకుండా నిలిచిన ప్రకృతి దృశ్యాలనీ కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది రజిత.


"ఊరకరారు మహానుబావులు. మా ఊరిని పావనం చేశావ్. ఏదన్నా విశేషమా?" అన్నాడు మధు వారిద్దరి మధ్యనున్న మౌనాన్ని ఛేదిస్తూ. .

"ఆ వివరాలన్నీ ఇంటికెళ్లాక చెప్తానులే. ఎలా ఉన్నావ్. నీ పెళ్లెప్పుడయింది. ఎంతమంది పిల్లలు?" అనడిగింది.


" పెళ్ళై ఐదేళ్ళయింది. ఇద్దరు ఆడపిల్లలు. ఇక నేను ఇలా వున్నాను. ఏదో నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఓ మధ్య తరగతి భర్తగా భార్యా విధేయుడిగా ఇలా బతుకుతున్నాను" అన్నాడు నవ్వుతూ.


"ఆహా అట్లాగా? అందరూ ఇలానే అంటారులే. మీ మగవాళ్ళ సంగతి తెలీని వాళ్లెవరు?"


"అమ్మో అంతమాటనకు. మనం పరమ నిస్టా గరిస్టులం. సత్యసంధులం. ధర్మ నిరతులం. పాప విదూరులం. . . "


"చాలు చాల్లే ఆపు నీ ఆత్మస్తుతి. నువ్వు కాదు నీ శ్రీమతి కితాబు ఇస్తేనే నమ్ముతాను. అంతరంగాల్లో ఏముందో ఆ శ్రీరంగడికే ఎరుక. ఎవరి మనసులో ఏం దాచిపెట్టారో ఎవరికీ అంతుచిక్కదు. పైకి కనపడేదంతా నిజం కాదుగా. మెరిసేదంతా బంగారం కానట్టు. . . "


రజిత ఎందుకో ఎమోషనల్ అవుతోందనిపించి టాపిల్ మారుద్దామని "నీ మనసులో ఏముందో నాకు తెలుసు. అంతకంటే ముందు నీ మెడలో మెరిసేదంతా నిజమైన బంగారమే అనికూడా తెలుసు" అన్నాడు పైకే గట్టిగా నవ్వుతూ.


రజిత మౌనం దాల్చింది. కాలేజీ రోజుల్లో పరిచయం తప్ప ఆతర్వాత కాంటాక్ట్ లేదు. అలాంటప్పుడు ఎక్కువ చనువు తీసుకుని మాట్లాడ్డం మంచిది కాదని ఊరుకున్నాడు మధు. పరిచయాలతో పనిలేకున్నా గమ్మత్తుగా ఉండే ఒకే ఒక భావన 'ఆమె' గురించిన ఆలోచనలు.


అది విశ్వ పురుషులందరి సాంత్వనా పరిభాషలు.

ఏ ఒక్క విషయంలోనూ ఏకీభవించకపోయినా ఈ ఒక్క విషయంలో ఏకాభిప్రాయానికి వస్తారేమో.

మధు బండి వేగాన్ని పెంచాడు. కాస్త దూరంలో స్పీడ్ బ్రేకర్లు కనబడుతున్నాయి.


బండి వేసుకొచ్చిన ప్రయోజనాన్ని సార్ధకం చేసుకుందామనే ఆలోచన రాగానే ఉత్సాహంగా మరింత ముందుకు ఉరికించాడు. కానీ అప్పుడే బ్రేకు వేయాల్సొచ్చింది. ఉత్సాహమంతా చప్పున చల్లారిపోయింది.


" హలో మధు గారూ"

అరుపులాంటి పిలుపుకు అదిరిపడి బండి స్లో చేసాడు మధు.


"నేనేనండీ మధుగారూ, మొన్న మీతో చెప్పానే, మా బావమరిది ఆ పనిమీదే ప్రత్యేకించి వచ్చాడని. తీసుకురమ్మంటారా? మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో? మీకూ కుదరాలిగా అని వేచి చూస్తున్నా. మీకెన్ని పనులూ ఎంత వ్యవహారం. నేనర్థం చేసుకోగలను. ఆ. . . అదీ సంగతి. వాడో వానకారు కోయిల. వాళ్ళింటికి ఎప్పుడెప్పుడు వెళదాం అంటూ నన్ను తినేస్తున్నాడు. వాడి తొందర అలాంటిదిమరి. ప్రాణ భయం అటువంటిది మరి. ఏవంటారు?" ఆఫీస్ కొలీగ్ కం పక్కవీధి పార్థసారథి మధు మనో రథానికి అడ్డుపడ్డాడు.


"ఈ రోజు కాస్త పనుంది. రేపు తీసుకురండి. మాట్లాడదాం. "

అని బండి మెల్లగా ముందుకు పోనిచ్చాడు మధు.


"అయితే సరేమరి. రేపు ఉదయం వాడ్ని తీసుకొచ్చేస్తా. థాంక్యు", అని వెళ్ళిపోయాడు పార్థసారథి.


'పానకంలో పుడకలా తగిలాడు.

రూపాయితియ్యడుగానీ జీవితం మొత్తం పట్టుపరుపు లేసుకుని పడుకుంటావని, నిన్ను పడగొట్టేవాడు ఈ భూమ్మీద పుట్టలేదని చెప్పాలని ఆశ. '


గొణుక్కుంటున్న మధుతో "ఏంటి నీలో నువ్వే మాట్లాడు కుంటున్నావ్? అతనెవవరు?" అడిగింది రజిత.


"ప్రతి నాటకంలో ఓ విదూషకులుంటాడులే. అలాంటివాడే. బావమరిది బతుకుకోరే సగటు బంగారు బావగారు. ఇతని భార్య తమ్ముడి జాతకంలో ఉద్యోగపర్వం లేదని చెప్పినప్పటినుంచీ, రెమిడీ చెప్పమని ఉల్లి పకోడీ వేయించినట్టు వేపుకు తింటున్నాడు. ఎవరి కర్మలకు ఎవరు కర్తలు. " మాట్లాడుతూనే సందులూ గొందులూ తిప్పుకుంటూ తీసుకెళుతున్నాడు.


"ఎవరి ఆరాటం వారిది. ఎవరి ప్రాధాన్యతలు వారివి. ఒకరి బలహీనతని ఎగతాళి చేయడం దేనికి. ఏది లేకపోతే అదే పెద్ద వెలితిగా అనిపిస్తుంది. దాన్ని భర్తీ చేసుకునే పరుగు పందెంలో సగం జీవితం కలతలతోనే సాగిపోతుంది. వీలైతే సానుభూతి చూపించాలి. పెద్ద మనసుంటే సాయం చేసి ఆదుకోవాలి.


సెటైర్లు వేయడం సరికాదు. అతనికి ఉద్యోగం రాదని చెప్పడానికి మీరెవరండీ? మీరేమన్నా దేవదూతా? బ్రహ్మకి తాతా? వస్తుందని చెప్పండి. ఆశ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఎట్లీస్ట్ తనమీద తనకి అసహ్యం కలక్కుండానన్నా చేస్తుంది. బి ఆప్టిమెస్టిక్ అని కూడా చెప్పలేకపోతే ఇంకెందుకు ఈ మానవ సంబంధాలు. . . "


అర్ధాంతరంగా రజిత ఇలా క్లాసు పీకుతుందనుకోలేదు. ఏదో తుఫాను రాబోతోందని మనసు హెచ్చరించింది. వెంటనే టాపిక్ మార్చాడు మధు. "అదిగో ట్యాంక్ బండ్ వచ్చేశాం. ఆ రజితా. . ఆ విగ్రహాల్ని కొత్తగా కట్టారు. నేనూ మా ఆవిడా పిల్లల్ని తీసుకుని ఇక్కడకే వస్తాం. ఇక్కడ సాయంత్రం పూట మిర్చిబజ్జీ బండి పెడటారు. అబ్బ ఎంత బావుంటుందో. "


మధు చెప్పుకుంటూ పోతున్నాడు. మాట్లాడకుండా కూర్చుంది రజిత. ఈ ఆడవాళ్ళింతేనేమో సందు దొరికితేచాలు క్లాసు తీసుకునేందుకు సిద్ధంగా వుంటారు. టాపిక్ మారిస్తే ఠక్కున మాట్లాడ్డం మానేస్తారు. క్షణ క్షణముల్ జవారాండ్ర చిత్తముల్ అని ఇటువంటి వాళ్ళని చూసే అన్నారు కాబోలు.


"ఏం రజితా, మన కాలేజ్ డేస్ నీకు గుర్తున్నాయా? మన ఫ్రెండ్స్ కొందరైనా నీకు టచ్ లో ఉన్నారా?"

". . . . . . . "

"రజితా నిన్నే.. మీవారు ఏం చేస్తున్నారు? పిల్లలు? నీ జాబ్ విశేషాలు చెప్పు. అన్నట్టు అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు?"


"బాగానేవున్నారు"


"ఒకరోజు నీకోసం మీ డాడీ కాలేజీకొచ్చారు గుర్తుందా? అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళావు. మీ డాడీని

మ్యానేజ్ చెయ్యలేక ఎంత ఇబ్బందిపడ్డామో తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. నీకోసం సినిమాహాల్ కి ధనుష్ గాడిని పంపించి, మన సుభాష్ క్లాస్ రూమ్ లో నీలాగా చున్నీ వేసుకుని నీ గొంతుతో మాట్లాడ్డానికి నానా తంటాలు పడ్డాడు.


చివరికి దొరికిపోయి తెల్లమొహం వేసాడు. నువ్వు వచ్చి వాడ్ని చెడా మాడా తిట్టేశావ్. మీ డాడీ నిన్ను శాంతపరిచి ఇంటికి తీసుకెళ్లారు. మర్నాడు సుభాష్ ని ఎందుకలా తిట్టావ్ అని అడిగితే డాడీ దృష్టి మరల్చడానికి అలా చేశానని చెప్పావ్ గుర్తుందా? అప్పుడే అనుకున్నా నువ్వు మహా తెలివైనదానివని. ఎందుకంటే పెద్ద గీత ముందు చిన్న గీతలా నువ్వు చేసిన హడావిడికి నువ్వు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకెళ్ళావనే సంగతే మీ డాడీ మర్చిపోయేలా చేశావ్. అలాంటి సంఘటనలు ఎన్నో. అవన్నీ ఇప్పుడు తీపిజ్ఞాపకాలు. నీకెప్పుడన్నా గుర్తొస్తాయా? తలుచుకుని నవ్వుకుంటావా? నీకు గుర్తున్న ఒక సంఘటన చెప్పు" అన్నాడు మధు నవ్వుతూ.


"నేను గుర్తు పెట్టుకుని పడీ పడీ నవ్వుకునేంత జ్ఞాపకాలు నాకేం లేవు. " అంది రజిత ముభావంగా.


పలుకే బంగారమాయే అంటే ఇదే. ఏవిటో ఈ బిగుసుకు పోవడం. ఎందుకులేవు. కాలేజీని షేక్ ఆడించింది.

జూనియర్స్ ని రకరకాలుగా ఆటపట్టించేది.

అంతటి సరదా మనిషి ఇంత మూడీగా ఎలా మారిపోయింది?


ఒక సరదా మాట లేదు. ఉత్సాహం లేదు. జీవితంలో ఏవైనా ఎదురుదెబ్బలు తిందేమో. లేకపోతే కాలేజ్ మేట్స్ చాలా కాలానికి కనిపిస్తే ఎగిరెగిరి మాట్లాడుకుంటారు. పాత సంగతుల్ని తవ్వి పోసుకుని నవ్వుకుంటారు. ఇదేం తీరు. ఇదేం వాలకం. ఇల్లు రావడంతో ఆలోచనలనుంచి తేరుకున్నాడు మధు. ఆమెను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. గంభీరంగా చూస్తూ అక్కడే ఆగిపోయింది రజిత.

=============================

సశేషం

వినిపించని రాగాలు 2 త్వరలో

=============================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






116 views5 comments

5 Comments


Vijayalaxmi Telikicharla • 4 hours ago

బాగుంది వాణీగారు

Like

gopala krishna • 6 days ago

వినిపించని రాగాలు లో కనిపించని భావాలు లేవు...కథనంలోనూ, పఠనం లోనూ భావాలు బాగా పలికించారు..ఇరువురికీ అభినందనలు.

Like


vani gorthy • 5 days ago మీ అద్భుతమైన సమీక్ష రచన స్థాయిని పెంచేలా ఉంటుంది. ధన్యవాదాలు శ్రీదేవి గారూ

Like

Dr Sreedevi Sreekanth • 6 days ago

వాణీ గారి కథ, కథనం మహాద్భుతం. ఆ మార్ధవం చదివే వారి స్వరంలో లోపించింది. ఆ వర్ణన బావుకత సహజ కవయిత్రి వాణీ గారి కథనానికి మరింత అందాన్ని తెచ్చే వన్నెలు. పాత్రలను మన కళ్లముందు తిరుగాడే కథనం ఆమె కలానిది. పాత్ర పోషణ ఆమె మేథస్సు కు సహజాలు.

Like

Srinivas Bhagavathula • 6 days ago

బాగుంది వాణీగారూ అభినందనలు అండీ

Like
bottom of page