top of page

వినిపించని రాగాలు 3


'Vinipinchani Ragalu 3' New Telugu Web Series(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

రజిత, గోడకు తగిలించి ఉన్న ఫోటోల వంక తదేకంగా చూడడం గమనించాడు మధు.

ఫొటోలో ఉన్న మధు తండ్రి వంక ఆసక్తిగా చూసింది రజిత.

అతని దగ్గర సెలవు తీసుకోని హాస్పిటల్ కు వెళుతుంది.

తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న రాజేష్ కష్టాల్లో పడ్డం తెలిసి బాధ పడతాడు మధు.ఇక వినిపించని రాగాలు 3 వ భాగం చదవండి…

మధు లేచి కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడేం కనబడలేదు. కానీ ఏదో కదిలి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది. మళ్లీ కనిపిస్తుందేమో అని అటువైపే కాసేపు చూస్తూ ఉండిపోయాడు. నీడలైతే కనబడలేదుగానీ ఏవో శబ్దాలు మాత్రం వినబడుతున్నాయి.

బయట లారీ లోడ్ దించుతున్నారేమో అనుకున్నాడు. అదీ ఈ టైంలో. వీళ్ళకి వేళా పాళా లేదేంటో అనుకుంటూ కిటికీలు మూసొచ్చి మళ్లీ నిద్రకి ఉపక్రమించాడు.

కానీ ఏవేవో శబ్దాలు అతని చెవిలో రొదపెడుతున్నాయి.

వాటి అంతరార్ధం మధుకి అప్పుడర్థం కాలేదు.

కానీ ఏ కుదుపులూ లేకుండా సాగిపోతున్న అతని జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులకి ఆ రాత్రి నాంది అని తెలియని మధు నిద్రలోకి జారుకున్నాడు.

విధి వ్యక్తులచేత కొన్ని పనులు చేయిస్తుంది. అవి అసంకల్పిత చర్యలైనా పర్యవసానం మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడో పడబోయే పశ్చాత్తాపానికి ఇప్పుడే బీజం పడుతుంది. మధు యాధాలాపంగా పెదవి దాటిన ఒక చిన్న మాట ఒక విశాల వృక్షాన్ని కూల్చేసింది.

అనాలోచితంగా అన్న ఒక చిన్న మాట ఎక్కడో ఒక నిండు జీవితాల్ని మార్చేసింది. తన మాటకి పర్యవసానం ఎలా ఉండబోతోందో తెలుసుకునేరోజు ఇంత తొందరగా వస్తుందని మధుకి తెలియదు.

మధులేచేసరికి బారెడు పొద్దెక్కింది. వాచ్మెన్ వచ్చి డోర్ కొట్టాడు. బద్ధకంగా లేచి తలుపు తీసాడు.

"సార్ మీరు చెప్పినపని గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రే చేసేసాను. ఇక సమస్య తీరిపోయినట్టే" అన్నాడు.

అర్ధంకానట్టు చూశాడు మధు.

"నేనేం చెప్పాను, నువ్వేం చేసావు?"

"అదే సార్ మన అపార్ట్మెంట్ ముందున్న పెద్ద చెట్టు కొట్టేశాను. "అన్నాడు.

"హారి దుర్మార్గుడా, చెట్టు కొట్టడమేంట్రా? నేనెప్పుడు చెప్పాను? కలగన్నావా ఏంటి?" అన్నాడు.

"ఏం తెలీనట్టు తిరగేసి నన్నే అడుగుతున్నారేంటి సార్? మీరేగా నిన్న మద్యాహ్నం ఈ చెట్టు కొట్టేస్తే పీడ విరగడవుతుంది అన్నారు. దీనివల్లే ఇన్ని తలనొప్పులు వస్తున్నాయ్ అన్నారు. మీరంత చిరాకుపడటం నేనెప్పుడూ చూళ్లేదు.

అందుకే అందరూ పడుకున్నాక గొడ్డలితో నాలుగు దెబ్బలేసాను. అంతే నేల మట్టానికి ఒరిగిపోయింది.

దుంగ తీసికెళ్లి పక్క వీధిలో పడేశాను. మనం కొట్టినట్టు మున్సిపాలిటీ వాళ్ళకేకాదు వాళ్ళ జేజమ్మకి కూడా తెలీదు. మీరు హ్యాపీ గా వుండండి సార్" అని చెప్పి వెళ్ళిపోయిన వాచ్మెన్ వెళ్లిన వైపు చూస్తూ తల పట్టుకున్నాడు మధు.

ఏవి హ్యాపీరా బాబూ..

పచ్చని చెట్టు కొట్టేశావ్. రాత్రి దబ్బుమని చప్పుడయ్యింది ఇదా? వీడి అఘాయిత్యం కూలా. నమ్మిన బంటు సరే. మధ్యలో ఆ చెట్టేo చేసింది పాపం. ఎన్నేళ్ళు కష్టపడితే అంతదయింది. ఒక్కక్క కొమ్మనీ జాగ్రత్తగా పెంచుకుంటూ అంత పొడుగ్గా గుబురుగా ఎదిగింది. ఈ మూగ జీవి ఏం

చేసిందనిరా అంత పనిచేశావ్.

ఒక పక్క ఆక్రోశిస్తూనే మరోపక్క చెట్టు శపిస్తుందా అనే ఆలోచన కలిగింది.

చెట్టు నేరక పాపమే చేసింది....

పోకరీరాయుళ్లకు కాపుకాసింది.

తాగుబోతులకు తల విరబోసి మదుగిచ్చింది.

దిక్కుమాలిన వెధవలకు అడ్డాగా మారింది.

వచ్చేపోయే ఆడవాళ్ళని వేధించేందుకు వేదికయ్యింది. కానీ ఆ పాపం నోరు లేని చెట్టుదా? తన కిందున్న ఎవరికైనా నీడనివ్వడమే తనకి తెలుసు.

తాగుబోతులని హేళనగా ముడుచుకోదు.

లోకాకళ్యాణ కర్తలకి గొడుగు పట్టదు.

ఒకటే రీతి. ఒకటే నీతి.

అతి కొద్ది కాలంలో మరింత చెట్టుగట్టి గుబురుగా మారింది. ఇంటి ముందు తాటాకు పందిరి వేసినట్టు చల్లగా ఉంది.

అపార్ట్మెంట్ గోడని దాటి గర్వంగా చూసేలోపే

ఇంతపని జరిగింది.

అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న స్లమ్ లో వుండే కుర్రాళ్ళ మకాం ఎప్పుడూ చెట్టుకిందే.

" బాబూ ఈ బళ్ళేవిటి? వాటిమీద పొద్దస్తమానం కూర్చుని మీ కబుర్లేంటి? మీ ఇళ్ళకి పోరాదా? ఎవరికోసం ఈ పడిగాపులు.

మా అపార్ట్మెంట్ ముందు ఇలా గుంపులుగా చేరి ఏం సాధిస్తారు?" మధు వాళ్ళని అడగ్గానే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

"మా ఇంట్లో ఉండేందుకు మా అందరికీ చోటుచాలదు. ఒకళ్ళు పడుకుంటే ఇంకోళ్లు బయట కూర్చోవాలి. మావి చాలాచిన్న ఇళ్ళు. అసలే వేసవికాలం అందులో ఉక్కపోత. మధ్యలో కరెంటు కోత. దీనికితోడు ఇంట్లో ముసలమ్మల మంచాలు. మూలుగుళ్లు. ఇంకెక్కడుండేది?

ఇంట్లో ఉంటే అమ్మానాన్నలు మేం ఉద్యోగం చెయ్యట్లేదని సణుగుడు. మాకెవరిస్తారు ఉద్యోగాలు. చదువుకున్నా అసలెక్కడున్నాయని ఉద్యోగాలు? చెబితే వాళ్ళకి అర్థంకాదు. ఫోన్ లో గేములు ఆడుకుంటే పనీపటా లేదా ఎప్పుడూ ఆటలేనా అని తిట్టిపోస్తారు.

నిద్రపోతే నిద్రమోహంవాడు అంటారు. తింటే తిండి పోతంటారు. మాట్లాడితే వదరుబోతు అంటారు. ఏం చేసినా మా ఉద్యోగాలకు ముడిపెట్టి ఎప్పుడెప్పుడు తిడదామా అని చూస్తుంటారు. అందుకే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదని ఈ చెట్టుకింద సమావేశం అయ్యాo. మాకు ఉద్యోగాలు మీరు ఇప్పించండి లేదా మాకు ఉద్యోగాలు వచ్చేదాకా మా జోలికి రాకండి" అని పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు ఒకడు.

వాడి తెలివికి తల తిరిగిపోయింది మధుకి. యువతకు అన్నిటిమీదా మంచి అవగాహనే ఉంది. కార్యాచరణలోపాల వలన నిర్వీర్యం అయిపోతున్నారు.

చెట్టుకింద చేరి ఊరికే వుంటారా అంటే వచ్చేపోయే వాళ్ళని కన్నార్పకుండా చూస్తారని వినికిడి. చూస్తూ కామెంట్లు చేస్తారని అలజడి. వాళ్ళని పొమ్మని అదమాయిస్తే మరింత పెచ్చుమీరిపోతున్నారు.

అదేమంటే "మీ ఆడవాళ్ళని ఎప్పుడైనా కామెంట్ చేశామా చెప్పండి. మీరెప్పుడైనా విన్నారా? మా బాధల్లో మేం ఉంటే అలా మాట్లాడతారేంటి' అని ఎదురుప్రశ్నలు.

స్వయానా వినలేదుకానీ అపార్ట్మెంట్ లో ఆడపిల్లల తల్లులు కంప్లైట్ అదేగా. వాళ్ళ పిల్లల భద్రత గురించి ఆందోళన వాళ్ళది.

"ఏదైనా అఘాయిత్యం చెప్పి చేస్తారా? ఎప్పుడు ఎవరికి పాడుబుద్ధి పుడుతుందో ఎవరికి తెలుస్తుంది? ముందుగానే జాగ్రత్త పడాలి. తర్వాత ఏదన్నా జరిగితే దానికి మీరు బాధ్యత వహిస్తారా?" అని ఆడవాళ్ళందరి ఆందోళన.

సెక్రటరీ అయిన పాపానికి వాళ్ళ విన్నపాలు పెడచెవిన పెట్టకూడదు. కుర్రాళ్ళ వాదన సహేతుకంగా వున్నా, దాన్ని పరిగణలోకి తీసుకోటానికి లేదు. అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదులకే పెద్దపీట వెయ్యాలి అనుకున్నాడు.

"మిమ్మల్ని ఈచోటు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని అందరి తరపునా ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా చెబుతున్నాను. ఈ చెట్టుకింద ఎవరూ మకాం పెట్టొద్దు. వచ్చేపోయేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటోంది. లేకపోతే విషయం మీ పెద్దవాళ్లదాకా తీసుకు వెళ్లాల్సి వస్తుంది" అని చెప్పాడు మధు.

"మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మీ పని మీది, మా పని మాది. ఇంకా దీన్ని పొడిగిస్తే ఏం చెయ్యాలో మాకూ తెలుసు"

అటు తిరిగి కూర్చుని మధు చెప్పేది వినిపించుకోలేదు వాళ్ళు.

సరెపోనీలెమ్మని వదిలేద్దాం అంటే "అట్లా వీల్లేదు. మీరేం చేస్తారో మాకు తెలీదు. ఈ చెట్టుకింద కుర్రాళ్ళు ఉండటానికి వీల్లే”దని అపార్ట్మెంట్ మహిళలు సీరియస్ అయ్యారు.

అటు నుయ్యి ఇటు గొయ్యి. ఇదొక సమస్యా? అంటే అదే పెద్ద సమస్య అంటారు వీళ్ళు. మేం ఎవరికీ సమస్య కాము. కామ్ గా ఉంటాం. మా జోలికి రావద్దంటారు వాళ్ళు.

నాలుగో ప్లోర్ సుభద్ర విసురుగా కిందకి దిగి వచ్చింది. వస్తూ ఇంత చెత్తా కుడితి కలిపిన బక్కీటు తెచ్చి ఆ కుర్రాళ్ళమీద విసిరికొట్టింది.

వాళ్ళు అదిరిపడి ఆవిడమీదకి కయ్యిమంటూ లేచారు. “మా మీద చెత్త పోస్తావా? నీ ప్లాట్ లో కోడి ఈకలు తెచ్చి పోస్తాం. పట్టుకురండిరా” అని హటం చేశారు.

"రామరామ, మీ మీద ఎవరుపోశారురా, మేం పాతుకున్న చెట్టుకింద పోసాను. అక్కడ మీరున్నారు. నాకేం సబంధం" అని సాగదీసింది.

"ఒళ్ళు తిమ్మిరిగా ఉందా?, కళ్ళు కనపడట్లేదా?" అని అపార్ట్మెంట్ లోకి దూసుకొచ్చారు. ఆవిడ పారిపోయి వాఁచ్ మెన్ రూంలో దాక్కుని గడియ వేసుకుంది.

అతి కష్టం మీద తలుపు తెరిపించి సుభద్రని బయటకు తీసుకొచ్చారు.

"నేను పాతిన చెట్టుకింద నేను ఏదైనా పోసుకుంటా. నీకెందుకురా బడుద్దాయ్" అని కొత్త తగాదాకి తెరతీసింది.

"ఆ చెట్టు పాతింది నువ్వా.. అబద్ధాలు చెప్పకు. నేను పాతాను. మా ఆయన పార్క్ కి వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా పీక్కొచ్చారు. రోజూ నీళ్లుపోసింది నేను. అంత పెద్దగా చేసింది నేను. చెప్పేది సరిగ్గా చెప్పాలి" అంటూ కస్సుమంది కనకం. "అట్టనకండి. ఆ చెట్టుకి నీళ్లు పోసి పెంచింది నేను. రోజూ కూర తొక్కులు గుడ్డు డిప్పలు గిరాటుకొట్టి పెంచింది నేను. " అని వాచ్ మెన్ భార్య రంగంలోకి దిగింది.

"అబ్బబ్బా ఆపండి మీగోల. ఎవరునాటారనేది సమస్య కాదిక్కడ. ఆ కుర్రాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పండి" అన్నాడు మధు.

"ఆ బడుద్దాయిలకు సమాధానం చెప్పేదెవరు? నేను కుడితి తెచ్చి రోజూ ఆ చెట్టుకిందే పోస్తా. ఎవడేం చేస్తాడో చూస్తా" అంది సుభద్ర బక్కీటు తిప్పుతూ.

"ఆహా. నువ్వు పోస్తే, మేం చూస్తూ ఊరుకుంటామా? పదండిరా ఈ చెత్తంతా తీసికెళ్లి వీళ్ళింట్లో పోసొద్దాం" అని హడావిడి చేశారు.

అపార్ట్మెంట్ అంతా గందరగోళంగా మారింది. అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. చూస్తూ నిలబడ్డ మధుమీద గయ్యి మంది రెండోప్లోర్ సత్యవేణి.

" గుడ్లప్పగించి చూస్తారేంటి. వాళ్ళ ఆగడాలని అరికట్టలేరా? మీరేం సెక్రటరీ. అదే నేనైతేనా" అని పెద్ద నోరుపెట్టి అరిచింది.

"ఈసారి ఎలక్షన్స్ లో మీరే సెక్రటరీగా ఉందురుగాని. ఈయనవల్ల ఏం కాదు. ఉట్టి బెబ్బేబ్బే మెమ్మేమే" గొంతు కలిపాడు మూడో ఫ్లోరు ముకుందరావు. వాళ్ళు వినరు వీళ్ళసలే వినరు.

ఆరోజు ఆ గొడవకు మధుకి తిక్కరేగింది.

"వాచ్మెన్ ఈ చెట్టు కొట్టిపారేయ్. ఏ గొడవా ఉండదు. ఎర్రటి ఎండలో తలమాడితేగానీ వెధవలు ఇక్కడ్నించి ఉడాయించరు" అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. కాసేపట్లో ఆ గొడవ సర్దుమణిగింది.

మధ్యాహ్నం చెప్పగానే రాత్రికి రాత్రి చెట్టు కొట్టిపారేశాడు.

ఎటువంటి సంధి షరతులకు తావులేకుండానే, సమస్య ఒక కొలిక్కి రాకుండానే వీడింతపని చేసేసాడు. చెట్లు నాటమని మొత్తుకుంటుంటే కొట్టుకోడం ఏంటి? ఇదా పరిష్కారం? చాలా తప్పు జరిగిపోయింది.

చెట్టయితే శపించదుకదా?! చెట్టుకీ మనసుంటుంది. ఎంత బాధపడిందో పాపం. ఒక చెట్టుకు బదులు రెండు చెట్లు నాటితేఆ పాపం పోతుందిలే.

ఎక్కడ నాటుదాం? మళ్లీ అపార్ట్మెంట్ గోడ పక్కనేనా?

కాదు, ఈసారి చచ్చినా వీల్లేదు. పిల్లల స్కూల్ లో గానీ, పార్క్ లోగానీ నాటాలి. రేపే ఆపని చెయ్యాలి. చెట్టు మీద గూడు పెట్టుకుని ఉంటున్న పక్షులు ఏవయ్యాయో.. ఎక్కడికి ఎగిరిపోయాయో. నిజానికి పక్షుల చివరి దశలో వాటి పిల్లలే వాటిని చూసుకుంటాయిట. మనుషులకన్నా పక్షులే నయం కదా. అటువంటి వాటి ఆవాసాన్ని పాడుచేసాను.

పోనీ కుండీ కొనుక్కొచ్చి అందులో నాటితే.. పక్షులు వాలలేవుకదా. ఏమైనా ఇప్పటికి కుండీల్లో నాటాలి. రేపు పార్కుల్లో నాటాలి.

ఎల్లుండి స్కూల్ లో నాటాలి.

ప్రస్తుతం మాత్రం కుండీలోనే నాటాలి.

అలా అనుకోగానే మధు మనసు కాస్త. కుదుటపడింది.

కానీ చేసిన తప్పుకి దండన తప్పదని తనకీ తెలుసు.

ఇంట్లోకి వచ్చి మొహం కడుక్కుని కాఫీ కలుపుకుని హాల్లోకి రాగానే టింగ్ మని కాలింగ్ బెల్ మోగింది.

ఎవరా అని తలుపుతీస్తే ఎదురుకుండా తండ్రీ, భార్యా పిల్లలు.

"అప్పుడే వచ్చేసారేవర్రా! అమ్మమ్మా వాళ్ళిల్లు బోరుకొట్టేసిందా? పార్కూ గీర్కూ అన్నీ చూసేసారా?" అన్నాడు.

"చిన్నది వెళ్లిపోదాం అని ఒకటే గోల. సరే రెండ్రోజులకి ఏవైందని తిరిగి వచ్చేశాం. " అంది మధు భార్య సత్య.

మధు తండ్రి లోపలికి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. తను తెచ్చిన గాజుల్ని భార్య ఫోటోముందు పెట్టాడు.

"నువ్వడిగిన రంగు చీర దొరకలేదోయ్. ఇదిగో ఈరంగు నీకు బాగుంటుంది.... " తండ్రి ధోరణికి నిట్టూర్చాడు మధు.

మధుని పిల్లలు చుట్టేసుకుని అక్కడి విశేషాలు చెప్పుకుపోతున్నారు. సత్య తను తెచ్చిన సామాను లెక్క చూసుకుని బ్యాగ్గులోంచి గాజు బొమ్మలు తీసి షోకేస్ లో పెట్టింది.

"నాన్నా అమ్మని నాకు నచ్చిన బొమ్మ కొనమంటే కొనలేదు" కూతురి ఫిర్యాదుకు

"ఎన్ని కొన్నా ఎక్కడపడితే అక్కడ ఆగిపోయి చూసినవన్నీ కొనమంటుంది. ఈమధ్య దీని అల్లరి ఎక్కువైంది. " అంది సత్య.

"పోనీలేవోయ్, బాలానాం క్రీడాసక్తః. ఆడుకునే వయసులో ఆడుకోనివ్వు. నీకేం బొమ్మలు కావాలో నాకు చెప్పు. నీకు కొనిపెడతాను" అన్నాడు కూతుర్ని ముద్దుపెట్టుకుంటూ.

"నాకు క్రేయాన్స్, డ్రాయింగ్ బుక్ కావాలి నాన్నా. కొనిపెట్టవా" అడిగింది పెద్దకూతురు.

"తప్పకుండా కొనిపెడతా. ప్రాక్టీక్ మేక్స్ మా బుజ్జి పర్ఫెక్ట్" అన్నాడు పెద్ద కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ.

"ప్రతిదానికీ మీ దగ్గర రెడీ మేడ్ సమాధానాలు భలే వుంటాయండీ. వాళ్ళనలా గారాబం చేయకండి. ఆడపిల్లల్ని భయం భక్తులు నేర్పాలి" అంది బ్యాగ్గుల్లో బట్టలు బయటకు తీసి సర్దుతూ.

"భయంకన్నా భక్తి గొప్పది. భక్తి కన్నా యుక్తి గొప్పది. మన పిల్లలకి అవన్నీ ఉన్నాయిలే. నువ్వేం కంగారు పడకు" అన్నాడు మధు.

సత్య మామగారికి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది. పిల్లలకు పాలు కలిపి ఇచ్చి స్నానానికి బయలుదేరింది.

"కాసేపు కూర్చో. తర్వాత స్నానం చూద్దువుగాని. వంట నేను చేస్తానులే. ఎవరికి ఏంకావాలో చెప్పేయండి. ఆలసించిన ఆశాభంగం" అన్నాడు మధు హుషారుగా.

"నాన్నా నాకు బిర్యానీ కావాలి"

"నాన్నా నాకు పూరీ కావాలి"

"అన్నీ చేస్తానమ్మా. మీ అమ్మకి ఏం కావాలో అడగండి” అన్నాడు సత్యని కొంటెగా చూస్తూ.

"చాల్లేoడి బడాయి. పెద్ద నలభీముడల్లే. నేనే చేస్తాను. మీరువెళ్లి కూరలు, పాలు పెరుగు ప్యాకెట్ తీసుకురండి. రత్తాలు రోజూ వస్తోందా?" అని అడిగింది.

"రోజూ ఎందుకులెమ్మన్నాను. రెండ్రోజులకోసారి రమ్మన్నాను. ఇప్పుడు ఫోన్ చేసి పిలుస్తాను. ఇల్లు తుడుస్తుంది. ఇంతకీ ట్రిప్ విశేషాలు మాకు చెప్పేదేంలేదా? ఎలా గడిపారు ఏవిటీ విశేషాలు. నాన్న సంతోషపడ్డారా?" అన్నాడు మధు పిల్లలవంక చూస్తూ.

"తాతయ్య చాలా హ్యాపీగా వున్నారు. మీరూ వస్తే బాగుండేది నాన్నా" అంది పెద్దకూతురు.

"నాకెక్కడ కుదురుతుందమ్మా! ఆఫీస్ లో ఆడిటింగ్ ఉంది. ఉన్న ఒక్క ఆదివారం హాయిగా రెస్ట్ తీసుకున్నా. మళ్లీ ఎప్పుడో చూద్దాం"

"మీకు కుదరదనే మేం సోలోగా వెళ్లి తిరిగొస్తున్నాం. ఇదే అలవాటైపోతే ఇక మీతో మాకు పనుండదు. మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. ఎప్పుడూ పనులూ పనులూ. కొందరు కోడి పెట్టల్లా ఇంట్లో పొదుగుతూ వుంటారు"

"సత్యభామా ఇక ఆపు. ఈసారి మీతో తప్పకుండా వస్తానుగానీ నీ దండకం కాస్త ఆపు. నాకోసం ఏం తెచ్చావో అది చెప్పు" అన్నాడు మధు.

బ్యాగ్గులోంచి శాలువా తీసి ఇచ్చింది. కాశ్మీర్ పూల దుప్పటి తీసి చూపించింది.

"కుంకుమ పువ్వు తెచ్చాను. మీ కొలీగ్ ప్రకాష్ భార్య ప్రెగ్నెంట్ కదా. ఆవిడకి ఇద్దామని" అంటూ బ్యాగ్గుల్ని సర్దుతున్న సత్యకి సోఫా పక్కన నాలుగు మడతలు పెట్టిన కాగితం కనిపించింది. ఇదేవిటీ అంటూ తీసి చూసింది. మడతలు విప్పి చదివి ఆమె మొహం వివర్ణమైంది.

"ఏవిటోయ్ నీ చేతిలో ఆ లేఖేవిటి?... " అన్నాడు మధు.

" మీ భవిష్యత్తు.. ఇప్పుడు నా చేతిలో ఉంది" అంది తల ఎత్తి మధువైపు తీక్షణంగా చూస్తూ.....


=================================================

...సశేషం...

=================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.28 views2 comments

2 Comments


srinivas gorty • 9 days ago

రచయిత రాసిన కథకు తన గళం కలిపి అందంగా మలిచారు.

Like

srinivas gorty • 9 days ago

మంచి కథ.

Like
bottom of page