top of page

వినిపించని రాగాలు 4


'Vinipinchani Ragalu 4' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది.

దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు.

వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు.

ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.



ఇక వినిపించని రాగాలు 4 వ భాగం చదవండి…


సత్య మాటలకి తత్తరపడ్డాడుమధు.

భార్యకి భయపడేది ఒకే ఒక్క విషయంలో. అతనికి వచ్చే లేడీ ప్యాన్స్ రాసే ఉత్తరాల గురించి.


ఎప్పుడో ఒకసారి అలా జరిగింది. జాతక ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది? ఉండబోతుంది ఇలాంటి విషయాలు ఒక ప్రముఖ వీక్లీ లో అచ్చు వేస్తామని అడిగారు.

మధు అన్ని రాసుల వారి జాతక చక్రాల వారి గురించీ, జరగబోయే పరిణామాల గురించి వాళ్ళకి రాసిచ్చాడు. అందులో కొన్ని అనుకూల ఫలితాలూ, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అది చదివిన ఆడవాళ్లు వాళ్ళ సందేహ నివృత్తికై అదనపు సమాచారం కోరుతూ అతని అడ్రెస్ కి ఉత్తరాలు రాశారు. పత్రికవారు పాఠకుల ఒత్తిడి మేరకు అడ్రెస్ ఇచ్చి ప్రోత్సహించారుట.

ఆ ఉత్తరాలను చదివిన సత్య అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.

'మా వారిని పర స్త్రీ వ్యామోహం కాస్త తగ్గించుకుంటే మంచిది' అని రాశారుకదా.


ఆయనకి ఆ వ్యామోహం నిజంగా ఉందా? ఉందని ఎలా తెలుసుకోవడం? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా నియంత్రించాలో ఉపాయం చెప్పండి"అని ఒకళ్ళు..


ఇంకోళ్లయితే ఏకంగా 'మా ఆయనకు వృత్తి వ్యాపారాలలో నష్టం వస్తుందని రాశారు. వృత్తిలోనా? లేక వ్యాపారంలోనా? మీరు సరిగ్గా చెప్పలేదు. మీ అడ్రెస్ చెబితే మీ ఇంటికొచ్చి మా సందేహానివృత్తి చేసుకుంటాం' అని.


ఏదో ఉజ్జాయింపుగా అన్ని నక్షత్రాల వారికీ కలిపి చెప్పేస్తే వాటి గురించి ఉత్తరాలు రాసేవాళ్ళు ఎక్కువయ్యారు. అప్పటినుంచి ఆ పత్రిక్కి రాయడం మానేశాడు. అయినా ఉత్తరాల పరంపర కొన్నాళ్ళు కొనసాగింది. అందులో ఎక్కువమంది మహిళలే.


అందులో అతని ప్రమేయం లేదని పూర్తిగా నిర్ధారణ చేసుకునేదాకా సత్య అతన్ని వదిలిపెట్టలేదు.

"ఏంటి ఆ కాగితం?" అన్నాడు సందేహంగా సత్య మొహంలోకి చూస్తూ.


"శ్రీవారికి ప్రేమలేఖ" అంది

తుళ్ళిపడ్డాడు. "నాకెవరురాస్తారు? రాసినా

చించి పారెయ్యనూ" అన్నాడు కాగితంవైపు భయం భయంగా చూస్తూ.


"నా భర్త శ్రీరామచంద్రుడని నాకు తెలుసు. కొవ్వొత్తికి నిప్పు తగిలితే కరక్కుండా ఎందుకుంటుంది"అంది సత్య.


" రాముడిని వరించిన సూర్ఫణఖకు బుద్ధి చెప్పాడేకానీ మెల్ట్ అయ్యాడా ఆ రాముడు.. ఈ రాముడూ అంతే?" అన్నాడు మధు మీసం మెలేస్తూ.


" వలచి వచ్చిన పర స్త్రీ ఎంత సుందరమైనదైనా రాక్షస సమానంగా చూడటం రామతత్వం. ఒక బాణం ఒక భార్య ఆయన వ్యక్తిత్వం. కుటుంబ బంధాలలో వుంటూకూడా దైవత్వాన్ని ప్రదర్శించాడు. అందుకే ఆయన మానవులందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు. "


ఇద్దరి సంభాషణ రాముడు మీదనుంచి కృష్ణుడిమీదకు మళ్లింది.

"ఆ అవతారంలో బుద్ధిమంతుడు. తర్వాత అవతారంలో ఇంతకు ఇంతా చూపించాడుగా" అంది సత్య.

"అంతమాట మనకు. శీకృష్ణుడు సమస్త మానవాళి యొక్క పూర్తి అంతరంగం.


మనసు ఎలా ఉంతుంది? దానిరూపం విశేషాలు చూపించాడు. ఎలా వుండకూడదో కూడా చెప్పాడు. గీతాసారం మొత్తం మానవ జీవన సమాచారం. మానస సంచారి ఆయన.. " అంటూ చెప్పుకుపోతున్నాడు మధు.

"సరే ఇక ఆపండి. మీరు నా రాముడే. "అంది సత్య.

"ఇంతకీ ఆ కాగితం ఏంటో చెప్పలేదు" అన్నాడు మధు.

"చెప్పాగా భవిష్యత్తు అని"


"నా భవిష్యత్తా" "మీ భవిష్యత్తు కడనుకుంటా,"


" ఏదీ ఇటువ్వు"

అని భార్య చేతిలోంచి కాగితం తీసుకుని

చూసాడు.


"ఇది ఎవరిదో జాతకం కాగితం. ఇక్కడికెట్లా వచ్చింది?" అన్నాడు అటూ ఇటూ తిప్పి చూస్తూ.

"ఏమో నన్నడుగుతారే? మళ్లీ జాతకాలు చెప్పడం మొదలెట్టారా? వద్దని ఎంతచెప్పినా వినరా మీరు? ఆమధ్య ఎవరికో చెప్పింది చెప్పినట్టుగా జరిగిందని, మీరు చెప్పడం వల్లే అలా జరిగిందని ఆ నష్టపోయినవాడు మిమ్మల్ని దుమ్మెత్తిపోశాడు. గుర్తులేదా?


వీడు యాక్సిడెంట్ లో పోతాడని, వాడికి కోట్లు లాస్ వస్తుందని, కూతురు ఎవరితోనో వెళ్ళిపోతుందని చెబితే పట్టుకు తంతారు. అసలు మనుషులందరి భవిష్యత్తు మీకెలా తెలుస్తుంది? ఈరోజు నేనూ పిల్లలూ ఊరునుంచి తిరిగి వచ్చేస్తాం అని మీకు తెలుసా?"అంది సత్య కోపంగా చూస్తూ.

"పిచ్చిదానా, గట్టిగా మనసుపెట్టి చూస్తే అన్నీ అద్దంలో కనిపించినట్టు స్పష్టంగా తెలుసు కోవచ్చు. జరగబోయేది తెలిస్తే జాగ్రత్త పడమని చెప్పడమే శాస్త్ర ముఖ్యోద్దేశ్యం. "


"అసంభవం. జరగబోయేది ఎప్పటికీ మనకు తెలీదు. తెలిస్తే అది జరగదు. అలా అయితే ఈ మనుషులందరూ జాతకాలు చెప్పించుకుని, ఏం జరగబోతోందో ముందే తెలుసుకుని కష్టాల బారినుంచి తప్పించుకోవచ్చుగా"


"పిచ్చి సత్యా! వాన పడుతుందని వాతావరణ శాఖ చేసే హెచ్చరిక లాంటిదే ఇదికూడా. ముందుగా రేయిన్ కోట్ ఏర్పాటు చేసుకుంటారు కదా" అన్నాడు మధు.


"ఒకటి గుర్తుపెట్టుకోండి. వాతావరణ శాఖ చెప్పింది చెప్పినట్టు అన్ని సార్లూ జరగదు. ఈరోజు ఎండ కాస్తుందని చెబితే నమ్మి సగం దూరం వెళ్ళాక వానకురిస్తే ఏం చేస్తారు?

వానకి తడవాల్సిందే, ఎండ వస్తే ఎండాల్సిందే. ఏదైనా అనుభవించాల్సిందే. మీరు చెప్పులూ గొడుగులూ ఏం పంచిపెట్టక్కర్లేదు. జరగాల్సింది ఎదోవైపునుంచి వచ్చి జరిగిపోతుంది.


ముందే తెలిస్తే కొన్ని సందర్భాల్లో జీవితాంతం అదే తలుచుకుని బాధ పడాల్సొస్తుంది. ముందుగా వచ్చే సంతోష సమయాల్ని కూడా పాడుచేసుకునే అవకాశం ఉంది. మీరు జాతకాల జోలికి పోవద్దు. అంతే" ఖరాఖండిగా చెప్పేసింది సత్య.


"అయ్యో సత్యా ఏదీ నీకర్ధం కాదా! ఒక గదిలో పాముందని ముందే తెలిస్తే నువ్వు జాగ్రత్తగా చూసుకుని వెళతావ్. అదే తెలియకపోతే దూసుకు వెళతావ్. కాటు వేస్తుంది కదా" అన్నాడు మధు.


"అది రాసి ఉంటేనే తప్ప తెలియక పోతే కాటు వెయ్యదు. ముందే తెలుసుకుంటే వ్యాకులత పెరుగుతుంది. ఇక మీ వితండవాదం ఆపండి.


అలా చేస్తే నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పానా లేదా? ఇంతకీ ఎవరిదీ ఆ జాతకం" అని లాక్కుని చూసింది.

"ఈ సంపత్ కుమార్ ఎవరు? అతనుగానీ మనింటికి వచ్చాడా? " అడిగింది సత్య.

గతుక్కుమన్నాడు మధు.


రజిత వచ్చిందని చెబితే ఇంకేమన్నావుందా?

పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఏడుపులూ, గొడవలూ ముక్కు చీదుళ్ళు. ఇప్పటికే చాలా ప్రయివేటు క్లాసు తీసుకుంది. చెబితే టైం టేబుల్ వేసి మరీ తిడుతుంది. అమ్మో, చెప్పకూడదు అనుకున్నాడు.


"అవును, నిన్న వాడే వచ్చి కాసేపుండి వెళ్ళిపోయాడు. జాతకం చెప్పమని అడిగాడు. మా ఆవిడ చెప్పొద్దoదని నిర్మొహమాటంగా చెప్పాశా" అన్నాడు గడ్డాన్ని గోక్కుంటూ భార్యని ఓరకంట చూస్తూ.


"మంచిపనిచేశారు. ఆ మాత్రం భయం ఉండాలి. లేకపోతే మీ ఫేట్ మారిపోతుంది. ఇదిగోండి మీ మిత్రుడి జాతకం కాగితం. పదవే లోపలికి, టిఫిన్ చేసిపెడతా తిందువుగాని. తాతయ్య స్నానం చేసి వచ్చారో లేదో చూడు. ఆయన్ని టిఫిన్ కి రమ్మను" అని కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.

బిగబట్టుకున్న ఊపిరిని ఒక్కసారిగా వదిలి ‘హమ్మయ్య.. గాలివాన వెలిసింది’ అనుకుని జాతకం కాగితాన్ని పరిశీలనగా చూసాడు.


తన ఇంటర్ క్లాస్ మేట్ సంపత్ కుమార్.

ఒకసారి తన దగ్గరకు వచ్చాడు. నిజానికి అతను అండగాడే. తెల్లటి చాయతో,చక్కటి క్రాఫూ మంచి ఒడ్డూ పొడుగూ ఉంటాడు.


చదువు అంతంతమాత్రం అయినా మంచి మాటకారితనంతో పెద్దవాళ్ళకి సైతం నిలబెట్టి మాట్లాడగలిగేవాడు. మాస్టారు వాడ్ని బతకనేర్చినవాడివిరా. ఏట్లో పడేసినా ఎలాగొలా బతికేస్తావ్ అనేవారు. అటువంటి వాడు ఒకరోజు డీలా పడిపోయి మధు దగ్గరకి వచ్చాడు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడనిపించింది మధుకి. అతనిగురించి కొంత ముందే తెలుసు కాబట్టి కొంత ఊహించాడు. పిచ్చా పాటీ మాట్లాడాక

"వయసైపోతోందిరా.. పెళ్లి చేసుకోవాలి. నువ్వు జాతకాలు చూస్తావుగా. నా జాతకం ఎట్లావుందో చెప్పు. ఎవర్ని పెళ్లిచేసుకుంటే నాకు కలిసొస్తుందో, జీవితంలో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడే అమ్మాయి నా భార్య అవుతుందో లేదో చెప్పు? " అని అడిగాడు.


మొత్తం పరిశీలించి "నీ జాతకంలో కళత్రం(భార్య) చేతిలో మరణం ఉన్నట్టుగా తోస్తోంది. రాబోయే కాలం నీకు గడ్డుకాలం. కొన్ని ఇబ్బందులు తప్పవు. కఠిన పరిస్థితుల్లో సంయమనం పాటించాలి. వివేకాన్ని మేల్కొల్పాలి. ధర్మాన్ని పాటించాలి. అప్పుడే నీకు మంచి జరుగుతుంది."


"అమ్మో, ఏంట్రా భయపెట్టేస్తున్నావ్? అంత ఘోరంగా ఉందా నా జాతకం?శుభం చెప్పరా అంటే చావులూ, విడాకులూ అంటావేరా? ఓ మంచిమాట చెప్పి నా పెళ్లి అయ్యేలా చూడరా?" అన్నాడు కుమార్.


"అయితే ఒక పని చెయ్యి. భర్త పోయిన స్త్రీని చూసి వివాహం చేసుకో. అప్పుడు నీకు ఈ ముప్పు తప్పుతుంది" అన్నాడు మధు.


"విధవా వివాహం చేసుకుంటే ప్రాణ గండం వుండదుగా? నిజమే చెబుతున్నావా?" అన్నాడు కుమార్.


"నిజం చెప్తున్నాను. నీకు అదే కరెక్ట్. కన్యను పెళ్లి చేసుకున్నావో ఇక కష్టాలు నిన్ను వెంటాడతాయి. " అని

గతంలో తను చెప్పినమాట గుర్తొచ్చింది మధుకి.


జాతక చక్రం వేసిచ్చింది కూడా తనే. అప్పుడు కుమార్ తో తను అంత కఠినంగా ఎందుకు చెప్పానా అనుకున్నాడు. కానీ కొన్ని చెప్పక తప్పదు. శాస్త్రం మంచికి ఉపయోగపడాలి అని నమ్మాడు మధు.


అతనికి చెడు జరక్కూడదని తను కోరుకోని రోజులేదు.

ఈ జాతకం ప్రకారం అతనికి పెళ్లయిందో లేదో ?

అయినా ఈ కాగితం ఇక్కడికెలా వచ్చింది?

రజిత తెచ్చిందా? రజితకీ సంపత్ కుమార్ కీ ఏవిటీ సంబంధం? రజిత తప్ప ఎవరూ ఇంటికి రాలేదు. ఇది ఇక్కడికెందుకు తెచ్చింది మరి. భార్య చేతిలో హత్య చేయబడితే వార్తల్లో రావాలిగా? ఎక్కడా వినలేదు.

ఎవ్వరూ అనుకోలేదు. రజిత అసలిక్కడికి ఎందుకొచ్చినట్టు?

ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు మధుని అతలాకుతలం చేస్తున్నాయి. రజితకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలిసిపోతుందిగా.


ఫోన్ తీసి నెంబర్ నొక్కుతుంటే పెద్దకూతురు వచ్చి "నాన్నా! నాకు ఫోన్ ఇవ్వవా? ఆడుకుంటా" అంది. అంది. "ఇప్పుడేగా వచ్చావు. కాస్త ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిన్నాక ఆడుకుందువుగాని. ఇప్పుడు నాక్కాస్త పనుంది. లోపలికి వెళ్ళి చెల్లి ఏం చేస్తోందో చూడు. అమ్మతో గుత్తి వంకాయ, మావిడికాయ పప్పు చెయ్యమని చెప్పు" అన్నాడు మధు.


"పరవాన్నం కూడా కావాలి నాన్నా" అంది.


"అదికూడా చెయ్యమని అమ్మతో చెప్పు. పో... " అన్నాడు. పాప లోపలికి వెళ్ళిపోయింది


బాల్కనీలోకి వెళ్లి ఫోన్ చేశాడు. కాసేపటికి ఫోన్ కలిసింది.

"హలో రజితా! మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉన్నారు?"

" బాగానే వున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను"


"ఒక్క నిమిషం ఆగు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీ ఆయనపేరెంటి?

"---------"

"హలో నిన్నే... మీ ఆయన పేరు?"

"సంపత్ కుమార్"

"అవునా.. వాడు నా ఫ్రెండే. వాడు ఇప్పుడెలావున్నాడు?"

"--------------"

"హలో హలో నిన్నే" ఫోన్ కట్టయ్యింది.

మధుకి తల పగిలిపోయే ఆలోచనలు.


రజిత నా దగ్గరకి ఎందుకొచ్చింది? ఈ కాగితాన్ని ఇక్కడ ఎందుకు వదిలెళ్ళింది.

వాడికి భార్య వలన మరణం అని తెలిసింది నాకొక్కడికే. సంపత్ కుమార్ నెంబర్ కి కాల్ చేసాడు మధు. స్విచ్చాఫ్ అని వచ్చింది.


రజిత ఎందుకో వచ్చి ఏదో చెప్పబోయి ఇంకేదో దాస్తోందనిపించింది.

జాతకం కాగితం వెనక్కి తిప్పి చూసాడు మధు.

'భార్యా గుణవతి శత్రువు' అని రాసుంది.

ఉలిక్కిపడ్డాడు మధు...


సామెతను మార్చి ఎవరు రాసుంటారు?

రజితా? లేక కుమార్ రాసుంటాడా?

కుమార్ కి అంత తెలుగు రాదు. ఇలాంటి తెలివిలేదు. మరి ఎవరు రాసుంటారు? రాసి ఇక్కడకి ఎవరు తెచ్చారు?భార్య రూపవతి శత్రువు అనే నానుడి తెలుసుగానీ ఇదేంటి? రజితకి మళ్లీ ఫోన్ చేసాడు. రింగైనా ఎత్తలేదు.


"మావిడికాయ పప్పు కబురు అందింది. కానీ ఎలా చెయ్యను" సత్య వంటింట్లోంచే అడిగింది.


"కంది పప్పుతో చెయ్యి"

"పప్పు ఉంటే సరిపోయిందా? మావిడికాయ ఎక్కడుంది? మీరు తెచ్చారా?"


"లేదు"

"మరి"

"పోనీ ఆకుకూర పప్పు చెయ్యి. "


"ఆకుకూర పెరట్లో పెంచారా?"

"లేదు"

"మరి?"

" టమాటా చెయ్యి"

"చెట్టు నాకు కనపళ్లేదు?"

“లేదుగా".

"మరి?"

"ఉత్తి పప్పు చెయ్యి".

"అలా అన్నారు బాగుంది".

"గుత్తి వంకాయ?"

"గుత్తి తీసేసి ఉత్తి వంకాయ చెయ్యి. నేను ఇప్పుడే వస్తా"అని గదిలోకి వచ్చి బట్టలు వేసుకున్నాడు.


మధు తండ్రి వచ్చాడు.

"ఏ నాన్నా, ప్రయాణం బాగా జరిగిందా. పిల్లలూ మీరూ బాగా ఎంజాయ్ చేశారా?" అడిగాడు.


"బావుందిరా. నువ్వుకూడా వచ్చిఉంటే ఇంకొన్ని రోజులు ఉండేవాళ్ళం. నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని మీ ఆవిడ కంగారు పడింది. కొత్త ఉద్యోగం కదా. ఒత్తిడిలో సరిగ్గా తినవని సత్య భయం"


"ఈసారి అందరం కలిసి వెళదాంలేండి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. వంట కాగానే సత్య భోజనం పెడుతుంది. నాకోసం చూడకుండా భోజనం చేసి కాసేపు పడుకోండి. నేను ఇప్పుడే బయటకు వెళ్లి వస్తా" అన్నాడు మధు.


"త్వరగా వచ్చెయ్యి"


"సరే నాన్నా, చిన్నమ్మా నేను అరగంటలో వచ్చేస్తానని అమ్మతో చెప్పు" అని బయటకు నడిచాడు మధు.


ఆగష్టు పదిహేడు. తన జీవితంలో పెద్ద మలుపు తిరుగబోతోందని జాతకంలో ఉంది. అయితే అది ఎలాంటి మలుపు? ఇందులో తనకేమన్నా అపాయం రాబోతోందా? ఇదేదో ముందుగా తెలుసుకోవడం వల్ల తనకు రాబోయే ముప్పుని తప్పించుకోవచ్చు.

"ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః

ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః


మనస్సు యొక్క శక్తి చేత నిన్ను నీవు ఉద్దరించుకొనుము, పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు. అతి ఆలోచనలు మాని అసలు విషయం తెలుసుకోవాలని బయలు దేరాడు మధు.


సగం దూరం వచ్చేసరికి ఆ కాగితం ఇంట్లోనే మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. మళ్లీ వెనక్కి తిరిగి వెళితే సత్య కోప్పడుతుంది. తీగ లాగుతుంది. డొంక కదులుతుంది. రజిత వచ్చిన సంగతి తెలుస్తుంది. ఇప్పుడవన్నీ అనవసరం. ముందు రజితని కలుసుకుని అసలు విషయం తెలిస్తే చాలు. మనసులో పడిన ఆలోచనా బీజాన్ని తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచిస్తూ బండిమీద వేగంగా వెళుతున్నాడు మధు. ఎదురుగా వస్తున్న లారీని దగ్గరకొచ్చాక చూసాడు.


వెంటనే తప్పించబోయి పక్కనే వున్న డివైడర్ కి ఢీకొట్టి కింద పడ్డాడు. బండి పక్కకి ఒరిగి పడిపోయింది. బండి మీదనుంచి దూకేయడం వలన మధుకి పెద్దగా దెబ్బలు తగల్లేదు కానీ ఆ ఘటనకి షాక్ తిని రోడ్డు పక్కన కూర్చుండిపోయాడు. అటుగా వెళ్ళేవాళ్ళు ఆగి మధు బండిని పైకి లేపి నిలబెట్టారు. మధుకి తాగేందుకు మంచినీళ్లిచ్చారు కాసేపు అలాగే కూర్చుని లేచి నిలబడ్డాడు. కాలు కొద్దిగా నొప్పి పెట్టినా లెక్కచేయకుండా బండి మీద కూర్చున్నాడు.

వాళ్ళకి థాంక్స్ చెప్పి మళ్లీ హాస్పటల్ కి బయలుదేరాడు.



===================================================

...సశేషం...

===================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







32 views3 comments
bottom of page