top of page

వినిపించని రాగాలు 5


'Vinipinchani Ragalu 5' New Telugu Web Series

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ...

మధు భార్యాపిల్లలు ఊరెళ్ళి ఉంటారు.

ఆ సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.

హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత.

రజిత, గోడకు తగిలించి తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు.


అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది రజిత.


తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న రాజేష్ కష్టాల్లో పడ్డం తెలిసి బాధ పడతాడు మధు.

మధు ఇంటి ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది.


దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు.


వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు.


ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

భార్య చేతికి దొరికిన ఉత్తరం చూసి ఆందోళన పడతాడు మధు.

అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం.

అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.

ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు.

రజితకు కాల్ చేసి, ఆమె భర్త పేరు సంపత్ కుమార్ అని తెలుసుకుంటాడు.

ఆమెను కలవడానికి ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్తాడు.

ఇక వినిపించని రాగాలు ధారావాహిక ఐదవ భాగం చదవండి.


మధు మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో దుశ్శకునంలా అనిపించింది. ఏది ఏమైనా జరిగేదాన్ని నివారించలేం అని సత్య అంటూ ఉంటుంది. కావలసింది కాక తప్పదు.


విధే మనల్ని తీసుకువెళుతుంది. చెయ్యటానికీ, చెయ్యకపోవడానికీ మనం ఎవరం అంటూ వేదాంత తత్వాన్ని గురించి వద్దన్నా చెబుతుంది.

సత్య అమాయకురాలేం కాదు. తనూ చదువుకుంది. ఫిలాసఫీ ఎం ఏ చేసింది.


‘జీవితాన్ని దానిదారిన దాన్ని పోనివ్వాలి. మనం ఎటో తీసుకెళదాం అని ప్రయత్నిస్తే అది పాదరసంలా చేతికి అందదు సరికదా ముక్కలవుతుంది. జీవితాన్ని సరిగా అర్ధం చేసుకుంటూ అది మనకేం చెబుతోందో గమనించాలి’ అంటూ పెద్ద లెక్చర్లిస్తుంది.


"కానీ నా జాతకాల వల్ల ఇంతవరకూ ఎంతమందికి ఎన్ని రకాలుగా మేలు జరిగిందో తెలుసా" అంటే

"అది అలా జరగాలని రాసుంది కాబట్టే జరిగింది. అందులో మీ గొప్పేం లేదు. మహా శివుడికే తప్పని బాధలివి. మీరెలా తప్పిస్తారు. ఉత్తి ట్రాష్" అంటుంది సత్య.


మధు మనసునిండా ఆ కాగితంలోని వాక్యాలు సుడులు తిరుగు తున్నాయి. రజిత వదిలేసిన కుమార్ జాతకం వెనక రాసిన వాక్యాల గురించి ఆలోచించడం, రజిత రాక గురించి, తెలుసుకోవాలని ప్రయత్నించడం మంచిదేనా అని దారిపొడవునా ఆలోచిస్తూనే

హాస్పిటల్ కి చేరుకున్నాడు మధు.


బండి పార్క్ చేసి చుట్టూ చూసాడు. చాలా పెద్ద హాస్పిటల్. రోగులకోసం వచ్చిపోయేవాళ్ళతో హడావిడిగా ఉంది. అవి విజిటింగ్ అవర్స్ కావడం వల్ల ఎక్కువమంది జనం వున్నారు. ఔట్ పేషేంట్ వార్డులోకి నడిచాడు మధు. పెద్ద హాలు. చుట్టూ రూములు. సైలెన్స్ అని రాసుంది. గోడ మీద పెట్టిన బోర్డ్స్. ప్రతి శరీర భాగానికీ ఒక డాక్టర్. వ్యాధి పేరుతో పిలవబడే ఒక బోర్డు.


కార్డియాలజీ, అంకాలజీ ఇలా మనిషి ఆపాదమస్తకం ఎన్ని అవయవాలో అన్ని వ్యాధులు. వాటికో పేరరు. పేరుకో డాక్టరు. వ్యాధి నిర్ధారిత పరీక్షా స్థలాలు. వాటికీ పేర్లు.


ఎక్స్ రే.. ఈ సీ జీ, సిటీ స్కాన్ ఇలా మానవ శరీరాన్ని అంచనా కట్టే ఎన్నో పరికరాల సమాహారం. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు మధు. తెల్ల దుస్తుల్లో నర్సులు అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. స్టెత్ మెడలో వేసుకున్న డాక్టర్లు డ్యూటీలు మారుతున్నారు. స్ట్రెచ్చర్ మీద పేషేంట్లను తీసుకెళుతున్న వార్డు బాయ్స్ పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పక్కనే ఉన్న మందుల షాపు చుట్టూ జనాలు ఈగల్లా మూసిరారు. అక్కడి సిబ్బంది క్షణం ఖాళీ లేకుండా పనిచేస్తున్నా మందులు కొనుక్కుని వెళ్లిన వాళ్ళు వెళ్లగా వచ్చేవాళ్ళ రెట్టింపు సంఖ్యలో వున్నారు.


పేషేంట్స్ బి పి కొలిచి కాగితం మీద రాసి ఇచ్చి పేషేంట్లను వెయిట్ చేయమని చెబుతోంది అక్కడి నర్స్. కర్ర పట్టుకుని అందర్నీ లాఘవంగా తప్పించుకుంటూ ఎప్పటికప్పుడు నేల శుభ్రం చేస్తున్నారు స్వీపింగ్ స్టాఫ్. దగ్గేవాళ్ళు, తుమ్మే వాళ్ళతో ఒక విధమైన వాతావరణం. దానికి తోడు ఘాటైన టించర్, మందులు గలగలిసిన వాసన మెదడులో ఒత్తిడిని పెంచుతున్నాయి.


రిసెప్షన్ దగ్గరకెళ్లి నిలబడ్డాడు మధు.

ఇద్దరు రిసెప్షనిస్టులు బిజీగా వున్నారు. అలాగే నిలబడి కొద్దిసేపు చూసి

"ఎక్సక్యూజ్ మీ"అన్నాడు.


"ఎస్ ప్లీజ్" అని తలపైకెత్తింది తలమీద పఫ్ పెట్టుకుని జడవేసుకున్న అమ్మాయి.


"రజిత అనే అమ్మాయి ఇక్కడకొచ్చిందా?" అడిగాడు.

" రజిత పేషంటా?" అంది లాప్టాప్ లో ఏదో నొక్కుతూ.


"కాదు పేషేంట్ తాలూకు" అన్నాడు.

"పేషేంట్ పేరు?"


"పేరు తెలీదు. ఒక పెద్దాయన్ని చూడ్డానికి ఇక్కడకొచ్చింది"

"పేషేంట్ మీకేమవుతారు?"


"నాకేంకారు. రజితకి పెదనాన్న అవుతారు"

"ఔట్ పేషంటా?"


"కాదనుకుంటా"

"పేషేంట్ ఏ ప్రాబ్లెమ్ తో అడ్మిట్ అయ్యారు"


"అడగలేదు"

"పేషేంట్ పేరు?" మళ్లీ అడిగింది.


" ఏమోమరి తెలీదు అడగలేదు. కానీ రజిత అనే ఆవిడ నిన్న వచ్చింది. కాస్త చూసి చెప్తారా?" అన్నాడు.

"ఏదీ తెలీకుండా ఎలా సార్? వివరాలు సరిగ్గా తెలుసుకుని రండి" అంది రిసెప్షనిస్ట్.


ఏం చెయ్యాలో మధుకి అర్ధం కాలేదు.

రజిత చెప్పింది నిజమేనా. తను కేర్ కే వచ్చిందా? ఇంకెక్కడికైనా వెళ్లిందా? అసలు ఫోన్ ఎందుకెత్తట్లేదు?


వచ్చి వెళ్లిపోలేదుకదా! రాత్రి బస్సుకు కదా వెళతానని చెప్పింది.

నేనసలు ఈ కాగితాన్ని చించి పారేయకుండా రజితని వేతక్కుంటూ ఇక్కడికి రావడం సరైన పనేనా?


ఆలోచిస్తూ హాస్పిటల్ క్యారిడార్ లో తిరుగుతున్నాడు.

రిసెప్షనిస్ట్ మధు వంక అనుమానంతో చూసింది. మధు టెన్షన్ గా అక్కడే తిరుగుతున్నాడు. ఫోన్ తీసి రజితకి చేసాడు. ఆమె ఎత్తకపోవడంతో అసహనంగా ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక ఎవరినన్నా అడుగుదామా అని అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు.


"అదిగో అటు చూడు. అతను నన్నే చూస్తున్నాడు. ఈరోజు ఈ పింక్ శారీలో నువ్వు చాలా బాగున్నావ్ అన్నారే మావారు. ఇతనెవరో నన్ను చూడ్డానికే వచ్చాడు. ఏవేవో పిచ్చి ప్రశ్నలడుగుతూ ఇక్కడే తచ్చాడుతున్నాడు. చూడు" అంది రిసెప్షనిస్ట్ పక్కనున్న అమ్మాయితో. ఆమె కూడా మధు వంక అనుమానంగా చూసింది.


"ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది.

టీ. వీలో నేరాలూ ఘోరాలులో భయపెట్టే న్యూస్ చెబుతుంటాడే అతనిలా లేడూ" అంది.

మధు బిక్కచచ్చిపోయాడు.

ఇంకా ఇక్కడే ఉంటే ఈ అమ్మాయి తనమీద క్రైమ్ కథలూ, ఆ అమ్మాయి సరస కథలూ రాసేస్తారేమో అని భయపడి గబగబా నడుచుకుంటూ బండి దగ్గరకు వెళ్ళాడు మధు.


రజితకి మళ్లీ ఫోన్ చేసాడు. కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది.

ఇక రజితకోసం వెతకడం అనవసరం. ఆ ప్రయత్నాన్ని మానుకోవడమే మంచిది.


ఈ విషయం ఇక్కడితో వదిలేసి తనదారిన తను పోదామనుకున్నాడు. బండి స్టార్ట్ చేసాడు. ఎందుకో హాస్పిటల్ మూడో అంతస్తు గది కిటికీ వైపు చూసాడు. కిటికీ తలుపులు మూస్తూ రజిత కనపడింది.

"రజితా!" అని గట్టిగా అరిచాడు.

ఆమె కిందకు చూసింది. చెయ్యి ఊపుతూ.

"ఆగు వస్తున్నా" అన్నాడు.


"నేను చెప్పలా, వీడు నాకోసమే వచ్చాడని. దొంగవెధవ. మా ఆయనతో చెప్పి తుక్కుతుక్కుగా తాన్నిస్తా" అంది రిసెప్షనిస్ట్.

ఆమె పేరు కూడా రజిత కాబోలు. ఇలా దొరికిపోయానేంటిరా బాబూ అనుకుంటూ లోపలికొచ్చి మూడో అంతస్తుకి చేరుకున్నాడు మధు.

రజిత ఉన్న రూమ్ తలుపు కొట్టాడు.

తలుపు తీసింది.


"హమ్మయ్య నిన్నెలా పట్టుకోవాలో తెలీక ఇందాకట్నుంచీ కారిడార్ లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నా.

ఇంతకీ మీ పెదనాన్నకి ఎలా ఉంది"

"..........."


"నిన్నే.. చెప్పు, ఏదన్నా సమస్యా?"

"............."


"అరె అడుగుతుంటే చెప్పవే. సరే అది పోనీ. మాఇంట్లోఈ జాతకం కాగితం దొరికింది. దీన్ని నువ్వే వదిలేశావు కదూ?"

"అవును"

"ఎందుకు?"

"........"

" మాట్లాడవే? నువ్వు నా ఫ్రెండ్ సంపత్ కుమార్ భార్యవి కదా? "

" అవును"

"ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?"

"ఎందుకు చెప్పాలి?"


"అలా అంటావేంటి? దీనిమీద 'భార్యా శీలవతి శత్రువు' అని రాసింది ఎవరు?"

"నేనే.."


"అంటే దీనర్థం ఏంటి?అసలేంటి ఇదంతా? కుమార్ ఎక్కడున్నాడో అదన్నా చెప్పు." అన్నాడు మధు.

రజిత రూమ్ లోపలికి వెళ్ళింది. మధుకూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఆమె కిటికీ పట్టుకుని బయటకు చూస్తూ నిలబడింది. మధులో అసహనం పెరిగింది.

ఆమె దగ్గరకెళ్లి నిలబడి "ఈ ధర్నాలు ఏంటి? మాట్లాడకుండా సాధింపులెందుకు? ఏదో ఒకటి చెప్పు. చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పు వెళ్లిపోతాను" అన్నాడు కాస్త నిష్ఠూరంగా.


ఆమె కంటివెంట బొట్లుగా నీళ్లు రాలుతున్నాయి.

రూమ్ లో ఒకే బెడ్ ఉంది. బెడ్ చుట్టూ కర్టెన్ వేసుంది. రజిత వచ్చి కర్టెన్ పక్కకి జరిపి "ఇదిగో చూడు. నీ అపూర్వ మిత్రుడు" అని బెడ్ మీద ఉన్న వ్యక్తిని చూపించింది. అతన్ని చూసి ఖిన్నుడయ్యాడు మధు. బెడ్ మీద కుమార్. కృత్రిమ శ్వాస గొట్టాల మధ్య కోమాలో చలన రహితంగా పడి వున్నాడు.


"ఏంటి కుమార్ ఇక్కడ ఈ స్థితిలో ఎందుకున్నాడు? అసలేంటి ఇదంతా? మీ పెదనాన్నని చూడ్డానికి వచ్చానన్నావ్ ఆయనెక్కడ? అసలు వీడికేమైంది? ఎప్పుడు ఎడ్మిట్ అయ్యాడు వీడు?" మధు ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది. రజిత మాత్రం ఉదాసీనంగా నిలబడి చూస్తోంది.


"మాట్లాడవేం? అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావే? నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పిందంతా అబద్ధం కదూ. నువ్వు చెప్పిన మాటలన్నీ బూటకం కదూ. పెదనాన్న అన్నావ్. అనారోగ్యం అన్నావ్. రాత్రికి వెళ్లిపోవాలన్నావ్. ఇక్కడచూస్తే వీడు చావుబతుకుల్లో వున్నాడు. నీ బతుక్కి ఒక్కటంటే ఒక్కటన్నా నిజం చెప్పావా? ఎందుకీ ఆత్మవంచన. " మధు కోపంతో ఊగిపోయాడు.


"అతని స్వయంకృతాపరాధమే అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది" అంది రజిత.


"అంటే? కాస్త అర్ధమయ్యేలా చెప్పొచ్చుగా. ఇంటికి వచ్చావ్. కానీ నీ గురించిన ఒక్క విషయం కూడా బయట పడకుండా జాగ్రత్త పాడ్డావ్. ఎందుకు? దీనంతటివేనకా ఏదో పెద్ధదే ఉంది. అదేంటో చెప్పు. " అన్నాడు మధు.


"నీకేసమాధానం కావాలి నానుంచి?

నీ ఫ్రెండ్ ఈ స్థితిలో ఉండటానికి కారకులు ఎవరనా?

ఆ జాతకం కాగితం గురించా? ముక్కలు ముక్కలైపోయిన నా జీవితం గురించా? నువ్వేం తెలుసుకోవాలి. అంతా అయిపోయాక తెలుసుకుని ఏం చేస్తావ్?"


ఎర్రటి కళ్ళలో ఆక్రోశాన్ని వర్షిస్తూ అడుగుతున్న రజిత మామూలు పరిస్థితుల్లో లేదని అర్ధమైంది. మధు కాస్త నిదానించాడు.

రజితని కుర్చీలో కూర్చోబెట్టాడు. తనూ ఆమెకెదురుగా మరో కుర్చీలో కూర్చుని రజితని శాంత పరచడానికి ప్రయత్నించాడు.


"మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్లిపోయావ్? అదొక్కటే చెప్పు చాలు" అన్నాడు. మెల్లగా ఆమె ఉద్రేకాన్ని అదుపుచేస్తూ.


"నువ్వు చెప్పిన జాతకం నా జీవితాన్ని నాశనం చేసింది. అధోగతిపాలు చేసింది. అని చెప్పటానికి రాలేదు. నీ పరువుని బజారుకి ఈడుద్దామని వచ్చాను. నీలాంటి వాళ్ళవల్ల సమాజానికి చాలా హాని జరుగుతుంది కాబట్టి ఇక జీవితంలో నువ్వు జాతకాలు చెప్పకుండా అసలు సంఘంలో తల ఎత్తుకోకుండా చేద్దామనే వచ్చాను. " అంది రజిత. ఆమె మొహం ఎర్రబడింది. పొంగుకొస్తున్న దుఃఖాశ్రువులను తుడుచుకుంటూ మధువంక కోపంగా చూసింది.


మధు జేబులోంచి కర్చీఫ్ తీసి ఆమెకిచ్చాడు. తీసుకుని విసిరికొట్టింది.

అప్పటిదాకా అసహనంతో ఉన్న మధు ఒక్కసారిగా సావధానంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తెలిసో తెలియకో తనవల్ల ఏదో పెద్ద పొరపాటే జరుగుంటుంది. లేకపోతే రజిత ఇంతలా కుంగుబాటుకు గురవ్వదు. కుమార్ ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటే దానికి కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇలాంటి సమయంలో రజితకి నా సహాయం ఎంతో అవసరం అనుకుంటూ

"కూల్ రజితా... నిదానంగా జరిగిందేవిటో చెప్పు. ఎక్కువ ఉద్రేక పడకు. నీ ఆరోగ్యం పాడవుతుంది. విశ్రాంతిగా కూర్చుని కూల్ గా చెప్పు ప్లీజ్" అన్నాడు మధు.


"నా జీవితానికి విశ్రాంతి ఎక్కడుంది. నువ్వే నీ స్నేహితుడ్ని పక్కతోవ పట్టించావు. నీ మాటల ప్రభావానికి అతడు దాసుడైపోయాడు. అందుకే అతన్ని కాకుంఫా నిన్ను శిక్షించాలని మీ ఇంటికి వచ్చాను. కానీ ఆ పని చెయ్యలేకపోయాను. వచ్చినదారిన తిరిగి వెళ్ళిపోయాను" చెబుతున్న రజిత గుండె అగ్ని పర్వతంలా మండిపోతోందన్న సంగతి ఆమె మొహం చూస్తే అర్ధమవుతోంది.


దెబ్బతిన్న బెబ్బులిలా నరసంహారానికి కాళీ రూపం ఎత్తిన నారిలా.

మధు భ్రుకుటి మూడేసి ఆలోచించాడు.

ఇదెలా సాధ్యం. కుమార్ ని కలిసి చాలా కాలమయ్యింది. తనని నేనెలా ప్రభావితం చేయగలను అనే సందేహం కలిగింది.


"చీమకి కూడా అపకారం చెయ్యని నేను నీకు నష్టం తలపెట్టానా రజితా?! నిజంగా నాకేం తెలీదు. ఒట్టు. నన్ను నమ్ము. వాడూ నేనూ కలిసి కూడా ఎంతో కాలం అయింది. నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావ్. అయినా నా పరువు తీయకుండా వెళ్లిపోయినందుకు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. అసలేంజరిగిందో చెప్పు. నాకు చేతనైన సాయం చేస్తాను" అన్నాడు మధు రెండు చేతులూ జోడిస్తూ.


అటుగా నర్స్ రావడం చూసి కళ్ళు తుడుచుకుని లేచి వెళ్లి గది తలుపు మూసి వచ్చింది. మళ్లీ కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది. మధు ఆమె దగ్గరకు వెళ్లి " వీడికి ఈ పరిస్థితి దాపురించిందేవిటి? నువ్వు మాయింటికి వచ్చి వెళ్లిన కారణం చెప్పు"అన్నాడు.


"నేను వచ్చిన కారణం ఏదైనా తిరిగి వెళ్లిపోవడానికి మాత్రం అక్కడ

మీఇంట్లో నేను చూసిన మీ ఫ్యామిలీ ఫొటోలో వున్న మీనాన్నగారు.

ఆయన ఫోటో చూశాక, ఆయన గురించి పూర్తిగా విన్నాక ఒక నిర్ధారణకు వచ్చాను. ఆ మహనీయుడు. ఆయనకి ఒక్కగానొక్క కొడుకువని, నీ మీదే ఆయన ఆధారపడి బతుకుతున్నారని, చనిపోయిన మీ అమ్మగారిని ఎంతగా మిస్ అవుతున్నారో నా కళ్లారా చూశాక నాలో ఆవేశం చల్లారింది. అతని కొడుక్కి అపకారం చేసి ఆయనకి క్షోభ కలిగించాలని అనుకోలేదు. అందుకే నా ఆలోచన మార్చుకున్నాను. "

"నాన్నగారా? ఆయన నీకు ముందే తెలుసా? మరి నాతో చెప్పలేదే? ఎలా తెలుసు నీకు?"


" దేవుడు కొందరిని ఇతరులకు సాయం చేయడానికే పుట్టిస్తాడేమో. ఆరోజు ఆయనే కనక లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాను.

ఆయన చేసిన మేలుని, నువ్వు చేసిన కీడుని ఎప్పటికీ మర్చిపోలేను. " అంది రజిత కళ్ళు తుడుచుకుంటూ.


"నీ దుఃఖానికి నేను కారణం అయ్యానా? అసలు ఇదెలా జరిగింది. ?"

"కుమార్ కి జాతకం చెప్పావా నువ్వు?"

"ఎప్పుడో చెప్పాను. "

"అదే మా పరిస్థితికి కారణం"


"నేనేం చేశాను?కుమార్ కి నేనేం చెప్పలేదు రజితా. భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకుంటే నీకు మంచిది అని చెప్పానంతే"

"మీ మటుకు మీరు ఏదోటి చెప్పేస్తారు. ఎలా అన్వయించుకోవాలో అర్థంకాని మా మనోవేదన ఎవరికితెలుస్తుంది. తర్వాత జరిగే పరిణామాలు ఊహించలేరు. " అంది రజిత.


"ఒకరికి హాని చెయ్యాలనే ఉద్దేశ్యం నాకేకోశానా లేదు. అసలేంజరిగిందో వివరంగా చెప్పు. "అన్నాడు మధు.

ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది.


రజిత వెళ్లి తలుపు తీసింది. బయట నర్స్ నిలబడి ఉంది. "డాక్టర్ గారు రౌండ్స్ కి వస్తున్నారు. మీరలా తలుపులు బిడాయించుకుంటే ఎలా? తలుపు తెరిచి ఉంచండి" అని చెప్పి వెళ్ళిపోయింది.


===================================================

...సశేషం...

===================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link

Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






34 views0 comments
bottom of page