top of page
Original_edited.jpg

చివరి కోరిక - పార్ట్ 7

#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries

ree

Chivari Korika - Part 7 - New Telugu Web Series Written By Madduri Bindumadhavi Published In manatelugukathalu.com On 26/11/2025

చివరి కోరిక - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన: మద్దూరి బిందుమాధవి 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ:

'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం లో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. మెడికల్ చెకప్స్ లో ఆమె భర్త సత్యానికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలుస్తుంది. సుందరికి ఆసరాగా ఉన్న మరిది విశ్వాన్ని దూరంగా ఉంచమంటారు బంధువులు. 

ఇక చివరి కోరిక - పార్ట్ 7 చదవండి.

పెళ్లికి వెళ్లి..ఉబ్బిన కళ్లతో, చిన్నబుచ్చుకున్న ముఖంతో వచ్చిన సుందరిని చూసిన రజని..


”అక్కయ్యా ఏం జరిగింది. పెళ్ళిలో ఎవరైనా ఏమైనా అన్నారా” అని అడిగి..”అన్నం తిన్నావా” అంటూ గబ గబా కంచం పెట్టే ప్రయత్నంలో పడింది. 


విశ్వం, రజనీ కూడా ఆ పెళ్లికి వెళ్లవలసిందే! విశ్వం ఆఫీసులో ఇన్స్పెక్షన్ పని ఉండి, వదినగారిని పెళ్లి హాలు దగ్గర దింపి తను ఆఫీసుకి వెళ్ళిపోయాడు. రజనికి జ్వరం, తలనొప్పిగా ఉండి ఇంట్లోనే ఉండి పోయింది. రజనీ ఊరడింపుతో కొంత స్థిమిత పడిన సుందరి.. పెళ్లిలో జరిగింది చెప్పి తన మనసులో కలిగిన సందేహాలని బయట పెట్టింది. 

“రోజులు మారాయి, మారుతున్నాయి, ఇంకా మారతాయి కూడా అక్కయ్యా! రుద్ర విషయంలో జరిగినట్టు ..ఒక్కోసారి పసి మనసులో పడిన కొన్ని విష బీజాలు అలాగే ఉండిపోతాయి. వీడికి అవి వయసుతో పాటు చెట్టుగా ఎదిగి ఊడలు దిగాయి. 

నీకు చెప్పెటంతటి దాన్ని కాదు కానీ, నేను చిన్నప్పుడు నేర్చుకున్న భర్తృహరి సుభాషితంలో 


“ప్రసహ్య మణిముద్ధరేనమకరవక్త్ర దంష్ట్రాంతరాత్ 

సముద్రమపి సన్ తరేత్ప్రచల దుర్మి మాలాకులం 

భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ 

నతు ప్రతినివిష్ట మూర్ఖ జయచిత్ర మారాదయేత్” 


అంటే..మొసలి కోరల నడుమ ఉండే మణిని అయినా  బలాత్కారంగా పెకలించి వెలికిదీయవచ్చు. చలిస్తూ ఉండే అలలతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు. కోపంతో బుసకొట్టే పామునైనా పూలదండలతో తలకు చుట్టుకోవచ్చు. కానీ మొండిపట్టు పట్టిన మూర్ఖుడి మనస్సును సమాధాన పరచడం మాత్రం సాధ్యం కాదు అని! 


అలాగే “తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..” అనే పద్యం కూడా మూర్ఖుల గురించి స్పష్టంగా చెప్పింది. 


మనవాడి తీరు చూస్తుంటే నాకు ఈ సుభాషితం గుర్తుకు వచ్చింది. వాడి మూర్ఖత్వాన్ని పట్టించుకోవటం మానేసెయ్యి. 


ఇది చెప్పటం తేలికే కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యం కాదు. వాడు కన్న కొడుకు కాబట్టి నువ్వు అంతగా బాధపడుతున్నావు. నువ్వు బాధపడుతున్నంత  కాలం ప్రపంచము, మనుషులు నిన్ను బాధ పెడుతూనే ఉంటారు.”


“అసలు నీకంటూ ఒక వ్యాపకం ఉండాలి. అప్పుడే ఇవన్నీ పట్టించుకోవటం మానేస్తావు. ‘జీవితంలో కొన్నిసార్లు కొన్నిటిని మార్చుకోవాలి, కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని అంగీకరించాలి, కొన్నిటిని సర్దుకోవాలి..అప్పుడే ప్రశాంతత మిగులుతుంది’ అంటారు పెద్దలు. ఇవన్నీ నీకు తెలియనివి  కాదు. నువ్వు ఉన్న మానసిక స్థితిలో ఇప్పుడు గట్టి సంకల్పం కావాలి.”

“ఇప్పుడు వస్తున్న సాంకేతికత మన లాంటి వాళ్ళకి బోలెడన్ని అవకాశాలు కల్పిస్తోంది. నీకు ల్యాప్ టాప్ లో ఒక బ్లాగ్ తయారు చేసి ఇస్తాను. అందులో నువ్వు చదివిన పుస్తకాల మీద నీ అభిప్రాయాలు రాస్తూ ఉండు. అదివరకు లాగా ఇంగ్లీష్ లో టైప్ చెయ్యక్కరలేదు. ఇంచక్కా తెలుగులో రాయి. అసలు ఇంకా చెప్పాలంటే..నోటితో నువ్వు మాట్లాడుతూ ఉంటే వాయిస్ రికగ్నిషన్ తో అదే టైప్ అయ్యే కృత్రిమ మేధ కూడా అందుబాటులోకి వచ్చింది. 


“మన ఇంటికి దగ్గరలో ఉన్న “శాంతి..మహిళా సేవా సంస్థ” లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో మాట్లాడతాను. అక్కడ చేరి నీకు బాగా వచ్చిన అల్లికలు, ఇతర క్రాఫ్ట్ వర్క్స్ అక్కడి పిల్లలకి నేర్పు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. మన సాహిత్యంలో నువ్వు చదివిన గొప్పవారి జీవిత  విశేషాలు, వ్యక్తిత్వ వికాస కథలని వారికి చెప్పి ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించు. వారికి లోకం పోకడ తెలియజెయ్యి. అసలు ఈ పాటికే నిన్ను అక్కడ చేర్పించవలసింది. ఇంట్లో పిల్లల పెంపకం, అత్తయ్య..మామయ్య వాళ్ళ సేవతో ఇప్పటి వరకు నీకు సమయం దొరకలేదు. ఇంకా ఆలస్యం చేయద్దు. వయసు ఎప్పుడు ఒక అవరోధం కాదు.”


“బావగారు ఉన్నంత కాలం నిన్ను ప్రేమగా, ప్రాణంగా చూసుకున్నారు. ఆ జ్ఞాపకాలు చాలవా నీకు ధైర్యంగా బతకటానికి. నువ్వు అన్ని సౌభాగ్యాలతో బతకాలని ఆయనకోరిక. ప్రాణంగా ప్రేమించిన భర్త చివరి కోరిక తీర్చటం నీ కర్తవ్యం అని మాత్రమే ఆలోచించు.”

  “అన్నట్టు చెప్పటం మర్చిపోయాను..రేపు పార్ధు హాస్టల్ నించి వస్తున్నాడు.


‘సర్ప్రైజ్..పెద్దమ్మకి చెప్పకు’ అన్నాడు. నువ్వు ఇలా బాధ పడుతున్నావని ముందుగా చెప్పేశాను” అన్నది తోటికోడలిని దగ్గరకి హత్తుకుంటూ. 


పార్ధు, అమల విశ్వం పిల్లలు. పెద్దమ్మ అంటే ప్రాణం. చిన్న తనం అంతా తల్లి దగ్గరకంటే..పెద్దమ్మ దగ్గరే ఎక్కువగా గడిపారు. పార్ధు ఇంజనీరింగులో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. అమల ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. 


పార్ధు వస్తున్నాడు అనే వార్త విని సుందరి ముఖంలో కాంతి మళ్లీ తిరిగి వచ్చింది. 

అవును నిజమే..రజని చెప్పినట్టు..తనని అసహ్యించుకుని వద్దనుకునే కన్న కొడుకుని, అతని మూర్ఖత్వాన్ని  తలచుకుని బాధపడటం కంటే తనని ప్రేమించి అక్కున చేర్చుకునే మరిది కుటుంబం, వారి అండ చాలవా నాకు!  శేష జీవితం ప్రశాంతంగా గడిపేయ లేనా!  ఇక ముందు ఇలా తను బాధ పడి వారిని బాధపెట్టకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నది. 

******


“అలా నా కూతురు లాంటి తోటికోడలు రజని ఆలోచనతో ఈ సంస్థలో చేరిన నన్ను మీరు ఎంతో ఆదరణగా చూస్తూ అభిమానిస్తున్నందుకు కృతజ్ఞతలు. నా ప్రస్తుత జీవితం గురించి మీకందరికీ తెలుసు. మనిషికి కష్టం వచ్చినప్పుడే నిబ్బరంగా నిలబడాలి. మట్టి ముద్దని నేలకేసి కొడితే అది నేల మీదే ఉండి పోతుంది. అదే ఒక బంతిని బలంగా నేలకేసి కొడితే రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది. స్త్రీ బంతి లాగా ఉండాలే కానీ, నేలకి కరుచుకునే మట్టి ముద్దగా ఉండకూడదు.”


“ఒక స్త్రీ దురదృష్టవశాత్తు తన మానం కోల్పోతే, ఎవరి వల్ల అది జరిగిందో అతనితోనే వివాహం జరిపించాలనేది ఒకప్పటి పెద్దల ఆలోచన. నలుగురు వేలెత్తి చూపుతారని ఆ స్త్రీ  ఇంటికే పరిమితమై పోయేది.  ఏ ఆత్మహత్యో చేసుకుని జీవితాన్ని అక్కడితో ముగించిన సందర్భాలు కూడా మనకి తెలుసు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. కానీ జీవితం నిరంతరం సాగుతూనే ఉంటుంది..ఉండాలి.” 


“ఇప్పుడు కాలం మారింది. తనది తప్పు కానప్పుడు నలుగురిముందు తలవంచుకుని నిలబడవలసిన అవసరం లేదు. అలాంటిది నిరాధారంగా నిందించే పరిస్థితి వచ్చినప్పుడు.. అది కన్నపిల్లలైనా ఎంత వరకు ఆ మాటలకి విలువ ఇవ్వాలో తెలుసుకోవాలి. ప్రతి మనిషి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. బయటికి వచ్చి నలుగురిలోనూ మసలటం మొదలు పెట్టాక నాకు ఈ విషయాలన్నీ తెలిసి, దృఢంగా తయారయ్యాను.”


“మీరు కూడా మీ చుట్టూ పక్కల ఉన్న నా లాంటి స్త్రీలకి..వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేందుకు అవసరమైన చేయూతనివ్వాలని కోరుతున్నాను. ప్రార్థించే చేతుల కన్నా, విమర్శించే నోళ్ల కన్నా, సహాయం చేసే ఒక నిండు మనసు, ఆసరా ఇచ్చే ఒక చెయ్యి ఎంతో గొప్పవి. నా ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తాను.  నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు” అంటూ వేదిక దిగి వచ్చింది. 


సభ్యుల కరతాళ ధ్వనులతో..సుందరి ఆత్మ విశ్వాసం మరింత పెరిగినట్టనిపించింది.

బిక్కు బిక్కుమంటూ..కళ్ళ నీళ్లతో బేలగా, దిగులుగా ఉండే సుందరిలో వచ్చిన మార్పుకి, పెరిగిన ఆమె ఆత్మ విశ్వాసానికి రజనీ విశ్వంలు మనస్ఫూర్తిగా సంతోషించారు. 


===============================================

                                                సమాప్తం.

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు

మనతెలుగుకథలు.కామ్ తరఫున,

రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారి తరఫున

ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

===============================================


మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree



ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page