top of page

వినిపించని రాగాలు 6


'Vinipinchani Ragalu 6' New Telugu Web Series

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ...

మధు భార్యాపిల్లలు ఊర్లో లేని సమయంలో

అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.

హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత.

రజిత, గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు.

అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది రజిత.

ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

భార్య చేతికి దొరికిన ఉత్తరం చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం.

అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.

ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు.

రజితకు కాల్ చేసి, ఆమె భర్త పేరు సంపత్ కుమార్ అని తెలుసుకుంటాడు.

ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి, రజితను కలుస్తాడు.

అక్కడ బెడ్ మీద అచేతనంగా పడిఉన్న తన స్నేహితుడు కుమార్ ని చూస్తాడు.

తన జీవితం నాశనం కావడానికి కారణం నువ్వేనని మధుని నిందిస్తుంది రజిత.

ఇక వినిపించని రాగాలు ధారావాహిక ఆరవ భాగం చదవండి.


కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు.

అతని వెనకాల పీ జీ స్టూడెంట్స్ కొందరు వున్నారు. వాళ్ళ మెళ్ళో స్టెత్. చేతిలో ఫైల్స్ ఉన్నాయి. నర్స్ కుమార్ బ్రెయిన్ ఎక్సరే ఫిల్మ్ తెచ్చి ఇచ్చింది. డాక్టర్ పైకి పెట్టి చూపిస్తున్నాడు. స్టూడెంట్స్ ఎగబడి చూస్తున్నారు.


"చిన్న మెదడుకి దెబ్బతగలటం వల్ల అది వెనక్కి ఒరిగి మెడుల్లా అబ్లంగేట పై పడటం వల్ల మెదడుకు చేరవేసే నరం కట్ అయింది. దానివల్ల ఒత్తిడి పెరిగి బి పీ ఇంక్రీజ్ అయింది” అంటూ మెడికల్ స్టూడెంట్స్ కి కేస్ వివరిస్తూ చికిత్సా విధానాన్ని ఎక్సప్లైన్ చేస్తున్నాడు.


డాక్టర్ చెబుతుంటే స్టూడెంట్స్ చకచకా నోట్స్ రాసుకున్నారు.

"డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలాఉంది? ఏదైనా ఇంప్రూమెంట్ ఉందా?" అడిగాడు మధు.


"మీరెవరు?" అన్నాడు డాక్టర్.

"పేషేంట్ ఫ్రెండ్ ని. త్వరలోనే కొలుకుంటాడా? మళ్లీ మామూలు మనిషవటానికి ఎన్నాళ్ళు పడుతుంది?" అడిగాడు మధు.


"తల వెనక ఏదో బలమైన దెబ్బ తగలటంవల్ల కోమాలోకి వెళ్ళాడు. ఆపరేషన్ చేశాం. పరిస్థితిని మరో నాలుగురోజులు చూసి మరొక ఆపరేషన్ చేయాల్సొస్తుంది. చూద్దాం. " చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని వెనకాలే అందరూ వెళ్లిపోయారు.


మధు రజిత వంక చూసాడు. ఆమె కుమార్ వంక చూస్తోంది. మధు కుర్చీలో కూర్చున్నాడు. రజిత కూడా వచ్చి కూర్చుంది.

"తల వెనక దెబ్బ ఎలా తగిలింది? యాక్సిడెంట్ జరిగిందా?"


" ఇనపరాడ్డుతో కొట్టడం వలన కోమాలోకి వెళ్ళిపోయాడు. "

"ఓ మై గాడ్. ఎవరు కొట్టారు? ఎందుకు?"


దీర్ఘంగా నిట్టూర్చింది రజిత. చెప్పడం మొదలుపెట్టింది.

****

కుమార్ మా పక్కింటి అబ్బాయి. చిన్నప్పటినుంచీ కలిసి పెరిగాం. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు.


ఒకసారి మా అమ్మకి టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు మా నాన్న క్యాంప్ లో వున్నారు. నేనూ మా అమ్మా ఇద్దరమే ఉన్నాం. నాకప్పుడు పద్నాలుగేళ్ళుంటాయి. మా అమ్మ మూసిన కన్ను ఎరక్కుండా మూడురోజులు మంచం మీద ఉంది.

మా తాతయ్యా వాళ్ళకి ఫోన్ చేసి అమ్మకి జ్వరంగా వుంది. నాన్నకూడా లేరు. నాకు భయంగా ఉంది ఇక్కడికి రమ్మన్నాను. అమ్మమ్మ వచ్చింది. అమ్మని డాక్టర్ కి చూపించాం. హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యమన్నారు. మూడు రోజులు ఉండాలన్నారు.


అప్పుడు అమ్మమ్మ చెప్పింది. తాతయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.

మందులు వేసుకుంటూ బాగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాట్ట. తాతయ్యని అత్తయ్యకి అప్పజెప్పి వచ్చిందట అమ్మమ్మ.


అమ్మకి జ్వరంగా ఉందని తాతయ్యతో చెప్పలేదుట. చెబితే కంగారుపడి హార్ట్ బీట్ పెరుగుతుందని భయపడింది. అప్పుడు కుమార్ వాళ్ళ పేరెంట్స్ మేం చూసుకుంటాం మీరు వెళ్లి ఆయన ఆరోగ్యం సంగతి చూసుకోండి అని చెప్పి అమ్మమ్మని ఊరికి పంపించేశారుట. అమ్మని వారం రోజులపాటు హాస్పిటల్ లో ఉంచాల్సొచ్చింది. అన్ని రోజులూ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని ఆదుకున్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేదాకా వాళ్లే మమ్మల్ని చూసుకున్నారు.


నాన్న వచ్చేదాకా వాళ్ళింట్లోనే మాకు భోజనం పెట్టారు. నాన్న వచ్చాక విషయం తెలుసుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు.


సమయానికి మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. అన్నారుట. కుమార్ వాళ్ళ నాన్న ఇప్పటి మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుందని అన్నారుట.


పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ ఉద్దేశ్యం కూడా అదే అయితే మనకేం అభ్యంతరం లేదని అన్నారు నాన్న. అప్పటికి మేం ఇద్దరం ఇంకా చిన్న వాళ్ళం కాబట్టి ఆ మాటలు అక్కడితో ఆగిపోయాయి. కానీ అవి నా మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోయాయి.


మేమిద్దరం కలిసి ఆడుకునే ప్రతి ఆటలో కావాలని నేనే ఓడిపోయేదాన్ని. కొంచెం పెద్దయ్యాక అతనికిష్టమైన వంటలు నేర్చుకుని వండి తీసుకెళ్లి తినిపించేదాన్ని.

నేనంటే ఇద్దరం అనే భావన బలపడిన వయసులో అతని అభిరుచినిబట్టి అలంకరించుకునేదాన్ని. అతని మెచ్చుకోలు మాటకోసం ఎదురుచూసేదాన్ని. మా రెండు కుటుంబాల చిరకాల స్నేహం వలన మా పెళ్లికి ఎటువంటి అభ్యంతరం వుండదనుకున్నాను. అందుకే అతనిపై గాఢమైన అనురాగం పెంచుకున్నాను. ఇద్దరం బాగా చదువుకుని,ఉద్యోగాలు వచ్చాక పెళ్లిచేసుకుంటే బాగుంటుంది అన్నాను నేను.


అందుకు కుమార్ కూడా ఒప్పుకున్నాడు. నేను కాలేజ్ లో చేరాను. అతను కాకినాడ కాలేజీలో చేరాడు. సెలవులు ఇచ్చినప్పుడు ఇద్దరం ఇళ్ళకి వచ్చేవాళ్ళం. నేను మాత్రం కుమార్ కోసమే వచ్చేదాన్ని. అక్కడ

ఉన్నన్నాళ్ళూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం కలిసి భోoచేసేవాళ్ళం. రోజులు క్షణాల్లా గడిచిపోయేవి.


నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. కుమార్ కి ఇంకా రాలేదు. అయినా ఇద్దరిలో ఒకరికి వచ్చింది కాబట్టి మా పెళ్లికి ఏ అభ్యంతరాలూ ఉండవు అనుకున్నాను.

నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. జీతం ఇంటికి పంపిస్తున్నాను.


ఒకరోజు అమ్మ నాతో అంది. నాన్నగారు నీకు వేరే పెళ్లిసంబంధాలు చూస్తున్నారని. త్వరలో నా పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తున్నారని.


అదేంటి మా చిన్నప్పుడు మీరనుకున్న మాటలు మర్చిపోయారా? కుమార్ వాళ్ళ నాన్న గారికి మీరు మాటిచ్చారుగా అన్నాను. నీకు ఉద్యోగం వచ్చింది. కుమార్ కి ఉద్యోగం లేదు సరికదా రెండు సబ్జెక్టుస్బలో బ్యాక్ లాగ్స్ కూడా ఉన్నాయి. అన్నీ పూర్తిచేదెప్పుడు? ఉద్యోగం సంపాదించేదెప్పుడు? అదీగాక కుమారే అన్నాట్ట. రజితకి వేరే సంబంధాలు చూసుకోమని. వాళ్ళమ్మ చెప్పింది. ఎందుకూ అని నేను అడగలేదు. ‘ఏం జరిగినా మన మంచికేనని ఊరుకున్నాను’ అంది అమ్మ.


కుమార్ నాకు వేరే సంబంధం చూసుకోమన్నాడంటే నమ్మలేకపోయాను. కుమార్ దగ్గరకి వెళ్ళాను. నన్ను చూసి తలదించుకున్నాడు. మునపటిలా నన్ను చూడగానే కనిపించే ఉత్సాహం లేదు.

అతని మొహంలో విషాద ఛాయలు ఎందుకో నాకర్ధం కాకేదు. నాలోని అలజడిని తెలియజెప్పాలనే నా ప్రయత్నమంతా.

"నీకు నేనంటే నీకు ఇష్టంలేదా?"' అని అడిగాను.


అకస్మాత్తుగా నేనలా అడుగుతానని అనుకోలేదు కుమార్.

ముందు కాస్త తడబడ్డాడు. తర్వాత తేరుకుని

"చిన్నప్పటినుంచీ నువ్వంటే ఇష్టమే. కానీ ఇంతగా ప్రేమించిన అమ్మాయిని విధవని చెయ్యడం ఇష్టం లేదు. అసలు నాకు పెళ్లే వద్దు. నేనెవర్నీ చేసుకోను. నువ్వు వేరొకర్ని పెళ్లిచేసుకుని హాయిగా ఉండు" అన్నాడు.


"అదేంటి? నిన్ను పెళ్లి చేసుకుంటే అశుభం జరుగుతుందని నీతో ఎవరు చెప్పారు? అలాంటివన్నీ నమ్మకు. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు అన్న మాటల్ని నువ్వు మర్చిపోయావేమోగానీ నేనసలు మర్చిపోలేదు. నిన్ను కాదని వేరొకర్ని ఎలా పెళ్లి చేసుకుంటాను. మీ ఇంట్లో నువ్వు మాట్లాడు. మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. " అన్నాను.


"నాకు ఉద్యోగం వచ్చాక రజితను పెళ్లి చేసుకుంటానని ఇంట్లోవాళ్ళతో చెప్పి చూసాను. వాళ్ళు ఈ పెళ్లి వద్దన్నారు.

నా జాతకంలో ఏదో గండం వుందిట. నావల్ల నీకేం కాకూడదనే మా అందరి భయం" అన్నాడు కుమార్.


"అవునా అది ఇటువంటి ప్రమాదం? నేను మీ అమ్మగారితో మాట్లాడతాను" అన్నాను.


"వద్దు వద్దు. అలాంటి ప్రయత్నాలేం చెయ్యొద్దు. వాళ్ళని ఆ విషయంలో కదిపావంటే చాలా బాధపడతారు. నాగురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇప్పటికే చాలా దిగులుగా వున్నారు. ఇంకా ఇబ్బంది పెట్టలేను. వాళ్లెలా చెబితే అలా చేస్తాను. వాళ్ళకి కనీస ఆనందాన్ని ఇవ్వడం నా బాధ్యత. నన్నర్ధం చేసుకో. వేరే వ్యక్తిని పెళ్లిచేసుకో ' అన్నాడు.


"నువ్వుండగా నేనెలా విధవనవుతా? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ? ఇలాంటి విశ్వాసాలు ఈ కాలంలో కూడా ఉన్నాయా?" ఆశ్చర్యంగా అడిగాను నేను.


"ఒక జాతక కర్త అలానే చెప్పాడు. నా వల్ల నీ జీవితం పాడవకూడదు. నువ్వు బాగుండాలంటే నా నుంచి దూరంగా ఉండాలి" అన్నాడు.


"అదేంటి కుమార్! ఎక్కడో వున్న ఎవరో నీ ద్వారా నా జీవితాన్ని కూడా ఇలా బ్లాక్ చేస్తున్నారంటే నమ్మలేక పోతున్నాను. జాతకాలు అంత పవర్ఫుల్ గా ఉంటాయా?"


" మరి! చెప్పిందెవరనుకున్నావ్, ప్రముఖ ఆస్ట్రాలజర్ ద గ్రేట్ మధుసూదన రావు. గురితప్పని బాణం. అతను ఈ విద్యలో పండిపోయాడు"అన్నాడు.


"నువ్వంత ఖచ్చితంగా చెప్తున్నావంటే నాకూ నమ్మాలనిపిస్తోంది. నీకు నష్టం జరగడం నాకిష్టం లేదు. నేనూ అసలు పెళ్లే చేసుకోను" అన్నాను.

పెళ్లికి వేసిన మొదటి అడుగులోనే ఇన్ని చిక్కుముడులుంటే అది అసలు పొసగదు అని అప్పుడర్ధం కాలేదునాకు.


కొన్నాళ్ళు ఇద్దరం కలుసుకోలేదు. ఎవరిదారిన వాళ్ళం ఉన్నాం.


నేను బెంగుళూర్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాను.

కొన్నాళ్ళ తర్వాత కుమార్ నాదగ్గరకొచ్చి "మనం పెళ్లి చేసుకుందామా రజితా?" అన్నాడు.

నాలో ఆశ్చర్యం సందేహం భయం కలగలిసినాయి.

'మరి ఆ జాతకం?' అన్నాను.


'మనం కాస్త రిస్క్ చేయాలి. దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకువెళదాం. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే ఇది జరిగుతుంది ' అన్నాడు.


'ఏంటో చెప్పు. నీకోసం ఏదైనా చేస్తాను' అన్నాను.

'నువ్వు వెంటనే ఎవరినన్నా పెళ్లి చేసుకో. "అన్నాడు.


"మనం పెళ్లి చేసుకుందాం అన్నావ్? ఇప్పుడు ఇలా అంటున్నావ్? గతంలో మనం అనుకున్నదేగా కొత్తగా ఏముంది. "అన్నాను.


"చెప్పేది పూర్తిగా విను. నో అని చెప్పేముందు బాగా ఆలోచించుకో.

ఇది ఉత్తుత్తి పెళ్లి. వేరొకరితో తాళి కట్టించుకో. మెళ్ళో తాళి పడగానే ఆ తాళి తీసేసి అతన్ని వదిలేసి నాదగ్గరకు వచ్చెయ్యి. నువ్వు రెండోపెళ్లి స్త్రీ వి అవుతావు కాబట్టి నిన్ను పెళ్లిచేసుకున్నా నాకు ప్రాణగండం ఉండదు' అన్నాడు.


'ఇది కూడా ఆ మధు వెధవే చెప్పాడా? ఇలాంటి రాక్షస సలహాలు చెప్పేవాళ్ళకి బుద్ధిలేకపోతే నీకుండద్దా? ఒకసారి సంప్రదాయబద్ధంగా పెళ్లైపోతే విడిపోవడం అసంభవం. అది నా ఆత్మ సాక్షికి విరుద్ధం. ఈ ఉత్తుత్తి పెళ్లిళ్ల ఆలోచన మానుకో' అన్నాను.


'మన పెళ్లి కావాలంటే మరో దారి లేదు. బాగా ఆలోచించుకుని చెప్పు' అన్నాడు.


పెళ్లంటే ఇద్దరు మనుషులతో పాటు రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలు ముడిపడి ఉంటాయి. నా స్వార్ధంకోసం నా మెళ్ళో తాళికట్టిన వ్యక్తిని నమ్మించి మోసం చెయ్యలేదు. అంత దారుణానికి పూనుకోలేను.


ఎలాంటి అనైతిక చర్యకీ పాల్పడనని తెగేసి చెప్పేసాను.

కుమార్ నన్ను బతిమాలాడు.


‘ఇక మనిద్దరి పెళ్లి గురించి మర్చిపో. లేకపోతే మీ అమ్మా నాన్నతో నువ్వంటున్న ఈ దొంగ పెళ్లి గురించి చెప్పేస్తాను’ అన్నాను.


చెప్పొద్దని బతిమాలాడు. మనకి ఇదితప్ప వేరే దారి లేదని ఖరాఖండిగా చెప్పేసాడు.

అయినా నేను ఒప్పుకోలేదు.


‘ఇదేంటి కుమార్. ఇలా ఎక్కడన్నా ఉంటుందా? ఏవోఅనుకోని పరిస్థితుల కారణంగా విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం వేరు. కావాలని మనసులో దుర్భుద్ధితో పెళ్లి పీటలమీద కూర్చోవడంకన్నా పెద్ద పాపం ఉంటుందా? మనం ఎవరికీ తలవంచకపోయినా ఫర్వాలేదు. అంతరాత్మ ముందు దోషిగా ఉండకూడదు’ అన్నాను.


ఇద్దరిమధ్యా బేధాభిప్రాయ మేఘాలు కమ్ముకున్నాయి.

కుమార్ మన పెళ్లి సంగతి మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లి కాకపోయినా ఫర్వాలేదుగానీ ఎలాంటి తప్పుడు దోవలు ఎంచుకోకూడదు అనుకున్నాను.


నాకు పెళ్లిమీద ఆసక్తి చచ్చిపోయింది.

ఉద్యోగం చేసుకుంటూ నేనిలాగే ఉండిపోతాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోమన్నాను.

వచ్చే ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను. ధర్మ పోరాటంలో ఓటమి ఎదురైనా అది విజయంగా భావిస్తాను అని చెప్పాను.

నా మాటలు కుమార్ కి రుచించినట్టులేవు.

చాలా రోజులు నాకు కనపడలేదు.

నేనూ అతన్ని కలుసుకోవాలనుకోలేదు.


కొన్నాళ్ళతర్వాత కుమార్ మళ్లీ నాదగ్గరకొచ్చాడు.

'ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. మన పెళ్లిని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్కటవుదాం. ఆపై ఏదైతే అదవుతుంది' అన్నాడు.


‘ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడకుండా నిలబడతావా?’ అని అడిగాను.

"ఏం చెయ్యాలి" అన్నాను.


‘నువ్వేం ఆలోచించకుండా నేను చెప్పినట్టు చెయ్యి. మన పెళ్లికి ఒప్పుకో చాలు. అంతా నేను చూసుకుంటాను’ అన్నాడు.


నేను కుమార్ మనస్తత్వం గురించి ఇంకా ఆలోచిస్తూ అప్పుడేఒక నిర్ణయానికి రాలేకపోయాను.


కానీ మా ఇంట్లో వాళ్ళు నాపై ఒత్తిడి తెచ్చారు. కుమార్ మా నాన్నతో స్వయంగా మా పెళ్లి గురించి మాట్లాడాడు. అందరూ చర్చించుకున్నాకే ఆ ప్రపోజల్ నాదగ్గరకు వచ్చింది. "కుమార్ నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నానని నాతో చెప్పాడు. వాళ్ళ కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం. రుణం తీర్చడం కోసం కాకపోయినా నీకూ అతనంటే ఇష్టమే అని అమ్మ చెప్పింది. కానీ అతనికి ఇంకా ఉద్యోగం లేదనే ఒక్క లోటు తప్ప అతను బంగారం లాంటి కుర్రాడు కదమ్మా" అన్నారు నాన్న. ఏమనాలో నాకు తెలీలేదు. మనిషి మంచి చెడులు ఆ పరిస్థితులు వచ్చినపుడే బయటపడతాయి.

నేను పూర్తి స్పష్టతకు రాకముందే కుమార్ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. రెండు కుటుంబాలకు సంబంధించిన పనులూ కుమారే దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఎంగేజ్మెంట్ కి పురోహితుడ్ని మాట్లాడ్డం, బంధువుల పిలుపులు, క్యాటరింగ్ పనుల్లో కుమార్ చాలా చురుగ్గా ఉంటూ నాన్నకి కుడిభుజంలా వున్నాడు. నాన్నకి కొడుకు లేని లోటు కుమార్ వల్ల తీరబోతోందని కొంత నమ్మకం కలిగింది నాకు.


ఎన్నో రోజుల నా సందిగ్ధానికి తెరపడింది.

నేనూ నా పూర్తి సమ్మతిని తెలిపాను. చీరల షాపింగ్ దగ్గర్నుంచి షామియానాల దాకా కుమార్, అతని స్నేహితులూ కలిసి చాలా ఉత్సాహంగా పనుల్లో పాలుపంచుకుంటున్నారు. రెండు కుటుంబాలవారి పెట్టుపోతలు, ఆచార వ్యవహారాలకు తగ్గట్టు కొనుగోళ్లు కలిసే చేస్తున్నారు. వాళ్ళందరి సంతోషం చూస్తూ

నా చిన్ననాటి కల నెరవేరబోతోందని సంతోషిస్తూ నిశ్చయ తాంబూలాల కార్యక్రమంలో ముస్తాబై కూర్చున్నాను.

దగ్గర బంధువులు, పురోహితులవారు వచ్చి కావలసిన సరంజామా తీసుకొచ్చి ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్ తల్లి దండ్రులు, వాళ్ళవైపు బంధువులు వచ్చారు. కుమార్ మాత్రం రాలేదు.


"అదేంటి బావగారూ ఇంకా అబ్బాయి రాలేదు? ముహూర్త సమయానికి ఇద్దరితో ఉంగరాలు మార్పించాలికదా" అన్నారు నాన్న.


"క్షమించండి బావగారూ, మా పద్ధతి ప్రకారం పెళ్లి కుమారుడు నిశ్చయ తాంబూలాలకి రాకూడదు. మేము మాత్రమే వచ్చి పిల్లని ప్రదానం చేసుకోవాలి. ఇది మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన మాట. ఆ విధంగానే మా ఇంట్లో మా అందరి పెళ్లిళ్లు జరిగాయి. మీరు కాదు కూడదంటే మాత్రం ఇప్పుడే పిలిపిస్తాను. కాకపోతే సంప్రదాయాన్ని తప్పామని మా వాళ్ళందరూ మమ్మల్ని తప్పుపడతారు. అయినా ఫర్వాలేదులేండి. అబ్బాయిని పిలిపిస్తాం" అన్నారు.


"అయ్యో వద్దండీ.. పెద్దలు పెట్టిన ఆచారాన్ని మనం పాటించి తీరాలి. ఈకాలంలో అమ్మాయి, అబ్బాయిలను ఎదురెదురుగా కూర్చోబెట్టి తాంబూలాలు పుచ్చుకుంటున్నారుగానీ పూర్వ కాలంలో ఇలా లేదు. మన పిల్లలకు పూర్వకాలం పద్ధతిలోనే పెళ్లి జరిపిద్దాం. వాళ్లిద్దరూ సుఖంగా ఉండటం కంటే మనకేం కావాలి చెప్పండి" అన్నారు నాన్న.


కుమార్ లేకుండానే తాంబూలాల కార్యక్రమం ముగిసింది. భోజనాల వేళకు కుమార్ వచ్చాడు. మా అందర్నీ ఫోటోలు తీసాడు. "మరో నెలరోజుల్లో మన పెళ్లి ముహూర్తం తెలుసా?" అన్నాను.


"ఆ ముహూర్తం పెట్టించింది కూడా నేనేగా. ఇంకాస్త ముందు పెట్టిస్తే బాగుండేది కదా. "అన్నాడు. మా మనసులతో పాటు మా జీవితాలు కూడా ముడిపడబోతున్నాయని మురిసిపోయాను.

=============================

...సశేషం...

=============================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.25 views0 comments

Comments


bottom of page