top of page

వినిపించని రాగాలు 7


'Vinipinchani Ragalu 7' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ.. .


మధు భార్యాపిల్లలు ఊర్లో లేని సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.

హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత.

రజిత, గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది.


ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

భార్య చేతికి దొరికిన ఉత్తరం చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం. అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.


ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు. రజితకు కాల్ చేసి, ఆమె భర్త పేరు సంపత్ కుమార్ అని తెలుసుకుంటాడు.


ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి, రజితను కలుస్తాడు.


అక్కడ బెడ్ మీద అచేతనంగా పడిఉన్న తన స్నేహితుడు కుమార్ ని చూస్తాడు.


తన జీవితం నాశనం కావడానికి కారణం నువ్వేనని మధుని నిందిస్తుంది రజిత.

జరిగిన కథను అతనికి ఇలా వివరిస్తుంది.


ఇక వినిపించని రాగాలు ధారావాహిక ఏడవ భాగం చదవండి.

మా పెళ్లి ముహూర్తం రాత్రి రెండింటికి. కుమార్ తరపు బంధువులు వచ్చారు. అతని స్నేహితులను కూడా పిలిచాడు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తరపు పెద్దవాళ్లు కూడా వచ్చారు. పెళ్లి పందిరి మా పెద్ద పెరట్లో ఏర్పాటుచేశారు. మొక్కలన్నీ పీకి చదును చేసి ఎత్తైన మండపం నిర్మించారు. అదంతా పూలతో అలంకరించారు.


వచ్చినవాళ్ళందరికీ విడిది మా చుట్టు పక్కల వాళ్ళ ఇళ్లలో ఏర్పాటు చేశారు. ఉదయం నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. ఆరోజు భోజనాల దగ్గర అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి భోజనం చేసిన అందరూ దాదాపు ఆస్వస్తులయ్యారు. ఏమైందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. భోజనం తిన్నవాళ్ళంతా దాదాపుగా వికారం వాంతులాంటి వాటితో చాలా బాధపడ్డారు. కొందరు ముసలివాళ్ళని హాస్పిటల్ లో చేర్చారు. నేనూ, నాతో పాటు కుమార్, మా అమ్మా నాన్నా, వాళ్ళ అమ్మా నాన్నా తప్ప అందరూ ఆ భోజనాన్ని తిన్నారు. తలతిప్పు వికారంతో చాలా మంది విడిదిలో ఉండిపోయారు. పెళ్లి మంటపం దగ్గర ఉన్నవాళ్లు కుమార్ స్నేహితులు, కొద్దిమంది ముఖ్యమైన బంధువులు మాత్రమే. అలా జరిగినందుకు నాన్న చాలా భయపడ్డారు. వీళ్ళలో ఎవరికన్నా జరగరానిదేదైనా జరిగితే అప్రతిష్ట అని ఆందోళనలో వున్నారు. పక్కూరునుంచి వంటవాళ్లను పిలిపించి, పెరట్లో గాడిపొయ్యి తవ్వించి శుభ్రంగా వంటలు చేయించారు. కానీ ఇలా ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. నాన్న భయపడుతుంటే కుమార్ వాళ్ళ నాన్న వచ్చి

"ఇదంతా యాదృచ్చికంగా జరిగింది. మన వైపు నీళ్లు వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి కాస్త అజీర్తి చేసుంటుంది. మీరేం కంగారు పడకండి బావగారూ. అంతా సర్దుకుంటుంది" అని నచ్చచెప్పారు. అయినా నాన్న మనసు ఏదో కీడు శంకిస్తూనేవుంది. అమ్మ కూడా దిగులుగానే ఉంది. హాస్పటల్ లో చేరిన వాళ్ళ కోసం తోడుగా ఇంకొంతమంది వెళ్లి ఉండిపోయారు.


కొందరు విడిదిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ముహూర్త సమయం సమీపించింది. భజంత్రీలు మోగుతున్నాయి. పౌరోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.


మంటపంలోకి పెళ్లి కొడుకు వచ్చాడు. వరపూజ అవుతోంది. ఇంతలో పెద్దగా అరుపులు వినిపించాయి.. 'మెయిన్ ఆపండి.. . మెయిన్ ఆపండి' అని. ఎవరో గభాల్న కరెంట్ మెయిన్ ఆపేశారు. పెళ్లి ఇల్లు మొత్తం చీకటి. పెళ్ళికొచ్చిన కుమార్ స్నేహితుడి తాలూకు ఒక మూసలాయన గోడకి వేలాడుతున్న సీరియల్ లైట్స్ వైర్ మీద చెయ్యి వేసాడు. అది షాక్ కొట్టింది. దాని వైర్ అతని వేలు లోపలికి గుచ్చుకుంది. అది కొద్దిసేపు వదిలి పెట్టలేదు. అతను గిలాగిలా కొట్టుకుంటున్నాడు. ఎవరో అతన్ని పట్టుకుని పక్కకు లాగబోయారు. వాళ్ళకీ షాక్ కొట్టింది.


అంతే కాదు గోడలు, తలుపులు కిటికీలు ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోంది. మెయిన్ ఆపేశారు. వైరు పట్టుకున్నాయన ఎగిరి దూరంగా పడ్డాడు. ఏడుపులు గగ్గోళ్ళు.

అతన్ని హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఎవరికీ మనసు మనసులోలేదు. పెద్దాయనకి ఎలా ఉంటుందా అనిభయం.


కరెంట్ వాళ్ళని పిలుచుకొచ్చి వైరింగ్ చెక్ చేయించారు. ఎర్త్ వైర్ కి కరెంట్ వైర్ తగిలి కరెంట్ ఇల్లంతా పాకింది. దాన్ని సరిచేయించారు. మళ్లీ లైట్లు వెలిగాయి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంత విపరీతం ఎవరి పెళ్లిలోనూ జరగలేదని కధలు కధలుగా చెప్పుకున్నారు. పెళ్లి ముహూర్తానికి మండపం ఖాళీ. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువుల జాడలేదు.


ఆస్వస్తులైన వారి సేవల్లో అందరూ ఎంగేజ్ అయ్యారు.

మంటపం మీద మాత్రం మా ఇద్దరి కుటుంబాలతో పాటు కుమార్ స్నేహితులు మాత్రమే మిగిలాము. మాలో ఎవరి మొహంలో పెళ్లి జరుగుతోందన్న ఆనందం మచ్చుకైనా లేదు. హాస్పటల్ లో ఉన్నవాళ్ళందరూ ఎలా ఉన్నారో అని ఒకపక్క బాధ. ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యం. పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిపించెయ్యాలని నాన్నపడే ఆరాటం చూస్తుంటే నాకు బాధేసింది. ఈ పెళ్లి వాయిదా వేద్దామా అని నాకు అనిపించింది. ఇన్ని అపశకునాలు ఒకేసారి జరగడం దేనికో సంకేతంలా అనిపించింది.


కానీ నాన్న అలా జరగడానికి ఒప్పుకోరు. ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడం అందులోనూ ఇన్ని అశుభాలు జరిగాయని ఆపేస్తే నామీద నింద పడుతుందని నాన్న భయం. మా ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్కలేదు. పెళ్లి తంతు జరిపిస్తున్న బ్రాహ్మడు కూడా తనకెప్పుడు ఏమవుతుందో అని భయం గానే మంత్రాలు చదువుతున్నాడు. పీటల మీద కూర్చున్న మా వెనకాల కుమార్ స్నేహితులు మాకు ధైర్యం చెబుతూ నిలబడ్డారు. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళలో కూడా ఒకరిద్దరు వాయిద్యాలు పక్కనపెట్టి పొట్ట పట్టుకుని వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు ఏదో తూతూగా వాయిస్తున్నారు. కన్య ధార పొసే సమయం వచ్చింది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి కుమార్ వాళ్ళ నాన్న చెవిలో ఏదో చెప్పాడు. "అవునా, అలాగా. ఇప్పుడే వస్తున్నా" అని ఆయన లేచాడు.


"ఏవైంది బావగారూ" అంటూ నాన్న కూడా పీటల మీదనుంచి లేచారు. "ఏం లేదు బావగారూ. మీరు కానీయండి. నేను ఇప్పుడే వస్తాను. " అని చెప్పి వెళ్ళిపోయాడు. మా అందరి మతులూ పోయినట్టయింది. కుమార్ వాళ్ళమ్మ కూడా ఏడుస్తూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఇంత జరుగుతున్నా ఈ పెళ్లి ఆపరెందుకని?అవతల ప్రాణాల మీదకి వచ్చినా మేం పీటల మీదనుంచి లేవకూడదా?


ప్రకృతి సహకరించట్లేదంటే ఏదో సూచన ఇస్తోందన్నమాటేగా.

నాన్న వంక నిస్సహాయంగా చూసాను.


"నువ్వేం బాధపడకు తల్లీ. ఎవరికీ ఏం కాదు. మనం నమ్మిన భగవంతుడు ఎవరికీ ఏ అన్యాయం చెయ్యడు. నువ్వు ప్రశాంతమైన మనసుతో ఉండు. " అంటూ ధైర్యం చెప్పాడు.


కుమార్ కూడా మొహం ఎత్తకుండా పీటలమీద కూర్చున్నాడు. " ముహూర్త సమయం వచ్చేస్తోంది. నువ్వు మనసులో ఏ దిగులూ పెట్టుకోకుండా ఆ భగవంతుడ్ని తలుచుకుంటూ మాంగళ్య ధారణ చెయ్యి. ఇది మీ నూరేళ్ళ జీవితానికి సంబంధించినది. అంతా మంచే జరుగుతుందని నా మనసు చెప్తోంది. నువ్వు ప్రశాంతంగా ఉండు" అని కుమార్ కి దైర్యం చెప్పారు నాన్న.


మంటపంలో కూర్చున్న మిగిలిన ఇద్దరు ముగ్గురు పెళ్లి పెద్దలు కళ్ళు తుడుచుకుంటూ మెల్లిగా అక్కడనుంచి వెళ్లిపోయారు. ఏదో ఘోరం జరిగింది. ఇలాంటి సమయంలో చెప్పలేక అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక కొద్ధి క్షణాల్లో కూతురి మెడలో పడబోయే తాళిని ఆపడం ఇష్టంలేదు నాన్నకి. కాసేపట్లో ఈ శుభకార్యం అయిపోతుంది. అప్పుడు మిగిలిన విషయాల గురించి ఆలోచించొచ్చు అందాకా ఏదీ పట్టించుకునే స్థితిలో లేరు నాన్న.


గట్టిమేళం మోగుతుంది. కుమార్ తాళి చేత్తో తీసుకుని తాళి కట్టేందుకు పైకి లేచి నిలబడ్డాడు. డాం.. .. అంటూ పెద్ద శబ్దం. దూరంగా నిప్పురవ్వలు ఎగజిమ్మాయి. ట్రాన్స్ఫార్మర్ పేలింది. కరెంట్ పోయింది. కుమార్ స్నేహితులు సెల్ ఫోన్లు ఆన్ చేశారు.


అప్పటికే కుమార్ నా మెడలో తాళి కట్టేసాడు. సెల్ ఫోన్ లైట్ల మధ్య మిగిలిన పెళ్లితంతు జరిగింది. కరెంటాఫీసుకి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. కరెంట్ వచ్చింది. మొత్తానికి అలా ఆటంకాలతోనే మా పెళ్లి జరిగింది. ప్రాణాపాయం అంచులదాకా వెళ్లొచ్చిన బంధువులు కోలుకుని ఇంటికి తిరిగి రావడంతో మేం చాలా సంతోషించాం. "ఇదొక బ్యాడ్ టైం, పోనీలే కీడు తొలగిపోయింది. అందరూ క్షేమంగా వున్నారు. నాకంతే చాలు" అన్నారు నాన్న. బంధువులంతా ఎవరిళ్లకు వాళ్ళు క్షేమంగా వెళ్లిపోయారు.


పిల్లల్ని పసుపుబట్టలతో నీకొండకి తీసుకొచ్చి దర్శనం చేయిస్తాం తల్లీ అని నాన్న కనకదుర్గమ్మకి మొక్కుకున్నారు. అందరం కలిసి దుర్గ గుడికి వచ్చి దణ్ణం పెట్టుకున్నాం. తర్వాత అన్నవరం వెళ్లి వ్రతం చేసుకున్నాం. సింహాచలంలో కప్ప స్తంభానికి మొక్కాము. ఇక అరిష్టాలన్నీ తొలగిపోయినట్టే మీ కాపురం పదికాలాలు పచ్చగా ఉంటుంది తల్లీ అని దీవించారు అమ్మా నాన్న. ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి కుమార్ నేను ఒక్కటయ్యాము. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగలిగానని సంతోషపడ్డాను.


కుమార్ వాళ్ళ అమ్మా నాన్నా వచ్చి నాన్నా వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు నాకు వినబడుతున్నాయి.


"ఆ శుభకార్యాన్ని ఇంట్లో కంటే ఏదైనా హోటల్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి బావగారూ. పెళ్లిలో జరిగిన కొన్ని సంఘటనలకు పిల్లలు కూడా బాగా బెదిరిపోయారు. మళ్లీ ఇక్కడే అంటే.. . కుమార్ కూడా అదే అన్నాడు. ఈ వాతావరణం నుంచి కాస్త దూరంగా వాళ్ళని పంపిద్దాం. సరదాగా నాలుగురోజులు గడిపి వస్తారు. " అన్నారు. నాన్నకి అలా ఇష్టంలేదు.


కానీ పెళ్లిలో అంత గందరగోళం జరిగినా పెళ్లి ఆపమని చెప్పలేదు వాళ్ళు. అటువంటి మంచి మనుషుల మాటను కాదనడం ఇష్టం లేక సరే బావగారూ వాళ్ళు మీ కొడుకూ కోడలూ. ఇక అంతా మీ ఇష్టం. మీకెలా నచ్చితే అలాగే కానివ్వండి "అన్నారు నాన్న.


కుమార్ స్నేహితులు కారు తీసుకొచ్చారు. మా ఇద్దర్నీ కారులో హోటల్ కి తీసికెళ్ళారు. నాన్నా అమ్మా వేరే కారులో వచ్చారు. కుమార్ ఫ్రెండ్స్ ముందుగానే గది ఏర్పాట్లు చేయించారు. ముహూర్త సుమయానికి మమ్మల్ని గదిలోకి పంపించారు.


అమ్మా నాన్నా కాసేపు ఉండి ఇంటికి వెళ్లిపోయారు.

పెద్ద మంచానికి పూల అలంకరణ బాగుందని చూస్తూ గది మొత్తం కలియతిరిగి చూసాను. ఆ గదికి మరో తలుపు ఉంది. అది తెరవబోయాను. కుమార్ తెరవద్దన్నాడు. అది పక్క గదికి కనెక్టివ్ రూమ్. దాని సంగతి మనకెందుకు అన్నాడు.


"అందులో ఎవరైనా ఉన్నారా?" అని అడిగాను. ఏమో తెలీదన్నాడు.

హోటల్ లో అలా ఉంటే ఎలా ? మన మాటలు అవతలివాళ్ళకి వినిపిస్తాయేమో అంటే. మనం మెల్లగా మాట్లాడుకుందాం అని చెప్పాడు. కుమార్ ఎంత చెప్పినా నాకు ఆ గది గురించిన సందేహం వీడలేదు.


ఇప్పుడే వస్తానని కుమార్ బయటకు వెళ్ళాడు. ఈ సమయంలో ఎక్కడికి అనబోయా. అప్పటికే తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయాడు. మంచం మీద కూర్చుని చుట్టూ చూశాను. పెద్ద గది. అటాచ్డ్ బాత్ రూమ్. పెద్ద అల్మారా ఉంది. తలుపులు తీసి నేను తెచ్చుకున్న చిన్న బట్టల బ్యాగ్ అందులో పెట్టాను.


కుమార్ తనతో తెచ్చిన బ్యాగ్ తెరిచి చూడబోయాను. అప్పుడే వచ్చిన కుమార్ "అదెందుకు తీస్తున్నావ్?" అన్నాడు.


"ఏం లేదు. ఈ అలమరాలో పెడదామని. ఎందుకు అంత కంగారు పడతావ్. ఇందులో బంగారం దాచిపెట్టావా?"


"నీ కంటే పెద్ద బంగారం ఏముంది?" అన్నాడు. నేను నవ్వాను.


" నువ్వు ఒకసారి రిసెప్షన్ లోకి వస్తావా? నా ప్రెండ్ వాళ్ళ అమ్మ నీకో గిఫ్ట్ తెచ్చిందిట. అది నీకిచ్చి వెళ్లిపోతుందిట. ఒక్క పదినిమిషాలు" అన్నాడు.


"ఇలా బయటకు రానా. ఈ తెల్లచీర మల్లెపూలు పెట్టుకుని బయటకొస్తే హోటల్ వాళ్ళు నన్ను అదోలా చూస్తారు. వద్దు" అన్నాను.


"ఒక్క పదినిమిషాలేగా. నీ పక్కన నేనుంటానుగా. ఏం ఫర్వాలేదు" అన్నాడు.

"ఆవిడనే పైకి తీసుకురావచ్చుగా" అన్నాను.


"లిఫ్ట్ సరిగా పనిచెయ్యట్లేదు. రెండో ఫ్లోర్ దగ్గర ఆగిపోయింది. పెద్దావిడ మోకాళ్ళనొప్పులతో ఎక్కలేదు పాపం. ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం దేనికి? మనమే వెళ్లి హై, బై చెప్పేసి వచ్చేద్దాం పద" అన్నాడు కుమార్.


సరే పద అన్నాను. గదిలో లైట్లన్నీ ఆపి చిన్న లైటు వేసాడు. నీలం కాంతి పల్చగా గదిలో పరుచుకుంది. మసక మసకగా ఏ సీ చల్లదనానికి ఒక విచిత్రమైన భావన కలిగింది.


మనం తిరిగి వచ్చేసరికి ఇలా ఈ డిమ్ లైట్లు వెలుగుతుంటే, అందులో ఈ చల్లదనంలో కలిగే ఆ అనుభూతి ఆహా వర్ణనాతీతం. అప్పుడు నేను నిన్ను అంటూ కొంటె పనులకు ఉపక్రమించిన కుమార్ ని దూరంగా నెడుతూ

"సరే చాల్లే పద. ఆవిడ్ని పంపించేసి త్వరగా వచ్చేద్దాం పద" అన్నాను.


కుమార్ నవ్వుతూ గది తలుపు వేసి వచ్చాడు. ఇద్దరం కిందకి వెళ్లాం. అక్కడ ఒకావిడ సోఫాలో కూర్చునివుంది. అంత పెద్ద వయసు మనిషిలా అనిపించలేదు. కాసేపు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించింది.


మీ పెళ్లికి రాలేకపోయానని చెప్పి మా ఇద్దరికీ బట్టలు ఇచ్చింది. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి కిందకి పిలిచి మరీ బట్టలు పెట్టాలా? రేపు ఇంటికి వచ్చి పెట్టకూడడా? అనుకున్నాను. ఆవిడ్ని పంపించి ఇద్దరం రూమ్ కి వచ్చాము.


నీలం రంగు కాంతి నిద్రపోతున్న కోరికలను మేల్కొలిపేలా చాలా ఆహ్లదకరంగా ఉంది. కుమార్ టేస్ట్ ని మెచ్చుకున్నాను. అంత చలిలో చల్లని డ్రింక్ నాతో తాగించాడు కుమార్. బాత్ రూమ్ కి వెళ్ళొచ్చాను. మేం వేసుకున్న తెల్లటి బట్టలు తప్ప మా మొహాలు మాకే కనపడడం లేదు.


చీకటిగా వున్న ఆ గదిలో మా ఇరువురి ప్రేమాలింగన సమయంలో ఫోన్ మోగింది. ఆ కాంతి గదంతా పరుచుకుంది. కుమార్ నన్ను తన భుజం మీదకి లాక్కుని ఫోన్ కట్ చేయబోయాడు.


ఆ లైట్ అతని మొహం మీద పడింది. అతని వెనక ఉన్న అద్దంలో అతని మొహం స్పష్టంగా కనపడింది. అతను కుమార్ కాదు.

ఇంకెవరో..

గట్టిగా అరుస్తూ అతన్ని విడిపించుకో బోయాను. నన్ను వదిలిపెట్టలేదతను.

"ఏయ్ పిచ్చి, నేనే.. నీ కుమార్ నే. "అన్నాడు.


ఆ గొంతు కూడా కుమార్ ది కాదు. ఎవరునువ్వు వదులు అని విడిపించుకోబోయాను. కానీ సాధ్యం కాలేదు. పెనుగులాడుతూ వెళ్లి లైట్ వేసాను.


ఆ వ్యక్తిని పెళ్లిలో చూసాను.. మరి కుమార్ ఏమయ్యాడో తెలీదు. అంతా అయోమయంగా ఉంది నాకు. తలుపు తీసుకుని బయటకు రాబోయాను. వెళ్లకుండా పట్టుకున్నాడు. అరవబోయాను.


నా నోరు మోసి నన్ను బెడ్ దగ్గరకు లాక్కొచ్చాడు. నేను ఆవేశపడకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ "అసలు ఎవరునువ్వు? ఈ గదిలో ఎందుకున్నావో చెప్పు. కుమార్ ఏడి?" అన్నాను సాధ్యమైనంత కంగారు తగ్గించుకుంటూ.


అతను కూడా నాపై బలప్రయోగాన్ని తగ్గించాడు.

"కుమారే నన్నీగదిలోకి రమ్మని చెప్పాడు. ఆ పక్కన గదిలో కనెక్టివ్ రూమ్ లో కుమార్ వున్నాడు. ముందు కార్యం నన్ను చేయమని తర్వాత తను వస్తానన్నాడు. " అని చెప్పాడు.


"అదే ఎందుకు? అతను ఉండాల్సిన చోట నిన్నెందుకు ఉంచాడు? నిజం చెప్పు. లేకపోతే ఇప్పుడే అరిచి గోలచేసి హోటల్ స్టాఫ్ ని పిలుస్తా" అని బెదిరించాను.


అతను కాసేపు తటపటాయిస్తూ నిలబడ్డాడు. నాకు అస్పష్టంగా విషయం కొంత అర్ధమైంది.


ఇందులో కుమార్ ప్రమేయం ఖచ్చితంగా ఉందని ఊహించగలిగాను. పెళ్లిలో జరిగిన హంగామా వెనక, హోటల్ కి వచ్చాక తనని కిందకి తీసుకువెళ్ళటం, అతని ప్రవర్తన అన్నీ గుదిగుచ్చి చూస్తే ఇదంతా కుమార్ ఆలోచన అని స్పష్టంగా ఉంది.


"చెప్పు. అసలేంటి ఇదంతా?" అని అతన్ని గట్టిగా అడిగితే అతను అంతా చెప్పేసాడు.

నా అనుమానమే నిజమైంది. ఇదంతా కుమార్ ఒక ప్లాన్ ప్రకారమే చేశాడని.


అతను చెప్పిన ఒక విషయం విని నా తల గిర్రున తిరిగింది. నా మెళ్ళో తాళి కట్టింది కుమార్ కాదుట. ఇతనే కట్టాట్ట. ఒక్క గంట భార్యాభర్తల్లా కలిసి ఉంటే చాలని కుమార్ చెప్పాట్ట. ఆ తర్వాత అతను వచ్చి అంతా చూసుకుంటాను అన్నాడని చెప్పాడు.


ఎందుకిదంతా చేసాడు అని అడిగాను.

కుమార్ కి పెళ్ళైతే ప్రాణగండం ఉందని ఎవరో చెప్పారట. అందుకే నీ మెడలో నా చేత తాళి కట్టించాడు. తొలి రాత్రి కూడా జరిగిపోతే తనకిక ప్రాణ గండం ఉండదని నమ్మాడు. అందుకే.. .. "


నాకు మొత్తం అర్థమైపోయింది. అతను ముందు పెళ్లే వద్దని చెప్పి, తరువాత నన్ను వేరే వాళ్ళను చేస్కోమనడం. భర్తని వదిలేసి వచ్చేయమనడం అంతా గుర్తుకొచ్చింది. నేను కాదంటే కొన్నాళ్ళు ఊరుకుని ఈ కొత్త ప్లానుతో వచ్చాడన్నమాట. పెళ్లి వారెవరూ మంటపంలో ఉండకుండా ఫుడ్ లో ఏదో కలిపి ఉంటాడు. అందుకే అందరూ హాస్పిటల్ పాలయ్యారు. ఎర్త్ వైర్ కి కరెంట్ వైర్ కలిపి పాపం ఆ ముసలాయనకి షాక్ తగిలేలా చేసాడు.


మొత్తానికి మా పెళ్లి సమయానికి ఎవరూ అక్కడ లేకుండా ప్లాన్ వేసాడు. అంతటితో ఆగకుండా తాళి కట్టే సమయానికి కరెంట్ పోవడం కూడా కుమార్ పనేనన్నమాట.


నా పెళ్లి, తొలిరాత్రి నాకు తెలీకుండానే వేరొకరితో కానిస్తున్నాడంటే కుమార్ పరమ ద్రోహ చింతన కలవాడైనా అయ్యుండాలి, లేదా జాతక ప్రభావానికి పూర్తిగా లొంగిపోయినవాడు అయినా అయ్యుండాలి.


తొలిరాత్రి ఇంట్లో కాకుండా హోటల్ లో జరుపుకుందామని ఎందుకు పట్టుబట్టాడో అప్పుడర్ధమైంది. ఒకే ఒక్కసారి నాతో కలవమని, ఆ తర్వాత కుమార్ వస్తాడని అతను బలవంతం చేయబోయాడు. నాకొచ్చిన కోపానికి శక్తినంతా కూడదీసుకుని ఒక్కతోపు తోసి తలుపులు తీసుకుని బయటపడ్డాను..


=================================================

...సశేషం...

=================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







30 views1 comment

1 comentário


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
13 de fev. de 2023

Madhavi muchatlu • 4 hours ago

కథ మరియు చదివిన విధానం చాలా బాగున్నాయి

Curtir
bottom of page