top of page

అనుబంధం


'Anubandham' Written By A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

“మీ అమ్మ చివరి చూపుగా నిన్ను కలవరిస్తోంది క్రిస్. వెంటనే బయలుదేరి రా! ఇంటి దగ్గరే వుంది..'' కొడుక్కి ఫోను చేసాడు మార్టిన్.

''ఇప్పుడే బయలుదేరుతున్నా డాడ్ ..” అన్నాడు క్రిస్టఫర్.

రెండు గంటల డ్రైవ్ లో ఉంటాడు క్రిస్. వీకెండ్లో అమ్మ నాన్నలను చూసి వెడుతూ వుంటాడు. అప్పుడప్పుడు వేరే ట్రిప్పులకు వెళ్లినా ఈ మధ్య ఆరోగ్యం బాగుండకపోవడంతో డాక్టర్ '' ఇక ఎప్పుడు ప్రభువు పిలుపు వస్తుందో తెలియదు. ఇంటిదగ్గిరే ఉండాలని కోరుతోంది. తీసుకెళ్ళు మార్టిన్ . ధైర్యంగా వుండు” అని చెప్పగానే ప్రతి వీకెండ్ కీ క్రిస్టఫర్ వస్తున్నాడు.

డాడ్ ని చూడగానే అతడి ముఖంలో ఆందోళన కనబడి, ‘ఇక కాలం సమీపించింది’.. అని అర్థం చేసుకున్నాడు.

ఒక్కసారి కొడుకును హత్తుకుని కాస్త స్తిమితపడ్డాడు మార్టిన్. భార్య వున్న రూం లోకి తీసుకు వెళ్ళాడు.

''మామ్! ఎలావుంది నీకు? ఏమైనా కోరుతున్నావా..” అన్నాడు తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెకు దగ్గరగా కూర్చుని.

''అవును క్రిస్ ! నిన్ను ఒక కోరిక కోరుతున్నాను..” అంది జింజర్ వణుకుతున్న గొంతుతో. తనకు ఏకాంతం ఇవ్వమన్నట్టు భర్త వైపు చూసింది. అది గ్రహించి మార్టిన్ అక్కడ నుంచి తప్పుకున్నాడు. జింజర్ కొడుకు సాయంతో తలగడ కింద నుంచి మెల్లగా ఒక కవరు తీసి క్రిస్ చేతిలో పెట్టింది.

''క్రిస్! ఇందులో ఒక ఫోటో, వివరాలు వున్నాయి. నాకు ప్రభువు నుంచి పిలుపు వచ్చింది. సమయం లేదు.

నా కోరిక తీర్చు. నా మనసు శాంతిస్తుంది''

''అలాగే మామ్ ! తప్పక తీరుస్తాను” అన్నాడు క్రిస్ .

మరి కొద్ది క్షణాల్లో ఆమె కనులు మూత పడ్డాయి.

అంత్య క్రియలు ముగిసాక క్రిస్ అన్నాడు.''డాడ్! నాతో వచ్చేయి. ఒక్కడివి ఎలా వుంటావు? అందులో మామ్ లేకుండా నువ్వు ఒక్కరోజు వుండలేదు'' అన్నాడు.

''నిజమే క్రిస్! కానీ మీ మామ్ కి ఈ ఇల్లు- ల్యాండ్ అంటే చాలా ఇష్టం. ప్రతి చెట్టును ఆమె సాకింది. ఈ ఇంటిని ప్రాణంగా చూసుకునేది. అలంకరించేది. చూడు ప్రకృతికి తన చిత్ర కళతో ప్రాణం పోసి కళ్ళముందు నిలబెట్టింది. మామ్ ఇంకా ఈ ఇంట్లో మసలుతున్నట్టే నాకు అనిపిస్తోంది. నేను జీవించినంత కాలం ఆమె నాతోనే ఉంటుంది. నువ్వు వెళ్ళు క్రిస్! నీకు వీలు వున్నప్పుడు వస్తూ వుండు. నా ఆరోగ్యం బాగానే వుంది. ఏమీ భయంలేదు. అన్నట్టు మామ్ కోరికను మరిచిపోవద్దు''అన్నాడు మార్టిన్

''ఆ! అన్నట్టు ఆ లెటర్ చదవనే లేదు..” అంటూ తన గదిలోకి వెళ్లి జింజర్ ఇచ్చిన లేఖను అప్పుడు తెరిచి చూశాడు.

“ప్రియమైన క్రిస్! నాకు మీ డాడీతో పెళ్లి కాక ముందు సంతానం కలిగింది. అంటే నీకంటే పెద్ద అయిన

అన్న వున్నాడు. వాడి పేరు డేవిడ్. పుట్టినతేదీ, సర్టిఫికెట్, ఫోటో ఇందులోనే వున్నాయి. వాడిని ఎందుకు నిర్దయగా

విడిచి పెట్టావు.. అని అడుగుతావు కదూ! వాడు మాట్లాడ లేడు. మెదడు ఎదగలేదుట! పైకి చూస్తే అవయవాలు అన్నీ బాగానే ఉంటాయి. మనం చెప్పినది మెదడుకు చేరదు. ఎలాటి భావం చెప్పలేడు. చర్చి ఫాదర్ ‘నేను పెంచుతాను. నీ పెళ్లికి, వైవాహిక జీవితానికి వీడు ఆటంకం అవుతాడు. నీకు ఇప్పుడు ఇంకా పదునాలుగేళ్ళు. జీవితం చాలావుంది.. “ అంటూ మార్టిన్ తో నాకు పెళ్లి చేశారు. ‘మార్టిన్ కు చెప్పవద్దు’ అంటూ మాట తీసుకున్నారు. నాకు ప్రాణం ఒప్పక ఎప్పుడైనా చూసి వచ్చేదాన్ని. మీ డాడ్ నన్ను చాలా బాగా చూసేవాడు. మార్టిన్ తో చెప్పేసి, నా దగ్గరకు తెచ్చుకోవాలని ఆశపడేదాన్ని. కానీ ఫాదర్ ఎంతమాత్రం ఒప్పుకోలేదు.

“నాకు తెలుసు. ఈ మంచితనం అంతా ఒక్క మాటతో మారిపోతుంది! ఎందుకు తల్లీ నీజీవితం పాడు చేసుకుంటావు? వాడు బాగా ఉంటే అలాగే చెప్పవచ్చు.. అంటూ వారిస్తూనే ఉండేవారు. నువ్వు పుట్టేక కొంత కాలం నీ పెంపకంలో వాడిని మర్చిపోయాను. నువ్వు పెద్దవాడై నాకు దూరం అయ్యాక మళ్ళీ వాడే గుర్తు రావడం.. ‘వాడికి తల్లిగా బాధ్యత నేర్చలేదు’ అని కృంగిపోయాను. మార్టిన్ ఇదంతా

నీ మీద బెంగ అనుకుని ఎంతగానో నన్ను మరిపించేవాడు.

నేను జబ్బుపడ్డాక వాడి గురించే విలపించాను. ఫాదర్ గురించి ఈ మధ్య సమాచారం తెలియలేదు. చివరకు ఎవరో చెప్పారు '' వాడు బాగానే వున్నాడు. ఫాదర్ వృద్ధుడు అయ్యారు. అందువల్ల డేవిడ్ ను హోమ్ లో చేర్చారు”

అంటూ అడ్రస్ ఇచ్చారు. నువ్వు ఇకమీదట చూసుకుంటావని ఆశ పడుతున్నా! అదీ విషయం”

లెటర్ చదివిన క్రిస్ దాన్ని ఆవేశంతో గుప్పిటతో నలిపేసి చెత్త బుట్టలో వేసాడు. మతి లేనివాడిలా అటూ ఇటూ తిరిగాడు. ఆలోచించాడు. ‘నాకు అన్న వున్నాడు. కానీ వాడొక పనికి మాలిన వాడు. డిజేబుల్డ్. ఇప్పుడు నేను తమ్ముడు అనే బంధంతో చేరదీయాలి. ఇదేమి న్యాయం? మామ్ చూపలేని ప్రేమను నేను పంచాలి.. ముందే చెబితే నా దగ్గిరే వుంచుకునేవాణ్ణి. మామ్ సంతోషపడేది. కళ్లారా చూసుకునేది. ధైర్యం చేయలేదు. ఇప్పుడు తీసుకు వస్తానని నన్ను నమ్ముతోంది. ఒక బేబీలా చూసుకోడం కష్టం కదా..

డాడ్ ని సలహా అడుగుతాను. నాకు ధైర్యం వుంది’ అనుకున్నాడు. చెత్తలో పడేసిన వుత్తరం తీసి సాపుచేసి

''డాడ్! ఇదిగో నీ దగ్గర రహస్యం ఎందుకు? చదువు” అంటూ ఇచ్చాడు.

అది చదివిన మార్టిన్ ''ఓహ్ గాడ్.. జింజర్! ఎంతపని చేసావ్? ఒక్కమాట నాకు చెప్పలేదు! అంటే నువ్వు, ఫాదర్ కూడా నన్ను నమ్మలేకపోయారు. అది నా దురదృష్టం. క్రిస్! నువ్విక ఆలోచించవద్దు. వెళ్లు.. డెవిడ్ ను

తీసుకురా. నువ్వు ఎప్పటిలా నీకు వీలు వున్నప్పుడు వచ్చిపో. వాడిని జింజిర్ కి గుర్తుగా నేను చూసుకుంటాను. ఈ సంపాదనకు వారసులు మీ మామ్, నువ్వు, డేవిడ్. నేను కేవలం ఆమె ఆస్తికి కేర్ టేకర్ ని. ఈ విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్పాలని అనుకున్నా! ఆ టైము ఇప్పుడు వచ్చింది. నాకు కొన్ని మూలికలతో చేసే ట్రీట్మెంట్ వచ్చు. ఒక మనిషి సాయం తీసుకుంటాను. డెవిడ్ లో మార్పు వస్తుందని అనుకుందాం. వెళ్లు! ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది'' అంటూ చెప్పాడు.

క్రిస్ సంతోషంగా తండ్రిని కౌగలించుకున్నాడు.

“డాడ్! యూ ఆర్ గ్రేట్. థాంక్ యు సో మచ్'' అన్నాడు. వెంటనే మామ్ ఇచ్చిన కవరు తీసుకుని తన అన్నను తీసుకు రావడానికి బయలుదేరాడు క్రిస్.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్న

గ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.

తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే

అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.

నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.

ధన్యవాదాలు.

అన్నపూర్ణ.
106 views0 comments

コメント


bottom of page