top of page

నేరానికి శిక్ష ఏది?


'Neraniki Siksha Edi?' written by A. Annapurna

రచన : A . అన్నపూర్ణ

అప్పుడే స్టోర్ రూమ్ పక్కగా వెడుతున్న ప్రవీణ్, ఏవో మాటలు వినిపించి లోనికి వెళ్లి చాటుగా నిలబడి విన్నాడు.

స్టోర్ రూమ్ క్లార్క్ యాదగిరి ఎవరితోనో మాటాడుతున్నాడు ''ఏభై వేలకు తక్కువైతే ఇవ్వను…” అన్నాడు.

ఆ వ్యక్తి బతిమాలుతూ, “కష్టాల్లో వున్నాను. ఇంతకంటే ఇచ్చుకోలేను. నా తండ్రి ప్రాణం కాపాడు..”

అంటున్నాడు కన్నీళ్లతో. చేతిలో నోట్లు వున్నాయి. ప్రవీణ్ వెనక్కి తిరిగి తన రూమ్ లో కూర్చుని ఆలోచించాడు.

యాదగిరి మంచివాడు నమ్మకస్తుడు అనుకున్నాను. రహస్యంగా మందులు అమ్ముతున్నాడన్నమాట.

'అతనిది పొగరుగా వుండే స్వభావం. ఎవరినీ లెక్కచేయడు. గౌరవించడు.టైముకి వస్తాడు. టైము దాటి ఒక్క క్షణం పనిచేయడు. కానీ నిజాయితీగా ఉంటాడు.' అదీ యాదగిరి గురించి అనుకున్నది.

ఒక సంస్థ అధికారిగా నేను నిజాయితీగా వుంటాను. నా దగ్గర పని చేసేవారు కూడా అంతే నిజాయితీగా

ఉండాలి. అందుకు అనుకూలంగా తగిన వాతావరణం కల్పించాడు. అందరితో స్నేహంగా పెద్ద, చిన్న పనివారు

అని తేడా లేకుండా చూసాడు. అలాంటిది ఇప్పుడు యాదగిరి చేసిన పనికి గుండె మండిపోయింది.

పిలిచి చివాట్లు పెట్టడమా.. తెలియనట్టు కొంతకాలం చూడటమా..అని సహనంతో ఆలోచించాడు.

ప్రవీణ్ అమెరికాలో కొంతకాలం పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చి, అనుభవంతో స్వంత ఫార్మా

కంపెనీ ప్రారంభించి కొంతమందికి ఉద్యోగావకాశం కల్పించాడు. ''స్వదేశానికి ఒక పౌరుడిగా నా కర్తవ్యం నిర్వహించాను” అని తృప్తి పడే వ్యక్తి. తన కంపెనీలో కూడా అందరూ అలాటివారే ఉండాలని అనుకుంటాడు. పది సంవత్సరాలుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

యాదగిరి చేరి మూడు ఏళ్ళు అయింది. ఎప్పుడూ అనుమానం రాలేదు. కానీ ఈరోజు స్వయంగా తెలిసింది.

తన ఆశయానికి విరుద్ధంగా యాదగిరి ఎందుకు ఇలా చేసాడు? గోడౌన్లో కూడా ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా? ఇతని కుటుంబం గురించి తెలుసుకోవాలి. వుద్యోగం తీసేయడం ఒక్క నిమిషం పని.

‘నువ్వు ఈ పని ఎందుకు చేసావు?’ అని అడిగితే అబద్ధం చెప్పవచ్చు. ‘ఇక చేయను’ అని తప్పించుకోవచ్చు.

ఒకసారి తప్పు చేయడానికి సిద్ధపడితే ఆ తర్వాత అలవాటు పడిపోతాడు. వేరొకచోట చేరి యజమానిని మోసం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడే తుంచేయాలి.

యాదగిరి చేసింది తప్పు. అది నేను సహించను. అతడిలో మార్పు రావాలి. ఆతను ఈ పని చేసిన కారణం తెలిస్తే అతన్ని మార్చవచ్చు. అది వీలు కాకపోతే అప్పుడే చూద్దాం

అనుకున్నాడు.

కొన్ని రోజుల తరువాత యాదగిరిని పిలిచాడు.

''యాదగిరీ! నీ భార్య పిల్లలు బాగున్నారా? డబ్బు అవసరం ఉంటే చెప్పు” అన్నాడు సౌమ్యంగా .

''నా భార్య ఆరోగ్యం చాలా కాలంగా బాగులేదు సార్..ట్రీట్ మెంట్ జరుగుతోంది. నలుగురు పిల్లలు. వాళ్ళ స్కూల్ ఫీజులు, బట్టలు ఏదో రకంగా భారం గానే గడిచిపోతోంది'' అన్నాడు.

''అంటే కష్టంగానే ఉందన్నమాట. నీ భార్యకి అనారోగ్యం అన్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది!

''అవును! మొదట ఒక్కతే పాప. ‘ఆపరేషన్ చేయిస్తాను అంటే మగ బిడ్డ లేకపోతే ఎలా?’ అని నా భార్య వినలేదు.


రెండోసారి ఇద్దరు కవలలు అమ్మాయిలే కలిగారు. నా తమ్ముడి కొడుకును కూడా నేనే పెంచాల్సి వచ్చింది.

తమ్ముడు మరదలు యాక్సిడెంట్లో మరణించారు.

''అయ్యో.. అలాగా! నేను మీ ఇంటికి వస్తాను. ఏదైనా సహాయం చేయగలనేమో చూస్తాను” అన్నాడు ప్రవీణ్.

''మీరు రాలేరు సార్. పరిసరాలు మురికిగా ఉంటాయి.'' అన్నాడు యాదగిరి మొహమాటంగా.

''ఫర్వాలేదు. మన హైదరాబాదులో కొత్త కాదుగదా!” అన్నాడు ప్రవీణ్ .

''సరే! ఆదివారం తీసుకు వెడతాను'' అన్నాడు యాదగిరి. ప్రవీణ్ ఇప్పుడు కొత్తగా తన మీద ఇంత శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నాడో యాదగిరికి అర్థం కాలేదు. ఇంటికి వస్తాను అంటే కాదన లేక సరే! అన్నాడు.

ఆదివారం పిల్లలకు మిఠాయిలు, బొమ్మలు, కొత్త డ్రెస్సులు యాదగిరి భార్యకి పూలు, పళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ప్రవీణ్ ఒక సోదర భావంతో.

ఇల్లు చిన్నది అయినా బాగానే వుంది. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. యాదగిరి భార్య

నీలమ్మ వాళ్ళని అదుపు చేయలేక సతమతమవుతోంది.

ఉన్నంతలో ఓపిక తెచ్చుకుని మర్యాద చేసింది నీలమ్మ. కొన్ని రోజుల తరువాత మరోసారి ప్రవీణ్ తన భార్య రేవతిని యాదగిరి ఇంటికి తీసుకు వెళ్ళాడు.

యాదగిరికి మతిపోతోంది. ఇన్నాళ్లూ లేనిది ఇలా కొత్తగా సారు తన కుటుంబం మీద ఇంత శ్రద్ధ ఎందుకు

చూపిస్తున్నాడు? ఒకసారి వచ్చాడు సరే.. ఇదేమిటి మళ్లీ ? మేడంగారిని తీసుకు రావడంలో అర్ధం ఏమిటో..

అడిగితె బాగుండదు. తన పేదరికాన్ని చూసి జాలి పడుతున్నారా? కంపెనీలో చాల మంది వున్నారుకదా...

నాలాటి వారు? వారిమీద లేని అభిమానం నామీద ఎందుకు ?” అనుకున్నాడు.

నాలుగు రోజుల తరువాత యాదగిరిని పిలిచి '' నీలమ్మను నా స్నేహితుడి హాస్పిటల్లో చూపించు. ఫీజు ఉండదు. మందుల గురించి నేను ఏర్పాటు చేస్తాను. పిల్లలను మంచి స్కూల్లో చేర్చు. నేను లెటర్ రాసిస్తాను. సీటు ఇస్తారు'' అన్నాడు.

''సార్ ! మీరు నా మీద ఇంత జాలి ఎందుకు చూపుతున్నారు? నాకు చాలా అప్పులున్నాయి. అంబానీ కూడా సాయం చేయలేడు. ఒకరి జాలితో బ్రతకడం నాకు నచ్చదు '' అన్నాడు నీ లెక్కలేదు అన్నట్టు, అది అహంకారమో హేళనో తెలియకుండా.

''చూడు యాదగిరీ! నా దగ్గర పనిచేసే ఉద్యోగుల బాధ్యత నాది అనే ఆలోచనతో చెబుతున్నాను. నేను చేసేది

చేస్తాను. నువ్వు చేసేది కూడా వుంది. ప్రతి వారికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడం మన

చేతిలోనే వుంది.''

''నాకు చాల కష్టాలున్నాయి తీర్చండి ...అని మిమ్మల్ని నేను అడగలేదు. మీరు ఇచ్చే జీతం పెంచమనలేదు.''

''లేదు. నిజమే కానీ నలుగురు పిల్లలను పోషించడం నీకు కష్టం. వాళ్ళకి మంచి భవిష్యత్ ఎలా ఇస్తావు?

''అంటే పెళ్లి చేసుకోవడం, నలుగురు పిల్లలను పోషించడం తప్పు అంటారా..?” పొగరుగా అన్నాడు.

''అది తప్పు కాదు కానీ భారం. అది సరి చేసుకునే ఉపాయం చెబుతాను. చెయ్.''

మీరు గొప్పవారు కావచ్చు. నాకు బాస్ అవ్వచ్చు. మీరు చెప్పినట్టు ఎందుకు చేయాలి ?”

''నామాట పూర్తిగా విను. వినకుండానే చేయను అనడం పద్ధతి కాదు”

''మీరు ఏమి చెబుతారో నాకు తెలుసు. నా పిల్లలు ఇద్దరినీ అనాధ శరణాలయానికి పంపమంటారు. అంతేగా!”

నిరసనగా అన్నాడు యాదగిరి.

''కాదు. నీ ఆలోచన తప్పు. నీ శ్రేయస్సు కోరి చెబుతున్న మాటలు ముందు వినడం నేర్చుకో'' ప్రవీణ్ కూడా తీక్షణంగా అన్నాడు.

యాదగిరి తగ్గాడు.

''నాకు ఒక్కడే కొడుకు. రేవతికి ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదు అని డాక్టరు చెప్పింది. అమ్మాయి కావాలని ముచ్చటగా వుంది రేవతికి. నీ కూతురు ఒక పాపను మేము దత్తత తీసుకుంటాం. మాచెల్లికి అసలు సంతానం లేరు. మరో పాపను మా చెల్లి తీసుకుంటుంది. అదీ నీకు, నీలమ్మకి ఇష్టం అయితే. లేదంటే నీ ఇష్టం. అందుకే మీ ఇంటికి వచ్చాము. కొంత నీ భారాన్ని పంచుకోవాలని తప్పితే ఎలాంటి దురుద్దేశం లేదు. ఆలోచించుకో ''యాదగిరిలో ఆవేశం పొగరు తగ్గిపోయాయి విచక్షణ మేలుకుంది. బాస్ ఇలా అడుగుతాడని ఊహించలేదు. అందులో ఎలాంటి దురుద్దేశం కనబడలేదు.

బాస్ మంచితనానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియలేదు.

అలాంటి మనిషిని మోసం చేసాడు. డబ్బుకోసం కక్కుర్తిపడి అడ్డదారిలో మందులను అమ్ముకున్నాడు. ఆయన నిజాయితీకి మచ్చ తెచ్చాడు. ఈ విషయం ఈరోజు కాకపోతే ఇంకో రోజు బయట పడుతుంది.

‘ నా తప్పు ఒప్పుకుని ‘సారీ’ చెబుతాను. అదొక్కటే మార్గం. జీవిత కాలం బాస్ నీడ వదులుకోకూడదు. ఆయనకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకు రావాలి. కంపెనీని వున్నత శిఖరానికి చేర్చడమే ఆశయంగా కష్ట పడతాను’ అనుకున్న యాదగిరి చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పేడు.

''మీరు ఎలా చెబితే అలా వింటాను. నా భార్య అడ్డు చెప్పదు.

ఆమె చాలాకాలంగా చెబుతోంది. ‘ఎవరికైనా పెంపకం ఇద్దాం. మన ఇంటో వాళ్ళు సుఖపడరు. తినడానికే కడుపునిండా ఉండదు’ అని! మీలాటి పెద్ద మనసున్న వారు తీసుకుంటే సంతోషపడుతుంది” అన్నాడు మనస్ఫూర్తిగా.

ప్రవీణ్ ప్రయత్నం ఫలించింది. యాదగిరి మారాడు కనుక ఏమీ తెలియనట్టు వుండిపోయాడు. అటు అమ్మాయిని పెంచుకోవాలన్న రేవతి కోరిక తీరింది. చట్ట ప్రకారం అమ్మాయిలు కవలలను దత్తత ఇచ్చాడు యాదగిరి.

''యాదగిరీ! నీ బిడ్డలను చూడాలంటే ఎప్పుడైనా రావచ్చు. నా అనుమతి అవసరం లేదు'' అన్నాడు పెద్ద మనసుతో ప్రవీణ్.

''వద్దు సార్.. వాళ్ళు ఇక మీ అమ్మాయిలే! మనస్ఫూర్తిగా నేను నా భార్య చెబుతున్నాం. వాళ్ళను చూడం. ఎలాంటి మమకారం పెట్టుకోము''అన్నాడు యాదగిరి.

''అంతా నీ ఇష్టం. ఆ హక్కు అధికారం మీకు వుంటాయి'' అన్నారు ప్రవీణ్, రేవతి.

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. కాకినాడలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను.

మా నాన్నగారు పీ ఆర్ కాలేజీలోనూ, ఉమెన్స్ కాలేజీలోనూ ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేసారు. 'శ్రీ బులుసు వేoకటేశ్వర్లు గారు' వారి పేరు.

మాఇంట్లో గొప్ప సాహిత్య గ్రంధాలు ఉండేవి. నాన్నగారు కవి, రచయిత కావడం వలన పుస్తకాలు చదవడం, రాయడమూ అలవాటు వచ్చింది. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కథలు కవితలు వచ్చాయి. చతురలో నా నవలలు ప్రచురించారు. నా నవలను చదివిన యండమూరి నా శైలి, చెప్పిన విధానం చదివించేలా ఉన్నాయని అభినందించారు. 'చతుర' చలసాని ప్రసాదుగారు, 'రచన' వసుంధరగారు...ప్రోత్సహించడంతో రచనలను చేస్తూనే వున్నాను.

హైదరాబాదు వచ్చాక 'లోక్ సత్తా' ఉద్యమ సంస్థ స్థాపకులు డా' జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో ఇరవై ఏళ్ళుగా పనిచేయడం గర్వముగా భావిస్తాను. వారి సంస్థ పత్రిక జన బలంకి వ్యాసాలు వ్రాస్తూనే వున్నాను. ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాను. వీలున్నప్పుడు ఇండియా వస్తూనే వుంటాను. ఇదీ నా పరిచయం.


71 views0 comments

Comments


bottom of page