Pempakam Written By A. Annapurna
రచన : A . అన్నపూర్ణ
''మనఇంటికి బంధువులు వస్తున్నారు...మీ సెలవులు వాళ్ళతో గడుపుతాం ఈ సంవత్సరం...హ్యాపీనా ..అంది సరోజ, తన పిల్లలు సరితా ,వరుణ్ లతో. ఈ సెలవులకు మనం ఎక్కడికి వెడతాం మమ్మీ... అని వాళ్ళు అడిగినపుడు.
''ఆ బంధువులు ఎవరు మాకు తెలుసా? పన్నెండేళ్ల సరిత అడిగింది.
''లేదు. వాళ్ళు డాడీకి బంధువులు. చిన్న విలేజిలో వుంటారు.నీకు అత్తా, మామ అవుతారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు.ఇద్దరు అబ్బాయిలు ,ఒకమ్మాయి. మీ రూము వాళ్ళకి ఇద్దాం...మీరు డాడీ ఆఫీసు రూముకి షిఫ్ట్ అవ్వాలి. వన్ వీక్.ఓకే... ''అంది సరోజ.
వాళ్ళు మొదటిసారి మన వైజాగ్ సిటీకి వస్తున్నారుకదా....ఎలాగో అడ్జెస్ట్ అవుదాం.....ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. 'వాళ్ళు విలేజి నుంచి వస్తారట...మంకీస్ లా ఉంటారేమో ఆటపట్టిద్దాం' అనుకున్నారు.
''మీరు వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు చదువులో చురుకైనవాళ్లు. మీకు డౌట్స్ ఉంటే అడగండి...తెలియనివి నేర్చుకోండి...మామ మ్యాథ్స్ టీచర్,. అత్త హిందీ టీచర్.''అన్నాడు మాధవ్.
''సరేలెండి...ఇలాగచెప్పి ....వీళ్ళని తక్కువ చేయకండి.... మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు
తెలుగు మీడియం. మనవాళ్ళు ఖరీదైన నేవీ స్కూలు. వాళ్ళు చదివేది....ఆఫ్ట్రాల్...మునిసిపల్ స్కూల్. తేడా వుంది''. తన బుద్ధి చూపించింది సరోజ.
వాళ్ళు రావడం సరోజకి అంతగా ఇష్టంలేదు....కానీ...మాధవకి ఎప్పుడో డబ్బుసాయం చేశారట.
అతను ఇంజినీరింగ్ చదవడానికి . అసలు ఆమాటే నచ్చలేదు.... ఏదో ఒక్కసారేకదా అని మాధవ పిలుస్తానంటే సరేనంది. వాళ్ళ కారణంగా మన ట్రిప్ వదులుకున్నాం ...అనే నిరాశతో.
ఊహూ..మమ్మీకికూడా వాళ్లంటే ఇష్టంలేదన్నమాట....మనకి అడ్డులేదు...అనుకున్నారు సరితా-వరుణ్.
''రండి రండి బావగారూ ...ఇన్నాళ్ళకి మాఇంటికి వచ్చారు...సంతోషం...బాగున్నావా రేవతి...హలొ
పిల్లలు, వీళ్ళు సరితా, వరుణ్. మీరంతా పరిచయాలు చేసుకోండి....మొహమాటంలేదు. ఫ్రీగా వుండండి.'' అంటూ సంతోషంగా ఆహ్వానించాడు...మాధవ.
''నాపేరు కార్తీక్, చెల్లి రేణు, తమ్ముడు వంశీ...నేను ఇంటర్, చెల్లి టెంత్, వంశీ ఎయిత్.చదూతున్నాం...అంటూ చెప్పేడు చొరవగా కార్తీక్.
''ఎప్పుడో చూసేను....రేవతిగారు....బాగున్నారా...భార్గవగారు..."పలకరించి వాళ్ళకి రూము చూపించింది...సరోజ.
ఒకరోజు రెస్ట్ తీసుకున్నాక....మాధవ వాళ్ళకి వైజాగులో ముఖ్యమైన ప్రదేశాలు చూపించాడు. సరితా వరుణ్ లను రమ్మంటే బోర్ ఎన్నిసార్లు చూస్తాం ..రాము...అన్నారు.
అప్పుడప్పుడు పజిల్స్ ఆడుకోవటం...వాళ్ళ స్కూల్ చూపించడం ....షాపింగుకి వెళ్లడం తప్పితే...సరితా వరుణ్ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు.
వాళ్ళ దృష్టిలో వాళ్ళు విలేజి బ్రూట్స్,మోడ్రన్గా ఉండటం తెలీదు. ఇంగ్లీషు మాటాడలేరు...క్లాసులో మార్కులు మాత్రం బాగావస్తాయట....హిందీ, ఇంగ్లీష్ తెలుగు భాషల్లో డిబేట్స్, ఏస్సే రైటింగులో ఫస్ట్ అట. ...కాళ్ళకు చీపుగా చెప్పులు వేసుకుంటారు. షూలు వుండవు....పూర్ ఫెలోస్..అని హేళన చేసేరు..
‘వాళ్ళు ఆలా మాటాడితే' తప్పు...ఒకరిని చులకన చేయకూడదు....
వారిలో తెలివిని, మంచిని చూడాలి. తెలియనివి పరస్పరం నేర్చుకోవాలి...అని సరోజ చెప్పలేదు.
వాళ్ళు వెడుతుంటే అందరికి గిఫ్ట్స్ ఇచ్చాడు...మధు.. ఏ సహాయం కావాలన్నా నన్ను మరువకు..భార్గవ 'అన్నాడు అభిమానంగా. .
''అలాగే మాధవ్...సెలవుపెట్టి మాకు వైజాగ్ చూపించావ్. సరోజకి శ్రమ కలిగించాం...మీరు కూడా
మా వూరు రండి. సరదాగా గడుపుదాం..''అంటూ ధన్యవాదాలు చెప్పి వాళ్ళఊరికి వెళ్లిపోయారు
భార్గవ కుటుంబం.
మాధవ్ బదిలీల మీద అనేక ప్రాంతాలు తిరిగి. ...వైజాగులోనే రిటైర్ అయ్యాడు. అతను ప్రభుత్వ శాఖలో పనిచేయడం వలన సరితా,వరుణ్ లకు కాలేజీలో సీట్లు వచ్చాయి తప్ప మెరిట్లో రాలేదు. డబ్బు ఖర్చుచేసి వరుణ్ కి వుద్యోగం వేయించుకున్నాడు.సరితకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసరుతో పెళ్లి చేసాడు.
పెళ్లి అయేదాకా అతడిగురించి తెలియలేదు. కరప్ట్ అని కేసులు ఉన్నాయని. ఆ తరువాత ఏమి చేయలేక దూరం పెట్టాడు అల్లుడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళడు..కూతురు మాత్రం వచ్చి వెడుతూంటుంది.
చాలాకాలంగా భార్గవ, రేవతిలతో మాటాడటం కుదరలేదు. పనికట్టుకుని చూడాలని వెళ్లాడు మాధవ్.
''ఒక్కడివే వచ్చావా...?సరోజనుకూడా తీసుకు రావలసింది ...అంతా బాగున్నారా...సంతోషంగా .ఆప్యాయంగా కౌగలించుకున్నాడు భార్గవ.
''సరోజకి మనవలు బేబీ సిట్టింగ్....తీరికలేదు...ఒక్కడినే వచ్చాను.ఇల్లు రీమోడల్ చేయించావా.బాగుంది.
సిటీలో వున్నసదుపాయాలు మీకూ వచ్చాయి.''అన్నాడు మాధవ...మెచ్చుకుంటూ.
''అవును....కార్తీక్ కట్టించాడు...ఇంట్లో సామాను వంశీ అమర్చాడు....రేవతి కాఫీ తెచ్చి పలకరించింది.
''అమ్మాయి పెళ్ళికి వస్తారనుకున్నా...రాలేదు...''అంది.
అప్పుడు సరిగ్గా 'అల్లుడిప్రతాపం బయటపడి కేసుల గొడవలో వున్నాం ' అని చెప్పలేక కుదరలేదమ్మా....
రాలేకపోతున్నట్టు బావగారికి ఫోన్ చేశాను...అన్నాడు.
''గ్రీటింగ్స్ పంపాడు...నువ్వు మర్చిపోయావు రేవతి.వంట మొదలుపెట్టావా, అన్నవచ్చాడన్నఆనందంలో మరిచిపోయావా..అంటూ మాట మార్చాడు.
''భలేవారే....అన్నకిష్టమైన పనసకాయకూర, పిండివంటలు అన్నిరెడీ...మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వడ్డిస్తా.. అంది రేవతి.
సాయంకాలం కొబ్బరితోటలోకి వాకింగ్కి వెళ్ళినపుడు మాధవ చెప్పేడు.
''అదృష్టవంతుడివి బావ పిల్లలను సక్రమంగా పెంచి ప్రయోజకులను చేసారు మీరిద్దరూ!
వున్నది పల్లెటూరే...కానీ చదువు రావడానికి సిటీ, ఖరీదైన స్కూలు, లక్షల్లో ఫీజులు అవసరం లేదని
నీపిల్లలు రుజువు చేసారు.
వచ్చే చదువు ఏవూరైనా వస్తుంది.డబ్బుతోరాదు. సరోజ డబ్బు తో అన్ని అమరుతాయి అనుకుంది. ఆకాశానికి నిచ్చెన వేసింది. వాళ్ళకి అదే నేర్పింది.''
''అన్ని చక్కబడతాయి మాధవ్...మంచి రోజులు వస్తాయి''అన్నాడు భార్గవ.
''లేదు వరుణ్ కూడా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా అనుకుంటాడు... విదేశీ సంస్థలతో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు. చదువంతా వృధా చేసుకున్నాడు. ఖరీదైన లైఫ్ కి అలవాటుపడ్డారు....ఎవరో బ్రిటన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండేళ్లు తిరగకుండా విడిపోయాడు.
మరో వూరు పేరులేని అమ్మయితో ఉంటున్నాడు. బహుశా ఆపిల్ల ప్రోత్సహమే ఈ చీకటి వ్యాపారం చేస్తున్నాడు. వద్దు...నిజాయి తీగా సంపాదించు. మనకి కావలసింది ఉంటే చాలు....అత్యాశకు పోవద్దు...అని చెప్పాను.
'నీదంతా పాతకాలం ఆలోచన. ప్రతిదానికి భయపడితే ఏమి సాధించలేం.ప్రతి ఫీల్డ్ లో ఇబ్బందులు ఉంటాయి.' అంటాడు. నా ఆలోచన ఎవరికీ నచ్చదు. వాళ్ళముగ్గురు ఒకటి. నా చేతులు దాటిపోయారు.కేసులువస్తే మాత్రం నా డబ్బు పలుకుబడి కావాలి.
నలుగురిలోకి వెళ్లలేక, తలెత్తుకోలేక, కృంగిపోయి నీదగ్గిర కొన్ని రోజులు ఉండాలని వచ్చాను. మనమధ్య దూరపు బంధుత్వమే కానీ, అంతకంటే స్నేహం ఎక్కువ.''అన్నాడు మాధవ్.
''నేను అర్థంచేసుకోగలను మధు...కానీ పిల్లలు మనలా వుండరు. ఏమిచేయగలం. వాళ్ళకి కష్టం వస్తే
ఊరుకోలేము.....వాళ్ళు మారాలని ఆశించడం కంటే చేసేదిలేదు...అని ఊరడించాడు.
నువ్వు వేరే ఏదైనా సోషల్ వర్క్ చేయి. మనసుకి శాంతి కలుగుతుంది అన్నాడు భార్గవ.
''నువ్వు మాఇంటికి వచ్చినపుడు నీ పిల్లలను నాపిల్లలు హేళన చేసారు. వెక్కిరించారు. వాళ్లమనసులు
ఎంతగాయపడ్డాయో పాపం..... వాళ్ళు ఇప్పుడు వృద్ధిలోకి వచ్చారు.
పెద్దఉద్యోగాల్లో స్థిరపడి మీఇద్దరిని గౌరవంగా ప్రేమగా చూస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా
వుంది. అంతా మీఇద్దరి పెంపకం సంస్కారం''.అన్నాడు మాధవ్.
''కనీస సదుపాయాలు వాళ్ళకి ఇవ్వలేదు.... ..మాగొప్పతనం ఏమీలేదు.
వాళ్ళ కోరికలేమీ మాకు చెప్పలేదు. మేము సాదా టీచర్లు కావడం, పేదరికం, వాళ్ళని తీర్చి దిద్దాయేమో.
చదువుకున్నారు...వాళ్ళంతగా వాళ్ళు బాగుపడ్డారు.మేము ప్రత్యేకంగా చూసిందేమిలేదు.''
వారం రోజులుండి వెళ్ళిపోయాడు మాధవ్. ''ఎక్కడికివెళ్ళారు...పిల్లలు నన్ను ఏడిపించేసారు. సరిత పూర్తిగా నామీద వదిలేసి ఏటో వెడుతుంది. ఏమైనా అంటే వూరికే కూచుని ఏమి చేస్తావ్, ఆమాత్రం చూడలేవూ అని నామీదే విరుచుకుపడింది. వీళ్ళు పిల్ల రాక్షసుల్లా తయారయ్యారు.''అంటూ గోలపెట్టింది.
''నేను రేవతి, భార్గవలను చూడాలని వెళ్ళాను. వాళ్ళ కార్తీక్ పెద్ద కంపెనీకి సిఈఓ. అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్.
వంశీ స్పేస్ సెంటర్లో సీనియర్ సైన్టిస్ట్. ముచ్చటేసింది. ఒకప్పుడు పల్లెటూరి బ్రూట్స్ అనుకున్నవాళ్ళు
పెద్ద పదవుల్లో వున్నారు....మన వాళ్ళు చెప్పుకోడానికి సిగ్గుపడే స్థితిలో వున్నారు.
మన రాత ఇంత గొప్పగా ఏడిసింది. సరేకాని... నేను మాధవ్ వూరికి వెళ్లి అక్కడ బావతో కలసి ఆర్గానిక్ పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. నెలరోజుల్లో ఇక్కడ డబ్బు సమకూర్చుకుని వెళ్ళాలి.
నాతో వస్తావో ఇక్కడేవుంటావో ఆలోచించుకో...అన్నాడు.
సరోజకూడా చెప్పింది...''.అక్కడ పిల్లలకు నేను చదువు చెబుతాను రేవతితో కలసి...!అని తన ఆలోచన
కూడా చెప్పింది. మాధవ్ ఫోన్ చేసి భార్గవతో చెప్పేడు తన నిర్ణయాన్ని.*
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. కాకినాడలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను.
మా నాన్నగారు పీ ఆర్ కాలేజీలోనూ, ఉమెన్స్ కాలేజీలోనూ ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేసారు. 'శ్రీ బులుసు వేoకటేశ్వర్లు గారు'వారి పేరు.
మాఇంట్లో గొప్ప సాహిత్య గ్రంధాలు ఉండేవి. నాన్నగారు కవి, రచయిత కావడం వలన పుస్తకాలు చదవడం,రాయడమూ అలవాటు వచ్చింది. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కథలు కవితలు వచ్చాయి. చతురలో నా నవలలు ప్రచురించారు. నా నవలను చదివిన యండమూరి ' నా శైలి, చెప్పిన విధానం చదివించేలా ఉన్నాయని అభినందించారు. 'చతుర' చలసాని ప్రసాదుగారు, 'రచన' వసుంధరగారు...ప్రోత్సహించడంతో రచనలను చేస్తూనే వున్నాను.
.హైదరాబాదు వచ్చాక 'లోక్ సత్తా' ఉద్యమ సంస్థ స్థాపకులు డా' జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో ఇరవై ఏళ్ళుగా పనిచేయడం గర్వముగా భావిస్తాను.వారి సంస్థ పత్రిక జన బలంకి వ్యాసాలు వ్రాస్తూనే వున్నాను ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాను.వీలున్నప్పుడు ఇండియా వస్తూనే వుంటాను. ఇదీ నా పరిచయం.
Comments