top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 6


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 6'

New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 6' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గా కొత్తగా ప్రమోట్ అయ్యాడు. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 6 చదవండి.


ఖైదీ నెంబర్- 203 పవన్ కుమార్ విషయమై భార్య తెచ్చిన ప్రస్తావన అనాసక్తంగా అదేదో అంటీ అంటనట్టు వింటున్నట్టు కనిపించాడే గాని, మనసున మాత్రం ఎర్రసిరాతో గీత గీసి గుర్తుపెట్టుకున్నాడు డిప్యుటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్. గురి తప్పని బుల్లెట్ లా పనిచేయడం అతడికి అలవాటు. అంచేత తను ఆఫీసు రూముకి వెళ్ళీ వెళ్ళిన వెంటనే తన పర్సనల్ అసిస్టెంటు ద్వారా పవన్ కుమార్ ప్రొఫైల్ దస్త్రం తెప్పించుకున్నాడు.


మంగళ అంతగా స్పందించి చెప్పినప్పుడు తను మాత్రం ఎలా నిమ్మకుండిపోతాడు! తనకున్న విధుల ప్రకారం జైలు చుట్టూ రౌండ్సుకి వెళ్లి వచ్చి, అప్పుడే లీవునుండి డ్యూటీలో చేరిన సూప రింటెండెంట్ గారిని ఒక భారీ సెల్యూట్ తో పలకరించి రాష్ట్ర ప్రభుత్వ జైలు శాఖనుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను వివరించి కాఫీటైముకి తీరుబడిగా వచ్చి తన చేంబర్ లో కూర్చున్నాడు. ఒక వేపు కాఫీ సేవిస్తూనే మరొక వేపు దస్త్రంలో పొందుపర్చబడ్డ అనుబంధ పత్రాలను కూడా చూసాడు.


కేసు ఫైలులోని కొన్ని ముఖ్యమైన విషయ వివరాలను గుర్చుంచు కోవడం మరచిపో లేదు. కాని—పనిలోపనిగా మరొకటి కూడా తలపోసాడు. తను అకారణమైన ఆరాటానికి లోనవుతు న్నాడే మో! తన మాటల సాంరాశాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని ఓ అభిప్రాయానికి వచ్చే లోపల ఖైదీ నెంబర్- 203 పట్ల కనబరచిన మునుపటి ఆసక్తి తగ్గి ఆ ప్రస్తావన ఇక తేకుండానే ఉండిపోతుందేమో మంగళ! అలాగ్గాని జరిగితే అది తనకు బోనస్ పాయింటే కదా!


అయితే—అతడనుకున్నట్టు అలా జరగలేదు. మంగళ మూడవరోజు సాయంత్రం పవన్ కుమార్ కేసు సంగతి మరచిపోకుండా ప్రస్తావించింది. ఒక మామూలు రిమాండ్ ఖైదీ పట్ల అంతటి అక్కర చూపిస్తూన్న భార్య పట్ల అతడికి అసహనం వంటిది కలిగింది. ఇంగితంతో దానిని అణచుకుని ప్రతిస్పం దించడానికి కొన్ని క్షణాలు పట్టాయతడికి.


ముక్కూ మొహం ఎరగని మూడో వ్యక్తి కోసం- అదీను సీరియస్ నేరారోపణ సూచించే సెక్షన్ ల క్రింద శ్రీకృష్ణ జన్మస్థలానికి వచ్చిన వ్యక్తి పట్ల ఇంతటి ఆరాటం ఎఁదుకు చూపిస్తుందో మంగళ! ఇక పొల్లుపోనివ్వకుండా విషయ వ్యవహారాల రెక్కల్న విప్పి చూస్తే అతడు మంగళకు నిజంగానే మూడో మనిషేనా? ఆ తలంపు నిప్పుకణికై తాకింది.


ఖైదీ పూర్తి పేరు- పోకల పవన్ కుమార్. కాలేజీ డ్రాప్ అవుట్. స్వస్థలం భీమవరం ప్రక్కనున్న దిబ్బల పాలెం. వయసు ఇరవై ఎనిమిది. కమిట్ చేసింది సీరయస్ క్రైమ్. అప్పటికి మైనారిటీ తీరని అమ్మాయిపైన అత్యాచారం చేసాడు.


అదీను ఆమెను బెదిరించి మెంటల్ టార్చర్ ఇస్తూ వరసగా ఆరునెల్లపాటు అత్యాచారం చేసాడు. కేసు ఫైనల్ స్టేజీ లో నిరూపించబడితే ప్రాత సెక్షన్ ల ప్రకారమయితే తక్కువలో తక్కువ పది సంవత్సరాలు. ఇప్పటి నిర్భయ్ శాసనానుసారం- కోర్టువారు వివిధ కేసు ల్లో ఇచ్చిన చట్టపూర్వక నిర్వచనాల ప్రకారమైతే శిక్షాకాలం ఇంకెన్నేళ్ళో!


జీవితకాల కారాగార శిక్ష కూడా పడవచ్చు. అలా తగినంత తీవ్ర దశన శిక్షపడకపోతే విమన్ రైట్స్ యాక్టివిస్టులు ఊరుకోరు. వివిధ కోర్టుల కోరిడార్లను అదరగొడ్తారు.

వివరణంతా విన్న తరవాత మంగళ కనురెప్పల్ని అల్లార్చి చూస్తూ ఉండిపోయి, రవంత విరామం ఇచ్చిన తరవాత భర్త ముఖంలోకి కళ్ళెత్తి చూసింది. “అంతటి ఘోర అకృత్యం చేసాడా! ఇంపాజిబుల్! ”


“ఎన్నో కొత్త కొత్త అకృత్యాలు చోటుచేసుకుంటూన్న ఈ రోజుల్లో అది మాత్రం ఎందుకు ఇంపాజిబుల్? ”


“ఎందుకంటే- ముఖం చూస్తే కళ్లల్లోని కాంతుల్ని చూస్తుంటే అలా అనిపించదని చెప్పాకదండీ! ”


“ముఖాన్ని బట్టి వేషాన్ని బట్టి వ్యక్తి గుణగణాలను అంచనావేయడం మానుకొమ్మని హెచ్చరించాను కదా మంగళా! ”


“ఓకే ఓకే! అతడికి అనుకూలంగా వెళ్ళేలా ప్రాసిక్యూషన్ వాదనల్లో గ్యాప్స్ వంటివేవీ గోచరించలేదా? ”


అంటే- అన్నట్టు విస్మ యంగా చూసాడు.


“అంటే- డార్క్ టన్నల్ చివరన వెలుగురేఖ వస్తుందన్నట్టు అతడికి అనుకూలమై అంశం ఉండదంటారా ! ”


“అటువంటి గ్యాప్స్ ఉన్నా మాకు మేము వ్యతిరేకంగా చెప్పుకోము కదా! రికార్డడ్ ఆధారాలు, సాక్షుల స్టేట్ మెంట్లూ, టు- జీరో- త్రీకి వ్యతిరేకంగానే ఉన్నట్టు తోస్తూంది”మంగళ ముఖకవళికల్ని గమనిస్తూ అన్నాడతడు.

మంగళ మరోమారు మౌనం వహించి పెదవు లిప్పింది- “నాకు తెలిసిన ఒక లూప్ హోల్ గురించి చెప్పేదా! ”


ఉఁ- అన్నాడతను.


”ఎంతటి దౌష్ట్యం- ఎంతటి దుష్టప్రవర్తన గల వాడైనా అపోజిట్ సెక్సు ఒప్పుదల లేకుండా ఏగబిగిన అంత దీర్ఘకాలం పాటు- అదీను భయంకరుడైన ఒక గ్యాంగస్టర్ కూతురుని అత్యాచారం చేస్తూ వచ్చాడంటే ఆశ్యర్యంగా లేదూ! ఇక్కడేదో తిరకాసు ఉన్నట్లే కనిపించడం లేదూ! ”


“కావచ్చు. ఈ పాయింట్ అనుమానం రేకెత్తించవచ్చు. కాని- ఇక్కడ ఓ ముఖ్యైన లిటిగేషన్ ఉంది మేడమ్. అది మరచిపోతున్నట్టున్నారు. ఇదంతా ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు జరిగింది. ఒక నిర్ణీత వయసు వచ్చేంతవరకూ సెక్సులో పాల్గొనడానికి అమ్మాయి అంగీకారం తెలిపినా అది అత్యాచారం క్రిందకే రావచ్చు. ఆఫ్ కోర్సు- ఈ అంశం- టూ టెక్నికల్ గా కనిపించవచ్చు. బట్ వీ కాంట్ హెల్ప్.


ఇక విషయానికి వస్తే- ఇదంతా ఒక విధమైన స్కలిటన్ ఫైలు వంటిదే. అప్పటికప్పుడు మాకు చేరవలసిన కాపీలు మాకు పూర్తిగా అంది ఉండక పోవచ్చు. అవన్నీ జుడీషయల్ ఫైలులోనూ- క్రైం బ్రాంచీ ఫైలులోనూ ఉండవచ్చు. కాబట్టి- టు- జీరో- త్రీకి వ్యతిరేకంగా ఇంకెన్ని ఆధారాలు ఉన్నాయో!”


అప్పుడామె ముఖభావాన్ని కనుమరుగు చేసుకుంటూ వెంటనే తేరుకుంది. తనను తను సబాళించుకుంది. తనిప్పుడు జైలు పోలీసు ఆఫీసరు ముందు మాట్లాడుతున్నదన్న విషయం గుర్తు కు తెచ్చుకుంది.


ఆమె కళ్లనిండా నవ్వుల్ని నింపుకుంటూ అంది- “మరి సుమోటోగా గాని, డైరక్టుగా ఖైదీ నుండి గాని పిటిషన్ వస్తే మీరు గాని మరే ఇతర జైలు అధికారి గాని ఫార్మల్ రివ్యూ చేసి కేసుని రి- ఓపెన్ చేయగల అవకాశం ఉండదంటారా? ఎందుకంటే ఆ ఖైదీకి కోర్టు కేసుల విషయంలో అంత యెత్తున ఖర్చు పెట్టగల తాహతు లేనట్లుంది. లీగల్ ఫీజులు ఈరోజుల్లో యెంతలా ఉంటాయో మనకు తెలియనది కాదుగా-- ”


“అతగాడి డిఫెన్స్ వ్యవహారం తరవాతి మాట. మొదట మాకున్న పవర్స్ గురించి చెప్తాను. మాకు విశేషాధికారాలు గల కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటే ఉండవచ్చుగాక-- కాని సుమోటోగా కేసుల్ని రివ్యూ చేసి కొత్త విషయాలను కొత్త కోణాల ద్వారా పరిశీలించగల క్వాషీ జుడిషియల్ విచక్షాధికారం మాకుండవు. ఆ వెసులుబాటు ఒరిజనల్ జుడీషీయల్ పవర్స్ ఉన్నవాళ్ళకే చెందుతుంది. ఒక వేళ ఇప్పటికిపుడు టూ జీరో త్రీ పిటిషన్ సమర్పించుకున్నా దానిని పై అధికారులకు ఫార్మల్ గా సబ్ మిట్ చేస్తాం. అంతకు మించి మేం చేయడానికేముందో చెప్పు-- ”


“పాపం! మరి ఆ మనిషికి వేరే మార్గమే ఉండదా! ”


“ఎందుకుండదు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రతిదానికీ ఏదో ఒక అవకాశమో, అప్పీలు చేయగల వెసులుబాటూ ఉండే తీరుతుంది. ఇదంతా ప్రొఫెషనల్ లాయర్ల వ్యవహారం. అయినా నీకు సంబంధం లేని వ్యక్తుల గురించి- అందునా- అటువంటి వాళ్ల గాలి కూడా తాకకూడని నేరస్థుల కోసం నువ్వెందుకిలా ఇంపల్సివ్ నెస్ కి లోనవుతున్నావో తెలియడం లేదోయ్!


అదేదో స్వంత బంధువునో రక్తసంబంధీకుణ్ణో జైలులో చూస్తున్నట్టు తనువెల్లా మధనపడిపోతున్నట్టున్నావు. నన్ను కూడా ఒక పట్టాన గుంజాటనకు లోను చేస్తున్నావు. అదలా ఉంచు. ఆ టు- జీరో- త్రీ ఖైదీ చెట్లకు పురుగుల మందు పిచకారీ చేస్తున్నప్పుడు చూసానన్నావే- అప్పుడతనితో మాట్లాడావా? ”


తలూపుతూ బదులిచ్చింది- “ఉఁ! క్లుప్తంగా“


“అప్పుడు నిజంగా నీకేమనిపించింది? అతడు తన గురించి యేమేమి చెప్పాడు? ”


“అతడు తన గురించి కొద్దిగానే చెప్పాడు. అత డి ముఖంలోకి చూస్తుంటే- అతడి హృదయంలోకి చూస్తున్నట్లనిపించింది. ప్రశాంతంగా స్వఛ్ఛంగా కనిపించింది. అటువంటి వ్యక్తి అంతటి ఘోరమైన నేరం కచ్చితంగా చేసుండడనే అనిపించింది”


“సరే- నీ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ని శంకించడం లేదు. అతడికి మనస్సాక్షి అంటూ ఉంటే- అతడు నిజంగా నిరపరాధి అయుంటే- అతడీపాటికి హయ్యర్ కోర్టులో రివ్యూ పిటిషన్ కోసం అప్పీల్ చేయవచ్చుకదా! ఆ మాటకు వస్తే దిగువ కోర్చువారు విచారిస్తు న్నారే గాని ఫైనల్ వెర్డిక్టు ఇంకా ఇవ్వలేదుగా! ఆలోపల ఇంతగా తర్జనభర్జన పడిపోతే ఎలా? ”


మంగళ ఊరకుండి పోయింది.

“అదేంవిటి మళ్ళీ మూడీగా మారిపోయావు. ఏంవిటి విశేషం?“


“మరేం లేదు. మొదటే చెప్పాగా- అతడికి అంతటి స్తోమత లేకపోవచ్చని“


అప్పుడు అశ్వథ్ కొన్ని క్షణాలు మౌనం వహించాడు. అతడికి ఉన్నపళాన ఎప్పుడో విన్నఆంగ్లపదం మెదడున మొలకెత్తింది- “నో మ్యాన్ హేజ్ ఎవర్ బోర్న్ టు సేటిస్ ఫై ఎ విమన్”


అప్పుడు మంగళ కొనసాగించింది- “నిజం చెప్పాలంటే నేనూ మీలాగే ప్రాక్టికల్ గా ఉండాలనుకుంటానండి. సిక్స్త్ సెన్సో మరేదో బుర్రలోకి ప్రవేశించి రొద చేస్తున్నట్లనిపిస్తుంటుంది. అయినా నా తెలియనితనం కాకాపోతే- అవన్నీ చెప్పి మిమ్మల్నెందుకు డిస్ట ర్బ్ చేస్తున్నానో నాకే తెలియడం లేదు. సారీ! అన్నట్టు-- మాటల్లో పడి చెప్పడం మరచిపోయేను. రేపు నేను మా అమ్మానాన్నల ను చూడటానికి వెళ్తున్నానండి“


ఆ మాటకు అశ్వథ్ ఆశ్చర్యంగా చూసాడు. మనసున చెలరేగిన ఉద్వేగాన్ని అణచుకుంటూ అడిగాడు- “అమ్మ ఊరికెళ్లి మూడురోజులయింది. రేపో ఎల్లుండో వచ్చేయ వచ్చు. ఆ తరవాత వెళ్ళొచ్చుగా! ”


“అలాగే అనుకున్నానండి. నాకెందుకో మనసు లాగుతున్నట్లనిపిస్తూంది. అమ్మకూడా వచ్చిపొమ్మంది- అవేవో ప్రొపర్టీ వ్యవహారాలు మాట్లాడాలని. నేను వెళ్ళిన మరునాడు అత్తగారు ఎలాగూ వచ్చేస్తున్నారుగా! మరచిపోకుండా నా నమస్కారం చెప్పండి“


అతడేమీ అనకుండా మిన్నకుండిపోయాడు. ఆమె తరపున అమ్మకు తను నమస్కారం చెప్పాలా—ఆ నమస్కార మేదో మంగళే ఫోనులోనో మెసేజ్ ద్వారానో చెప్పవచ్చుగా--


అత్తగారితో మంగళకు విడదీయలేని అనుబంధం ఉంది. చాలా దగ్గరితనంతో స్వంత తల్లిలా చూసుకుంటుంది. అటు వంటి సూనృతమైన బంధాన్ని కూడా తలవకుండా మంగళ పుట్టింటికి వెళ్తుందంటే- నిజంగానే వాళ్ళింట్లో తేల్చుకో వలసిన అత్యవసర ప్రొపర్టీ వ్యవహారాలు చాలానే ఉన్నాయేమో! కాని- లోలోతున ఆ అభిప్రాయాన్ని అతడి మనసు స్వీకరించలేక పోతూంది. భార్యకళ్లలోకి కళ్ళు పెట్టి చూసి అతడు స్నానాల గదివేపు కదిలాడు. క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్!


=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






34 views0 comments

Comentarios


bottom of page