top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 3


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 3'

New Telugu Web Series

Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 3' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

అశ్వథ్, మంగళ భార్యాభర్తలు.

అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గా కొత్తగా ప్రమోట్ అయ్యాడు. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.

అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది..


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 3 చదవండి.

అప్పుడతను కాళ్ళకు ఇనుప గొలుసులు పడ్డట్టు ఆగిపోయాడు. ఆమ ముఖంలోకి ఓపారి నిదానంగా చూసి- మౌన నివేదన సమర్పించుకున్నట్టు కళ్ళను అల్లార్చాడు. ”మీరిక్కడేం చేస్తున్నారు పవన్? మీ కోసం మీ ఉనికి కోసం నేనెంతగా వెతికానో తెలుసా? ” ఉద్వేగాన్ని ఆపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ అడిగిందామె. ఇంకా కాసేపు అలా మిటకరించి చూస్తూనే ఎట్టకేలకు గొంతు విప్పాడు “ఖైదీలు ఎక్కడెలాగుండాలో అలాగే ఉన్నాను మంగళ గారూ! “ “మీరిక్కడ జైలు ఖైదీనా! ఎలా? ఎలా?” ఆమె కంఠస్వరం హెచ్చించి అడిగింది. అప్పుడు నరాల బిగింపుని అణచుకుంటూ ఎర్ర బడ్డ ముఖాన్ని దాచుకునందుకు ప్రయత్నిస్తూ- పేలవంగా నవ్వుతూ బదులిచ్చాడతడు- “నేను వేసుకున్న యూనిఫాం చూస్తుంటే తెలియటం లేదూ నేనూ ఒక ఖైదీనేనని! మీరు గొప్పింటి స్త్రీ. ఇక్కడి సీనియర్ ఆఫీసరుగారి భార్యగా వచ్చినట్టు న్నారు. నేరారోపణ ఎదుర్కుంటూన్న ఖైదీతో అంతలావు ఉద్వేగంతో మాట్లాడటం చూసేవారికి బాగుండదు. నేర చరితను మూటగట్టుకుని అయినవాళ్ల వద్దా-- కాని వాళ్ల వద్దా దుష్టుడినన్న పేరుని సంపాదించుకున్నాను. చెరగని నలుపు ముద్ర వేసుకున్నాను. గుడ్డిలో మెల్లలా ఇక్కడ కొంచెం మెరుగే. అప్పటికి సరైన స్థాయిన సత్ప్రవర్తన గల ఖైదీల కొరత వల్ల నాకు ప్రమోషన్ వంటి ఈ స్థానాన్ని ఇచ్చారు. దినభత్యం కూడా కాస్త ఎక్కువగానే నా పద్దులో కూడుతుంటుంది. మొదట-- సారీ చెప్తాను మిమ్మల్ని ఓసారి కలవకుండా చెప్పకుండా ఊరికి వెళ్లిపోయినందుకు-- ఇక అసలు విషయానికి వస్తే మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు- ఉండలేరు కూడా-- అదే కదా మంగళా- సారీ- మేడమ్ గారూ! ఋతురాగాలను మంద్ర స్థాయిలో ఉంచాలంటే- రాగద్వేషాలకు అతీతంగా సాగాలంటే ప్రకృతితో మనిషి నిత్యమూ ధ్యానాత్మక స్థితిలో నిలవాలి. అలా నిరంతరంగా అధ్యాపనం చేస్తుండాలి. మరైతే- ఇవన్నీ నావంటి సగటు మనిషికి అసాధ్యాలేగా! “ “ఆ ఉపోద్ఘాతాల మాటకేం గాని, యిప్పుడిప్పుడు మీరన్నారుగా నన్నిక్కడ ఎవరైనా చూస్తే బాగుండదని. చూస్తే చూడని. ఇప్పుడు దీనికి బదులివ్వండి. బృందావనంలో కృష్ణుడిలా ఉండాల్సిన మీరు ఇక్కడ శ్రీ కృష్ణ జన్మస్థానానికి ఎలా వచ్చారు? ” “విడి విడిగా చెప్తాను. మొదటిది- ఎవరైనా చూస్తే బాగుండదని చెప్పానే- అది మీ కోసం మాత్రమే కాదు. నా కోసమూ చెప్పాను. ఇక నేను యెదుర్కుంటూన్న నేరారోపణ గురించి చెప్తే- ఈ ప్రపంచంలో ఎవరెలా స్పందిస్తారో నాకు తెలియదు గాని- మీరు మా త్రం తప్పకుండా విపరీతమైన విస్మయానికి లోనవుతారు. అయినా తక్కువలో తక్కువగా మీకు షాక్ తగలకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిదానంగా చెప్తాను. అవసరం కలిగింది కదానని నేను పరుల బ్యాంకు ఖాతాలో ఫ్రాడ్ చేసి డబ్బు దోచుకున్నానంటే నమ్ముతారా మంగళా!” దానికి ఏమనాలో ఎలా స్పందించాలో తెలియక కళ్ళు అల్లార్చుతూ ఉండిపోయిందామె. “నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! ” ఆమె అదోలా చూస్తూ- అవునన్నట్టు- తల ఆడించింది. ఆమెలో ఫెళ్ళున ఒక లైవ్ వైర్ వంటి అనుమానం తాకింది. ఆవేశపరుడైన పవన్ ఎవరినైనా మర్డర్ చేసి వచ్చాడేమో! అప్పుడతడు ఆమె మనసుని పట్టున విప్పి చదివినట్టు చెప్పాడు- “ఒక వేళ నేను మర్డర్ చేసి వచ్చానంటే కూడా మీరు ఒకింత నమ్మగలరేమో! ఎందుకంటే- ఆ క్షణాన నన్ను నేను అదుపులో ఉంచుకోలేక మర్డర్ చేసుండవచ్చు. కాని అది కూడా కారణం కాదు. నేనొక కన్నెపిల్లను- అదీను మైనారిటీ తీరని కన్నెపిల్లను అమానుషంగా రేప్ చేసినట్టు కేసు బనాయించారు. “ అది విని నిజంగానే అదరిపడ్డట్టయింది మంగళ. ”మీరు అన్ మ్యారీడ్ లేడీని బలత్కరించారా! అది నన్ను నమ్మమంటా రా! ” ఆమె తలవిదిలిస్తూ అంది. అతడీసారి బరువుగా నిట్టూర్చి కాసేపు నిశ్శబ్ద తరంగాలలో ఈదులాడి మళ్ళీ చెప్ప సాగాడు- “ఆ అమ్మాయి పేరు మోసిన లిక్కర్ కింగ్ కూతురు. రాష్ట్రం నలుమూలలా బెల్టు షాపులున్నాయి. అందిన కాడికి కనుకుట్టిన ఖాళీ ప్రదేశాలన్నిటినీ చాపలా కబ్జా చేసుకుంటూ ఉంటాడు. ఇటువంటి పనులు చేయడానికి అతడికి ల్యాండ్ ఆర్మీ వంటి బోలెడంత మంది మార్బలం-- నిజం చెప్పాలంటే అతగాడి వద్ద ఒక్క కేడీ కూడా ఉండడు” ఆ మాటకామె ఆశ్చర్యంగా చూసింది- “అదెలా సాధ్యం పవన్? గ్యాంగస్టర్ ల వద్ద కేడీలు లేకపోతే ఇంకెవరుంటారూ! ” “మీరు నేను విడిచిన వ్యంగాస్త్రాన్ని గమనించలేదు మంగళ గారూ! నేను చెప్పేది- అతగాడి వద్ద పనిచేస్తూన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లే. మాఫియా కల్చర్ని ఒంట బట్టించుకుని ధ్వంస రచన చేసే వాళ్ళే! పిలుచుకు రమ్మంటే- బాస్ ని మురిపించడానికి మైమరిపించడానికి తల తెగ్గొట్టి చేతిలో పెడ్తారు. అటువంటి వాళ్ళను సాక్షులు చేసి, తప్పుడు సాక్ష్యా లు సృష్టించి, తెలిసిన రాజ కీయ నాయకుల్ని తోడు తీసుకుని కచ్చితమైన పథక రచన చేసి, ఎటూ కదల్లేని విధంగా కేసులో ఇరికించి, నన్ను కటకటాల వెనక్కి పంపించాడు. దీని వెనుక మరొటి కూడా ఉంది. అక్కడి వాళ్ళకు నాపైన అసూయ- వాళ్లకు దొరకని మ్రానిపండు నాకు దొరికిందని-- ” “వాళ్ళ అసూయ మాట అటుంచండి. ఇంతకీ ఆమె పేరేమిటన్నారు? ” “నేనింకా ఆమె పేరు చెప్పలేదు. శ్రీనిత్య- తండ్రి పేరు జోగయ్య“ “హాఁ! ఆ అమ్మాయి పేరు శ్రీనిత్య కదూ! ఇక పోతే- మీకూ శ్రీనిత్యకూ సంబంధమే లేదంటారా? ” “నేనలా అనలేదు. ఆమెతో నాకు క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది“ “అది అంతవరకేనా--- ” ఈసారి అతడాగిపోయాడు. చెట్టు కొమ్మల సందుల్లోకి చూస్తూ అన్నాడు- “ఆమె పొడవుగా మంచి అంగసౌష్టంతో ఉంటుంది. ఎప్పుడూ యవ్వనపు పొంగుతో అలరారుతుంటుంది. చిరగని జీవితం- తరగని యవ్వనం ఆమెకు స్వంతం”. ఆమె రెట్టించింది-- “నేనడిగిన ప్రశ్నకు ఇది జవాబు కాదు పవన్ గారూ! “ “ఉఁ! ఒప్పుకుంటాను. మా మథ్య ఎమోషనల్ సంబంధాలుండేవి. దగ్గరి సంబంధాలుండేవి“ “అంటే- మీరిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడే మ్యూచ్వల్ అట్రాక్షన్ లో పడ్డారన్నమాట! మరి రేప్ కేసు ఎలా బనాయించారు? అప్పు డు శ్రీనిత్య యేం చేస్తుంది? చిందులేస్తూ తమాషా చూస్తుందా! ” “నాకొచ్చిన చిక్కంతా ఆమె వల్లనే కదా! తను ఒక్కసారంటే- ఒక్క సారి కూడా తన వయసు నాకు చెప్పలేదు. నిజం చెప్పాలంటే - మంచి దర్పంగా బిగువుగా కనిపించే ఆమెను చూస్తుంటే నాకెప్పుడూ వయసు గురించి అడగాలనిపించలేదు” మంగళ అతడి వేపు నిదానంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తరచి చూస్తే- దాదాపు అన్ని అంశాలూ పవన్ కి వ్యతిరేకంగానే ఉన్నట్లున్నాయి. ఆ మధ్య వచ్చిన చట్ట సవరణల ప్రభావం కారణంగా- ముఖ్యంగా నిర్భయ చట్ట ప్రవేశం జరిగిన తరవాత- వివిధ కోర్టులు వెలువరించిన కోర్టు తీర్పుల ప్రకారం పరిశీలిస్తే పవన్ కి ఇక్కట్టయిన పరిస్థితే! అంతేకాదు. అటువంటి అత్యాచార కేసుల్ని ఎదుర్కుంటూన్న మైనర్ అబ్బాయిలను సహితం ప్రభుత్వం విడిచి పెట్టనంటుంది. జువనైల్ చట్టాల్ని ప్రక్కన పెడ్తానంటుంది. మైనర్ బాలిక యెవరైన తానుగా ఇష్టపడి మగాడితో కలసినా- లేక వివాహం జరిగి, భర్తతో గర్భాదానానికని శారీరకమైన హింసకు లోనయినట్టు తెలిసినా- ఆ విషయమై చిన్నపాటి పిర్యాదు గాని పుట్టుకొస్తే చాలు.. మగాణ్ణి పెను ముప్పులోకి నెట్టవచ్చు. అటువంటప్పుడు—మేజర్ ఐన పవన్ వంటి యువకుడు మైనారిటీ తీరని అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ షిప్పుకు పాల్పడితే ఇక చెప్పడానికేముంది-- మొత్తానికి ఆచి తూచి చూస్తే, అన్ని సంఘటనలూ కోరలు చాచిన సర్పాల్లా అతడి చుట్టూ చేరి అతణ్ణి కాటేసేలా ఉన్నాయి- ఒక్కటి తప్ప. అదేమంటే- పవన్ వద్దకు కూతురు వచ్చీ పోవడం ఇంట్లో వాళ్ళకు తెలుసన్న వైనం నిరూపించగలిగితే! ముఖ్యంగా పెద్ద వాళ్ళ అనుమతితోనే రిలేషన్ షిప్పు సాగిందని చెప్పగలిగితే-- ఒక వేళ అలా నిరూపించిగలిగి- అమ్మాయి గార్డియన్స్ సరైన పధ్దతిలో కర్తవ్యపాలన చేయలేదని చెప్పగలిగినా- ఆ వైనం చాలా వరకు జడ్జిగారి స్వేఛ్చా నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అమెరికా వంటి దేశాలలో, మరి కొన్ని యురోపియన్ దేశాలలో అయితే- పదహారేళ్ళు పూర్తయిన అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ లో పాల్గొంటే అది దండించ దగ్గ నేరం కాదు. ఇక్కడ అలా కాదుగా! సందర్భం యెటువంటిదైనా సరే—మైనర్ గార్ల్ తో సెక్సువల్ రిలేషన్ షిప్పు చట్టరీత్యా ఇక్కడ అపాయకరమే-- ఇక మాటకు మాట చెప్పుకోవాలంటే- ఆ వయసు వచ్చేటప్పటికి- ఇక్కడిలా కాకుండా ఆ ఊరి అమ్మాయిలకి లైంగిక సంబంధాల వల్ల ఉత్పన్నమయే పర్యావసానాల గురించి తెలుసుకో తగ్గ అవగాహన లభ్యమయే ఉంటుంది. ఇప్పుడామె ఆలోచ నలు వెనక్కి మళ్ళిన రైలు బండిలా గతంలోకి మళ్ళాయి. భావ తరంగాలు వేడి వేడిగా వలయాలుగా లేచి తనువంతా ప్రాకాయి. తను పెళ్లి పీటల పైన కూర్చోక ముందు ఇతని కోసం తను ఎన్నెన్ని చోట్ల వెతికిందని. ఇతడి ఆచూకీ ఆరాతీయడానికి ఎక్కడెక్కడకి పరుగులు తీసిందని. ఒక రోజా లేక రెండు రోజులా- ఎన్నాళ్లు ఇతడి కడచూపుకోసం ఆక్రోశించిందని! ఈ మహాను భావుడేమో- ఇక్కడ గుట్టుగా చెరసాల నాలుగు గోడల మధ్య బైటి ప్రపంచానికి ఏ విధంగానూ కనిపించని రీతిన ఎగుడు దిగుడు గులక రాళ్లలా రోజుల్ని లెక్కిస్తూ చప్పుడు లేకుండా గడిపేస్తున్నాడు. మంగళ లోలోపల లేచి పడుతూన్న దు:ఖపు తెరల్ని ఆపుకోలేక పోతూంది. ఆమెకు తెలియకుండానే కళ్లు తడిసిపో తున్నాయి. ఇప్పుడు తనేమి చేయాలి? ముందుకు సాగాలా లేక వెనక్కి మళ్ళాలా? కాలాన్ని వెనక్కి పట్టిలాగే మాయాలోకపు టైమ్ మిషన్ తన వద్దలేదుగా! షాక్ ఆఫ్ ది లైఫ్ ఇది కాక- మరొకటి ఎక్కడైనా ఉంటుందా! స్త్రీ హృదయ కమలంలో కొలువై ఉండ వలసిన భానుతేజం- సర్వగుణ సంపన్నతకూ విశుధ్ధ వర్తనకూ ప్రతి రూపమైన పవన్ నేడిలా చీకటి గుహలో వాడి వడలి పోతుంటాడని తనెప్పుడైనా ఊహించిందా! చూస్తూండగానే మిల మిలా మెరిసే పుత్తడి కళ్లముందే పిత్తడిగా మారిపోవచ్చు. హిమ పర్వతాలు కళ్లముందే కుప్ప కూలిపోవచ్చు. కాని మానవజాతి మేలి రత్నమైన పవన్ కుమార్ స్త్రీపైన- అందునా మైనర్ గార్ల్ పైన అత్యాచారం చేసాడంటే ఎలా నమ్మడం. ? ఓడలు బళ్ళు- బళ్లు ఓడలు కావడం అంటే ఇదేనా! అంతలో లేడీ అసిస్టెంట్ వార్డెర్న్ సరోజ వచ్చి ఆ చివరన నిల్చుని సభా కార్యక్రమం ఆరంభమవబోతుందని గుర్తు చేయడంతో మంగళాదేవి తేరుకుని చివరి చూపుగా పవన్ ముఖంలోకి దీర్ఘంగా చూసి అక్కణ్ణించి కదలింది. అప్పుడు వెనకనుంచి పవన్ గొంతు వినిపించింది- “సారీ మంగళా! రియలీ సారీ! ” కాని ఆమె ఆగలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. తడిసిన కళ్ళను తుడుచుకోవాలన్న ధ్యాస కూడా మరచి వేగంగా నడవసాగింది.

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
39 views0 comments

Comments


bottom of page