top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 4


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 4'

New Telugu Web Series

Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 4' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ.

అశ్వథ్, మంగళ భార్యాభర్తలు.

అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ గా కొత్తగా ప్రమోట్ అయ్యాడు. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.

అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది..

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.



ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 4 చదవండి.

సభా కార్యక్రమం మొదలు పెట్టినప్పట్నంచీ మంగళాదేవి అదోలా బేల చూపులు సారిస్తూ- పలకరించి నప్పుడల్లా అరువు తెచ్చుకున్న నవ్వుని కళ్ళలో పోసుకున్నట్టు ముభావంగా ఉండటం గమనించిన అశ్వథ్ తన వంతు ప్రసంగం పూర్తి చేసిన తరవాత సభా సందడిలో తెరపి దొరకపుచ్చుకుని- మేటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్- అన్న ముఖభావాన్ని చూపిస్తూ భార్యను నిలదీసాడు- “అదేమిటోయ్- ఇంతవరకూ బాగానే ఉన్నావుగా! కుతూహలంగానే ఫామ్ అంతటా చూసొచ్చా వుగా! ఇప్పుడేమిటి- అలా ముఖం వ్రేలాడదీసుకుని కూర్చున్నావు?” మళ్ళీ అదే పెట్టుడు నవ్వుముఖంతో తిరిగి చూసి అదేమీ లేదని చెప్పింది- “నిన్ను తాకి మూడు ముళ్ళూ వేసిన వాణ్ణి. నువ్వెప్పుడు ఎలా ఉంటావో- ఏ నవ్వు ముఖంతో ఎప్పుడెలా ఉంటావో నాకు తెలీదూ!” మంగళాదేవి బదులివ్వకుండా ఊరకుండిపోయింది. కాని అశ్వథ్ మాత్రం ఊరకుండలేక పోయాడు. “చీరకట్టుకే అందం వచ్చేలా డిజైనర్ సారీలా అలంకరించుకొచ్చిన నిన్నే తోటి ఆఫీసర్ల భార్యలందరూ గమనిస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించవద్దూ! సైకలాజీ చదివిన విద్యావంతురాలివి, దేహభాష పట్ల అంతటి అనవగాహన ఉంటే ఎలాగోయ్? ” భర్త మాటల్ని విన్న మంగళ వెంటనే అలార్టయి తేరుకుంది. వెండి మబ్బులా ఫెళ్ళున నవ్వి ముఖంలోకి గ్లో తెచ్చుకుంది- “అబ్బే! మరేమీ లేదండీ. ఏపుగా పెరిగిన ఆ పచ్చటి ఫల వృక్షాలను పసిపిల్లల్లా సాకుతూ- తమకు మిగిలిన జీవితానందమంతా వాటివల్లే సుమా! ‘ అన్నట్టు భక్తితో వాటి ఆలనా పాలనా గమనిస్తూన్న ఖైదీలను చూసింతర్వాత మనసెందుకో భారంగా మూడీగా మారిపోయిందండి. అయినా మీరు మరీ సీరియస్ గా అలా ముఖం పెట్టి చూడకండి. ఇద్దరమూ గొడవ పెట్టుకుంటున్నా మనుకునేరు“ అశ్వథ్ ఆగలేదు. “అదలా ఉంచు. ఇప్పుడు నీ తంతు మరీ విడ్డూరంగా ఉందే! పచ్చని చెట్లు చూసి- ఉత్సాహంగా పని చేసే ఖైదీలను చూసి నీ ముఖం ఉత్తేజంతో విప్పారాలే గాని- సిగ్గాకులా ఇలా ముడుచుకుపోవటం యేమిటోయ్? ” “పెళ్ళాం మూడ్సు గురించి మరీ దిగాలు పడిపోకండి. ఆడాళ్ళలో ఉన్న హార్మోన్స్ అటువంటివి మరి. క్షణ క్షణ భంగురముల్-- “ భార్య మాటలకు వెంటనే యేదో అనాలని నోరు తెరిచిన అశ్వథ్ ఉన్నపళాన ఆపుకున్నాడు. ప్రక్కనే ఉన్న అతిథులతో ఆహ్వానితులతో మాటలు కలుపుతూ చూపులు మరల్చాడు. మంగళకు కర్మఫలం యెలా సంభవిస్తుందో- దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదా! పలుదశల్లో ధీర్ఘమైన పోలీసు ట్రైనింగ్ తీసుకొని సున్నిత మానవ మనోతత్వ విషయాలపై అవగాహనా క్లాసులు హాజరయిన అశ్వథ్ కు భార్య ఇచ్చిన వివరణలో సంపూర్ణత లోపించినట్లనిపించింది. ఫంక్షన్ కి రాకముందో వచ్చిం తర్వాతనో ఏదో జరిగి ఉంటుంది. కచ్చితంగా తన అత్తగారితో పేచీకి దిగుండదు. ఇద్దరి మధ్యా అవ్యాజమైన అనురాగబంధం! తనపైన ఇద్దరూ కలసి కట్టుగా జంట దాడి కూడా చేస్తుంటారు. మరేమి జరేగుంటుంది? ఇప్పటికావిషయాన్ని విడిచిపెట్టేయడమే మంచిదని పించిందతనికి. మంగళ నిండుకుండ. అంత త్వరగా తనలో ఇమిడి ఉన్న భావావేశాన్ని వ్యక్తం చేసి తేలిపోయే మనిషి కాదు. జరిగిందేమిటో తెలుసుకోవడానికి తానుగా ఆసక్తి చూపిస్తే-- ఆమె గుల్లలోకి తనకు తానుగా డిప్పలోకి లాక్కునే నత్తలా ఒదిగిపోయి మరింత మూడీగా తయారవచ్చు. ఆమె అలా ఉండటం తను భరించలేడు. సభా కార్యక్రమం ముగిసిన తరవాత మరొక బ్లాకులో విడిగా ఉన్న తన ఆఫీసు గదికి భార్యను తీసుకువెళ్ళా డు అశ్వద్. ఆమెకు కాఫీ ఇప్పించి సౌకర్యంగా కూర్చునేలా ఏర్పాటు చేసి కొన్ని ముఖ్యమైన ఆఫీసు పేపర్లను తీసుకుని చదు వుతూ దస్త్రాలపై రిమార్కులు వ్రాస్తూ కనుకొలకుల ఓరనుంచి మంగళ ముఖ కవళికల్ని గమనించసాగాడు అశ్వథ్. అంతకు ముందు- కొన్ని గంటల ముందు- కారు మేఘాల మధ్య చంద్రబింబంలా తేలుతూ వెలిగిన భార్య ముఖంలో ఉన్నట్లుండి తేటదనం లోపించడం అతడికి కొట్టవచ్చినట్లు కనిపిస్తూంది. భార్య ముఖం అలా కాంతిని కోల్పోయుండటం అతడికి సందిగ్ధంగా ఉంది. మంగళ అతడికి సమీపంగా కూర్చుని జైలు పరిసరాలను పరకాయిస్తుండగానే అతడు ఫైల్సు చెక్ చేసి సంతకాలు పెట్టడం కానిచ్చి- ముఖ్యమైనవి పైఅధికారుల పర్యవేక్షణకై మార్కుచేసి, బయట తన కోసం నిరీక్షిస్తున్న సెంట్రీని పిలిచి గది తలు పులు వేసుకొమ్మని పురమాయించి- “వెళ్దాం పద! ”అంటూ కదిలాడు అశ్వథ్. అతడి పిలుపు మంగళ చెవిన పడనట్లుంది. ఎక్కడ కూర్చున్నది అక్కడే కదలకుండా ఎటో చూస్తో ఉండి పోయిందామె. ఆమె చూపులు అల్లంత దూరాన ఉన్న ఓపెన్ ఎయిర్ జైలు స్థలం వేపు సారించి ఉన్నాయి. అతడు మాట్లాడకుండా వెళ్లి మంగళ భుజాన్ని ఓ పారి కుదిపి బైటకు నడిచాడు. ------------------------------------------------------------ మరునాడు తనకు డ్యూటీ ఇన్ చార్జీ అయిన కొలీగ్ డ్యూటీలో చేరడం వల్ల అశ్వథ్ అదే రోజు సాయంత్రం సెంట్రల్ హోమ్ మినిస్టరీ ఆధ్వర్యాన పూణేలో జరగబోతూన్న పోలీసు ఆఫీసర్ల విజిలెన్సు ట్రైనింగు ప్రోగ్రాము హాజరు కావడానికి పూణే ట్రైను అందుకోవడానికి స్టేషన్ చేరుకున్నాడు. పోలీసు ఆఫీసర్ల క్యాడర్ లో విజిలెన్స్ ట్రైనింగు తీసుకోవడమంటే ప్రమోషన్ వరు సలోనో- స్ఫెషల్ గ్రేడు నిచ్చెనకో అతను సమీపంగా ఉన్నాడన్న మాట. రైలు కంపార్టుమెంటులోకి ఎక్కింతర్వాత పెట్టే బేడా సర్దుకున్న తరవాత తనను సాగనంపడానికి వచ్చిన జూనియర్ స్టాఫ్ ఆఫీసరుని ఇక తనకోసం ఉండనవసరం లేదని సాగనంపేసి అలా వచ్చి కుదురుగా కూర్చున్నాడో లేదో- తన కోసమే అక్కడ తచ్చాడుతూ కాచుక్కూర్చున్నట్టు ఆలోచనలు అడవి కందరీగల్లా అతణ్ణి ఆక్రమించుకున్నాయి. అతడు ఉన్న పాటున కళ్ళు మూసుకున్నాడు. రెప్పల వాకిళ్ల ముందు మంగళ రూపాన్ని తెచ్చుకున్నాడు. కమల శోభిత మంగళ ప్రదం తన భార్య ముఖార విందం! ఎదుటివారి ఆనందమే తన దనుకుని- పరుల దు:ఖాలే తనవని జీవించే వారు కొందరుంటారు. తన సతీ మణి ఆ కోవకు చెందిన స్త్రీ అని అతడికి తెలుసు. అటువంటి వారు త్వరగా స్పందించి తల్లడిల్లుంపుకు లోనవుతుంటారని కూడా అతడికి తెలుసు. కాని ఒక్కరోజులోనే మాటకందని అంతటి విచిత్రమైన పరిణామమా! భార్యా భర్తల మధ్య ఎక్కడైనా దేనినైనా దాచవచ్చు. కాని-- పడక గదిలో మాత్రం ఏదీ దాగదు. తెలిసీ తెలియని పెక్కు మృదు మనోభావాలను మొదట సహచరి కళ్లు చెపుతాయి. ఆ తరవాత మిగిలినవి; హృదయాలు కలసినప్పుడు, స్త్రీ పురుష మనోరాగాలతో బాటు శరీరాలు ఒక్కటైనప్పుడు వాటికవే ప్రస్ఫుటితమవుతాయి- నీటి కొలనులో వలయాలుగా తేలే అలల్లా-- మనసుకి ఉన్న అంతర్గతమైన ఘ్రాణ శక్తి అటువంటిది. ఈ రీతిన సాగితే తన మంగళ తనకు క్రమక్రమంగా దూరమవుతుందేమో! ఇది అపోహగా మిగిలిపోతే పర్వాలేదు, నిజమై నిప్పై కూర్చుంటే-- అతడలా ఏ. సీ బోగీలో కూర్చుని ఆలోచిస్తూ సాగిపోతున్నప్పుడు మరొక పాయనుండి మరొక విచిత్రమైన ఆలోచనా కెరటం అనూహ్యమై రీతిన పుట్టుకొచ్చింది. ఇంతకూ మంగళ తన మూడీ ప్రపంచంలో తను తేలిపోతూ అతడి కోసం దారిలో ఆరగించడానికి యేదైనా చేసి పంపించిందా లేదా! అనుకున్నదే తడవుగా అశ్వథ్ హ్యాంగింగ్ ర్యాక్ పైన ఉంచిన ట్రావెలింగ్ బ్యాగ్ జిప్స్ చరచరా తెరిచి చూసాడు. అతడి నేత్రాలు కాంతివంతంగా విచ్చుకున్నాయి. తన కిష్టమైన టమోటా వేపుడన్నం- మధ్యన కోడిగుడ్డు- దాని చుట్టూ దోరగా వేసిన ఉల్లి ముక్కలు- విడిగా చిన్న డబ్బాలో అప్పడాలు. వాటిని చూసి అతడికి నోరూరింది. మంగళ కాపురానికి రాకముందు తన తల్లి కూడా ఇలానే చేసి పంపించేది టూరుపైన వెళ్ళినప్పుడల్లా--. ఇవన్నీ చూపుకి చిన్నచిన్నవే! కాని పొడిబారుతూన్న మనిషి జీవితంలో అవి చెలమలై సేదతీరుస్తాయి. బెర్తుపైన కుదుపులకు లోనవుతూ పడుకున్న అశ్వధ్ కి రాత్రి కలవచ్చింది. తనకీ తన జీవితానికీ ఈషణ్మాత్రమూ సంబంధం లేని కల. తెల్ల చీర కట్టుకున్న మంగళను యెవరో ఆకాశం నుండి ఆమాంబాపతు చేతులు చాచి మబ్బుల్లోకి లాక్కు పోవడానికి పెనుగులాటకు పాల్పడతున్నారు. తను నిస్సహాయుడై నిర్లిప్తంగా చూస్తూ నిలుచున్నాడు. ఇదెక్కడి మాయదారి కల? మూడు ముళ్ళూవేసి తన దానిని చేసుకున్న భార్యను లాక్కుపోతుంటే, తను నిర్జీవంగా చూస్తూ నిల్చుంటాడా! ------------------------------------------------ పూణేలో ట్రైనింగు ముగించుకొని ఎనిమిదవరోజు హైద్రాబాదు చేరిన అశ్వథ్ కి తలంటుపోసుకొని జారు ముడి వేసుకున్న జడలో జాజిమల్లె దండను తురుముకుని, నుదుట చిక్కటి గుండ్రటి బొట్టు దిద్దుకుని ముఖారవిందాన తెలికాంతు ల్ని నింపుకొని ఎదురొచ్చిన మంగళను చూసి అతడి మనసు పులకాంకితమైంది. అప్పుడప్పుడే అమావాస్య ముగిసి- కారు చీకట్లు చెదరి పున్నమి వెన్నెల ఫెళ్ళున పొటకరించి నట్లనిపించింది. తను లేని ఈ ఏడు రోజుల్లోపల మంగళ తన బరువైన మూడీ వాతావరణం నుండి బైటపడి సర్దుకున్నట్లే కనిపించింది. ఆడాళ్ళలో అనుదినం చిత్రాతి చిత్రంగా పరిణామం పొందే హార్మోనుల అసమతుల్యతా ప్రభావం కూడా కొంత కారణమై ఉంటుందేమో! తను యేదోదో అనుకుంటున్నాడు గాని ఇదంతా తాత్కాలికి మార్పే నేమో! కాని—వాస్తవ పరిస్థితి అదికాదని- మంగళ తన మన:స్థితిని పూర్తిగా పూర్వస్థాయికి సమకూర్చుకో లేదని ఆరోజు రాత్రే అతడికి తెలిసొ చ్చింది. వారం రోజుల యెడబాటు కదూ-- అనుభవ సారం పుణికి పుచ్చుకున్నభరతమ్మ కొడుకూ కోడలూ మాట్లాడుకొనే ఊసులు చెవిన పడకూడదన్న తలంపుతో పెందలకడే హాలుని ఖాలీ చేసి వెళ్లి పడుకుంది. మృదువైన రాత్రి మధురమైన అమృత వాహినిలా ప్రవహిస్తూంది. మత్తుగా పూలగుత్తులా వాలుతూ మోహతరంగాలను రేపుతూన్న తరుణంలో రతీదేవిలా అలంకరిచుకుని అల్లనల్లన నడుస్తూ గదిలోకి ప్రవేశించింది మంగళ. మరువం దవనం యవ్వన మకరందం కలబోతగా వ్యాపించి “జీవితమంటే తోటనుండి విరజిమ్మే పరిమళమే కదా! జగమంతా ఒక మధురోహల ఊయలే కదా! ” అనిపించేలా ఉంది. భార్యను చూసి తనకు తానుగా సర్దుకుని లేస్తూ అన్నాడు అశ్వథ్- “అదేమిటోయ్ ఈరోజు నన్నింతగా ఉక్కిరి బిక్కరి చేసేస్తున్నావు! ఎప్పుడూ అత్తగారి సలహాలు తు చ పాటిస్తూ గ్రహాల కదలికలు గట్రా చూసింతర వాతనే కదా నన్ను కటాక్షిస్తావు. మరి ఈరోజేమిటి- మోహ సముద్రంలో ముంచేసేలా వచ్చావు? ఏడు రోజుల ఎడబాటు తెచ్చిన విరహవేదనా లేక మొగుణ్ణి చూడలేదన్న బెంగపాటా! ” “ఏమైనా అనుకోండి గానీ- ఏదైనా విశేషం ఉంటేనే మీ దగ్గరకు చేరాలా యేమిటి! ఆడదానిగా నాకంటూ ముద్దూముచ్చట్లూ తీర్చుకోవాలన్నఆశ ఉండదా! ఇప్పటికే మా అత్తగారు- ‘పుల్లపునుకులు నీకెప్పుడు చేసిపెడ్తానో కదా! ’ అని నిట్టూర్చ నారంభించింది. “అబ్బే! నేనా ఉద్దేశ్యంతో అనడం లేదోయ్! ఎప్పుడూ పట్టుదొరకనివ్వకుండా ఊరిస్తూ విసిగిస్తూ ఉంటావు కదా! అది తలంపుకి వచ్చి అడిగానంతే! “అంటూ మంగళను దగ్గరకు తీసుకుని ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడతను. “సరే- నాకొక నిమిషం టైమివ్వండి మీ అనుమానం నివృత్తి చేస్తాను. రాత్రి బండెక్కేముందు మీ ఆఫీసర్ల గెట్ టు గెదర్ పార్టీలో యేమి తిన్నారు? “ “ఆఫీసర్లకు ఇచ్చిన డిన్నర్ పార్టీలో బిర్యాణీ తిన్నాను. సోవాట్? ” “పూర్తిగా వినండి మహాశయా! ఊదయమూ అదే బిర్యాణీ తీసుకున్నారనుకోండి. ఇప్పుడూ అదే పెట్టానను కోండి. మీకెలా ఉం టుంది? ” మంగళ మాటల్లో అణగి ఉన్న అర్థాన్ని అందుకోవడానికి అతడికి యెక్కువ సేపు పట్టలేదు. మనసు మూలన ఫెళ్ళుమన్న మధురోహతో తపిస్తూ కంపిస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడతడు- “అమ్మ దొంగా! ఊరించి ఊరించి మొగణ్ణి కొంగున కట్టి పడేసుకున్న సరసురాలివని నిరూపించుకున్నావు సుమా! “ ఆమె మాత్రం అతడి ఆశ్చర్యానందాలను గమనించకుండానే తెలుగింట ఆలుమగల రమణీయ రసికతకు బారెడు గుర్తుగా నిలచే తాంబూల సేవనం కోసం ప్రక్కనున్న పళ్లెం నుండి పచ్చటి లేలేత తమలపాకు చేతిలోకి తీసుకుని చిక్కటి చిరు నవ్వుల రవ్వల్ని నేలరాల్చనీయకుండా పదిల పర్చుకుంటూ- పచ్చ కర్పూరంతో వక్క పొడిని మితంగా మిళితం చేస్తూ- అందులో తీయందనానికి జతగా గుల్ కంద్ ను కూడా కలిపి అతడి నోటికి అందిచ్చింది. మధురం మధురం అతి మధురం-- అంతటితో ఆమె ఊరుకోలేదు చాలించలేదు. తాంబూల రాగంతో నిగారించుకున్న చక్కటి చిక్కటి ఎర్రదనాన్ని పెదవుల నిండా రుద్దుకుని నాలిక కుదురుగా ఎర్రబారిందో లేదోనని ఓ పారి చూసుకుని అశ్యథ్ పెదవులపై ల్యాండ్ చేసింది. వాతావరణం చల్లబడ్డ తరవాత, చిక్కటి రాత్రి అమృత ధారగా మారి రసకర్పూరమై కరిగిన తరుణాన మంగళ అలసి పోయిన కళ్ళతో కవ్వింపుగా చూస్తూ అడిగింది- “ఎలాగుంది? ” “గుల్ కంద్ చేర్చిన లేత తమలపాకు కదూ- ఇక చెప్పాలా! అమృతం స్రవించినట్లుంది“ “నా మోహం! గోడకు వ్రేలాడదీసిన బొమ్మలేని పటంలా ఉంది తమరి తెలివి. మీ పోలీసోళ్ళకు మొరటి శృంగారం గురించి తప్ప- లేత తలిరాకు వంటి స్త్రీ సున్నిత మోహావేశం గురించి ఎలా తెలుస్తుంది! నేనడిగేది ఈ రాత్రి- మన రాత్రి ఎలా గడచిందని” “ఎలా చెప్పాలో- అసలు చెప్పాలో చెప్పకూడదో తెలియదు గాని- నీకు ప్రతిసారీ థేంక్స్ చెప్పాలనిపిస్తుంటుంది” ‘ఎందుకో? ’ అన్నట్టు కనుబొలెగరేసి చూసింది మంగళ. ”నీతో గడిపే ప్రతి రాత్రీ మొదటి రాత్రిలా మధురాతి మధురంగా ఉంటుందోయ్“ “థేంక్స్! మరి నేను మీకొకటి చెప్పాలను కుంటున్నాను. చెప్పేదా? ” “చెప్పేదా అంటే అడగబోతున్నానేగా అర్థం! అడుగడుగు. ఏదైనా అడుగు. ఇస్తాను. “ “ఇక అడగడానికేముంది లెండి, ఇద్దరి తనువులూ ఒక్కటై సెలయేరై ప్రవహిస్తున్నప్పుడు“ “మరింకేం కావాలంటావు? మనసు విప్పి చెపితేనే కదా తెలుసుకునేది-- ” “ మొన్న హ్యూమన్ రైట్సు డే నాడు సభా కార్యక్రమం జరుతున్నప్పుడు జైలు ప్రాంగణం లోపలకు వెళ్ళాను కదా-- వెళ్ళి ఓపెన్ ఎయిర్ జైలుస్థలంలో పెరుగుతూన్న పూలచెట్లూ పండ్లచెట్లూ చూస్తూ ఇంకా ఇంకా లోపలకు వెళ్ళాను కదా! ” “అవును వెళ్ళుంటావు, ఇంతకీ యేమంటావు? ఆ ఫల వృక్షాలన్నిటినీ భారీ క్రేనులతో పెకలించి ట్రాక్టర్లలో పెట్టి మన స్టాఫ్ క్వార్టర్సు పెరట్లో ట్రీ ట్రాన్స్ లొకేషన్ చేసేద్దామంటావా! ” “అబ్బ! మీరు మరీను. మీకు హ్యాపీ మూడ్ కలిగితే ఆపడం కష్టం- నయాగరా ఫాల్సే! ఒక్క నిమిషం- నా కోసం- జోక్స్ కట్టిపెట్టి చెప్పేది వింటారా? “ ఈసారి అశ్వథ్ కుదురుగా సర్దుకుని కూర్చున్నాడు బుధ్ధిమంతుడిలా ముఖం పెట్టి తలాడిస్తూ-- “అప్పుడు ఆ చెట్ల సముదాయంలో ముతక యూనిఫాంలో చెట్లను పరామర్షిస్తున్న ఒక ఖైదీని చూసానండి. ఖైదీ నెంబర్ టు జీరో త్రీ- అనుకుంటాను” అప్పుడు అశ్వథ్ అడ్డొచ్చాడు- “ఒక్క ఖైదీ మాటేమిటి? అందరు ఖైదీలు, కొందరు జైలు వార్డెర్లు కూడా ముతక యూనిఫారమ్ లోనే ఉంటారు. వాళ్ళకూ నెంబర్లుంటాయి. ఇందులో నువ్వు చూచిన విచిత్రం యేమిటంట! ”

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.







62 views0 comments
bottom of page