ధనమూలమిదం జగత్
- Lalitha Sripathi
- Apr 16
- 7 min read
#TeluguMoralStories, #నైతికకథలు, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #Dhanamulamidam Jagath, #ధనమూలమిదం జగత్

Dhanamulamidam Jagath - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 16/04/2025
ధనమూలమిదం జగత్ - తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“సీతారాముల కళ్యాణం చూతం రారండి “ అంటూ మైక్ లో నెమ్మదిగా పాటలు వినిపిస్తుంటే ఆడవాళ్ళు మంచి పట్టుచీరలు, నగలతో సంబరంగా తిరుగుతున్నారు.
హైదరాబాద్ లో అది ఒక పెద్ద కళ్యాణ మండపం. అక్కడ పెళ్లి జరపాలంటే కనీసం సంవత్సరం ముందు బుక్ చేస్తే కానీ దొరకదు. పూల అలంకరణ, ఫోటోలు, భోజనాలు అన్నీ ఆ మండపం వాళ్ళే సమకూరుస్తారు కానీ, దానికి తగ్గట్టే డబ్బు తీసుకుంటారు.
ఒక మామూలు మధ్య తరగతి వాళ్ళు, అక్కడ పెళ్లికి వెళ్లి, ఆ హాలు అతిశయం చూద్దామనుకుంటారు కానీ వాళ్ళ స్థాయి వాళ్ళు చేసే పెళ్లిళ్లు అక్కడ జరగవు. అక్కడకి వచ్చే ఖరీదైన కార్లు, అందులోనుంచి వజ్రాల నగలు, లక్షల ఖరీదైన దుస్తులు వేసుకుని వచ్చే మనుషులు దేవలోకం నుంచి వచ్చారేమో అన్నట్టు ఉంటారు.
అటువంటి మండపంలో రాధాకృష్ణ కూతురు పావని పెళ్లి ఇవాళ.
అలాఅని, రాధాకృష్ణ ధనవంతుడు కాదు, ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. అతని భార్య రుక్మిణి కూడా ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసి ప్రస్తుతం గృహిణిగా సమయం గడుపుతోంది.
వీరికి ఇద్దరు పిల్లలు, అబ్బాయి ప్రవీణ్ పెద్దవాడు, తరవాత అయిదు సంవత్సరాలకి పుట్టింది అమ్మాయి పావని. తల్లీతండ్రి ఇద్దరూ టీచర్లవడంతో పిల్లలు కూడా మంచి చదువులు చదివారు.
రాధాకృష్ణ తండ్రి, సాంబశివరావు కూడా స్కూల్ టీచర్ గా చేసాడు. పెద్దలిచ్చిన ఒక పెంకుటింట్లో భార్య పార్వతి, తన నలుగురు పిల్లలతో ఉండేవాడు.
పెద్దపిల్ల పెళ్లి ఇల్లు తాకట్టు పెట్టి చేసాడు, ఎక్కువ చదివించలేనని పెద్ద కొడుకు రాధాకృష్ణని బీఎడ్ చెయ్యమన్నాడు. అటు కొడుకు స్కూల్ లో టీచర్ గా చేరడం, ఇటు సాంబశివరావు కాలం చెయ్యడం, కొద్ది తేడాలో జరిగిపోయాయి.
ఇంటి బాధ్యత, తమ్ముడు చదువు, చెల్లి పెళ్లి, సినిమా కష్టాలన్నీ రాధాకృష్ణని చుట్టుముట్టాయి.
“అమ్మా! నాకు ఏం చెయ్యాలో దిక్కు తోచడంలేదు. అటు ఇంటిమీద అప్పు. ఇటు ఇంటి ఖర్చులు, రమేష్ ఇప్పుడు ఇంటర్ లోకి వచ్చాడు, చెల్లెలు రమ్య తొమ్మిదో క్లాస్. వాళ్ళ చదువులు ముందున్నాయి. నాన్న పెన్షన్ డబ్బులు అప్పుకి కట్టినా ఇల్లు ఎలా నడపాలి, నాకు అంతా అయోమయంగా ఉంది” తల్లితో వాపోయాడు.
“ఖంగారు పడకు కృష్ణా! ఒక చేత్తో తీసిన దేవుడు ఇంకో చేత్తో ఇస్తాడు. నేను ఇంట్లో కూరగాయలు పండిస్తాను. నాకు కుట్టు వచ్చుగా, ఆడవాళ్ళకి జాకెట్లు, డ్రెస్సులు కుడతాను,పండగలప్పుడు లడ్లు, కారాలు చేస్తే ఇంకా కొన్ని డబ్బులు వస్తాయి” ధైర్యం చెప్పింది పార్వతి.
తల్లి ఆ రకంగా కష్టపడడం ఇష్టం లేకపోయినా వద్దు అనలేకపోయాడు రాధాకృష్ణ. ఏడాది పాటు పార్వతి తన శక్తికి మించే కష్టపడింది.
సాంబశివరావు సంవత్సరీకం అవగానే కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది పార్వతి.
వీళ్ళ కుటుంబానికి బాగా కావాల్సిన వాళ్ళ ద్వారా రుక్మిణి సంబంధం వచ్చింది. రుక్మిణి కూడా టీచర్ గా పనిచేస్తోంది. ఆమె తండ్రి పెద్ద కట్నాలు ఇవ్వలేనని పెళ్ళి మాత్రం శక్తి మేరకు చేస్తాను అని చెప్పాడు. అమ్మాయి ఉద్యోగం చేస్తోందని రాధాకృష్ణ వెంటనే ఒప్పుకున్నాడు, పెళ్లి చూపులలోనే తన బాధ్యతల గురించి చెప్పాడు. రుక్మిణి అది తన బాధ్యత కూడా అనేసరికి ఆమెని తన జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించాడు.
పార్వతి కూడా రుక్మిణి ఉద్యోగానికి వెళ్లాలని తనకి చేతయిన పని సాయం చేసేది. పెళ్లయ్యాక రాధాకృష్ణ, రుక్మిణి ఇద్దరూ పార్వతి కి గట్టిగా చెప్పారు ఇంక ఇదివరకటిలాగా వేరే పనులు పెట్టుకోవద్దు, ఇంట్లో కొద్దిగా సాయం చేస్తే చాలని.
రుక్మిణి స్కూల్ నుంచి ఇంటికి రాగానే రమేష్, రమ్యాలని కూర్చోపెట్టి చదివించేది.
రమేష్ “కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తాను వదినా! నేను అమెరికా వెళ్లి పై చదువులు చదివి బోలెడు డబ్బు సంపాదించి నీకు పంపుతాను. నువ్వు, అమ్మ నగలు చేయించుకొండి, రమ్యకి పెళ్లి చెయ్యండి” అంటూ కబుర్లు చెప్పేవాడు.
“మాటలు కాదు రమేష్ నువ్వు బాగా చదివి నీకు కావాల్సిన సబ్జెక్టులో మంచి కాలేజీలో సీట్ తెచ్చుకో” అనేది రుక్మిణి.
రమేష్ మాటలు విని పొంగిపోయేది పార్వతి. “నన్ను కూడా అమెరికా తీసుకెళ్లరా రమేష్!” అన్న తల్లితో “నాకు ఉద్యోగం రాగానే నిన్ను తప్పక తీసుకెళ్తానమ్మా” ఆ మాటలకి ఊహలలో తేలిపోయేది పార్వతి.
రమేష్ ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంక్ కి ఉన్న ఊర్లో కంప్యూటర్ లో సీట్ రాదు.
పోనీ వేరే సబ్జెక్ట్ తీసుకోమని అన్న అంటే అన్నం మానేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
“సిటీలో అయితే చాలా కాలేజీలు ఉంటాయి, అక్కడ హాస్టల్ లో ఉండి చదువుతాను,సాయంత్రం వేరే కోర్సులు చెయ్యచ్చు” అన్న రమేష్ తో రాధాకృష్ణ “నేను డబ్బులు ఎత్తి పంపడం కష్టంరా !” అంటున్న రాధాకృష్ణని ఆపుతూ “రమేష్! ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నాకు వాగ్దానం చెయ్యి,నువ్వు శ్రద్ధపెట్టి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి” అంది రుక్మిణి.
“వదిన.. నువ్వు దేవతవి వదినా!” అంటూ రుక్మిణి కాళ్ళకి దణ్ణం పెట్టాడు.
అన్నట్టుగానే, రమేష్ ఇంజినీరింగ్ చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇంక పరవాలేదు, తమ్ముడి సాయంతో అప్పులు తీర్చి, రమ్య పెళ్ళి చేసి, ఆ పెంకుటింటిని పడగొట్టి మంచి ఇల్లు కడదామనుకున్న రాధాకృష్ణతో, తను అమెరికా వెళ్తున్నానని, తన క్లాసుమేట్ ని పెళ్లి చేసుకుంటే మామగారు ఖర్చు భరిస్తానన్నారని, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పాడు.
హతాశులయ్యారు రాధాకృష్ణ, రుక్మిణి.
చిన్న కొడుకు పెళ్లి ఘనంగా చెయ్యాలని కలలు కన్న తల్లి ఆశలు వమ్ము చేస్తూ, రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని విమానం ఎక్కారు రమేష్ దంపతులు.
పోనీలే, అమెరికా నుంచి డబ్బు పంపుతాడు అనుకుంటే, తల్లి ఖర్చు కోసమని, నెలకి పదివేలు, సరిగ్గా నాలుగు నెలలు పంపి మానేసాడు.
రమ్య డిగ్రీ చదివి బ్యాంకు పరీక్షలు వ్రాసి బ్యాంక్ లో ఉద్యోగం తెచ్చుకుంది. రమ్యకి అదే బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేసే అబ్బాయి తో పెళ్ళి కుదిరింది. కనీసం పెళ్లికి సాయం చెయ్యమని రమేష్ ని సిగ్గు విడిచి అడిగింది పార్వతి.
“అమెరికా అంటే డబ్బులు కురుస్తాయి అనుకుంటారు మీరంతా, ఇక్కడ తగ్గ ఖర్చులు ఇక్కడ ఉన్నాయి, నాకు డబ్బు పంపడం కుదరదు, మాకు సెలవలు లేవు అందుకే పెళ్లికి కూడా రాలేము” అని తెగేసి చెప్పాడు రమేష్.
చెల్లెలికి బహుమతి అని పదివేలు పంపాడు. ఆ రోజంతా పార్వతి ఏడుస్తునే ఉంది.
తల్లిని చూసుకోవడం బరువు అనుకోకపోయినా, అక్క చెల్లెళ్లకి పసుపు కుంకం అని, పురుళ్ళు పుణ్యాలని, ప్రతీ ఏడూ ఖర్చులతో నడుం విరిగింది రాధాకృష్ణకి.
అవి కొద్దిగా తగ్గేసరికి, పిల్లలు చదువుకు వచ్చారు. ప్రవీణ్ ముందు నుంచి క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు. ఇంటర్ లో లెక్కలు తీసుకుని, ఐఐటీ లో చేరడానికి కోచింగ్ లో చేరతాను అన్నాడు.
వాళ్ళ టీచర్లు కూడా “ఐఐటీ కోచింగ్ ఉన్న కాలేజీలో పెడితే ప్రవీణ్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటాడు” అన్నారు.
దానికి కావాల్సిన డబ్బు తన దగ్గర లేదని, సంశయిస్తూనే తమ్ముడికి ఫోన్ చేసి సాయం అడిగాడు రాధా కృష్ణ.
ఒకసారి సాయం చేస్తే అదే అలవాటుగా మారి, ప్రతీ దానికి అడుగుతారన్న భార్య మాటలతో ఏకీభవించి, ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను, సాయం చెయ్యలేనని చెప్పాడు రమేష్.
తమని ఎక్కడ అడుగుతాడో అని, అక్క చెల్లెళ్లు ముందే చెప్పారు తమ దగ్గర డబ్బులు లేవని.
రుక్మిణి మెళ్ళో గొలుసు అమ్మి, కాలేజీ ఫీజు కట్టి చేర్పించారు ప్రవీణ్ ని.
తల్లితండ్రుల కష్టం గ్రహించిన ప్రవీణ్, కష్టపడి చదివి, మంచి రాంక్ తో ఐఐటీ లో చేరాడు. ఫీజుకి, హాస్టల్ కి తండ్రి అప్పులు చేస్తున్న సంగతి తెలిసినా, తనకి ఉద్యోగం రాగానే తీర్చచ్చు అనే ధైర్యంతో మరింత శ్రద్ధగా చదివాడు.
నాలుగేళ్ళ ఇంజినీరింగ్ చదువు తర్వాత, స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్లి ఎంబీఏ చేసాడు.
అప్పుడు రమేష్ కి, ప్రవీణ్ అమెరికాలో ఉన్న సంగతి చెప్పను కూడా లేదు.
చదువు పూర్తి అయ్యి, అమెరికా కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకున్న ప్రవీణ్, తన సంపాదనతో, ఒకొక్కటిగా అన్ని అప్పులు తీర్చాడు. ఉన్న ఇల్లు లో అందరికీ వాటా ఉందని, ఆ ఇల్లు అలానే అద్దెకి ఇచ్చి, కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో విల్లా కొన్నాడు.
అప్పటికి రాధాకృష్ణ రిటైర్ అయ్యాడు, రుక్మిణి ఉద్యోగం మానేసింది. పావని కూడా మంచి కాలేజీ నుంచి ఇంజినీరింగ్ చేసి ఉద్యోగంలో చేరింది.
పార్వతి మనవడి అభివృద్ధి చూసి పొంగిపోయింది.
"చిన్నప్పటి నుంచి మీ నాన్నకి అన్నీ కష్టాలే, మీ అమ్మకి ఈ కుటుంబం కోసం చెయ్యడమే సరిపోయింది, నువ్వన్నా వాళ్ళని సుఖపెట్టాలిరా ప్రవీణూ!" అనేది మనవడితో.
"వాళ్ళని మాత్రమే కాదు నానమ్మా! నిన్ను కూడా మహారాణిలా సుఖపెడతా చూడు" అంటూ
నాయనమ్మకి నగలు చేయించాడు ప్రవీణ్.
ఆ రోజున ఆవిడ సంతోషానికి హద్దులు లేవు. కనపడ్డవాళ్ళకి, కనపడని వాళ్ళకి మనవడు నగలు కొన్న సంగతి ఒకటే చెప్పుకుంది.
ఉద్యోగంలో చేరిన అయిదేళ్లకి, ప్రవీణ్, తన స్నేహితుడు ప్రకాష్ తో కలిసి, హైదరాబాద్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.
అతి కొద్ది కాలంలోనే, పదిమంది ఉద్యోగులతో మొలకగా ప్రారంభమైన ఆ కంపనీ, వెయ్యి మందితో పెద్ద కంపెనీగా అవతరించింది.
భాగస్వామిగా ఉన్న ప్రకాష్ కుటుంబం కూడా ప్రవీణ్ లాగా మధ్య తరగతి వాళ్లే.
ప్రకాష్ కి, పావని మంచి జోడీ అని అడిగి మరీ సంబంధము కలుపుకున్నారు.
ఒకవైపు చెల్లెలు, ఇంకోవైపు వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడు, వాళ్ళపెళ్లి, కనీవినీ, ఎరగని రీతిలో చెయ్యాలని ప్రవీణ్ అనుకున్నాడు.
"ఇంత డబ్బు ఖర్చు ఎందుకురా? ఏదో సామాన్యంగా చేస్తే
పోలా, అవతల వాళ్ళు కూడా ఏమి అనుకోరు" అన్న తల్లితండ్రితో "అమ్మా! మన దగ్గర డబ్బు లేదని మనని చిన్నచూపు చూసి, దూరం పెట్టిన బంధువులకి మనమేమిటో చూపించాలి.
ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి, ప్రేమలు, అనుబంధాలు అంతరించిపోతున్నాయి.
‘ధనమూలమిదంజగత్’ అన్నట్లు డబ్బే ముఖ్యం అనుకునే మన చుట్టాలలో, మీకు గౌరవం కల్పించి మనం డబ్బుకే కాక అనుబంధాలకి కూడా విలువ ఇస్తామని తెలియచెప్పాలి.
అందుకే, నేను మనకి తెలిసిన బంధువులని, బాబాయి, అత్తయ్యలని అందరినీ పిలుస్తున్నాను, అంతేకాదు, వాళ్ళకి మన తాహతు తెలిసేటట్లు మంచి బట్టలు పెట్టి పంపాలి.
నాకు ఇప్పుడు డబ్బుకు, సంఘంలో గౌరవానికి లోటు లేదు.
మీ కొడుకు సంపాదన ఇది, మీరు అందరిలో గొప్పగా, గర్వంగా ఉండాలి" అన్న కొడుకు వంక సంతోషంగా చూసి "సరే" అన్నారు.
పెళ్లికి వచ్చిన బంధువులంతా, అక్కడ ఏర్పాట్లు చూసి, నోటమాట రానట్టుగా అయిపోయారు. హాల్ వాళ్ళు ఏర్పాటు చేసిన మనుషులు, వచ్చిన వాళ్ళని ఏమి కావాలో, నిమిష నిమిషానికి కనుక్కుంటూ, ఫలహారాలు, పానీయాలు అందిస్తూ, ప్రతివాళ్ళకీ తాము ఎంతో ముఖ్యులు అన్న ఆలోచన వచ్చేట్లుగా మర్యాదలు చేస్తున్నారు.
ముహూర్తం రాత్రి కావడంతో, రాధాకృష్ణ, రుక్మిణి కూడా, వచ్చిన వాళ్ళని పలకరిస్తూ, వారికోసం కొన్న బట్టలూ, బహుమానాలు ఇస్తూ మంచి ఆతిధ్యం ఇచ్చారు.
ఒక పదేళ్ల క్రితం, రాధాకృష్ణ, రుక్మిణిని చూసిన వాళ్ళకి ఇప్పుడు వారిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
రుక్మిణి ఖరీదైన కంచిపట్టు చీర, మెళ్ళో వజ్రాల నెక్లెస్, కాసులపేరు, నడుముకి వడ్డాణ్ణం, ముఖంలో సంతోషంతో వచ్చిన మెరుపు, ఇదివరకులా వంగి, వంగి, నంగి మాటలు కాకుండా, దర్జాగా నుంచుని, స్పష్టంగా మాట్లాడుతుంటే ఆడపడుచులు "మా రుక్మిణి వదినేనా!" అంటూ నోళ్లు నొక్కుకున్నారు.
అటు రాధాకృష్ణ, ఖరీదైన సూట్, చేతికి ఆపిల్ వాచ్, మెళ్ళో బంగారు గొలుసుతో, ఒకప్పటి నలిగిన పాత ప్యాంటు, షర్ట్ వేసుకుని, సైకిలు మీద నీరసంగా తిరిగే రాధాకృష్ణకి, ఏ మాత్రం పోలిక లేకుండా ఉన్నాడు.
రమేష్ కుటుంబాన్ని పలకరిస్తూ "ఎలా ఉన్నావురా! మీ పిల్లలు ఏమి ఉద్యోగాలు చేస్తున్నారు? మీకు బుక్ చేసిన హోటల్ బావుందా? మీ కోసం మేము వాడే మెర్కు పెట్టాము, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు?" హుషారుగా అడిగిన అన్న కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేక పోయాడు రమేష్.
"సారీ అన్నయ్యా! నువ్వు అడిగినప్పుడు నిజంగానే కొంచెం డబ్బుకి ఇబ్బంది ఉంది..." నసుగుతున్న తమ్ముడి భుజంతట్టి "పర్వాలేదు రమేష్ ! డబ్బుతో ముడిపడ్డ బంధం కాదుగా మనది, రక్త సంబంధం, కనీసం అమ్మ కోసమేనా ఎప్పుడైనా ఇండియా రావాల్సింది, పోనీలే, ఇప్పుడన్నా వచ్చినందుకు అమ్మ ఎంత సంతోష పడుతోందో చూడు"
అంటూ తల్లి వంక చూపించాడు.
వచ్చిన చుట్టాలందరికి పార్వతి తాను కట్టుకున్న చీర, నగలు చూపించి "ఇవన్నీ నా మనవడు కొన్నాడు, నా కోసం పెద్ద రూమ్ కట్టించి, అందులో టీవీ కూడా పెట్టించాడు. నాకోసం ఒక అమ్మాయిని కూడా పెట్టాడు. నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు మా పెద్ద అబ్బాయి, కోడలు" పొంగి పోతూ అందరికీ చెప్తుంటే, అంతకుముందు వెలిసిపోయిన చీరలో, బోసిమెడ తో ఉన్న పార్వతేనా ఈవిడ అనుకుంటూ చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నారు.
రిసెప్షన్ మొదలవడంతో, అందరూ కాబోయే దంపతులని అభినందించి, భోజనాలకి వెళ్తున్నారు.
పావని, ప్రకాష్, ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టు ఉన్నారు. చెల్లిని నగలతో దిగేసాడు ప్రవీణ్. పెళ్ళికొడుకు ప్రకాష్ కూడా, మంచి డిజైనర్ డ్రెస్, మెళ్ళో పచ్చల హారంతో, కళ్ళు చెదిరేటట్టు ఉన్నారు.
కింద భోజనాల దగ్గర నిల్చున్న తండ్రి దగ్గరకి వచ్చి ప్రవీణ్ "నాన్నా! మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారా? మర్యాదలు బాగా జరుగుతున్నాయా?" ప్రేమగా అడిగాడు.
"అందరూ వచ్చారు, మన మర్యాదలకి సూపర్ హ్యాపీగా ఉన్నారు. వాళ్లందరికంటే, మీ అమ్మ, నానమ్మ సంతోషం చూస్తే, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుకి పూర్తి విలువ వచ్చిందనిపిస్తోంది.
ఇక్కడ ఉన్న అయిదువందల మందిలో, నా కష్టాల్లో నాకు తోడుగా నిల్చిన వాళ్ళు, ఒక ఏభై మంది కన్నా లేరు.
మిగిలిన వాళ్లంతా నీ డబ్బు చూసి వచ్చిన వాళ్లేరా ప్రవీణ్ ! ధనమూలమిదం జగత్ అనేది నూటికి నూరు శాతం నిజం.
కానీ డబ్బే మనిషిని శాసించకూడదు, మానవ సంబంధాలు కన్నా డబ్బు ముఖ్యం కాదు.
మనలోని మానవత్వాన్ని నిలిపి, అనుబంధాలు కొనసాగిస్తే మన డబ్బు సద్వినియోగమవుతుంది.
ఆ నిజాన్ని, మనంకూడా గుర్తుపెట్టుకుని, జాగ్రత్తగా జీవితాన్ని నడిపించాలి, ఇది నీకు ఒక పెద్ద జీవితపాఠం" అన్నాడు కొడుకు భుజం తడుతూ రాధాకృష్ణ.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
@Prabhatakamalam1351
• 2 hours ago
అవును ధనమూలం జగత్ నేకథ బాగుంది. బాగా చదివారు.