top of page

ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు


'Etthukunna Bidda Motthukunaa Digadu' written by

Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

"అమ్మా.. మా అత్తగారికి నాలుగు రోజుల నుంచి జ్వరం. ఈ రోజే కొంచెం తగ్గింది. నోరు చేదుగా ఉంది. నిమ్మకాయ పచ్చడి తినాలనుంది అంటున్నారు. అన్నయ్య ఆఫీసుకెళ్ళేటప్పుడు పంపిస్తావా" అని విజయ దగ్గర నించి ఫోన్!

కూతురు నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం! ఆవిడ వెంటనే కార్యరంగంలోకి దూకేస్తారు. ఇంట్లో ఉన్న కాస్త పచ్చడినీ, సీసాలో సర్దటం మొదలుపెట్టారు.

"మీ అబ్బాయి రోజూ మజ్జిగ అన్నంలో నిమ్మకాయ నంజుకుంటారు అని మీకు తెలుసు కదా! ఉన్నది ఆ కాస్తే.." అంటూ నసిగింది కోడలు సరళ.

"ఆ.. అదేం పెద్ద భాగ్యం! మళ్ళీ పెట్టుకుంటే పోలేదా? అయినా ఆడపిల్ల నోరు తెరిచి అడిగాక కాదంటే ఏం బాగుంటుంది?" ఆవిడ తన పనిలో నిమగ్నమయ్యారు.

"ఒరేయ్ బాబూ.. అలా ఆఫీసుకి వెళుతూ ఈ సీసా విజయ వాళ్ళింట్లో ఇచ్చేసి వెళ్ళు" అని పురమాయించింది.

అలా "ఇవ్వాళ్ళ ఉల్లికారం పెట్టి దొండకాయ కూర చేశాను", “పాపం దానికిష్టం వెలగ పచ్చడి", "ఆవ పెట్టి పులిహోర, ఆవడలు చేశాను", "దానికి పెసర పిండి అప్పడాలు ప్రాణం. పట్టుకెళ్ళి ఇచ్చిరా” అని ప్రతి రోజు ఏదో ఒక వంకతో మహేష్ ని కూతురింటికి తరిమేది.

ఆ అలవాటు ఎంత వరకు వచ్చిందంటే, "అమ్మా.. ఇవ్వాళ్ళ మా అత్తగారు ఊరెళ్ళారు, నాకు బద్ధకంగా ఉండి వంట చెయ్యలేదు! చేసి పంపించు" అని పురమాయించే వరకు అన్నమాట!


***

విజయ మహేష్ తరువాత నాలుగేళ్లకు పుట్టింది. చిన్నప్పటి నించీ చదువు, ఫ్రెండ్స్ తప్ప ఎప్పుడూ ఇంటి పనుల్లో అమ్మకి సహాయం చెయ్యడం అనేది అలవాటు చెయ్యలేదు కాంతమ్మగారు.

"అమ్మా.. చెల్లి పెళ్ళీడుకొస్తున్నది. అప్పుడప్పుడు కాస్త ఇంటి పనులు అలవాటు చేస్తే బాగుంటుందేమో! ఎలాంటి వాడు దొరుకుతాడో తెలియదు కదా. మరీ మగరాయడల్లే పెంచితే కష్టం" అన్నాడు మహేష్.

"ఆ.. ఇప్పటి నించి పనులంటూ చెండుకు తినడం ఎందుకు? రేపు పెళ్లయ్యాక ఎలాగూ తప్పదు. ఆడపిల్లలకి పుట్టింట్లో ఉన్నంత కాలమే సుఖమైనా.. సంతోషమయినా" అన్నారు.

"ఆ మాట కొంతవరకు నిజమే గానీ, అసలు బొత్తిగా 'తూర్పు చూడమంటే పడమర చూస్తే' దానికే కష్టం! అయినా నాకు తోచింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం" అన్నాడు మహేష్.

***

కాంతమ్మ గారి తల్లి బ్రతికున్నన్నాళ్ళూ ఒంట్లో ఓపికున్నా లేకపోయినా కూతురి కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చేది. ఇక్కడే ఉండి పిల్లల పనులు చూస్తూ సాయంగా ఉండేది. ఎప్పుడూ కూతురు.. కూతురు.. అని కాంతమ్మగారి సేవలో ఉండేదని ఆవిడ తన కోడళ్ళకి కంట్లో నలుసయింది.

"అమ్మా! బొబ్బట్లు తినాలనుందే” అని నేను నా యాభయ్యో ఏట అంటే, కళ్ళు కనపడకపోయినా మా అమ్మ అప్పటికప్పుడు చేసి పెట్టడం నీకు గుర్తు లేదుట్రా" అన్నది, కూతురి కోసం తిరగలి ముందేసుకుని మినప సున్ని విసురుతున్న కాంతమ్మగారు కొడుకుతో.

"అమ్మా నువ్వు చేయించుకుని తినే స్థానంలో ఉన్నావు కనుక నీకు అప్పుడు అందులో కష్టం తెలియలేదు. ఇప్పుడు చేస్తుంటే తెలుస్తున్నది కదా, ఆ వయసు వచ్చేసరికి ఎవరి శరీరానికయినా విశ్రాంతి కావాలనీ.. ఎల్లకాలం అలాగే ఎవరూ చాకిరీ చెయ్యలేరనీ" అన్నాడు.

***

"ఏమండీ! అత్తయ్యగారి కుడి చెయ్యి నరం ఉబ్బి, చెయ్యి ఇంత లావున వాచింది. గ్లాసు చేత్తో పట్టుకుని కాఫీ తాగలేకపోతున్నారు. ఆవిడకేమో కుడి చెయ్యి తలకింద పెట్టుకుని పడుకునే అలవాటు! రాత్రంతా నిద్ర కూడా పోలేదుట" అన్నది ఆఫీసు నుంచి వచ్చిన భర్తతో సరళ.

"ఏ నొప్పులూ రాక ఏమవుతాయి? పోయిన బుధవారం విజయ అడిగిందని పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా వెయ్యి వత్తులు చేసింది. ఈ వయసులో అన్ని వత్తులు ఒకే రోజు చేస్తే చెయ్యి నరం లాగదూ మరి! ఇవ్వాళ్టి రోజున అన్నీ బజారులో దొరుకుతున్నాయి! కొనుక్కోవచ్చు కదా! శనివారంనాడు కంది సున్ని, ఆదివారం మినప్సున్ని.. ఆవిడేమన్నా మనిషా, యంత్రమా? అడిగేదానికి బుద్ధిలేదు, చేసే ఈవిడకీ బుద్ధి లేదు! ఆడపిల్లలంటే మమకారం ఉండచ్చు కానీ, వాళ్ళకి యాభయ్యేళ్ళు వచ్చే వరకు వారికీ, వారింట్లో వారందరికీ కూడా కావలసినవన్నీ తల్లి చేసి పెట్టాలంటే కష్టమని దానికి తోచక్కరలేదా? చదువుకున్నది, ఎందుకు? కష్ట సుఖాలు తెలియక్కర్లా?" అని మహేష్ అరుస్తుంటే

"హుష్.. గట్టిగా అరవకండి, అత్తయ్యగారికి వినిపిస్తుంది. మీ చెల్లికి పెట్టడం ఇష్టం లేక ఇలా అంటున్నారనుకుంటారు" అని సర్ది చెప్పబోయింది సరళ.

"విననీ! కొంతయినా తెలుసుకుంటుంది. 'అమ్మా ఆవకాయ అయిపోయింది, గుమ్మడి వడియాలు పెడతావా, మా అబ్బాయికి నువ్వు పెట్టే సగ్గు బియ్యం వడియాలిష్టం, ఇంగువ బాగా దట్టించి నీ చేత్తో చేసిన చింతకాయ పచ్చడి అంటే మా వాళ్ళు చొంగ కార్చుకుంటారు ' అంటూ నయగారాలు పోతూ ఈవిడని ములగ చెట్టెక్కించి అన్నీ చేయించుకెళుతుంది. నువ్వు ఆవిడ వెనకాల తిరుగుతూ అన్ని పనులు ఆవిడతో సమానంగా చెయ్యట్లేదా? నీ కంటే మూడేళ్ళు పెద్దదే కదా విజయ! తను చేసుకోలేదా?" అన్నాడు ఇంకా కోపంగా.

"నేను మగ పిల్లలు అపురూపం, అబ్బరం, అధికం అనుకునే ఇంట్లో పుట్టిన ఆడపిల్లనండీ! నా అదృష్టమే చెప్పాలి. ఆడపిల్లలకి పని రాకపోతే వచ్చే వాడి చేతిలో మొట్టికాయలు తినాలి. అయినా "ఆడపిల్ల" అంటే ‘ఆడ’ పిల్లే! ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోయేదే! పని పాటలు రాకపోతే అమ్మ పెంచిన పిల్లా? అబ్బ పెంచిన పిల్లా? అని దీర్ఘాలు తీస్తారు అని మా చేత చిన్నప్పటి నించీ, బజారు పనులతోసహా, అన్ని పనులు చేయించేది మా అమ్మ.

పెళ్ళయిన కొత్తలో మా అమ్మ చేతి గోంగూర పచ్చడి, పులిహోర తినాలనిపించి చేసి పెట్టమంటే...ఇప్పుడు చేస్తాను కానీ పెళ్ళి చేసి పంపిన పిల్లల ముద్దు ముచ్చట్లు చూస్తూ కూర్చుంటే, వెనక పిల్లల పనులు చేసే ఓపికుండొద్దూ! అలా ఒక్కదాన్నే చెయ్యలేక ఇంట్లో పిల్లలకి పని చెప్పాలి. ఆ పని ఒత్తిడంతా కింది పిల్లల మీద పడుతుంది అనేది.

అమ్మా ఆవకాయ వెయ్యటం నీ అంత బాగా రాదు, వేసి పెడతావా అని అడిగితే, నీకెలా చేతనయితే అలా వేసుకో. అయినా అన్నీ రెడీగా బజార్లో దొరుకుతున్నాయి కదా! తెచ్చి కలిపి పడేసుకోవటమే కదా! మా రోజుల్లో లాగా మిరపకాయలు కొట్టించాలా? ఆవపిండి దంపించాలా? అని నిష్కర్షగా చెప్పింది. అందుకే మీ అమ్మగారికి నేనంటే లోకువ! ఆవిడకి కూతురు నోట్లోంచి మాట రావటం ఆలశ్యం,ఒళ్ళు తెలియకుండా హైరాన పడిపోతారు! నా దురదృష్టం 'మగపిల్లలు ఎక్కువ అనుకునే ఇంట్లో పుట్టి ఆడపిల్ల ఎక్కువనుకునే ఇంటికి కోడలుగా రావటం' " అన్నది సరళ.

"నీకు అందుకే ఇంచక్కా అన్ని పనులూ వచ్చాయి. ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మ విశ్వాసంతో అన్నీ చక్కపెట్టుకుంటావు" అన్నాడు మహేష్.

"మీ మాటలు ఇందాకటి నుండి వింటున్నాను. వీడు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు. నేనే ముద్దు చొప్పునో, మా ఇంటి అలవాటనో శక్తికి మించి దాన్ని భుజాలకెత్తుకున్నాను. "ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు" అన్నట్లు ఇప్పుడు బాధపడి ఏం లాభం! ఇప్పుడు మనమేమి అన్నా వాళ్ళ అత్తగారు దీని చేతకానితనానికి తల్లిగా నాదే తప్పని తిట్టి పోస్తారు" అన్నది పక్క గదిలోంచి వచ్చిన కాంతమ్మగారు.

"నువ్వూరుకోమ్మా! విజయతో నేను మాట్లాడతాను. నీ చెయ్యి అసలు స్వాధీనంలో లేదని, డాక్టర్ నీకు పూర్తి రెస్ట్ కావాలన్నాడని చెబుతాను. అంతగా తెగించి సరళని చేసి పెట్టమనదనే అనుకుంటున్నాను" అన్నాడు.

"ఏమో నాయనా! మీ పిల్లలని మాలాగా కాకుండా కష్టం సుఖం తెలిసేట్లు పెంచండి" అని మళ్ళీ గదిలోకెళ్ళి నడుం వాల్చి "రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః:" అని “నా పిల్లని చల్లగా చూడు తండ్రీ” అంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి

నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.

నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.

ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.

"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.

ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.

సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.

నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.105 views0 comments

Comments


bottom of page