top of page

జల పుష్పాలు


'Jala Pushpalu' written by Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

ప్రకృతి ప్రసాదించిన అందాలతో, తనకు తానుగా రూపుదిద్దుకున్న అతి సుందరమైన నగరం 'విశాఖపట్నం'. చుట్టుపక్కల ఎత్తయిన కొండలు, ప్రకృతి రమణీయమైన రహదారులతో, పచ్చని వృక్షాలతో, ముఖ్యంగా నురుగలు కక్కుతున్న సముద్ర కెరటాలతో బీచ్ రోడ్ లు, ఎన్నో రెట్లు మిరుమిట్లు గొలిపే 'ఎల్ ఈ డి లైట్స్ ', ఫైవ్ స్టార్ హోటల్స్ తో సహ సహజసిద్ధమైన చల్లని వాతావరణంతో ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది 'విశాఖపట్నం '.

సరిగ్గా ‘విశాఖ ఆర్కే బీచ్’ కు రెండు కిలోమీటర్ల దూరంలో విసిరి వేయబడినట్లుండే ప్రాంతం ‘జాలరి పేట’. ఎన్నో శతాబ్దాల నుంచి చిన్న చిన్న పాకలతో నిత్యము తమ జీవనాధారమైన చేపల వేటతో, అరకొర జీవితాలతో సతమతమవుతున్న వందల కుటుంబాలు ఒక చోటే ఉంటూ ప్రతి ఐదేళ్లకొకసారి ఓట్ల కోసం వచ్చే ప్రజాప్రతినిధుల వాగ్దానాలు ఫలించక, అభివృద్ధి చెందక, ఆ జాలరి పేట నిర్లక్ష్యానికి లోనై కుటుంబాలు సతమతమవుతున్నాయి.

అది అక్టోబర్ నెల. చిన్నపాటి చలిగాలి, సముద్రపు హోరు తప్ప ఏ అలజడి లేదు. ఇంతలో ఒక పూరి గుడిసె నుండి 'ఒలేయ్ వెంకీ! పోలయ్య పొద్దుగాల ఆలిసివస్తాడు. కూసంత తిండిగింజలు, నూనె, పోపు సామాను, ఒక కేజీ బియ్యం పట్రాయే!' అని పోలయ్య భార్య 'రత్తాలమ్మ’ అరవగానే పరుగెత్తుకుంటూ వచ్చి ' ఎటే నీ సొద. గిన్నెలు కడిగి పెట్టాను కదా!’ అని అన్నది కూతురు ఎంకమ్మ. రత్తాలమ్మ నోట్లో ఉన్న అడ్డ పోగా తీసి, తుపుక్కున ఊసి 'పచారీ కొట్టు కెళ్లి సామాన్లు తేవే. ఆడు రాగానే కూర లేదనుకో.. 'కల్లు తాగిన కోతి ' లా మీద పడతాడు. అంటూ బొడ్డు చీర ముడిలో బాగా నలిగిపోయిన 50 రూపాయల కాగితం కూతురికి ఇస్తూ, ‘తొందరగా రాయే!. పెత్తనాలు చేయకు’ అంటూ నోటిలో ఉన్న చుట్ట ముక్కను తీసి. . ' ఛీ ఛీ వెధవ బతుకు. ప్రభుత్వ రేషన్ దుకాణం లో ఎప్పుడూ సరుకులు ఉండవు. ఏం తింటాం !’ అంటూ ఓ మూల కూలబడిపోయింది రత్తాలమ్మ.

" ఓరి భగవంతుడా! ఈరోజేనా చేపలు బాగా పడితే బాగుండును. ఈ వారం అంతా కూలి గిట్టుబాటు కాలేదు. తిండికే సరిపోవట్లేదు. బజారులో చేపలు ఏం అమ్ముతాను? ఏం తింటాము? చచ్చిపోతున్నాం రా దేవుడా!' మూలన పడి ఉన్న అల్యూమినియం అన్నం గిన్నె, ఏళ్ల తరబడి వాడుతున్న 'ఇనుప మూకుడు 'తెస్తూ గుడిసె చూరు తగలకుండా ఒంగుని బయటకు వచ్చి, పొద్దున్నే వెలిగించిన పొయ్యి తాలూకు బొగ్గుల బూడిదను దులిపి కాలి ఆరిపోయిన కర్ర ముక్కలమీద కొంచెం కిరోసిన్ పోసి అగ్గి పెట్టి వెలిగించి పొయ్యి రాజేసింది రత్తాలమ్మ.

పోలయ్య చేపల వేట ముగించుకుని తడిసిన నిక్కరు తో, వెలిసిపోయిన టీ షర్టు తో, భుజాన వల, చేతిలో కర్ర తెడ్డు, ఇంకో చేతిలో తన వాటా కు వచ్చిన చేపలతో వచ్చి గుమ్మం దగ్గర అన్నీ పడేసి, తడిసిపోయిన బట్టలు విప్పి మరో ఎండిన బట్టలు వేసుకుని " ఒలేయ్ రత్తాలు! చేపల బుట్ట లోపల పెట్టు. నేను ఇప్పుడే కల్లు దుకాణం వరకు పోయి వస్తాను. కూర బాగా చెయ్!” అంటూ అరుస్తూ హుషారుగా వెళ్ళిపోయాడు .

చేపల బుట్ట తెరిచి చూసిన రత్తాలు ' ఏంటయ్యా ? రేపు ఏంటి అమ్మమంటావు ? పెద్ద చేపలు, రొయ్యలు పడలేదా? అన్నీ ధర తక్కువ పలికి చేపలే! ఏం చేతురా దేవుడా! “ అంటూ వాపోయింది. ఇది రోజూ ఉన్న తంతే గనుక పోలయ్య పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

ఈ రకంగా జాలరి పేట లో అన్ని కుటుంబాలలోను తిండికి కూడా సరిపోక ప్రతిరోజు ప్రతి కుటుంబంలోనూ 'కురుక్షేత్ర యుద్ధమే 'జరుగుతుంది. అరిచి అరిచి ఆలిసి నిద్ర పోతారు ఆ సగటు మనుషులు.

ఆ మర్నాడు తెల్లవారుజామున 'రెండు గంటలకు' లేచి అలవాటు ప్రకారం తయారై “రత్తాలూ! వేటకు పోతానే, తలుపు వేసుకో. ఈయ్యాల ఆ భగవంతుడు దయ చూస్తా డు! మంచి చేపలు పడతాయి. అంటూ తన కర్రతెడ్డు, వల చేరో భుజాన వేసుకుని సముద్ర తీరం వైపు తన పడవ ఉన్న దగ్గరకు వచ్చాడు పోలయ్య. సముద్ర ఘోష క్రమ క్రమంగా పెరుగుతుంది. చిన్నగా ఈదురుగాలి మొదలయ్యింది. అప్పటికే మరో ముగ్గురు జాలర్లు పడవను నీటిలోకి తోస్తున్నారు. పోలయ్య ని చూడగానే 'ఏరా మామా! లేట్ అయింది? రాత్రి కల్లు పూటుగా తాగినావా ఏంటి ?” అని నవ్వుతూ అడిగారు.

“ అబ్బే! అదేటి లేదురా. నిద్ర లేదు అంతే!” అంటూ తను కూడా పడవని బలంగా నీళ్ళలోకి నెట్టి ఎగిరి గంతేసి అలల మీద కిందకు దిగుతున్న పడవలోకి మొత్తం నలుగురు ఎక్కేసారు.

ఆ నలుగురు సముద్రంలో పడవకు తెడ్డులు వేస్తూ ముందుకు సాగారు. 'ఒరేయ్ ఇయాల మా ఆవిడ గోల చేస్తుంది రా, అసలు చేపలు సరిగ్గా రావటం లేదని. కొంచెం ముందుకు వెళ్దాం. గాలి కూడా ఎక్కువగా ఉంది. పెద్ద చేపలు దొరుకుతాయి! అక్కడే వల వేద్దాం” అన్నాడు పోలయ్య. అలాగే ఆ నలుగురు మరో గంట కష్టపడి ఎదురుగాలి తట్టుకుంటూ ప్రయాణం చేసి సముద్రపు ఒడ్డు నుంచి ఏడూ.. ఎనిమిది కిలోమీటర్ల దూరం పోయాక నిశ్చలంగా ఉన్న సముద్రపు నీటిలో పెద్ద పెద్ద చేపల వెళుతుండటం చూసి, అక్కడే ఉండి తమ పెద్దవలను విసిరి, వాటికి నాలుగు వైపులా బరువులు ఉండేటట్టు చూసి తమ పని అయ్యాక, మంచి ఎండలో పడవలో కూర్చుని తమ సద్దన్నం డబ్బాలు తీసి తినడం ప్రారంభించారు.

సముద్రపు ఆటుపోట్ల మధ్య తెల్లవారుజాము నుంచి కష్టపడిన శరీరాలు అలిసిపోయి ఒక్కొక్కరికి కళ్ళు మూతలు పడుతున్నాయి. సరిగ్గా మూడు గంటలకు చేపల వల బరువుగా తగిలేసరికి ఉలిక్కిపడి లేచి, అందరూ వలను బలంగా లాగుతూ ఉంటే, మండుతున్న సూర్యుని ప్రతాపంతో వారి కండరాలు లోపలికి పోయి, బయటకు వస్తున్న డొక్కలు, వారికి తెలియకుండానే యోగాసనాలు జరిగిపోతున్నాయి.

అలా మధ్యాహ్నానికి పెద్ద చేపలు, రొయ్యలు, బాగా ధర పలికే జలచరాలు వలలో చిక్కుకున్నాయి. చివరాఖరి ప్రాణాల కోసం పరితపిస్తున్న "జలపుష్పాలు " ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి.

ఎన్నడూ లేనంతగా చేపల వేట దొరికేసరికి అమితానందంతో ఆ నలుగురూ చేపల వలను పడవలోకి లాగి, తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అలా మూడు నాలుగు గంటల ప్రయాణం చేసి సాయంత్రం కల్లా ఒడ్డుకు చేరుకుని, అక్కడే వేచి చూస్తున్న తమ కుటుంబాలకు ఆ రోజు పడ్డ చేపలను చూపిస్తూ "చూడండి. మనకు పది రోజులకు సరిపడా చేపలు దొరికాయే!” అంటూ ఆ నలుగురూ సంతోషంగా తమ తమ వాటాలను పంచుకొని ఇళ్లకు చేరుకున్నారు.

'పోలయ్య చేపలతో ఇంటికి వస్తూ, కనబడిన ముష్టి వాళ్లుకు సైతం కొన్ని చేపలు ఇస్తూ, ఆనందంగా ఇంటికి వచ్చేసరికి రచ్చబండ దగ్గర పోలీస్ జీప్ సైరన్ వినబడే సరికి 'ఏమైంది?’ అంటూ అందరినీ అడిగాడు.

“ ఏం లేదురా! రేపు, ఎల్లుండి 'తుఫాను '. కనుక రెండు రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు! “ అనేసరికి పోలయ్య “పోనీలేరా. దేవుడు తినడానికి సరిపోయేంత ఇచ్చాడు! “ అంటూ తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఇలా నెలలు గడిచిపోతున్నా దినచర్యలో మార్పు లేదు. జీవితాలలో వెలుగు లేదు. అది నవంబర్ నెల కావడంతో నాలుగైదు సార్లు ‘తుఫాన్ అలజడి' వల్ల చేపల వేటకు వెళ్లలేకా, ఇంకో పని చేతకాక, చుట్టలు కాలుస్తూ రచ్చబండ దగ్గర ఉన్న' రేడియో వార్తలు' వింటూ నిరాశ నిస్పృహలతో జీవితాలు గడుపుతున్నారు జాలరి పేట గ్రామ వాసులు.

ఆ రోజు అలాగే 'రేడియో వార్తలు' వింటున్న పోలయ్య బృందం, లాటరీ వచ్చిన వాళ్ల లాగా ఆనంద పడసాగారు. "ఒరేయ్ తుఫాన్లు తగ్గిపోయాయి. రేపటి నుంచి చేపల వేటకు వెళ్ళచ్చు. ' రేడియోలో '. చెప్పారు. మనం పొద్దుగాలే చేపలవేటకు వెళ్దాం! అన్నీ సర్దుకోండి.” అన్న మాటలు వినేసరికి జాలరి కుటుంబాల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది..

పోలయ్య ఇంటికి రాగానే “ఒలే రత్తాలు. మనకి మంచి రోజులు వచ్చాయి. రేపటి నుంచి వేటకు వెళ్లవచ్చని 'రేడియోలో చెప్పారు '! “ అనగానే రత్తాలు ఒక్కసారిగా లేచి దండాలు పెడుతూ, 'గంగమ్మ ' దయవల్ల మంచిగా చేపల వ్యాపారం చేసి నా కూతురి పెళ్ళి చేసేయొచ్చు! “ అని గట్టిగా అoటూ కూతురి తల నిమిరింది.

ఆ రోజు నవంబర్ 15. తెల్లవారగానే పోలయ్య హుషారుగా లేచి, తన వల, కర్రతేడ్డు. పట్టుకొని, చంకలో చద్దన్నం మూట పెట్టుకుని, భార్యకి చెప్పి సముద్రంలో వేటకు బయలు దేరాడు. 'తుఫాన్’ వెలిసిన తర్వాత సముద్రం ప్రశాంతంగా ఉంది. అప్పటికే అక్కడికి చేరుకున్న సహచరులు పడవను సిద్ధం చేస్తూ కనబడేసరికి " ఒరేయ్. చాలా రోజుల నుంచి వేటకి వెళ్ళలేదు. ఇవాళ మనం 'యారాడ కొండ వాలు ' పై నుంచి పోదాం ! బాగా చేపలు దొరుకుతాయి” అని పోలయ్య అనగానే. వాళ్లు కూడా ' పదండి రా. గట్టిగా తెడ్డు వేయండి! ఎదురు గాలి బాగా ఉంది” అన్నారు హుషారుగా. అందరూ కలిసి ఒక్క గొంతుతో అలసట రాకుండా "హైలెస్సా.. హైలెస్సా " అంటూ పడవను వేగంగా నడిపిస్తున్నారు.

' ఒరేయ్ పోలయ్య ! తొందరగా పోనీయండి. అటువైపునుంచి ఇంజన్ బోట్లు వచ్చేస్తాయి. అవి వచ్చాయంటే మొత్తం చేపలు కొట్టుకుపోతారు.” అని అనగానే అందరూ కలిసి పడవను వేగంగా ముందుకు పోనిచ్చారు. బాగా చేపలు ఉన్న ప్రాంతంలో నాలుగు పక్కల వల జల్లి, వల చుట్టూ ఆరెంజ్ కలర్ ప్లాస్టిక్ బంతులను కట్టి వల ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, తమ పడవలో కూర్చుని ‘చేపలు ఎప్పుడు పడతాయా’ అని ఎదురు చూస్తున్న సమయంలో దూరం నుంచి బోటు ఇంజన్ శబ్దం. వినిపించింది. “మర పడవలు వచ్చేస్తున్నాయి. తొందరగా చేపలను పట్టుకోవాలి. వలను లాగండి” అంటూ హడావిడిగా నలుగురూ పనిచేస్తున్న సమయంలో పోలయ్య “ఒరేయ్! అది చేపలు పట్టే బోటు కాదు. ప్రయాణికులను తీసుకువెళ్లే ' టూరిస్ట్ బోటు'. కంగారు పడకండి !”అని అనగానే పుల్లయ్య బృందం కాస్త శాంతించింది.

అదే సమయంలో మళ్లీ సముద్రపు పోటు ఎక్కువయింది. పోలయ్య బృందం పడవ ను గట్టిగా పట్టుకొని వలని లాగుతున్న సమయంలో, దూరంగా 'టూరిస్ట్ బోటు 'లోంచి హాహాకారాలు వినబడ్డాయి. ఆశ్చర్యపోతూ "ఏంట్రా ఏమైంది? అందరూ అరుస్తున్నారు. ప్రమాదం ఏమైనా జరిగిందా?” అని ఆత్రుతగా చూస్తున్న పోలయ్య కు ఒళ్ళు జలదరించే సన్నివేశం కనబడింది. ఆ లాంచ్ లో ఉన్న కనీసం 30 మంది ప్రయాణికులు. ఒక్కొక్కరుగా సముద్రంలో దూకేస్తున్నారు. ఒక పక్క ఇంజన్ నుంచి మంటలు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పోలయ్య బృందం తమ పడవను అ లాంచి వైపు తిప్పి “ఒరేయ్. చేపల వల అక్కడే వదిలేయండి. బతికి బాగుంటే మనం మళ్ళీ తెచ్చుకుందాం! ముందు మన అందర వెళ్లి కొంతమందిని కాపాడుదాం!” అంటూ అరిచేసరికి పోలయ్య బృందం నిండుగా చేపలు ఉన్న వలను అక్కడే వదిలేసి చాలా వేగంగా తెడ్లు వేస్తూ టూరిస్ట్ లాంచ్ వైపు వెళ్లారు.

ఎంతో వేగంగా టూరిస్ట్ బోటు దగ్గరకు వచ్చిన పోలయ్య బృందం తమ పడవను వదిలి సముద్రంలో దూకి. . ' గజ ఈతగాళ్లు ' కావడంవలన మునిగిపోతున్న ఒక్కొక్కరిని చేయిపట్టి లాక్కెళ్లి. తమ పడవ లో ఎక్కించి కనీసం పది మందిని తమ పడవలో కూర్చోబెట్టి, మళ్ళీ ఈదుకుంటూ వెళ్లి, మునిగిపోతున్న టూరిస్ట్ బోటు వద్ద ఉన్న 'ఆడవాళ్లను ఎంతో చాకచక్యంగా తమ పడవ దగ్గరకు తీసుకువచ్చి రక్షిస్తూ, పడవ మునిగిపోకుండా పడవ చుట్టూ ఉన్న టైర్లకు వేలాడుతూ ఉండమని చెప్పి తమ శాయశక్తులా పోలయ్య బృందం ఎంతోమందిని కాపాడుతున్న సమయంలో. ఈ విషయం తెలిసిన ' పోర్టు అధికారులు,' నేవి హెలికాప్టర్లు ' వచ్చి మిగతా వాళ్ళని మునిగిపోకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు..

పోలయ్య బృందం ఎంతో శ్రమించి ఇంత మందిని కాపాడి ప్రభుత్వ సహాయం వచ్చేవరకు తన శాయశక్తులా కష్టపడి ప్రయాణికులను యధాతధంగా పోర్టు అధికారులకు అప్పగించి ఎంతో ఆనందంతో ఇంటికి పోతూ, “ఒరేయ్ మనకి చేపలు పట్టడం అవ్వలేదు కానీ మనం ఎంతో మందిని కాపాడాము. ఆ దేవుడే మనకి మేలు చేస్తాడు. పదండి ఇంటికి పోదాం” అనుకుంటూ ఎంతో అలసిపోయిన శరీరాలతో వెనుదిరిగారు.

పోలయ్య బృందం జాలరి పేట ఒడ్డుకు తమ పడవ ను కట్టి పైకి వస్తున్న సమయంలో ఎందుకో జాలరి పేట అంతా లైట్ ల తో మెరిసి పోతుండటం గమనించారు. చాలా పోలీస్ జీపులు, పోర్టు అధికారుల కార్లు, రాజకీయవేత్తల కార్లు అంతా లైట్ లతో జాలరి పేట నిండిపోయింది.ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితిలో పోలయ్య బృందాన్ని చూసేసరికి నగరంలో ఉన్న అన్ని వార్తా పత్రికల రిపోర్టర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి మీరు “మీరందరూ ఎంతో గొప్ప పని చేశారు. రండి.. రండి. మీ నలుగురి కోసం అధికారులంతా ఎదురుచూస్తున్నారు” అంటూ తడిసిపోయిన బట్టలతో ఉన్న పోలయ్య బృందాన్ని ఆహ్వానించారు. అడుగడుగున చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానీకాన్ని ఆశ్చర్యంగా చూస్తూ పోలీసు బృందం ఉన్న రచ్చబండ కు వచ్చారు పోలయ్య బృందం..

పోర్టు చైర్మన్ గారు మాట్లాడుతూ “ఈ రోజున విశాఖపట్నం చరిత్రలో లిఖించదగ్గ వీరోచిత పోరాటపటిమను కనబరిచిన పోలయ్య బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నలుగురు చేసిన సాహస కార్యం వలన నడి సముద్రంలో మునిగిపోతున్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడ బడ్డాయి మాకు, అటు దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చారు” అని చెప్పగానే కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది జాలరి పేట.

నగర రాజకీయవేత్తలు, పోర్టు అధికారులు సంయుక్తంగా ఒక 'సన్మాన సభ ' ఏర్పాటు చేశారు. ఆ నలుగురికి ఇళ్ల పట్టాలు ఇస్తూ, ఆ నలుగురిని 'coast guard post' నిచ్చి, “సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా వీరు ముందుండి కాపాడుతారు” అంటూ పొగిడి, ప్రభుత్వ 'ఇళ్ల పట్టాలు. ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు ' ఇచ్చి పూలదండలతో గౌరవించారు.

ఈ వార్తను దేశంలోని అన్ని పత్రికలు ప్రచురించే సరికి. . ' భారత ప్రభుత్వం' కూడా వారికి అనేక పారితోషకాలు ఇచ్చి. జాలరి పేట అభివృద్ధికి దోహదపడ్డారు.

. 'పోలయ్య బృందం ఈ సన్మానాలు చూసేసరికి. సన్మాన సభలో మాట్లాడుతూ పోలయ్య, ' అయ్యా. పెద్దలందరికీ నమస్కారం! మాకే తెలియదు, ఆ సమయంలో మా కుటుంబం గురించి గాని, మా చేపల వల గురించి గాని, ఆలోచించలేదు. ఎంతోమంది సముద్రంలో పడిపోతూ ఉండేసరికి ఎలాగైనా వాళ్ళని రక్షించాలన్న తపన తప్ప మరి ఏమీ ఆశించలేదు! అన్నిటికీ ఆ' దేవుడు 'మాకు ఈ శక్తిని ఇచ్చి ఎంతోమందిని కాపాడగలిగాము. ఇందులో మేము కూడా ప్రాణాలకు లెక్క చెయ్యలేదు బాబయ్య” అంటూ ప్రసంగం ముగించే సరికి దేశంలో ఉన్న అన్ని' టీవీ ఛానల్ ప్రసారాలు ' చూసిన ప్రజలు పోలయ్య బృందాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. అసలైన "జలపుష్పాలు" పోలయ్య బృందమే ! అని ఎలుగెత్తి చాటారు.************!!!!!!!!

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


211 views0 comments

Comments


bottom of page