top of page

పనికిరాని పట్టభద్రుడు


'Panikirani Pattabhadrudu' written by Lakshminageswara rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

' ఒరేయ్ నాన్న, శ్రీధర్! డైనింగ్ టేబుల్ మీద కూర, పప్పు పెట్టాను నీకు. నువ్వు లంచ్ బాక్స్ సర్దుకొని కాలేజీ కి వెళ్ళు. నాకు టైం అయిపోతుంది ఆఫీస్ కి’ అంటూ పొద్దున్నే లేచి తనకు, కొడుకుకు భోజనం తయారు చేసి , ఇల్లు తుడిచి, అన్నీ సర్ది సరిగ్గా 9 గంటలకల్లా శ్రీధర్ ను లేపి వాడికి హార్లిక్స్ ఇచ్చి ఆఫీస్ కి వెళ్ళి పోతూ అన్న మాటలు నిద్ర బడలిక లో ఉన్న శ్రీధర్ కి వినిపించి 'అలాగే నాన్నా బై!' అంటూ లేచి బాత్రూం వైపు పరిగెత్తాడు. రాంబాబు గారికి ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్. సరిగ్గా ఐదు సంవత్సరాల కిందట భార్య అకాల మరణంతో జీవితం తలకిందులైన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా మరో వివాహం చేసుకోక, తల్లి తండ్రి అన్నీ తనై, ఏ లోటు లేకుండా శ్రీధర్ ను ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చేయిస్తున్నాడు తండ్రి రాంబాబు. ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ సహిస్తూ కొడుకే సర్వస్వంగా భావిస్తూ, అడిగిందల్లా సమకూరుస్తూ తన బాధ్యతను నిర్వర్తించ సాగారు రాంబాబు గారు. ఆ మర్నాడు శ్రీధర్ "నాన్నగారు! నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక 'గ్రాడ్యుయేషన్ సెరిమనీ ' వస్తుంది, ఎన్నాళ్లనుంచో కలలుకంటున్న' స్పోర్ట్స్ కారు ' గురించి ఎన్నో సార్లు మీకు చెప్పాను. మీరేమో ప్రతి సారి కూడా నీకు ‘ఫస్ట్ క్లాస్' వచ్చిన తర్వాత 'స్పోర్ట్స్ కారు ' కొంటానని సంవత్సరం నుంచి చెప్తున్నారు. నాకు పస్ట్ క్లాస్ వచ్చింది. నెక్స్ట్ వీక్ 'గ్రాడ్యుయేషన్ సెర్మనీ' ఉంది. నాకు కొన్టారు కదా!" అని అడిగేసరికి ఎప్పటిలాగే "అలాగే నాన్నా! తప్పకుండా కొంటాను!.." అని మరోసారి శ్రీధర్ కి నచ్చచెప్పారు రాంబాబు గారు. చివరికి ఆరోజు రానే వచ్చింది. శ్రీధర్ బాగా తయారై "నాన్నగారు ! నేను 'గ్రాడ్యుయేషన్ సర్మనీ' కు వెళ్తున్నాను, కారు కొంటానన్నారు కదా! ఏమైంది? అని అడగగానే 'కంగ్రాచ్యులేషన్స్ రా శ్రీధర్ ' ఇదిగో! ఈ రోజు నీకు జీవితంలో ఏదైనా సాధించాలంటే మహాత్ముల జీవిత చరిత్రలు బాగా చదవాలి, అంటూ ఒక 'వివేకానంద స్వామి' వారి పుస్తకం ఇచ్చారు రాంబాబు గారు. అది చూసిన వెంటనే "నాన్నగారు, ఈ రోజు కూడా మీరు మాట తప్పారు. నేను అడిగింది పుస్తకాలు కాదు. 'స్పోర్ట్స్ కారు' . దాని గురించి చెప్పకుండా,ఇదేంటి? నాకు చెప్పొచ్చుగా మీరు కొనలేని పరిస్థితిలో ఉన్నారని, అందుకే ఆ మహానుభావులు పుస్తకాలు చదివి బాగుపడు అంటున్నారు, అలాగే లెండి, తీరిగ్గా ఉన్నప్పుడు చదువుతాను, 'థాంక్యూ వెరీమచ్ ' అంటూ కోపంగా ఆ పుస్తకాన్ని అక్కడే వదిలేసి కాలేజీకి వెళ్లి పోయాడు శ్రీధర్. " ఏ రా! శ్రీధర్, గ్రాడ్యుయేషన్ సర్మనీ కి స్పోర్ట్స్ కార్ తో వస్తానన్నావు కదా! ఏమైందిరా? అని ఎగతాళి చేస్తుండగా చెప్పుకోలేని కోపంతో తన డిగ్రీ సర్టిఫికెట్ పుచ్చుకుని అవమాన భారంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ మర్నాడు శ్రీధర్ తన బ్యాగ్ సర్దుకుని 'నాన్నగారు , ఇవాళ నేను హైదరాబాద్ వెళుతున్నాను, నా ఫ్రెండ్ ఒకడు ఒక 'సాఫ్ట్వేర్ కంపెనీలో ' మంచి ఆఫర్ ఉంది రమ్మన్నాడు, అని చెప్పగానే “అదేంట్రా? కొన్నాళ్లు వేచి చూడొచ్చు కదా! అంత తొందర ఏంటి ?ఆయినా నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు అంత కోపం? సరే! అదే నిర్ణయం అయితే తప్పకుండా వెళ్ళు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. వెళ్తున్నప్పుడు నేను ఇచ్చిన 'వివేకానంద స్వామి పుస్తకం' కూడా పట్టుకు వెళ్ళు. గుడ్ లక్ నాన్న!” అంటూ కొడుకు శ్రీధర్ తల నిమిరి చేతిలో ఒక 'ఏటీఎం కార్డు ' పెట్టి “జాగ్రత్తగా ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు” అంటూ తన స్కూటర్ మీద భారమైన హృదయం తో ఆఫీస్ కి వెళ్ళి పోయారు రాంబాబు గారు. శ్రీధర్ మనసులోని కోపం అలాగే ఉంచుకుని , ‘బై నాన్న గారు' అంటూ ఆయన ఇచ్చిన పుస్తకం ఆయన రూమ్ లోనే వదిలేసి తన బ్యాగ్ పుచ్చుకొని హైదరాబాద్ ప్రయాణం అయిపోయాడు. అలా శ్రీధర్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బాగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్ లోకి వచ్చినా కూడా తండ్రికి తన ఉనికి గురించి గానీ, ఉద్యోగం గురించి గానీ ఏ విషయం తెలియనివ్వక తన కఠోర నిర్ణయం 'తండ్రిని ఇక చూడకూడదు' ,అన్న ఉద్దేశంతోనే 'రెండు సంవత్సరాలు ' గడిచినా తన ఆఫీస్ అడ్రస్ గాని ,ఇంటి అడ్రస్ గాని తెలియనివ్వకుండా చేశాడు, ఆ' పనికి రాని పట్టభద్రుడు '. ఆరోజు తన ఆఫీస్ కి ఒక ' ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్' తన పేరుమీద రావడంతో ఆశ్చర్యపోతూ, చదివేసరికి కాళ్ల కింద భూమి కదిలినట్లు అయ్యింది. "father expired,start immeditely"! అది చదివిన వెంటనే క్రింద తన ఫ్రెండ్ కాంత్ పేరు చూసి వెంటనే ఫోన్ చేశాడు శ్రీధర్, “ఏమైంది రా? కాంత్ , నాన్నగారికి ఒంట్లో బాగోలేదా? నాకు ముందే చెప్పొచ్చు కదా!.. ఛి ఛి నామీద నాకే అసహ్యం వేస్తుంది, పంతాలకు పట్టింపులకు పోయి కన్న తండ్రిని అనాధగా వదిలేశాను, అంటూ ఫోన్లోనే ఏడ్చేశాడు శ్రీధర్. వెంటనే 'ఫ్లైట్ బుక్' చేసి వైజాగ్ తరలి వచ్చాడు శ్రీధర్. తండ్రి కాళ్ళు పట్టుకొని 'నాన్న! నన్ను క్షమించు, నువ్వు కారు కొనలేదని అవమానంతో, కోపంతో నీ మొఖం చూడకూడదు అనుకున్నా! అందుకే ఏదైనా సాధించి నీకు వచ్చి చెబుదాం అనుకున్నాను, అలాంటి కారులు ' 10 కొనగల స్తోమత ఉన్న అమ్మలాంటి ప్రేమను పంచి, అన్నీ నీవే చేశావు. చివరికి నేనొక పనికిరాని అహంకారపు కొడుకుగా మిగిలిపోయాను, 'నన్ను మనసారా క్షమించు నాన్న!” అంటూ వేక్కీ వేక్కీ ఏడుస్తు 'దహన సంస్కారాలు' పూర్తి చేసి అన్ని కార్యక్రమాలు అయ్యాక నాన్న గారి రూమ్ లోకి వెళ్లి ఆయన ఫోటోలు చూస్తూ కళ్ళనీళ్ళు పెడుతూ ఉండగానే, ఆ టేబుల్ సొరుగులో ఉన్న కాయితాలు చూస్తున్న సమయంలో చివరిసారిగా నాన్న గారు ఇచ్చిన 'వివేకానంద స్వామి 'పుస్తకం కనబడింది, అంతే ఒక్కసారి ఆ పుస్తకం అందుకుని గుండెలకు హత్తుకుంటూ ఉన్న సమయంలో ఆ పుస్తకంలో నుంచి ఒక ఎర్రటి చిన్న బ్యాగ్ కింద పడింది, వెంటనే అది తీసి చూడగానే 'విత్ లవ్ నాన్నగారు' అంటూ sports' car' తాళం కనబడేసరికి ఆశ్చర్యపోతూ, అందులో ఉన్న చిన్న కాయితం తీశాడు దానిమీద " హ్యాపీ గ్రాడ్యుయేషన్ డే " నీకోసం కొన్న ఆ కారు పక్కింట్లో మూర్తి గారి గ్యారేజ్ లో ఉంది, ఆ కార్ కి మొత్తం డబ్బులు కట్టేశాను, నీ పేరు మీద' రిజిస్టర్ 'అయి ఉన్నది, నీకు కోపం తగ్గిన వెంటనే వచ్చి ఆ 'వివేకానంద స్వామి' పుస్తకం చదివి ఆ తాళం తీసుకుంటావని అలా పెట్టాను! "నీలోని ఆత్మస్థైర్యం పెంచుకుని పరులకు సాయం చేస్తూ జీవితం ధన్యం చేసుకో. ఇట్లు మీ నాన్న." "అయ్యో నాన్నగారు" మీ మీద కోపంతో వెళ్ళిపోయాను, జీవితంలో ఎంతో సంపాదించాను, కానీ మీలోని ప్రేమ విలువను, తెలుసుకోలేకపోయాను ,ఎంత సంపాదించిన ఏం లాభం? తల్లిదండ్రుల ప్రేమ విలువను తెలుసుకోలేక పోయాను, నాకెందుకు నాన్న? ఈ "పనికిరాని పట్ట భద్రుని " మనసారా క్షమించమని కోరుతున్నాను” అంటూ నాన్నగారి ఫోటోకి బొట్టు పెట్టి నమస్కారం చేశాడు శ్రీధర్.!!!*****


41 views0 comments
bottom of page