top of page

కలసి వుంటే కలదు సుఖం


'Kalasi Unte Kaladu Sukham' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

అది 'రామాపురం' అనే అందమైన పల్లెటూరు. వేకువనే ' కొక్కొరొకో ' అన్న తొలికోడి కూతతో నిద్రాదేవి నులి వెచ్చని కౌగిలి నుంచి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది. పక్షుల కిలకిలా రవములతో, కోకిల 'కుహు కుహూ' గానముతో పల్లె ప్రజలు కాలకృత్యాలు తీర్చుకుని కూసింత చద్ది బువ్వ తిన్నారు. తలపాగా చుట్టుకుని నాగలి చేతబూని తమ తమ పొలం పనులకు ఉత్సాహంగా బయలుదేరారు.

పచ్చని పైరు పంటలతో, పిల్ల కాలువలతో కళకళలాడుతూ ఉండే ఆ ఊరిలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణలే తమ సొత్తుగా భావించి చాలా సంతోషంగా జీవిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. సుమారు వంద గడపలు ఉన్న ఆ ఊరిలో జనులు నిష్కల్మషమైన మనస్సుతో ఒకరినొకరు వరసలు పెట్టి పిలుచుకుంటూ కష్ట సమయాల్లో ఆదుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆ ఊరిలో పాతకాలపు శివాలయం, రామాలయం లలో నిత్యం పూజలు జరిపేందుకు పట్నం నుంచి పూజారి కుటుంబాన్ని పిలిపించి వాళ్ళకు నివాసం, జీతభత్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊరిలో ఏ గొడవలు వచ్చినా ఊరి పెద్ద రామయ్య రావిచెట్టు క్రింద ఉన్న రచ్చబండ వద్ద పరిష్కరిస్తాడు. నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పు వాళ్ళందరికీ శిరోధార్యం. ఆ ఊరిలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ప్రతి పండుగనూ ఎంతో వేడుకగా చేసుకుంటారు. ఏరువాక సమయంలో పొలంలో దుక్కి దున్ని వరి గింజలు వేసి పాటలు పాడుతూ నాట్లు వేశారు. సకాలంలో పంటలకు నీళ్ళు, క్రిమి సంహారక మందులు చల్లి కలుపు తీశారు. ఏపుగా వచ్చిన పైరును నాట్లు కోసి కుప్ప వేశారు. కొన్ని రోజుల తర్వాత కుప్ప నూర్చి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ధాన్యలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్న గృహిణులు హారతిచ్చి ఇళ్లల్లోకి స్వాగతించారు. ప్రతి ఇంటి ముంగిట పాతరలు, ఇంట్లో ధాన్యపు పురులు కట్టుకుని ధాన్యాన్ని భద్రపరుచుకున్నారు. అవి ధనుర్మాసపు రోజులు. వేకువనే రామాలయంలో ధనుర్మాసపు పూజలు. బిల బిల లాడుతూ పిల్లలు గుడికి వెళ్ళి బాదం ఆకులలో వేడి వేడి పొంగలి , దథ్థోజనం, పులిహోర ప్రసాదం పెట్టించుకుని ఆరగించటం, ఆ తర్వాత ఆటపాటలతో హాయిగా గడుపుతున్నారు. ఇల్లాళ్ళు సంక్రమణం పట్టి నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో కళ్లాపి చల్లి రంగు రంగుల రంగవల్లులు తీర్చి గొబ్బిళ్ళు పెట్టారు. "హరిలో రంగ హరీ" అంటూ హరిదాసు పాటలు, గంగిరెద్దుల హడావుడి , కన్నె పిల్లల సందె గొబ్బిళ్ళు, పేరంటాలు, ఆ ఊరి రామాలయంలో గోదాదేవి కల్యాణం జరుపుకున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్నాయి రోజులు.

వాళ్ళెంతగానో ఇష్టపడే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇళ్లన్నీ ఆవు పేడతో అలుక్కుని రంగవల్లులు వేశారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపలను పసుపు- కుంకుమ, పువ్వులతో అలంకరించారు. అరిశెలు, చక్కిరాలు వంటి పిండి వంటలను అందరూ కలిసి చేసుకున్నారు. కొత్త అల్లుళ్ళ రాకతో మరింత జోరు పెరిగింది. భోగి రోజున భోగిమంటలను వేసుకుని తలంటుకుని కొత్తబట్టలను కట్టుకొని పిండి వంటలతో విందారగించి పిల్లలకు భోగిపళ్లు పోసుకుని పేరంటం చేసుకున్నారు. ఆ తర్వాత రోజున బొమ్మల కొలువు పెట్టుకొని పేరంటం చేసి పాటలు పాడుతూ బొమ్మలకు హారతులు, కనుమ రోజున పశువులను, పశువుల సావిడులను అందంగా అలంకరించి బొమ్మలకు హారతిచ్చి సంక్రమణ పురుషుడైన దేవుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ ఊరి పెద్ద కాలువలో వ్రేళ్ళాడించి అటుకుల నివేదన , నిమజ్జనం, ప్రసాదాలను స్వీకరించారు .అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తమ తమ ఇళ్ళకు పయనమయ్యారు.

ఆ తర్వాతి రోజు ముక్కనుమ. ఆ రోజున ఎవరూ ప్రయాణం చేయరు. ఈ పండుగ నాలుగు రోజులు గదుల ముగ్గు, రథం ముగ్గులు ,వాటికి రంగులద్దటం, గొబ్బిళ్ళు పెట్టి వాటిని పువ్వులతో అలంకరణ చేశారు. కోడి పందాలు, వీధి నాటకాలు వేసుకుని ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. నాటకాలను వేసేందుకు పట్నం నుంచి పేరు పొందిన కళాకారులను తెప్పించి వాళ్ళకు బస, తిండి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తమకు ఇష్టమైన సత్య హరిశ్చంద్ర, భక్త ప్రహ్లాద, నల దమయంతి మొ… నాటకాలను వేయించారు.

ఆ ఊరి రైతు కామయ్య ఏకైక కొడుకు రంగడు . పక్క ఊరిలో ఇంటర్ వరకూ చదివాడు.చిన్నప్పటి నుంచి నాటకాలన్నా‌ , పద్యాలన్నా చెవికోసుకుంటాడు. సహజంగా ఒడ్డు, పొడుగుతో అందగాడైన రంగడు తన శ్రావ్యమైన కంఠస్వరంతో కంఠతా పట్టిన పద్యాలతో రాగాలాపన చేస్తూ నాటకాలలో వేషాలు వేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. అనేక పోటీల్లో బహుమతులను కూడా గెలుచుకుని మంచి తనంతో అందరికీ ఇతోధికంగా సాయపడుతూ ఆ ఊరి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. నలదమయంతి నాటకంలో నలుని వేషం వేసి అందరి మన్ననలను పొందాడు. అదే ఊరికి చెందిన సరోజ కూతురు లక్ష్మి, రంగడు ఇద్దరూ ప్రేమించుకున్నారు. చెట్లు- పుట్టలు తిరుగుతూ ప్రేమ గీతాలను పాడుకుంటూ ఆనందంగా గడుపుతున్న వాళ్ళను చూసి ఆ ఊరి వాళ్ళు రామయ్య దృష్టికి తెచ్చారు.

రామయ్య వాళ్ళిద్దరినీ రచ్చబండ వద్దకు పిలిచి ఊరి ప్రజలందరి సమక్షంలో విచారణ జరిపారు. లక్ష్మి, రంగడు ఇద్దరూ ఒకరి ఎడల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసి వారి పెళ్లి జరిపించమని కోరారు. 'జీవిస్తే ఇద్దరం కలిసే జీవిస్తాము . చావైనా, బ్రతుకైనా ఇద్దరం కలిసే ' అని తమ స్థిరమైన నిర్ణయాన్ని తెలిపారు. ఆ ఊరి ప్రజలందరూ కలిసి తాటాకు పందిరి వేసి పచ్చని తోరణాల మధ్యన లక్ష్మి మెడలో రంగడి చేత మూడు ముళ్ళు వేయించారు. ఇరు కుటుంబాల పెద్దలు, రామయ్య , మొ.. వాళ్ళు కొత్త జంటను ఆశీర్వదించారు.

తాము కన్న కలలు ఫలించడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేవు.ఆ ఊరిలోనే లక్ష్మి- రంగడు కొత్త కాపురం పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. మరుసటి ఏడాదే కొడుకును కని ఆ ఊరి శివయ్య పేరును తమ కొడుకుకు పెట్టుకుని ప్రేమగా వాడిని పెంచుకుంటున్నారు. రంగడు సొంతంగా ఒక కాన్వెంట్ ను పెట్టుకుని ఊరిలో పిల్లలకు చదువు చెపుతున్నాడు.

పదవ క్లాసు చదివిన లక్ష్మి కూడా భర్త సహకారంతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి BEd కూడా చేసింది. ఇప్పుడు ఉపాధ్యాయుల పోటీ పరీక్షలకు సిధ్ధమవుతోంది. ఆ పరీక్షలు రానే వచ్చాయి. లక్ష్మి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుల ట్రైనింగ్ ను పొందింది. అదృష్టం వరించినట్టుగా ప్రక్క ఊరికే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా లక్ష్మి చేరింది. ఆ ఊరి ప్రజలు చాలా చాలా సంతోషించి ఆ జంటకు సన్మానం చేశారు. లక్ష్మి‌, రంగడు ఇద్దరూ క్రమేణా ఆ ఊరిలో పిల్లలకు చదువు , ఆటపాటలు నేర్పుతూ విద్యావంతులను చేస్తున్నారు.

గవర్నమెంటుకు దరఖాస్తులు పెట్టుకుని నిధులు పోగు చేసుకుని ముఖ్యమంత్రి నిధుల సాయంతో ఊరికి రోడ్లు, బస్సులు వంటి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని ఊరిని అభివృద్ధి చేసుకున్నారు.ముఖ్యంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. పాల కేంద్రాన్ని, సహకార బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. కష్టపడి పండించిన పంటను పట్నంలో అమ్ముకుని ఆ ఆదాయాన్ని పొదుపు చేసుకుని తమ గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు.

ఆరోగ్యశాలను ఏర్పాటు చేసుకుని పట్నం నుంచి వైద్యుడిని తెప్పించుకుని ఆయనకు వసతి, జీతభత్యాలను ఏర్పాటు చేశారు. గ్రంథాలయాన్ని నిర్మించి పిల్లలకు విజ్ఞానం కల్గించే పుస్తకాలను, భాగవత, రామాయణాది గ్రంధాలను అందులో పొందుపరిచారు. వినోదం కోసం తమ గ్రామంలో నాటకాలు వేసే హాలును నిర్మించుకున్నారు. యువకులందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రంగడి సారథ్యంలో నటనలో శిక్షణ పొంది నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని వారాంతంలో నాటకాలు వేసి తద్వారా మానసిక ఉల్లాసాన్ని , ఉత్తేజాన్ని పొందుతున్నారు. వయోజన పాఠశాలను ఏర్పాటు చేసుకుని వయోజనులకు విద్య బోధిస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో నిశానీలు లేరు.

"ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా " అని ఎవరికోసం ఎదురు చూడకుండా ' కష్టేఫలి ' అన్న సిద్ధాంతాన్ని నమ్మి అందరూ ఒక త్రాటి పై నడిచి తమ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించారు. ఈ ఏడాది 'రామాపురం'' అత్యుత్తమ గ్రామంగా అవార్డును పొంది వార్తల్లోకెక్కి అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ రాకపోకలతో ఆ ఊరు సందడి సందడిగా ఉంది. ఆ ఊరి ప్రజల ఆనందానికి ఎల్లలు లేవు. స్వయంగా జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలను మెచ్చుకుని మరిన్ని నిధులను ఆ గ్రామానికి మంజూరు చేశారు. ఆ డబ్బుతో మంచి నీటి రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకుడు గుంతలను తవ్వుకుని వర్షం నీరు నిలువ చేసుకుంటున్నారు.

"కలసివుంటే కలదు సుఖం" అన్నట్లుగా రామాపురం ప్రజలందరూ కలిసి సమిష్టిగా తమ ఊరిని అభివృద్ధి చేసుకుని అందరూ కలసి మెలసి సంతోషంగా జీవిస్తూ కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తున్నారు. ఇప్పుడు 'రామాపురం ' గ్రామం మిగిలిన గ్రామాలకు ఆదర్శ ప్రాయమైనది.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

219 views0 comments
bottom of page