'Mahila Dinotsavam' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.
🌷🌷
స్త్రీ
పరిపూర్ణత కు శ్రీకారం స్త్రీ.మమకారానికి సాకారం స్త్రీ.
కరుణతో లాలించినా, కర్తవ్య దీక్షతో పాలించినా,
తల్లిగా దీవించినా , ధర్మపత్ని గా నడిపించినా
ఆమెకు సాటి ఎవరూ లేరు, రారు. అందుకే సృష్టి యావత్తు ఆమె కనుసన్నలలో నడుస్తోంది. విశ్వ వ్యాప్తి గా ఉండే చైతన్య శక్తి యే స్త్రీ. ఆమెకు నీరాజనాలు పట్టే సంస్కృతి మనది. వేదాలు, ఇతిహాసాలు పురాణాలలో ఆమె పాత్ర అమోఘం. అద్వితీయం.
" ఉపాథ్యాయాన్ దశాచార్య ఆచార్యానాం శతం పితాః, సహస్రంతు పిత్రూన్ మాతా గౌరవేణాతి రఛ్ఛతే."
పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు,
వంద మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి,
వేయి మంది తండ్రుల కంటే ఒక తల్లి సదా పూజనీయురాలు అని మనుస్మృతి చెబుతున్నది.
"మాతృ దేవో భవ, పితృ దేవోభవ " అని తల్లి కే తొలి నమస్కారం చేయాలి అని ఉపనిషత్తులు చెపుతున్నవి.
'శ్రీ ' (సంపద), స్త్రీ ( భార్య) ఈ రెండిటితోనే పురుషుడికి పూర్ణత్వం సిధ్దిస్తుంది. ఆమె తోనే ఆ ఇల్లు కళకళ లాడి ఆ వంశం వృద్ధి చెందుతుంది. స్త్రీ దుఃఖించ కూడదు , ఆమె ఖేదం ఆ వంశ నాశనం అని కూడా మను స్మృతి చెబుతున్నది.
"పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే ,
రక్షన్తి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి". అని స్త్రీ రక్షణ బాధ్యత పురుషునికే అప్పగించాడు మనువు. బాల్యంలో తండ్రి, యౌవనం లో భర్త, కౌమార, వ్రృథ్థాప్యం లో బిడ్డలు ఆమెకు రక్షణ కల్పించాలని మను థర్మం శాసిస్తున్నది.
"యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః". ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు . అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. ఆమెకే అగ్రతాంబూలం .
అతని శక్తి " వథువే."
వివాహ మంత్రాలు వథువుని మహారాణి గా పేర్కొన్నాయి." గ్రృహాన్గఛ్ఛ గ్రృహపత్నీ చథా సోవశినీత్వం విదధమాదాసి" అని ' నీవు మా ఇంటికి అతిథిగా వచ్చి , అథిపతిగా మారి మాచే పుణ్య కార్యాలు , యజ్ఞ యాగాలు చేయించి మమ్మల్ని ముందుకు నడిపించటానికి మా ఇంటికి రావాలి ' అని వరుడు వథువుని పెళ్ళిలో హామం చేసేటప్పుడు ప్రాధేయపడతాడు.
కన్యాదాన సమయంలో తండ్రి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి కన్యాదానం చేస్తాడు. అందుకే వథువుని సర్వాలంక్రృతురాలిని చేసి నడిపించకుండా ధాన్యం పోసిన వెదురు బుట్టలో మంగళ వాయిద్యాలతో తీసుకుని వస్తారు.వివాహ తంతు అయినాక కూడా ఆమెను నడిపించకుండా " ఉత్తరా రథస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తిః’; ‘అరోహయన్తీముత్తరాభి రభిమన్త్రయతే’... - రథం మొదలైన వాహనాల మీద కూర్చోపెట్టి వరుడి ఇంటికి తీసుకు వెళ్లాలని వివాహమంత్రాలు చెబుతున్నాయి.
మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువుని తనకు భార్యగా ఉండాలని " నాతిచరామి" అని వరుని చేతే ప్రమాణం చేయించి , ఆమెను అభ్యర్థించి, ఆమె అనుమతి మేరకే తన ఇంటికి తీసుకువెళ్లాలని వేద మంత్రాలు వల్లిస్తున్నాయి.
నవమాసాలు మోసి , మరోజన్మ (ప్రసవం) ఎత్తి బిడ్డ కు ప్రాణం పోసే ప్రాణ శక్తి స్త్రీ.
భర్త ను సేద తీర్చే చైతన్య శక్తి స్త్రీ.
మనిషిని పోరాట యోథునిగా తీర్చి దిద్దే శక్తి స్త్రీ.
తన శ్వాసను వదిలైనా సరే బిడ్డకు శ్వాసను అందించాలని నిస్వార్థంగా కోరుకునే ప్రాణి ఈ భూమి మీద కేవలం ఆమె మాత్రమే.
అందుకే వేదాలన్నీ ఆమెకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చాయి . కనుకనే ఆమె " వేద స్వరూపిణి " అయినది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు. బ్రాంచి పోస్ట్ మాస్టర్. వ్యవసాయ దారుడు. పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల. గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments