top of page

అంతా శివమయం


'Anta Sivamayam' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి నా మానస పూజ.

" శివాయ విష్ణు రూపాయ - శివ రూపాయ విష్ణవే " కనుక శివకేశవులు అభేదము.

ఈశ్వరా !

నిరాకారుడు, నిరహంకారుడు, త్రిగుణాతీతుడివి కనుక ఏ రూపమున నిన్ను కొలువగలను ? ఏ విధముగా అర్చించగలను ?

పవిత్ర నదీ జలాలతో నిన్ను ఆపాదమస్తకం అభిషేకిద్దామంటే పవిత్ర గంగ నే నీ శిరస్సున ధరించితివి కదా !

హాలాహలమును గళమున ఉంచుకొని వేడెక్కిన నిన్ను పరిమళ చందనములతో చల్ల పరుద్దామంటే హిమశిఖరమే నీ ఆవాసము కదా !

స్వర్ణ మణి మాణిక్యాలతో నిన్ను పూజించుదామనుకుంటే నాగరాజు అయిన వాసుకి యే నీ కంఠాభరణము కదా !

శ్రృతిలయలతో శ్రావ్యంగా గానం చేద్దామంటే

సామగానలోలుడివి, ఓంకార స్వరూపుడివి నీవే కదా !

నాద ధ్వని వినిపించుదామనుకుంటే ఢమరుకాన్నే చేతిన పూనిన ప్రణవ నాదమునివి నీవే కదా !

వేద పారాయణము చేసి నిన్ను ఆనందింప చేద్దామనుకుంటే వేదోపాసన చేసిన దక్షిణామూర్తివి నీవే కదా !

పట్టు వస్త్రములతో నిన్ను సత్కరిద్దామనుకుంటే జింక చర్మమే నీ ఆఛ్ఛాదనము కదా !

న్రృత్య నాట్యాలతో నిన్ను అలరిద్దామనుకుంటే నాట్యాధిపతి నటరాజ స్వరూపుడు నీవే కదా!

పంచ భక్ష్య పరమాన్నములతో సంత్రృప్తిగా నీకు నివేదన చేద్దామనుకుంటే సాక్షాత్తు అన్న పూర్ణ యే నీ సతి కదా !

షోడశోపచారములతో నీకు సేవ చేద్దామనుకుంటే వినయ విథేయుడైన నందీశ్వరుడు నీ సేవకుడు కదా !

సుగంధ పరిమళ పుష్పాలతో అర్చించి పుష్పమాల వేద్దామనుకుంటే సర్పాన్నే కంఠమాల గా ధరించితివి కదా !

మధురమైన ఫలాలను సమర్పించుదామనుకుంటే గరళాన్ని మ్రింగిన గరళ కంఠేశ్వరుడువి నీవే కదా !

పవిత్ర మందిరమున నిన్ను ఉంచి పూజించుదామనుకుంటే స్మశానమే నీ ఆవాసము కదా !

ఎచట ఉన్నా వో నీ ఉనికిని కనుగొందామనుకుంటే

ఆది- అంతము లేని సద్యోజాతకుడివి నీవే కదా !

ఏమి ఇచ్చి నిన్ను సేవించుకోగలను ?

ఏ సేవలతో నిన్ను సంత్రృప్తిపరచగలను ?

ఏ రూపమున నిన్ను పూజింతును ?

ఏమున్నది నా వద్ద ? " నేను - నా " అనే అహం తప్ప. అహం వీడి సత్యము తెలుసుకున్నాను.

నాలో జ్వలిస్తున్న జీవన జ్యోతివి నీవే.

నాది అనబడే ఈ దేహము నాది కాదు - నీవు ఇచ్చినదే.

అహంకార దర్పములను వీడి , నిర్మలమైన మనస్సును నీకు అర్పించి , నిన్ను అర్చించి, నీలో ఏకమై, మమేకమై శివైక్యమును పొందుతాను ఈశ్వరా !


***శివ కటాక్ష ప్రాప్తిరస్తు***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

135 views0 comments

Comments


bottom of page