'Kadali' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
ప్రపంచ కవితా దినోత్సవం (21 /03 /2021) సందర్భంగా నా కవిత.
అంశం... కడలి.
కడలి కెంత గంభీరమో నదీ నదాలన్నీ తనలో ఇముడ్చుకున్నాననీ,
కెరటాల కెంత ఉబలాటమో ఉవ్వెత్తున నింగికెగరాలనీ,
అలలకెంత ఆరాటమో రెట్టించిన ఉత్సాహం తో తీరం దరికి చేరాలనీ,
హోరుగాలి కెంత సంతసమో అలలతో కూడి మంద్ర స్వర సంగీతం ఆలపిస్తున్నాననీ,
నింగి కెంత నిగర్వమో నక్షత్ర కూటమితో ప్రశాంత వదనయై ఉన్నాననీ,
చంద్రుని కెంత చిలిపి దరహాసమో సంద్రునికి అందనంత ఎత్తున ఉన్నాననీ,
సుడిగుండాల కెంత బాధయో సుగమ మార్గము తెలియక ఇరుకున పడ్డాననీ,
పుడమి కెంత పులకరింతయో సంద్రము తన అంతర్భాగమైనందుకు,
చరచరాల ప్రాణులకు ఎంత నిశ్చింతయో సంద్రుని ఆవాసంలో హాయిగా సేద తీరుతున్నందుకు,
ప్రక్రృతి కెంత పరవశమో సంద్రగాలితో సరాగాల నాట్యమాడాలనీ,
సంద్రుని కెంత నిబధ్ధతయో ఆచంద్ర తారార్క సృష్టి కి సాక్షీభూతమైనందుకు,
కవుల కెంత మనోహరమో ఆద్యంతము లేని సంద్రము కవితాత్మక ఊహాకల్పన వర్ణన కు,
నా మదికెంత ఆహ్లాదమో సంద్ర కెరటాలను చూసి ఆనందించే అదృష్టం కలిగినందుకు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments