top of page

కలియుగ ద్రౌపది


'Kaliyuga Droupadi' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

"సుజా...

ఏమని రాయను నీకు ప్రేమ లేఖ ! నీ అందమైన నవ్వును పొగుడుతూ రాయనా!? లేదా నీ నీలాల కన్నుల్లో దాగి ఉన్న సొగసును వర్ణిస్తూ రాయనా!? మధురమైన భావాలు మది కొలనులో మొగ్గ విప్పుతుంటే నిన్ను నాదానిగా చేసుకోవాలనే నా తపనను ఎలా వ్యక్తం చేయను?

సుజా.. ఐ లవ్ యూ"

"ఈ నెలలో ఇది ఇరవై రెండవ ప్రేమలేఖ."

నవ్వుతూ ఆ లేఖను మంచం మీదకి విసిరేసింది సుజా. ఆమె నవ్వులో తనలో ఏదో ప్రత్యేకత ఉందనే గర్వం తొణికిసలాడింది. ఆ గదిలో ఉన్న మరకలు పడ్డ నిలువుటద్దం ముందు నిల్చుని ముందూ వెనకా చూసుకుని మురిసిపోతోంది.


"ఇదే కదా వాళ్ళు కోరుకునేది. ఈ వంపుసొంపులు, ఈ అందాలు వారికి కావాలి కదా. ఇంకా ఎన్ని యేళ్లు? మహా అయితే ఒక పదీ పదిహేను. అంతేగా ఆతర్వాత నేనూ ఒక ఆకర్షణ లేని ఆంటీనేగా!! అప్పుడు వస్తాయా ఈ ప్రేమ లేఖలు?? అప్పుడు అడుగుతారా నా ప్రేమను???" సుజా నవ్వుతోంది. ఇప్పుడామె నవ్వులో వేదాంతం కనిపిస్తోంది.


" ఏంటి సుజా! నువ్వు మరీను. మగవారు మావైపు కన్నెత్తి కూడా చూడట్లేదని మేము బాధపడుతుంటే నువ్వేమో నీకొచ్చే ప్రేమలేఖలు అపురూపంగా దాచుకోవలసింది పోయి, ఇలా విసిరేస్తున్నావు." అప్పుడే అక్కడకు వచ్చిన మధుమతి ఆ ప్రేమలేఖను ఏరుతూ అడిగింది.


" ఆ సుధాకర్ గాడిదో ప్రేమా.!! దానికో లేఖ.! దాన్ని నేను దాచి పెట్టుకోవాలి..." విరక్తిగా నవ్వింది.


"ఎందుకే నీకంత వైరాగ్యం?? ఏం వయసొచ్చింది అని?

పద్దెనిమిదేళ్ల అందగత్తెవి. నీ అందం నాకుంటేనా, కుర్రాళ్లను ఒక ఆట ఆడించేదాన్ని. నేనే మగవాడిగా పుట్టుంటేనా! నిన్ను పెళ్లి చేసుకుని స్వర్గ సుఖాలు అనుభవించేదాన్ని" సుజా కౌగిట్లో వాలుతూ మధుమతి అల్లరి పెట్టింది.


" ఛీ వదలవే రాకాసి. ఇదేం పాడు బుద్దే నీకు...పో అవతలికి" సుజా నవ్వుతూనే ఆమెను వెనక్కి తోసింది.


పడుతూ పడుతూనే మంచం మీద పడింది మధుమతి. చామన ఛాయగా ఉన్నా మంచి శరీర పుష్టి ఉన్న యువతి. ప్రేమ అనే పైత్యం నరనరాల్లో ఉందేమో! ఎవరైనా తనకూ ఒక ప్రేమలేఖ రాస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటుంది. సుజాను చూసి కుళ్లుకోదు. కానీ ఆ అందం తనకు ఉంటే బాగుండు అని పరితపిస్తూ ఉంటుంది.


" అబ్బ ఎంత బలంగా తోసావే ముసలమ్మ!! ఈ తోపుకు మంచం విరిగితే మన రాకాసి మన నడ్డి విరగ్గొడుతుంది" లేచి కూర్చుని సుజా చెంగుతో ఆటలాడుతూ చెప్పింది.


మధు ఎవరిని రాకాసి అంటుందో అర్దం అయ్యింది సుజాతకు.


" ఏయ్ చాల్లేవే...పాపం పెద్దావిడ. ఆవిడను పట్టుకుని రాకాసి అంటావేం?" అంటూ మధు చేతిలోని తన చెంగును విడిపించుకుని పుస్తకాలు సర్దే పనిలో పడింది సుజా.


" నీకేం అమ్మా. పద్ధతిగా ఉంటావు. నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. మేము కొద్దిగా మోడ్రన్ గా ఉంటే చాలు మీద మీదకు వస్తుంది."

సుజా వెనకాలే వెళ్తూ బుక్స్ అందిస్తూ చెప్పింది మధు.


"ఆమె చెప్పేది మన మంచికేగా. చున్నీ ఉన్నదెందుకు మెడకు చుట్టుకోడానికా?! లేదా ఎత్తులు కప్పుకోడానికా?

పోనీ చీర కట్టారు. జాకెట్టు ఎంత పైకి పెట్టారు? వెనక కనిపించేట్టు. పైట కూడా నడుము మొత్తం కనిపిస్తోంది మీరు కప్పుకోకపోతే మందలించడం వార్డెన్ గా ఆమె బాధ్యత. ఇందులో నాకేం తప్పు కనిపించట్లేదు" తను చెప్పవలసింది చెప్పి క్లాసుకు వెళ్లిపోయింది సుజాత.


" ఆ ముసలిదానికేం తెలుసు! మా పడుచు పడతుల గొడవ. పిల్లా జెల్లా లేనిది. ఒక మొగుడా ముచ్చటా. దాంతో ఉండి ఉండి నువ్వు కూడా ముసలిదానివి అయిపో" ఆమె వెళ్లే వైపు అల్లరిగా అరిచింది మధు. ఆ అల్లరి అరుపులు తలుపుచాటున వింటున్న రమాదేవి గుండె బరువెక్కింది.

ఇద్దరూ యవ్వన దశలో ఉన్న అతివలు. కానీ ఎంత వ్యత్యాసం? ఒకరు అదుపులేని జీవితం కోరుకుంటూ ఉంటే ఇంకొకరు అదుపే జీవితంగా చేసుకున్నారు. ఒకరు తల్లిలా శ్రేయస్సు కోరే వార్డెన్ రమాదేవిని కొరకరాని కొయ్యగా భావిస్తుంటే మరొకరు ఆ కొయ్యలో దేవతను ప్రతిష్టించారు.

***

"నేను చేసిన తప్పేంటి??" రమాదేవి బాధపడుతోంది. చిక్కటి చీకటిలో హాస్టల్ గార్డెన్ లో కూర్చుని నెమ్మదిగా అడుగుతోంది సుజాతను.

వర్షిస్తున్న ఆమె కళ్ళు కనిపించక పోయినా బరువెక్కిన ఆమె హృదయాన్ని అర్దం చేసుకుంది సుజాత.

ఆమెను పొదివి పట్టుకుని భుజాలను సన్నగా తడుతూ ఓదార్చింది.

" చెప్పు సుజా...పిల్లా జెల్లా లేకపోవడానికి నాదా తప్పు? నాకు మాత్రం మొగుడుతో ఉండాలని ఉండదా? నా జీవితంలా మీ బతుకులు అవ్వకూడదు అనే కదా నా ప్రాకులాట. అదెందుకు అర్ధం చేసుకోరు??" ఆమె తన మనసులో బాధ వెళ్లగక్కుతూ వెచ్చని సుజాత ఒడిలో వాలిపోయింది. ఆమెను ప్రేమగా నిమురుతూ మౌనంగా ఉండిపోయింది సుజా.

రమాదేవి ఎంతటి నరకం అనుభవించినదో సుజాతకు తెలుసు. సుమారు తనంత వయసున్నప్పుడే కదా రమాదేవి జీవితం బుగ్గిపాలు అయ్యింది. ఊరిలో పెద్దమనిషిగా చలామణి అయ్యే ఓ రాబందు ఆమె శీలాన్ని దోచుకున్నాడు.

ఇదేమని ప్రశ్నిస్తే "నువ్వు ఆడపిల్లవని మరచి తిరిగావు. అసలు నువ్వు వేసే బట్టలు ఏంటి? లంగా జాకెట్టు వేసుకుంటే ఏ మగాడికైనా మనసు రాదా? చక్కగా పైట కప్పుకు తిరిగితే ఈ అనర్థం జరిగేదా? మగవాడు దర్జాగా బతుకుతాడు. ఆడదానివి నీకు బుద్ది ఉండక్కర్లేదా? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అని మరిచావా?? నిన్ను చూసి మిగతా పిల్లలు చెడిపోతారు… పో ఇక్కడి నుండి" అని గెంటి వేసిన ఊరి జనం మీద కోపం కన్నా, "పరువు మొత్తం మంట గలిపావు కదే పాపిష్టి దానా" అని అమ్మ ఉరివేసుకుని ఈ లోకం విడిచి తనను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది...అది గుండెల్ని పిండేసే విషయం ఆమెకు. ఇందులో తన తప్పు ఏముందో అర్దం కాకపోయినా యుగాలు మారినా సమాజం స్త్రీనే దోషిస్తుంది అని అర్దం అయ్యింది.

ఎలాగోలా తెలిసిన వారి కాళ్ళా వేళ్ళా పడి ఈ ఉద్యోగం తెచ్చుకుంది. తన బతుకులా ఈ పిల్లల బతుకు మారకుండా ఉండాలంటే కఠినంగా ఉండాలని ఈ పిల్లలను సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. మహా అయితే మూడేళ్లు ఉంటారు వీళ్ళు. ఈ మూడేళ్ల లో సాధ్యమైనంత మేరకు వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది

అసలు ఆడపిల్లకు చదివే గొప్ప అనుకునే ఆ రోజుల్లో సుజాతను డిగ్రీ కళాశాలలో చేర్పించారు. నలుగురు ఆడపిల్లల్లో చివరిది సుజాత. నాన్న రైల్వే ఉద్యోగి. ట్రాన్స్ఫర్ లు అవి తరచుగా అవుతూ ఉంటాయి. పిల్ల చదువులో బంగారం. పెద్ద పిల్లలకు చదువు అబ్బ లేదు. చిన్న పిల్ల అయినా బాగా చదివి ఆ డిగ్రీ పూర్తి చేస్తే , తన రైల్వే జాబు ఆమెకు వచ్చేలా చెయ్యొచ్చు అని ఆ తండ్రి ఆశ. అందుకే బంధువులందరూ ఆడపిల్లను హాస్టల్ లో ఎందుకని చెవులో హోరు పెడుతున్నా, ఆమె ఇష్టానికి అనుసారంగా ఆమెను చదువుకొనిచ్చాడు.

సుజాతను డిగ్రీ కళాశాలలో చేర్పించేటప్పుడు ఆమె అమ్మ రాజ్యం ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రమాదేవి కి కూడా పిల్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్పి వెళ్ళింది. ఎందుకో కానీ రమాదేవికి సుజాత అంటే ఎంతో అభిమానం. చక్కగా పైట కప్పుకుని నిండు కుండలా అణకువగా ఉండే ఆ పిల్లని చూస్తే తనకు ఇటువంటి అమ్మాయి ఉంటే ఎంత బాగుండేదొ అనుకునేది.

చూస్తూ చూస్తూ వుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. డిగ్రీ మూడవ సంవత్సరం చివరి దశలో ఉన్నారు వీళ్ళు.

సుజాతకు ప్రేమలేఖ రాసిన సుధాకర్ మధుమతి ప్రేమలో పడిపోయాడు. మధుమతి కి షికార్లు పెరిగాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి.

సుజా మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. అణకువగా..నిండుకుండలా... నిశా నీడల్లో రమాదేవి జీవిత పాఠాలు నేర్చుకుంటూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ. ఈ డిగ్రీ పూర్తి చేస్తే చాలు తండ్రి కల నెరవేరుతుంది. అప్పుడు తన తండ్రి ఏం చేస్తాడు. ఆడపిల్లకు చదివేందుకు అన్నవాళ్లకు చెంప చెళ్ళుమనిపించేలా తనను చూపిస్తాడా?? తను రైల్వే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం పురుష లక్షణం అనే ఛాందసవాదులను ఎదిరిస్తాడా??

"ఎంతగా మురిసి పోతాడో కదా నాన్న. " తండ్రి మురిపాన్ని తలుచుకుంటూ మురిసిపోయింది సుజాత.

లైబ్రరీ నుండి కొన్ని పుస్తకాలు తీసుకు వస్తుంటే ఎవరిదో చిన్న రోదన వినిపిస్తుంటే అటువైపు వెళ్ళింది. ఆ అమ్మాయి బెంచి మీద తలవాల్చి ఏడుస్తోంది. ఎవరై ఉంటారు?? ఏం కష్టం వచ్చిందో అని చూస్తున్న సుజాతను గమనించిందో ఏమో తల పైకెత్తి విసురుగా చూసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు మధుమతి. సుజా వెంటనే తన చేతిలోని పుస్తకాలు పక్కన బెంచి మీద పెట్టి మధు చెంతకు చేరింది. " ఏమైంది మధు??" అన్నట్టు కళ్ళతోనే మౌనంగా అడిగింది. ఎందుకో సుజా కళ్ళల్లో కూడా నీరు చేరుకుంది. సున్నిత హృదయం కదా.

" ఏం లేదు" అన్నట్టు చెప్పడం ఇష్టం లేని మధు మొహం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుని అక్కడనుండి నిష్క్రమించింది.

" ఏమై ఉంటుందా" అని ఆలోచిస్తూ అలాగే కూర్చుంది సుజా మధు వెళ్ళిన వైపే చూస్తూ.

" సుధాకర్ మోసం చేశాడా?? లేదా ఏదైనా చెప్పుకోరాని అఘాయిత్యం జరిగిందా?? ఏమైంది దీనికి నిన్నటి నుండి చూస్తున్నా. మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా ఉంది. కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయని అడిగితే నిద్రలేదు అంది. ఉదయం దాని దిండు తడిచి ఉంది. అంటే అది రాత్రంతా ఏడుస్తూ ఉందా?? ఏం జరిగింది దానికి?? అదేమీ అఘాయిత్యం చేసుకోదుగా...వెంటనే దాన్ని కాపాడాలి" అనుకుంటూ సుజాత హాస్టల్ వైపు పరుగు పెట్టింది.

హాస్టల్ కి వెళితే అక్కడ మధుమతి లేదని తెలిసింది. కాలేజీ లో కూడా వెతికింది. ఎక్కడా లేదు. మరి ఎక్కడికి వెళ్లి ఉంటుంది??? సుధాకర్ దగ్గరకా ??? అతని రూం తనకి తెలుసు. ఈ రోడ్డు దాటి అవతలి రోడ్డు. వెళ్దామా వద్దా?? మధు అక్కడకే వెళ్లిందని నమ్మకం ఏంటి?? ఒకసారి చూసి వద్దాం. తప్పేంటి??? అనుకుంటూ రోడ్డు దాటింది.

"మధు ఏమయ్యావే? ఏం చేసుకోకే.. నేనొస్తున్నా..నిన్ను నా గుండెల్లో పెట్టుకు లాలిస్తా...నీ బాధ నాతో పంచుకో...యెటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోకు..మధు.." మనసులో అనుకుంటూ సుధాకర్ ఇల్లు చేరుకుంది.

ఎవరో వస్తారని అంచనా వేసినట్లు తలుపులు తెరిచి, స్వాగతం ...నా కలల రాణి కి ...అని పూలతో రాసి ఉంచారు. ఆ పూలను పాడు చెయ్యకుండా పక్కనుండి వెళుతూ “మధు...సుధాకర్...మధు…” అని మార్చి మార్చి పిలిచింది. బదులు లేదు. ఇంకొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. బయట ఎవరో తలుపు మూసేసిన చప్పుడు. ఉలిక్కి పడి వెనక్కి చూసింది. సుధాకర్ నవ్వుతూ తలుపుకి అడ్డు గా నిల్చున్నాడు.

"సుధాకర్! మధు ఎక్కడ?"

" మధువు లోలికించే నీ మెత్తని అందాలు ఉండగా మధు ఎందుకు మధ్యలో"

" సుధాకర్… నీకు పిచ్చి పట్టినట్టు ఉంది. అడ్డులే.. నేను బయటకు వెళ్ళాలి"

" వెళ్దువు... తొందరఎందుకు? నీ మధువులు నన్ను ఆస్వాదించనీ.... నీ సుమధుర పెదవులు నన్ను ముద్దాడనీ.." అతను గట్టిగా బంధించాడు ఆమెను.

"చీ...నీచుడా...నన్ను వదులు" అతన్నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేడిగా తాకుతుంటే, అత్యంత దగ్గరగా తనను హత్తుకు నిల్చున్న అతన్ని చూస్తుంటే ఒళ్లంతా కాలబెట్టుకోవాలి అనేంత కంపరం వేస్తోంది.

నిండుగా కప్పుకున్న పైట చెంగును అతను లాగుతుంటే ఎగసి పడుతూ ఉన్న అమ్మ తనం చూసినా సిగ్గు తెచ్చుకోలేని ఆ మృగాన్ని చూసి స్త్రీ బతుకు మీదే జుగుప్స కలుగుతోంది. "ఛీ...నీకు నాకు ఉన్న తేడా ఈ రెండు అవయవాలే కదా ..నువ్వు మనిషివే నేను నీలాంటి మనిషినే...ఈ రెండు నిమిషాల సుఖం కోసం మృగం గా మారకు" అంటూ అరిచింది.

ఆమె ఆర్తనాదం శూన్యం అయ్యింది. బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోక తప్పదు. సూరీడును కప్పిన నల్లని మబ్బులా అతను ఆమె దేహాన్ని కబళించ బోతుంటే ఆమె అతన్ని బలంగా తోసింది.

చేతిలోని జింక తప్పించుకుంటే వేటాడే మృగంలా ఆమెను పట్టుకోబోయాడు. ఆమె జింక కాదు సివంగి అని తెల్సుకోడానికి ఎంతోసేపు పట్టలేదు అతనికి.

గదిలోకి పరుగెత్తిన ఆమె చేతిలో కత్తి పట్టుకుని ఉగ్ర రూపంలో కాళికామాత లా భయకరంగా అరుస్తూ దూసుకువచ్చి, వెంట బడుతున్న అతన్ని కిందకు తోసి అతని మెడను తన కాళ్ళతో నొక్కి పెట్టి " ఏరా...ఇదేనా నీకు కావలసింది… ఈ ఒంపు సొంపుల కోసమే కదా నువ్వు మృగం లా మారింది...ఇప్పుడు తీసుకోరా..." అంటూ ఆమె అతనిపై దూకింది.

**********

"నందూ ఎంత సేపు అలా ఆ పిచ్చి కథలు చదువుతూ కూర్చుంటావు...ఇలా రా! వచ్చి నాకు సహాయం చెయ్యి. రేప్పొద్దున పెళ్ళైయ్యాక నీ అత్తమామలు నన్ను తిట్టుకుంటారు. పిల్లకి పని నేర్పించలేదని" రాధిక పిలుపుతో చదువుతున్న కథను పక్కన పెట్టేసి వంటింటి లోకి వెళ్ళింది నందిని.

"అమ్మా! అన్నయ్యకు కూడా నేర్పకూడదూ ఈ పని. ఏం?.. వాడు మాత్రం మనిషి కాడా.. వాడి తిండి వాడు వండుకొలేడా? అమ్మాయిని అయినంత మాత్రాన వంటపని నాకే ఎందుకమ్మా.. ?? పని యేదైనా పనే కదా! ఆడామగా తేడా ఎందుకు?" నందిని ప్రశ్నల వర్షం కురిపించింది.

రాధిక చిన్నగా తల కొట్టుకుంది

"అబ్బా... మొదలెట్టావా.. రోజూ నీతో ఇదో గోల అయ్యిందే… నాకో విషయం చెప్పు. అర్దరాత్రి అయినా అపరాత్రి అయినా వాడు బయటకు వెళ్లి సరుకులు తేగలడు… నువ్వు భయం లేకుండా వెళ్లి తేగలవా… అబ్బాయి అబ్బాయే .. అమ్మాయి అమ్మాయే." అంటూ కాఫీ పట్టుకు వెళ్ళింది శ్రీవారిని లేపేందుకు.

రాధిక చెప్పింది విని ఊరట పడక ఆమె వెనకే వెళ్ళింది నందు. "అమ్మా! నువ్వు పంపిస్తే నేను వెళతాను. భయం అనేది ఆడవారికైనా మగవారికైనా ఉంటుంది. ఏం?.. మగవారి మీద దాడులు జరగట్లేదా. పోనీ ఆడవారి మీద దాడి చేసేది ఎవరు? మగవారే కదా… నీ కొడుకు లాంటి వారేగా. మరి వాళ్ళకి ఆడవాళ్ళను ఎలా గౌరవించాలి అని చెప్పకుండా మమ్మల్నెందుకు మూసుకుని కూర్చోమని అంటారు. " సాధారణ ప్రశ్న లాగే అడిగింది నందిని. ఆ అమాయక కళ్ళలో ఎందుకీ వివక్ష అన్నట్టు ఉంది.

" ఏం చెప్పనే తల్లీ నీకు… పట్ట పగలే అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కాదా బంగారం. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తావు. అక్కడ డేంజర్ అని రాసుంటే నువ్వు జాగ్రత్త పడతావు కదా...లేదా అటువైపు వెళ్లడమే మానుకుంటావు. ఇదీ అలాంటిదే. అందుకే ఆడపిల్లల్ని రాత్రి పూట బయటకు పంపనిది" నందిని ముఖాన్ని తన అరచేతిలో పట్టుకొని ముద్దాడుతూ చెప్పింది.

"మరి నన్ను పగటి పూట కూడా బయటకు పంపరు కదా అమ్మా" నందిని అడిగిన ప్రశ్నకు రాధిక నీళ్ళు నమిలింది. ఏం చెప్పాలో తెలియక అప్పుడే నిద్ర లేచిన భర్త వంక చూసింది.

" రా తల్లీ రా ..నా పక్కన కూర్చో" అంటూ పిలిచాడు రంగనాథ్.

రాధిక వెళ్లిపోయింది. నందిని తండ్రి మీద ప్రేమగా తల వాలుస్తూ అడిగింది.

" వాడెవడో బెదిరిస్తే నన్నెందుకు బంధించేరు డాడీ" ఆమె కళ్ళు ఆమెకు తెలియకుండానే వర్షిస్తున్నాయి.

"నీ మీద ప్రేమతో తల్లీ" ఆమె తలమీద ముద్దు పెట్టుకున్నాడాయన.

" ఇందాకే ఒక కథ చదివాను డాడీ...పాపం సుజాత నిండుగా బట్టలు కప్పుకుని తలవంచుకుని బతుకుతుంది. అయినా ఆమె మీద అత్యాచారం చేయబోయాడు. ఇంకా పూర్తి కథ చదవలేదు కానీ ఒకటి మాత్రం అర్దం అయ్యింది ఆమె బట్టల్లో తప్పు లేదు వాడి ఆలోచనలో తప్పు ఉంది." తండ్రి గుండెల మీద వాలుతూ సుజాత కథ చెప్పింది నందిని.

" అవునమ్మా...వాడు దుర్మార్గుడు... సుజాత తప్పులేదు...రమాదేవి దీ తప్పులేదు.." ఆమె తలనిమిరాడు.

" మరి నేను చేసిన తప్పేంటి డాడీ...నాకు నచ్చిన బట్టలు వేసుకోనివ్వరు..నచ్చినట్టు తిరగనివ్వరు...అసలు కాలేజీకి కూడా పంపట్లేదు. కనీసం బాల్కనీలోకి కూడా రానివ్వరు...తప్పు వాడు చేస్తే శిక్ష నాకా డాడీ" అతని కళ్ళల్లోకి చూస్తు అమాయకంగా అడిగింది.

" నీ మీద ప్రేమతోనే అమ్మా..మేమేం చేసినా" మళ్లీ అదే సమాధానం ఇచ్చాడు.

నందిని మౌనంగా వెళ్ళిపోయింది. నందిని ఇంటర్ విద్యార్థిని. పసుపు ముద్దలో పాలు పోసి చేశారా అన్నట్టుండే మేని ఛాయ కు, చారడేసి నల్లని కళ్ళు, నిండైన అధరాలు, తీరైన అవయవ సౌష్టవం తో అప్సరస అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్టు ఉన్న ఆమె యవ్వన దేహంపై రాకాసి కళ్ళు పడ్డాయి.

కాలేజీలో చాలా మంది కుర్రాళ్ళు వెంట పడ్డా, అందరినీ తోసి ముందుకు నిలిచింది. ఎమ్మెల్యే గోవిందం కొడుకు రాహుల్. డబ్బు ఉన్నదనే అహంకారం, మేం ఏం చేసినా చెల్లుతుందనే పొగరుతో నందినిని దక్కించుకోవాలని ఆశ పడ్డాడు. వెంట పడ్డాడు. వేధించాడు. నందిని ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చింది. కొద్ది రోజులు ఊరుకున్నాడు.

ఒకరోజు నందిని బజారులో ఉండగా ఆమె మీద యాసిడ్ పోశాడు. నందిని కెవ్వున అరిచింది. అది యాసిడ్ కాదు నీళ్ళు అని గ్రహించాక బైక్ మీద వెళ్తున్న అతడిని చూసింది. జాగ్రత్త అని చూపుడు వేలితో బెదిరిస్తున్నారు. ఎవరైతే ఇది చూడకూడదు అని అనుకుందో వాళ్ళు ఇది చూశారు.. రాధిక, రంగనాథ్ లు. మిన్నకుండి పోయారు. ఏం జరిగిందో తేల్చుకోలేని స్థితిలో ఉండి పోయారు.

చుట్టూ జనం చేరి ఏదేదో మాటలు. రాధిక నందిని జెబ్బ పట్టుకుని కారులో తోసింది. ఇంటికి వెళ్లేవరకు ఒక్క మాటా లేదు. ఇంటికి చేరాక జరిగిందంతా చెప్పింది నందిని. ముందే ఎందుకు చెప్పలేదని తిట్టిపోసారు. పాపం వాళ్ళ భయం వాళ్ళది. పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకునే మామూలు మధ్య తరగతి మనుషులు వాళ్ళు.

అక్కడ నుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నాలుగు గోడలే నందిని ప్రపంచం. ఆ పిల్ల అడిగినవన్నీ కొనిస్తారు. ఒక్క స్వతంత్రం తప్ప. పిల్లకి ఎంత తొందరగా పద్దెనిమిది యేళ్ళు నిండుతాయో...ఎంత వేగంగా పెళ్లి చేసి పంపేద్దామా అన్నట్టు ఉన్న అమ్మానాన్న ను చూసి నిర్లిప్తంగా నవ్వింది నందిని.

తనకంటూ ఆశలు, అశయాలు లేవా?? తన మనోభావాలు వీళ్ళు పట్టించుకోరా?? ఎవడికో భయపడి నేను గృహ నిర్బంధం లో బతకాలా?? వెరేవడికో ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడి దగ్గర మళ్లీ ఓ బానిస బతుకు. ఎందుకంటే నేను ఆడదాన్ని. నాకు ఏ స్వాతంత్రం లేదు. కేవలం రెండు అవయవాల తేడా వల్ల నేను ద్వితీయ శ్రేణి ప్రాణిని. నా కలలు చంపుకుని, నా తండ్రి తెచ్చిన వాడిని పెళ్ళాడాలి. వాడికి సేవలు చెయ్యాలి. వాడికి పిల్లల్ని కని ఇవ్వాలి...వాడి తల్లిదండ్రుల్ని చూసుకోవాలి...మరి నా తల్లిదండ్రులో... పోనీ ఈ ఇల్లు నాది కాదు. మరి ఆ ఇల్లు అయినా నాది అవుతుందా??

అక్కడైనా నన్ను నన్నుగా గుర్తిస్తారా?...నా ఊహలు కలలు నన్ను నెరవేర్చుకునే అవకాశం ఇస్తారా??? నింగి నేల నాదే అన్నట్టు నన్ను ఎగరనిస్తారా?? లేదా రెక్కలు ముక్కలు చేసి బాధ్యతా వలయంలో పడేస్తారా???"

తన మదిని తొలుస్తున్న ప్రశ్నలను డైరీలో రాస్తూ పోతోంది నందిని.

"నందినీ! మేడ మీదకు వెళ్లకు...ఎదురింటి కుర్రాడు ఇటే చూస్తున్నాడు"

"నందూ! చున్నీ సరిగ్గా కప్పుకోమ్మా...ఎవరి చూపులు ఎలాంటివో మనకేం తెలుసు"

"నందూ! మొక్కలకి నీళ్ళు పొయ్యడానికి నువ్వు రాకు. అమ్మ పోస్తుందిలే.."

" స్కూటీ ఎందుకు తల్లీ...బయటకు వెళ్ళేది లేదుగా.."

" బాల్కనీ లోకి రావొద్దమ్మా...నాకే అనిపిస్తోంది...నాకుతురు ఎంత అందంగా ఉందో అని...మరి బయట వాళ్ళకి అనిపించదా??..."

"తల విరబోసుకోకు...టైటు బట్టలేసుకోకు...బయటకు రాకు...ఇంటికి ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళు.."

ఇలా ఎన్నో ఆంక్షలు...అన్నింటికీ ఆమె సమాధానం ఒక్కటే...నవ్వు...నిర్లిప్తంగా... నిర్వేదంగా...ఒక్క నవ్వు...ఒక్క మౌనం.. ఆమె జవాబు..

"ఈ ఇంటర్ పరీక్షలు ఒక్కటీ రాసి వస్తే డిగ్రీ ఇంట్లో కూర్చొని దూర విద్య ద్వారా చేసేయొచ్చు...రేపటి నుండి పరీక్షలు...అన్నయ్య తోడుగా వస్తాడు. వెళ్లి పరీక్షలు రాసి జాగ్రత్తగా వచ్చేయమ్మా" రంగనాథ్ చెప్పిన దానికి మౌనంగా తల వూపింది.

"ఎందుకో ఈ మధ్య అది డల్ గా ఉంటోంది అండి..ఏదో కోల్పోయిన దానిలా ఏది అడిగినా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది. నాకెందుకో గుబులుగా ఉంది అండి" రాధిక రంగనాథ్ తో చెప్పుకుంది.

"పరీక్షల సమయంలో కదా ...కొంచెం భయం పెట్టుకు ఉందేమో..నేను చెప్తాలే" అంటూ రాధికకు సర్ది చెప్పాడు.

పరీక్షా కేంద్రానికి వెళ్ళింది నందిని. ఆడుతూ పాడుతూ చెంగు చెంగున వస్తున్న తన తోటి పిల్లల్ని చూసి ఒక నవ్వు నవ్వింది.

పుస్తకాలతో చివరి నిమిషం వరకు కుస్తీ పడుతున్న అమాయక జీవులను చూస్తూ చిన్నగా నవ్వుకుంది. ఆమె నవ్వులో ఆంతర్యం ఏమిటో ఆమెకే అర్దం కాలేదు.

అందరూ క్లాసు రూముల్లోకి వెళుతుంటే, నందిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలాగే నిల్చుంది.


ఏం చెయ్యాలో, ఎలా తన సమస్యను ఎదుర్కోవాలో తెలియదు కానీ ఎన్నో రోజులుగా తను పడుతున్న వేదనకు మాత్రం ఒక పరిష్కారం దొరకాలి. ఆ చిత్త కార్తె కుక్కకు చెప్పు దెబ్బ తగలాలి. కానీ ఎలా? గొంతెత్తి చించుకోవాలా? చనిపోతానని బెదిరించలా? ఒక ఆడది ఏం చెయ్యగలదు అని భావించే అలాంటి ప్రభుద్దులకు బుద్ది చెప్పాలి. ఇదొక్కటే ఆమె ప్రస్తుత లక్ష్యం.


తలదించుకుని వెళితే, చేతకాని తనంగా భావించి, వశపరుచుకోవాలని చూసే, కలియుగ కీచకులకు కునుకు లేకుండా చెయ్యాలి. ఆడవాళ్ళం మేమేం చెయ్యగలం? ఎదిరిస్తే నిందించే సమాజాన్ని, మహమ్మారిలా పీడించే ఇటువంటి అకృత్యాలకు బలైన అబలలకు, వారు కూడా కలియుగ ద్రౌపదులే అని, తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చు కోకుండా, సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని, నిరూపించి చూపించాలి. ఇదొక్కటే ఆమె ప్రస్తుత ధ్యేయం.


పరీక్ష హాలులోకి అందరూ వెళ్ళిపోయారు. నందిని మాత్రం గేటు ముందు నిలుచుండి పోయింది. గార్డు లోపలికి రమ్మని కేక వేశాడు. ఆమె చలించలేదు అలాగే మిన్నకుండి పోయింది. నందిని అన్నయ్య రఘు ఆమె భుజం పట్టుకుని కుదిపాడు. అతని వైపు తీక్షణంగా చూస్తూ, గేటుకు ఎదురుగా కూర్చుండి పోయింది.


"ఏం చేస్తున్నావ్ నందు?" అతను అయోమయంగా అడిగాడు.

"నా లైఫ్ ను రిపేర్ చేసుకుంటున్నాను." నందిని జవాబు ఇచ్చింది.


" అందరూ చూస్తున్నారు. పిచ్చి వేషాలు వెయ్యకుండా లోపలికి నడు" రఘు కంఠంలో ఇంతకు ముందున్న లాలన కోల్పోయింది. పరువే సర్వసం అనుకుని బతికే కుటుంబానికి చెందిన వాడు కదా. ఎవరేం అనుకుంటారో అని చుట్టూ చూస్తున్నాడు. అప్పటికి అక్కడ ఉన్న విద్యార్థుల తల్లి తండ్రులు వీళ్ళను వింతగా చూడడం మొదలు పెట్టారు.


నందిని అదే పట్టుదలతో కూర్చుంది. ఆమె కళ్ళల్లో తెగింపు, ఆమె నరనరాల్లో దాక్కున్న పౌరుషం, న్యాయం దక్కే వరకూ వదిలేది లేదనే ఒక ప్రతిజ్ఞ గా మారి పోయింది. దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసినప్పుడు, కురు సభలో ఈ అత్యాచారాన్ని చూసి తన నిస్సహాయత పై మదపు నవ్వులు రువ్వించిన కౌరవుల అంతు చూసేవరకు శాంతించని ద్రౌపదిలా, తన కలలను కల్లలు చేసిన ఆ నీచుని అంతం చూసేవరకూ వదిలేది లేదని శపథం బూనింది.


కొంత సేపటికి, చుట్టూ జనం మూగారు. తెల్లగా, అందాల భరిణెలా ఉన్న నందినిని కొందరు తమ సెల్ ఫోన్లలో బంధిస్తుంటే, ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంత మంది పెద్ద మనుషులు. ఆమె మాత్రం స్తబ్దుగా ఉండిపోయింది. రఘు తన తండ్రికి ఫోను చేసి విషయం చెప్పేసరికి, భార్యా భర్తలు ఇద్దరూ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రాధిక నందినిని చివాట్లు పెట్టింది. లాక్కు వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ లాభం లేదు. మొండిగా , నిశ్శబ్ధంగా, ఎటో చూస్తూ కూర్చున్న నందిని, కళ్ళల్లో నిండుకున్న నీళ్లను, చెక్కిళ్లను దాటకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ కన్నీళ్లు బలహీనతకు చిహ్నాలుగా కాకూడదు. రాబోయే పెను మార్పులకు ఉప్పెనలా మారాలి. అందుకే భద్ర పరుచు కుంటోంది.


క్షణాల్లో ఈ వార్త దావాలంలా పాకి పోయింది. టీవీ ఛానెల్స్ వారికి, మహిళా సంఘాల వాళ్లకూ ఈ విషయం చేరిపోయింది. మూకుమ్మడిగా వచ్చేశారు. కెమెరాలు క్లిక్ మనిపిస్తూ, నందినిని మాట్లాడించి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికీ మౌనమే ఆమె సమాధానం. ఏ అందం అయితే ఆమె శాపంగా మారిందో అదే అందం ఆమెకు తెలియకుండానే వరంలా మారిపోయింది. గంట లోపే ఈ సౌందర్య రాశి దీక్ష అన్ని మాధ్యమాలలో చేరిపోయి, భావకుల హృదయాలను మీటింది. ఆమె ఎందుకలా చేస్తుందో ఎవరికీ తెలియదు. కనీసం తల్లి దంద్రులైనా చెబుతారంటే వాళ్ళు కూడా తమకు తెలియదని విషయాన్ని దాట వేస్తున్నారు.


లోపల విద్యార్థులు పరీక్ష రాస్తుంటే, బయట ఎర్రటి ఎండలో తారు రోడ్డుపై కాలుతున్న పిరుదుల సాక్షిగా నందిని తన జీవిత పరీక్ష రాస్తోంది. ఆ వేడికి చర్మం కాలి దద్దుర్లు వచ్చినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూ ఒక దేవతా ప్రతిమలా కూర్చుంది.


కాసేపటికి పోలీసులు వచ్చారు. గుంపులు గుంపులుగా చేరిన జనాలను బెదర గొట్టి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలనుకున్నారు. కానీ చేత కాలేదు. ఇంత కింతకు పెరిగిపోతున్న జనాలను కంట్రోల్ చెయ్యలేక పోతున్నారు. నందిని అక్కడ నుండి బలవంతంగా తీసుకు వెళ్లే ప్రయత్నం చేసినా, ఆమె సమస్య ఏంటో తెలిసే వరకూ, ఆమెకు న్యాయం జరిగే వరకూ అక్కడ నుండి కదలబోమని మహిళా సంఘాల నేతలు దృఢంగా చెప్పేసరికి, పై నుండి ఆదేశాలు వచ్చే వరకూ ఏమీ చెయ్యకూడదని పోలీసులు ఊరుకున్నారు.


నందిని అభిమతం ఏంటో కానీ గీతలో శ్రీకృష్ణుడు ‘ప్రయత్నం అంటూ మొదలు పెడితే భగవంతుడే దారి చూపిస్తాడు’ అని చెప్పినట్టు, అటువైపుగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా ఈ విషయం ఆసక్తి కలిగించడంతో, నేరుగా నందినీ దీక్షా స్థలానికి చేరుకున్నారు. స్వయంగా ముఖ్య మంత్రి రావడంతో ఈ విషయం ఇంకా పాపులర్ అయ్యింది. జనాలు కూడా అబ్బురంగా చూస్తూ, అడ్డు తప్పుకున్నారు. పోలీసులు ఒక రక్షణ వలయంగా మారి, ఎగసి పడుతున్న జనాలను అదుపు చేస్తున్నారు.


ఆయన నందిని చెంతకు చేరి, నేల మీద ఆమె పక్కనే కూర్చుండేసరికి , ఎలా స్పందించాలో అక్కడున్న అధికారులకు అర్థం కాకున్నా, జనాల ఈలలు కేకలతో, చప్పట్లతో ఆ ప్రాంగణము మారుమ్రోగింది.

"ముందు ఈ మంచి నీళ్ళు తాగమ్మా!" అంటూ ఆమెకు నీళ్ల సీసా అందించారు. గతంలో కూడా ఒకమ్మాయి తన సవతి తల్లి పైశాచికత్వానికి బలైతే, ఆమెను ఆదరించి, స్వయంగా తన ఇంటికి తీసుకు వచ్చి, ఆమె జీవితాన్ని ఒక బాటలో నడిపించిన సహృదయ శీలి ఆయన. అందుకే ఆ సదభిప్రాయం తోనే ఆయన అందించిన బాటిల్ లోని నీళ్లను గడగడా తాగేసింది నందిని."ఇప్పుడు చెప్పమ్మా.. ఎందుకిదంతా చేస్తున్నావు? ఏం కష్టం వచ్చింది తల్లీ. నాకు చెప్పు బిడ్డా! నేనున్నాను కదా..” అని ఆప్యాయత కురిపిస్తూ అడిగేసరికి, నందిని పెదవి విప్పింది. తనకు జరిగిన అన్యాయాన్ని , నాలుగ్గోడల మధ్య తననుంచేసిన విధానాన్ని బట్టబయలు చేసింది.


" ఏం మనిషివయ్యా నువ్వు? పిల్లను వెంటబడి వేధించి నోడిని శిక్షించాల్సింది పోయి పిల్లను చదువుకోనీకుండా చేస్తావా? "


" వాడు ఎమ్మెల్యే కొడుకు సార్. చట్టాలు వాడి చుట్టాలు" రాధిక పరుషంగా చెప్పింది.


"ఎమ్మెల్యే కొడుకైతే ఏంది? ముఖ్య మంత్రి కొడుకు అయితే ఏంది? ఈ అమ్మాయి చూపించిన తెగువ చూపిస్తే ఎవ్వడైనా కాళ్ళు మొక్కాల్సిందే."


రాహుల్ ను నిర్భయ చట్టం కింద అరెస్ట్ చెయ్యమని అధికారులను ఆదేశించారు.


ఆయన ఆదేశించినట్టే, రాహుల్ క్షణాల్లో అరెస్ట్ అయ్యాడు. చుట్టూ కెమెరాలు, జనాలు, ఎదురుగా ముఖ్య మంత్రి. వీరందరి నడుమ దోషిగా నిల్చున్న రాహుల్ని నందిని ముందుకు తీసుకు వచ్చి నిలబెట్టారు. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక , తలదించుకు నిల్చున్న రాహుల్ ను చూసి విజయగర్వంతో నవ్వింది. ఆమె అందమైన నవ్వు కెమెరా కళ్ళలో బంధింప పడింది.

హాయిగా మనసారా నవ్వు తోంది. ఇప్పుడామె నవ్వులో నిర్లిప్తత లేదు. నిరాశ లేదు. పోరాడితే న్యాయం తప్పక వస్తుంది అనే నమ్మకం తప్ప. ఆ నవ్వు రేపిస్టులని తయారు చేస్తున్న తల్లిదండ్రులకు, వారికి అండగా నిలుస్తున్న వ్యవస్థకు , ఆడవారిని అణచివేసే ధర్మానికి ఒక చెంప పెట్టు.

ముఖ్య మంత్రి గారికి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పింది.

" లేదమ్మా..నేనే నీకు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి వెధవలకు భయపడి, బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న ఎందరో ఆడబిడ్డలకు నువ్వు ఆదర్శంగా నిలిచావు. ఈ సందర్భంగా నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఒక ప్రత్యేక శాఖను నియమిస్తున్నాను. మన రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు, యెటువంటి అన్యాయం జరిగినా, ఆ శాఖకు కంప్లైంట్ చెయ్యండి. ప్రతీ గ్రామానికి ఒక అధికారిని నియమించి, ఒక్కో ఆడబిడ్డను స్వయంగా కలిసి వాళ్ళ కష్టాలను తీర్చేలా చూడాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నాకు లేఖ రాయండి. మిమ్మల్ని ఇబ్బంది కి గురి చేసేవారు ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడైనా , శిక్ష పడేలా చేస్తాను. అంతే గాని , మూగగా భయపడుతూ భరించొద్దు. మీ మౌనమే ఆ వెధవలకి ఆయుధం అవుతోంది. ఈ అమ్మాయిలా ఎంతో మనో ధైర్యంతో మీ సమస్యను ఎదుర్కోండి. మీకు మీరే సాయం చేసుకోగలరు అని గుర్తుపెట్టుకోండి" అని ఆయన చెప్పేసరికి , ఆ ప్రాంగణం చప్పట్లతో మారు మ్రోగింది. ఒక దిశా నిర్దేశం దొరికింది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.


160 views0 comments

Comments


bottom of page